రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, February 3, 2017

రివ్యూ...



దర్శకత్వం : త్రినాధరావు నక్కిన

తారాగణం : నాని, కీర్తీ సురేష్, నవీన్ చంద్ర, సచిన్ ఖడేకర్, ఈశ్వరీరావ్, పోసాని, రావు రమేష్ తదితరులు.
రచన: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: నిజార్ షఫీ
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్
నిర్మాత : దిల్ రాజు
విడుదల  : ఫిబ్రవరి 3 2017
***
      ‘నేచురల్ స్టార్’ నాని ఓసారి మాస్ క్యారక్టర్ గా మెరిపించాలని ‘నేను లోకల్’  గా విన్యాసాలు చేస్తూ విచ్చేశాడు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు త్రినాధరావు నక్కిన, సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ ల టీంతో మొదటిసారి పనిచేస్తూ అభిమానుల్ని మురిపించేందుకు ముందడుగేశాడు. మరి గత వైఫల్యం  ‘మజ్నూ’ ని మరిపించే లోకల్ సంగుతులు ఇందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం...

కథ 
       బాబు (నాని) అనేకసార్లు బీటెక్ తప్పి, లెక్చరర్ ని అల్లరిపెట్టి, కాపీకొట్టి ఎలాగో పాసయి ఖాళీగా తిరుగుతూంటాడు. సంపాదించే తల్లి (ఈశ్వరీ రావ్) ) ఉద్యోగం పోగొట్టుకున్న తండ్రీ (పోసాని) వుంటారు. ఒక సంఘటనలో కీర్తి (కీర్తీ సురేష్) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమని పొందేందుకు ఆమె చదువుతున్న ఎంబీఏ కాలేజీలో చేరి  వేధించడం, అల్లరి చేయడం మొదలెడతాడు. ఆమెకి మాత్రం తండ్రి (సచిన్ ఖెడేకర్) చూసే సంబంధమే చేసుకోవాలని వుంటుంది. ఈ  పట్టుదలని వదిలించి ప్రేమలో పడేసుకుంటాడు. ఇంతలో వర్మ (నవీన్ చంద్ర)  అనే ఒక పోలీస్ ఎస్సై వచ్చి, ఆమెని తను ప్రేమించానని, తనే పెళ్లి చేసుకోవాలనీ అడ్డు పడతాడు. ఆమె తండ్రి కూడా అతన్నే సమర్ధించి బాబుకి ఓ సవాలు విసురుతాడు : పాతిక రోజుల్లో నువ్వు నా చేత అవునన్పించుకుంటే కూతుర్నిచ్చి  పెళ్లి చేస్తానని. ఈ సవాలుని  బాబు స్వీకరిస్తాడు...

          ఇప్పుడు బాబు ఎలా యోగ్యుడనిపించుకున్నాడు, ఇందుకోసం ఏమేం చేశాడు, ఎస్సై తో ఎలా పోటీ పడ్డాడు, ఏమేం డ్రామా లాడేడూ  అన్నది మిగతా కథ. 

 ఎలావుంది కథ 
      ఇది మార్కెట్ లో వుండాల్సిన రోమాంటిక్ కామెడీ జానర్ కాకుండా, ఒక  పూర్తి స్థాయి వూర రోమాంటిక్ డ్రామా జానర్ కథ. చివర్లో  డబ్బు- వర్సెస్- ప్రేమ గురించి భారీగా క్లాసు పీకే మెలోడ్రామా దీనికి కొసమెరుపు. ఈ మూస ఫార్ములా డ్రామా పొల్లుపోకుండా ఈ కథంతా నడుస్తుంది. పూర్వం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలు అత్తారింట్లో మాస్ అల్లుళ్ళుగా వచ్చేసిన కథ కాదా అంటే, కావొచ్చు. వచ్చేసిన కథలే తెలుగుసినిమాలకి  అచ్చోసిన కొత్తగా అన్పించే  కథలని అర్ధంజేసుకోవాలి.  ముందే చెప్పుకున్నట్టు, ఇది నేచురల్ స్టార్ నాని తన నేచురాలిటీ చూసుకోకుండా కమిటై నటించిన, రోజూ తినే ఇడ్లీ లాంటి రొటీన్ మాస్ కథ. 

ఎవరెలా చేశారు 
     ఈ మాస్ క్యారక్టర్ లో నాని చేయాల్సిన వన్నీ చేశాడు. బీటెక్ స్టూడెంట్ గా ఎంత ఆకతాయిగా అలరిస్తాడో, ఆ తర్వాత ఎంబీఏ స్టూడెంట్ గా అంత చిల్లరగా నవ్విస్తాడు. అయితే  ఇక్కడ తను చూపెట్టిన స్పెషాలిటీ ఏమిటంటే, ఇలాటి క్యారక్టర్లు సాధారణంగా తండ్రి సంపాదిస్తూంటే తిని హీరోయిన్ వెంట పడుతూంటాయి. ఈ మూసని తనదైన  క్యారక్టరైజేషన్ తో నాని బ్రేక్ చేసి నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళాడు : తల్లి ఉద్యోగం చేసి సంపాదిస్తూంటే తను తిని హీరోయిన్ వెంటపడే కొడుకుగా ప్రేక్షకుల్ని అలరిస్తాడు, నవ్విస్తాడు, ఏడ్పిస్తాడు, ఎంతో ఎంటర్ టైన్ చేస్తాడు!  అరిగిపోయిన రొటీన్ ఆవారా మాస్ పాత్రకి ఇదే ప్రత్యేకాకర్షణ! ఈ క్యారక్టర్ లో బీటెక్ ఇంజనీర్ గా నాని మెరిసిపోయాడు. ‘పనీ పాటా లేకుండా, బాధ్యతా లేకుండా తిరిగే నువ్వూ...’  అని హీరోయిన్ తండ్రి తిట్టినా, సవాలు విసిరినా- నేను మారను, నేనిలాగే వుంటాను, ఏ పనీ చెయ్యను, హీరోయిన్ నాలోని ప్రేమని చూసే ప్రేమించాలి, నాలోని ప్రేమని చూసే పెళ్లి చేయాలి- అని చివరివరకూ అదే దృఢసంకల్పంతో, మాస్ కమిట్ మెంట్ తో వుండి,  పెద్దవాళ్ళందరి మీదా  పైచేయి  సాధించడం నాని హీరోయిజాన్ని మాసాత్మకంగా మరో  మెట్టు పైకి తీసికెళ్ళి అనితరసాధ్యంగా ఎస్టాబ్లిష్ చేసింది. ముగింపులో ప్రేమకోసం చేయబోయిన ప్రాణ త్యాగం, చెప్పిన మాటలు అద్భుతం. ఇలాటి నేచురల్ మాస్ పాత్రలు కమర్షియల్ సినిమాలకి చాలా అవసరం. ఈ వొరవడికి శ్రీకారం చుట్టిన,  తనకిచ్చిన పాత్రని అర్ధం జేసుకుని అంత  కష్టపడి నటించిన  ‘నేచురల్ స్టార్’ నానిని  ఎంతయినా అభినందించాల్సిందే! 

          నాని పాత్ర ఇంత ఎలివేట్ అయ్యేందుకు  కీర్తీ సురేష్, నవీన్  చంద్ర, ఈశ్వరీరావ్, తులసి, పోసాని, సచిన్ ఖెడేకర్, రావురమేష్ మొదలైన వాళ్ళందరూ పోటీపడి నటించారు. సంగీత సాహిత్యాలు, ఛాయాగ్రహణం అన్నీ వండర్ఫుల్ గా తోడ్పడ్డాయి. దర్శకుడు నక్కిన త్రినాధరావు ఇంతమంచి ప్రయత్నం చేసినందుకు నిజంగా అభినందనీయుడు!

చివరికేమిటి 
      ఎంటర్ టైనర్ గా తీసుకుని టైం పాస్ చేయడానికి ఎలాటి ధ్యాసకూడా  పెట్టి చూడనవసరంలేని,  ఈజీ గోయింగ్ మాస్ కమర్షియల్ మూవీగా ఇది ప్రేక్షకుల్ని అలరిస్తుంది. నాని హిట్ ‘భలే భలే మగాడివోయ్’ లాంటి పూర్తి స్థాయి ఆరోగ్యకర రోమాంటిక్ కామెడీ ని దృష్టిలో పెట్టుకుని దీన్ని చూడకూడదు. ఆ తర్వాత వచ్చిన హిట్ కాని రోమాంటిక్ డ్రామా  ‘మజ్నూ’  ని చూసిన కళ్లతోనూ దీన్ని చూడకూడదు. జస్ట్ నేచురల్ నాని, మాసాత్మకంగా ఎలా నేల విడిచి సాము చేశాడో చూడాలనుకుంటే మాత్రం దీన్ని తప్పకుండా చూడాలి!  దీనికి ‘మాసాత్మక నేచురల్’ అని  పైన అవకతవక హెడ్డింగ్ పెట్టడాన్ని కూడా వ్యాకరణాత్మకంగా  చూడరాదు.

-సికిందర్ 
http://www.cinemabazaar.in