రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, అక్టోబర్ 2021, శుక్రవారం

1072 : రివ్యూ


దర్శకత్వం : అనిల్ పాదూరి
తారాగణం: ఆకాష్ పూరీ
, కేతికా శర్మ, రమ్యకృష్ణ, మకరంద్  దేశ్ పాండే, ఉత్తేజ్, సునైనా
రచన : పూరీ జగన్నాథ్
, సంగీతం : సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం : నరేష్
బ్యానర్స్ : జగన్నాథ్ టూరింగ్ టాకీస్
, పూరీ కనెక్ట్స్
నిర్మాతలు : పూరీ జగన్నాథ్
, ఛార్మీ
విడుదల : అక్టోబర్ 29
, 2021
***

        పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీని మళ్ళీ పూరీ లాంచ్ చేశారు. మూడేళ్ళ క్రితం మహెబూబా తో లాంచ్ చేస్తే వచ్చిన ఫలితం సరిపోక పోగా, ఇప్పుడు రోమాంటిక్ తో తిరిగి ఇంకో లవర్ బాయ్ గా కొడుకుని చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నానికి అనిల్ పాదూరి అనే కొత్త దర్శకుడికి అవకాశం కల్పించారు. ఆకాష్ పూరీలో నటుడున్నాడు. కానీ పూరీ మార్కు హీరో కాదు. తనేమిటో అతను సపరేట్ గా చూపించుకుంటే కనీసం మూడో లాంచింగ్ అయినా ఆకాశయానం చేస్తుంది. మరి ఈ రెండో లాంచింగ్ ఆకాశ మార్గం పట్టలేదా? ఎలా? చూద్దాం...

కథ

   గోవాలో వాస్కోడిగామా అలియాస్ వాస్కో (ఆకాష్ పూరీ) చిన్నప్పుడు పోలీస్ ఇన్స్ పెక్టరైన తండ్రి తో బాటు తల్లి గ్యాంగ్ వార్ లో చనిపోతే, నానమ్మ మేరీ (రమాప్రభ) పెంపకంలో పెరిగి రౌడీ అవుతాడు. ఇతడ్ని రోడ్రిగ్స్ అనే డ్రగ్ మాఫియా గ్యాంగ్ లో చేర్చుకుని ప్రత్యర్ధి శాంసన్ మీద దాడులకి ఉపయోగించుకుంటూ వుంటాడు. మరో వైపు వాస్కో ఇన్స్ పెక్టర్ జాన్ (ఉత్తేజ్) చెల్లెలు మోనికా (కేతికా శర్మా) ని పిచ్చిగా ప్రేమిస్తూ ఆమె వెంట పడతాడు.

        ఇలా వుండగా, రోడ్రిగ్స్ ని చంపేసి తనే మాఫియా లీడరవుతాడు వాస్కో. శాంసన్ డ్రగ్స్ కొట్టేసి రెచ్చగొడతాడు. ఒక ఇన్స్ పెక్టర్ని కాల్చి చంపేస్తాడు. దీంతో వాస్కోని పట్టుకోవడానికి ఏసీపీ రమ్యా గోవాల్కర్ (రమ్యకృష్ణ) వేట మొదలుపెడుతుంది. ఈమెనుంచి తప్పించుకుంటూ, మోనికా ప్రేమ కోసం ప్రయత్నిస్తూ, మరోవైపు పగబట్టిన శాంసన్ ని ఎదుర్కొంటూ  పోరాటం మొదలెట్టిన వాస్కో, చివరి కేమయ్యాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    కొడుకు ఆకాష్ ని ఇతర మాస్ యాక్షన్ హీరోలకి దీటుగా నిలబెట్టాలన్న వ్యూహంతో, బిగ్ హీరోలు చేయాల్సిన కథని ఆకాష్ లేత భుజాల మీద ప్రయోగాత్మకంగా మోపి చూశారు. ఇందులో నూటికి నూరు శాతం చతికిలబడ్డారు. ఈ ప్రయత్నంలో ఏదైనా ఫ్రెష్ యాక్షన్ కథైనా చూసుకోకుండా, ఇతర హీరోలతో తను ఎన్నోసార్లు వాడేసిన అదే ఔట్ డేటెడ్ మాఫియాల కథని రీసైక్లింగ్ చేసి, ఫ్రెష్ ఆకాష్ లేత రెక్కల మీదేసి ఆకాశంలోకి ఎగరేయాలని చూశారు. దీంతో రోమాంటిక్ టైటిల్ తాలూకు రోమాన్స్ కూడా జాడ లేకుండా పోయింది. అవసరానికి మించిన సాంగ్స్ లో మాత్రమే సెక్సీగా రోమాన్స్ మిగిలింది.

        ఈ గందరగోళంలో ప్రేమ గొప్పదా, మోహం గొప్పదా కూడా చర్చించాలనుకున్న పాయింటు కూడా చితికిపోయింది. మోహమే గొప్పదని చెప్పడం పూరీ ఉద్దేశం. కానీ మోహమే గొప్పదని హీరో ప్రూవ్ చేయాలనుకుంటే, ప్రేమకి ప్రత్యర్ధిగా వున్న ఏసీపీ రమ్యదే గెలుపుగా చూపించడ మెందుకు? ప్రేమ బలానికి ప్రత్యర్ధులు తలొంచుతారేమో గానీ, ఉత్త మోహమే వుంటే అంతు చూస్తారనా? పాయింటు తిరగ బడినట్టుంది. కొన్ని శాశ్వత విలువలుంటాయి. అవి ఏ కాలంలోనూ మారవు. వాటిని విరిచి ఇంకేదో చెప్పాలని చూస్తే కుదరదేమో? ప్రేమే బలమైనదన్న శాశ్వత విలువ గురించే చెప్పాలేమో ఒకవేళ? మోహం గురించే చెప్పాలనుకున్నప్పుడు, టైటిల్ రోమాంటిక్ అని గాకుండా లస్ట్ అని వుంటే సరిపోవచ్చు. ఆకాష్ మొహంలో నటించగల నేర్పు వుంది, కానీ ఇలాటి పాత్రల్లో కాదు.

నటనలు - సాంకేతికాలు

     ఆకాష్ గురించి చెప్పాలంటే అతడి వాయిస్ ఎసెట్. వయసుకు మించి వాయిస్ లో గాంభీర్యం వుందన్పించేలా. అయితే వాయిస్ ఇంత బలంగా వుందని భారీ మాఫియా పాత్ర మీద వేస్తే లేత వయసు విలవిల్లాడి పోయింది. ఈ మాఫియా హీరోయిజం అతి అయిపోయింది. పదుల సంఖ్యలో గ్యాంగ్స్ ని చితక్కొట్టడం ఓవరాక్షనై పోయింది. ఇలా అతడ్ని మాఫియా మాస్ యాక్షన్ హీరోగా ఎస్టాభ్లిష్ చేస్తూ, పంచ్ డైలాగులతో, మందు పాటతో, హీరోయిన్ తో పది నిమిషాలకో అడల్ట్ సాంగ్స్ తో, పూర్తి ఆల్ రౌండర్ గా చూపించాలన్న ప్రయత్నం తొందరపాటు తనమే అయింది.

        ఇదంతా చూపించే ప్రయత్నంలో రోమాంటిక్ హీరోగా కాస్త ఫీల్ తో చూపించడం మర్చేపోయారు. అలాగే కామెడీ కూడా చేయగలడని నిరూపించేందుకు కామెడీ సీన్లు ఎందుకనో వేయలేదు. రోమాంటిక్ హీరోగా మొదలైన వాడు లస్ట్ పెంచుకుని బీస్ట్ గా మారినా, చెప్పాలకున్న మోహం పాయింటుకి తగ్గట్టు వుండేదేమో పాత్ర. మాఫియాల్ని ఎత్తేసి, లస్ట్ తో బీస్ట్ గా మారిన ఆకాష్, రమ్యకృష్ణకి సవాలుగా మారినట్టు సింపుల్ కథగా చూపించి వుంటే,రోమాంటిక్ బతికి బయటపడే అవకాశాలు ఆకాశమంత వుండేవేమో.

        హీరోయిన్ కేతికా చాలా చాలా మైనస్ గ్లామపరంగానూ. కేవలం ఎక్స్ పోజింగ్ వరకే ఆమె రేంజి. ఇంతే ఆమె గురించి చెప్పుకోగల్గేది.

        టెక్నికల్ గా చూస్తే, దర్శకత్వం పూరీ ఘోస్ట్ డైరెక్షన్ చేసినట్టుగా వుంది. పేరుకి కొత్త దర్శకుడి సినిమా గానీ, చూస్తే పూరీ తీసిన సినిమాలాగే వుంది యాక్షన్ సీన్స్ సహా. ఇందులో ప్రేమో మోహమో ఏదీ సరిగా లేనప్పుడు అరడజను పాటలు పెట్టేశారు. అయితే డైలాగ్ వెర్షన్ చాలా లౌడ్ గా వుంది. ప్రేమ కథ- లస్ట్ కథ ముగింపు కూడా కాస్త చల్లబడకుండా, అరుపులతో బీభత్సంగా వుంటే - లస్టో బీస్టో అనికూడా అన్పించకుండా ఈ సెకండ్ లాంచింగ్ కూడా వేస్టయి పోయింది.

చివరికేమిటి

    రమ్య కృష్ణ పాత్ర వాయిసోవర్ తో ప్రారంభమవుతుంది. ఆమె ఆకాష్ వాస్కోడిగామా జీవితం గురించి చెప్తూంటే ఫ్లాష్ బ్యాక్ లో కథ వస్తూంటుంది. పూరీ మార్కు అదే టెంప్లెట్ కథ. లవ్ ట్రాక్ కాసేపు, మాఫియా ట్రాక్ కాసేపు మారుతూ వస్తూంటాయి. ఇవేవీ ఆసక్తికరంగా వుండవు. పూరీ సినిమా లంటే అవే మాఫియాలు, అవే లవ్ ట్రాకులు. సుమారు గంటకి ఆకాష్ ఇన్స్ పెక్టర్ ని చంపేశాక, ఫ్లాష్ బ్యాక్ పూర్తయి, రమ్యకృష్ణ ఇన్స్ పెక్టర్ని చంపిన  ఆకాష్ ని పట్టుకునే వేట ప్రారంభిస్తుంది.

        సెకండాఫ్ లో ఈ వేటతో బాటు, బతికున్న మాఫియాకి ఆకాష్ మీద వున్న పగతో కూడిన యాక్షన్ మొదలైపోయి- రోమాంటిక్ -లస్ట్ - బీస్ట్- ఫీస్ట్ అన్నీ సఫా అయిపోతాయి. ప్రేమ జంట మీద ఎక్కడా సానుభూతి కురిపించే సీన్లు ఫస్టాఫ్ లో కూడా వుండవు. ఆ తాలూకు భావోద్వేగాలూ వుండవు. ఎంత మోహమైనా ఆ మోహం తాలూకు కదిలించే సంభాషణాలూ వుండవు. నిడివి రెండు గంటలుండడ మొక్కటే ఊరట!

—సికిందర్