రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, March 17, 2019

798 : ‘పాలపిట్ట’ తాజా ఆర్టికల్, విస్మృత సినిమాలు - 5


      ఒకప్పుడు బెంగాలీ సినిమాలు, సాహిత్యం విరివిగా తెలుగు సినిమాలకి ఆధారమయ్యాయి. 1950 లలో తెలుగు నిర్మాతలు, దర్శకులు ఒక కొత్త ట్రెండ్ ప్రారంభించారు.  తెలుగు, ఆంగ్ల, బెంగాలీ భాషల నవలలు, కథలు, నాటకాలూ తెలుగు సినిమాలుగా తెరకెక్కించే కొత్త సృజనాత్మక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. దీనికి బీజం 1945 లో బిఎన్ రెడ్డి వేశారు. జీన్ ఫిలిప్ రామ్యూ రాసిన 18 వ శతాబ్దపు ‘పిగ్మాలియన్’ అనే ఆంగ్ల నాటకాన్ని భానుమతి - నాగయ్యలతో ‘స్వర్గ సీమ’ గా తీశారు. తర్వాత 1949 లో షేక్స్ పియర్ నాటకం ‘కింగ్ లియర్’  ఆధారంగా శివరావు కస్తూరి, శ్రీరంజని లతో కెవి రెడ్డి ‘గుణసుందరి కథ’ తీశారు. 1950 లలో ఇవి ఒక ఒరవడికి నాంది అయ్యాయి. ఆంగ్ల సాహిత్యంతో  పడిన అడుగు తెలుగు, బెంగాలీ సాహిత్యాలకీ బాట వేసింది. ముఖ్యంగా బెంగాలీ సాహిత్యం తెలుగు సినిమాలకి కొత్త వ్యాపార వస్తువుగా దొరికింది.  దేవదాసు, అర్ధాంగి, చరణడాసి వంటి విజయవంతమైన సినిమాలుగా తీశారు. 

         
దిలా వుండగా, బెంగాలీ సినిమాలని  రీమేక్ చేసే ఇంకో ఒరవడి కూడా ప్రారంభించారు. దేవాంతకుడు, చివరకు మిగిలేది, వివాహబంధం మొదలైనవి. ఇలా 1980 ల వరకూ అడపాదడపా  బెంగాలీ సినిమాలని రీమేక్ చేస్తూ వచ్చినా  ఏదీ విజయం సాధించలేదు – 1977 లో ఎన్టీఆర్, వాణిశ్రీలు నటించిన  ‘ఎదురీత’ తప్ప. 1964 లో తీసిన ‘వివాహబంధం’ అపజయం పాలవడానికి కారణం, తెలుగులో కొచ్చేటప్పటికి ఆ కాలానికి కథాకథనాలు పాతవై పోవడం కావొచ్చు. 

          1960 లనుంచి తెలుగు సినిమాల్లో కమర్షియల్ విలువలతో వ్యాపార యుగం ప్రారంభమయ్యింది. నటనలు, పాటలు, కథాకథనాలూ వేగం పుంజుకున్నాయి. 1964 లో ‘వివాహబంధం’ విడుదలయ్యే నాటికి  గుండమ్మ కథ, రాముడు -భీముడు, మూగమనసులు, మంచి మనసులు, ఆరాధన, దాగుడు మూతలు, మంచి మనిషి వంటి కమర్షియల్ వినోదాత్మక సాంఘికాలెన్నో ప్రేక్షకులకి కొత్త రుచులు పంచి పెట్టాయి. ఇలాంటప్పుడు చివరకు మిగిలేది, మనసే మందిరం, వివాహబంధం లాంటి విషాదగాథలు ఎందరికి నచ్చుతాయి.  

          ఇంత మాత్రాన ‘వివాహబంధం’ మంచి సినిమా కాదా అంటే మంచి సినిమానే. లేకపోతే  భానుమతి ఎందుకు నటించి, నిర్మిస్తారు. బెంగాలీలో హిట్టయిన ‘సాత్ పాకే బంధా’ కి రీమేక్. ఆశుతోష్ ముఖోపధ్యాయ్ రాసిన నవల ఆధారం. ఈయన ఇంకో నవల ఆధారంగా బెంగాలీలో తయారైన ‘దీప్ జ్వెలే జాయ్’ ని తెలుగులో ‘చివరకు మిగిలేది’ గా రీమేక్ చేశారు. తెలుగులో ‘వివాహబంధం’ గా రీమేక్ చేసిన  ‘సాత్ పాకే బంధా’,  1974 లో హిందీలో విజయానంద్, జయాబాధురీలతో ‘కోరాకాగజ్’ గా రీమేక్ చేశారు. ఇది పెద్ద హిట్టయ్యింది.  

          ‘వివాహబంధం’ ని భరణీ పిక్చర్స్ బ్యానర్ పై పిఎస్ రామకృష్ణ నిర్మించి దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు, భానుమతీ రామకృష్ణ, చిత్తూరు వి నాగయ్య, సూర్యకాంతం, ప్రభాకర రెడ్డి, పద్మనాభం, హేమలత, వాసంతి తదితరులు నటించారు. ఎంబి శ్రీనివాసన్ సంగీతం సమకూర్చారు. ఛాయాగ్రహణం అన్నయ్య,  మాటలు అట్లూరి పిచ్చేశ్వర్రావు, పాటలు సి నారాయణ రెడ్డి. 

          పెళ్ళంటూ చేసుకున్నాక  ఏవో వెలుపలి కారణాలు చీలికలు తెస్తే చిట్లి పోయేంత బలహీనమైనదా ఆ బంధం?  మరెందుకు విడిపోతారు ? దీనికి జవాబులు  వెతుకుదాం...

          చంద్రశేఖర్ (ఎన్టీ రామారావు) ఓ మూడొందల జీతంతో లెక్చరర్. అదే కాలేజీలో అప్పారావు (చిత్తూరు వి నాగయ్య) ప్రిన్సిపాల్. చంద్రశేఖర్ కి చిన్నప్పట్నుంచీ పెంచిన పిన్ని (హేమలత) వుంటుంది. మధ్యతరగతి జీవితం. అప్పారావుకి మాణిక్యాంబ (సూర్యకాంతం) అనే భార్య, భారతి (భానుమతి), అరుణ (వాసంతి) అనే ఇద్దరు కుమార్తెలు, రఘు (ప్రభాకర రెడ్డి)  అనే కుమారుడూ వుంటారు. సోదరుడి కుమారుడు కాంతారావు (పద్మనాభం) పడి వేలాడుతూ వుంటాడు. అప్పారావుది సంపన్న కుటుంబం. కానీ డొక్కు కారు వుంటుంది.

          ఓ రోజు ఆ  కారెక్కకుండా బస్సులో వస్తూంటే చంద్రశేఖర్ పరిచయమవుతాడు భారతికి. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అప్పారావుకి తెలిసి సంతోషిస్తాడు. భార్యకి చెప్తే ఆమె ఇంతెత్తున లేస్తుంది. అతడి అంతస్తేమిటని ప్రశ్నిస్తుంది. తమ హోదాకి తగ్గ సంబంధమే చేయాలంటుంది. వినకుండా పెళ్లి చేసేస్తాడు అప్పారావు. ఇది మనసులో పెట్టుకుంటుంది మాణిక్యాంబ. 

          చంద్రశేఖర్ భార్యగా సామాన్య ఇంట్లోకి ప్రవేశిస్తుంది భారతి. పిన్నితో కూడా కలిసిపోయి సుఖంగా వుంటుంది. యాత్రలకి వెళ్ళొస్తారు. వస్తూ చాలా బహుమతులు తెస్తారు. దీంతో మండిపడుతుంది మాణిక్యాంబ. మూడొందల జీతగాడు అల్లుడు ఇవన్నీ తెచ్చి పంచడం భరించలేక పోతుంది. కించపరుస్తూనే మెత్తగా పొదుపు గురించి బోధిస్తుంది. “ఇవన్నీ ఎందుకు? చేతిలో డబ్బుంటే మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేస్తుంది. నువ్వైనా పట్టించుకోక పోతే ఎలా? ఆదాయాన్ని బట్టి ఖర్చుపెట్టుకోవాలి” అంటుంది. “ఆదాయం తక్కువైనంత మాత్రానా ఆప్యాయతలు తగ్గుతాయా?”  అంటాడు. “ఎందుకు తగ్గుతాయి, ఇల్లుమాత్రం గుల్లవుతుంది” అంటుంది. సీరియస్ అయిపోయి లేచి వెళ్ళిపోతాడు. 

           
ఇలా ఆమెకెంత ఆత్మాభిమానమో, అతడికీ అంతే ఆత్మాభిమానం. దీంతో ఆమె అంటే ఇక కూల్చలేని అడ్డుగోడ కట్టుకుని, నత్త గుల్లలా ముడుచుకు పోతాడు.

          ఆమె ఏం చేసినా పుండు మీద కారం జల్లినట్టే వుంటుంది.  ఏదో వొక వంకతో అతన్నీ, కూతుర్నీ పిలిపించుకుంటూ వుంటుంది. ఒకసారి ఢిల్లీ నుంచి బంధు వులొచ్చారని పిలిస్తే వెళ్తాడు భారతిని తీసుకుని. ఆ బంధువు - ఇంగ్లాండ్ ఎప్పుడు వెళ్తున్నారు? మీరు రాసిన పుస్తకానికి పతకం వచ్చిందటగా? ప్రమోషన్ కూడా వచ్చిందట? – అంటూంటే చంద్రశేఖర్ కి తర్వాత అర్ధమవుతుంది, అత్తగారే ప్రతిష్ట కోసం అల్లుణ్ణి ఇలా గొప్పగా చిత్రించుకుందని. దీంతో మరింత అవమానం ఫీలయ్యి వెళ్ళిపోతాడు. ఎంత సేపూ తనది దిగువ స్థాయి అనుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న ఆమె తీరుని నిరసించడం మొదలెడతాడు.   

          ఆమె వూరుకోదు. కూతురితో ఫోన్లో మాట్లాడుకోవాలని ఇంటి ముందు టెలిఫోన్ స్థంభం పెట్టించి కనెక్షన్ ఇప్పిస్తుంది. దీంతో చంద్రశేఖర్ ఆగ్రహం పతాక స్థాయికి చేరుతుంది. భారతీనే నానా మాటలంటాడు. భారతి తల్లిని నానా మాటలంటుంది. మాణిక్యాంబ ఇంకింత రెచ్చిపోయి – “ముష్టి మూడొందల జీతానికే మురిసిపోతే అయిపోయిందా? నూతిలో కప్పలా ఎంత కాలం బతుకుతాడు? శ్రమపడాలి, పైకి రావాలి!”  అని క్లాసు పీకేస్తుంది. ఇంకోసారి అల్లుడితోనే  నేరుగా అనేస్తుంది – “ఫలానా వారి అల్లుడు అన్పించుకోవడం కాదు గొప్ప. ఫలానా వారి అత్తగారు వస్తే నేను గర్వ పడేలా వుండాలి నీ హోదా, అదీ గొప్పంటే!”  అని. 

         
ఇలా పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యా నలిగిపోతూంటుంది భారతి. అత్తాఅల్లుళ్ళ ఆత్మాభిమానాల సమస్య కాస్తా, భార్యా భర్తల మధ్య సూటిపోటి మాటల వాగ్యుద్ధంగా మారిపోయి విడిపోతారు.

ఎవరి కథ?
        నందమూరి తారక రామారావు కొత్త గెటప్ లో కనిపిస్తారు. ఈ గెటప్ తో పాత్ర వయసుకి మించిన రూపంలో కన్పిస్తారు. ధోవతీ కుర్తా వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని, బరువు కూడా పెరిగి పెద్ద మనిషిలా వుంటారు. యూత్ అప్పీల్ లేని ఈ గెటప్ మనకి ఇబ్బందిగానే వుంటుంది. ఇది బెంగాలీ ఒరిజినల్ లోని బెంగాలీ బాబు గెటప్పే. పదేళ్ళ తర్వాత తీసిన హిందీ ‘కోరా కాగజ్’ లో లెక్చరర్ పాత్ర ప్రొఫెసర్ పాత్రగా మారి, ఆధునిక దుస్తుల్లో యూత్ అప్పీల్ తో వుంటాడు విజయానంద్.

          ఎన్టీఆర్ పాత్ర స్వభావం నెగెటివ్ గానే వుంటుంది. ఇలాటి మనుషులుంటారు. నిజానికి ఆత్మాభిమానం నెగెటివ్ లక్షణం కాదు. కానీ పాత్ర స్వభావం పైన చూస్తే ఆత్మాభిమానం, లోన చూస్తే సంకుచితత్వం అన్నట్టుంటుంది. ఆయన సూర్యకాంతంతో రియాక్ట్ అయ్యేది ఫక్తు ఆత్మాభిమానంతోనే. కానీ జీవించేది మాత్రం ఆత్మాభిమానంతో కాదు. సంకుచితత్వంతో, మార్పు కోరని అదే నూతిలో కప్ప జీవితం. ఈ నూతిలో కప్ప జీవితపు ఛాయలు ఆయన మోహంలో ప్రకటిస్తూంటారు. ఆ మోహంలో సంతోషం వుండదు, సుఖం వుండదు. ఆశలుండవు, ఆశయాలుండవు. బెంగాలీ రచయిత భలే పాత్రని సృష్టించాడు. మాటంటే ఆత్మాభిమానం తన్నుకొస్తుంది, చూస్తే ఆ ఆత్మాభిమానంతో మానసికంగా, ఆర్ధికంగా ఎదిగేది లేదు. 

          సూర్యకాంతం గయ్యాళి అత్తేంకాదు, ఆర్ధికం నేర్చిన వ్యవహార్త. ఎదుటి వాళ్ళు కూడా పైకి రావాలనే ఆమె గొడవ. అయితే నోటి దూలవల్ల చెడగొట్టుకుంటుంది. “నా ఇల్లు బంగారం గానూ”  అనేది ఆమె ఊతపదం. చివరికి విసిగిపోయిన కూతురు, “నీ ఇల్లు బంగారం కాదు. అంతస్తుల్ని గురించి, అభిమానాల్ని గురించీ నీ అభిప్రాయాలు మారనంత వరకూ నీ ఇల్లు బంగారం కాదు!” అని అరుపులు అరిస్తేగానీ కళ్ళు తెరవదు. 

          సూర్యకాంతం ఓ విధంగా ‘విలన్’ పాత్రే అయినా విలన్ పాత్రలా అన్పించదు. ఆమెతో  ఈ పాత్రలో మంచితనమే కన్పిస్తుంది. ఈ పాత్రని ఎంజాయ్ చేయగలమే తప్ప ద్వేషించలేం. ఆమె డైలాగ్ డెలివరీ గానీ, ఆ డైలాగ్ డెలివరీలో సెలయేటి ప్రవాహంలా సాగిపోయే భాష గానీ ఇప్పటి సినిమాల్లో చూడం.

          ఇక తల్లికీ భర్తకీ మధ్య నలిగిపోయే పాత్రలో భానుమతి రానురాను పాత్ర డెప్త్ పెరుగుతున్నకొద్దీ దృష్టిని తన మీదికి తిప్పుకుంటుంది. సెంట్రల్ పాత్ర తనదే అయిపోవడం వల్ల. నిజానికి ఒరిజినల్ బెంగాలీ గానీ,  హిందీ రిమేక్ గానీ,  హీరో కథగా వుండవు. హీరోయిన్ కథగానే వుంటాయి. కథా ప్రారంభం కూడా హీరోయిన్ తోనే వుంటుంది. బెంగాలీలో సుచిత్రా సేన్ గానీ, హిందీలో జయబాధురీ గానీ గతాన్ని తలచుకోవడంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అంటే భర్త నుంచి విడిపోయి దూరంగా టీచర్ గా జీవిస్తున్నప్పుడు, గతం గుర్తు కొచ్చి ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. అప్పుడు మొదట్నుంచీ కథ. 

          తెలుగులో భానుమతితో ఇలా వుండదు. నేరుగా బస్సు ప్రయాణంలో ఎన్టీఅర్ పరిచయంతో వర్తమానంలో ప్రేమ కథగా మొదలవుతుంది. ఇందుకే తెలుగు రీమేక్ లో ప్రధాన పాత్ర ఇటు భానుమతి కాకుండా, అటు ఎన్టీఆర్ కాకుండా అయోమయంగా  వుంటుంది కథని ఫాలో అవడానికి.  
          సినిమా కథ అనేది ప్రధాన పాత్రకి సంబంధించినదై వుండి, ఆ ప్రధాన పాత్ర దృష్టి కోణం (పాయింటాఫ్ వ్యూ) లో సాగడం ఆనవాయితీ. ఆ దృష్టికోణంలోనే  ప్రేక్షకులు కథని చూసి ఆ ప్రధాన పాత్రని పట్టుకుని ప్రయాణించగల్గుతారు. ప్రయాణించడానికి ప్రధాన పాత్ర ఆధారంగా లేనప్పుడు, ఎంత కథ చెప్పినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఆవకాశమే లేదు.

 
         బెంగాలీ వొరిజినల్ ని  హీరోయిన్ కథగానే తీశారు, హీరో కథ కాదు. దీన్ని మార్చకుండా హిందీ లోనూ హీరోయిన్ కథగానే తీశారు. హీరోయిన్ కథ కాబట్టి బెంగాలీలో అప్పటి పాపులర్ హీరోయిన్ సుచిత్రా సేన్ ని ఈ పాత్రకి ఎన్నుకున్నారు. హీరో పాత్రలో చిన్న హీరోని పెట్టుకున్నారు. హిందీలో కూడా అప్పటికి పాపులరైన జయబాధురీని హీరోయిన్ గా తీసుకున్నారు. హీరోగా అంతగా తెలియని విజయానంద్ ని తీసుకున్నారు. ఇలా పాత్రల్ని బట్టి, కథని బట్టి, ఆర్టిస్టుల్ని బ్యాలెన్స్ చేశారు. 

          తెలుగులో ఇలా చేయలేదు. ఎన్టీఆర్, భానుమతి హేమాహేమీల కాంబినేషన్ గా  చేశారు. చేసినప్పుడు కథ ప్రకారం భానుమతిని ప్రధాన పాత్ర చేయలేక, ఎన్టీఆర్ ని ప్రధాన పాత్రగా చేయడానికి కథని మార్చలేక రెండు పాత్రల కథ అన్నట్టు చేశారు. దీంతో ఓ ప్రధాన పాత్ర, అది  ఎదుర్కొనే సమస్య, దాని దృష్టి కోణం, ఆ దృష్టి కోణంలో ఫ్లాష్ బ్యాక్ తో కథా ప్రారంభమూ  అనే అర్ధవంతమైన కథా ప్రక్రియ చెదిరిపోయింది. హిందీ, బెంగాలీల్లో ప్రధాన పాత్రగా హీరోయిన్ ని ప్రవేశ పెడుతూ చాలా సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. ఆమె తోనే కనీసం పదిహేను నిముషాలు టీచర్ అని పరిచయం చేసి దృశ్యాలు నడిపించారు. ఈ దృశ్యాల్లో ఈమె ఎవరు? ఎందుకు వొంటరిగా వచ్చి ఈ వూళ్ళో వుంటోంది? ఏం జరిగిందీమెకి?  అన్న ప్రశ్నలెన్నో మనల్ని వేధించేట్టు చేసి, ఆసక్తిని పెంచారు.  

          ఐతే భానుమతి ఈ పాత్ర ప్రయాణంలో ఆయా ఘట్టాల్ని అర్ధవంతంగా నటించింది. భర్తకి ఎదురుతిరిగే సన్నివేశం, తర్వాత తల్లికి ఎదురు తిరిగే సన్నివేశం, చివరికి ఆత్మత్యాగం చేసుకోబోయే సన్నివేశం - కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా - ఆమె
నటనని ఆకాశానికంటించింది. 

          తండ్రి పాత్రలో నాగయ్యకి  భార్యని కాదని కూతురి పెళ్ళిచేయడం వరకే  ప్రాధాన్యం. ఆ తర్వాత ఎందులోనూ జోక్యం చేసుకోడు, కష్టాల్లో వున్న కూతురికి సానుభూతి వ్యక్తం చేస్తూ వుండడం తప్ప. కొడుకు పాత్రలో ప్రభాకర రెడ్డికి తల్లికిలాగే అహం ఎక్కువ. చెల్లెలి చేత విడాకుల పత్రాలమీద సంతకం చేయించుకుంటాడు. కానీ ఆ తర్వాత ఆ ప్రయత్నాలు చెయ్యడు. కుటుంబంలో ఆడపిల్లకి సమస్య వస్తే మగవాళ్ళయిన తండ్రీ కొడుకులు ఇలా వుండడం కాస్త ఇబ్బందిగానే వుంటుంది మనకి. ఏ వైఖరీ తీసుకోలేక కిమ్మనకుండా వుంటారు. 

          ‘మాతం - గి మణిపూర్’ అని మొట్టమొదటి మణిపురీ సినిమా వుంది. ఇందులో ఉమ్మడి కుటుంబంలో పెద్ద కొడుకు వల్ల కోడలికి విషమ సమస్య వస్తే, ఇంటిల్లి పాదీ ఆ సమస్యని పరిష్కరించడానికి ఒకటవుతారు. ఎవర్నీ దూషించరు, కనీసం సమస్యకి కారణమైన పెద్ద కొడుకు ప్రియురాలితో కూడా. ఎవరి తోనూ సంఘర్షించరు. దీనికి జాతీయ అవార్డు లభించింది. ‘తీర్థ్ జాతర’ అనే నాటకం ఆధారంగా 1972 లో తీశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఇప్పటికీ నిలబెట్టుకుంటున్న మణిపురి ప్రజలు, కలహం వస్తే కలహాలతో పరిష్కరించుకోవాలనుకోరు. ‘వివాహబంధం’ లోనే కాదు, చాలా కుటుంబ సినిమాల్లో కలహం వస్తే తలా వొకరుగా విడిపోయి కలహించుకోవడం ఒక ఫార్ములాగా వుంటూ వస్తోంది. 

          ఇందులో పద్మనాభం కామెడీ కూడా ఆర్ధిక పరమైనదే. డబ్బు సంపాదించడానికి పూటకో ఆలోచన చేస్తాడు, ఏదీ అమలు చేయక పక్క పాత్రకి నరకం చూపిస్తూంటాడు. “ఈ రోజుల్లో లక్ష అంటే ఎంత? ఆఫ్టరాల్  రెండక్షరాలు” వంటి డైలాగులు పేలుస్తూంటాడు. 

భానుమతి పాత్రకే బలం, స్పష్టత 
     ఈ వివాహబంధపు కథ పూర్తిగా ఆర్ధికం మీద ఆధారపడింది. ఆర్ధిక ఎదుగుదల కోసం అల్లుణ్ణి  అత్త వేధించడమే ఈ డబ్బు చుట్టూ సంబంధాల కథ. అయితే ఒక అనుమానం రాకమానదు. అన్ని గొప్పలు పోయే సంపన్నురాలైన, ఆత్మాభిమానం గల అత్తగారు, కట్నం ఏమీ ఇవ్వలేదా? అల్లుడు తీసుకోలేదా? సంబంధం అనుకున్నాక వెంటనే పెళ్లి సీను చూపించేశారు తప్ప కట్నం, పెట్టిపోతలు వగైరా ఆ సంబంధమైన వ్యవహారమేమీ మాట్లాడుకున్నట్టు సీను వేయలేదు. బెంగాలీ, హిందీల్లో కూడా ఇలాగే వుంటుంది. ఈ స్పష్టత లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత పాత్రల ప్రవర్తన ఒక పజిల్ లా వుంటుంది. 

          సూర్యకాంతంకి కూతుర్ని సామాన్యుడి కివ్వడం అస్సలు ఇష్టం లేదు. “నేనూ ఒకప్పుడు లెక్చరర్నే కదా, ఏం తక్కువైంది?” అని నాగయ్య అంటే, “ఏం తక్కువైందో నాకు తెల్సు. ఈ సంసారాన్ని ఈది ఈ కుటుంబాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి నేను పడ్డ పాట్లు నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెల్సు. నా బిడ్డకి కూడా ఎందుకు కష్టాలూ?” అంటుంది సూర్యకాంతం. 

          అలాటిది కూతుర్ని వైభవంగా అత్తారింటికి పంపినట్టు కన్పించదు. పంపాక కూతురు సుఖపడాలని సౌకర్యాలు కల్పించే పనిలో పడుతుంది. హిందీలో ఫ్రిజ్ కూడా పంపిస్తుంది అత్తగారు. సూర్యకాంతం అల్లుడికి పుండు మీద కారం జల్లుతున్నట్టు వాయిదాల పద్ధతిలో ఒకటొకటీ సౌకర్యాలు కల్పిస్తుంది. “నేను ఆదర్శ వివాహం చేసుకున్నాక ఇవన్నీ ఎందుకు?”  అని అల్లుడు అనడానికి అలాటి వివాహం చేసుకున్నాడన్న స్పష్టత నివ్వలేదు కథకుడు. కథలో పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యగా పాత్రల మధ్య ఒక సమస్యని  ఏర్పాటు చేసినప్పుడు, ఆ పాత్రల మధ్య పూర్వం ఏం జరిగిందో తెలియజేయకపోతే కథని ఫాలో అవడం కష్టమవుతుంది. 

          ఇలా ఎన్టీఆర్, సూర్యకాంతం పాత్రల విషయంలో ఒక స్పష్టత లేని విషయం అలా వుంచితే, భానుమతి పాత్ర ఎదురయిన సమస్యతో ఒక స్పష్టతతో, బలంగా  వుంటుంది. ముందు ఆమె తల్లితో సమస్యలు వస్తున్నాయని అస్సలు అనుకోదు. తల్లిది సానుకూల దృక్పథమే అనుకుంటుంది. అందుకని, ఒక బంధువు ముందు భర్త గురించి తల్లి లేనిపోని గొప్పలు చెప్పి భర్త మనోభావాలు దెబ్బ తీసినప్పుడు -  “మీ అమ్మగారు నిన్ను నాలాంటి సామాన్యుడి కిచ్చి పెళ్లి చేశారా అని ఆలోచిస్తున్నాను” అని అతనంటే - “మీకన్నీ రావాలనీ, మీరలా వుండాలనీ ఆవిడ ఉద్దేశం” అని నచ్చజెప్తుంది. 

          “నా లాంటి వాడు అల్లుడు కావడం ఆవిడ గారికి నామర్దాగా వుంది, నువ్వు నన్ను చేసుకోవడం ఆవిడకిష్టం లేదు” అని మళ్ళీ అంటే – “మీరొట్టి శాడిస్టు మనిషి!” అని నవ్వేస్తుంది . కానీ టెలిఫోన్ పెట్టిస్తున్నప్పుడు తల్లి ఇంటికొచ్చి గోడకి తగిలించిన సామాగ్రిని చూసి, “ఈ తట్ట బుట్ట పెట్టే చోటు ఇదా? తీసి అవతల పడెయ్యి!” అని భర్త ముందు కసురుకున్నప్పుడు నిర్ఘాంత పోతుంది. “తీయడానికి వీల్లేదు!” అని భర్త అరిచినప్పుడు ప్రత్యక్ష సమరం మొదలైపోతుంది. 

          అలాఅలా తన సంసారం మీద తల్లిగారి పెత్తనం బాగా పెరిగిపోతూంటే, ఇద్దరికీ నచ్చ చెప్పలేక నలిగిపోతున్న ఆమె, ఒకానొక దశలో సహనం కోల్పోయి భర్తతో అనేస్తుంది –“మగవారు మీరుండగా ఇవన్నీ ఆవిడ ఎందుకు చేయించాలని మీకు బాధగా వుంది కదూ? పెళ్లి చేసుకున్నంత మాత్రాన పుట్టింటిని పూర్తిగా మర్చిపోవాలనుందా  ఏమిటీ? ఇక నా మంచీ చెడూ అమ్మా నాన్నా ఏం చూడనే కూడదా?” అని. 

          ఇలా భర్తకీ తల్లికీ మధ్య వ్యక్తిత్వాల గొడవలు తనకీ భర్తకీ మధ్య వ్యక్తిత్వాల గొడవగా మారిపోతుంది. ఇక ఆమె అన్నకి ఫోన్ చేసి, చెల్లెల్ని తీసికెళ్ళి పొమ్మంటాడు. ఏమనాలో అర్ధంగాక పుట్టింటికి చేరుతుంది భారతి. 

          మనసుని మళ్ళించుకోవడానికి ఎమ్మే చదవడం మొదలెడుతుంది. చదువుకుని ఉద్యోగం చేస్తానంటుంది. అన్న మందలిస్తాడు. “స్త్రీ జీవితానికి అర్ధం, లక్ష్యం ఉద్యోగం చేయడం కాదు. వివాహం చేసుకోవడం” అంటాడు. అప్పటికే విడాకుల కాగితాల మీద సంతకం తీసుకున్న అతను, చెల్లెలి పెళ్లి ప్రస్తావన తెచ్చి, అక్క వుండగా చెల్లెలి పెళ్లి కష్టమని, అందుకని మళ్ళీ పెళ్లి చేసుకోమంటాడు. తల్లి కూడా సమర్ధిస్తుంది. దీంతో విరుచుకు పడుతుంది భారతి, “ మీరింత వరకూ నా మంచి కోసం చేసింది చాలు...నువ్వు మంచి అనుకున్నదే లోకం మంచి అనుకోవాలని ఎక్కడుందమ్మా? కాలం మారుతోంది. అంతస్తులు మారుతున్నాయి. అనుభావాలు మారుతున్నాయి. కానీ నీలాటి అమ్మలు మాత్రం మారడం లేదు!” అనేసి వెళ్ళిపోతుంది. 

          కాలం మారుతోంది అనే మాట అప్పటి ఈ సినిమాలో ఇంకో రెండు సార్లు వస్తుంది. బస్సులో మగవాళ్ళ సీట్లో ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు, “కాలం మారిపోతోంది. ఆడవాళ్ళ  సీట్లో ఆడవాళ్లే, మగవాళ్ళ ఆడవాళ్లే” అని ఒకసారి, చివర్లో ఎన్టీఆర్ పశ్చాత్తాప పడినప్పుడు మరోసారి. కాలం మారిందనే మాట ఇప్పటికీ వాడుతూనే వుంటారు. కానీ అరవై ఏళ్ల  క్రితమే కాలం మారిందని గమనించి సినిమాల్లో వాడేశారు. ఏ కాలంలో వాళ్ళు ఆ కాలం మారిందనే అనుకుంటారు. అయితే ఇప్పుడు చూస్తేనే, అప్పటి కాలం మారలేదనీ, ఇప్పటి కాలమే బ్రహ్మాండంగా మారిందనీ గొప్పలు పోతారు. ఇప్పటి ఈ కాలం ఇంత మారడానికి వెనకటి కాలాలే మారుతూ మెట్లు వేశాయని గుర్తించరు. 

          భారతి ఎమ్మే పాసయి, టీచరుగా ఉద్యోగమొస్తే వేరే వూరు వెళ్ళిపోతుంది. అక్కడ గతాన్ని మరచిపోవాలని చాలా ప్రయత్నిస్తుంది. ఆమెని చూసి ఒక టీచర్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే అన్నట్టు సంకేతాలిస్తాడు. నాల్గు దులుపుతుంది. చెల్లెలి పెళ్లి పిలుపు రావడంతో ఇక వెళ్ళక తప్పదు. వైభవంగా జరుగుతున్న ఆ పెళ్ళిలో వధూవరులు ఏడడుగులు వేస్తున్నప్పుడు తట్టుకోలేక పరిగెడుతుంది. పరుగెత్తీ పరుగెత్తీ భర్త ఇల్లు చేరుకుంటుంది. తలుపు కొట్టీ కొట్టీ  అలసి పోతుంది. ఒకావిడ తలుపు తీసి “ఎవరు కావాలి?”  అంటుంది. భారతికి అర్ధమైపోతుంది. “మీ వారున్నారా, పిలవండి” అంటుంది నిస్సహాయంగా. అప్పుడే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని జీర్ణించుకోలేక. అప్పుడు అతనొస్తాడు. అతడి పేరుకూడా చంద్రశేఖరే. లాయర్. భర్త ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడనీ, తాము ఈ ఇంట్లోకి వచ్చామనీ అతనన్నప్పుడు తేలిక పడుతుంది భారతి. ఈ సస్పెన్స్ డ్రామా గొప్పగా వుంటుంది. 

          అయితే ఇతను ఆమెని నిందిస్తాడు. భర్త పిచ్చి పట్టిన వాడిలా ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదనీ, పిన్ని కూడా ఇవన్నీ చూడలేక చనిపోయిందనీ, దీని కంతటికీ బాధ్యత భారతీదేననీ దూషిస్తాడు. భారతికిక  చచ్చిపోవాలన్పిస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక భర్త చంద్రశేఖర్ లాయర్ దగ్గరికొస్తాడు. లాయర్ జరిగింది చెప్తాడు. చంద్రశేఖర్ చలించిపోతాడు.

          “కాలం మారుతోంది. మనసుకు నచ్చినా నచ్చక పోయినా కట్టుకున్న భర్తే ప్రత్యక్ష దైవమని పూజించే రోజులు పోయాయి. పురుషులతో బాటు స్త్రీలు కూడా వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటున్నారు. విభిన్న వ్యక్తిత్వాలున్నభార్యాభర్తల మనసులు అతకడం కష్టం” అని బాధపడతాడు. 

          “తనలో ఎంత మార్పు వస్తే ఇక్కడి కొచ్చింది...మొదట్లో నేనూ నీలాగే అనుకున్నాను. ఆడవాళ్ళు మగవాళ్ళని నీడలా అనుసరిస్తే చాలనుకున్నాను. మనకిష్టమైన రూపంలో కన్పించడానికి వాళ్ళు మట్టి బొమ్మలూ, లక్క బొమ్మలూ కాదు. మనలాంటి మనుషులే...” అంటూ భారతిని వెతకడానికి పరిగెడతాడు.   సుఖాంతమవుతుంది. ఈ మొత్తం కుటుంబ డ్రామాలో నీతి ఏమిటంటే, భార్యాభర్తల మధ్య ఇంకో వ్యక్తి రూపంలో సమస్య వచ్చినప్పుడు, ఆ భార్యాభర్తలు ఒకటై తమ వైవాహిక బంధం కోసం ఆ మూడో వ్యక్తి ప్రమేయాన్నే తిప్పికొట్టాలనీ.  ఈ కథలో చంద్రశేఖర్ అత్త ప్రభావానికి లొంగిపోయి భార్య  భారతిని బాధపెట్టడం, భారతి చంద్రశేఖర్ ని బాధ పెట్టడం, ఇద్దరూ కలిసి సంసారాన్ని ముక్కలు చేసుకోవడం. అత్తగారు మాత్రం సలక్షణంగా వుండడం. ఈ దృశ్యాన్ని ట్రాన్సాక్షనల్ ఎనాలిసిస్ (టీఏ) ప్రకారం చూస్తే, అత్తగారు పేరెంట్ మెంటాలిటీతో వుంటే, భార్యాభర్తలు చైల్డ్ మెంటాలిటీతో వుండిపోయారు. ఈ రెండు మెంటాలిటీలూ లాభం లేదనీ, మనుషులు అడల్ట్ మెంటాలిటీకి ఎదిగితే సమస్యలు రావనీ టీఏ చెప్తుంది. ఇదీ విషయం. 

          పిఎస్ రామకృష్ణ దర్శకత్వం బెంగాలీ మాతృకలాగా మరీ కళాత్మకంగా లేకపోయినా,  సీదా సాదాగా బాగానే వుంటుంది. సన్నివేశాలు నడుస్తున్నప్పుడు ఉన్నట్టుండి పక్క ఆర్టిస్టుల క్లోజప్స్ వేసే చమత్కారం ఎక్కువ కన్పిస్తుంది. గ్లామరస్ గా భానుమతికి చాలా సార్లు వేశారు. మాటలు రాసిన అట్లూరి పిచ్చేశ్వరరావు “చివరకు మిగిలేది” కి రాసిన రచయితే. ఆయన దురదృష్టమేమిటంటే ఈ రెండూ అట్టర్ ఫ్లాపయ్యాయి. పాటలు రెండు సూపర్ హిట్టయ్యాయి- “నీటిలోన నింగిలోన”, “విన్నావా విన్నావా” అనే పాటలు.

సికిందర్
‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రిక
మార్చి, 2019 సంచిక