రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, March 24, 2023

1315 : రైటర్స్ కార్నర్

            "అన్ని కథలూ ఒకే ఆకారంలో వుండానికి కారణముంది - అదేమిటంటే భౌతిక, రసాయన, జీవశాస్త్రాల సమ్మిశ్రమమైన మానవ మనస్సు అంతర్గత వ్యక్తీకరణ అయిన ఒక స్ట్రక్చర్ లో ఆ కథలు వుంటాయి కాబట్టి” —జాన్ యార్క్
        
    బ్రిటన్ లో జాన్ యార్క్ 30 సంవత్సరాలుగా స్క్రీన్ ప్లేల్లో రచయితల పనిని వీక్షించడంలో, విశ్లేషించడంలో విశేష పాత్ర పోషిస్తున్నారు. ఆయన కథల్ని రూపొందించే విధానం అన్ని కథలూ ఒక ఏకీకృత ఆకృతిని కలిగి వుంటాయన్న ఆయన థియరీ ప్రకారం వుంటుంది. మునుపటి ట్యూటర్లు కథలు ఎలా పనిచేస్తాయన్న దానిపై దృష్టి పెడితే, జాన్ యార్క్ విధానం కథలు ఎందుకు పనిచేస్తాయన్నదానిపై దృష్టి పెడతారు. ఎందుకంటే అవి మనం ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానాన్ని ప్రతిబింబిస్తాయి. ఇన్ టు ది వుడ్స్ ఆయన రాసిన పుస్తకం. ఈ పుస్తకంలో ఆయన కథా రచనా విధానాన్ని, సమస్యల్ని, పరిష్కారాల్ని చర్చిస్తారు. ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేమిటో చూద్దాం...

        మీ పుస్తకం, ‘ఇన్‌ టు ది వుడ్స్ లో  కథా నిర్మాణం మానవ గ్రహణశక్తికి కఠినంగా వుందని, అన్ని కథలు తప్పనిసరిగా ఒకే విధంగా వుంటాయనీ మీరు వాదించారు. ఎందుకంటే అవి మనం ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానాన్ని ప్రతిబింబిస్తాయి.  స్టోరీ టెల్లింగ్‌పై మీకీ  అవగాహనని ఏర్పరిచిన మీ ప్రారంభ ప్రభావాలలో కొన్ని ఏమిటి?
        మా అమ్మ అస్తమానం కథల్ని చదివి వినిపించేది. నాకు తగినంత వయస్సు వచ్చాక, ఆమె చాలా థ్రిల్లింగ్ మలుపు దగ్గర కథ చెప్పడం ఆపి, మిగతాది నువ్వే చదువుకో అని పుస్తకం మీద పడేసేది. ఆ థ్రిల్లింగ్ మలుపు తర్వాత ఏం జరిగిందన్న కుతూహలం కొద్దీ నేను చదవడం మొదలెట్టే వాడ్ని. అలా నాకు పుస్తకాలు చదవడం అలవాటయింది. మొదట కామిక్స్ లో తలదూర్చాను. ప్రధానంగా మార్వెల్ సిరీస్. ఆపై ఆనాటి బ్రిటిష్ థ్రిల్లర్ రచయితలు - అలిస్టర్ మెక్లీన్, హేమండ్ ఇన్స్, ఇయాన్ ఫ్లెమింగ్ నవలలు చదివాను. సాహిత్యం వైపు కొంచెం తర్వాత వచ్చాను. సాహిత్యంలో మార్క్ ట్వైన్ రచనలు నాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇవీ నాకు కథా రచన పట్ల అవగాహనని ఏర్పర్చిన సాధనాలు.
        
            వర్ధమాన స్క్రీన్ రైటర్లు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఏం చదవాలంటారు?
        వీలైనన్ని ఎక్కువ స్క్రీన్‌ప్లేలు చదవాలి. ఇప్పుడు చాలా వరకు ఇంటర్నెట్‌లో ఉచితంగా అందుబాటులో వున్నాయి.  స్క్రీన్ రైటింగ్ కోర్సు మీద పుస్తకాలు చదవాలి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మీకు చదవడానికి సమయం లేకపోతే, రాయడానికీ సమయం (విషయం కూడా) వుండదన్న స్టీఫెన్ కింగ్ మాట గుర్తుంచుకోవాలి. మీరు రాయని సమయంలో తింటూంటే, లేదా నిద్రపోతూంటే అప్పుడూ చదవాలి. మీకు ఆసక్తి వున్న జానర్స్ మాత్రమే కాదు, ఎప్పుడూ చదవని జానర్స్ కూడా చదవాలి. అది మనస్సుని విశాలం చేస్తుంది. స్ఫూర్తినిస్తుంది. ఏది స్వీకరించాలో, ఏది కూడదో విచక్షణ నేర్పుతుంది. ఇతర వ్యాపకాలతో అతి తక్కువ సమయం గడపాలి. మీరెంత మీతో మీరు గడిపితే అంత మీ లోపలినుంచి డీప్ నాలెడ్జితో విషయం బయటికొస్తుంది.
         
        అనుభవం లేని రచయితలు తమ కథల్ని రూపొందించేటప్పుడు చేసే అత్యంత సాధారణ తప్పు ఏమిటి?
        పేలవమైన కథనం, నమ్మశక్యం కాని మలుపులు. ఇవి ప్రధానంగా కన్పించే తప్పులు. కథనానికి ఎల్లప్పుడూ పాత్రల మధ్య ఎక్కువ సంఘర్షణ అవసరం. మలుపులకి మార్పుని తిరస్కరిస్తే ఏర్పడే పరిణామాల్ని తెలిపే పాత్రల ముఖాముఖీ అవసరం. ఇంకా పాసివ్ పాత్రలు రాయడం సర్వసాధారణంగా చేస్తున్న తప్పు. అసంఖ్యాక స్క్రిప్టుల్లో సంఘటనలు ప్రధాన పాత్రకి జరుగుతున్నట్టుగా రాస్తున్నారు, ప్రధాన పాత్రే సంఘటనల్ని సృష్టించాలని గుర్తించడం లేదు. దీంతో పాసివ్ రియాక్టివ్ ప్రధాన పాత్రలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన పాత్రల ఈ లోపం వల్ల కథ ముందుకు సాగని పరిస్థితి వుంటోంది. ఇలా ప్రధాన పాత్రని తీసేసినా కథలో తేడా ఏమీ రాదు. ప్రధాన పాత్రకి ఓ లక్ష్యం వుండాలి, ఆ లక్ష్యం కోసం పనిచేయాలి. లేకపోతే కథ రాసి ఏం ఉపయోగం?
        
           మీరు పనిచేసిన చలనచిత్రాల్లో, టీవీ సిరీసుల్లో మీరు గర్వపడేవి ఏవి?
        నేను ఎల్లప్పుడూ షేమ్ లెస్ నీ, లైఫ్ ఆన్ మార్స్ నీ గర్వించే సినిమాలుగా భావిస్తాను. ఎందుకంటే అవి కాలీన స్పృహతో వున్నాయి. ఒక ఛానెల్లో సెక్స్ ట్రాఫిక్’ అనే సినిమా చేశాను. అది నాకు పై మెట్టు అయింది. అలాగే ఈస్ట్ ఎండర్స్ సిరీస్ రాసినందుకు గర్వపడతాను.  
        
          మీ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ కి కథా సూత్రాలు  కోర్సు చెప్పండి. ఈ కోర్సు ద్వారా మీరేం చెప్తున్నారు?
        ప్రస్తుతం ఎడిటర్లు, స్క్రిప్ట్ రీడర్లు, డెవలప్‌మెంట్ అసిస్టెంట్లు, స్టోరీలైనర్లు లేదా రచయితలకి నోట్స్ ఇవ్వాల్సిన ఎవరైనా స్క్రిప్ట్ ఎడిటింగ్ నైపుణ్యాలని పెంపొందించుకునేందుకు ఉద్దేశించిన కోర్సు ఇది.  స్క్రిప్ట్ ఎడిటింగ్‌లోకి వెళ్ళాలనుకునే స్క్రీన్ రైటర్‌లకి  ఇది అద్భుతమైనది. ఇది కథా నిర్మాణపు మెకానిక్స్ పట్ల, మరింత బలమైన కథల రూపకల్పన పట్లా అవగాహన ఏర్పరచి, వాటిని ఆచరణాత్మకంగా కథలకి వర్తింప జేసేందుకు తోడ్పడుతుంది. ఒకరు రాసినా, ఎడిట్ చేసినా మంచి కథ కోసమే. అలాంటప్పుడు ఈ కోర్సుని ఎందుకు అభ్యసించకూడదు. అభ్యాసం అవసరం లేదనడం, వాద్యకారుడ్ని సంగీతం నేర్చుకోవద్దని చెప్పడం లాంటిదే.
        
    ఒక రచయిత తన కథపై స్పష్టత సాధించడంలో సహాయపడడానికి మంచి స్క్రిప్ట్ ఎడిటర్‌పై ఆధారపడతాడు. కాబట్టి ఎడిటర్‌కి కథపై ఎంత ఎక్కువ పట్టు వుంటే అంత మంచిది. ప్రొడక్షన్ సమస్యలు కొన్నిసార్లు కథల్ని అష్టవంకర్లు తిప్పడానికి దారితీయవచ్చు. కాబట్టి ఎడిటర్‌గా మొదట కథ ఏమిటో తెలుసుకోవాలి. ఆపై దానిని కాపాడుతూనే సరసమైనదిగా, ప్రొడక్షన్ కి అనుకూలంగా, దాని విశ్వసనీయత చెడకుండా   తీర్చిదిద్దాలి. స్క్రిప్ట్ ఎడిటర్ అనే అతను రచయితకి రక్షక కవచంలా పనిచేస్తూ ముందుకి తీసికెళ్ళాలి.
        
        స్క్రిప్ట్ రీడర్లు మెరుగైన నోట్స్ ని ఎలా ఇవ్వగలరు? వాటిని స్వీకరించే రచయితలు ఎలా మెరుగవుతారు?
        అవతలి వ్యక్తి పాత్రలో మిమ్మల్ని మీరు వూహించుకోండి. విమర్శని తిరస్కరించడం అభద్రతని తెలుపుతుంది. దీన్ని అర్థం చేసుకుని సానుకూలంగా మార్చుకోవడం ఇరు పక్షాల పని. రచయితలు తరచుగా సున్నితంగా వుంటారు. వారికి భరోసా అవసరం కానీ ఫీడ్ బ్యాక్ కూడా అవసరం. ఎందుకంటే రచయితలు తమ రచన సృష్టించే లోకంలో వుండిపోయి బయటి నుంచి చూడరు. స్క్రిప్ట్ ఎడిటర్ లేదా రీడర్ కథని గనుక అర్థం చేసుకుంటే - నిజంగా అర్థం చేసుకుంటే - పాత్ర ప్రయాణం, సబ్‌టెక్స్ట్, స్ట్రక్చర్, డైలాగ్ మొదలైన వాటిపై వారి మార్గదర్శకత్వం చాలా విలువైనదిగా మారుతుంది.  ఎందుకంటే ఈ విషయాలన్నీ కథ చెప్పడానికి ఉపయోగపడతాయి.  చెప్పడానికి దృఢమైన, ఆకర్షణీయ కథ లేకపోతే, మిగిలినవన్నీ పక్కదారి పడతాయి. రచయిత దృక్కోణంలో విమర్శ కథని లోతుగా దొలిచేసినట్టు అన్పించి ఆత్మరక్షణకి దిగుతాడు. అందుకని నోట్స్ నిర్మాణాత్మకంగా, సున్నితంగా వుండేట్టు చూసుకోవాలి. ఇది మెరుగైన,  మరింత ఉత్పాదకతతొ కూడిన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. రచయిత ఎడిటర్ని విశ్వసిస్తే, వారిద్దరూ కలిసి మరింత మంచి ఫలితాల్ని సాధించవచ్చు.
        
        మీరు స్క్రిప్టుని భావోద్వేగానికి అద్దంలా భావించాలన్నారు. దీన్ని వివరించండి.
        ఒక నిపుణుడైన సర్జన్ కి ఎప్పుడు ఆపరేషన్ అవసరం లేదో తెలిసినట్టు స్క్రిప్ట్ రీడర్ కి కూడా తెలియాలి. కొన్నిసార్లు అతను ఎటువంటి ఆపరేషన్ అవసరం లేని స్క్రిప్ట్స్ చదువుతాడు. ఇతర సమయాల్లో, రచయితకి అద్దం వలె వ్యవహరిస్తాడు. తద్వారా తనతోబాటు, ప్రేక్షకుల ఎమోషనల్ ట్రావెల్లోకి రచయితని నడిపిస్తాడు. ఈ ఎమోషనల్ ట్రావెల్ తను ఫీలవుతున్నాడా లేదా తెలుసుకోవడం రచయిత వంతు. తను రాసిన సీనుకి రీడర్  చెప్పిన వేరే ఎమోషన్ (అర్ధం) వస్తూంటే, ఆ సీనుని మార్చడానికి రచయిత సిద్ధపడాలి.
        
        ప్రతీ లైనూ ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా రాయడమంటే?
        స్క్రీన్ రైటింగ్‌లో గొప్పగా మారడానికి చాలా సంవత్సరాల సాధన అవసరం. ఈ వృత్తి సంగీత వాయిద్యం లాంటిది. కాబట్టి అంతరాయం లేకుండా ప్లే చేసే శ్రావ్యతని సృష్టించడానికి కృషి చేయాలి. ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కరికీ ఒకే లక్ష్యం వుంది. సినిమా బోరు కొడుతూంటే సెల్ ఫోన్ తీసే లక్ష్యాన్ని, అది ఆన్‌లో వుంటే ట్విట్టర్‌ని చూసే లక్ష్యాన్ని నిరోధించే తెలివితో రచయిత రాయాలి. ఒక వాక్యం (లైను) రాస్తే ఇంకో వాక్యం చదివించేలా రాయాలి. అంతే, దీనికి ఇతరుల్ని అనుకరించవద్దు. సొంత వాయిస్ ని కనుగొనాలి. రచయితకి తన స్క్రిప్టుతో తనకి వుండే గొప్ప పరీక్ష ఏమిటంటే, తను రాసిన స్క్రిప్టుని తను వదిలి పెట్టకుండా ముగింపు వరకూ ఏకబిగిన చదవగల్గేడా? మధ్యలో ఆపి నిద్రపోయాడా? ఇది గొప్ప పరీక్ష. నిద్రపోక పోతే ఆ స్క్రిప్టులో ఏదో మ్యాజిక్ వున్నట్టే!
***