రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, ఏప్రిల్ 2016, బుధవారం

రైటర్స్ కార్నర్ :

  కప్పటి జంట రచయితలు సలీం - జావేద్ లు కలిసి స్క్రిప్టులు రాసినా డైలాగులు జావేదే  రాసినట్టు, పరుచూరి బ్రదర్స్ సెంటిమెంటల్ సీన్లు ఒకరు, యాక్షన్ సీన్లు మరొకరు పంచుకుని  రాసినట్టు, కవల సోదరులైన హాలీవుడ్ జంట రచయితలు  చాడ్ హేస్- కేరీ హేస్ లు యాక్ట్ లు పంచుకుని రాస్తారు. కలిసి 16 సినిమాలకి రాసిన ఈ కవల రచయితల తాజా సినిమా ‘కంజూరింగ్-2’ జూన్ 10 న విడుదల కాబోతోంది. వీరి పని విధానమేమిటో, కలిసి ఎలా పనిచేస్తారో ఒకసారి తెలుసుకుందాం..

     1. రాకెట్ డ్రాఫ్ట్ :కలిసి రాయడమంటే ఇద్దరూ కలిసి సీక్వెన్సులో రాసుకుపోవడం కాదు. సోలో రైటర్లు ఇలా రాయడానికే అలవాటు పడతారు. ముందు బిగినింగ్ రాసి, తర్వాత మిడిల్, ఆ తర్వాత  ఎండ్ పద్ధతిలో.  మా రాకెట్ డ్రాఫ్ట్ కోసం, అంటే ఫస్ట్ రఫ్ డ్రాఫ్ట్ కోసం- మా మెదడులో అప్పటికే రూపుదిద్దుకున్న సీన్లనీ, సీక్వెన్సుల్నీ రాస్తాం. వీటికి కనెక్టింగ్ మూమెంట్స్ ని రాకెట్ డ్రాఫ్ట్ పూర్తయాక రాస్తాం. దీంతో మేమనుకుంటున్న అతి ముఖ్యమైన సీన్లు, సీక్వెన్సులు పేపర్ పైకి వచ్చేస్తాయి. దీంతో ఈ సీన్స్ నీ, సీక్వెన్సుల్నీ కలిపే లింకుల గురించి చర్చిస్తాం. ఈ చర్చల్లో కోపతాపాలు, వాగ్యుద్ధాలూ మామూలే. ఇవి  కూడా భాగమే మా పని విధానంలో.  

          
2. యాక్ట్ ఎసైన్ మెంట్స్ : కలిసి రాయడమంటే సీక్వెన్సు లో రాసుకుపోవడం కాదని ఇందాకే  చెప్పుకున్నాం. మేమిద్దరం చెరొక యాక్ట్ పంచుకుంటాం.  ఫస్ట్ యాక్ట్ (బిగినింగ్) ఒకరు  తీసుకుంటే, సెకండ్ యాక్ట్ (మిడిల్) మరొకరు  తీసుకుంటాం.  ఈ తీసుకునే దగ్గర కూడా తీవ్ర చర్చ, గొడవ  జరుగుతుంది. ఇలా విడివిడిగా పంచుకుని ఈ రెండు యాక్టులూ రాశాక, థర్డ్ యాక్ట్ (ఎండ్) ని ఇద్దరం కలిసే  రాస్తాం. ఎందుకంటే ఇది అత్యంత కష్ట తరమైన భాగం.  ఈ రోజుల్లో ప్రేక్షకులు పెట్టే డబ్బుకి సరిపడా సంతృప్తితో కథని ముగించి ఇంటికి పంపించడమనేది చాలా కష్టంతో కూడుకున్న పనై పోయింది. థర్డ్ యాక్ట్ కలిసి  రాశాక, మొదట్లో విడివిడిగా రాసిన రెండు యాక్ట్స్ ని పరస్పరం మార్చుకుని వాటి మీద విడివిడిగా పని చేస్తాం. ఒకరు రాసిన యాక్ట్ ని మరొకరు దిద్దుతాం తప్పులేమైనా వుంటే. అలాగే నోట్స్ రాస్తాం, కొత్త అయిడియాలు స్ఫురిస్తే అవీ రాస్తాం. అప్పుడు ఆ రెండిటినీ చర్చిస్తాం. ఒక రూపానికి తీసుకొస్తాం.

        3. డ్రాఫ్ట్ ప్రాసెస్ : ఇప్పుడు సీన్లని బ్రేక్ డౌన్  చేస్తాం. ఇది కూడా సీక్వెన్సులో వుండదు. ఒక్కో సీన్ లాటరీ తీసి విడివిడిగా వాటి మీద వర్క్ చేస్తాం. మళ్ళీ పోల్చుకుంటాం. ఇది కూడా పూర్తయ్యాక డ్రాఫ్ట్ రాస్తాం. ఇది అనేక సార్లు తిరగ  రాశాకే ఫైనల్ కాపీ తీసి అందిస్తాం.


కొత్త రచయితలకి సూచనలు :

1. రాయండి, రాస్తూనే వుండండి :  రచయితగా మారాలంటే  ఏం కిటుకు లుంటాయంటే కిటుకులేమీ వుండవు, ఒకరికి చెప్పకూడని రహస్యాలేమీ లేవు. జస్ట్ రాయండి, అంతే. ఎక్కడైనా ఎప్పుడైనా రాయండి. ‘వన్ నోట్’  మీద రాయడం రైటర్స్ కి బాగా కలసివచ్చే అంశం. ఎక్కడైనా ఎప్పుడైనా అందుబాటులో  వున్న కంప్యూటర్, లాప్ టాప్, మొబైల్.. ఇలా  ఏ డివైస్ లో  నైనా  ‘వన్ నోట్’ ని ఓపెన్ చేసి వర్క్ చేసుకోవచ్చు.
కాఫీ షాప్ లో  ఓ మూడు నిమిషాలు లీజర్ దొరికిందా? ఐతే టాబ్లెట్ ఓపెన్ చేసి ‘వన్ నోట్’ లో ఓ రెండు పేరాలు రాయండి. ట్రైన్ లో పోతూండగా ఐడియా ఏదైనా తట్టిందా? మీ ఫోన్లో ‘వన్ నోట్’ ఓపెన్ చేసి రాయండి. రైటింగ్ అనేది నిరంతరం  సానబట్టుకుంటూ ఉండాల్సిన వృత్తి. రాయడానికి అవకాశం చిక్కినప్పుడల్లా రాస్తూనే వుండాలి.

 
2. బాగా చదవండి : గొప్ప రచయితలు ఎంత రాస్తారో అంత చదువుతారు. మీరు సినిమా రచయిత అయితే సినిమా స్క్రిప్టులు చదవండి. నవలా రచయిత అయితే నవలలు చదవండి. కథా రచయిత అయితే కథానికలు చదవండి. చెడ్డ కథలు చదివి వాటిని బాగా ఎలా రాయవచ్చో ఆలోచించండి.  మంచి కథలు చదివి ఇంకా మంచిగా ఎలా రాయవచ్చో ఆలోచించండి. ఏ ఖాళీ దొరికినా మేం స్క్రిప్టులు చదువుతూనే వుంటాం. వర్క్ తో బాటు  ఎంజాయ్ మెంట్ కోసం కూడా. వన్ నోట్’ తో ఇది సులభమవుతోంది. ‘వన్ నోట్’  లొ సేవ్ చేసిన వందల,  వేల స్క్రిప్టులు మా టాబ్లెట్ లో ఓపెన్ చేసి చదువుకుంటాం.

 
3. అవుట్ లైన్ తో  ప్రారంభించండి :  అవుట్ లైన్ చాలా  ముఖ్యం. మళ్ళీ రిపీట్ చేస్తాం :  అవుట్ లైన్ పెట్టుకుని  రాయడం ప్రారంభించండి.  మా కొచ్చే పెద్ద పెద్ద అయిడియాలన్నిటికీ    డైలాగులూ  యాక్షన్ ఆలోచించేకంటే ముందు, అవుట్ లైన్ వేసి చూస్తాం. ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోండి : అవుట్ లైన్ గా వర్కౌట్ కాని ఐడియా స్క్రిప్టుగా వర్కౌట్ గాదు. అవుట్ లైన్ మీ కథకి రోడ్ మ్యాప్. స్క్రిప్టు రాస్తున్నప్పుడు రిఫరెన్స్ కోసం అవుట్  లైన్ ని వెతుక్కునే అవసరం లేకుండా,  ఈజీ యాక్సెస్ కోసం,  ‘వన్ నోట్’ లో   మీ వర్కింగ్ డ్రాఫ్ట్ పక్కన పెట్టుకోండి.


4. రాయండి, ఎడిట్  చేయండి, రిపీట్ చేయండి : రచయితలు  తిరిగరాత గాళ్ళే. రాసేకన్నా తిరగ రాసేదే  ఎక్కువ వుంటుంది. ఈ వృత్తే అలాంటిది. చాలా మానసిక శ్రమ డిమాండ్ చేసేది. ‘ది కంజూరింగ్-2’ అనే మా  స్క్రిప్టుని 150 సార్లు తిరగ రాస్తే గానీ ఫైనల్ కాపీ తయారు కాలేదు. ఆ తిరగ రాసిన ప్రతి చిత్తు ప్రతినీ ‘వన్ నోట్’ లో సేవ్ చేసి వుంచాం. స్క్రిప్టు ని  స్టూడియోకి సబ్మిట్ చేసే ముందు ఇదంతా చేస్తాం. ప్రొడక్షన్ ప్రాసెస్ లో స్టూడియో ఎగ్జిక్యూటివ్ ల నుంచి, నిర్మాతల నుంచి, నటీనటుల నుంచీ, దర్శకుడి నుంచీ మాకందే బెటర్ మెంట్ నోట్స్ ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ తిరగ రాస్తాం. ఇదంతా పేపర్ మీద గంటల కొద్దీ పట్టే  ఎడింగ్ పని కాదు, ఖర్చుతో కూడిన ప్రింటింగ్ తోనూ పనిలేదు, నోట్స్ ఎక్కడో మిస్సయ్యే సమస్యా  వుండదు- ‘వన్ నోట్’ లోనే ఇదంతా సాఫీగా తేలిగ్గా జరిగిపోతుంది.


5. కలిసి  రాసే ప్రయత్నం చేయండి : ఇంకొకర్ని కలుపుకుని రాయడం ఎప్పుడూ మంచిదే. చేస్తున్న తప్పులు తెలుస్తూంటాయి. మేమిద్దరం పగలు కలిసి పని చేస్తాం. రాత్రి  ‘వన్ నోట్’ లో వర్కింగ్ స్క్రిప్ట్ ఇంటికి పట్టుకు  పోతాం. ఆ రోజు జరిగిన వర్క్ మీద నోట్స్ రాస్తాం, సందేహాలు నోట్ చేస్తాం, కొత్త ఆలోచనలు ప్రతిపాదిస్తాం.  అప్పటి కప్పుడు ఒకరు రాస్తున్నది మరొకరం  రియల్ టైంలో   టాబ్లెట్ లో  చూసుకుంటాం. కలిసి రాయడంవల్ల మా క్రియేటివిటీ మరింత విస్తృతమవుతూంటుంది. అంతే గాక కొత్త పద్ధతుల్లో రాసే ఉపాయాలు తెలుస్తూంటాయి ‘వన్ నోట్’ లాగా.



   ***