రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, December 18, 2015

సెన్సిబిలిటీ అడగొద్దు!






రచన – దర్శకత్వం : పూరీ జగన్నాథ్

తారాగణం : వరుణ్ తేజ్, దిశా పటానీ, రేవతి, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, అలీ, సప్తగిరి, ధన రాజ్ తదితరులు
సంగీతం : సునీల్ కాశ్యప్,  ఛాయాగ్రహణం : పి.జి. విందా
బ్యానర్ : సికె ఎంటర్  టెయిన్ మెంట్స్, శ్రీ శుభ శ్వేతా ఫిలిమ్స్
నిర్మాత : సి. కళ్యాణ్

విడుదల : 17 డిసెంబర్ 2015
***
తెలుగు సినిమాల రొటీన్ ని బ్రేక్ చేస్తూ ‘కంచె’ లాంటి డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల మన్ననలు పొందిన నవయువ హీరో వరుణ్ తేజ్, ఈ సారి అందరు స్టార్ల లాగే తనుకూడా ఓ పక్కా మాస్ పాత్ర చేస్తే, లెక్క బ్యాలెన్స్ అవుతుందని  కాబోలు, పూరీ జగన్నాథ్ కి ఓకే అనేసి మాస్ టైటిల్ తో ‘లోఫర్’ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇలా యూటర్న్ తీసుకోవడం మంచిదా  కాదా  ప్రేక్షకులే నిర్ణయిస్తారు. అయితే స్టార్లతో మాస్ సినిమాలు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగల్గేవిగానే ఉంటూ వస్తున్నాయి - వాటి జయాపజయాల సంగతెలా వున్నా. కానీ వరుణ్ తేజ్ తో పూరీ బ్రాండ్ మాస్ అనేసరికి ఈసారి చాలా భిన్నంగా, రొటీన్ ని బ్రేక్ చేసే  మాస్ మూవీగా  ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘లోఫర్’. ఈ భిన్నత్వమేమిటో, రొటీన్ ని ఎలా బ్రేక్ చేసిందో ఈ కింద తెలుసుకుందాం.

కథాకమామీషు
        స్తీలో బతికే లక్ష్మి ( రేవతి), మురళి ( పోసాని) పోట్లాడుకుని విడిపోవాలనుకుంటారు. మూడేళ్ళ కొడుకు ని మురళి తీసుకెళ్ళి పోబోతే అడ్డు పడుతుంది లక్ష్మి. లోఫర్ గా తిరిగే భర్త చేతికి కొడుకుని ఇవ్వకూడదనుకుంటుంది. మురళి బలవంతంగా తీసికెళ్ళి పోయి తనలాగే లోఫర్ బుద్ధులన్నీ నేర్పి  దొంగగా తయారు చేస్తాడు. తండ్రితో కలిసి దొంగతనాలు చేస్తూంటాడు రాజా ( వరుణ్ తేజ్).

        అటు వూళ్ళో తండ్రి (ముఖేష్ రిషి) బలవంతపు పెళ్లి చేస్తున్నాడని తప్పించుకొచ్చిన మౌని ( దిశా పటానీ), రాజా కి తారసపడుతుంది. రాజా ఈమెని ప్రేమించడం మొదలెడతాడు. దీనికి తండ్రి మురళి అడ్డు పడతాడు. రాజాకి అతడి తల్లి గురించి చెడుగా చెప్పివున్నాడు మురళి.  కామెర్లు వచ్చి చనిపోయిందని అబద్ధం కూడా చెప్పాడు. ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాదని నూరి పోశాడు. ఇప్పుడు రాజా మౌని తో ప్రేమలో పడడంతో సమస్యై పోతాడు రాజాకి. ఇలా వుండగా, మౌని అన్నదమ్ములు ఆమెకోసం ముఠాతో వచ్చిపడతారు. మౌని కి పూర్వం నుంచే రాజా తల్లి లక్ష్మితో వూళ్ళో పరిచయముంటుంది. ఆమె కబురు చేసేసరికి లక్ష్మి కూడా వచ్చేస్తుంది. ముఠా బారి నుంచి మౌని ని కాపాడుతున్న రాజాని చూసి, వీడు నీకు తగ్గ వాడు కాదని మౌనిని లాక్కెళ్ళి పోతుంది లక్ష్మి. అతను  తన కొడుకని గుర్తు పట్టదు. 

        కానీ ఇంట్లో తల్లి ఫోటో పెట్టుకున్న  రాజా ఆమెని గుర్తు పడతాడు. కానీ కొడుకని చెప్పుకోలేని పరిస్థితి.  ఇక ఆమెకోసం ఊరెళ్ళి పోతాడు. అక్కడ తనని గుర్తు పట్టని తల్లికి దగ్గరవడం గురించి, మౌని కి బలవంతపు పెళ్లిని తప్పించడం గురించీ ప్రయత్నాలు మొదలెడతాడు. అప్పుడేం జరిగింది?  రాజాయే తన కొడుకని లక్ష్మి తెలుసుకుందా? రాజాకీ మౌని కుటుంబానికీ వున్న సంబంధమేమిటి?  తనని తల్లి నుంచి దూరం చేసి  చేసి ఇద్దర్నీ ఏడ్పించిన తండ్రి కెలా బుద్ధి చెప్పాడు ?...ఇవీ  మిగతా సినిమా చూస్తే తెలిసే విషయాలు.

ఎలావుంది కథ
        బస్తీమే సవాల్ గా వుంది. దర్శకుడు తను అతిగా ప్రేమించే మాస్ ప్రేక్షకుల్ని కూ డా ఈసారి విభజించుకుని, అక్షరాస్యతా తెలివితేటలూ వుండని అన్ ఎడ్యుకేటెడ్స్ కి మాత్రమే అన్నట్టు వాళ్లకి స్థాయికి తగ్గ  కథకథనాలు చూసుకుని, ఇతర వర్గాల  ప్రేక్షకులకి నమస్కారం పెట్టేయడం విచారకరం. ఇలా యూత్ కి గానీ,  మిగతా ఫ్యామిలీస్ కి గానీ  కనెక్ట్ అయ్యే అంశాలేవీ లేకపోవడం ఇక్కడ ఈ మూవీ సొంతం చేసుకున్న భిన్నత్వమన్న మాట.  యూత్ లో కూడా అబ్బాయిలు తప్ప అమ్మాయిలూ ఈ దర్శకుడి సినిమాలు చూడడం ఎప్పుడో మానేశారనేది ఇంకో వాస్తవం. గత రెండు ‘టెంపర్’, ‘జ్యోతి లక్ష్మి’  అనే అడల్ట్ కంటెంట్ వున్న వయొలెంట్ మూవీస్ కైతే ప్రేక్షకుల్లో అమ్మాయిలే లేరు. ఇలా తనకున్న యువ ప్రేక్షకుల్ని కూడా జెండర్ ఆధారం గా విభజించుకుని కథలు తయారు చేసుకుంటున్న  తను, ఈసారి  యూత్ లో అబ్బాయిల్ని కూడా దూరం చేసుకుంటూ - మాస్ సినిమాల రొటీన్ తత్వాన్ని బ్రేక్ చేయడం మరో ప్రత్యేకత! ఏదో రెండు సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న యువహీరో వరుణ్ తేజ్ పేరు చూసి కొందరు యూతబ్బాయిలు  ఈ సినిమాకి  ఏకైక పోషకులుగా మిగలొచ్చు.


స్క్రీన్ ప్లే సంగతులు       వాస్తవానికి స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకునేంత స్థాయి సినిమా కాదిది. ఎందుకంటే పైన చెప్పుకున్నట్టు బస్తీమే సవాల్ గా తీసిన లెక్కా పత్రం, కథా కార్ఖానా పట్టని సినిమా ఇది. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో గ్రామ కక్షల సినిమాల్లోలాంటి పురాతనమైన కథకి కనీసం దర్శకత్వ విలువలు, విజువల్స్ లో, ఎడిటింగ్ లో చూపాల్సిన టెక్నికల్ విలువలూ పట్టని ‘సినిమా చుట్టేయడం’ అనే పద్దతిని పాటించిన విధానమిది. గ్రామ కక్షల సినిమాల్లో నైనా కొన్ని విలువలకి అర్ధవంతమైన చిత్రణలుండేవి. ఆత్మీయతలు, అనుబంధాలు, ఎడబాట్లు, త్యాగాలు వంటివి సాగదీసినా వాటికి పునాదులంటూ ఉండేవి. తల్లినే చంపే  రాక్షస కొడుకులూ, అందుకు పురిగొల్పే తండ్రులూ వంటి పాత్రలకి చోటుండేది గాదు. 

        మదర్ సెంటి మెంటు తో కథ అన్నాక ఆ పాయింటు  గల్లంతయ్యే వయొలెంట్ చిత్రణలుంటే, అదొక సెంటి మెంటు అని ప్రచారం చేయడంలో అర్ధమే లేదు. సెకండాఫ్ లో హీరోయిన్ తండ్రి ఇంట్లో బందీ అయిపోతే పాపం హీరోగారికి రోమాన్స్ కి వీల్లేక డ్రైగా వాళ్ళ మీదా వీళ్ళ మీద పడి కథ లాగించెయ్యాల్సిన పరిస్థితి. పెళ్లి ఇష్టం లేని పిల్ల ఇంట్లోంచి పారిపోతే, దానికోసం ముఠా వెంటపడ్డం అనే ట్రాక్ ఇంకా ఇంకా హీరోయిన్ కి  పెట్టారంటే, కొత్తగా కథ ఆలోచించాలన్న ఓపిక లేకపోవడమే ఇది. 

        ఇదే ‘లోఫర్’  టైటిల్ తో ధర్మేంద్ర – ముంతాజ్ లు నటించిన 1973 నాటి సూపర్ హిట్ మూవీ వుంది. తెలుగువాడైన  ఎ. భీమ్ సింగ్ దీని దర్శకుడు. 1954- 78 మధ్యకాలంలో, ఈయన మొత్తం  తన 53 ఏళ్ల జీవితంలో తెలుగు, హిందీ, తమిళ, మళయాళ, కన్నడ సినిమాలు అన్నీ కలిపి 67 వరకూ దర్శకత్వం వహించాడు. దర్శకుడే గాక ఈయన నిర్మాత, రచయిత, ఎడిటర్ కూడా. హిందీలో ‘లోఫర్’ తో బాటు, ‘మై చుప్ రహూంగీ’, ‘జోరూకా గులాం’, ‘రాఖీ’ వంటి పన్నెండు హిట్సే గాక, దిలీప్ కుమార్- సైరాబానూ లతో ‘గోపీ’ అనే అతిపెద్ద మ్యూజికల్  సూపర్ హిట్ కూడా ఇచ్చిన వాడు. తెలుగులో ‘మనసిచ్చిన మగువ’, ‘బంగారు మనిషి’, ‘ఒకే కుటుంబం’ లాంటి 9 సినిమాలకి దర్శకత్వం వహించాడు. 



        భీమ్ సింగ్ ‘లోఫర్’ ని మూస ఫ్యామిలీ సెంటిమెంట్లూ అంటూ చాదస్తాలకి పోకుండా, ట్రెండ్ ని బట్టి ఒక రోమాంటిక్ థ్రిల్లర్ లా కొత్తగా తీశాడు. చిన్నప్పుడే ధర్మేంద్ర స్కూల్లో ఆకతాయి కుర్రాడు. తనవల్ల ప్రమాదవశాత్తూ తోటి స్టూడెంట్ స్కూలు భవనం మీంచి పడి చనిపోతాడు. ధర్మేంద్ర రైలెక్కి బాంబే  పారిపోతాడు. అక్కడ అంకుల్ అనే గ్యాంగ్ స్టర్ కంటబడతాడు. అంకుల్ దగ్గర నేరస్థుడిగా మారిపోతాడు. అంకుల్ ప్రత్యర్ధికి ఆటంకంగా మారతాడు. దీంతో హీరోయిన్ ముంతాజ్ రంగంలో కొస్తుంది. ఈమె ఎవరు? ఇంకా తెలుగు సినిమాల్ని వదల బొమ్మాళీ అంటూ పట్టి పీడిస్తున్న ‘ఇంటి దగ్గర పెళ్లి తప్పించుకు పారిపోయిన, ముఠా వెంటబడుతున్నఅర్భక హీరోయిన్ పాత్ర’  లాంటిది మాత్రం చస్తే కాదు నీచంగా.  అంకుల్ ప్రత్యర్ధి ధర్మేంద్ర మీద నిఘా కోసం నియమించిన ఏజెంట్ ఆమె. ధర్మేంద్ర ని చంపేందుకు తగిన సమయం చూసి చెప్పాలామె. ఇదికదా యాక్టివ్ హీరోయిన్ క్యారక్టర్ అంటే? 

        చాలా మలుపులు తిరుగుతుంది ఈ కథ. ఒక పెద్ద వజ్రాల దోపిడీలోకి తిరగబెడుతుంది. ధర్మేంద్ర ని రోమాంటిక్ గా ఎంత స్పీడుగా ముంతాజ్ వెంటాడుతూంటుందో, ధర్మేంద్రని  చిన్ననాటి  రహస్యం ( స్టూడెంట్ మరణం) అంతే  కరకుగా వెన్నాడుతూంటుంది. మనిషి అన్నాక మనస్సాక్షిని చంపుకుని ఎక్కువ కాలం మనలేడు.. ఆ చనిపోయిన పిల్లాడు మరెవరి కొడుకో కాదు...

        పాడిందే పాడరా ..అన్నట్టు ఇలాగే లోఫర్లూ, డాఫర్లూ అంటూ తెలుగులో స్లమ్ డాగ్ సినిమాలు తీసుకుంటూ పోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. మన కభ్యంతరం లేదు. ఈ చాదస్తాలకి ప్రామిజింగ్ గా తెరపైకొచ్చే హీరోలు బలైపోతున్నారనేదే సమస్య. ఈ బానిస శృంఖలాల్ని వరుణ్ తేజ్ ఎంత త్వరగా తెంచుకు  బయటపడితే అంత మంచింది సెన్సిబుల్ సినిమాలతో...

-సికిందర్ 

సాంకేతికం

       
   శరవేగంగా టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు సినిమా రంగానికి ఎప్పటికప్పుడు అనేక సవాళ్ళు విసురుతున్నాయి. హోం థియేటర్లు, హెచ్ డీ స్క్రీన్లు, ఆన్ లైన్ పైరసీ మొదలైన టెక్నాలజీ పరమైన సవాళ్ళకి తోడూ సెల్ ఫోన్లలో సైతం షార్ట్ ఫిలిమ్స్ చూసుకునే సౌకర్యం ఏర్పడడంతో, ఇంకా వీడియో గేమ్స్ వంటి కాలక్షేపాలతో ప్రేక్షకులు థియేటర్ల మొహం చూడ్డం  మానేస్తున్నారు. ఇలాటి ప్రేక్షకుల్ని నిత్యం థియేటర్లకి రప్పించే ప్రయత్నాలు టెక్నాలజీ పరంగా జరుగుతూనే వున్నాయి.
తాజాగా దక్షిణ  కొరియా దిగ్గజం సామ్ సంగ్ వర్చువల్ రియాలిటీ మూవీ ప్రొజెక్షన్ ని ప్రవేశ పెట్టింది. దీంతో సినిమా చూసే అనుభవం- వూహ కందని ప్రపంచంలో మనం ఉన్నట్టుగా చూపించే అద్భుత విన్యాసంతో - అదీ థియేటర్లలో మాత్రమే అభించే అనుభవంగా మారబోతోంది.  

దక్షిణ కొరియాలో స్థానిక సినిమా నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్లు 3డీ,  4డీ  సినిమా ప్రదర్శనలకంటే  ఇంకా హై ఎండ్ 5 డీ  వీ ఆర్’ ( వర్చువల్ రియాలిటీ ) ప్రదర్శనలకి అప్ డేట్ అవ్వాలని ఆశిస్తున్నారు. ఈ దృష్ట్యా వర్చువల్ రియాలిటీ ని వినూత్న ప్లాట్ ఫాం గా పరిచయం చేయదలచుకున్నామని సామ్ సంగ్ సీ ఈ ఓ  జేకే షిన్ చెప్పారు.
        అప్పుడే జియాన్ వూ- యెల్ అనే దర్శకుడు  మొట్ట మొదటి కొరియన్ వీ ఆర్ మూవీ గా టైం పారడాక్స్’  అనే షార్ట్ ఫిలిం ని రూపొందించారు. ఇది ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంకా వీ ఆర్ వీడియో గేమ్స్ ని డెవలప్ చేయాలంటే చాలా ఏళ్ళు పడుతుందనీ, కానీ వీఆర్ సినిమాలు నిర్మించాలంటే చాలా తక్కువ సమయం పడుతుందనీ దర్శకుడు జేయోన్ చెప్పారు. ఈయన మరో నాల్గు వీ ఆర్ మూవీస్ పై వర్క్  చేస్తున్నారు.
     వీఆర్ టెక్నాలజీ థియేటర్ ఒనర్లని కూడా ఆకర్షిస్తోంది. దక్షిణ కొరియాలో అతిపెద్ద థియేటర్  నెట్ వర్క్ సంస్థ  సిజె- సిజివి  స్క్రీన్ ఎక్స్’  అనే సరికొత్త వెండి తెరని ఏర్పాటు చేసింది.  దీన్ని కొరియా అడ్వాన్స్ డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించింది.
        ప్రపంచంలో మొత్తం నాల్గు దేశాల్లో ఇంతవరకూ 84 స్క్రీన్ ఎక్స్ వెండి తెరలు ఏర్పాటయ్యాయి. రానున్న మాసాల్లో ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. చైనాకి చెందిన అతిపెద్ద థియేటర్ల గ్రూప్ వాండా గ్రూప్’  ఈ బృహత్కార్యానికి పూనుకుంటోంది. చైనాలో వాండా సినిమా గ్రూప్, ఉత్తర అమెరికాలో ఎ ఏం సీ, ఆస్ట్రేలియాలో హైట్స్ అనే  పేర్లతో ఈ సంస్థ థియేటర్ లని  నిర్వహిస్తోంది. 2020 నాటికల్లా వెయ్యి  థియేటర్లని వీ ఆర్ థియేటర్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
      దక్షిణ కొరియాలో వీ ఆర్ ఫార్మాట్ లో కాయిన్ లాకర్ గర్ల్అనే థ్రిల్లర్ హిట్టయింది. వాండా గ్రూప్ సినిమా నిర్మాణం లో కూడా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వీ ఆర్ ఫార్మాట్ లో  ది ఘౌల్స్’  అనే సినిమా నిర్మాణాన్ని ప్రారంభించింది.
        ‘ఇళ్ళల్లో కూర్చుని సినిమాల్ని డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్న కాలంలో వీ ఆర్ టెక్నాలజీ ప్రేక్షకుల్ని తప్పకుండా థియేటర్ల వైపుకు లాగుతుంది. వీ ఆర్ ఫార్మాట్ లో సినిమాలు చూస్తే  ఆ అనుభవమే వేరు. దీనికి ఇంకేదీ సాటి రాదుఅని వాండా గ్రూప్ ప్రతినిధి చెప్పారు.

-సికిందర్