రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, మే 2016, గురువారం

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -14




గొప్ప కథల ముగింపులు ప్రారంభంలోనే  పాగా వేసుకుని వుంటాయి. పుట్టుకని అంటి పెట్టుకునే మరణం వున్నట్టు, చీకట్లో కలగలిసిపోయే వెలుతురు వున్నట్టు, థియేటర్లో తెర పైకి లేవడంలోనే  కిందికి దిగడం  వున్నట్టు- గొప్ప కథల ముగింపులన్నీ  ప్రారంభంలోనే  వుంటాయి. అవి సహజ ముగింపులుగా వుండి, కథకి సోల్ ని ఏర్పాటు చేసే ప్రక్రియని కొలిక్కి తెస్తాయి. ‘శంకరాభరణం’ లో శంకర శాస్త్రి- మంజూ భార్గవిని చేరదీయడంలోనే కథకి ముగింపు వుంది- మరణంలో కూడా వాళ్ళు ఒకటయ్యే సహజ ముగింపు. సోల్ ఫుల్ ఎండింగ్. ‘ముత్యాల ముగ్గు’ లో రావుగోపాల రావు కుట్రచేసి,  శ్రీధర్ - సంగీతలని విడదీయడంలోనే అతడి వినాశంతో ముగింపు రాసిపెట్టి వుంది. ‘అహ నా పెళ్ళంట’  లో రాజేంద్ర ప్రసాద్ పీనాసిగా  నటించడంలోనే  కోట శ్రీనివాసరావు తిక్క కుదిర్చే ముగింపు వుంది. ‘శివ’ లో నాగార్జున జేడీ ని కొట్టడంలోనే రఘువరన్ మాఫియా ప్రపంచానికి చరమాంకం వుంది. ‘క్షణం’ లో కూతుర్ని వెతకమని అడవి శేష్ ని అదా శర్మ అర్ధించడంలోనే,  ఆ కూతురు అతడిదయ్యే ముగింపూ దాగి వుంది...

      దీ స్వతంత్రంగా లేదు, అన్నీ ద్వంద్వాలేనని  కథకులకి తెలుసు. రేయింబవళ్ళు, సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, రాగద్వేషాలు, జననమరణాలు ... పాజిటివ్ /నెగెటివ్- నెగెటివ్ /పాజిటివ్ ల బొమ్మా బొరుసాటే జీవితమైనా కథైనా. వీటిలోనే పరస్పర ముగింపులు దాగి వుంటాయి. అపజయంలో విజయం, విజయంలో అపజయం తొంగి చూస్తూంటాయి. పక్వత కొచ్చినప్పుడు అవి బయటపడి ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే కథా ప్రారంభాల్లో కూడా ముగింపులు కథనం పక్వత కొచ్చేవరకూ వేచివుంటాయి. పక్వతకి రాగానే బయటపడి  ప్రభావాన్ని చూపిస్తాయి. కథల్లో ఇది స్టోరీ క్లయిమాక్స్ అవుతుంది. అంటే  స్క్రీన్ ప్లే లో కథ ఎక్కడైతే  ప్రారంభమవుతుందో (ప్లాట్ పాయింట్ వన్ దగ్గర అన్నమాట) అక్కడే కథకి  ముగింపూ ఆటోమేటిగ్గా ప్రోగ్రాం చేసి వుంటుందన్న మాట. పని గట్టుకుని కథకుడు  ముగింపులు రాసి అతికించేదేం వుండదు.  పైన పేర్కొన్న సినిమాల ఉదాహరణల్లో ఇది గమనించాం. 

        ఇక ప్లాట్ క్లయిమాక్స్ వుంటుంది. ఇది కథా ప్రారంభంలో దాగి వుండే ముగింపుని కాదని,  ‘కథనం’ లో మరెక్కడ్నించైనా పుట్టుకు రావచ్చు. దీన్ని  ట్రాజడీల్లో గమనించ వచ్చు. ట్రాజడీలు ప్లాట్ క్లయిమాక్స్ తో వుంటే ఇంకా బావుంటాయి. ఎందుకంటే కథా ప్రారంభంలో వుండే ముగింపు (స్టోరీ క్లయిమాక్స్) నే కథకుడు ట్రాజడీగా మార్చి ముగిస్తే  అందులో సోల్ వుండదు. ఉదాహరణకి-  ‘శివ’ లో నాగార్జున జేడీని కొట్టిన కథా ప్రారంభాన్ని, మాఫియా రఘువరన్ చేతిలో నాగార్జున చనిపోయే ట్రాజడీగా మార్చుకుని ముగిస్తే, అది వర్కౌట్ కాదు. వర్కౌట్ అవాలంటే రఘువరన్ ని  చంపి ఆ పోరాట ఫలితంగా నాగార్జున కూడా చనిపోవాలి.  అప్పుడా ట్రాజడీ ఉన్నతాదర్శం కోసం చేసిన ఆత్మబలిదానంగా సోల్ ని సంతరించుకుంటుంది. ఐతే కథా ప్రయోజనం దృష్ట్యా ఈ సోల్ రసపోషణ చెయ్యదు.  

        లేదూ ఏ హీరోయిజమూ లేని  పాసివ్ పాత్రగా అయ్యోపాపం అన్పించాలంటే,  ‘దేవదాసు’ లోలాగా ప్లాట్ పాయింట్ వన్ కి  ముందే, బిగినింగ్ విభాగంలో ఆ పాసివ్ నెస్ కి కారణమవుతున్న వ్యక్తిత్వ లోపం ఏదైనా చూపాలి. ‘దేవదాసు’ లో అర్ధరాత్రి తనని వరించమని వచ్చే పార్వతిని భయంతో, పిరికితంతో దేవదాసు తిరస్కరించే వ్యక్తిత్వ లోపముంది. దాని ఫలితం చివరిదాకా అనుభవించాడు. ఇలాగే  ‘కృష్ణ గాడివీర ప్రేమ గాథ’ లో గొడవలంటే భయపడి పారిపోయే నాని పాత్ర లాంటిది ‘శివ’లో నాగార్జున అయివుండాలి. మొదట ఈ లోపాన్ని కూడదీసుకుని ప్లాట్ పాయింట్ వన్  దగ్గర ఎలాగో జేడీ నికొట్టి కథని ప్రారంభించినా- ఆ తర్వాత అడుగడుగునా ఈ లోపం వెన్నాడుతూ చివరికి రఘువరన్ చేతిలో అంతమయ్యే  ట్రాజడీకి చేరుకోవచ్చు. స్టోరీ క్లయిమాక్స్ ని ట్రాజడీ గా మార్చాలంటే ఇంతకంటే మార్గం లేదు. అయితే స్టోరీ క్లయిమాక్స్ ని ట్రాజడీగా మార్చే టప్పుడు కథా ప్రయోజనాన్నికూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ కథ ద్వారా ఏం చెప్పా బోతున్నారన్నది ముఖ్యం. కథా ప్రయోజనం సమాజంలో దుష్టశక్తిని నిర్మూలించి శాంతియుత వాతావరణం నెలకొల్పడమైతే, రఘువరన్ ఒక్కడే  చనిపోతే  ఆ కథా ప్రయోజనం నెరవేరుతుంది. రఘువరన్ తో బాటు నాగార్జున కూడా చనిపోతే రస భంగమవుతుంది. సోల్ ఏర్పడ వచ్చు,  కానీ ఆ సోల్ కి కథాప్రయోజనంతో  సంబంధం వుండదు. రఘువరన్ చస్తే ప్రేక్షకులు ఆనందంతో కొట్టే చప్పట్ల హోరుతో  నెరవేరే కథాప్రయోజనం, అంతలో నాగార్జున కూడా చనిపోతే చప్పట్లు సద్దుమణిగి  ఉస్సూరనే ప్రేక్షకుల నిట్టూర్పులతో సోల్ ఆవిరై పోవచ్చు. కాబట్టి ట్రాజడీ చేసే టప్పుడు సోల్ కి  ఉద్దేశించిన కథా ప్రయోజనంతో సంబంధం ఉండేట్టు చూసుకోవాలి. 

        మరైతే,  ‘శంకరాభరణం’ లో స్టోరీ క్లయిమాక్స్ తోనే ముగింపు ట్రాజడీ అయింది కదా అనొచ్చు. ‘శంకరాభరణం’ ముగింపు ట్రాజిక్ అని ఎవరన్నారు? అవి కర్తవ్యం పూర్తి చేసుకుని దైవ సన్నిధికి ఒకరు, గురువు పాదాల చెంతకి మరొకరూ  చేరుకునే  ఆత్మల సమ్మేళనం. స్పిరుచ్యువల్ నోట్ తో ఆ కథ సుఖాంతం. ఆధ్యాత్మిక జానర్ ట్రాజిక్ ఫీల్ నివ్వదు. 

     ఇక ప్లాట్ క్లయిమాక్స్ ఇలా వుంటుంది- ‘మరో చరిత్ర’ లో కమల్ హసన్,  సరితలు ఏడాది పాటు విడివిడిగా గడిపితే,  అప్పటికీ  వాళ్ళ ప్రేమ ఇంతే బలంగా వుంటే, పెళ్లి చేస్తామన్న పెద్దల షరతు ప్రకారం విడివిడిగా వుంటారు. ఇది కథా ప్రారంభం. ఇందులోనే ముగింపూ వుంది. ఈ పరీక్ష నెగ్గి ఒకటయ్యే  ముగింపు. కానీ ఈ ముగింపుని ట్రాజడీ చేయాలనుకున్నారు. అందుకే స్టోరీ క్లయిమాక్స్ ని క్యాన్సిల్ చేసే ప్లాట్ క్లయిమాక్స్ ని ప్లాన్ చేశారు. కథా ప్రారంభానికి ముందు కథనంలో సరితని ఒకడు టీజ్ చేస్తే ఆమె చెంప వాయించే ఘట్టం, కథా  ప్రారంభం తర్వాత కథనంలో మాధవితో కమల్ పెళ్లిని  తిరస్కరిస్తే ఆమె అన్న పగ బట్టే  సన్నివేశం. మొదటి చోట సరితకి వాడొక విలన్ వున్నాడు, రెండో చోట కమల్ కీ  మాధవి అన్న విలన్ గా తయారయ్యాడు.  వీళ్ళిదరూ కలిసి ఏడాది ఎడబాటుని  దిగ్విజయంగా పూర్తి చేసుకుని మరింత  బలీయమైన ప్రేమతో  కలుసుకోబోతున్న సమయంలో కమల్, సరితలని చంపేస్తారు. ఇది కథా ప్రారంభంలో మనం ఊహించుకునే పరీక్ష నెగ్గి  వాళ్ళు కలుసుకుంటారనే ముగింపుని  (స్టోరీ క్లయిమాక్స్ ని )  అనూహ్యంగా క్యాన్సిల్ చేస్తూ ఏర్పడే ప్లాట్ క్లయిమాక్స్- అంటే    యాంటీ క్లయిమాక్స్. ఈ కథనంలోంచి పుట్టుకొచ్చిన క్లయిమాక్స్, కథా ప్రారంభంలోంచి పుట్టిన క్లయిమాక్స్ కాదు. ఈ ప్లాట్ క్లయిమాక్స్ లేదా  యాంటీ క్లయిమాక్స్  కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ( సరిత రోమియోని కొట్టడం ఆమె చేసుకున్న కర్మ, కమల్ మాధవిని తిరస్కరించడం అతను  చేసుకున్న కర్మ- వీటి ఫలితం అనుభవించాల్సిందే- చాలా నిర్దాక్షిణ్యంగా వుంటుంది ప్రకృతి పని చేసే తీరు) ప్రవేశపెట్టడం వల్ల, ప్రేక్షకులు అందులో  సోల్ ని బాగా ఫీలవగలిగారు. 450 రోజులపాటూ  సినిమాని ఆడించారు.

        అదే ‘తని ఒరువన్’ లో చూస్తే. ఇది కూడా ప్లాట్ క్లయిమాక్స్ తో ట్రాజిక్ ముగింపే (హీరోకి, మనకి కాదు).  కానీ కథనం లోంచి పుట్టిన  ఆ ముగింపుని కూడా   కృత్రిమంగా పుట్టించారు. కథనంలో హీరో పనిగట్టుకుని తన గర్ల్ ఫ్రెండ్ ని విలన్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పంపి,  అతడి దుర్మార్గం చెప్పించి  ఆమె కళ్ళు తెరిపించే సీను వేసి, కథని  ఆమే ముగించేట్టు అక్కడ అసహజంగా ఆమెని యాక్టివేట్ చేశారు. ఆ మాత్రం హీరో విలన్ ని చంపలేకనా ఆమెని యాక్టివేట్ చేయడం?  ఇందులో సోల్, కథా ప్రయోజనం రెండూ లేకుండా పోయాయి. 

        సోల్ వుండని ఇంకో రకం ముగింపు వుంటుంది. దీనికేం పేరుంటుందో ఎవరైనా కనిపెట్టాలి-  ‘బ్రహ్మోత్సవం’  లో అది ప్లాట్ పాయింటో కాదో,  అక్కడ  రావురమేష్ తో మహేష్ బాబు కి ఏదో ఒక కథంటూ ప్రారంభమయ్యాక, అందులో వున్న ముగింపు తాలూకు కథనాన్ని (రావురమేష్ లేవనెత్తిన ప్రశ్నని) ఎగేసి , ఇంకేదో ఏడుతరాల గాథ  చెప్పుకొచ్చి- అదయ్యాక ఒక్క సీనుతో కథాప్రారంభంలో మ్యానిపులేట్ చేసిన ముగింపుని  తెచ్చి తేల్చేశారు. ఈ ప్యాచ్ వర్క్ తో సోల్ ఏర్పడుతుందా? 


         1. కథని కాపాడేది సోల్ మాత్రమే, సోల్ ఈజ్ సుప్రీమ్. 
           2.  స్టోరీ క్లయిమాక్స్ తో  ట్రాజడీ కి సోల్  ఏర్పడాలంటే, ‘దేవదాసు’ లోలాగా బిగినింగ్ విభాగంలో లో బీజాలు వేయాలి.
        3. ప్లాట్ క్లయిమాక్స్ తో  ట్రాజడీ కి సోల్ ఏర్పడాలంటే, ‘మరో చరిత్ర’  లోలాగా మిడిల్ విభాగంలో బీజాలు నాటాలి.
        4. స్టోరీ క్లయిమాక్స్ తో సుఖాంతమయ్యే కథలకి ‘శంకరాభరణం’ లోలాగా, లేదా ‘శివ’ లో లాగా  ప్లాట్ పాయింట్ వన్ లో కథా ప్రారంభంలో విత్తనాలు జల్లాలి. 
        5. సోల్ కి కథా ప్రయోజనంతో సంబంధం వుండాలి.
        6. హీరోకీ విలన్ కీ ఒకే ముగింపు నిస్తే, కథాప్రయోజనంతో బాటు సోల్ కూడా చెదిరిపోతుంది.
        7. హీరోకీ విలన్ కీ భిన్న ముగింపులిస్తే, కథా ప్రయోజనమూ- సోల్  చెక్కుచెదరవు.
        8. కథాప్రయోజనం లేని కథకి సోల్ వుండదు.
        9. కథా ప్రయోజనమున్నప్పటికీ  ఆకస్మిక ముగింపు నిస్తే సోల్ వుండదు.
        10. సోల్ ఈజ్ సుప్రీమ్.
        11. సోల్ ఈజ్ సుప్రీమ్.
        12. సోల్ ఈజ్ ఎక్స్ ట్రీమ్ -  అల్టిమేట్!

***
ఇక లాక్ వేద్దాం!
      సోల్ తోనే కథ పుడ్తుందిమనం సోల్ తోనే పుట్టినట్టు. కాబట్టి ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథతో బాటే సోల్ కూడా పుడుతుంది. ఇది కథా ప్రారంభ దశ. అంటే హీరోకి ఒక గోల్ ఏర్పడి అది సాధించేందుకు ముందుకు సాగిపోయే మజిలీ. ఈ కథా ప్రారంభ దశలోనే ముగింపు కూడా  ఎలా నిక్షిప్తమై వుంటుందో పై ఉదాహరణల్లో చూశాం. ఈ నిక్షిప్తమై వున్న ముగింపుకే  లాక్ వేయబోతున్నాం. స్క్రీన్ ప్లే లో ముగింపు దశ,  మిడిల్ విభాగం ముగిసే, ప్లాట్ పాయిట్ టూ దగ్గరనుంచీ మొదలయ్యే,  ఎండ్ విభాగంతో  ప్రారంభ మవుతుందని తెలిసిందే. ఈ  ప్లాట్ పాయింట్ టూని,  ప్లాట్ పాయింట్ వన్ తో కలిపి లాక్ చేస్తాం. అంటే ముగింపుకి, అనగా ప్లాట్ పాయింట్ టూకి,  లాక్ అండ్ కీ ప్లాట్ పాయింట్ వన్ చేతిలో వుంటాయన్న మాట. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథా ప్రారంభంలో ముగింపుకి లాక్ వేస్తే – కథలో కథాప్రయోజనం కూడా దెబ్బతినకుండా, సోల్ కూడా దెబ్బ తినకుండా వుంటాయి. ఇదీ గొప్ప కథకి పునాది వేయడం. 

        గొప్ప కథకి పునాది వేస్తే అది నల్గురి చేతిలో పడి నలిగినా,   కొంచెం నాణ్యత తగ్గి మంచి కథగా మిగలొచ్చనే కదా పరిష్కార మార్గం వెతుకుతున్నాం.  అదే రొటీన్ గా సిడ్ ఫీల్డ్ ప్రకారం బిగినింగ్- మిడిల్- ఎండ్,  మధ్యలో ఇంటర్వెల్ పాయింటుగా రాసుకుంటున్నవి కూడా మంచి కథలే. అయితే దీనికి లాకింగ్ లేకపోవడం వల్ల రాసుకుంటున్న మంచి కథలు చెడ్డ కథల స్థాయికి పడిపోతున్నాయి నల్గురి చేతులూ పడి. మంచి కథ రాసుకుంటే చెడ్డ కథగా పడిపోతున్నప్పుడు, గొప్ప కథకే పునాది వేస్తే అది మంచి కథగా మారవచ్చు తప్ప మరీ చెడ్డ కథగా పతనమవదనే ఈ వ్యాసకర్త నమ్మకం. 

        సిడ్ ఫీల్డ్ కూడా ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ లు రెండూ మొత్తంగా కథని కలిపి ఉంచే రెండు కొక్కేలు వంటివి అంటాడు తప్ప, వాటిని ఎలా కలిపి ఉంచాలో చెప్పలేదు. మనం తిప్పలు పడి, కథా ప్రారంభంలోనే దాగి వుండే ముగింపుకి ఒక తాళాన్ని వెతికి పట్టుకొచ్చాం. గొప్ప కథకి పునాది ఇదే : ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ముగింపుకి లాక్ వేయడం. ఈ లాక్ ని కూడా చాలా  నైపుణ్యంగల తాళం చెవితో వేస్తాం. మొత్తం కథని పాడు చేయాలన్న  దాన్నెవరూ బద్ధలు కొట్టలేరు, ఏటీఎం లాక్ లాంటిదన్న మాట. ఇంకా చెప్పుకుంటే ఆ లాక్ ని పగలగొట్ట బుద్ధే కాదు, దాన్ని ప్రేమిస్తూనే  ఇంకేం చెడగొట్ట వచ్చో పైపై అలంకారాలు పరిశీలిస్తూంటారు. ఆ అలంకారాలు చెడగొడితే ఆ గొప్ప కథ పునాదులు కదిలి మంచి కథ సెటప్ కి సెటిల్ కావచ్చు  తప్ప, మొత్తంగా  కుప్ప కూలిపోదు. సినిమా ఫీల్డు క్రియేటివిటీ ఎలా ఉంటుందంటే, హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం తీసి పంపినా దాన్ని ఇంకేదో చేసే పనిలో బిజీ అయిపోతారు- దాన్ని దానిలాగా ఉండనివ్వరు. ఎన్టీఆర్ వచ్చి తిట్టినా వూరుకోరు. అది బామియాన్ బుద్ధ విగ్రహ మవుతుంది చివరికి. 

        ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ముగింపుకి తాళం వేయాలి : ఎలా వేయాలి, వేస్తె ఎలా లాభం? 

        ముందుగా ప్లాట్ పాయింట్ వన్ ఏమేం కలిగి వుంటుందో చూద్దాం. హీరోకి ఒక సమస్యని సాధించేందుకు గోల్, ఆ గోల్ లో ఎమోషన్, రిస్క్, పరిణామాల హెచ్చరికా -అనే నాలుగు పరికరాలుంటాయని అనేక సార్లు చెప్పుకున్నాం. 

        ఇప్పుడు- ప్లాట్ పాయింట్ వన్ లోనే కథా ప్రారంభం, ఆ కథా ప్రారంభంలోనే ముగింపూ, కథాప్రయోజనమూ, సోల్  -కూడా వుంటాయని తెలుసుకున్నాం. 

        ముగింపుకి తాళం వేయాలి. దాని తాళం చెవి ఏది?

        ప్రశ్నే! ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథాప్రారంభపు  కీలక సంఘటన లోంచి పుట్టే ప్రశ్నే తాళం చెవి? 

      ఈ ప్రశ్న అనే ‘మాస్టర్ కీ’ ని చాలా కిలాడీ తనంతో తయారుచేసుకోవాలి. టక్కరి దొంగలా వుండాలి. చిక్కడు- దొరకడు అన్పించు కోవాలి.  అంతేగానీ కదలడు – వదలడు అన్పించుకోకూడదు!  ‘మాస్టర్ కీ’ తో అందడు –ఆగడు అన్పించుకుంటూ పలాయనం చిత్తగిస్తే, ఆ ‘మాస్టర్ కీ’  కోసం స్టోరీ డిస్కషన్ పెద్దలు పట్టుదలతో వెంటపడాలి! ఇంకా మాటాడితే, మాస్టర్ కీ ఎవరికీ దొరక్కుండా ఏ దుర్గం చెరువులోనో  విసిరేస్తే ఇంకా  మంచిది. అప్పుడు స్క్రీన్ ప్లేలో ఇంకేవో సీన్లు మార్చుకుంటూ కూర్చుంటారే తప్ప, కథా ప్రారంభ- ముగింపుల జోలి కెళ్ళలేరు. దాంతో ఆ గొప్ప కథ  పునాదిని మంచి కథ వరకూ దించి వదిలేస్తారు. అంతకంటే చెడగొట్ట లేరు! 
        ఇదెలాగో చూద్దాం.
        కాసేపు  స్క్రీన్ ప్లే అంటే బిగినింగ్ -మిడిల్- ఎండ్ అనే సాధారణ పరిభాష మర్చిపోదాం. స్క్రీన్ ప్లే అంటే   కాన్షస్ -  సబ్ కాన్షస్ మైండ్ ల  ఇంటర్ ప్లే అనే జేమ్స్ బానెట్ చెప్పే ఉన్నతార్ధంలో చూద్దాం. కాన్షస్ మైండ్ ని బిగినింగ్ గానూ, సబ్ కాన్షస్ మైండ్ ని మిడిల్ గానూ చూద్దాం.  హీరో ని మన ఇగో అనే దృష్టితో చూద్దాం- ప్రేక్షకులతో సైకలాజికల్ కనెక్ట్ కోసం. 

        మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే, మన ఇగో వచ్చేసి మన కాన్షస్ మైండ్ ( వెలుపలి మనస్సు) లో ఏ బాధ్యతలు నెత్తి  మీదేసుకోకుండా ఎంజాయ్ చేయాలనీ చూస్తూంటుంది. దానికి బాధ్యతల్ని గుర్తు చేసే  మనలోని సబ్ కాన్షస్ మైండ్ (అంతరాత్మ) అంటే భయం. అటు వైపు వెళ్ళకుండా టక్కరితనం ప్రదర్శిస్తూంటుంది. స్క్రీన్ ప్లేలో ఏం జరుగుతుందంటే,  అలాటి మన టక్కరి ఇగోని మెడబట్టి సబ్ కాన్షస్ మైండ్ లోకి నెట్టి పారేస్తాం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథని ములుతిప్పే సంఘటన ఇందుకే చాలా బలంగా వుండాలంటాడు సిడ్ ఫీల్డ్ ప్రేక్షకులతో సైకలాజికల్ కనెక్ట్ కోసం. 

        ప్లాట్ పాయింట్ వన్ కి ముందు పాత్ర సమస్యలోకి వెళ్ళడానికి మొండికేయాలి, మొండికేసిన పాత్రని ప్లాట్ పాయింట్ వన్ దగ్గర బలంగా  సమస్య లోకి నెట్టేయాలి.

        ఈ రెండు బీట్స్ కథలో తప్పని సరిగా ఉండేట్టు చూసుకోవాలి. 

        ఇవి గత వ్యాసంలో చెప్పుకున్న జోసెఫ్ క్యాంప్ బెల్ సిఫార్సు చేసిన బీట్సే. 

        అలా సబ్ కాన్షస్ మైండ్ లోకి  ఇగో తప్పనిసరై వెళ్లి పడ్డాక, అక్కడున్న శక్తులతో పోరాడి బయట పడేందుకు దాని చావు అది చావాల్సిందే. హీరో పాత్రకి ఈ పరిస్థితిని  కల్పిస్తేనే మిడిల్ బలంగా వుంటుంది.   

        సబ్ కాన్షస్ మైండ్లో ఇగో వెళ్లి పడేందుకు సృష్టించే సంఘటన లేదా పరిస్థితి ఎంత బలంగా వుండాలంటే, అది మళ్ళీ కాన్షస్ మైండ్ వైపు తిరిగి చూసే ఛాన్సే వుండకూడదు. ‘భజరంగీ భాయిజాన్’  లో సల్మాన్ ఖాన్ మొదట పాప సమస్యని తేలిగ్గా తీసుకుని ఎలా వదిలించుకోవాలా అని చూస్తూంటాడు. ఒక ఏజెంట్ కి డబ్బిచ్చేసి ఇల్లీగల్ గా పాక్ సరిహద్దు దాటించేందుకు పాపని అప్పజెప్పేసి చేతులు దులుపు కుంటాడు. ఏజెంట్ మోసం చేసి ఆ పాపని వ్యభిచార గృహంలో అమ్మేస్తూంటాడు- అప్పుడు సల్మాన్ కి పౌరుషం ముంచుకొచ్చి,  వాణ్ణి కొట్టి పడేసి, ఆ పాపని విడిపించుకుని తనే పాక్ కి బయల్దేరడానికి సిద్ధపడతాడు. ఇక వెనక్కి చూసే పరిస్థితి లేదు. దేన్నైతే ఎవాయిడ్ చేస్తూ వచ్చాడో ఆ సబ్ కాన్షస్ మైండ్ అనే మిడిల్లోకి ప్రవేశించక తప్పని పరిస్థితి!

       మొదట అనంగీకారం, తర్వాత అంగీకారం- ఇవీ పైన చెప్పుకున్న ఆ రెండు బీట్స్.
        ఇది చాలా బలంగా వుండే ప్లాట్ పాయింట్ వన్ సంఘటన. ఈ బలం వ్యభిచార గృహంలో పాపని అమ్మడం అనే కాన్సెప్ట్ వల్ల వచ్చింది. ఈ కథలో వ్యభిచార గృహమేమిటి, ఛీ, ఫ్యామిలీస్ కి నచ్చదు, బావుండదు అని కథకుడు అనుకుంటే,  అప్పుడతను కమర్షియల్ కథ రాయడానికి పనికిరాడు. పాప అమ్మ కావాలీ అమ్మ అమ్మ కావాలీ అని ఏడుస్తూంటే,  చూసిన వాళ్ళెవరో ఇంకా ఏడిపిస్తావెందుకయ్యా - నువ్వే పాకిస్తాన్ తీసికెళ్ళి పాపని తల్లితో కలిపి పుణ్యం కట్టుకోరాదూ- అనే చాదస్తపు, బలహీన, హాస్యాస్పద, నాన్ కమర్షియల్  ప్లాట్ పాయింట్ రాసుకోవడానికి ఆ కథకుడు  పనికొస్తాడు. ఇలాటి ప్లాట్ పాయింట్సే వుంటున్నాయి  సినిమాలన్నిటా.

        ఒకవేళ  పాత్ర వెనక్కి కాన్షస్ మైండ్లోకి వచ్చేసినా, సబ్ కాన్షస్ (అంతరాత్మ) వదలదు. పీడిస్తూనే వుంటుంది. కాబట్టి పీడించే శక్తుల్ని సబ్ కాన్షస్ లో ఓడించి రావాల్సిందే. 

        ‘శివ’ లో జేడీ ని నాగార్జున సైకిలు చైను తెంపి కొట్టే  క్లాసిక్ సీన్ ఎంత బలమైందంటే, అలా కొట్టిన  నాగార్జున ఇంటి కెళ్ళి పోయి నిశ్చింతగా నిద్రపోలేడు. జేడీ తాలూకు మాఫియా గ్యాంగ్ వదలరు. కాబట్టి ముందుకే వెళ్ళాలి తప్ప, వెనక్కి రాలేడు.  

        ఇందుకే ప్లాట్ పాయింట్ వన్ ని బలంగా,  బిగినింగ్ కి క్లయిమాక్సు లాగా తీర్చి దిద్దుకోవాలి.  అసలు ప్లాట్ పాయింట్ వన్ అంటేనే  బిగినింగ్ విభాగంలో జరిగిన మొత్తం కథనపు కూడిక. బిగినింగ్ కథనాన్ని కొలిక్కి  తేవడం. ఈ దృష్టితో ఎంతమంది ప్లాట్ పాయింట్ వన్ ని స్థాపిస్తున్నారు? స్క్రీన్ ప్లేకి ప్లాట్ పాయింట్ వన్ మొదటి మూల స్థంభం అనే ప్రాధాన్యాన్ని సంతరించుకున్నప్పుడు, దాని మీదా కథా ప్రారంభపు పతాకం ఎగరేస్తూ బాకా వూదాలి- రిజిస్టర్ చేయాలి.   

         యాక్షన్ కథలో ఈ బలం వయొలెంట్ గానూ, కామెడీ కథలో పడీపడీ నవ్వేలాగానూ, ప్రేమ సినిమాలో కదిలించేదిగానూ, రోమాంటిక్ కామెడీ లో పిచ్చెక్కే లాగానూ, ఫ్యామిలీ సినిమాలో సెంటిమెంట్ తోనూ... ఇలా జానర్ కి తగ్గ రస పోషణతో బలంగా, పతాకస్థాయిలో కన్పించాలి. 

        ప్లాట్ పాయింట్ వన్ సంఘటన యాక్షన్ తో  ప్రేక్షకుల మనోఫలకాల మీద చెరిగిపోనంత బలంగా ముద్రేసుకోవాలి. 1975 నాటి ‘ముత్యాలముగ్గు’ లో శ్రీధర్- సంగీతల కాపురం చెడగొట్టడానికి విలన్ రావుగోపాలరావు పన్నే పథకంలో భాగంగా, అనుచరుడు నూతన్ ప్రసాద్- అర్ధరాత్రి సంగీత నిద్రపోతున్న బెడ్ రూమ్ లో రహస్యంగా దాక్కుని,  బట్టలిప్పుకుని, శ్రీధర్ వచ్చి తలుపు కొట్టినప్పుడు, బట్టలెత్తుకుని అతణ్ణి తోసుకుంటూ పారిపోయే ప్లాట్ పాయింట్ వన్ సంఘటనని ఎంతకాలమైనా ఎవరూ మర్చిపోలేరు. యాక్షన్ తో కూడుకున్న ఈ సంఘటన చిత్రీకరణలో హిచ్ కాక్  సస్పన్స్ ని తలపిస్తుంది-  ఎలాటి నేపధ్య సంగీతమూ  లేకుండా. ఈ కథలో ఈ బూతు సంఘటనేమిటీ అని సాత్విక కథలు రాసే ముళ్ళపూడి వెంకట రమణే అనుకునివుంటే,  దర్శకుడు బాపు కూడా నిజమే కదా అనుకుని వుంటే,  ‘ముత్యాలముగ్గు’ కాలగర్భంలో కలిసిపోయేది. కుటుంబ కథా చిత్రాల్ని క్రైం ఎలిమెంట్ ఎలివేట్ చేస్తుంది- నాటి ‘ముత్యాల ముగ్గు’ అయినా, నేటి ‘భజరంగీ భాయిజాన్’ అయినా.

        ప్లాట్ పాయింట్ వన్ సంఘటనని బిగినింగ్ కి క్లయిమాక్స్ లాగా, జానర్ కి తగ్గ  యాక్షన్ తో ఇంత  బలంగా రిజిస్టర్ చేశాక- 

        హీరో పాత్రకి అవసరమైన  గోల్, గోల్ లో ఎమోషన్, రిస్క్, పరిణామాల హెచ్చరికా ఉండేట్టు చూసుకుని-

        అప్పుడు 
 కథకుడు ఈ మొత్తం సెటప్ అంతా ఏమని ‘ముగింపు’ సూచిస్తోందో పరిశీలించాలి. నిజానికి ఒక ఐడియా అనుకున్నప్పుడే దాని ముగింపూ ఆల్రెడీ తెలిసే వుంటుంది. ఐడియాని సినాప్సిస్ గా విస్తరించినప్పుడు ముగింపు పట్ల పూర్తి  స్పష్టత వచ్చేస్తుంది. ఆ  సినాప్సిస్ ఆధారంగా వన్ లైన్ ఆర్డర్ వేస్తున్న సమయంలోనే స్క్రీన్ ప్లే ని లాక్ చేయాలన్న ప్రస్తుత చర్చనీయాంశం  ఉపయోగంలోకి వస్తుంది. కాబట్టి వన్ లైన్ ఆర్డర్ వేసేప్పుడే  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర లాకింగ్ ని దృష్టిలో పెట్టుకుని వేయాల్సి వుంటుంది. ఐడియాలో అనుకున్న, సినాప్సిస్ లో రాసుకున్న, సమంజసమైన ముగింపే వన్ లై ఆర్డర్ ప్లాట్ పాయింట్ వన్ సంఘటనలో  తొంగి చూడాలి. అలా తొంగి చూడకపోతే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సృష్టించిన సంఘటనలో ఏదో లోపం ఉన్నట్టే నని కథకుడు భావించాలి. 

        ‘శివ’ సినాప్సిస్ లో ముగింపు ఇలా వుందనుకుందాం – శివకి భవానీ (మాఫియా) తో అంతిమ పోరాటం మొదలై భవానీని వధించి, నగరానికి మాఫియా పీడా వదిలిస్తాడు. ఈ పోరాటంలో అన్న కూతుర్ని పోగొట్టుకుంటాడు. 

        
సరీగ్గా ఈ ముగింపే ‘శివ’ ప్లాట్ పాయింట్ వన్ సంఘటనలో తొంగి చూస్తోంది- నాగార్జున జేడీ ని కొట్టడంతో అటుపైన రఘువరన్ (భవానీ) భరతం పట్టడం కూడా వుంటుందనీ! ఇలా కాక నాగార్జున జేడీతో స్నేహం చేసి రఘువరన్ రహస్యాలు లాగి దెబ్బ కొట్టే ప్లాన్ తో సాగితే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర జేడీ ని కొట్టే  యాక్షన్ తో కూడిన సంఘటన వుండదు, క్యాంటీన్ లో ఓ కప్పు కాఫీతో జేడీని ముగ్గులోకి దింపే వెర్బల్ సీను వుంటుంది. ఇందులోనూ ముగింపు తొంగి చూస్తూంటుంది గానీ,  ఈ సీన్ తో ప్లాట్ పాయింట్ వన్ యాక్షన్ తో కూడుకుని లేకపోవడంతో,  పేలవంగా వుండడమే గాక, ఇక్కడ ఉత్పన్న మవాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఉత్పన్న మవదు! 

        ఏమిటా ప్రశ్న?
        లాక్ వేయడానికి అత్యవసరమైన టూల్. 

        నాగార్జున సైకిల్ చైన్  తెంపి జెడీ ని కొట్టినప్పుడు- కమర్షియల్ సినిమా కథకి అత్యంత అవసరమైన ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదించే క్వశ్చన్ ఒకటి   రైజ్ అవుతోంది- కొట్టాడు, కొట్టేశాడు, కొట్టేశాడ్రా, ఇప్పుడేంటి???!!!...అని కంగారు పుట్టించే ప్రశ్న!

        ఇలా ప్లాట్ పాయింట్ వన్ సంఘటన ప్రశ్నని కూడా విసరాలి. ఇదే  కామెడీ అనుకుందాం- ఇరుక్కున్నాడు, ఇరుక్కున్నాడ్రా ఇప్పుడేంటి? -అనే  ప్రశ్న కిక్  ఇవ్వొచ్చు.

        ఇదే నాగార్జున  జేడీ తో కప్పు కాఫీ తాగుతూ  కబుర్లు మొదలెడితే, ఇందులో  ఆర్గ్యుమెంట్ లేదు, ప్రశ్నే లేదు. కంగారూ పుట్టించదు, పైగా నిద్రపుచ్చుతుంది. ఇది కేవలం ఒక స్టేట్ మెంట్ తో కూడుకుని వుండే ‘గాథ’ లా వుంటుంది. గాథలు కమర్షియల్ సినిమాలకి పనికిరావు. ప్రశ్న తో ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదించే కథలే కమర్షియల్ సినిమాలకి పనికొస్తాయి. 

        కాబట్టి- ప్లాట్ పాయింట్ సంఘటన, ఏ జానర్ కథకైనా దాని రసపోషణతో - 1) యాక్షన్ తో అత్యంత శక్తివంతంగా వుండి, 2) అందులో ముగింపు తొంగి చూస్తూవుండి, 3) ప్రశ్నని లేవనెత్తుతూ వుండి- 

 
       4) ఆ ముగింపు ప్రశ్నకి దానికి తగ్గ జవాబు విసురుతూ వుండాలి. ప్లాట్ పాయింట్ వన్ సంఘటన ప్రశ్నని విసిరితే, ముగింపు దానికి తగ్గ జవాబు విసరాలి. ఒక హాలీవుడ్ సినిమా వుంది- జిమ్ కేరీ నటించిన కామెడీ- ‘లయర్ లయర్’ అని. ఇందులో ధారాళంగా అబద్ధాలు మాట్లాడేసి కేసులు గేలిచేసే లాయరైన జిమ్ కేరీ, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హఠాత్తుగా అబద్ధాలు చెప్పే టాలెంట్ ని కోల్పోతాడు- దాంతో ఇప్పుడేంటి,  ఇక నిజాలు చెప్పేసి కేసులు గెలుస్తాడా? అన్న ఇంటరెస్టింగ్ ప్రశ్నని  తలెత్తుతుంది. దీనికి జవాబు ముగింపు విసురుతుంది. ఆ జవాబే మిటనేది సస్పన్స్. దటీజ్ ది  లాక్. 

      ప్లాట్ పాయింట్ వన్ ప్రశ్నలకి మరికొన్ని హాలీవుడ్ ఉదాహరణలు- 
            * ఒకళ్ళ నొకళ్ళు ద్వేషించుకునే హీరో హీరోయిన్లు అజ్ఞాతంగా ప్రేమలేఖలు రాసుకుని, అవి పరస్పరం రాసుకున్నామని తెలుసుకుని షాకయ్యారు -  ఇప్పుడేమిటి, ఈ ప్రాణశత్రువులు ప్రేమబంధంలో ఎలా పెనవేసుకుంటారు? ఇంటరెస్టింగ్ క్వశ్చన్ (‘యూ హేవ్ గాట్ మెయిల్’)         * సిటీ బస్సులో బాంబు పెట్టారు, బస్సు స్పీడు యాభై కి తగ్గితే పేలిపోతుంది- ఇప్పుడేం చేయాలి,  ప్రయాణికుల్ని ఎలా కాపాడాలి?- స్టన్నింగ్ క్వశ్చన్( ‘స్పీడ్’).        * తనలాగే వున్న ఒక  నకిలీ మనిషి నేరాలు చేస్తున్నాడని హీరో తెలుసుకున్నాడు- ఇప్పుడేం చేయాలి, తను తనే అని ఎలా నిరూపించుకోవాలి?- థ్రిల్లింగ్ క్వశ్చన్ (‘ది సిక్స్త్ డే’)
        * ఒక జర్నలిస్టుకి బాటిల్లో గుండెల్ని పిండేసే ప్రేమ లేఖ దొరికింది- ఇప్పుడేం చేస్తుంది, ఆ హీరోతో ప్రేమలో పడుతుందా?- లవింగ్ క్వశ్చన్ (‘మెసేజ్ ఇన్ ది బాటిల్’).
        * ఆత్మహత్య చేసుకోబోతున్న హీరోని దేవదూత ఆపి, నువ్వు లేకపోయి వుంటే నగరం ఎలా వుండేదో చూస్తావా అని అడుగుతుంది- మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్ (‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’).

        
కాబట్టి నేపధ్య బలంతో ప్రశ్న కూడా అంత  ఇంటరెస్టింగ్ గానూ  వుండాలి. నేపధ్య బలంతో ప్రశ్న ఎంత ఇంటరెస్టింగ్ గా వుంటే అంత బలంగా లాక్ వేయవచ్చు. 

        ప్రశ్నలో యూత్ అప్పీల్ వుండాలి. మళ్ళీ మహోజ్వల చిత్రరాజాలు చూసే రోజులు ఎప్పుడొస్తాయో తెలీదు. సమీప భవిష్యత్తులో వచ్చే సూచనలు లేవు. దశాబ్దంన్నర కాలంగా సాగుతున్న ఫక్తు కాలక్షేప బఠాణీ ఎంటర్ టైన్మెంట్ సినిమాలే ఇంకా  రాజ్య మేలుతాయి. ఎంటర్ టైన్మెంట్ అంటేనే స్పీడు, హుషారు, ఓ కిక్కు, యూత్ ఫుల్ మేకింగ్. కాబట్టి ప్లాట్ పాయింట్ వన్ దగ్గర లేవనెత్తే ప్రశ్న యూత్ ని ఆకర్షించేట్టు వుండాలి. ‘బ్రహ్మోత్సవం’ లోలాగా యూత్ కి ఏ మాత్రం ఆసక్తి కల్గించని, ఏమాత్రం యూత్ అప్పీల్ లేని, ఏడుతరాల్ని వెతికే ముసలి ప్రశ్నతో వుండకూడదు. 

        సోల్ కి ముసలితనం వుండదు. ముసలి ప్రశ్న, యూత్ అప్పీల్ వున్న ప్రశ్న- ఈ రెండిటి తేడాలతో అప్రమత్తంగా వుండాలి. యూత్ అప్పీల్ కే ఓటెయ్యాలి. యువదర్శకులు తమ ఇళ్ళల్లో చూసిన జీవితాలతో ముసలి ప్రశ్నలు వేసుకోవాలనుంటే ‘గాథలు’  చెప్పుకోవాలి, ఆర్ట్ సినిమాలు తీసుకోవాలి. అనవసరంగా కమర్షియల్ సినిమాల జోలికివచ్చి వాటి అకాల వార్ధక్యానికీ,  మరణానలకీ  ముహూర్తాలు పెట్టకూడదు. కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటే, తమ ఇళ్లల్లో జీవితాలు మర్చిపోయి,  బయటి  ప్రపంచం ఎలా వుందో చూడాలి. చూడాలన్న ఆసక్తి పెచుకోవాలి. బయటి ప్రపంచం ఎప్పుడూ యూత్ ఫుల్ గానే- బాక్సాఫీసు అప్పీలుతో క్యాచీగా క్రేజీగా కళకళ లాడుతూనే వుంటుంది, దట్స్ సింపుల్! 

      యూత్ అప్పీల్ కి  కూడా శరవేగంగా కాలం చెల్లిపోతూంటుంది. ఎలాగంటే, ఒకప్పుడు ముక్కోణ ప్రేమ సినిమాలకి వున్న డిమాండ్,  యూత్ అప్పీల్ ఇప్పుడు లేదు. అలాగే ప్రేమికులనగానే పెళ్ళే  పరమార్ధంగా ఏడ్చే ప్రేమికుల పాత్రలకి కూడా ఇప్పుడు యూత్ అప్పీల్ లేదు. కేరీర్ ప్రధానమైన, భౌతిక సుఖాల, ఉత్తుత్తి- కాలక్షేప  ప్రేమల  జీవనశైలికి పల్లె నుంచీ పెద్ద నగరాల దాకా పరిస్థితి  మారిపోయింది. ఇలాటి కథల్లోంచే లేవనెత్తే కొత్త కొత్త ఆధునిక ప్రశ్నలకి యూత్ అప్పీల్ ఉంటోంది. ఇలాటి ప్రశ్నలతో లాక్ వేయాలి. 

        కనుక స్క్రీన్ ప్లేకి లాక్ వేయాలన్న ఆసక్తి వుంటే, యూత్ అప్పీల్ లేని ముసలి ప్రశ్న, లేదా యూత్ అప్పీల్ వున్నా కాలం చెల్లిన ప్రశ్నా లేకుండా జాగ్రత్త పడాలి- జానర్ తో సంబంధం లేకుండా.  ఫ్యామిలీ స్టోరీ కాబట్టి  మహేష్ బాబుకి ముసలి ప్రశ్న అంటగట్టి హిట్ కొట్టమంటే ఏం జరిగిందో తెలిసిందే. మహేష్ బాబు వృద్ధుడయ్యాక ముసలి ప్రశ్న వేద్దామా వద్దా అప్పుడాలోచించుకోవచ్చు. కనుక హీరో తలపడే సమస్య గంభీరంగా వున్నా, ప్రశ్న యూత్ అప్పీల్ తో వుండాలి. యూత్ అప్పీల్ అంటే ఆటోమేటిగ్గా మాస్ అప్పీల్ కూడా. 

        విక్రం కుమార్ దర్శకత్వంలో  సూర్య నటించిన  ‘24’ లో ప్లాట్ పాయింట్ వన్ ఎంత పవర్ఫుల్ గా వుంటుందో గమనించండి. సూర్య దగ్గర వృధాగా పడి వుంటున్న పెట్టెలో గడి యారం బయట పడినప్పటి కథా ప్రారంభపు సంఘటనకి ప్రేక్షకులు ఈలలూ కేరింతలతో హోరెత్తించేస్తారు- నిర్మాతలకో హీరోలకో కథ చెప్తున్నప్పుడు ప్లాట్ పాయింట్ వన్ దగ్గర వాళ్ళు కూడా అలా ఎక్సైట్ అవ్వాలన్న మాట. ఇక ఇప్పుడు సూర్య ఆ గడియారంతో ఏం చేస్తాడన్న  పవర్ఫుల్ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్న సరీగ్గా యూత్ అప్పీల్ కి న్యాయం చేస్తుంది. సమంతాతో ప్రేమకలాపాలకి ఆ గడియారాన్ని వాడతాడు సూర్య! 

        ఈ కథా ప్రారంభంలోనే  దాగి వున్న ముగింపేమిటి? ఆల్రెడీ ఈ గడియారం కోసం వెతుకుతున్న విలన్ సూర్య చేతిలో అది పడడమే. ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఇదే జరుగుతుంది- అయితే విలన్ సూర్య చేతిలో పడేది డూప్లికేట్ గడియారం. ఇక్కడ కూడా ప్రేక్షకులు హోరెత్తించేస్తారు. ప్లాట్ పాయింట్లు రెండూ ప్రేక్షకుల్లో ఇంత  సంచలనం సృష్టించాయంటే ఈ  స్క్రీన్ ప్లే ఎంత బలంగా లాక్ అయి వుందో అర్ధం జేసుకోవచ్చు. కథ విన్పించేటప్పుడు నిర్మాతలూ హీరోలూ ఇక్కడ కూడా అంత థ్రిల్లవాలి.  ప్లాట్ పాయింట్స్ తో కథకుడెప్పుడూ సోమరిగా వుండకూడదు. కథకుడు సోమరిగా వుండకూడదు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర లేవనెత్తే ప్రశ్నతో ప్లాట్ పాయింట్ టూ (ముగింపు) కి లాక్ వేస్తున్నప్పుడు ఒకటి గ్రహించాలి : ఈ ప్లాట్ పాయింట్ వన్- ప్లాట్ పాయింట్ టూ రెండూ ఎదురెదురు అద్దాల్లాంటివి. ఒకదాని వ్యవహారం ఇంకో దాంట్లో కన్పిస్తూనే వుంటుంది. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర లాక్ వేస్తున్నప్పుడే ఆ మాస్టర్ కీకి ప్లాట్ పాయింట్ టూ ముగింపు వ్యవహారం  తెలుసు కనుక- ఆ మాస్టర్ కీ తో ప్లాట్ పాయింట్ టూ దగ్గర తాళం తీసినప్పుడు, డూప్లికేట్ గడియారం విలన్ సూర్య చేతికి వచ్చింది ‘24’ లో!

        తాళం తీసినప్పుడు ఇలాటి ఆశ్చర్యాలు వుండాలి.        ప్లాట్ పాయింట్ టూ అంటే సంఘర్షణతో మిడిల్ విభాగమంతా ముగిసిపోయి- ఇక హీరో తన సమస్య కి తిరుగులేని పరిష్కారమార్గం కనిపెట్టే దృశ్యమే కాబట్టి- ఈ దృశ్యం  కూడా ప్లాట్ పాయింట్ వన్  దృశ్యం లాగే బ్రేకింగ్ న్యూస్ లా బలంగా ఉంటూ బ్యాలెన్స్ చేయాలి. 

        ‘టైటానిక్’ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఆత్మహత్యా యత్నం చేస్తున్న హీరోయిన్ ని హీరో  కాపాడడం, ప్లాట్ పాయింట్ టూ  దగ్గర టైటానిక్ నౌక  మునిగిపోతూ ఇద్దరి జీవితాలూ – ప్రేమా ప్రశ్నార్ధకమవడం! 

       ‘హోమ్ ఎలోన్’ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కుర్రాణ్ణి మర్చిపోయి ఇంట్లో అందరూ తాళాలేసుకుని వూరి కెళ్ళి పోతే  దొంగలు ప్రవేశించడం, ప్లాట్ పాయింట్ టూ దగ్గర దొంగల్ని నానా తిప్పలు పెడుతూ తనూ హైరానా పడ్డ కుర్రాడు ప్రమాదవశాత్తూ పక్కింట్లో కెళ్ళి పడ్డం!

        గొప్ప సినిమాల్లో ప్లాట్ పాయింట్స్ ఇలా ఒక దానికొకటి వ్యతిరేకంగా ఉంటున్నాయి. ‘టైటానిక్’ లో ఆ నౌక కాన్షస్ మైండ్ అయితే, చుట్టూ సముద్రం సబ్ కాన్షస్ మైండ్; ‘హోమ్ ఎలోన్’ లో తాళాలు వేసిన ఇంటి లోపలి భాగమంతా సబ్ కాన్షస్ మైండ్ అయితే,  కుర్రాడు ఆ సబ్ కాన్షస్ మైండ్ లో పడ్డ ఇగో. గొప్ప సినిమాలు సైకలాజికల్ గా ప్రేక్షకులతో ఇలా బాగా కనెక్ట్ అవుతాయి.  

        ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రశ్నతో బిగినింగ్ ని ముగించాక, ప్రారంభమయ్యే మిడిల్ కథా ప్రపంచాన్ని సబ్ కాన్షస్ మైండ్ కి ప్రతీకగా సృష్టించి, అందులో మునక లేస్తున్న మన  ‘ఇగో’ గా ప్రధాన పాత్ర చిత్రణ చేయగల్గితే, స్క్రిప్టు యధాతధంగా ఓకే అయ్యే అవకాశాలె క్కువ. 

        ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పైన చెప్పిన విధంగా లాక్ వేశాక యాదృచ్చికంగా మిడిల్ కి ఆ ఫీల్ వచ్చేస్తుంది- ఎందుకంటే ప్లాట్ పాయంట్ వన్ దగ్గర ప్రశ్నతోనే సోల్ పుడుతుంది. 


        కాబట్టి లాక్ వేసేందుకు- 
        1. ప్లాట్ పాయింట్ వన్ కి సన్నాహంగా గోల్ పట్ల హీరో అయిష్టాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి.
        2. ప్లాట్ పాయింట్ వన్ సంఘటనకి హీరోని నెడుతూ గోల్, ఎమోషన్, రిస్క్, హెచ్చరికా ప్రతిఫలించేట్టూ చూసుకోవాలి.
        3. వీటితో ప్లాట్ పాయింట్ వాన్ ని యాక్షన్ తో బలమైన సీన్ వేస్తూ  రిజిస్టర్ చేయాలి.
        4. ఈ బలమైన సంఘటనలోంచి ఇప్పుడేంటి, ఏం జరుగుతుంది? అన్న ప్రశ్న ఆడియెన్స్ ఫీలై కంగారు పడేట్టు చూసుకోవాలి.
        5. ఆ ప్రశ్న కి తప్పని సరిగా యూత్ అప్పీల్ వుండాలి.
        6. ఆ ప్రశ్న ప్రేక్షకులు బాగా ఫీలయ్యేట్టూ ప్లాట్ పాయింట్ టూ వరకూ గిం గు రుమంటూ ఉండేలా దృశ్య చిత్రీకరణ వుండాలి. ఇది సోల్ ని  ఏర్పాటు చేస్తుంది.
        7. ఈ సంఘటన లోంచే కథకి అనుకున్నముగింపు తొంగి చూస్తోందని గ్రహించాలి.
        8. ఆ ముగింపుకి లేవనెత్తిన ప్రశ్న అనే మాస్టర్ కీతో లాక్ వేయాలి.
        9. ప్లాట్ పాయింట్ టూ దగ్గర లాక్ తీసేప్పుడు ఆ ముగింపుకి ఒక  ట్విస్ట్ ఇవ్వాలి.
        10. లాక్ తీశాక కథా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని క్లయిమాక్స్ ఇవ్వాలి.

        పై ఎజెండాని అమల్లో పెడితే కథలు పూర్తిగా చెడిపోవు. కొంత చెడిపోతున్నా చెడి పోనివ్వాలి, అంతకన్నా చెడిపోదు గనుక. నేను చెప్పిందే వేదమని భీష్మించుకుంటే అసలుకే మోసం వస్తుంది. ఇతను చెప్పింది వేదంలా వుందే అని వాళ్ళు ఫీలయితే ఇక ఏమాత్రం చెడిపోయే అవకాశాలుండవు!

-సికిందర్
         

       
         














22, మే 2016, ఆదివారం

స్క్రీన్ ప్లే సంగతులు

     మనుషులు- మమతలు, ఆస్తులు- అంతస్తులు, ఉమ్మడి కుటుంబం- ఒకే కుటుంబం,  నా ఇల్లు నా వాళ్ళు- మంచి కుటుంబం, మన సంసారం- వింత  సంసారం, కలసి వుంటే కలదు సుఖం- మనసే మందిరం,  సాంప్రదాయం- శ్రావణ మాసం, పసుపు కుంకుమలు- బంగారు గాజులు, తోడికోడళ్ళు – భలే కోడళ్ళు, ఇల్లరికం- ఇంటి దొంగలు, తండ్రీ కొడుకులు-పెత్తందార్లు, గొప్పవారి గోత్రాలు-  పంతాలు పట్టింపులు, సీతా కల్యాణం- రుక్మిణీ కల్యాణం, కల్యాణ మంటపం- ఊరంతా సంక్రాంతి, లోకం చుట్టిన వీరుడు- చుట్టాలొస్తున్నారు జాగ్రత్త, ఊరికి ఉపకారి- మనిషి రోడ్డునపడ్డాడు...
          ఈ సినిమా టైటిల్సే ‘బ్రహ్మోత్సవం’ కథ!  ఇంకా  హమ్ ఆప్ కే హై కౌన్ – హమ్ సాథ్ సాథ్ హై,  మై ప్రేమ్ కీ దీవానీ హూ- వివాహ్ లాంటి సూరజ్ బర్జాత్యా ఆడవాళ్ళ విందులూ వంటకాల –పాటల పోటీల సినిమాల టైటిల్స్  కూడా కలుపుకోవచ్చు. 


          కొత్త సినిమాలో పాత  సినిమాల వాతావరణం వుండకూడదని కాదు. మారుతీ కారు వుంది, ఇంకా అది పాత మారుతీ కారులా లేదు. అప్పుడూ ఇప్పుడూ పోలీసు వున్నాడు గానీ, ఇంకా పాత నిక్కర్లేసుకు లేడు. ఇప్పుడు పాత సినిమాల వాతావరణం ఉండొచ్చు గానీ, ఇంకా పాత  వాసనలు  వేస్తేనే సమస్య. పాయింటు సమకాలీనమై వుంటే వాతావరణం పాత సినిమాల వాతావరణంలా వున్నా, కొత్త వాసనతో సర్దుకు పోవచ్చు. పాయింటూ ఆనాటిదే, వాతావరణమూ వాసనా ఆనాటివే  అయినప్పుడు, ఇంకా ఈ కాలపు దర్శకులెందుకు?  పాత సినిమాలే చూసుకుంటారు ప్రేక్షకులు. ప్రతీ రెండేళ్ళ  కోసారి కొత్త యువతీ యువకులు సినిమాలు చూసే  ప్రేక్షకుల వుతూంటే, వాళ్ళ కాలం కాని కాలపు సినిమాలు వాళ్ళ కెలా  కనెక్ట్ అవుతాయి? వాళ్ళకున్న కాలీన స్పృహ సినిమాలు తీసే వాళ్ళకి అస్సలు వుండక పోవడమేమిటి?  

     యూత్ సినిమాలు  ఫ్యామిలీల కోసం తీయకపోవచ్చు గానీ, ఫ్యామిలీ సినిమాలు తప్పక యూత్ కోసం కూడా తీయాలి- ఆ స్టార్ కి వాళ్ళూ  ఫ్యాన్స్ అయి వుంటారు గనుక. ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీస్ కీ  యూత్ కీ  కనెక్ట్ అయ్యేట్టు మధ్యే మార్గంగా తీయాల్సి వుంటుంది. కానీ యూత్ ని  విస్మరించి, ఫ్యామిలీ సినిమా అంటూ ప్రిన్స్ మహేష్ బాబుతో  ‘బ్రహ్మోత్సవం’ అనే  చాదస్తం తీశారు. పోనీ ఈ చాదస్తం ఫ్యామిలీస్ కైనా కనెక్ట్ అయ్యే పాయింటుతో  ఉందా అంటే అదీ లేదు. ఫ్యామిలీ ప్రేక్షకులంటే  ఎవరు? అత్యధికంగా 45 లోపు వయస్కులే. వీళ్ళల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పరిచయమున్న వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, కోరుకుంటున్న వాళ్ళూ ఎందరుంటారు. దాదాపు వీళ్ళ తల్లి దండ్రులే ఆ వ్యవస్థలో వుండి వుండరు. అప్పటికి జమీందారీ ఫ్యూడల్ వ్యవస్థ పోయింది. దాంతో బాటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థా అంతరించిపోతూ వచ్చింది. ఇప్పటి 45 లోపు వయస్కుల తల్లిదండ్రులకి  ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో తెగిపోతూ వచ్చింది. వీళ్ళ నుంచి వేర్పడి వీళ్ళ పిల్లలు కొత్త చదువులు చదువుకుని ప్రపంచీకరణలో భాగమవుతున్నారు- దూర తీరాలకి తరలిపోతున్నారు. తప్పనిసరై న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా ఏర్పడుతున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీల ట్రెండ్ రెండు దశాబ్దాల క్రితమే మొదలైంది. ఈ రెండు దశాబ్దాల కాలంలో వృద్ధులై పోయిన తల్లిదండ్రులు సర్దుకు పోయారు - అది కూడా ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని అనుభవిస్తూనే- కాకపోతే ఇది వర్చువల్ రియాలిటీ. కావలసినంత టెక్నాలజీ తో ప్రపంచమే ఒక కుగ్రామమై పోయాక ఇంకా అందరూ కలిసే వుండాలని ఎవరు దబాయిస్తారు- బడాయిగా కొందరు దర్శకులు తప్ప?  న్యూక్లియర్ ఫ్యామిలీస్ మళ్ళీ ఉమ్మడి కుటుంబాలుగా మారిపోతాయనా? అప్పట్లో టైము కాగానే దూరదర్శన్ చిత్ర లహరి పాటల కోసం టీవీల ముందు కొలువు దీరినట్టు- ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ట్రెండ్ లో కూడా రాత్రి  కాగానే కంప్యూటర్ ఆన్ చేసుకుని స్కైప్ లో ఎక్కడెక్కడో వున్న తమ వాళ్ళని చూసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, కాలసినంత సమయం ఆనందలహరిలా గడిపేసి-  దీని తస్సాదియ్యా, ఇంతకంటే ఏం కావాల్రా మనిషి జన్మకీ? -  అని జాడించి  ముసుగు తన్ని పడుకుంటున్నారు!  

      ఎవరన్నారు అందరూ కలిసి వుండడం లేదని? ప్రపంచమే ఒక కుగ్రామమై పోయింది. ఆ కుగ్రామమే ఉమ్మడి కుటుంబం, వసుధైక కుటుంబం. పోగొట్టుకున్నది తిరిగి  ప్రకృతే మరో రూపంలో ఇస్తుంది, ఏమీ దిగులుపడ నవసరం లేదు. ఒకవేళ ఇంకా దిగులు పెట్టుకుంటే ఆ దిగులు తీర్చే సినిమాలుండాలి గానీ, సమస్యతో సంబంధంలేని పాత సంగతులు  చెబితే ఆ సినిమాలది వేరే దారి అయిపోతుంది. అనుబంధాలెప్పుడూ అర్జెంటు సమస్యే కాదు, డబ్బే అర్జెంటు సమస్య. డబ్బులేక పస్తులు పడుకుంటున్నాయి కుటుంబాలు. సంపాదన వుంటేనే అబ్బాయికి పెళ్లి సంబంధం కుదురుతోంది, ఇంటి నిండా  బంధువులుంటే కాదు. మిగతావన్నీ- అనుబంధాలూ ఆత్మీయతలూ చుట్టరికాలూ సెంటిమెంట్లూ ఫీలింగులూ - ఇవన్నీ సెకండరీ.  
***
        ‘బ్రహ్మోత్సవం’ సమస్య ఐడియాతో బాటు స్ట్రక్చర్ సమస్య కూడా. డబుల్ ట్రబుల్ అన్నమాట. స్ట్రక్చర్ లేకపోయినా కొన్ని సార్లు స్టార్ సినిమాలు ఆడేస్తాయి- ఐడియా లేకపోతే మాత్రం మొరాయిస్తాయి. సామాజిక సమస్య అయినా, రాజకీయ సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా  వర్తమాన కాలపు సమస్యల్ని ప్రతిబింబిస్తేనే అమ్ముడుపోయే ఐడియా అవుతుంది. ఇప్పటి తరానికి  తెలీని ఏనాటివో ఉమ్మడి కుటుంబాల కథలూ సమస్యలూ తీసినప్పుడు, వరకట్న కథలు, బాల్య వివాహాల కథలూ, వితంతు వివాహాల కథలు, సతీ సహగమనాల కథలూ, బాంచెన్ దొరా కథలు కూడా తీయాలి కదా? అవేం పాపం చేసుకున్నాయి? ఉమ్మడి కుటుంబాల కథలే రూపం మార్చుకుని కాలానికి తగ్గట్టు ఫ్యాక్షన్ కుటుంబాల కథలుగా మారిపోయాయి. అవి కూడా అరిగిపోయాయి. అసలు ఏ ఇజాలూ, నీతులూ లేని ‘మనం’ లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత హాయిగా వుందని?
\
        ‘బ్రహ్మోత్సవం’లో  ఇంటి పెద్ద సత్యరాజ్ ది తన వాళ్ళందరూ తన చుట్టూ వుండాలన్న మనస్తత్వం. జీవితాన్ని పదిమందితో కలిసి సంబరంగా గడుపుకోవాలని కోరిక. ఏ చిన్న అవకాశం  దొరికినా పండగలకీ పబ్బాలకీ బంధువులందర్నీ పిలిపించుకుని భారీ ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటాడు. అలా నల్గురు బావమరుదుల్ని ఏనాడో వాళ్ళ కుటుంబాలు సహా ఇంద్రలోకాన్ని తలపించే భవనంలో తెచ్చి పెట్టుకున్నాడు. ఆనాడెప్పుడో మామ దగ్గర నాలుగు వందలు తీసుకుని ఈనాడు నాల్గు వందల కోట్ల విలువజేసే  పెయింట్స్ తయారుచేసే ఫ్యాక్టరీకి యజమానిగా ఎదిగాడు.  బావమరుదులందరికీ ఫ్యాక్టరీలో వాటాలిచ్చాడు. కానీ వాళ్ళకే పెత్తనమూ వుండదు. ప్రతీదానికీ  ముందు నేను మాట్లాడాలీ అంటాడు. తనే మాట్లాడతాడు. తన ప్రకారమే అన్నీ జరుగుతాయి ఇంటా బయటా. ముగ్గురు బావ మరుదులు ఇదేదో తిని ఎంజాయ్ చేయడానికి బావుందన్నట్టు ఆ ఇల్లరికాన్ని అనుభవిస్తున్నా, పెద్ద బావమరిది రావురమేష్  మాత్రం ఆత్మాభిమానం కలవాడు. ఈ వాతావరణంలో ఇమడలేకపోతాడు. అతడిది అస్తిత్వ సమస్య. బానిసలా బతకలేకపోతాడు. మనిషికూడా మొహాన ఏ నవ్వూ లేకుండా పిచ్చాడిలా ఉంటాడు- ‘అహ నా పెళ్ళంటా’ లో కోట శ్రీనివాసరావు లాగా, ‘హేరాఫేరీ’ పరేష్ రావల్ లాగా. 

        భార్య జయసుధ అతడికి సర్ది చెబుతూ వుంటుంది- హనుమంతుడి స్థానం రాముడి పాదాల చెంతే అయినా అతణ్ణి మనం పూజించడం లేదా? – అని. రావురమేష్ కి హనుమంతుణ్ణి  అవ్వాలని వుండదు. తన కూతురు ప్రణీతని మేనల్లుడు మహేష్ బాబు కిచ్చి చేస్తే ఈ ఇంట్లో తనకో గుర్తింపు వస్తుందన్నఆశతో ఉంటాడు. కానీ  ఈ విషయం బావగారు సత్యరాజ్ తో చెప్పలేక పోతాడు. 

        ఇలా వుండగా ఫారిన్నుంచి సత్యరాజ్ స్నేహితుడి కూతురు కాజల్ అగర్వాల్ వస్తుంది. మహేష్ బాబు ఈమెతో ప్రేమలో పడతాడు. ఇతడికి ఇంట్లో వున్న మరదలు ప్రణీత నచ్చదు. ఇక రావు రమేష్ మనసులో మాట ఎవరో చెప్తే సత్యరాజ్ కి తెలుస్తుంది. దీనికి తన నిర్ణయం ఏమిటో చెప్పడు. అంతా కలిసి టూరుకి వెళ్తారు. అక్కడ కాజల్ చెప్పేస్తుంది మహేష్ బాబుకి- తను ఇంత పెద్ద కుటుంబంలో ఇమడలేనని. అంటే పెళ్లి చేసుకుని తనని బయటికి రమ్మంటోందని అర్ధమైపోయిన మహేష్ బాబు, ఆమెకో కిస్ పెట్టి బై చెప్పేస్తాడు.  దేని గురించీ అతను ఎక్కువ ఆలోచించడు. ఏదైనా అనేశాక లేక చేసేశాక, ఎక్కువ ఆలోచించ లేదనేస్తాడు.  ఈ ముద్దు సీను రావు రమేష్ చూసి అపార్ధం జేసుకుంటాడు. ఇక తన కూతురు ఈ ఇంటి కోడలు కాదన్న బాధకి, తను బానిసగా పడివుంటున్నాడన్న ఆక్రోశం కూడా తోడై, సత్యరాజ్ ని నానా మాటలంటాడు. ఈ మాటలకి సత్యరాజ్  తీవ్రంగా హర్ట్ అవుతాడు. మహేష్ బాబుతో కూర్చుని వేదాంతంలోకి వెళ్లి పోతాడు. తన ఏడుతరాల బంధువుల్ని ఒక దగ్గర చూడాలన్న కోరిక చెప్పి చనిపోతాడు. 

        లండన్ నుంచి మహేష్ బాబు చెల్లెలి ఫ్రెండ్ నని చెప్పుకుని సమంత వస్తుంది. ఈమెతో కలిసి మహేష్ బాబు ఏడుతరాల వేటలో పడతాడు. హరిద్వార్, వారణాసిలకి  వెళ్లి అక్కడ పూర్వీకుల వివరాలతో పూణే,  సోలాపూర్, కర్ణాటకలో ఇంకేదో వూరు, ఇంకో చోటు,  ఇంకో నగరం ఇలా తిరిగేస్తూ బంధువుల్ని కలుసుకుని ఒకచోట ఉందాం రమ్మంటాడు. పనిలో పనిగా సమంతా తో ప్రేమలో పడతాడు. ఆఖర్న ఒక చోట రావు రమేష్ ఎదురవుతాడు. 

        ఇక ఉమ్మడి కుటుంబం లోంచి వెళ్ళిపోయిన రావురమేష్ కూతురు ప్రణీతకి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తూంటాడు. ఈ పెళ్ళికి మహేష్ బాబునీ, అతడి తల్లినీ పిలవడు. పిలవకపోయినా తండ్రి చెప్పులేసుకుని, తల్లిని తీసుకుని వెళ్తాడు మహేష్ బాబు. అక్కడ రావురమేష్ తన తప్పు తెలుసుకుని కలిసి పోయేట్టు చేస్తాడు. 

        ఇదీ కథ. ఈ కథలో రెండు ఐడియాలు కన్పిస్తూనే వున్నాయి : ఉమ్మడి కుటుంబంలో అపార్ధాలు తొలగించడం, ఏడు తరాల వారసుల్ని వెతకడం. ఈ రెండూ  పొసగని ఐడియాలని కూడా తెలుసు. సత్యరాజ్ మరణం వరకూ ఒక ఐడియా, మరణం తర్వాత ఇంకో ఐడియా. సత్యరాజ్ మరణం వరకూ రావు రామేష్ తో సమస్య, మరణం తర్వాత సత్యరాజ్ కోరిక తీర్చే సమస్య. సత్యరాజ్ మరణం ఫస్టాఫ్ వరకూ రావురమేష్ ఆత్మాభిమానం, అమ్మాయి పెళ్లి సమస్య; సత్యరాజ్ మరణం తర్వాత సెకండాఫ్ లో సత్యరాజ్ కోరిక ప్రకారం మహేష్ బాబు ఏడుతరాల  బంధువుల్ని వెతికే సమస్య. 

        రాముడు పుచ్చకాయ కోసం ఇంట్లో గొడవ పడుతూంటే రంగడు  వంకాయల కోసం ఎలా వెళ్తాడు? గొడవ ఇంకా పెంచే ఉద్దేశముంటే వెళ్ళొచ్చు. నువ్వెంత నీ పుచ్చ కాయెంత? (నువ్వెంత నీ ఆత్మాభిమానం, నీ కూతురి పెళ్ళీ ఎంత?), నువ్వు పోతే మాకు
వంకాయల్లేవా? (ఏడుతరాల బంధువులు లేరా?)
అని చూపించి అవమాన పర్చడానికైతే తప్పకుండా వెళ్లి రావొచ్చు. అలాజరిగిందా?

           
కాబట్టి ఈ కథని  ఐడియా దశలోనే చిన్న పిల్లలకి కూడా చెప్పి నమ్మించలేమని తేలుతోంది. చిన్న పిల్లలు కూడా- రావు రమేష్ మామయ్య పుచ్చకాయ అడిగితే పుచ్చకాయ ఏదీ?- అని చంపి వదిలి పెడ్తారు.   

        ఐడియాలో కూడా స్ట్రక్చర్ వుండాలి. స్ట్రక్చర్ తో బాటు కథకి అవసరమైన ఆర్గ్యుమెంట్ వుండాలి.  ఆర్గ్యుమెంట్ ఉంటేనే అది కథవుతుందనీ, కమర్షియల్ సినిమాలకి ఇదే పని కొస్తుందనీ;  కానీ ఆర్గ్యుమెంట్ కాకుండా  స్టేట్ మెంట్ మాత్రంగా వుంటే అది కథగా కాక,  గాథ అవుతుందనీ,  గాథలు కమర్షియల్ సినిమాలకి పనికి రావనీ గతంలో కొన్నిసార్లు చెప్పుకున్నాం. ఇక ఐడియాలో స్ట్రక్చర్ లేకపోతే కథగా విస్తరించడానికి పనికి రాదనేది చాలా జనరల్ నాలెడ్జి. ఒక అయిడియా అనుకుంటే అందులో బిగినింగ్ (సమస్య)  మిడిల్ (సంఘర్షణ), ఎండ్ (పరిష్కారం)  ఉంటేనే ఆ ఐడియాని పనికొస్తుంది.  

       
ఓ పెళ్ళయిన జంట నాగ చైతన్య- సమంత రోడ్డు ప్రమాదంలో మరణిస్తారు ( బిగినింగ్- సమస్య), వాళ్ళ కొడుకు నాగార్జున పెద్దయి పునర్జన్మ ఎత్తిన తన తండ్రి నాగ చైతన్యని చూసి, అతణ్ణి తల్లి సమంత తో కలపాలని అన్వేషణ ప్రారంభిస్తాడు (మిడిల్- సంఘర్షణ), ఆ అన్వేషణలో పూర్వ జన్మలో తన భార్య శ్రియని, తామిద్దరి కుమారుడే అయిన అక్కినేని నా గేశ్వరరావునీ చూసి, మొత్తం అందర్నీ ఒకటి చేస్తాడు ( ఎండ్- పరిష్కారం). 

       
ఇదీ మనంస్టోరీ ఐడియా.
        ఈ ఐడియాలో బిగినింగ్-మిడిల్- ఎండ్ లతో ఒక స్ట్రక్చర్ కన్పిస్తోంది.

        ‘బ్రహ్మోత్సవం’ స్టోరీ ఐడియా ఇలా వుంటుంది  – ఉమ్మడి  కుటుంబంలో తన స్థానం కోసం, కూతురి పెళ్లి కోసం  రావు రమేష్ తపిస్తూంటాడు (బిగినింగ్- సమస్య),   మహేష్ బాబు కాజల్ ని ముద్దాడడం చూసి తన సంగతి తేల్చుకోవడానికి రావురమేష్ సత్యరాజ్ తో గొడవ పడతాడు (మిడిల్ –సంఘర్షణ), మహేష్ బాబు ఏడుతరాల వారసుల్ని వెతకమన్న తండ్రి కోరికతో వారసుల అన్వేషణ ప్రారంభిస్తాడు ( ఎండ్- పరిష్కారం).

 
       ఈ ఐడియాలోనే స్ట్రక్చర్ లేదు. మొదలైన సంఘర్షణ  ఒకటైతే  పరిష్కార మార్గం వెతకడం ఇంకొకటిలా వుంది.  

       
కాబట్టి ఈ రెండూ విడివిడి ఐడియాలు. వీటిని ఒకే కథగా చేయాలంటే ఒకదాన్ని  ప్రధాన కథ చేసి, రెండో దాన్ని ఉపకథగా మార్చాలి. కానీ రెండూ భిన్న కథా వస్తువులు, కుదరదు.  అప్పుడు ఇంటర్వెల్ల్ దగ్గర ఆగిపోయిన ఉమ్మడి కుటుంబం కథని సెకండాఫ్ లో పూర్తిగా కొనసాగించి ముగించాలి, లేదా ఇంటర్వెల్ నుంచీ ప్రారంభమైన ఏడుతరాల కథని సినిమా ప్రారంభంనుంచీ మొదలెట్టాలి. అంటే ఏదో ఒక ఐడియాతోనే ఈ సినిమాకి కథ అనేది సాధ్యమవుతుందన్న మాట. 

         మొదటి ఐడియా ఉమ్మడి కుటుంబం కథనే కొనసాగించాలంటే ( రావురమేష్ తో సమస్య పరిష్కారం) అది మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్ కి సరిపోదు. చిన్న హీరోతో చిన్న కుటుంబ కథా  చిత్రంగా తీసుకోవాలి సమకాలీనం చేసి. 

        మహేష్ బాబుతో ఏడుతరాల కథనే చేయాలంటే – ఇది కూడా  పదిసార్లు ఆలోచించాలి. ఎందుకంటే, ఎంత వెతికినా అసలు ఒక హీరో తన వంశ మూలాల్ని వెతుక్కునే కథతో సినిమాలే కనిపించడంలేదు. వుంటే డాక్యుమెంటరీలున్నాయి, లేకపోతే టీవీ సీరియల్స్ వున్నాయి అమెరికాలో. ఇలాటి ఐడియాతో సినిమా చేస్తే డాక్యుమెంటరీ ఫీల్ వస్తుందనేమో- ‘బ్రహ్మోత్సవం’ ఇలాగే  తయారయ్యింది కదా డాక్యుమెంటరీ చూస్తున్నట్టు.  అందుకే మూలాల్ని వెతుక్కునే సినిమా కథలు పునర్జన్మ కథలుగా ఉంటున్నాయోమో. పునర్జన్మ సినిమాలకి వర్కౌట్ అయ్యే కమర్షియల్ ఫార్ములా. మూలాల్ని వెతుక్కునే కథతో ‘మనం’ కూడా పునర్జన్మల కథే గా? 

        కాబట్టి ఈ రెండు ఐడియాలూ - ఒకటి కాలదోషం పట్టి, ఇంకోటి ప్రాప్త కాలజ్ఞత లోపించి భారీ నష్టాల్ని తెచ్చిపెట్టాయి. నిజంగా ఒక ఐడియా జీవితాల్నే మార్చేస్తుంది!
***
స్ట్రక్చర్  సంగతులు
    సినిమా ప్రారంభం మొదలుకుని అరగంట సేపూ పెళ్లి వేడుకలూ ఇంకేవో సంబరాలే. సత్యరాజ్ కూతురి పెళ్ళితో ప్రారంభం.  ఇది పావుగంట సేపు సాగుతూనే వుంటుంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఆ ఉమ్మడి కుటుంబంలో ఆనందాలన్నీ, విందూ వినోదాలన్నీ, కోలాటాల్నీ కూడా  చూపించారు. తెలుగుదనం @ 112 డిగ్రీలు. పెళ్ళవగానే ఇంకేవో వేడుకలు. మొత్తం 50, 60 మంది చిన్న పెద్దా ఆడవాళ్ళే ఎప్పుడు చూసినా గుంపులు కట్టి కనపడతారు. ఖరీదైన వస్త్రాలూ ఆభరణాలూ ధరించి కారాలు దంచడం, పచ్చళ్లేసుకోవడం లాంటి తెలుగుదనపు పనులు చేస్తూంటారు. ఇన్ని కుటుంబాల్లో మగపిల్లలే పుట్టలేదా మహేష్ బాబు తప్ప అన్నట్టు వుంటుంది మొత్తం ఆడ జనాభాని చూస్తూంటే. లేక పుడుతూంటే చంపేశారా ఆడ శిశువుల హత్యలకి నిరసనగా? బేటీ బచావో బ్రిగేడా వీళ్ళంతా? మహేష్ బాబు ఒక్కడే ఎలాగో తప్పించుకున్నాడా? ఇదేదో విచారణకి ఆదేశించాల్సిన పెద్ద గూడుపుఠాణీ. 

        పోతే మహేష్ బాబుకి ఫ్రెండ్స్ కూడా ఉండరా? డ్రీమ్ సాంగ్స్ అప్పుడు మాత్రం సడెన్ గా మగ డాన్సర్లు దూకి  ఆడేస్తూంటారు. అంత మంది ఆడవాళ్ళతో  మహేష్ బాబు ఒక్కడే ఆటాపాటా. ఇలా చూపించి  దర్శకుడు ఆడవాళ్ళందరూ గోపికలన్నట్టూ, మహేష్ బాబు గోపికల మధ్య కృష్ణుడన్నట్టూ తప్పుడు అర్ధం వచ్చేలా చేశాడు. 

        అంత మంది కుటుంబ సభ్యులయిన ఆడవాళ్ళలో గానీ, వేడుకలకి వచ్చిన అమ్మలక్కల్లో గానీ,  ఒక్కరూ నవ్వించే కోవై సరళ, ఝాన్సీ, హేమ లాంటి కమెడియన్సే లేకపోవడం పెద్ద లోపం. ఇక మగ కమెడియన్స్ అయితే పత్తా లేరు, సెకండాఫ్ లో ఎప్పుడో వెన్నెల కిషోర్ వచ్చికాస్సేపు ఏదో కామెడీ చేయడం తప్ప. 

        ఈ అరగంటలో నాలుగు పాటలు పెట్టేశారు (విడుదలైన రోజు సాయంత్రానికి సినిమా మీద 12 నిమిషాల కత్తెరేసినప్పుడు  ఈ పాటల్లోంచి ఒకటి పోయింది). ఇంత సేపూ ప్రధాన పాత్ర మహేష్ బాబు అప్పుడప్పుడు మాత్రమే కన్పిస్తూ, నల్గురు అత్తలతో, తల్లితో అంటీ ముట్టనట్టు సెంటిమెంట్లు ఒలికిస్తాడు. చెల్లెలి పెళ్లిలో ఓ చెయ్యేస్తున్న అన్నలా పెద్దరికం వహిస్తూ తిరగడు (సినిమా సాంతం ఓ ఫ్యాషన్ పరేడ్ లా, క్యాట్ వాక్ లా తన ఇమేజిని ప్రదర్శించుకోవడం తప్ప, పాత్రలో విషయం లేదు. అర్జెంటుగా పవర్ఫుల్ పాత్రలతో పక్కా  కమర్షియల్స్  చేస్తే తప్ప ఈసారి ఆయన అభిమాన సంఘాలు కూడా వూరుకునేట్టు లేవు).

       
అరగంట తర్వాత కాజల్ అగర్వాల్ వచ్చాకే ఇంతసేపూ ఆటాపాటలతో సాగిన మొనాటనీ పోతుంది. ఇక కాజల్ తో ప్రేమకథ గా స్వరం మార్చుకుంటుంది సినిమా. కౌంటర్ గా రావు రమేష్ ఆశయం వుంటుంది. ఈ ప్రేమ ట్రాకులోనే రెండు కీలక సన్నివేశాల్లో  ‘సీనస్ ఇంటరప్టస్’ అనే దృశ్యభంగ అనౌచిత్యాలకి పాల్పడ్డారు. ఇవి తీవ్ర అసంతృప్తికి గురిచేస్తాయి. 

        1. కాజల్ తన తండ్రితో తన ప్రేమ విషయం  చెబుతూ పూర్తిగా చెప్పకుండా ఆపేస్తుంది, మళ్ళీ దీని కొనసాగింపు వుండదు. వాళ్ళిద్దరి మధ్య దాని ఊసే వుండదు. 

        2. కూతురి పెళ్లి గురించి రావురమేష్ అనుకుంటున్నాడని  సత్యరాజ్ తెలుసుకుని మహేష్ బాబుతో మాట్లాడాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యా కామెడీగా దాగుడు మూతలు పెట్టారు – ఏంటీ ఏదో చెప్పాలనుకుంటున్నారూ?- అని డైలాగేదో మహేష్ పలికేసరికి చెప్పలేక పోతాడు  సత్యరాజ్.  ఈ సీన్ కూడా అక్కడ అలాగే కట్ అయిపోతుంది.

        కథ పట్ల, పాత్రలపట్ల పూర్తి  అవగాహన లేనప్పుడే దాటవేస్తూ ఇలాటి ‘సీనస్ ఇంటరప్టస్’ కి పాల్పడతారు. ఒక కీలక మలుపుకి దారితీసే విషయమేదో మనం తెలుసుకోబోతున్నామని ఉత్సుకతకి లోనవుతూంటే, దాని మీద నీళ్ళు గుమ్మరించడం ప్రమాదకరమైన ఆట, మొత్తానికి మొత్తం సినిమాకి సినిమాయే మునిగిపోవచ్చు.  స్ట్రక్చర్ లో సమస్యల వల్ల, క్యారక్టరైజేషన్స్ లో సమస్యల వల్ల ఈ పరిస్థితి  ఏర్పడుతుంది. వెనక్కి వెళ్లి వాటిని సరిదిద్దాలి. లేదూ, సరిదిద్దితే అనుకున్న ప్రకారం ఇంటర్వెల్ రాదంటే దీని ఫలితం కూడా అనుభవించక తప్పదు.

       1. కాజల్ తండ్రితో ఏం చెప్పాలనుకుంది అసలు? ప్రేమ ఇష్టమనా? ఇష్టం లేదనా? ఇష్టమైతే మహేష్ తండ్రి సత్యరాజ్ తో మాట్లాడమని చెప్పాలనుకుందా? అయ్యుండదు, ఆమెకి ఇంకో స్పష్టత రావాల్సి వుంది మహేష్ నుంచి- ఇది తర్వాత వచ్చే సీన్లో ఆమె బయట పెడుతుంది- ఉమ్మడి కుటుంబంలో ఉండలేనని. మరి అలాంటప్పుడు తండ్రితో ప్రేమ ఇష్టం లేదని కూడా ఇప్పుడు చెప్పాలనుకుని వుండదు. మరెందుకు ఈ సీను పెట్టినట్టు? దీని ప్రయోజనమేమిటి? దీన్ని ఎత్తేస్తే వచ్చే నష్టమేమిటి? ఈ సీను వుండాల్సిందేనని అంటే,  ఇది ఈమాత్రం ప్రేమ ట్రాకులో కన్ఫ్యూజన్ గా లేదా?  పైగా ‘సీనస్ ఇంటరప్టస్’ తో ఆశాభంగం కలిగించడం లేదా?

        2. రావు రమేష్  చెప్పలేక పోతున్న కూతురి పెళ్లి విషయం తెలుసుకున్న సత్యరాజ్ కి,  కొడుకుతో మాట్లాడడానికి అంత మొహమాట మెందుకు? అసలు కొడుకుతో మాట్లాడ్డ మేమిటి, అన్నీ తన నిర్ణయాల ప్రకారమే జరుగుతున్నాయిగా? అసలు బావమరిది రావు రమేష్ తో ఈ దూరాలేమిటి? ఇదేనా తను ప్రవచించే కలివిడితనం? పిలిచి కూర్చో బెట్టుకుని సంగతేంటో తేల్చెయ్యొచ్చుగా-అంత పెద్దరికం అనుకున్నప్పుడు? కొడుకుతో కూడా  ఆ దాగుడు మూతలేంటి? సత్యరాజ్ ఎస్ అంటే, ఇక్కడే మహేష్ తను కాజల్ని ప్రేమిస్తున్న సంగతి చెప్పేస్తే,  ఇంటర్వెల్లో ముందు నిర్ణయించుకున్న ప్రకారం సత్యరాజ్ చావు సీను రాదనా? సత్యరాజ్ నో అంటే, ఇక్కడే రావురమేష్ తగుల్కుని ఇంటర్వెల్లో రావాల్సిన సత్యరాజ్ చావుసీను ఇంటర్వెల్ లోపు జరిపేస్తాడనా? సత్యరాజ్ మహేష్ తో మాట్లాడినా, రావురమేష్ తో మాట్లాడినా,  కాజల్ కూడా ఇక్కడే ఈ సీనులోకే రావాల్సిన అగత్యమేర్పడి- ఉమ్మడి కుటుంబంలో నేనుండను, వస్తే నాతోరా!- అనేసి  ఇక్కడే మహేష్ బాబుతో చెప్పేసి వెళ్ళిపోతుందనా? అప్పుడు  రావు రమేష్ శాంతించి, సత్యరాజ్ కి చావులేక, ఇంటర్వెల్లే లేకుండా పోతుందనా?  సత్యరాజ్ ని చంపడానికి ఇన్ని దాటవేతలా? 

 
           సత్యరాజ్ కి రావురమేష్ మనో కామన తెలియడం వల్లే ఈ చిక్కులన్నీ . తెలియకపోతే? పై తండ్రీ కొడుకుల స్పష్టత లేని  ఇన్ని ప్రశ్నలు లేవనెత్తే ఈ  దాగుడు మూతల సీనే వుండదు, సీనస్ ఇంటరప్టస్ తో అసంతృప్తే వుండదు. ఇంటెర్వల్ దగ్గర రావురమేష్ నోటినుంచే అన్ని విషయాలూ అప్పుడే విని చనిపోతే చనిపోతాడు సత్యరాజ్. ఈ చావుకి కూడా అర్ధం ఉండదనేది వేరేసంగతి. 

        3. ఇంకో సీనస్ ఇంటరప్టస్ కూడా వుంది. వెనకటి ఒక సీన్లో  ఫ్యాక్టరీ అమ్మవద్దని నిర్ణయించుకున్నప్పుడు, ఆ మాటలు వింటూ ఉంటాడు మహేష్. సత్యరాజ్ అతడి అభిప్రాయమడిగితే ఏదో చెప్పబోతున్నట్టు లేచి, వెనక్కి తాతల ఫోటోల వైపు వెళ్లి చూస్తూ ఉంటాడు. ఏమీ చెప్పకుండా ఒకరకమైన కొంటెతనంతో ఇటు చూసి మ్యాటర్ కట్ చేస్తాడు. వీడు  తెలిసి చెప్పడం లేదా, తెలియక చెప్పడం లేదా అని ప్రేక్షకులకి మెదిలే ప్రశ్నే వేస్తాడు సత్యరాజ్. చెల్లెలి పెళ్ళిలో ఇన్వాల్వ్ మెంట్ కోరుకోలేదు పోనీ, వ్యాపార విషయం లోనైనా తన దృక్పథం ఏమిటో చెప్తాడని ఇప్పుడు ఎదురు చూసే వాళ్లకి తీవ్ర ఆశాభంగం తప్పదు. ఇదీ కథానాయకుడి తీరు! ఈ పాత్ర అర్ధమవడానికి దీని దృక్పథం ఏమిటో ఎక్కడా తెలీదు మనకి. ఎలా వున్న పాత్ర అలా  స్క్రీన్ ప్లే ని ఉత్తేజితం చేయడానికి తోడ్పడే క్యారక్టర్ ఆర్క్ లేకుండా, నేలబారుగానే కింద పడుంటుంది. 

      ఇక పెద్ద ట్రూపుగా అందరూ కలిసి టూర్ కి వెళ్ళడమూ, అక్కడ కాజల్ తన మనసులో మాట మహేష్ కి చెప్పడమూ. ఈ కాలపు అమ్మాయిగా ఆమె కరెక్టుగానే చెప్పింది. అంత మంది మనుషుల మధ్య ఉండలేనని. ఆమె ఉండలేదు, అతను బయటికి రాలేడు. కిస్ పెట్టి ఆమెని వదిలేస్తాడు. ఆమె ఎంత బాధ పడివుంటుందో. ఈ సీను తర్వాత ఇక కాజల్ కన్పించదు. ఈ సీన్లో చాలామంది మహేష్ ముద్దు పెట్టాడంటే ఆమెని చేసుకుని బయట కాపురం పెడతాడనే అనుకున్నారు. ఒకరిద్దరు రివ్యూ రైటర్లు కూడా ఆ తర్వాత కాజల్ ఏమైందో జుట్టు పీక్కున్నా అర్ధం కాలేదని రాశారు. దాన్ని  గుడ్ బై కిస్ గా తీసుకోవాలని దర్శకుడి కవి హృదయమని నిజానికి ఈ వ్యాసకర్తకి కూడా ముందు తట్ట లేదు! ఇలా వుంటే ఇక మూవీ డైనమిక్ గా ఎందుకుంటుంది? మోనాలిసా నవ్వుకి అర్ధం తెలీనట్టే ఈ ముద్దుకి అర్ధంకూడా రకరకాలుగా తీయ్యొచ్చు- అందులో ఒకటి,  చాటుగా రావురమేష్ చూస్తున్నాడని కావాలనే  కిస్ పెట్టాడని! లాంగ్ కిస్ బిగ్ ఫైట్! 

        బిగ్ ఫైట్ కి సిద్ధమవుతాడు రావురమేష్. తన నికృష్టపు జీవితం గురించి ఎన్ని చెప్పాలో అన్నీ  చెప్పేసి, ఇక ఈ ఇంట్లో వుండనంటాడు. కూతురి పెళ్లి ఆశలు కూడా వమ్ము చేసినందుకు తూలనాడతాడు. సత్యరాజ్ సహా కుటుంబ సభ్యులు షాకవుతూంటే, మహేష్ మందలిస్తూంటాడు. అతడికి అర్ధమై పోయే వుండాలి పరిస్థితి- అప్పుడు  రావురమేష్ ని పక్కకి తీసికెళ్ళి, అతను చూసింది నిజమే గానీ, కాజల్ ని తను వదులుకున్నానని అపార్ధం తొలగించాలి. ఇది జరగదు. రావురమేష్ కూతురి పెళ్లి కోరిక తెలిసీ నంగనాచిలా వున్న సత్య రాజ్ ఇప్పటికైనా నోరు విప్పాలి. ఇది కూడా జరగదు. తోడుదొంగల్లా తండ్రీ కొడుకులు  రావురమేష్ ని ఇంట్లోంచి వెళ్లి పోనిచ్చి నట్టే వుంటుంది సీను!

        తర్వాతి సీన్ ఇంటర్వెల్ సీన్. ఇది ప్లాట్ పాయింట్ వన్ అనుకుందాం. కానీ ప్లాట్ పాయింట్ వన్ కి కథని చేరవేసిన విధానం ఎలా వుంది? ఈ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర నుంచే అసలు కథ ప్రారంభమవుతున్నప్పుడు, ఇక్కడ ఏమేం సెట్ చేయబోతున్నారు? 

        రావురమేష్ మాటలకి ఒకటేబాధ పడిపోతూ ఉంటాడు సత్యరాజ్. అన్నేళ్ళల్లో ఒక్క రోజైనా - ఏమిటి నువ్వలా ఎందుకుంటావ్, మనమంతా కలిసిమెలిసి హేపీగా వుండాలి,  నీకేం కావాలో చెప్పూ - అని అతడి మనోభావాల్ని కనుక్కున్నాడా? అతడి కూతుర్ని తన కొడుక్కి చేసుకునే విషయంలో ఏనాడైనా ఒక స్పష్టత ఇచ్చాడా? అసలు విడిపోయి గౌరవంగా బతకాలన్న రావురమేష్ మనోభావాల్ని గౌరవించాడా? బలవంతంగా కలిసి వుండమనడ మేమిటి? కలిసి వుండాలనడం ఒక విలువ, విడిపోవాలనుకోవడం హక్కు. హక్కుల్ని గౌరవించాల్సిందే, పరిష్కరించాల్సిందే. నానబెడితే ఇలాగే తిరుగుబాట్లతో పెద్దరికాన్ని మంట గలుపుతాయి.  

        ఇక్కడ తండ్రీ కొడుకుల మధ్య మాటల్లో ప్రణీత గురించి కూడా ప్రస్తావనే వుండదు. ఇప్పుడైనా సత్యరాజ్ ప్రణీత గురించి ఏమనుకుంటున్నాడో బయట పడడు. వెనకటి సీన్లో మహేష్ తో దాగుడు మూతలాడి నప్పుడు ప్రణీత విషయం అడగాలనే ప్రయత్నించాడు సత్య రాజ్.  అంటే తనకిష్టమే నన్నమాట. మరి ఈ రొచ్చు అంతా ఎందుకు? ఇప్పుడైనా మహేష్ ని ఎందుకు అడగడు? మహేష్ కూడా అసలు తనవల్ల ఏం జరిగితే రియాక్ట్ అయి రావురమేష్ అలా ప్రవర్తించాడో తండ్రికి చెప్పేసి ఇప్పటికైనా హీరోగా ఎందుకు అభిశంసనకి నిలబడడు? ఇంత ఆదర్శ కుటుంబమని చెప్పుకునే వాళ్ళకి ఈ దొంగాటకాలేమిటి?

        ఇవన్నీ పక్కకి  పెట్టేసి వేదాంత ధోరణిలో బంధుత్వాల గురించి ఏదో చెప్పి, ఏడుతరాల బంధువుల్ని ఒక చోట చేర్చే కోరికేదో చెప్పి, గుండెపోటుతో చనిపోతాడు సత్యరాజ్. అతడి మరణం అతడి స్వయంకృతమే తప్ప రావురమేష్ దోషమేం లేదని కథనమే, పాత్రచిత్రణలే చెప్తున్నాయి. 

           
ఈ ప్లాట్ పాయింట్ వన్ లో సెట్ చేయాల్సిన అంశాలు : 1.  హీరోకి గోల్, 2. ఆ గోల్ లో ఎమోషన్, 3. గోల్ సాధించడానికి రిస్క్ చేస్తున్న అంశం, 4. గోల్ కి పూనుకుంటే తలెత్తే పరిణామాల హెచ్చరిక. 

        ఈ కథలో సెట్ చేసింది : 1. గోల్ వచ్చేసి ఏడు తరాల్ని గాలించడం. తలెత్తిన సమస్య అది కాదు కాబట్టి, ఆ సమస్యని పరిష్కరించడానికి ఇదో మార్గం కూడా కాదు కాబట్టి,  ఇది గోల్ కాకుండా పోయింది, పైగా ఇది గోలే అనుకున్నా దీనికి యూత్ అప్పీల్ లేదు; 2. ఈ  గోల్ లో ఎమోషన్ ఉండేందుకు తండ్రి కోరికని ఆశ్రయించి వున్నమరణాన్ని మహేష్ బాబు ఫీలవుతున్నాడేమోగానీ, మనకి ఏ ఫీలూ కలగడం లేదు, ఆ మరణం అతడి స్వయంకృతం కాబట్టి, మన ఫీల్ రావురమేష్ మీద కేంద్రీకృతమైంది కాబట్టి;   3. గోల్ ని సాధించడానికి మహేష్ బాబు చేస్తున్న రిస్కు ఏదీ లేదు, తనకి ప్రత్యర్ధి కూడా ఎవరూ లేరు, రావురమేష్ ప్రత్యర్ధి అనుకుంటే అతను  కథలోంచి వెళ్లి పోయాడు; 4. ప్రత్యర్ధి  లేకపోవడంతో పరిణామాల హెచ్చరిక కూడా ఏమీ లేదు.
        కనుక గోల్ నిల్.
        ప్లాట్ పాయింట్ వన్ అనేది లేదు. 

       లేకపోగా స్క్రీన్ ప్లే నిట్ట నిలువునా మధ్యకి ఫ్రాక్చర్ అయ్యింది- రభస, జ్యోతిలక్ష్మి, చక్కిలిగింత, అశోక్, ఊసరవెల్లి  తదితర ఎన్నో ఫ్లాపయిన సినిమాల్లాగే ఇంటర్వెల్ ముందొక కథ,  తర్వాతొక కథగా ‘బ్రహ్మోత్సవం’ కూడా  దర్శన మిచ్చింది. దీని కథ కూడా  ఈ ఫ్రాక్చర్ తో, సెకండాఫ్ సిండ్రోమ్ తో, ఆ  ఫ్లాపయిన సినిమాల దృష్ట్యా,  అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఐడియా దశలోనే తెలిసిపోతుంది. కానీ తెలుసుకోలేదు.
        ఈ సమస్య రెండు ఐడియాల కథవల్ల వచ్చింది. ఉమ్మడి కుటుంబం- ఏడుతరాలు. ఫస్టాఫ్ ఉమ్మడి కుటుంబం, సెకండాఫ్ ఏడుతరాలు. రెండిటికీ కలిపి ఓ స్ట్రక్చర్ ఎలా వస్తుంది? ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి  ఇంత పెద్ద ఫ్లాప్ సినిమా తీశారు. 

        సరే, ఇదలా వుంచితే, ఈ కథ తాను ప్రవచిస్తున్న  ఉన్నత  ఆదర్శాల గురించి, సంస్కృతీ సాంప్రదాయాల గురించీ, కుటుంబ విలువల గురించీ, ఐకమత్యం గురించీ, ఇంకా చాలా ఉదాత్త భావాల గురించీ  ప్రతిపాదించే ఐడియాలజీకి ఈ కథే తూట్లు పొడుచుకుంటుంది. నీ కుటుంబంలో నేను ఇమడలేనని కాజల్ వెళ్ళిపోతుంది, నీ పెద్దరికానీకో నమస్కారమని రావు రమేష్ వెళ్లిపోతాడు, కూతురు పెళ్లి చేసి ఇంట్లోనే అందరితో పాటూ ఉంచుకోకుండా ఆదర్శాల సత్యరాజ్ లండన్ పంపించేస్తాడు. ఆ కూతురూ అల్లుడూ అతను చనిపోయినా రానే రారు. మసాలా యాక్షన్ సినిమాలకి లాజిక్ లేకపోయినా జనం చూసేయ గలరు. ఎందుకంటే ఆ జీవితాలతో వాళ్ళకి అనుభవముండదు కాబట్టి. కానీ కుటుంబ కథలు అందరూ నిత్య జీవితంలో అనుభవించేవే. తండ్రి చనిపోతే కూతురూ అల్లుడూ రారా అని ఎవరికైనా లాజిక్ తోస్తుంది. 

        కూతురు బదులు కూతురి ఫ్రెండ్ నని చెప్పుకుని హీనంగా  సమంతా వస్తుంది. వస్తూ అది విషాదం సంభవించిన ఇల్లని కూడా చూడకుండా, బెజవాడ కనకదుర్గమ్మ యాత్ర్రీకులని చెప్పి బస్సు నిండా జనాన్ని వెంటబెట్టు కొచ్చి ఆ  ఇంట్లో బస చెయ్య మంటుంది! ఇది కామెడీ అట! దీని అవసరం ఇప్పుడట! పాపం భర్త పోయిన ఆ మహాతల్లి రేవతి వాళ్ళందరికీ వండి పెడుతుంది. మహేష్ బాబేమో సమంత చేసిన ఈ చిలిపి పనికి (!) అడ్మైరింగ్ గా చూస్తూంటాడు ఆమెని. ఎందుకంటే ఇక లవ్ ట్రాక్ మొదలెట్టుకోవాలిగా? ఇంట్లో కూర్చుని ఇంటికొచ్చిన ఆడపిల్లల్నే  ప్రేమిస్తాడు తప్ప, బయట తిరిగి ప్రపంచాన్ని చూసి అసలు ఇప్పుడు ప్రేమలంటే ఏమిటో తెలుసుకోడు. ప్రేమంటే ఇదీ అని కాజల్ లాంటి అమ్మాయిలు  వచ్చి చెప్పాలి. ఇదీ హీరో  పాత్రచిత్రణ! పూర్తిస్థాయి పాసివ్ పాత్ర... ఈ పాసివ్ పాత్రకి ఇప్పుడైనా ప్రణీత గుర్తుకు రాదు. కలిసివుందామనే ఐడియాలజీ తో ఆమెని బాధపెట్టింది గాక, కాజల్ వెంట పడి దెబ్బ తిని, మళ్ళీ సమంత వెంట పడ్డం! ఈ కథ  ఆదర్శాల ఐడియాలజీ లో ప్రణీతని కూడా కోన్ కిస్కా చేయడం! 

         ఈ కథ చెప్పే ఆదర్శాల గురించి ఇంకా చెప్పాలంటే, సత్యరాజ్ చనిపోయాక ఇంట్లో ఒక్కరూ పత్తా వుండరు- ఇప్పుడు మహేష్ బాబు, రేవతి ఇద్దరే వుంటారు. ఉమ్మడి కుటుంబంలో మిగతా వాళ్ళందరూ పరార్. రావు రమేష్ వెళ్లి పోయాడంటే దానికో సబబైన కారణముంది. మిగతా వాళ్ళకీ? మిగతా వాళ్ళు ఇప్పుడు ఈ ఆదర్శాల కథకి ఇబ్బంది కాబట్టి వెళ్ళిపోయారా? 

        ఇంతేనా? తెలుగువారి సాంప్రదాయాల గురించి చెప్పాలంటే ఇంకా వుంది. మనిషి ఇలా పోయాడో  లేదో అలా సంబరాలు మొదలై పోతాయి. ఇంకోసారి అటు అమ్మాయి తరపు వాళ్ళు, ఇటు అబ్బాయి తరపు వాళ్ళ మధ్యా  మాటకు మాట జుగల్బందీ. ఇదో అంత్యాక్షరి లాంటి వేడుక. పోతేపోయాడు ఆదర్శాల మూలపురుషుడు, సత్యరాజ్ శని వదిలింది అన్నట్టుంది.  

        ఇక మహేష్- సమంతా ఏడుతరాల వేటకి వెళ్ళినప్పుడు హరిద్వార్ లో, అక్కడ కాదని వారణాసిలో చావుల చిట్టాలు తిరగేస్తారు పూర్వీకుల సమాచారం కోసం. కానీ మహేష్ బాబు అక్కడికి వెళ్తూ తండ్రి చితాభస్మంతో వెళ్ళడు! ఇది కూడా తెలుగు సంస్కృతే నేమో.
        ఈ వారసుల్ని వెతికే ట్రాక్ అంతా రకరకాల ఊళ్లలో వారసుల్ని కనుగొని పలకరించే, వాళ్ళని కలిసుందాం రమ్మని ఆహ్వానించే సీన్లతో వుంటుంది. డాక్యుమెంటరీ ధోరణికి డ్రైగా మరిపోయిన ఈ సుదీర్ఘ ట్రాకులో ఎక్కడైనా ఈ అన్వేషణలో ఒక అద్భుతం జరుగుతుందని ఆశించడానికి లేదు. ఏడు తరాలంటే 175 సంవత్సరాలు. ఏ మహాత్మా గాంధీ పక్కన పోరాటం చేసిన వాళ్ళ వారసులో, లేదా అల్లూరి సీతారామరాజు తో కలిసి పోరాడిన వాళ్ళ వారసులో, ఇంకా లేదా ఎపిజే అబ్దుల్ కలాంతో  కలిసే వారసత్వమున్న వాళ్ళో తేలి,  ఒక ట్విస్ట్ ఇచ్చి, కథని  కొత్త మలుపు తిప్పుతారని ఎదురు చూడ్డానికీ లేదు [వెనకటి తరాల్ని శోధిస్తూ పోతే,  చాలా మంది వాళ్ళ వారసులు ఇప్పుడు ముస్లింలుగా, క్రైస్తవులుగా, సిక్కులుగా కన్పిస్తారని , హరిద్వార్ లో జీనియాలజీ (వంశావళి) రిజిస్టర్లు నిర్వహించే పండితులే చెప్తున్నారు].

       
ఏదీ తేలనప్పుడు కథనమంతా అనవసరమే కదా? ఇక్కడ సెకండాఫ్ ప్రారంభం నుంచీ మిడిల్ విభాగం వుండాలి. దేని మిడిల్ విభాగం? ప్రారంభించిన ఉమ్మడి కుటుంబం కథ బిగినింగ్ ముగిసి ఇంటర్వెల్ కే ఉరికంబం ఎక్కింది. దానికి మిడిల్ కి నోచుకునే అదృష్టం లేదు. ఇక సెకండాఫ్ లో ప్రారంభమైన ఏడుతరాల రెండో కథతో మళ్ళీ బిగినింగే. ఇది ఎక్కడా మిడిల్లో పడదు. మిడిల్ అంటే గోల్ కోసం సంఘర్షణ. గోల్ కోసం మహేష్ ఎక్కడా సంఘర్షించడు.  కాబట్టి ఈ రెండో కథ బిగినింగ్ గానే సాగుతుంది తప్ప మిడిల్ ని ఏర్పాటు చేయదు. ఎండ్ మాత్రమే వుంటుంది  అన్వేషణలో రావు రమేష్ కన్పించడంతో. ఎక్కడ బయల్దేరామో అక్కడికే వచ్చామనుకుంటాడు మహేష్. కనుక సినిమా ప్రారంభం నుంచీ ప్రేక్షకులు మొదటి కథకీ బిగినింగ్ నే, రెండో కథకి కూడా  బిగినింగ్ నే చూస్తూంటారన్న మాట. ఎక్కడా మిడిల్ తాలూకు సంఘర్షని చూడరు. ఏ సినిమాకైనా కథంతా వుండేది మిడిల్లోనే.  అందుకే ఈ సినిమాలో ఏ కథా ఓ కథ కాకుండా పోయింది!

        రెండు ఐడియాలు : రెండిటికీ బిగినింగ్ లు + ఎండ్ లు - నో మిడిల్ = టోటల్ గా  నో స్టోరీ. 

        ఇక క్లైమాక్స్ : రావు రమేష్ తన మానాన తను  కూతురు  ప్రణీత పెళ్లి చేసుకుంటూంటాడు. మహేష్ నీ, రేవతినీ పిలవడు. అయినా తండ్రి చెప్పులేసుకుని కొత్త జమీందారులా కొత్త శాసనాలు చేయడానికా అన్నట్టు మహేష్ రేవతిని తీసుకుని వెళ్తాడు. అక్కడ డైరీలో తండ్రి రాసిన ఒక పేజీ చూపిస్తాడు. అది చూసి రావు రమేష్ కరిగిపోయి కన్నీళ్ళు కార్చేసి, తనదే తప్పు క్షమించమంటాడు.  అసలు జరిగిన గొడవే మహేష్ అపా ర్ధాన్ని తొలగించక పోవడం వల్ల. సత్యరాజ్ పలాయన వాదం వల్ల. జరిగింది ఇప్పటికైనా చెప్పేసి క్షమించమని అడగాల్సింది మహేష్.  రివర్స్ లో పాపం భోళా మనిషి రావురమేష్ మళ్ళీ సత్యరాజ్ వంశ కోరల్లో మళ్ళీ తలకాయ పెడతాడు క్షమాపణలు చెప్పుకుని. సత్యరాజ్ తనకి ఆస్తి రాసినంత మాత్రానా అన్ని మానసిక గాయాలూ మాసిపోతాయా? అదేనా తన ఆత్మాభిమానం?

        డైరీలో పేజీ రాసుకోవడం, తానే మనుకుంటన్నాడో పైకి చెప్పకపోవడం, అపార్ధాలతో గొడవలు మీదికి తెచ్చుకుని చచ్చిపోవడం-  ఇదీ కలిసి జీవితాల్ని ఉత్సవంగా బ్రహ్మోత్సవంగా గడుపుకోవాలని చెప్పే సత్యరాజ్ కథ కాని కథ!

        ఇక చివరిగా ఆర్గ్యుమెంట్ సంగతి. ఐడియాలో ఆర్గ్యుమెంట్ కూడా కన్పించాలన్నాం. అప్పుడే అది కథ అన్పించుకుటుంది. ఒక పాయింటుని ఏర్పాటు చేసి, దాని గురించి ఇరువర్గాలు చేసుకునే తప్పొప్పుల పోరాటంలో ఎవరి వాదన గెలిచిందీ చూపడం. ఇది కథకి వుండే ప్రాథమిక లక్షణం. ఇలాటి ఆర్గ్యుమెంట్ సహిత కథలే కమర్షియల్ సినిమాలకి పనికొస్తాయి. ఇలా కాకుండా- నేనిలా చేస్తే మా నాన్నకి ఇలా జరిగింది...నాన్న కోసం నేనిలా చేస్తే... పెద్ద మామయ్యతో నాకిలా జరిగిందీ- అని పాసివ్ గా,  స్టేట్ మాత్రంగా ఇచ్చుకుని ముగిసేవి గాథలు. సినిమాకి పనికిరావు. కృష్ణవంశీ  ఫ్లాపయిన ‘మొగుడు’  కూడా చూడండి, చక్కగా  ఓ కథగా ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదించి, సెకండాఫ్ లో స్టేట్ మెంట్ తో గాథగా ఫిరాయిస్తుంది...


-సికిందర్


       
.