రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, అక్టోబర్ 2021, సోమవారం

1066 : రివ్యూ


రచన - దర్శకఠ్వం : ఆకర్ష్ ఖురానా
తారాగణం : తాప్సీ పన్నూ
, ప్రియాంశూ పన్యూలీ, అభిషేక్ బెనర్జీ, సుప్రియా పాఠక్, మనోజ్ జోషి తదితరులు
కథ : నందా పెరియసామి
, రచయితలు : అనిరుద్ధ గుహ, లీషా బజాజ్, కణికా థిల్లాన్, సంగీతం : అమిత్ త్రివేది, ఛాయాగ్రహణం : నేహా పిఎం
బ్యానర్ : ఆరెస్ విపి మూవీస్
, మ్యాంగో పీపుల్ మీడియా నెట్వర్క్
నిర్మాతలు : రోనీ స్క్రూవాలా
, నేహా ఆనంద్, ప్రంజల్ ఖందియా
విడుదల : 15 అక్టోబర్ 2021
, జీ5
***

        స్పోర్ట్స్ డ్రామాలు ఒక పంథాలో వస్తూంటాయి. క్రీడల్లో విజయాలు సాధించడం గురించి. బయోపిక్ లు కూడా ఇదే పంథాలో వస్తూంటాయి. కానీ క్రీడాకారిణుల పట్ల వివక్ష, అణిచివేత, అవమానం, వాళ్ళ జెండర్ నే ప్రశ్నార్ధకం చేసే నియమ నిబంధనలు లాంటి శరాఘాతాల్ని దృష్టికి తెచ్చే స్పోర్ట్స్ డ్రామాలు అరుదు. ఇలా బలౌతున్న క్రీడాకారిణులెందరో వున్నారు. వీళ్ళ కథలు ప్రచారం పొందడం లేదు. సినిమాలు అసలే రావడం లేదు. ఇలాటి వాళ్ళ కథల్ని తమిళనాడులో గుర్తించి ఒక రచయిత దర్శకుడి దృష్టికి తెచ్చాడు. దీన్ని సినిమాగా మల్చి రష్మీ రాకెట్ గా తీశాడు వెబ్ సిరీస్ దర్శకుడు ఆకర్ష్ ఖురానా. ఇలాటి సినిమాలకి పెట్టింది పేరైన తాప్సీ పన్నూ టైటిల్ పాత్ర పోషించింది.  

        ఓ అర్ధరాత్రి పోలీసులు క్రీడా సంఘం లేడీస్ హాస్టల్లోకి జొరబడి, రష్మీ వీరా (తాప్సీ పన్నూ) ని లాక్కెళ్ళి లాకప్ లో వేస్తారు. ఇది సంచలన వార్తవుతుంది. రష్మీ వీరా గురించి రకరకాల కథనాలు ప్రచారమవుతూంటాయి. ఎవరీ రష్మీ వీర? ఒక అమ్మాయి అయిన రష్మీ వీరాని రూల్స్ కి విరుద్ధంగా అర్ధరాత్రి, అదీ మగ పోలీసులు లాక్కెళ్ళి ఎందుకు లాకప్ లో వేశారు? ఏం చేసిందామె?

  చిన్నప్పట్నుంచీ మగ రాయుడులా తిరుగుతూంటుంది రష్మీ. గుజరాత్ లోని భుజ్ లో తల్లిదండ్రులు (సుప్రియా పాఠక్, మనోజ్ జోషి) లతో వుంటుంది. మగపిల్లల్ని ఎడాపెడా కొడుతుంది. అయితే పరుగు పెట్టడం మొదలెడితే రాకెట్ లా దూసుకుపోతుంది. పది సెకన్లలో 80 మీటర్లు రన్నింగ్ చేస్తుంది. ఇది చూసి ఆశ్చర్య పోతారందరూ. దీంతో ఆమెని క్రీడల వైపు ప్రోత్సహిస్తారు తల్లిదండ్రులు. పెద్దయి జిల్లా స్థాయి, అంతర్రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాలు సాధిస్తుంది. దీంతో క్రీడా సంఘం ఆమెని ఆసియా క్రీడలకి ఎంపిక చేస్తుంది. కెప్టెన్ గగన్ ఠాకూర్ (ప్రియాంశూ పన్యూలీ) ఆమెకి శిక్షణ నిస్తాడు. ఆసియా క్రీడల్లో మూడు మెడల్స్ సాధించి సంచలనం సృష్టిస్తుంది.

        అయితే ఇతర క్రీడాకారిణుల కంటే ఈమె తేడాగా వుందని క్రీడా సంఘం నుంచి అందుకున్న ఆదేశాలతో వైద్య పరీక్షలు చేపడతారు. ఆ పరీక్షల్లో ఆమెలో టెస్టోస్టిరాన్ (పురుష హార్మోన్)  వుండాల్సిన స్థాయి కంటే అధికంగా వుందని తేలుతుంది. దీంతో ఈమె ఆడపిల్లే కాదనీ, క్రీడాకారిణిగా పాల్గొనేందుకు అనర్హురాలనీ నిషేధిస్తుంది క్రీడా సంఘం. క్రీడా సంఘాన్ని ఏమార్చిందని అర్ధరాత్రి లాకప్ లో వేసి, మెడల్స్ ని వెనక్కి తీసుకుంటారు.

        ఇప్పుడేం చేసింది రష్మీ అన్నది మిగతా కథ. ఇక్కడ్నుంచి సెకండాఫ్ కోర్టు రూమ్ డ్రామాగా వుంటుంది. ఈ కథని తమిళ దర్శకుడు, రచయిత నందా పెరియ సామి అందించాడు. ఇది ఏ వొక క్రీడాకారిణి బయోపిక్ కాదు. అథ్లెట్స్ గురించి భాగ్ మిల్కా భాగ్’, పాన్ సింగ్ తోమర్ లాంటి బయోపిక్స్ వచ్చాయి. పరుగుల రాణి అశ్వనీ నాచప్ప గురించి తెలుగులో అశ్వని అని బయోపిక్ వచ్చింది. అయితే రష్మీ రాకెట్ ఇలాటి బయోపిక్ కాదు. దేశ విదేశాల్లో ఇందరో ఇలాటి వివక్షకి గురవుతున్న క్రీడాకారరిణుల కథగా దీన్ని తీసుకోవాలి. పెరియ సామి తమిళనాడులోని  కొన్ని గ్రామాల్లో తను చూసిన కొందరు క్రీడలపై ఆసక్తిగల అమ్మాయిల జీవితాల్ని స్టోరీ ఐడియాగా దర్శకుడు ఆకర్ష్ ఖురానాకి అందిస్తే, దీనిమీద విస్తృత రీసెర్చి చేసి సినిమా కథ చేశాడు ఖురానా.

  స్త్రీలలో టెస్టోస్టెరాన్ మోతాదుకి మించి వుండడాన్ని హైపర్ ఆండ్రోజనిజం అంటారు. దీనివల్ల స్త్రీత్వానికి ఏ లోటూ రాదు. కానీ క్రీడారంగంలో ఇదొక బహిష్కరణాస్త్రంగా మారింది అంతర్జాతీయంగానూ. ఇలా బహిష్కరణలకి గురైన క్రీడాకారిణుల వ్యక్తిగత, సామాజిక జీవితాలు కూడా దెబ్బతిన్నాయి. మనదేశం నుంచి గోల్డ్ మెడలిస్ట్ దుతీ చంద్, విదేశానికి చెందిన ఒలింపిక్స్ ఛాంపియన్ సెమెన్యా ఇలాటి బాధితుల్లో కొందరు.

        క్రీడాకారిణులకి లైంగిక వేధింపులు ఎలాగూ తప్పడంలేదు. దంగల్’, చక్ దే ఇండియా’, మేరీ కోం ఈ విషయాన్ని దృష్టికి తెచ్చాయి. కానీ అసలు నువ్వు ఆడదానివే కాదన్న కొత్త రూపం తొడిగిన వివక్షని దృష్టికి తెస్తున్న సినిమా ఇదే.

        మెడల్స్ వెనక్కి తీసుకుని రష్మీని బహిష్కరించడంతో, అరెస్టు చేయడంతో, స్వచ్ఛందంగా ఒక లాయర్ అభిషేక్ బెనర్జీ ముందుకొచ్చి బెయిల్ మీద విడిపిస్తాడు. కానీ స్వగ్రామం వెళ్ళిన రష్మిని అక్కడ వెలివేస్తారు. దీంతో తిరిగి వచ్చేస్తుంది. దీని మీద న్యాయపోరాటం చేయాలని కేసు వేస్తాడు లాయర్.

     సెకండాఫ్ అంతా కోర్టులో న్యాయపోరాటం గురించి. టెస్టోస్టెరాన్ మోతాదు ఎక్కువున్నంత మాత్రాన ఆడది ఆడది కాకుండా పొదన్న వాదాన్ని శాస్త్రీయ ఆధారాలతో నిరూపించడం ఈ సెకండాఫ్ కథ. ఇందులో క్రీడాసంఘం బోర్డు సభ్యుడి కుట్ర ప్రధానంగా వుంటుంది. తన కూతురికి విజయం దక్కలన్న ఉద్దేశం పెట్టుకుని రష్మిని రచ్చకీద్చాడు అతను. రష్మి ఆడది కాదు కాబట్టే మగ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారన్న వాదాన్ని కూడా లాయర్ ఓడిస్తాడు.

        అయితే రష్మీ ఆడదేనని శాస్త్రీయ ఆధారాలతో కేసు నిరూపించగల్గుతున్నా, ఇంకా బలంగా జడ్జీ నమ్మాలన్నట్టు సినిమాటిక్ చేశారు. సెకండాఫ్ లో తనకి శిక్షణ నిచ్చిన కెప్టెన్ గగన్ ఠాకూర్ నే రష్మీ పెళ్లి చేసుకోవడం, గర్భవతి కావడం- ఇది చూపించి రష్మీ ఆడదేనని జడ్జికి లాయర్ విన్నవించడం, జడ్జి అనుకూలంగా తీర్పు ఇవ్వడం వగైరా...ఇలా అందరు బాధితురాళ్ళకి సాధ్యమవుతుందా?

        ఫస్టాఫ్ తాప్సీ ప్రతీ సీనుని నిలబెట్టింది. క్రీడాకారిణిగా, బాధితురాలిగా. పాత్ర లోపలి పొరల్లోకి తలదూర్చి సమస్యని కళ్ళకి కట్టింది. రాకెట్ లా పరుగుదీసే దృశ్యాలు సరే. ఇలాటి విలక్షణ సినిమాలకి తను బ్రాండ్ నేమ్ అని మరోసారి నిరూపించుకుంది. సెకండాఫ్ న్యాయపోరాటంలో ఆమెకి పనిలేదు. కోర్టు ప్రొసీడింగ్స్ ని చూస్తూ కూర్చోవడమే. సెకండాఫ్ కోర్టు సీన్లు అభిషేక్ బెనర్జీవే. అతడి మీదే కథ. లాయర్ పాత్రని అతను అత్యంత బలంగా, సహజంగా పోషించాడు.

        వెబ్ సిరీస్ దర్శకుడు ఆకర్ష్ ఖురానా ఒక వినూత్న స్పోర్ట్స్ డ్రామాని రియలిస్టిక్ సినిమాగా అందించాడు. పాత్రల తీరుతెన్నులు, నటింపజేయడాలు, దృశ్యాల చిత్రీకరణ ఏదీ రియలిస్టిక్ జానర్ నుంచి పక్కకి జారకుండా ప్రతిభ కనబర్చాడు. అమిత్ త్రివేదీ సంగీతంలో పాటలు కొన్ని గుజరాతీ ట్యూన్ లో సందర్భానుసారం వుంటాయి. సినిమా నిడివి రెండు గంటలే వుండడం హాయి గొల్పే అంశం.
సికిందర్