రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, ఫిబ్రవరి 2016, సోమవారం

వీకెండ్ కామెంట్మినీ థియేటర్ల  అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎనిమిది నెలల క్రితమే ఈ ప్రతిపాదన గురించి విన్నాం. చిన్న నిర్మాతగా చిన్న సినిమాలు తీసి బాధలుపడ్డ చదలవాడ శ్రీనివాసరావు, ‘తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి’ అనే సంస్థని స్థాపించి చిన్న సినిమాల ప్రదర్శనావకాశాల్ని మెరుగు పరచడానికి తీవ్ర కృషి చేస్తున్నారు.  తిరిగి మొన్న ఈ అంశం పై తాజా ప్రకటన చేశారు. నాలుగు బృందాలుగా వెళ్లి మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో మినీ థియేటర్ల పని తీరుని  పరిశీలించి వచ్చామని, అక్కడ అవి విజయవంతంగా నడుస్తున్నాయనీ, త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ  అయిదు వేల థియేటర్లు నిర్మించే ప్రాజెక్టు చేపడతామనీ ప్రకటించారు. గుజరాత్ లో అయితే సర్కస్ టెంట్ తరహా నెలకొల్పిన మినీ థియేటర్లు నిర్వహిస్తున్నారనీ, ఈ తరహాలో మన రాష్ట్రాల్లో కూడా ప్రారంభించే ఆలోచన ఉందనీ అన్నారు. చదలవాడ చేపట్టిన ఈ బృహత్కార్యాన్ని ఎవరైనా అభినందించాల్సిందే.

  భారీ ప్రాజెక్టుని తన భుజాలకెత్తుకోవడానికి ఆయన చెప్పే కారణం- చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలకి రెండు రాష్ట్రాల్లోనూ  థియేటర్లు లభించడం లీజ్ హోల్డర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి న్యాయం జరక్కపోవడమే. ఈ మినీ థియేటర్లు ఏరియాని బట్టి 50 నుంచి 200 సీట్ల మధ్య కేపాసిటీతో ఉంటాయన్నారు. వెయ్యి గజాల నుంచి, 5 వేల గజాల స్థలం ఒక్కో థియేటర్ కి సరిపోతుందని, ఒక్కో మినీ థియేటర్  నిర్మాణానికి పన్నెండు నుంచి చ 20 లక్షల రూపాయల వ్యయం అవుతుందనీ పేర్కొన్నారు. టికెట్ల ధరలు కూడా చవకగా 30 నుంచి 50 రూపాయల మధ్యే వుంటాయి. రెసిడెన్షియల్ కాలనీల్లో, బస్ డిపోల్లో, మండల, ఆర్డీఓ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.  

అయితే ఎనిమిది నెలల క్రితమే  ఈ  అంశంపై ‘తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి’ భారీ యెత్తున రామోజీ ఫిలిం సిటీలో సమావేశం జరిపింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్ ఎఫ్ సి చైర్మన్ రామోజీరావు,  చదలవాడ ప్రయత్నాన్ని  శ్లాఘించారు. 250 మందికి పైగా చిన్ననిర్మాతలు, ఎగ్జిబిటర్లు పాల్గొన్న ఈ సమావేశంలో రామోజీ రావు మాట్లాడుతూ, తను కోట్ల రూపాయలు వెచ్చించి భారీ సినిమాలు నిర్మించవచ్చు గానీ, కథా బలమున్న సినిమాలపైనే తనకి దృష్టి వుండడం వల్ల చిన్న బడ్జెట్ సినిమాలే నిర్మిస్తున్నాననీ చెప్పుకొచ్చారు. మినీ థియేటర్ల నిర్మాణాన్ని ఆహ్వానిస్తున్నా నన్నారు. ఇక అప్పట్లో చదలవాడ నిధులు సమకూర్చుకుని రెండు రాష్ట్రాల ప్రభుత్వాధినేతల్ని కలవడమే మిగిలింది.

ఈ మినీ థియేటర్ల వైపు చిన్న నిర్మాతలు ఆశగా చూస్తున్నారు. కాలం చాలా మారిపోయింది. పెద్ద సినిమాలకే థియేటర్లు లభించి,  చిన్న సినిమాలకి థియేటర్లు దొరకని రోజులు పూర్వ మెప్పుడూ లేవు. భారీ సినిమాలైనా, చిన్న సినిమాలైనా పెద్ద పెద్ద థియేటర్ల దగ్గర్నుంచి టూరింగ్ టాకీసుల వరకూ అన్నిటా ఆడేవి. ఎన్టీఆర్ ‘బొబ్బిలి పులి’ కూడా గ్రామాల్లో టూరింగ్ టాకీసుల్లో భారీ వసూళ్లతో ఆడిందే. ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడంలో టూరింగ్ టాకీసుల పాత్ర కూడా  తక్కువేం కాదు. టూరింగ్ టాకీసుల్ని చిన్న సినిమాలకే పరిమితం చేయాలనీ ఎవరూ అనలేదు.

కానీ ఇవ్వాళ్ళ  థియేటర్లని పెద్ద సినిమాలకే పరిమితం చేశారు. అయితే ఏ మాట కామాటే చెప్పుకోవాలి : చిన్న సినిమాల నాణ్యత పూర్వమున్నట్టు ఇప్పుడు వుండడం లేదు. ఏడాదికి 70 మంది చొప్పున కొత్త నిర్మాతలూ దర్శకులూ వస్తూ, ఆ 70 సినిమాల్ని అట్టర్ ఫ్లాపు చేసుకుని వెళ్ళిపోతున్నారు.  ఏటేటా జరిగే ఈ తంతుని బాగా గమనించ వచ్చు.  ఈ సినిమాలకి ఎంత ప్రధాన సెంటర్ థియేటర్లలో వేసినా ఓపెనింగ్స్ వుండవు, రెండు రోజులు  ఓపిక పట్టినా 15 శాతానికి మించి ఆక్యుపెన్సీ పెరగదు. నాణ్యత ఇలా వుంటే వీటికి థియేటర్లు ఇచ్చి మాత్రమేం లాభం. చుక్క నూనె రాలని వేరుశనగ వస్తూంటే నూనె మిల్లులు కట్టి లాభం లేదు కదా? చిన్న సినిమాల్లో ‘నూనె’ వుందంటే అది రెండు రోజుల్లో తెలిసిపోతుంది. వెంటనే పెద్ద వర్గాలు వాటిని టేకప్ చేసి థియేటర్లు కూడా పెంచి ఆడించు కుంటున్నారు. కాబట్టి థియేటర్లు ఇస్తున్నారా లేదా అన్నది కాదు ప్రశ్న, చిన్న సినిమాల్లో ‘నూనె’ ఉంటోందా లేదా అన్నదే పాయింటు. కచ్చితంగా నూటికో కోటికో తప్ప నూనె వుండదని బాండ్ రాసిచ్చేయొచ్చు. మరి వీటి కోసమే మినీ థియేటర్లు భారీ యెత్తున నిర్మించడం ఎంతవరకు సబబో మనకైతే తెలీదు.

ప్రదర్శనల సంగతి తర్వాత, ముందు అత్యవసరంగా చిన్న సినిమా నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి ఏంచేయాలన్నది ఆలోచించాలి. పెద్ద సినిమాలు నాణ్యత లేకపోయినా స్టార్ వేల్యూతో ఆడేస్తాయి. చిన్న సినిమాలకి నాణ్యతే గీటు రాయి. చిన్న సినిమాల నాణ్యతా ప్రమాణాలు రెండు సార్లు పతన మయ్యాయి : ఒకటి, 2000 సంవత్సరం మొదలుకొని అయిదేళ్ళ పాటూ ఎవరెవరో కొత్తకొత్త వాళ్ళతో యూత్ సినిమాలంటూ వేలం వెర్రిగా తీసి పడేసినప్పుడు; రెండు చిన్న సినిమాలకి దాదాపు పెట్టుబడి అంతా శాటి లైట్ రైట్స్ రూపంలో వచ్చెయ్యడంతో చెత్త చెత్త సినిమాల్ని చుట్టేయడంతో.

ఇప్పుడొచ్చి, మినీ థియేటర్లు మన కోసమే కదా అని ఇంకింతమంది తలా ఓ డిజిటల్ కెమెరా పట్టుకుని వచ్చేసి నానా చెత్తని ఉత్పత్తి చేస్తే ఎంత కాలం తట్టుకుని నిలబడగలవు  మినీ థియేటర్లు? చిన్న సినిమాలు చాలా డేంజరస్ వైరస్.

ఇది ఆలోచించాలి.  చదలవాడ శ్రీనివాసరావు చిన్న సినిమాల క్వాలిటీని కూడా పరిరక్షించాల్సి వుంటుంది. అలాటి వాటికే స్థానం కల్పించాల్సి వుంటుంది. ఫిల్టర్ చేస్తే దారికొ స్తారు చిన్న సినిమాలు తీసేవాళ్ళు. అప్పుడు మినీ థియేటర్ల స్వప్నం  సార్ధకమవుతుంది. 
***