రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, ఆగస్టు 2023, బుధవారం

1361 : స్క్రీన్ ప్లే సంగతులు!


 

         “The multi level, the conscious and the unconscious, is natural when I write scripts… when I come up with ideas and stories.”

— Bong Joon-Ho


        ‘జైలర్’ స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగం చూస్తే- కుటుంబంతో ముత్తువేల్ సాధారణ జీవితం కనిపిస్తుంది (కథా నేపథ్యం ఏర్పాటు). రిటైరయిన ముత్తువేల్ తో బాటు భార్య, కొడుకు, కోడలు, మనవడు, టాక్సీ డ్రైవర్ ల స్వభావాలతో; కుటుంబంతో, టాక్సీ డ్రైవర్ తో ముత్తు వేల్ సంబంధాలతో సాగుతుంది (పాజిటివ్ పాత్రల పరిచయం). మరోవైపు విగ్రహాల స్మగ్లర్ వర్మ స్వభావం, కార్యకలాపాలు, అతడి అనుచరుడు శీను వ్యవహారం వుంటాయి (నెగెటివ్ పాత్రల పరిచయం). ఇప్పుడు ముత్తువేల్ కొడుకు ఏసీపీ అర్జున్ ఒక విగ్రహం దొంగతనం కేసులో శీనుని దర్యాప్తు చేసే క్రమం ప్రారంభమవుతుంది (సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన). శీనుని దర్యాప్తు చేస్తున్న అర్జున్ ఉన్నట్టుండి మాయమైపోతాడు (సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో తీవ్రత). తర్వాత అర్జున్ చనిపోయాడని తెలుసుకున్న ముత్తువేల్ తో బాటు కుటుంబం విషాదంలో మునిగిపోతారు (సమస్య ఏర్పాటు- ప్లాట్ పాయింట్ వన్).


        పై బిగినింగ్ విభాగం వరకూ చూస్తే, ఇది ముత్తువేల్ సాధారణ జీవితంతో ప్రారంభమై, ఆ సాధారణ జీవితం చెదిరిపోయిన పరిస్థితితో ముగుస్తోంది. సాధారణంగా కథతో వుండే త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ నమూనానే ఇది కలిగివుంది. ఇందులో విషయం నడపడానికి తోడ్పడ్డ 4 టూల్స్ ( 1. కథానేపథ్యం ఏర్పాటు, 2. పాత్రల పరిచయం, 3. సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, 4. సమస్య ఏర్పాటు ) కూడా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ కి చెందిన టూల్సే అవడాన్ని గమనించ వచ్చు.  
       
అయితే ఈ స్ట్రక్చర్ లోపల చేసిన కథనమే స్టార్ సినిమాల రెగ్యులర్ కథనంతో విభేదిస్తోంది. ఇదెక్కడ్నుంచి వచ్చింది
? మార్కెట్ యాస్పెక్ట్ నుంచి వచ్చింది. స్టోరీ ఐడియాకి ముందు మార్కెట్ యాస్పెక్ట్ నిర్ణయించుకుంటే, దాన్ని బట్టి క్రియేటివ్ యాస్పెక్ట్ తో తగిన కథనం వస్తుంది. దీని మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటి? ఈ సినిమాని రియలిస్టిక్ జానర్ లో మార్కెట్లో నిలబెట్టడం. స్టార్ సినిమాకి రియలిస్టిక్ జానరా? యంగ్ స్టార్ కాదు, వయసు పైబడిన సీనియర్ స్టార్. కబాలి, కాలా, పేట, దర్బార్ లతో రజనీకాంత్ సినిమాలు రియలిస్టిక్ జానర్లోనే వర్కౌట్ అయ్యాయి. జైలర్ ని కూడా అదే రియలిస్టిక్ పాత్రచిత్రణతో వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేశారు. కొత్త తరం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రియస్టిక్ స్కూల్ కి చెందిన వాడే. కాబట్టి రియలిస్టిక్ జానర్ లోనే తీయాలని మార్కెట్ యాస్పెక్ట్ నిర్ణయించి అందుకు తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ తో కథనం చేశారు. చేసినప్పుడు రజనీకాంత్ పాత్ర చిత్రణకి ప్రేక్షకుల్ని మెప్పించే రెగ్యులర్ రజనీ మార్కు కమర్షియల్ ఎంట్రీ సీను దగ్గర్నుంచి మ్యానరిజమ్స్, పంచ్ డైలాగ్స్, రోమాన్స్, పాటలు, ఫైట్లు వరకూ సమస్తం సినిమా నుంచి తొలగి పోయాయి. ఒక కుటుంబ పెద్ద పాత్రగా అతనుండి పోయాడు.

2. మార్కెట్ యాస్పెక్ట్ ఏది?

అంటే మార్కెట్ యాస్పెక్ట్ ని రజనీతో వర్కౌటయ్యే రియలిస్టిక్ జానర్ గా నిర్ణయిస్తే, ఆ రియలిస్టిక్ జానర్ డిమాండ్ చేసే సహజ పాత్రచిత్రణ కారణంగా క్రియేటివ్ యాస్పెక్ట్ ఏర్పాటయింది. అంటే సహజంగా అన్పించే కథనం. అంటే మార్కెట్ యాస్పెక్ట్ ఈ రియలిస్టిక్ క్రియేటివ్ యాస్పెక్ట్ ని నిర్ణయిస్తే, ఈ రియలిస్టిక్ క్రియేటివ్ యాస్పెక్ట్ తో రియలిస్టిక్ కుటుంబ పెద్ద పాత్ర పుట్టింది. అప్పుడీ రియలిస్టిక్ కుటుంబ పెద్ద పాత్ర రియలిస్టిక్ గానే ప్రవర్తిస్తూ, రియలిస్టిక్ కథనమే చేసుకుపోతోంది. కథ పాత్రది. పాత్ర ఎలా వుంటే అలాటి కథనమే చేసుకుంటుంది. ఇందులో రైటర్ చేతులు పెట్టేదేమీ వుండదు. జానర్ మర్యాద పాత్ర చేతిలో వుంటుంది. రైటర్ కి అర్ధమవాల్సింది పాత్రే. అప్పుడే పాత్ర చేసుకుంటున్న కథనం అర్ధమవుతుంది. ఈ పాత్ర మధ్య తరగతి కుటుంబ పెద్ద పాత్ర. దీని మనస్తత్వం ప్రకారమే కథనం వుంటుంది, రైటర్ మనస్తత్వం ప్రకారం కాదు. ఇదంతా రజనీ నటనని చూస్తే తెలిసిపోతోంది.

రైటర్ దృక్కోణంలో ఈ బిగినింగ్ విభాగంలో విషయం చూస్తే
, ఇది కథకి ఇన్స్ పిరేషన్. దీని తర్వాత ప్రారంభమయ్యే మిడిల్ విభాగంలో విషయం క్రాఫ్ట్. దీని తర్వాత ప్రారంభమయ్యే ఎండ్ విభాగం ఫిలాసఫీ. అంటే బిగినింగ్ లో జరిగింది ఇన్స్ పిరేషన్ గా తీసుకుని, మిడిల్ లో జరిగే కథని చెక్కాలి. మిడిల్ లో చెక్కిన కథతో ఉత్పన్నమయ్యే సారంతో ఎండ్ విభాగంలో ఫిలాసఫీ చెప్పి ముగించాలి.
       
పై బిగినింగ్ విభాగంలో రణానికి పాజిటివ్
, నెగెటివ్ పాత్రల స్థాపన పూర్తయింది.  స్మగ్లర్ వర్మ, అతడి గ్యాంగ్ నెగెటివ్ పాత్రల చర్యల వల్ల కొడుకు చనిపోయాడని తెలుసుకున్న ముత్తువేల్ కుటుంబంతో విషాదంలో మునిగిపోవడంతో సమస్య ఏర్పాటై ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. స్ట్రక్చర్ సూత్రాల ప్రకారం ఈ మొదటి మలుపు దగ్గర పాత్రకి గోల్ ఏర్పడి, సమస్యతో సంఘర్షణ ప్రారంభమవుతుంది. అంటే కథ ప్రారంభమవుతుంది. ఈ గోల్ అనే టూల్ లో 4 ఎలిమెంట్స్ వుంటాయి. వీటిని గోల్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి 1. కోరిక, 2.పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. భావోద్వేగం.

3. రణ రంగం సిద్ధం

ఇప్పుడు 1. ముత్తువేల్ కోరిక ఏమిటి? కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం. 2. దీనికోసం దేన్ని పణంగా పెడుతున్నాడు? కుటుంబ క్షేమాన్ని. 3. ఇందువల్ల మున్ముందు ఏ పరిణామాలు ఎదురవొచ్చు? దీనికోసం బిగినింగ్ విభాగంలో జరిగింది చూడాలి. ముత్తువేల్ కుటుంబాన్ని చూపించారంటే ఆ కుటుంబం నెగెటివ్ పాత్రలతో ప్రమాదంలో పడుతుందని అర్ధం. శివ లో నాగార్జున అన్న కూతురితో అనుబంధాన్ని చూపించారంటే ఆ అన్న కూతురు ప్రమాదంలో పడుతుందని అర్ధం. అంటే సంఘర్షణకి దిగాలని ప్రధాన పాత్ర తీసుకుంటున్న నిర్ణయం ఎలాటి పరిణామాలకి దారితీయవచ్చో తెలిపి ప్రేక్షకుల్లో ఆందోళన, దాంతో భావోద్వేగాలు సృష్టించడం ఈ మూడో ఎలిమెంట్ ఉద్దేశం. ఈ మూడు ఎలిమెంట్స్ కలిసి ముత్తువేల్ పాత్రకి 4వ ఎలిమెంట్ భావోద్వేగాలు ఏర్పడుతున్నాయి.
       
ఇలా మిడిల్ విభాగానికి రణరంగం సిద్ధమైంది. అంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుల మానసిక లోకం
, వెండి తెర మీద కథలో ప్రతిబింబిస్తే, ఆ సినిమా బలంగా కనెక్ట్ అవుతుందన్న నియమాన్ని పరిగణనలోకి తీసుకుంటే- ఏమిటా ప్రేక్షకుల (మనుషుల) మానసిక లోకం? కాన్షస్ మైండ్, సబ్ కాన్షస్ మైండ్, మధ్యలో ఇగో. కాన్షస్ మైండ్ ఏ ధర్మాలతో వుంటుందో, వెండితెర మీద బిగినింగ్ విభాగం అలా కన్పించడం. సబ్ కాన్షస్ మైండ్ ఏ ధర్మాలతో వుంటుందో, వెండితెర మీద మిడిల్ విభాగం అలా కన్పించడం. ఇక  ఇగో ప్రధాన పాత్ర. కాన్షస్ మైండ్ తో వుండే ఇగో, సబ్ కాన్షస్ మైండ్ లోకి ప్రవేశించి సమస్యని పరిష్కరించడం. మరి ఎండ్ విభాగం సైకలాజికల్ గా ఏది? సమస్యని పరిష్కరించుకున్న ఇగో, మెచ్యూర్డ్ ఇగోగా మార్పు చెంది మానసికంగా తృప్తి కల్గించడం.

4. గోల్ ఎలా పని చేస్తుంది?

ఇప్పుడు గోల్ ఏర్పాటుకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ తీసుకుందాం. ఏదైనా ఒక గోల్ పెట్టుకుని అది సాధించడానికి ప్రయత్నిస్తారు మనుషులు. ఎలా సాధిస్తారు?  సబ్ కాన్షస్ మైండ్ తోడ్పాటు తీసుకుని సాధిస్తారు. సబ్ కాన్షస్ మైండ్ తోడ్పాటు ఎలా తీసుకుంటారు? సబ్ కాన్షస్ మైండ్ ని యాక్టివేట్ చేసి తోడ్పడేలా చేసుకుంటారు. ఎలా యాక్టివేట్ చేస్తారు?
       
ఇక్కడే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ (ఆర్ ఏ ఎస్) అనే మెదడులో అంగం రంగప్రవేశం చేస్తుంది. జీవితంలో ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ ని సాధించాలని రాత్రింబవళ్ళు కష్టపడితే
, కష్టపడగా కష్టపడగా, ఎన్నాళ్ళకో సాధించవచ్చు. లేదా సాధించక పోవచ్చు. ఎందుకు? ఇది శాస్త్రం తెలీక కష్టపడడం కాబట్టి. ఏదైనా సాధించాలన్న మాటలతో, థాట్స్ తో సబ్ కాన్షస్ మైండ్ యాక్టివేట్ కాదు. దానికి దృశ్యం చూపించాలి. దృశ్య భాషే దానికి బాగా అర్ధమవుతుంది. ఫలానా ఒక జాబ్ కావాలని కోరుకుంటే ఆ జాబ్ లో ఆల్రెడీ చేరిపోయినట్టు, హాయిగా జాబ్ చేస్తున్నట్టు, ఆ ఆఫీసు వాతావరణంతో, కొలీగ్స్ తో, బాస్ తో హేపీగా కలిసి పనిచేస్తున్నట్టూ- డిటెయిల్డ్ గా వూహించుచుకుంటూ, ఆ వూహా రూపానికి మ్యూజిక్, ఇతర సౌండ్స్, ఎమోషన్స్, రంగులు  జోడిస్తే- ఈ సజీవ దృశ్య భాష సబ్ కాన్షస్ మైండ్ కి బాగా అర్ధమై వెంటనే యాక్టివేట్ అయి- అనుకున్న గోల్ నిజం చేసి పెడుతుంది. దృశ్య భాష భారీ సెట్టింగులతో, అవసరమైతే సీజీ ఎఫెక్ట్స్ తో, అట్మాస్ సౌండ్ సిస్టంతో కూడా ఎంత వూహించుకుంటే, అంత ఈజీగా గోల్ ని క్యారీ చేస్తుంది సబ్ కాన్షస్ మైండ్. ఈ దృశ్య భాషని సబ్ కాన్షస్ మైండ్ కి అందించేదే పైన చెప్పుకున్న ఆర్ ఏ ఎస్.  
        
గోల్ గురించిన ఇమేజి ( దృశ్యం) ని పైన చెప్పినట్టు పదేపదే మననం చేసుకుంటూ వుంటే, ఆ ఇమేజిని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అందుకుని, సబ్ కాన్షస్ మైండ్ కి బొమ్మ వేసి చూపిస్తుంది. ఈ ప్రకృతి ఏర్పాటు స్క్రీన్ ప్లే విషయానికొస్తే, ప్లాట్ పాయింట్ వన్ తో బిగినింగ్ ముగించుకుని, గోల్ తో మిడిల్ కి వెళ్తున్న క్యారక్టర్, గోల్ ని విజువలైజ్ చేసుకుని సంఘర్షణకి దిగితే, ఆ పోరాటం కరెక్టుగా వుంటుంది. పాత్ర మిడిల్ కి వెళ్ళడమంటే సబ్ కాన్షస్ మైండ్ లోకి ప్రవేశించడమే.
        
ఇప్పుడు ముత్తువేల్ గోల్ ని విజువలైజ్ చేసుకుని మిడిల్ పోరాటం ఎలా మొదలెట్టాడో, సబ్ కాన్షస్ మైండ్ ఎలా సహకరించిందో మిడిల్ విభాగంలో చూద్దాం.
(ఇంకా వుంది)
—సికిందర్