రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, August 13, 2014

రివ్యూ..


సీన్ రివర్సల్స్ తో స్పీడు!

రచన- దర్శకత్వం : సుజీత్
తారాగణం : శర్వానంద్, సీరత్ కపూర్, సంపత్, అడవి శేషు, వెన్నెల కిషోర్, కోట శ్రీనివాసరావు తదితరులు.
సంగీతం : జిబ్రాన్,   ఛాయాగ్రహణం : మాధి,  కూర్పు : మధు
బ్యానర్ : యూవీ క్రియేషన్స్,   నిర్మాతలు : వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
విడుదల : ఆగస్టు 1, 2014       సెన్సార్ : U/A
***
కొత్త దర్శకుడన్నాక తన శైలిని మార్కెట్ లో వున్న దానికంటే విభిన్నంగా చాటుకుంటూ ముద్రేయక పోతే నిలదొక్కుకునే అవకాశాలు లేవీ రోజుల్లో. రెండో సినిమా కోసం మళ్ళీ మొదటికొచ్చి ప్రయత్నాలు చేయాల్సిందే. ఈ రెండేళ్ళ కాలంలో అలా యూత్ ఫుల్ సినిమాలతో సొంత శైలిని విజయవంతంగా ప్రకటించుకున్న కొత్త  దర్శకులు ఇద్దరే కన్పిస్తారు : ‘స్వామిరారా’ సుధీర్ వర్మ,  ‘రన్ రాజా రన్’ సుజీత్ లు.

తెలుగు సినిమా ఓవర్సీస్ కి వ్యాపారాన్ని విస్తరించుకుని ఎప్పుడో గ్లోకల్ (గ్లోబల్+లోకల్) సినిమాగా పరిణామం చెందింది. స్థానిక డిమాండ్లని దృష్టిలో పెట్టుకుంటూనే,  ప్రవాస ప్రేక్షకుల టేస్టునీ సంతృప్తి పర్చినప్పుడే చిన్న సినిమా అయినా ఈ మార్కెట్ కి అర్హతలు సంపాదించుకుని బాగుపడుతుంది. కానీ చాలా చిన్న, మధ్య తరహా సినిమాలు గ్లోకల్ మేకింగ్ ని గాలికొదిలేసి,  పాత మూసలోనే కొట్టుకుపోతూ లోకల్ గానూ అడ్రసు లేకుండా పోతున్నాయి. చాలా మంది మారడానికి సిద్ధంగా లేరు. ఒకరో ఇద్దరో అప్పుడప్పుడు ఇలా మెరుస్తోంటే తెలుగు సినిమా మీద గౌరవం పెరుగుతుంటుంది.

షార్ట్ ఫిలిమ్స్ దర్శకుడు సుజీత్ విజన్, నేటి కాలపు ప్రేక్షకుల విజన్ ఒకటే : న్యూవేవ్ రోమాంటిక్ క్రైం థ్రిల్లర్ ఫీల్ ఎలా ఉండాలో తెలియజెప్పే విజన్. క్యాజువల్ గా, కేర్ ఫ్రీ గా సాగిపోతూ పిల్ల గాలి తెమ్మెరలా తాకే కథా కథనాలన్నమాట. విజువల్ విలువలు, మ్యూజికల్ విలువలు అదనం.

అలాగని  విషయపరంగా ఇదేదో మరో పాప్ కార్న్ సినిమాకాదు. కాకపోతే ఉన్న విషయాన్ని సకాలంలో చెప్పడం బాధ్యతగా తీసుకోలేదు. 2000 – 2002 మధ్యకాలంలో వెల్లువెత్తిన యూత్ చిత్రాలనే జాతరలో ఇలాగే విషయాన్ని సకాలంలో చెప్పడాన్ని కూడా  లైట్ తీసుకుని- మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అనే ఒక దుస్సంప్రదాయానికి తెర లేపిన దశని మళ్ళీ గుర్తు చేస్తూ వచ్చిందే ఈ ‘రన్ రాజా రన్’ అనే ఎంటర్ టైనర్.


విషయం ఏమిటి?
రాజా ( శర్వానంద్) ఒక కూరగాయల వ్యాపారి కొడుకు. సరదాగా తండ్రి (జయప్రకాష్ వి.) దగ్గర అసరాలకి డబ్బు తీసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయడమే పని. చాలా మందిని ప్రేమిస్తాడుగానీ, నిజాయితీకి పోయి వాళ్లకి దూరమవుతూంటాడు. అలాంటిది తాజాగా ప్రియ (సీరత్ కపూర్) తో ప్రేమలో పడతాడు. తండ్రి చెప్పే  చిట్కాలతో ఎలా ప్రేమించాలో అలా ప్రేమిస్తూంటాడు. ఆమె పోలీస్ కమిషనర్ కూతురని తెలిసి కంగారు పడ్డా, ఆయన్నికలుసుకుని పెళ్లి ప్రపోజల్ పెడతానంటాడు.

మరో వైపు నగరంలో డబ్బులకోసం పోలీసు అధికారుల, రాజకీయ నాయకుల కిడ్నాపులతో అలజడిగా వుంటుంది. ఓ రెండేళ్ళ క్రితం ఇలాటి కిడ్నాపులే జరిగాయి. అప్పుడు దిలీప్ (సంపత్ రాజ్ ) అనే పోలీసు అధికారి ఆ కేసుల్ని విజయవంతంగా సాల్వ్ చేశాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పడు మళ్ళీ పెట్రేగిన కిడ్నాపుల సంగతి చూడ్డానికి అతన్నే కొత్త నగర కమిషనర్ గా నియమిస్తుంది ప్రభుత్వం.

ఈ నేపధ్యంలో రాజా కమీషనర్ దిలీప్ ని కలిసి పెళ్లి ప్రపోజల్ పెడతాడు. విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు దిలీప్. అయితే ఒక షరతు పెడతాడు. కిడ్నాపర్లని పట్టుకోవడం కోసం రాజానే కిడ్నాపర్ గా మారి నటించాలంటాడు. అలాగేనని రాజా ప్రియని కిడ్నాప్ చేసేసి దిలీప్ కి ఝలక్ ఇస్తాడు. అసలు రాజా ఆడుతున్న గేమ్ ఏమిటి, జరుగుతున్న కిడ్నాపులతో అతడికున్న సంబంధమేమిటి, కమిషనర్ దిలీప్ అతడికి ఎందుకు ఏలా శత్రువయ్యాడు మొదలైన ప్రశ్నలకి సమాధానాలకోసం ఇక్కడ్నించీ మిగతా సినిమా చూడాల్సిందే.

శర్వానంద్ కిది సరయిన ప్లాట్ ఫాం. ‘జర్నీ’ తర్వాత అలాటి న్యూవేవ్ సినిమాతో ప్రేక్షకులకి దగ్గరయ్యే అవకాశంలభించింది. పట్టుబట్టి దర్శకుడు శర్వానంద్ లుక్ ని మార్చేయడంతో అతను సరిగ్గా ఏ స్థాయి  అల్లరి నటుడు కాగలడో తెల్చేసినట్టయ్యింది. మళ్ళీ మీసాలజోలికి వెళ్ళకుండా ఈలుక్ తోనే కంటిన్యూ అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోవచ్చు.


కొత్త హీరోయిన్ సీరత్ కపూర్ లావెక్కువ. ఈమెని మించి స్థూలకాయంతో నేస్తంగా నటించిన విద్యుల్లేఖా రామన్ ది కామెడీతో ఆకట్టుకునే నటన. సంపత్ రాజ్, జయప్రకాష్, కోట, అలీ, వెన్నెల కిషోర్ అందరూ కామెడీని వాళ్ళ వాళ్ళ స్టయిల్లో చేసుకుపోయారు. చాలా సీరియస్ పోలీసుగా ఎంట్రీ ఇచ్చిన సంపత్ రాజ్ ఉత్త కామెడీ క్యారక్టర్ గా మారిపోవడం మింగుడు పడని వ్యవహారం. పోతే జ్యూనియర్ పోలీసు అధికారి నయీం బాషా గా నటించిన అడివి శేష్ ది సస్పెన్స్ తో కూడిన క్లిష్ట పాత్ర.

పాటలపరంగా, నేపధ్య సంగీత పరంగా ఇదొక ఫ్రెష్ నెస్ తో కూడిన ప్రయత్నం. యాడ్ ఫిలిమ్స్ కి సంగీతం కూర్చే మహమ్మద్ జిబ్రాన్ ట్యూన్స్ మళ్ళీ ‘స్వామిరారా’ తరహా జాజ్ సంగీత బాణీల్ని గుర్తుకు తెస్తాయి.ఇక కెమెరా మాన్ మాధీది అత్యుత్తమ తరహా పనితనం. పిల్ల గాలి తెమ్మెర ఫీల్ అంతా కలర్ ఫుల్ గా అతడి కెమెరా పట్టుకోగాల్గింది. మూడోది దృశ్యాల్ని పరుగులెత్తించే మధు ఫాస్ట్ ఎడిటింగ్. ఇక ప్రకాష్ కళాదర్శకత్వం సినిమాకి నిజమైన గ్లోకల్ లుక్ ని సంతరించి పెట్టింది.

కొత్త దర్శకుడు సుజీత్ అనుభవమున్న టెక్నీషియన్ గా సినిమా మొత్తంతో కట్టి పడేస్తాడు. తడబాటు, సినిమాని బోరు సుడిగుండంలో పడెయ్యడం, సాగదీయడం, పాత్రల్ని ఖూనీ  చేయడం, నటనల్ని లైట్ గా తీసుకోవడం లాంటి బలహీనతలు లేని, ఆత్మవిశ్వాసం గలవాడిగా ఈ మొదటి సినిమాతోనే కన్పిస్తాడు. ఐతే అలా అలా వేగంగా పరుగెత్తే దృశ్యాలతో ఒక పేస్ ని మెయింటెయిన్ చేస్తూ కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేసినప్పటికీ, ఎక్కడో మెదడుని దొలిచేస్తూండే ప్రశ్నలకి సమాధానం చెప్పడంలో బాగా ఆలస్యం చేయడంవల్ల –దాని ఫలితంగా క్లైమాక్స్ ఉత్తుత్తిగానే తేల్చేయడం వల్ల,  ఒకలాంటి వెలితితోనే థియేటర్ లోంచి బయటికి రావల్సిన పరిస్థితి!

స్క్రీన్ ప్లే సంగతులు ..

ముందుగా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటే ఏమిటో చూద్దాం...అప్పారావుకి సుబ్బారావ్ ఫోన్ చేసి, ఒరే నీతో అర్జెంటు పనుంది వస్తున్నా- అని వచ్చాడనుకుందాం. అలా వచ్చిన సుబ్బారావు వచ్చిన ఆ అర్జెంటు పనేంటో చెప్పకుండా గంటలతరబడి పిచ్చాపాటీ  మాట్లాడుతోంటే అప్పారావ్ కి ఎలావుంటుంది? ఓపిక నశిస్తుంది. సుబ్బారావు వచ్చిన పనేంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కూడా తగ్గుతుంది. అప్పుడు రెండు గంటలయ్యాక సుబ్బారావు చల్లగా ఓ యాభై కావాలన్నా డనుకుందాం- అప్పుడు అప్పారావ్ మానసిక స్థితి ఎలా వుంటుంది? యాభై రూపాయలు కావాలని చెప్పడానికి రెండు గంటలు నస పెడతాడా!

ఇదే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటే. పైన చెప్పుకున్నట్టు 2000 – 2002 మధ్యకాలంలో వేలంవెర్రి యూత్ సినిమాల కథన రీతులు చూసి మనం కాయిన్ చేసిన పదబంధం-మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. మనమే ఎందుకు కాయిన్ చేయాల్సి వచ్చిందంటే,  ఇలాటి వైపరీత్యం ప్రపంచంలో ఇంకే భాషా చిత్రాల్లోనూ కనపడదు కాబట్టి. అలాగని ఇదేమన్నా విప్లవాత్మక మార్పా అంటే అదేం కాదు, ఆత్మహత్యా సదృశ అజ్ఞానపు పోకడ అది. ఇలా వచ్చిన యూత్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి. దీన్ని బట్టే స్క్రీన్ ప్లే అంటే ఏ అవగాహనతో కొత్తకొత్త దర్శకులు వచ్చిపడుతున్నారో అప్పట్లో తెలిసిపోయింది.

స్క్రీన్ ప్లేలో వుండే  ఫస్ట్- సెకండ్- థర్డ్ యాక్ట్ లని సింపుల్ గా బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలని అనుకుంటే –
బిగినింగ్ లో ప్రధానపాత్రని, ఇతర ముఖ్య పాత్రల్నీ పరిచయం చేసి, కథ దేని గురించో చెప్పి, ఆ కథలో సృష్టించా లనుకుంటున్న సమస్య లేదా పాయింటుకి దారితీసే  పరిస్థితుల కల్పన చేస్తూ, ముగింపులో ఆ సమస్య లేదా పాయింటుని స్థాపిస్తారు. ఇది సుమారు అరగంట వుంటుందనుకుందాం.

ఇక్కడ్నించీ తర్వాతి విభాగం ‘మిడిల్’ లోపడుతుంది కథ. ఈ మిడిల్లో ప్రధాన పాత్ర ఆ సమస్య లేదా పాయింటుతో పోరాటం చేస్తుంది. ఆ సమస్య లేదా పాయింటుని ప్రత్యర్ధి పాత్ర సృష్టించ వచ్చు,లేదా ప్రతికూల పరిస్థితి ఏదైనా సృష్టించ వచ్చు. ఏదుంటే దాంతో ప్రధాన పాత్ర సంఘర్షిస్తూ ఉత్థాన పతనాలు చెందుతూ చివరికి ఈ మిడిల్ విభాగపు చివర్లో పరిష్కార మార్గాన్ని కనుగొంటుంది. దీని నిడివి గంట ఉండొచ్చు.

దీంతో కథ ఎండ్ విభాగంలో పడుతుంది. అంటే క్లైమాక్స్ ప్రారంభ మన్నమాట. ఇక్కడ ఆ ప్రధాన పాత్ర కనుగొన్న పరిష్కార మార్గం తో ఆ ప్రత్యర్థి పాత్ర, లేదా ప్రతికూల పరిస్థితి ఏదైతే అది దాని పీచమణచడం ప్రారంభించి విజయం సాధిస్తుంది. కథకి ముగింపు వాక్యం పలుకుతుంది. ఈ నిడివి అరగంట ఉండొచ్చు.


ఇదీ పదిలక్షల సినిమా కథకైనా, యాభైకోట్ల సినిమా కథ కైనా వుండే  యూనివర్సల్ స్క్రీన్ ప్లే నిర్మాణం. రెండు గంటల సినిమాకి బిగినింగ్ అరగంట వుంటే,  మిడిల్ రెండింతలు అంటే గంట వుంటుంది, ఎండ్ ఇంకో అరగంట. అంటే స్క్రీన్ ప్లేలో వీటి నిష్పత్తి 1:2:1 అన్నమాట. సీన్ల వారీగా చెప్పుకుంటే 20-40-20. ఏంచేసీ మిడిల్ సుదీర్ఘంగా సాగాలన్నమాట. కథంతా సంఘర్షణతో కూడి ఉత్కంఠ రేపుతూ మిడిల్లోనే వుంటుంది కాబట్టి.

కానీ 2000 – 2002 మధ్య కాలంలో యూత్ సినిమాలెలా వచ్చాయంటే, అరగంటలో బిగినింగ్ ముగియదు. అది గంటన్నర పాటు సాగుతుంది. అప్పుడు మిడిల్ వస్తుంది. ఆ మిడిల్, తర్వాత వచ్చే ఎండ్ ఆ చివరి అరగంటలోనే  సర్దుకుంటాయి. అంటే స్క్రీన్ ప్లేలో బిగినింగ్ ఒక్కటే మూడొంతుల స్థానాన్ని దురాక్రమించడ మన్నమాట. 3 : ½ : ½ అన్నమాట. అంటే మిడిల్ విభాగం పూర్తిగా మటాష్ అవడమన్నమాట! మిడిల్ విభాగమే మటాష్ అయితే ఇక కథేముంటుంది? అది పాయింటు కెప్పుడొస్తుంది?

గంటన్నర పాటూ బిగినింగ్ విభాగమే సాగుతూ కామెడీ-కామెడీ- కామెడీ గా ఉంటూ విషయం చెప్పకుండా వుంటే నస పెట్టడంగానే వుంటుంది.  పైన చెప్పుకున్న అప్పారావ్ –సుబ్బారావుల ఎపిసోడే.

గంటన్నర సినిమా నడిచిపోయాక అప్పుడా యూత్  సినిమాల్లో లవర్స్ మధ్య ప్రాబ్లం వస్తుంది. అది మిడిల్ అన్నమాట. పది  నిమిషాలే ఆ ప్రాబ్లంతో సంఘర్షణ వుంటుంది. అంతలోనే తేలిపోయి ఎండ్ లో పడుతుంది. చూపిస్తున్న సినిమాలో విషయమేంటో, ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి అంతసేపూ సహన పరీక్షన్న మాట. తీరా తెలుసుకుంటే అది అది ఆ చప్పున చల్లరిపోయే తాటాకు మంట మాత్రమే.


ఇదే ప్రస్తుత సినిమాలోనూ జరిగిన అనర్ధం. ఎలాగంటే, అసలు హీరోకి పోలీస్ కమిషనర్ తో వైరం ఎందుకొచ్చిందో, గతంలో ఏం జరిగిందో చెప్పడానికి దర్శకుడు క్లైమాక్స్ వరకూ సమయం తీసుకున్నాడు. అంటే ప్రారంభించిన బిగినింగే పాయింటు లేకుండా, మిడిల్ ని బుల్డొజ్ చేసుకుంటూ  క్లైమాక్స్ వరకూ సాగిందన్న మాట. ఎండ్ విభాగంలో ఫ్లాష్ బ్యాక్ వేసి అసలు విషయం చెప్పేసరికి ఆ ‘విషయం’ తో సంఘర్షణకి తావేలేక మిడిల్ విభాగమూ, ఎండ్ విభాగమూ పదిహేను నిమిషాలకి కుంచించుకు పోయి- సినిమా తేలిపోవడానికి ఆస్కారమిచ్చింది.

ఫ్యాక్షన్ సినిమాల్లో కూడా అసలు హీరోకి ఏం జరిగిందో చెప్పి పాయింటు ఎష్టాబ్లిష్ చేసేందుకు ఇంటర్వెల్ తర్వాత వెంటనే ఫ్లాష్ బ్యాక్ వేస్తారు. అంతకంటే ఆలస్యం చేయరు.

మిడిల్ మటాష్ అనే మిడిమేళపు స్క్రీన్ ప్లేలో చెప్పాలనుకున్న విషయం ముగింపుకి జారిపోతుంది. అసలే సినిమాలోనూ క్లైమాక్స్ లో ఫ్లాష్ బ్యాక్ వేయడమే జరగదు. అక్కడ ప్రేక్షకులు భరించలేరు కాబట్టి.
ఈ లోపం గుర్తించి వుంటే ఈ సినిమా కథ మరింత బలంగా వుండేది.

దీన్ని పక్కనపెడితే, సినిమా విషయంలేకుండానే ఎందుకు కూర్చోబెడుతోందని చూస్తే- ఇందుకు సీన్ రివర్సల్స్  టెక్నిక్ ని వాడడమే కారణంగా కన్పిస్తుంది. ప్రతీ సీనూ ఒకలా ప్రారంభమై అందుకు వ్యతిరేకమైన రిజల్టుతో ముగియడమనే సీన్ రివర్సల్స్ టెక్నిక్ తో స్పీడుగా సాగకపోయుంటే,   ఈ సినిమా దీనికున్న విషయపరమైన లోపంతో కుప్పకూలేది.

వికలాంగుడికి కూడా దేవుడు ఇంకేదో ఇంద్రియ శక్తినిస్తాడు.

-సికిందర్