రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, జనవరి 2021, శనివారం

1007 : రివ్యూ

ఒరు పక్క కథై (తమిళం) 
రచన - దర్శకత్వం : బాలాజీ తరణీ తరన్ 
తారాగణం : కాళీదాస్ జయరాం, మేఘా ఆకాష్, చంద్రమౌళి, జీవా రవి 
సంగీతం : గోవింద్ వసంత్,  ఛాయాగ్రహణం : సి. ప్రేమ్ కుమార్ 
నిర్మాణం : వాసన్ న విజువల్ వెంచర్స్ 
విడుదల : జీ 5

***
    మిళ దర్శకుడు బాలాజీ తరణీ తరన్ విచిత్ర కథలు తీసుకుంటాడు. 2012 లో విజయ్ సేతుపతి క్రికెట్ బంతి తగిలి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కి లోనయ్యే నడువల కొంజమ్ పక్కత కానోమ్ కథ, 2018 లో విజయ్ సేతుపతి ఆత్మ స్టేజి నటుల్నిఆవహించే సీతకతి కథ, 2020 లో కన్యగానే వుండి మేఘా ఆకాశ్ గర్భవతయ్యే ఒరు పక్క కథై. చివరిది 2014 లో విడుదల కావాల్సింది. బిజినెస్ అవక ఆగిపోయింది. ఇప్పుడు ఓటీటీ పుణ్యమాని జీ5 లో విడుదలయ్యింది. ఆరేళ్ళ తర్వాత కథకి తీసుకున్న పాయింటు, మేకింగ్ అన్నీ తాజాగా వున్నాయి. మరి 2014 లో విడుదల ఎందుకు కాలేదన్నదానికి కారణాలు ఈ కింద వెతుకుదాం...

కథ
శరవణన్ (కాళీదాస్ జయరాం), మీరా (మేఘా ఆకాష్) కాలేజీ స్టూడెంట్స్. సౌమ్యంగా  వుండే మధ్యతరగతి కుటుంబాలు. ఇద్దరి ఇళ్ళల్లో ఇద్దరి ప్రేమకి ఆమోదం వుంటుంది. మీరాకి ఒక సమస్య ఎదురవవుతుంది. నెలసరి అవదు. రెండు రోజులు, నాల్గు రోజులు, ఆరు రోజులు దాటినా అవదు. తల్లికి చెబుతూంటుంది. తల్లికేమీ అర్ధంగాదు. డాక్టర్ దగ్గరికి తీసికెళ్తుంది. డాక్టర్ పరీక్షించి గర్భవతని చెప్తుంది. షాక్ తింటారు తల్లిదండ్రులు. మీరా తండ్రి శరవణన్ ని ఇంటికి పిలిపిస్తాడు. విషయం చెప్పకుండా శరవణన్ ని నమ్మక ద్రోహిలా సీరియస్ గా చూస్తూంటారు మీరా తల్లిదండ్రులు. ఎందుకు సీరియస్ గా చూస్తున్నారో అర్ధంగాదు శరవణన్ కి. అప్పుడు చెప్తాడు తండ్రి. షాక్ తింటాడు శరవణన్. గదిలో కెళ్ళి మీరాని చూస్తాడు. మనం ఏమీ చేయకుండానే ఇదెలా జరిగిందని అడుగుతాడు. అదే నాకూ అర్ధం గావడం లేదంటుంది. ఇక మీరా తల్లిదండ్రులు శరవణన్ తల్లిదండ్రులతో పెళ్లి చేసేద్దామంటారు. కొంత తర్జన భర్జన తర్వాత పెళ్లి ఖాయం చేసుకుంటారు. అసలు జరిగింది నిజమేనా అని శరవణన్, మీరాని ఇద్దరు డాక్టర్లకి చూపించినా గర్భమేనని చెప్తారు. అప్పుడు డాక్టర్ తో తను వర్జిన్ నే నని  మీరా అనేసరికి, డాక్టర్ కంగుతిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి పంపిస్తుంది. అక్కడ డాక్టర్ల బృందం పరీక్షించి, మీరా కన్యగానే గర్భం ధరించిందని తేలుస్తారు. ఇదెలా జరిగిందనే ప్రశ్నకి జవాబు మిగతా ఒరు పక్క కథై -ఒక పేజీ కథలో చూడొచ్చు... 

ఎలా నటించారు

      కాళీదాస్ జయరాం, మేఘా ఆకాష్ ఇద్దరూ ఫ్రెష్ గా కన్పిస్తారు. మంచి ఎక్స్ ప్రెషన్స్ చూపిస్తారు. ఇద్దరి తల్లిదండ్రుల పాత్రల్లో నటీనటులు కూడా నీటుగా వుంటారు. మెలోడ్రామాలు, ఏడ్పులు, దూషణలు లేని సున్నిత పాత్రలు. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులున్నారు. వీళ్ళు తప్ప ఇంకెవరూ వినోదాన్ని పంచరు. సీరియస్ పాత్రలు. సీరియస్ మూడ్ లో సన్నివేశాలు. నటనలు బావున్నా పాత్ర చిత్రణలు బలహీనం.

సాంకేతికంగా చిత్రీకరణ బావుంది. చెన్నైలో చిత్రీకరణ. హేండ్ హెల్డ్ సింగిల్ షాట్ సీన్లు, పాత్రల సమన్వయంతో పుల్ బ్యాక్ షాట్లు గమనించ దగ్గవి. ఏ ఇల్లు చూపించినా పింక్ కలర్ వేశారు. కానీ పింక్ బ్యాక్ గ్రౌండ్ చూపించడాని కిది రోమాంటిక్ డ్రామా కాదు, పూర్తిగా రోమాంటిక్ డ్రామా కూడా కాదు. సెకండాఫ్ లో రెండు మాంటేజీ పాటలున్నాయి. మేకింగ్ బావుంది, కథకి మేకప్ బాగాలేదు.

ఎలావుంది కథ
     వర్జిన్ బర్త్ ఐడియా తీసుకున్నాడు దర్శకుడు. కొన్ని రకాల చేపల్లో, ఉభయ చరాల్లో, సరీసృపాల్లో, పక్షుల్లో, క్షీరదాలు కాని అన్ని ప్రధాన సకశేరుకాల్లో ఈ దృష్టాంతం వుంటుందని వివరిస్తాడు. పురుష కణం అవసరం లేకుండానే స్త్రీ అండం దానికదే పొదుగుకుని సంతానోత్పత్తి చేసుకునే ప్రక్రియ. దీనికి కొంత సైన్సుని వివరిస్తాడు డాక్టర్ పాత్రల చేత. పార్థెనో జెనెసిస్ ఈ ప్రక్రియ పేరు. పురుష కణాల్లో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోము లుంటాయి. స్త్రీ కణాల్లో రెండూ ఎక్స్ క్రోమోజోములే వుంటాయి. లైంగిక సంపర్కం ద్వారా పురుష క్రోమోజోముల్లో ఎక్స్ క్రోమోజోము స్త్రీ క్రోమోజోములతో కలిస్తే ఆడ పిల్ల పుడుతుంది, వై క్రోమోజోము కలిస్తే మగ పిల్లాడు పుడతాడు. ఇలాకాక లైంగిక సంపర్కం లేకుండానే స్త్రీ అండం దాని కదే పొదుగుకుని గర్భానికి దారితీయొచ్చు. దీన్నే పార్థెనో జెనెసిస్ అంటారు. మనుషుల విషయాని కొస్తే ఇది కన్యలో జరిగితే, కన్నెగా వుండగానే గర్భవతవుతుంది. ఈ రెండో వూహే కథగా చేశాడు దర్శకుడు.

తర్వాత దీన్ని మతాచార్యుల పాత్రల చేత చెప్పిస్తాడు. ఏసు క్రీస్తుకి జన్మనిచ్చిన కన్నె మేరీ మాత గురించి. కర్ణుడ్నీ, పాండవుల్నీ కన్న కుంతీ దేవి గురించీ. ఇలా తండ్రి లేకుండా పుట్టిన బిడ్డ దేవుడి బిడ్డవుతుందని చెప్తారు. మానవ జాతిలో ఇలాటి ఒక కేసు 1950 లో ఇంగ్లాండులో జరిగిందనీ, ఆడ పిల్ల పుట్టిందనీ డాక్టర్ల చేత చెప్పిస్తాడు దర్శకుడు. ఈ ఉదాహరణే తీసుకుని కథ చేశాడు. 

అయితే పార్థెనో జెనెసిస్ గురించి గూగుల్ చేస్తే, మరికొన్ని విషయాలు తెలుస్తాయి. 1950 లో ఇంగ్లాండు డాక్టర్లు ఈ అనుమానమున్న స్త్రీలు రిపోర్టు చేయాలని ఆహ్వానిస్తే, 19  మంది వివాహితలు ముందు కొచ్చి, తమకి పుట్టిన ఆడపిల్లలు పార్థెనో జెనెసిస్ ద్వారా జన్మించి వుంటారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే వివాహితల్లో దీన్ని డాక్టర్లు నిర్ధారించడం సాధ్యపడలేదు. భర్తల ద్వారా కూడా ఆడపిల్లలు జన్మించి వుండొచ్చు. కన్యల్లో జరిగితే పార్థెనో జెనెసిస్ ని కచ్చితంగా నిర్ధారించవచ్చు. రిపోర్టు చేసిన వాళ్ళల్లో ఒక్క మిసెస్ ఆల్ఫా అనే వివాహిత విషయంలో సాధ్యమై వుండొచ్చని అభిప్రాయపడ్డారు. స్త్రీలలో స్వయంగా అండ ఫలదీకరణ జరిగి పుట్టే ఆడపిల్లకి తల్లి జీన్స్ తప్ప, తండ్రి జీన్స్ వుండవు. పోలికలు కూడా తల్లితో కలవవు. ఈవిడ కేసునే దర్శకుడు పేరు చెప్పకుండా ఉదాహరణగా చెప్పి వుండొచ్చు. అయితే దర్శకుడి కథలోలాగా కన్యల్లో జరిగిన కేసులు ఇప్పటికీ లేవు. 

కన్యలో పార్థెనో జెనెసిస్ జరిగితే ఆడపిల్లే పుడుతుంది. కారణం పురుష సంపర్కం లేదు కాబట్టి. పురుష సంపర్కముంటేనే, వై క్రోమోజోము కలిస్తేనే మగ పిల్లాడు పుడతాడు. దర్శకుడు చెప్పిన కన్నె మేరీ మాతకీ, కుంతి కీ మగ పిల్లలే పుట్టారు. ఇది పార్థెనో జెనెసిస్సా? కాదు. సైన్సు కంటే ముందు, సైన్సు నోరెత్తకుండా మతాలు ఎంత పకడ్బందీగా లాజిక్ చేసేశాయో గమనించ వచ్చు. మేరీ మాతకీ, కుంతికీ ఆడ సంతానమే కలిగి వుంటే, అది పార్థెనో జెనెసిస్ అని తేల్చేసేది సైన్సు. పార్థెనో జెనెసిస్ అనే అవకాశం లేకుండా, ఇద్దరికీ మగ పిల్లలు జన్మించడంతో అవి దైవ ఘటనలయ్యాయి. 

    దర్శకుడు 1950 కేసు ఉదాహరణ తీసుకుని తయారుచేసుకున్న కన్నె హీరోయిన్ పాత్రకి ఆడపిల్లనే కల్పించాడు. కాబట్టి దీన్ని దైవ ఘటనగా  కాక, పార్థెనో జెనెసిస్ గానే చూడాలి. కానీ తద్విరుద్ధంగా మతాచార్యుల చేత దీన్ని దైవ ఘటనగా చేసి, పుట్టిన ఆడ పిల్లని దేవుడి బిడ్డగా, బాల దేవతగా చేసి, మొత్తం మత భక్తి కథ చేసేశాడు. ఇలా పార్థెనో జెనెసిస్ గురించి ప్రేక్షకులకి తప్పుడు సమాచార మిచ్చినట్టయ్యింది.

***

    పార్థెనో జెనెసిస్ వివాహితల్లో తెలియకుండానే జరగవచ్చు. ఆడపిల్లలే పుడుతూ పోవచ్చు. అయితే పైన పేర్కొన్న 1950 లో జరిగిన కేసు తప్ప ఇంకోటి లేదు. 1995లో  ఇంగ్లాండు లోనే మూడేళ్ళ బాలుడిలో తండ్రి జీన్స్ లేవు. ఇది దైవ ఘటనేనా అనుకుని డాక్టర్లు కంగారు పడి పరీక్షలు జరిపితే, అతడి రక్తంలో వై క్రోముజోము లేదు. ఆడపిల్లలకున్నట్టు రెండూ ఎక్స్ క్రోమోజోములే వున్నాయి. అంటే పార్థెనో జెనెసిస్ ద్వారా జన్మించాడా? ఎలా సాధ్యం? అప్పుడు తెలిసింది : ముందు తల్లి అండం దానికదే పొదుగుకోవడం జరుగుతూంటే, తండ్రి వీర్య కణం వచ్చేసి ఆ ఫలదీకరణ ప్రక్రియని కొనసాగిస్తూ, ఆ క్రోమోజోముల సంక్షోభంలో పాసివ్ పాత్ర వహించడం జరిగిందని. అంటే ఇలా పుడితే ఇది కూడా పురుష సంపర్కం వల్లే జరుగుతుందన్న మాట. కనుక ఆ బాలుడు దేవుడి బిడ్డ అయ్యే అవకాశం లేదు. దేవుడు పంపిన అవతార పురుషుడవడు. ఇలా చూసినా కూడా మేరీ మాత, కుంతీ దేవీల దైవ ఘటనలు సేఫ్ అయిపోతాయి. 

    చివరగా, 1950 లో మిసెస్ ఆల్ఫా కేసులో పుట్టిన కూతురు కూడా తల్లిలాగే పార్థెనో జెనెసిస్ ద్వారా కూతుళ్లని కని వుండొచ్చనీ, ఆధునిక డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా దీన్ని నిర్ధారించవచ్చనీ డాక్టర్లు అంటున్నారు. ఇక్కడే సినిమా కథలో హీరోయిన్ పాత్రకి పుట్టిన కూతురి భావి జీవితం ప్రభావితమవొచ్చు. ఆమె పెళ్లి ఒక సమస్యగా మారవచ్చు. ఈ కథలో ఇంత విషయముంది, డ్రామా వుంది. కానీ మతం దగ్గరే కుదించడంతో కథ దాని సహజ వికాసం పొందకుండా పోయింది.

***

    ఈ సరికొత్త సైన్స్ ఫిక్షన్ కాగల కథని, మతాచార్యుల తప్పుడు భాష్యాలతో మత విశ్వాసాల చట్రంలో బిగించేసి, భక్తి సినిమా చూపించాడు దర్శకుడు. కన్నె హీరోయిన్ పాత్రకి పుట్టిన పిల్లని, మతాచార్యులు బాల దేవతగా ప్రకటించి, ఆలయంలో పెట్టేసుకోవడం, ఈ సంచలన వార్తకి-  భక్తజన సందోహం దర్శనాలకి తరలిరావడం, చిన్నారి కూతుర్ని విడిపించు కోవడానికి హీరో హీరోయిన్లూ, వాళ్ళ తల్లిదండ్రులూ కోర్టు కెక్కడం వగైరా. 

కోర్టు కూడా దీన్నొక వైద్య దృష్టాంతంగా చూడదు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా మతాచార్యులు బిడ్డని తీసికెళ్ళడం నేరమని
, మతాచార్యుల మీద విచారణ వేయాలని, బిడ్డ తానేం అవ్వాలో మైనారిటీ తీరాక నిర్ణయించుకుంటుందనీ తీర్పు చెప్తుంది. గాయపడ్డ బిడ్డకి రక్తదానం చేసిన వాళ్ళల్లో అన్నీ మతాల వాళ్ళూ వున్నారనీ, ఇప్పుడు బిడ్డని ఏ మత దైవంగా కొలుస్తారనీ ప్రశ్నిస్తుంది.
    
పార్థెనో జెనెసిస్ కేసే అరుదైన కేసుల్లో కెల్లా అరుదైన కేసవుతుంది. ప్రపంచ శాస్త్ర వేత్తల దృష్టిలో పడితే వాళ్ళకి బోలెడు పని కల్పిస్తుంది. దర్శకుడు ఎస్ శంకర్ కి ఈ కథ ఆలోచన వచ్చివుంటే, దీన్నొక సైన్స్ ఫిక్షన్ హై కాన్సెప్ట్ యాక్షన్ మూవీ చేసేవాడు. ఇలా పుట్టిన కూతుర్నే హీరోయిన్ గా చేసి, ఆమెకి వినూత్న ప్రత్యేకతలు కల్పించి హల్చల్ చేయించే వాడు. 

స్క్రీన్ ప్లే మాట  

   కథనం డాక్యుమెంటరీలా వుంది. ప్రధాన పాత్ర లేదు. రెండు కుటుంబాల్లో అన్ని పాత్రలకీ కలిపి కుటుంబ సమస్య. సమస్యతో ఆందోళనే తప్ప సంఘర్షణ లేదు. చట్టం పూనుకుని పరిష్కరిస్తే సుఖాంతం. సినిమా అన్నాక కథ అయి వుండాలి. ఇది నిర్మాతకి పదహారణాల వైట్ ఎలిఫెంట్ లాంటి గాథయింది. జానర్ ఫస్టాఫ్ రోమాంటిక్ డ్రామాలా వుంటుంది. సెకండాఫ్ స్పిరిచ్యువల్ జానరై పోతుంది. ఇంటర్వెల్ కే కథ అయిపోయి సెకండాఫ్ కి మరో కథ ఎత్తుకుంటుంది. ఇలా సెకండాఫ్ సిండ్రోమ్ ప్రాబ్లం కూడా. దీనికి కమర్షియల్ సినిమా వ్యాపార విలువలు లేవు. చలన చిత్రోత్సవాల్లో పాల్గొని అవార్డులు పొందే సమాంతర సినిమా విలువలు కూడా లేవు. జరిగిన ఒక విచిత్రానికి మత విశ్వాసాల కథ చేసినప్పుడిది మరో భక్తి సినిమా టెంప్లెట్ అయిపోయింది. తమిళనాట మూఢ భక్తిని సొమ్ముచేసుకునే మార్కెట్ యాస్పెక్ట్ కావచ్చు. ఇది కూడా విఫలమైంది. కొత్త హీరో హీరోయిన్ల తొలి సినిమా కలలు ములయార్ నదిలో ఆరేళ్లు మునక లేశాయి. 
    
విచిత్రాలు జరిగినప్పుడు అవి  సైన్సుకి పరిశోధనాంశాలు కాకుండా, మతానికి ఆరాధ్య అంశాలైనప్పుడు సృష్టి రహస్యాలు బయటపడవు, విచిత్ర కథలు కొత్త సంగతులు చెప్పవు. మానవాళి ఎక్కడేసిన గొంగళిలా సోమరిగా పడుంటుంది. ఈ కథలో జడ్జి ఒక మంచి మాట చెప్తాడు : మత విశ్వాసాలు వేరు, మూఢ విశ్వాసాలు వేరు. ఇది దర్శకుడికే చెప్పినట్టుంది. తను మూఢుడు కాదన్పించు కోవడానికి ఒక సబ్ ప్లాట్ వేసి సేఫ్ అయిపోయాడు దర్శకుడు. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులతో మూఢ నమ్మకాల మీద వేసిన సెటైర్లు మాత్రం చాలా ఫన్నీగా వున్నాయి. బాగానే నవ్వు తెప్పిస్తాయి.

                                                                            ***

     దీని సైన్స్ ఫిక్షన్ స్వభావాన్ని కాసేపు పక్కన బెట్టి, ప్రేమ కథ గానే చూద్దాం. శరవణన్, మీరాలు ఆల్రెడీ ప్రేమలో వుండి ఇద్దరి కుటుంబాల్లో ఆమోదం వుంటుంది. ఇలా పాత్రల పరిచయం, నేపథ్యం ఏర్పాటయి పోయింది. ఇక సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కావాలి. దీనికి మీరా నెలసరి పాయింటు వుంటుంది. ఇది రెండు రోజులు, నాల్గు రోజులు, ఆరు రోజులకి చేరి, వైద్య పరీక్షకి దారి తీసి, గర్భవతని తేలడంతో సమస్య ఏర్పాటవుతుంది. ఇది సమస్యా అంటే కాదు. సమస్య కన్యాత్వంతో గర్భం ధరించడం గురించి. కథ దీని గురించి. ప్రశ్నలు దీని గురించి. దీన్ని ముందుకు తీసుకు రాక పోవడంతో మొదటి మలుపు అర్ధరహితమై పోయింది. 
   
ఈ మొదటి మలుపుకి రావడానికి నెలసరి సమస్యని పదేపదే ప్రస్తావించడంతో
, మొదటి మలుపు దేనిగురించి రాబోతోందో తెలిసిపోయేలా అయింది. నెలసరి రావడం లేదంటే గర్భం ధరించి వుంటుందని. ఇది నిజమైతే శరవణన్ కారణమై వుంటాడని. నెలసరి రాకపోవడానికి గర్భమే కారణం కాకపోతే, మెనోపాజ్ వచ్చేసి వుంటుందని. విశృంఖల జీవన శైలులతో పాతిక ముప్ఫై ఏళ్లకే ముట్లుడిగి మూలనబడుతున్న అమ్మాయిలున్నారు దేశంలో. మీరాది విశృంఖల జీవితం కాదు. కనుక శరవణన్ మీద ఫోకస్ అవుతోంది. ఇలా తర్వాత కథ కవసర పడని విషయాలతో మన మెదడు నిండిపోతుంది మొదటి ఇరవై ఐదు నిమిషాలూ. పనికిరాని విషయాలతో ప్రేక్షకుల మెదడు నింప నవసరం లేదు.

    ఈ మొదటి మలుపు (ప్లాట్ పాయింట్ 1) ఇరవై ఐదు నిమిషాల్లోనే వస్తుంది, మంచిదే. అయితే నెలసరి రాని విషయం గురించి అన్నిసార్లు చెప్పకుండా, పది రోజులైనా రావడం లేదని ఒకే సారి రివీల్ చేసి - వెంటనే వైద్య పరీక్షలో గర్భమని చెప్పేస్తే - ఆ వెంటనే వర్జినే అని కూడా తేల్చేస్తే  -ఒక ఫ్లాష్ లో ఇది మొదటి మలుపుకి షాక్ వేల్యూతో వుండేది.

    వర్జిన్ గా గర్భమని అసలు పాయింటు చెప్పకుండా, కేవలం గర్భమని చెప్పడంతో అసలు సమస్య ఏర్పాటు కాలేదు. ఈ సమస్యని కూడా ఎదుర్కొనే ప్రధాన పాత్ర శరవణన్, మీరా ఇద్దరూ కాకుండా, వాళ్ళ తల్లిదండ్రులు కావడంతో, ఇది హీరో హీరోయిన్లు తమ సమస్యని తామెదుర్కో లేని, సంఘర్షించలేని, పరిష్కరించుకో లేని రోమాంటిక్ డ్రామా అయింది. రోమాంటిక్ డ్రామాలు హీరో హీరోయిన్ల స్వశక్తీకరణ చూపని బేలతనపు వ్యక్తీకరణలు. తర్వాత తల్లిదండ్రులు కూడా సమస్యతో సంఘర్షించక బాధలు పడే వరసగా మారడంతో, రోమాంటిక్ డ్రామా కాస్తా సినిమాకి పనికి రాని అగాథపు గాథయి పోయింది. ఈ గాథ కూడా సైన్సు పాఠాలతో డాక్యుమెంటరీలా వుంది.

    ఇక్కడొక ప్రధాన ప్రశ్న వస్తుంది. శరవణన్, మీరాలు శారీరకంగా కలవనప్పుడు, ఈ విషయం చెప్పుకుని ఎందుకు ఆ గర్భాన్ని ప్రశ్నించరు? మొదటి మలుపు సమస్య దీని మీదే వుండాలి. ఇదే కథాంశం కాబట్టి, పరిష్కరించాల్సిన పజిల్ కాబట్టి. నేను వర్జిన్ ని, ఈ ప్రెగ్నెన్సీ నాకార్ధం గావడం లేదని అనదు, నిందని తొలగించుకోవడానికి ఎదురు తిరగదు. తన క్యారక్టర్ ని కాపాడు కోవాలనుకోదు. కాలుజారి తప్పు చేసిన దానల్లే పెళ్ళికి రాజీపడి పోతుంది.

***

    పెళ్లి ఆలోచనకి ముందు అబార్షన్ చేయించాలనుకుంటారు. అప్పుడు అసలే బలహీనంగా వున్న మీరాకి అబార్షన్ వల్ల సమస్యలొస్తాయని డాక్టర్ అంటాడు. కానీ మీరాని చూస్తే బలంగా, గ్లామరస్ గా వుంటుంది. అసలు వర్జిన్ గర్భమని తేల్చేస్తే ఈ అబార్షన్ ప్రశ్న వచ్చేది కాదు. ఇదొక అనవసర ఫీడింగ్ ప్రేక్షకులకి. ఈ సీను కూడా బడ్జెట్ దండగ. తీసుకున్న ఐడియాకి చేసిన కథనమంతా బడ్జెట్ దండగ క్రియేటివ్ యాస్పెక్ట్. ఇందుకే బయ్యర్లు దండించారేమో. 
    
శరవణన్ కూడా తనతో శారీరక సంబంధం లేకుండా గర్భమెలా వచ్చిందని అనుమానించడు. ఆమెని అంత బలంగా నమ్ముతున్నాడనే అనుకున్నా కూడా, ఈ గర్భం ఒక పజిలే. ఆమెని గర్భం నిజమా కాదా నిర్ధారించుకోవడానికి డాక్టర్ల దగ్గర తిప్పుతాడే గానీ, చెప్పాల్సిన మాట చెప్పడు- షీ ఈజ్ వర్జిన్ అని. ఇదంతా కథ లేదనుకుని ఇంటర్వెల్ దాకా సాగదీయడానికి చేసిన ప్రయత్నం. ఇంటర్వెల్ కి ముందు చివరికి చెప్పాల్సిన మాట చెప్తుంది డాక్టర్ కి. మొదటి మలుపులో చెప్పాల్సిన మాట ఇంటర్వెల్ కి చెప్పడంతో ఇంత సేపూ నసతో నత్తనడక. ఈ స్టూడెంట్ పాత్రల క్యారక్టరైజేషన్ ఇలావుంది. 
    
మళ్ళీ నస ఏమిటంటే, వర్జిన్ అంటున్న మీరాని లేడీ డాక్టర్ ఒక నిమిషంలో వర్జినా కాదా తెలుసుకోవచ్చు. దీనికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రమ్మంటుంది. అక్కడ మీరా వున్న గదిలోకి డాక్టర్లు పోతూంటారు. తడవకి ఇద్దరు, ముగ్గురు చొప్పున సీరియస్ గా మొహాలు పెట్టుకుని, ఏదో జరిగి పోతోందన్నట్టు పదిమంది దాకా  పోతారు. వర్జిన్ టెస్టుకి ఇంత మంది డాక్టర్లా? ఆమెని వుంచుతారో, డాక్టర్లు కొట్లాడుకుని చంపేస్తారో?

***

    మొత్తానికి ఆమె వర్జిన్ మదర్ అని తేల్చాక, పార్థెనో జెనిక్ బిడ్డ పుట్టాక, సెకండాఫ్ మతం హైజాక్ చేస్తుంది పైన చెప్పుకున్నట్టుగా. దీంతో ప్రేమ కథ కూడా లేకుండా పోయింది. ప్రేమ కథతో చాలా ప్రశ్నలున్నాయి. వీటిని ఎదుర్కోకుండా ప్రేమికుల జీవితం లేదు. ఐదేళ్ల కథాకాలం గడిచి కూతురు దర్శినికి ఐదేళ్లు వచ్చేటప్పటికి, ఆలయ పూజార్లు తీసికెళ్లి ఆలయంలో దర్శనీయం చేస్తారు. ఈ లోగా శరవణన్, మీరాల చదువులేమయ్యాయో, ఉద్యోగాలేమయ్యాయో తెలీదు. ఎలావున్న క్యారక్టర్లు అలాగే వుంటాయి తల్లిదండ్రుల మీద ఆధారపడి. 
    
ఇదలా వుంచితే, కథ సంధించే ప్రశ్నల జోలికి కూడా పోలేదు. పార్థెనో జెనిక్ కూతురితో శరవణన్, మీరాల జీవితమెలా వుంటుంది? దర్శినికి మీరా తల్లేగానీ, శరవణన్ తండ్రి కాదు. పోనీ రెండో కాన్పుకైనా తండ్రి అన్పించుకుంటాడా అంటే అదీ నమ్మకం లేదు. రెండోసారి గర్భం కూడా పార్థెనో జెనెసిస్ అవదని చెప్పలేరు. ఇలా ఆమెకి పుట్టే ఆమె ఒకత్తి పిల్లలు పుట్టింటికి వంశాంకు రాలవుతారే తప్ప, మెట్టినింటికి కాదు. చాలా విచిత్ర పరిస్థితి. దీన్ని అత్తామామలెలా చూస్తారు? కోడలిగా ఒప్పుకుంటారా? ఎవరికైనా ఆమె కోడలు కాగలదా? తండ్రి కాలేని శరవణన్ ఎంతకాలం వుంటాడు? గిల్టీ ఫీలింగ్ మీరాని కూడా బాధించదా? రేపు పుట్టిన ఆడపిల్లల పరిస్థితి కూడా ఏమిటి? సమాజమెలా చూస్తుంది? గర్భాశయం తొలగించుకుంటే సమస్యలు తీరతాయా? ప్రేమ కోసం ఈ త్యాగాలు చేస్తారా? కలిసి వుంటారా, విడిపోతారా? పార్థెనో జెనెసిస్ వరమా, శిక్షా? పేజీ నిండా ప్రశ్నలు. కథకి చాలా పేజీలు కావాలి.

 సికిందర్