రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!






రచన- దర్శకత్వం : జి. నాగ కోటేశ్వర రావు

తారాగణం : రోషన్, శ్రియ శర్మ, నాగార్జున, ఎల్బీ శ్రీరాం, తాగుబోతు రమేష్,  రోషన్ కనకాల తదితరులు
సంగీతం: రోషన్ సాలూరి,  ఛాయాగ్రహణం : ఎస్వీ విశ్వేశ్వర్
బ్యానర్ : అన్నపూర్ణా స్టూడియోస్, మాట్రిక్స్ టీమ్ వర్క్స్
నిర్మాతలు : నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్
విడుదల : 16 సెప్టెంబర్, 2016
  
***

హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ని టీనేజి హీరోగా పరిచయం చేస్తూ అక్కినేని నాగార్జున- నిమ్మగడ్డ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ అనే ఈ కొత్త సినిమాలో  రోషన్ పేరుతో ఇంకో ఇద్దరు పరిచయమయ్యారు- సంగీతదర్శకుడు కోటి కుమారుడు సాలూరు రోషన్ సంగీత దర్శకుడిగా, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల ఓ సహాయ పాత్రగా. ఇంతమంది రోషన్ లు ఒకేసారి ఏదో సాధిద్దామని తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చేశారు.  అంతే కాదు నేనున్నానంటూ ఏఆర్  రెహమాన్  పుత్రరత్నం  అమీన్ కూడా గానం చేస్తూ తెలుగు శ్రోతలకి పరిచయమయ్యాడు. ఈ నవ తరపు ప్రతినిధుల పేర్లు వింటేనే, అందులోనూ ‘నిర్మలా కాన్వెంట్’  అనే సింపుల్ టైటిల్ చూస్తేనే,  ఇదెంతో ఫ్రెష్ ఫీల్ తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అయ్యుంటుందని మనబోటి అమాయకులకి అన్పిస్తుంది. తీరా వెళ్లి చూస్తే ఏమనిపిస్తుందో ఈ కింద చూద్దాం...

కథ!
      అనగనగా ఎస్. కోట దగ్గర ఓ భూపతి నగరంలో ఓ భూపతి రాజు గారి పట్టుమని పదహారేళ్ళ శాంతి (శ్రియా శర్మ) అనే కాన్వెంట్ స్కూలు బాలిక  నిశిరాత్రి వేళ విరహం తాళలేక, పిన్నికి చెప్పుకుని  స్నానం గట్రా చేసేసి, ప్రబంధనాయికలా ముస్తాబై, అభిసారికలా తన కలల రాకుమారుడి (రోషన్) రాక కోసం నిట్టూర్పులతో  శృంగారభరితంగా ఎదురు చూస్తూ ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటుంది- తన బాలికోన్మత్త  ప్రణయ కావ్యం పూర్తిగా అర్ధమవ్వాలంటే మూడు తరాల వెనకనుంచీ చూసుకుంటూ రావాలట. తన తాతగారికి 99 ఎకరాల పొలముంది (ఇంతేనా! దీనికే రాజుగారూ ఆయనకో  రాజకోట లాంటి అంత పేద్ద భవనమా? ). ఈ 99 ఎకరాలకి నీరు పారాలంటే పైనున్న ఒక్క ఎకరం మీదుగా పారాలి. ఆ ఎకరం ఆసామి దళిత ఈరిగాడు (ఎల్బీ శ్రీరామ్) ఇందు కొప్పుకోడు. దీంతో కసక్ మని రాజుగారు జాతరలో  పొడిపిస్తే,  జివ్వు మని రక్తం చిమ్ముకుని  చచ్చిపోతాడు ఈరిగాడు.  చచ్చిపోతూ ఆ ఎకరం భూమీ  కొడుకు (సూర్య) చేతిలో పెట్టి అమ్మవద్దంటూ మాట తీసుకుంటాడు. రాజుగారి మీద తెగ కోపంతో ఈరిగాడి కొడుకు ఏకంగా మతమే మారిపోయి- డేవిడ్ గా అవతరిస్తాడు. ఆ ఎకరం సాగు చేస్తూ, చెప్పులు కుట్టుకుంటూ కొడుకు సామేల్ అలియాస్ సామ్ (రోషనే) ని కాన్వెంట్ స్కూల్లో చదివిస్తూంటాడు. ఇదే కాన్వెంట్ స్కూల్లో చదువుతున్న శాంతి, సామ్ ని పడేస్తానని పిల్ల మూకతో బెట్ కడుతుంది. స్కూల్ యూనిఫాంలో తిరిగే పిల్లవాడు సామ్ తనేం తీసిపోకుండా ఆమెకి ‘లవ్ లాంగ్వేజ్’ నేర్పుతానంటూ వెంటపడతాడు. సామ్ తోటి పిల్లలు కిలకిలా నవ్వుతూ సామ్ వెంట పోకిరోళ్ళ లా తిరుగుతూంటారు.

    లవ్ లాంగ్వేజ్  తర్వాత,  పిల్లవాడు సామ్ ఏ కిస్సు ఎక్కడ పెడితే దానికేం పేరుంటుందో అద్భుతమైన  కవిత్వ భాషలో వర్ణించి పాడుతూ శాంతికి వొళ్ళంతా మైకం తెప్పిస్తాడు. ఈ ముద్దుల తర్వాత వీడు ఇంకేం  నేర్పిస్తాడోనని ఒక తోటి పిల్ల కామెంట్ చేస్తే, నేనే వాడికి లైన్ వేసుకుంటా నని ఇంకో పోకిరీ స్కూలు పిల్ల పళ్లికిలిస్తుంది!

    ఈ మొత్తానికీ ఓ పిల్ల విలన్ ఉంటాడు- వీడు నేటికాలపు పిల్ల విలనే అయినా పాతకాలపు విలన్ లా,  లవ్ బర్డ్స్  అయిన సామేల్ - శాంతి ల ప్రేమ ఫోటోలు తీసి శాంతి తండ్రికి పంపించేసి చేతులు దులుపుకుంటాడు. అంతేగానీ  నేటికాలపు విలన్ లా ఆ ఫోటోలతో ఆ పిల్లనే  బ్లాక్ మెయిల్ చేసి లొంగ దీసుకోవాలనుకోడు! ఆ ఫోటోలు చూసి ఆ పిల్ల తండ్రి తనివిదీరా ఆమెకి దేహశుద్ధి చేసి స్కూలు మాన్పించేస్తాడు. అదిక కుయ్యోమంటూ ఇంట్లో పడుంటుంది చదువుమానేసి! ఈమె కున్న పిన్ని గారైతే ఎప్పుడో ఈమెకి నాగార్జున లాంటి మొగుడొస్తాడని, నాగార్జునెందుకు- అఖిల్ లాంటి మొగుడే  దొరుకుతాడనీ చాలా కబుర్లు చెప్పి,  మత్తెక్కించి, మదమెక్కిన మగువలా తయారుచేసి వుంచింది.

       ఇంకా అటువైపు ప్రబంధ నాయకుడైన పిల్ల సామ్ గారి కాళ్ళూ చేతులూ కూడా విరిచేసి హాస్పిటల్లో పడేస్తాడు పిల్లదాని తండ్రి.  స్కూలు చదువు కూడా దాటని   పిల్ల టీనేజి సామ్- ఆ పిల్లలేక పోతే బతక లేనంటాడు అమ్మ ఇచ్చిన పాయసం కూడా ముట్టుకోకుండా. వెళ్లి వెంటనే పెళ్లి సంబంధం మాట్లాడమంటాడు స్కూలు చెడ్డీ  సామ్!

    అలాగే తండ్రి డేవిడ్ వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడేస్తాడు! తన బడి కెళ్ళే  చిత్తకార్తె కొడుకు పెళ్లి కోసం ఏమైనా చేస్తానని  ఆ వివాదాస్పదమైన ఎకరం పొలం కూడా రాసిచ్చి పారేస్తాడు!  ఎంచక్కా ఆ ఎకరమూ వుంచుకుని,  ఇంకా బోల్డు డబ్బు సంపాదించుకురా ఫో- అని వెళ్ళగొడతాడు పిల్ల తండ్రి.

    దీంతో పిల్లోడు సామ్  అచ్చం – ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు- అనే టైపులో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ తో,  బ్యాగు సర్దుకుని స్లమ్ డాగ్ లా ఎక్కడికో వెళ్లి పోతూంటాడు. వెళ్లి వెళ్లి  ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అన్నపూర్ణా స్టూడియోస్ గేటు ముందు తేలతాడు.  నాగార్జునని కలవాలని పట్టుబట్టి కూర్చుంటాడు- సారీ- అండర్ డాగ్ లా నించుంటాడు రోజంతా!

    ఇలా నిర్మలా స్కూల్ సామ్ బాబు ఎందుకని నాగార్జునని కలవాలి? ఎందుకంటే  ‘మా’ టీవీలో ఆయన నిర్వహించే  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం లో పాల్గొని కొట్లాది  రూపాయలు సంపాదించుకెళ్ళి- తన జగదేక బాల సుందరి శాంతిని సొంతం చేసుకునేందుకు!

ఎలావుంది కథ 
      ఎలా వుందో పైనే చెప్పుకుంటూ వచ్చాం. పెద్ద హీరోలు చేయాల్సిన కథ (కథేనా?) పెద్ద హీరోలు దొరక్క పిల్లల మీద తీసేసినట్టుంది. లేకపోతే అన్ని సినిమాల కథలూ పెద్ద హీరోల మూసఫార్ములా  మాస్ కథల్లాగే వుంటాయన్న బలమైన నమ్మకంతో ఇలా బోల్డ్ గా బాలల వృత్తాంతం రచించుకున్నట్టుంది. గతంలో ఇలాటి హైస్కూలు ప్రేమ-  టీచరుతో ప్రేమ లాంటి కథలు కొన్ని వచ్చి పచ్చి విమర్శల పాలయ్యాయి. ప్రస్తుత కాన్వెంట్  ప్రేమ- మోహ  పాఠాల కథ, పెద్ద బ్యానర్ కింద పెద్దవాళ్ళు, ప్రముఖులూ అయిన నాగార్జునా నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాళ్ళు  ఇష్టపడి తీశారు కాబట్టి-  కొందరు ప్రముఖుల పిల్లలూ నటించి- సంగీతించి- గానించి- అందించారు కాబట్టీ విమర్శల కతీతం అవుతుందనుకుంటే- అభ్యంతరకరం అవదనుకుంటే- చెప్పేదేమీ లేదు. తీసేవాళ్ళు గొప్పవాళ్ళయితే ‘సి’ గ్రేడ్ సినిమాల ‘విషయం’  క్లాస్  సినిమాగా మారిపోతుందనుకుంటే ఇలాటివి ఇంకా తీయవచ్చు.  స్కూలు కెళ్ళే పిల్లలు ప్రేమించుకోవడం, పెళ్లి గురించి పట్టు బట్టడం ఈ రోజుల్లో తప్పుకాదని చెప్పి, ప్రోత్సహించాలనుకుంటే మంచిదే! ఇంతకంటే కావాల్సిన అభివృద్ధి ఏముంటుంది? గో ఎహెడ్!

ఎవరెలా చేశారు 
       కొత్త యంగ్  హీరో రోషన్ నటించగలడు,  అయితే నటించడానికి కావాల్సింది ఇలాటి పాత్ర కాదు. ఈ పాత్రకి భారమైన ప్రేమ గోల ఎక్కువైపోయింది. ఛానెల్స్ లో ఏ డిస్నీ టీనేజి సిరీస్ చూసినా  వాటిలో వయసురీత్యా టీనేజి హీరోల చేష్టలు, దూకుడు, ఫాస్ట్ నటన- చాలా  ఫన్నీగా వుంటాయి. కానీ రోషన్ పాత్ర ఈ ఉత్సాహాన్ని పట్టుకోలేక పెద్ద హీరోలా చాలా సార్లు లేనిపోని గాంభీర్యంతో కన్పిస్తుంది. ‘పెళ్లి సందడిలో’ శ్రీకాంత్ లా హూందాగా వుండేందుకు ప్రయత్నిస్తుంది. ఇదంతా దర్శకత్వ లోపమే. స్కూలుపిల్లల్లో పెద్ద హీరోని చూసిన ఫలితం. పెద్ద హీరో పాత్రలా వుండి, పెద్ద హీరోలా బాధ్యతలు మీదేసుకునే కథనంతో రోషన్ ఎటూ తేల్చుకోలేని నటనతో ఓ సినిమా అయిందన్పించాడు.

    చిన్న పిల్ల శ్రియా శర్మ అన్ని శృంగార భావాలూ చక్కగా పలికించింది. మోహం, తాపం, విరహం, సిగ్గులు, హొయలు, స్కూలు వయసప్పుడే పెళ్లి మాటలు, మగాడు ఎలా వుండాలో కొటేషన్లు చెప్పే అనుభవం, శాంతి తో పెట్టుకుంటే మనశ్శాంతి ఉండదని పెద్ద హీరోయిన్లా మాస్ డైలాగులు, పాతికేళ్ళ హీరోయిన్ పలికే అన్ని ప్రేమ పలుకులూ, సినిమా ప్రారంభమే మొదటి షాట్ దగ్గర్నుంచీ సెక్సీ తనంతో రెచ్చ గొట్టే వొంటి విరుపులూ - ఇలా బాల శృంగార నాయికలా తను నటించడమూ, ఇలా ఈ పాత్రని దర్శకుడు తీర్చి దిద్దడమూ అపూర్వం, అమోఘం, అద్భుతం! తెలుగు సినిమా చరిత్రకి గర్వకారణం!

    ఈ సినిమాలో పాటల గురించి మనం చెప్పుకోవడం లేదు- ఎందుకంటే స్కూలు పిల్లలమీద ఈ ప్రేమ గీతాలు రాయడమూ, వాటికి బాణీలు కట్టడమూ ఎబ్బెట్టు కాదు, ఎబ్బెట్టున్నర!

చివరికేమిటి? 
         స్కూలు పిల్లలకి ప్రేమలూ పెళ్లిళ్ళనే  కోరికలు పుడతాయా-  దోస్తానా మస్తానా ఆకర్షణ లుంటాయా తెలుసుకోకుండా పెద్ద హీరో హీరోయిన్ల లవ్ ట్రాకులు పెట్టేసి భారీగా ప్రేమ పాటలూ  పెట్టేస్తే ఎట్లా? సున్నితత్వమనేదే లేకుండా మొరటు చిత్రీకరణలు చేస్తే అయిపోయిందా? ఇక్కడ చూపించాల్సింది స్కూలుపిల్లల మనస్తత్వాలా, లేకపోతే  మదమెక్కిన పోకిరీల వేషాలా? జానర్ మర్యాదని కూడా కాపాడకుండా ఆ విలనిజా లేంటి, ఆ కేకలేంటి, తాగుబోతు పాత్రలేంటి, మాస్ కమర్షియల్ మసాలా లేంటి? నిర్మలా కాన్వెంట్ అనే టీనేజీ కథని నీటుగా- క్లాసుగా- పిల్లలు చూసినా చప్పట్లు కొట్టేలా పిల్లల మనస్తత్వ చిత్రణలతో తీయలేరా? ప్రేమలో పడతారేమో, అది ప్రేమ కాదు ఆకర్షణ -అన్న ఆదుర్దా, సస్పెన్స్ సృష్టించి థ్రిల్లింగ్ గా కథని చెప్పలేరా? దాసరి నారాయణ రావు తీసిన ‘నీడ’ ని ఒకసారి చూస్తే, వయసురీత్యా అపాయపు టంచున వుండే టీనేజర్ తో కథ, పాత్ర ఎలా ఉంటాయో తెలుస్తుంది. స్కూలు పిల్లల కథకి కావాల్సింది వాళ్ళు తెలియకుండా చేసే ప్రయోగాలు, సాహసాలు- వెరసి ఒక అపాయకర పరిస్థితి!

    టీనేజి కథలో కూడా ఫార్ములా హీరోలాగా కోట్లు సంపాదించే హీరోయిజం వుం టుందా? స్కూలు పిల్లాడు వెళ్ళేసి  నాగార్జునని కలిసి – ప్రోగ్రాం చేసి- అదీ  తనూళ్లోనే ప్రోగ్రాం పెట్టించి - రాత్రికి రాత్రి రెండు కోట్లు గడించేసి- ఆ డబ్బు తీసికెళ్ళి విలన్ ముందు పడేసి – పిల్లనివ్వమనడం అప్పుడే రోషన్ లాంటి లేత కుర్రాడికి అవసరమైన యాక్టింగా?

    సెకండాఫ్ అంతా ఆ టీవీ ప్రోగ్రామేగా? సినిమా కెళ్ళి టీవీ ప్రోగ్రాం చూడాల్సి రావడమేమిటి? ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కథకి ఒక ప్రేమ కథేదో కలిపి తీసేస్తే అదొక సినిమా అయిపోతుందా? ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కుర్రాడి పాత్ర వేరు, అవసరం వేరు,  సన్నివేశం వేరు. కాన్సెప్టే లేని  ‘నిర్మలా కాన్వెంట్’ కథాకమామిషు పూర్తిగా వేరు! ఇది టీనేజి సినిమా కాదు- పెద్ద హీరోల మూస మాస్ ఫార్ములా సినిమా. 


-సికిందర్
http://www.cinemabazaar.in