రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 12, 2023

1352 : పరిచయం

 

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ జైలర్ గురించి ఎంత చెప్పుకుంటున్నారో, ఇందులో నటించిన విలన్ గురించి కూడా అంతే చెప్పుకుంటున్నారు.చెత్త మొహం, అతి క్రూరుడు, సుత్తితో మొహం పగులగొట్టి చంపేసే రాక్షసుడు, కళ్ళతోనే భయం పుట్టించే, మాసిన లుంగీ చొక్కా వేసుకునే, మురికి వాడల్లో తిరిగే పిచ్చోడు లాంటి జనం భయపడి చచ్చే,  నీచ నికృష్టపు దేశవాళీ విలన్ గా కనిపించిన నటుడి పేరు వినాయకన్. స్టార్ సినిమాలో ఒక విలన్ కి పేరు రావాలంటే అది కోరుకునే పెద్ద మనసు స్టార్ కుండాలి. విలన్ కెంత పేరొస్తే హీరోగా తనకంత పేరొస్తుందన్న సమభావముండాలి. విలన్ ఎంత బలవంతుడైతే హీరో కంత బలం పెరుకుతుందన్న క్రియేటివ్ దృష్టి వుండాలి. ఇవన్నీ రజనీకాంత్ ప్రదర్శించినందువల్లే జైలర్ సక్సెస్ కి వినాయకన్ కూడా ప్రధాన కారకుడయ్యాడు.
        
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్ అభిమానుల్ని ఆహ్లాదపరిచే, వినోదాత్మక, భావోద్వేగ, శైలీకృత యాక్షన్ సన్నివేశాల్ని దట్టించిన పాపులర్ కమర్షియల్ మూవీ. దీని ప్రధాన విజయమేమిటంటే విలన్ గా వినాయకన్‌ని ఎంపిక చేయడం. మలయాళ ప్రేక్షకులకి వినాయకన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇతర భాషల ప్రేక్షకులకి కొత్త టాలెంట్ ని పరిచయం చేయాలంటే జైలర్ బాగా తోడ్పడుతుంది. అయితే వినాయకన్ ని తీసుకోవాలని ముందుగా అనుకోలేదు. ముందుగా అనుకున్న స్టార్ వేరు.  జైలర్ ఆడియో లాంచ్‌లో స్వయంగా రజనీకాంత్ చెప్పారు.
       
పేరు ప్రస్తావించకుండా రజనీ చెప్పిందాన్ని బట్టి చూస్తే
, ఆయన చెప్తున్నది మోహన్ బాబు గురించేనని అన్పించక మానదు. మోహన్ బాబు విలన్ గానే నట జీవితం ప్రారంభించి తర్వాత విలన్ అయ్యారు. మోహన్ బాబు, రజనీ చాలా సంవత్సరాలుగా మంచి మిత్రులు కూడా.  మోహన్ బాబు నిర్మించిన సూపర్ హిట్ పెదరాయుడు లో రజనీ కీలక పాత్ర పోషించారు కూడా. ఈ నేపథ్యంలో జైలర్ ఆడియో లాంచ్ సందర్భంగా రజనీ చెబుతున్నది మోహన్ బాబు గురించేనని ఇట్టే తెలిసిపోతుంది.
        
జైలర్ లో విలన్ పాత్రని ఎవరైనా స్టార్ లేదా కొత్త నటుడు పోషిస్తే బావుంటుందనుకున్నానని రజనీకాంత్ చెప్పారు. విలన్ పాత్రలకి పేరుబడ్డ వారెవరిని తీసుకున్నా పెద్దగా ప్రభావం వుండదని అన్నారు. అప్పుడు దర్శకుడు నెల్సన్ ఒక పేరు సూచించాడని, ఆయనొక పెద్ద సౌత్ స్టార్ అనీ, తనకి మంచి మిత్రుడు కూడానని చెప్పారు. ఆయన విలన్ కి సరిపోతాడని భావించి తనే ఫోన్ చేసి మాట్లాడినట్టు చెప్పారు. తర్వాత నెల్సన్ వెళ్ళి కథ విన్పించి వచ్చాక తను పునరాలోచనలో పడ్డాననీ, ఆ స్టార్ కున్నఇమేజిని బట్టి, పాత్రతో వ్యవహరించడానికి తగినంత స్వేచ్ఛ వుండదని, ప్రాక్టికల్ గా కొన్ని పరిమితులు వుంటాయనీ, పైగా తను విలన్ ని కొట్టే సన్నివేశాలు కూడా వున్నాయనీ, ఆ స్టార్ తో ఆ పని చేయలేననీ భావించి, ఆ స్టార్ కి ఫోన్ చేసి సారీ చెప్పినట్టు వివరించారు.
       
అయితే రజనీ మాటల్ని ఎక్కువమంది తమిళ ప్రేక్షకులు వేరేగా తీసుకున్నారు. ఆయన చెప్పింది కమల్ హాసన్ గురించేనని భావించారు. చెన్నై ఆడియో లాంచ్ లో రజనీ 45 నిమిషాలు ప్రసంగించారు.
ఈ స్పీచ్‌తో నెటిజన్లు రజనీ ప్రస్తావించిన స్టార్ మరెవరో కాదని, ఐదు దశాబ్దాల తన ప్రత్యర్థి కమల్ హాసనే నీ తేల్చేశారు. ఇప్పుడు దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వీరిద్దరినీ కలపి తెరపై చూసే అవకాశం చేజారిపోయిందని, వీరిద్దరి అభిమానులు భొరున విలపించారు. అయితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ, కమల్ మళ్ళీ తెరపై 'తలైవర్ 171'లో ఒక్కటవుతారని ప్రచారం ఒకటి జరుగుతోంది.
        
మోహన్ బాబు కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు- స్టార్ ని విలన్ గా మార్చే ప్రయత్నం అలా కుదరక పోవడంతో రజనీ, నెల్సన్ లు కొత్త ముఖం కోసం అన్వేషించి వినాయకన్ ని పట్టుకున్నారు. స్టార్ ని తెచ్చి విలన్ చేస్తే ఏమయ్యేదో గానీ, కొత్త ముఖాన్ని తెచ్చుకుని  స్టార్ ని చేశారు. ఇంత పచ్చిగా, మురికివాడల క్యారక్టర్ అన్పించే వినాయకన్ స్టార్ విలన్ అయిపోయాడు! స్లమ్ డాగ్ విలియనీర్ అన్నట్టు.

ఎవరీ వినాయకన్
?

ఇంతకీ ఎవరీ వినాయకన్ అంటే- నటుడు, గాయకుడు, స్వరకర్త, నాట్యాచారుడు- ఇన్ని కళలున్నాయి ఈ మలయాళీ ఆర్టిస్టులో. 1995 లో మాంత్రికం లో అతిధి పాత్రతో నట వృత్తిని ప్రారంభించాడు . ఆ తర్వాత రెండు సినిమాల్లో సహాయ పాత్ర, కమెడియన్ పాత్రా పోషించాడు. తర్వాత స్టాప్ వయొలెన్స్’, ఛోటా ముంబాయి సినిమాల్లో నటించి గుర్తింపు పొందాడు. మొత్తం 53 మలయాళ సినిమాలు, 8 తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా (అసాధ్యుడు’- 2006), ఒక హిందీ సినిమా నటించాడు. 2016 లో కమ్మటి పాదం లో నటనకి గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డు పొందాడు. సినిమాల్లోకి రావడానికి ముందు బ్లాక్ మెర్క్యురీ అనే డాన్స్ గ్రూపుని నిర్వహించేవాడు. మైకేల్ జాక్సన్ ని ఇమిటేట్ చేసేవాడు.
       
ఇందుకేనేమో  
జైలర్ లో విలన్ గా బాగా హై వస్తే అనుచరులతో కలిసి పిచ్చ డాన్స్ చేస్తాడు. తాళ్ లో ఐశ్వర్యారాయ్ పాటకి కూడా డాన్స్ చేసి పడేశాడు. చంపడం అంటే అతడికెంత ఆనందమంటే, అనుచరుణ్ణి కింద పడదోసి, ఛాతీ మీద బాసింపట్టు వేసుకుని కూర్చుని, సుత్తితో తనివిదీరా మొహమ్మీద కొట్టి చంపుతాడు. ఇలాటిదే సీను రామ్ గోపాల్ వర్మ హిందీలో తీసిన వీరప్పన్ కథ జంగిల్ (2000) లో - మనుషుల్ని చంపడానికి ఉవ్వీళ్ళూరుతూ వుండే పొట్టి రాజ్ పాల్ యాదవ్ తో వుంటుంది.
       
విగ్రహాల స్మగ్లర్ వర్మగా విలన్ పాత్రలో వినాయకన్ నటన రియలిస్టిక్ నటన. పాత్ర లోతుపాతుల్లోకి వెళ్ళిపోయి
, పాత్రనంతా కళ్ళల్లో నింపుకుని- అక్కడ్నించీ ఒడలు జలదరించేలా పాత్రని ఆకాశాన్నంటిస్తాడు. రజనీ కాంత్ మాత్రం కూల్ గా వుంటాడు. రజనీని డామినేట్ చేస్తూ ఆయన ముందు వినాయకన్ ది ఓవరాక్షన్ కాదు- ఆ పాత్రే అంత. దీన్ని రియలిస్టిక్- మెథడ్ యాక్టింగ్ తో ఓవరాక్షన్ అన్పించకుండా చేశాడు. మృగానికి ఓవరాక్షనేంటి? మృగం తీరే అంత. వినాయకన్ మృగంగా మారితేనే ఇది సాధ్యం.
       
ఇప్పుడు వినాయకన్ పానిండియా కాదు
, గ్లోబల్ పండితుల దృష్టిలో పడినట్టు తాజా వార్తలొస్తున్నాయి. ఎప్పుడైనా దేశ సంస్కృతిని ప్రతిబింబించే దేశవాళీ పాత్రలే, దేశీయ నటనలే గ్లోబల్ సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తాయి.
—సికిందర్