రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, ఆగస్టు 2022, గురువారం

1190 : రివ్యూ!


        (డియర్ రీడర్స్ - క్షమించాలి, ఆగస్టు 5 నుంచి రివ్యూలు ఆలస్యమవుతున్నాయి. ఈ మధ్య థియేటర్లకి ప్రేక్షకులు కరువవుతున్న పరిస్థితుల్లో, విడుదల రోజే రివ్యూలిస్తే, పరిస్థితిని ఇంకింత దిగజార్చి నట్టవుతుందేమోనని ఈ జాప్యం. ఈ రోజు విడుదలైన రెండు స్టార్ హిందీ సినిమాల పరిస్థితి కూడా ఇలాగే వుంది. ఈ బ్లాగులో రివ్యూలు ప్రత్యేకంగా స్క్రీన్ ప్లే- సాంకేతికాల విశ్లేషణలకి సంబంధించి వుంటాయి కాబట్టి, వీటిని తెలుసుకోవడం కొంత ఆలస్యమైనా ఫర్వాలేదని కూడా భావిస్తున్నాం, అందుకని సహకరించగలరు)

దర్శకత్వం : హను రాఘవపూడి
తారాగణం : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రశ్మికా మందన్న, భూమిక, సుమంత్, సచిన్ ఖెడేకర్, జీశ్శూ సేన్ గుప్తా, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, సునీల్, ప్రియదర్శి తదితరులు
రచన : హను రాఘవపూడి, రాజ్ కుమార్ కందమూడి; మాటలు : హను రాఘవపూడి, జే కృష్ణ, రాజ్ కుమార్ కందమూడి; సంగీతం ; విశాల్ చంద్ర శేఖర్, ఛాయాగ్రహణం : పి ఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ
బ్యానర్స్ ; వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా నిర్మాత : చలసాని అశ్వనీ దత్
విడుదల : ఆగస్టు 5, 2022
***
        హానటి’, జాతిరత్నాలు విజయాల తర్వాత వైజయంతీ మూవీస్ నుంచి సీతారామం వెలువడింది. ఈ కుటుంబ సినిమా ఇటీవల సినిమాల పట్ల తెలుగు కుటుంబ ప్రేక్షకులు పెంపొందించుకున్న నిరోధక శక్తికి పరీక్ష పెట్టింది- ఇప్పటికైనా థియేటర్ల కెళ్ళి చూస్తారా లేదా అన్నట్టు. దురదృష్టవశాత్తూ ఈ సినిమాని గల్ఫ్ దేశాలు నిషేధించాయి. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కి మలయాళ సినిమాల ద్వారా గల్ఫ్ లో మంచి మార్కెట్ వుంది. ఈ సినిమాలో మతభావాల్ని దెబ్బతీసేలా కొన్ని దృశ్యాలున్నాయనీ, వాటిని తొలగించి తిరిగి సెన్సార్ కి దరఖాస్తు చేసుకోమనీ నిర్మాతని కోరాయి గల్ఫ్ దేశాలు. అక్కడి అసంఖ్యాక దుల్కర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

        ప్రేమ సినిమాల దర్శకుడు హను రాఘవపూడి ఈ సారి పీరియెడ్ ప్రేమతో వచ్చాడు. దీనికి మిలిటరీ నేపథ్యం. సైనికుడి ప్రేమ సంఘర్షణ. దుల్కర్ సల్మాన్ తో బాటు  మృణాల్ ఠాకూర్, రశ్మికా మందన్న, ఇంకా అనేకాయితర నటీనటులతో ఆకర్షణీయమైన తారాతోరణం. ఖర్చుతో కూడుకున్న సాంకేతికాలు. దేశవిదేశ లొకేషన్లు. తేలికపాటి పాటలు. సరిహద్దులో సైనిక చర్యలు. ఇంత హడావిడి మధ్య అసలు ఈ ప్రేమ కథ ఎలా సాగింది? ఇది తెలుసుకుందాం...

కథ

    1985 లో ఇండియా అంటే గిట్టని లండన్లో పాకిస్తానీ స్టూడెంట్ అఫ్రీన్ (రశ్మిక) అక్కడ ఓ ఇండియన్ కి చెందిన కారుని ధ్వంసం చేసిన ఘటనలో నష్టపరిహారం కట్టాల్సి వచ్చి, తాతగార్ని అడుగుదామని పాకిస్తాన్ వెళ్తే, అక్కడ తాతగారు బ్రిగేడియర్ తారీఖ్ (సచిన్ ఖెడేకర్) చనిపోయాడని తెలుస్తుంది. ఆయన వీలునామా రాస్తూ, ఆస్తి అఫ్రీన్ కి దక్కాలంటే, సీతా మహాలక్ష్మి (మృణాల్) కి 1965 లో లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్) రాసిన  ఉత్తరాన్ని ఆమె చిరునామాకి చేరేయాలని షరతు పెడతాడు.

        చేసేది లేక సీనియర్ స్టూడెంట్ బాలాజీ (తరుణ్ భాస్కర్) ని తీసుకుని అడ్రసు ప్రకారం హైదరాబాద్ లో నూర్జహా ప్యాలెస్ కి వెళ్తుంది. అక్కడ 1965 లో సీత అని ఎవరూ లేరని తెలుసుకుని, సీత ఆచూకీ దొరక్క రామ్ కోసం ప్రయత్నిస్తుంది. మిలీటరీలో దొరికిన సమాచారం ఆధారంగా రామ్ స్నేహితుడు దుర్జయ్ శర్మ (వెన్నెల కిషోర్) ని కలుసుకుంటుంది. దుర్జయ్ శర్మ రామ్ గురించి చెప్పుకొస్తాడు. కాశ్మీర్లో లెఫ్టినెంట్ రామ్ ఒక ఆపరేషన్ నిర్వహించి పేరు తెచ్చుకోవడంతో, అతడికి నీ భార్య నంటూ సీత ఉత్తరాలు రాయడం మొదలెడుతుంది. ఎవరీ సీత? భార్యనంటూ ఎందుకు ఉత్తరాలు రాసింది? అప్పుడు ఆమెని రామ్ ఎలా కలుసుకున్నాడు? వాళ్ళ ప్రేమ ఎలాసాగింది? ఇదీ మిగతా కథ.  

ఎలా వుంది కథ

    రోమాంటిక్ డ్రామా జానర్లో రోమాంటిక్ సస్పెన్స్ సబ్ జానర్ కి చెందిన కథ. వీర్ జారా (2004) కంచె (2015) సీమాంతర/సైనిక ప్రేమ కథల్లాంటి కథ. వీర్ జారా’, సీతారామం ల కాన్సెప్ట్ ఒకటే. సైనికుడైన హీరో పాక్ బలగాలకి చిక్కి ఖైదు కావడం. యశ్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన వీర్ జారా లో 22 ఏళ్ళుగా పాక్ లో ఖైదీగా వున్న షారూఖ్ ఖాన్ ని విడిపించడానికి పాక్ లాయర్ గా రాణీ ముఖర్జీ ప్రయత్నిస్తుంది. సీతారామం లో 20 ఏళ్ళ క్రితం పాక్ దళాలకి చిక్కిన దుల్కర్ ని ఉత్తరంతో కలవడానికి పాక్ స్టూడెంట్ గా రశ్మికా మందన్న ప్రయత్నిస్తుంది.

        వీర్ జారా కథ సుఖాంతమైతే, సీతారామం దుఖాంతం. వీర్ జారా లో పాకిస్తాన్ వాసి అయిన హీరోయిన్ ప్రీతీజింటా శక్తివంతుడైన రాజకీయ నాయకుడి కూతురైనట్టే, సీతారామంలో హైదరాబాద్ లో వుండే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ధనిక నవాబు చెల్లెలు. వీర్ జారా లో షారూఖ్ ఖాన్ తో  ప్రీతీజింటా ప్రేమకి, ఇంకో రాజకీయ కుటుంబంతో పెళ్ళి సంబంధం సమస్య సృష్టిస్తే, సీతారామం లో దుల్కర్ తో ప్రేమలో వున్న మృణాల్ కి, ఒమన్ రాజకీయ కుటుంబంతో పెళ్ళి సంబంధమే సమస్య సృష్టిస్తుంది. వీర్ జారాలో ప్రీతీజింటా పెళ్ళికి అడ్డున్నాడని ఆమె అన్న షారుక్ ని ఇండియన్ ఏజెంటుగా ప్రభుత్వానికి పట్టిస్తాడు. సీతారామం లో మృణాల్ అన్న ఇలాటి విలనీ ప్రదర్శించకుండా వుంటాడు.  వీర్ జారా కథ లీనియర్ నేరేషన్ అయితే, సీతారామం - కంచె లో  లాగే నాన్ లీనియర్ కథనం- మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో.   

        కంచె లో 1936, 1939 రెండు కాలాల్లో కథ వుంటుంది. ’36 లో ప్రేమ కథ, ’39 లో రెండో ప్రపంచ యుద్ధ కథ. యుద్ధ కథ ప్రత్యక్ష కథగా వుంటే, ప్రేమ కథ పూర్వ కథగా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వస్తుంది. ఈ ప్రేమ కథలో కూడా మళ్ళీ హీరోయిన్ ప్రగ్యా పై రెండు సినిమాల్లో హీరోయిన్ల లాగా ధనికురాలే. జమీందారు కూతురు. ప్రగ్యాని ప్రేమిస్తున్న వరుణ్ తేజ్ కి కులసమస్య అడ్డొస్తుంది. దీంతో ఆమె తండ్రి వేరే సంబంధం చూస్తాడు. ఇలా ఈ మూడు సినిమాల ప్లాట్ పాయింట్స్ ఒకే సమస్య చుట్టూ వుంటాయి. సీతారామం లో దుల్కర్- మృణాల్  లని కలవడానికి రశ్మిక ప్రయత్నించే ప్రత్యక్ష కథకి, దుల్కర్ - మృణాల్ ల ప్రేమకథ పూర్వ కథగా వస్తూంటుంది విడతలు విడతలుగా.

    అయితే కంచె లో ప్రత్యక్ష కథని ఆపినప్పుడల్లా దానికి క్లిఫ్ హేంగర్ మూమెంట్ ని సృష్టించి ట్విస్టు ఇస్తూ పోకుండా, అలాగే పూర్వ  కథని ఆపినప్పుడల్లా దానికి క్లిఫ్ హేంగర్ మూమెంట్ ని సృష్టించి ఇంకో ట్విస్టు ఇస్తూ పోకుండా, కథనాన్ని బలహీనపర్చిన పొరపాటే సీతారామం లో కూడా చేశారు. సీతారామం రోమాంటిక్ సస్పెన్స్ సబ్ జానర్ కూడా అయినప్పుడు, క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ కథనంతో వుంటే అది మరింత థ్రిల్ నీ, యూత్ అప్పీల్ నీ కల్పించి, సినిమా స్పీడుగా సాగేందుకు తోడ్పడేది. సినిమా మందకొడిగా సాగడానికి కారణమిదే.

        ఇదలా వుంచితే, చరిత్రని ఇష్టానుసారం కల్పన చేసి ప్రేక్షకుల్లోకి తప్పుడు చరిత్ర వెళ్ళేలా చేశారు. ఈ సినిమా ప్రారంభంలో చూపించిన ఆపరేషన్ జిబ్రాల్టర్ నిజానికి 1965 ఇండో- పాక్ యుద్ధానికే దారి తీసిన కీలక పరిణామం. ఇంత ప్రధానంగా జరిగిన యుద్ధాన్నే కథలో చూపించలేదు!

        1964 తో కథ ప్రారంభించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని చూపిస్తూ, టెర్రరిస్టు క్యాంపు అని లొకేషన్ చూపించారు. టెర్రరిస్టు నాయకుడ్ని చూపించారు. కానీ 1964 లో టెర్రరిస్టులే లేరు, క్యాంపులే లేవు. టెర్రరిజం కాదుగానీ, మిలిటెన్సీ మొదలైంది 1989 లోనే కాశ్మీర్లో. తర్వాత్తర్వాత టెర్రరిజంగా పిలవడం మొదలెట్టారు. ఇక 1964 లోనే టెర్రరిస్టు నాయకుడు  ఆపరేషన్ జిబ్రాల్టర్ కి పథకమేసినట్టు చూపించారు. ఈ పథకం ప్రకారం కొందరు పాక్ యూత్ ని కాశ్మీరీల్లా కాశ్మీర్లో ప్రవేశపెట్టి, కాశ్మీర్ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతని రెచ్చగొట్టడం ఉద్దేశంగా చూపించారు.

        అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేకత రెచ్చగొట్టిన మాట వాస్తవమే గానీ, అది ఆ రోజుల్లో లేని టెర్రరిస్టులతో కాదు, సైనికులతో. ఆపరేషన్ జిబ్రాల్టర్ పాక్ సైన్యపు పథకం. దీని ప్రకారం సినిమాలో చూపించినట్టు 10 -12 మంది టెర్రరిస్టుల్ని కాదు గానీ, ఏకంగా 26 నుంచి 33 వేల మంది సైనికుల్ని కాశ్మీర్లో చొరబెట్టారు! ఈ పథకం చూస్తే చాలా నవ్వులపాలయింది, చాలా కామెడీ వుంది. ఇంతవరకూ హిందీ సినిమాల్లో కూడా చూపించలేదు.

    ఇప్పుడు తెలుగులో ఎంటర్ టైన్ చేసే అవకాశమున్న ఈ చారిత్రక కామెడీని జారవిడుచుకున్నారు. పాక్ సైనికుల్ని కాకుండా టెర్రరిస్టుల్ని చూపించడం మార్కెట్ యాస్పెక్ట్ కాదు. పాక్ సైనికులతో మరుగున పడ్డ- నవ్వులపాలైన చరిత్రని చూపడమే సినిమాని మరింత ఎలివేట్ చేసే నిజమైన మార్కెట్ యాస్పెక్ట్. ఇలాటివి ఎందుకు వదులుకోవాలి? సినిమాలో కామెడీలేని లోటు కొంతైనా తీరేది.

        మారు వేషాల్లో కాశ్మీర్లో చొరబడ్డ ఈ పాక్ సైనికుల్ని కాశ్మీరీలే కామెడీ కామెడీగా సైన్యానికి పట్టించి పాక్ సైనికులెంత వెర్రి వాళ్ళో నిరూపించారు. ఈ ఆపరేషన్ జిబ్రాల్టర్ ని 1964 లో కాకుండా, ఆగస్టు 5, 1965 న ప్రారంభించారు. 15 రోజుల్లో ఇది రట్టయి, వెంటనే సెప్టెంబర్ 1 నుంచి పెద్ద యుద్ధమే ప్రారంభమై పోయింది. పాక్ చేసిన పోకిరీ పని ఫలితమే ఈ యుద్ధం. మంకీ బిజినెస్ అంటే ఇదే.

        అంటే ఈ సినిమాలో చూపించినట్టు హీరో హీరోయిన్ల ప్రేమ కథకే అవకాశం లేదన్నమాట - ఆపరేషన్ జిబ్రాల్టర్ వెంటే వచ్చిన యుద్ధం వల్ల. సినిమా కోసం చరిత్రని మార్చేస్తే అది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అవుతుందేమో గానీ, బాధ్యతగల సినిమా అవుతుందేమో తెలీదు.

నటనలు - సాంకేతికాలు

    రామ్ పాత్రలో దుల్కర్ ని మాత్రమే వూహించగలం. అందమైన ప్రేమికుడు. యశ్ చోప్రా సినిమాల్లోలాంటి చాక్లెట్ బాయ్- పీచు మిఠాయి తియ్యదనాల రోమాంటిక్ హీరో. సినిమాకి గ్లామర్ కోషెంట్ ని పెంచే లుక్ తో, పీరియెడ్ రోమాంటిక్ హీరోని తనదైన దరహాసపు ముద్రతో తెర మీద నిలబెట్టాడు. దర్శకుడు తెలుగులో కథ చెప్పడం, తనకి తెలుగు రాకపోవడం జరిగి, తెరమీద కొచ్చేటప్పటికి తెలుగుదనాన్ని మేనేజ్ చేస్తూ రామ్ ని రసవత్తరం చేశాడు ప్రేమికుడుగా. సైనికుడుగా చివర్లో ట్విస్టువల్ల ఒనగూడిన సన్నివేశ బలం వల్ల రాణించాడు. అయితే ఈ సన్నివేశం, కథ ముగింపూ పైన చెప్పుకున్న చారిత్రక నేపథ్య కారణాల వల్ల లాజిక్ లేనివి. ప్రేమ కథ కూడా వూహించడానికే అసాధ్యమైనది. చారిత్రక నేపథ్యాన్ని, లాజిక్ ని కాదనుకుని చూసే వాళ్ళకి ఓకే.

        సైనికుడుగా కొన్ని సాహసకృత్యాలున్నా అవి కూడా ప్రేమ కథలాగే సాఫ్ట్ గా తేలాయి. ఇక సునీల్ తో, వెన్నెల కిషోర్ తో దుల్కర్ కామెడీ సీన్లు గీతాంజలి లో సిల్క్ స్మితతో సుత్తివేలు కామెడీలాగా ఏమిటోగా వున్నాయి. కానీ సినిమాల్లో 1964 లో రేలంగి, రమణా రెడ్డిలున్నారు. రేలంగి, రమణా రెడ్డిల కాలంలో సునీల్, వెన్నెల కిషోర్ లు ఇంత చోద్యంగా వుండడం చోద్యమే. సునీల్, వెన్నెల కిషోర్ లు పూర్వమే పుట్టి వుండి, 1964 లో ఇలా కామెడీ నటించి వుంటే రేలంగి, రమణా రెడ్డిలు నవ్వి నవ్వి చచ్చే వాళ్ళు.

    ఇది రోమాంటిక్ డ్రామా కాబట్టి దుల్కర్ ది పాసివ్ పాత్ర. ఓటమి పొందే పాసివ్ పాత్ర. ఇటు ప్రేమ, అటు డ్యూటీ మధ్య నలిగే మానసిక- భౌతిక సంఘర్షణలతో కూడిన రౌండెడ్ పాత్ర. సాధారణంగా రోమాంటిక్ డ్రామాలు  ఒక్క ప్రేమ గురించే  మానసిక సంఘర్షణతో వుంటూ తేలిపోతూంటాయి. దుల్కర్ పాత్రకి మానసిక, భౌతిక సంఘర్షణలు రెండూ తోడయ్యాయి. అయితే ప్రేమికుడుగా మానసిక సంఘర్షణ ప్రేమలోంచి పుట్టలేదు. చివర్లో బందీ అయ్యాక తన అస్తిత్వం లోంచి పుట్టింది. దీనిక్కారణం హీరోయిన్ పాత్రచిత్రణలో లోపం. హీరోయిన్ పాత్ర కరెక్ట్ గా వుంటే, ఆ పాత్ర అనుభవిస్తున్న బాధలోంచి దుల్కర్ ప్రేమ సంఘర్షణ పుట్టేది.

        ఇక చివరికి సైనికుడుగా డ్యూటీకి ఓటెయ్యాలా, ప్రేమికుడిగా ప్రేమకే లొంగిపోవాలా అన్నప్పుడు డ్యూటీకే కట్టుబడే సార్వజనామోద విలువ పాటించాడు. ఐతే ఇందులో కూడా ఒక మెలిక వుంది, ఇది చివర్లో చూద్దాం. ఇలా బిగ్ కాన్వాస్ మీద ఈ తెలుగు సినిమా దుల్కర్ పాపులారిటీని పదింతలు పెంచిందనుకోవాలి.       

        ఈ రోమాంటిక్ సస్పెన్స్ ఎలాంటిదంటే పాత్ర గురించి చెప్తే సస్పెన్స్ పోతుంది. పాత్ర గురించి చెప్పకుండా మృణాల్ ఠాకూర్ గురించి చెప్పుకోవడానికేమీ వుండదు. అయితే ఈ పాటికి సినిమా అత్యధిక ప్రేక్షకులు చూసేసే వుంటారు కాబట్టి, కథ మొత్తం విడమర్చి చెప్పుకుంటే ఇప్పుడొచ్చే నష్టమేమీ వుండదనుకుని ముందడుగేద్దాం (రివ్యూ ఆలస్యంగా ఇస్తే ఇలా విపులంగా సినిమాని అర్ధం జేసుకోవడం కలిసొస్తుందన్నమాట).

    హీరోయిన్ మృణాల్ సీతగా హీరోకి కన్పిస్తుంది, ప్రిన్సెస్ నూర్జహా గా ప్రేక్షకులకి తెలుస్తుంది తగినంత సస్పెన్సు పోషించాక. ఓల్డ్ సిటీ ప్యాలెస్ లో వుండే నూర్జహాకి అంత మంచి తెలుగు, అంతందమైన అక్షరాలతో రాసే నేర్పూ వుండడం ఆశ్చర్యమే. సినిమా కదా ఆశ్చర్య పోనవసరం లేదు. అయితే ఆమె చేతివ్రాత (తెర వెనుక ఎవరు రాసిచ్చారో అద్భుతంగా వుంది, ఉర్దూ స్ట్రోక్స్ కూడా లేకుండా ముస్లిం గాళ్ తెలుగక్షరాలు) చూస్తే ఆమె బలహీన మనస్కురాలన్పించదు. స్వతంత్రురాలన్పిస్తుంది. ఇంకా రామ్ కి పై అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిన అవసర ముంటుందేమోగానీ, ఈవిడ తన జీవితానికి తనే కమాండర్ అన్పిస్తుంది. కానీ ఈ గ్రాఫాలజీ చెప్పే వ్యక్తిత్వంతో ఆమె పాత్ర వుండదు. సీతగా, నూర్జహాగా వేర్వేరు షేడ్స్ లేవు. ఇలాటి సూక్ష్మాంశాల్ని విస్మరిస్తే అద్భుత విజువల్స్ తో కళ్ళు చెదిరేలా వుండచ్చేమోగానీ సినిమా, హృదయాల్ని దోచుకోదు. ఏదో ఫేక్ ఫీలింగులు మనం ఫీలై ఆనందించడమే.

        ఈ కథకి హీరోకి తెలియని మృణాల్ ద్విపాత్రాభినయమే కేంద్ర బిందువు. ఈమె హీరో మధించి తెలుసుకోవాల్సిన నిగూఢ రహస్యం. అంటే హీరో కాన్షస్ ఇగో అయితే, ఈమె సబ్ కాన్షస్ వరల్డ్. అందుకని హీరోకి ఈమె ఒక మిస్టరీ. ఈ మిస్టరీలో ఆమెకి రెండు షేడ్స్ - సీత/నూర్జహా. సీత ప్రపంచానికి తను చూపెట్టుకుంటున్న తెచ్చి పెట్టుకున్న స్వతంత్ర వ్యక్తిత్వమైతే, దీని వెనుక నూర్జహా మాత్రం పంజరంలో చిలుక! ఈ షేడ్స్ లేకపోతే రసవత్తర పాత్ర చిత్రణ అన్పించుకోదు. ఇంటర్వెల్లో సీతే నూర్జహా అని ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తే అది అసంపూర్ణ కథనమే. తర్వాత సీతా నూర్జహాల వెలుగునీడల జీవితం చూపించినప్పుడే పూర్ణత్వంతో రౌండెడ్ క్యారక్టర్.   

        నూర్జహా రామ్ నెందుకు ప్రేమించిందో తెలీదు. అతను సైనికుడు కాబట్టి, సైనికుడికి మత భేదం వుండదనుకుని, పైగా అతను అనాధ కాబట్టి అభ్యంతరం చెప్పేవాళ్ళూ వుండరనుకుని, ప్రేమించి వుండాలి. అగర్తలో అతను మత ఘర్షణలు అడ్డుకున్నప్పుడు తను అక్కడే వుండి చూసింది కాబట్టి అది ప్రేమకి బలాన్నిచ్చి వుంటుంది. విరాటపర్వం లో వూళ్ళో పోలీసుల్ని ఎదుర్కొన్న రానా వీరత్వాన్ని చూసి ప్రేమని ఖాయం చేసుకున్న సాయి పల్లవి లాగా. ఏమిటో సినిమా అనగానే హీరోయిన్ల పాత్రలు తళతళ మెరిసే తోమి పెట్టిన వంట పాత్రల్లా వుంటాయి. లోపలేమీ వుండదు.

    ప్యాలెస్ లో సీతగా బొట్టు పెట్టుకుని నాట్యం చేస్తూంటుంది. ఒకసారి బొట్టు లేకుండా నూర్జహాగా వున్నప్పుడు వచ్చేస్తాడు రామ్. ఆమె సీతే అనుకుని, బొట్టులేకుండా  ఎంతందంగా వున్నావంటాడు. డైలాగుతో సీను చెప్తే ఏమందంగా వుంటుంది? విజువల్ రైటింగ్ చేస్తే అలరిస్తుంది. ఆమె నూర్జహాగా దొరికిపోగల అవకాశం డ్రమెటిక్ గా వుండాలంటే- ఉదాహరణకి, రామ్ వస్తున్నప్పుడు ఆమె నూర్జహాగా - పాకీజా లోని మీనా కుమారి క్లాసిక్ ముజ్రా -చల్తే చల్తే యుహీ కోయీ మిల్ గయా థా కి నాట్యం చేస్తూ దొరికిపోతే, సీను థియేటర్ పైకప్పు చీల్చుకుంటూ ఎలివేట్ అయ్యే పొటెన్షియల్ తో వుండొచ్చు. ప్రేక్షకులు బయటికి పరుగులుదీసి సీను ఎక్కడికెళ్ళిందబ్బా అని ఆకాశంలోకి చూసే పరిస్థితి.

        తను ముస్లిం అన్న విషయం ఎందుకు దాస్తోందో కూడా తెలీదు. ఒకసారి నిజం చెప్పేస్తానంటుంది చెలికత్తెతో. ఆ విషయం మర్చిపోతుంది. ఇది పైపైన రాసేసి పైపైన తీసేసిన ప్రేమ కథ గనుక ఈ ప్రేమ కథలో బాధ అనుభవం కాదు. రోమాంటిక్ డ్రామా అంటే బాధే. ఈ బాధ లేకపోవడంతో కథని డ్రైవ్ చేసే అంశం లేకుండా పోయింది. నూర్జహాగా ఆమె పంజరం లోంచి బయటపడాలని తపిస్తున్న చిలుకైతే ఈ బాధ కాన్ఫ్లిక్ట్ అయ్యే అవకాశముండేది. ఈ బాధ నుంచి నూర్జహాకి విముక్తి కల్గించడానికి సీత శక్తి చాలడం లేదు. బయటి హస్తం కావాలి. ఆ హస్తం రామ్. కానీ అతడికి తను ముస్లిం అన్న విషయం తెలిసిపోతే? ఎలా రియాక్ట్ అవుతాడు? ముస్లిం దేశంతో యుద్ధ పరిస్థితిలో? ఈ బాధతో, ఈ స్ట్రగుల్ తో, డ్రమెటిక్ క్వశ్చన్ కరువవడం ఈ ప్రేమ కథలో ప్రధాన లోపం.

    దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాముడు లాంటి యోధుడు రావణుణ్ణి కొట్టి సీతని తీసుకురావడం పెద్ద యుద్ధం కాదు, అది ఎండ్ రిజల్ట్. అసలు యుద్ధం ఎక్కడుందంటే, సీతని ఎవరు తీసికెళ్ళారు, ఎందుకు తీసికెళ్ళారు రాముడికి తెలియదు. ఆ సంఘర్షణే అసలు యుద్ధం అని వివరించాడు. ఈ యుద్ధమే (మానసిక సంఘర్షణ) కథలో సీత వైపు నుంచీ, రామ్ వైపు నుంచీ కొరవడింది డ్రమెటిక్ క్వశ్చన్ ని స్థాపించక పోవడంతో.

        కథ ఇలా వుంటే, ఈ రెండు పాత్రలు మేకప్ తేడా తప్ప, తేడా గల మెంటల్  మేకప్స్ తో ఎలా నటించగలదు మృణాల్ ఠాకూర్. ఆఖరికి ఇరవై ఏళ్ళు గడిచిపోయాక, కాశ్మీర్లో నాట్య పాఠశాల నడుపుకుంటున్నప్పుడు కూడా వయసు మీదబడలేదు. ఎలాటి మనిషి ఎలా అయిపోయిందన్న సానుభూతి కల్గించలేదు. శ్యామ్ సింగరాయ్ లో చివరికి నాట్య పాఠశాలే నడుపుకుంటున్న నడివయసు సాయి పల్లవి, నిగనిగలాడే నల్లటి ఒత్తైన శిరోజ సంపదతో, ఫ్యాన్స్ దృష్టిలో పడిపోకుండా యూత్ఫుల్ గ్లామర్ ని ప్రదర్శించినట్టే వుంది మృణాల్ కూడా. Is this called movie making? -  అని  అనుమానం దొలవడం.  

        ఇక పాకిస్థానీ గర్ల్ రశ్మికా మందన్న. ఈమె ముస్లిం అని తెలియడానికి కొట్టొచ్చేలా ముస్లిం డ్రెస్ చుట్టుకుని ఎంట్రీ ఇస్తుంది లండన్లో. తర్వాత మర్చిపోతుంది. ఇంకెప్పుడో సడెన్ గా మళ్ళీ ముస్లిం డ్రెస్ తో వచ్చేస్తుంది. పాకిస్థానీ స్త్రీలు ఈ హిజాబ్ గిజాబ్ బురఖా గిరఖా వేసుకోరు. ఒకసారి పాకిస్తాన్ నుంచి సైంటిస్టు హైదరాబాద్ వచ్చాడు. ఆ కాలేజీలో ప్రసంగించబోతూ, హాలునిండా బురఖాలేసుకుని వున్న విద్యార్థినుల్ని చూసి విస్తుపోయాడు. బురఖాలు మా దగ్గర గిరిజనులు వేసుకుంటారు అన్నాడు చురక అంటిస్తూ.

        గడ్డాలూ టోపీలతో, బురఖాలూ హిజాబ్ లతో మతాన్ని ధరించి విజిబుల్ ముస్లిములుగా కన్పించాలని ఇండియన్ ముస్లిమ్స్ ఎక్కువ ఓవరాక్షన్ చేస్తారు. అదో ఆనందం. ఇందులోకి పాక్ గర్ల్ ని దింపేశాడు దర్శకుడు. పాక్ మత దేశమైనా స్త్రీల వస్త్రధారణపై ఆంక్షల్లేవు. సరే, అఫ్రీన్ పాత్రలో రశ్మిక లండన్లో స్టూడెంట్. పాక్ జెండా తగులబెట్టారని ఇండియన్ కారు ధ్వంసం చేస్తుంది. ఇండో-పాక్ సరిహద్దులో పోరాటాన్ని లండన్ కి కూడా తీసికెళ్ళే ప్రబుద్ధులుంటారు. అఫ్రీన్ కి ఇండియా అంటే ద్వేషం. ఆమె కారు ధ్వంసం చేసిన వ్యవహారం కాలేజీకొస్తుంది. మేనేజిమెంట్ క్షమాపణ చెప్పమంటే చెప్పదు. ఆమె ఇండియన్స్ కి క్షమాపణ చెప్పదు. అప్పుడు ఇండియన్ కారు ఓనర్ నష్టపరిహారం కట్టాలి, లేదా జైలు కెళ్ళాలి- అంటాడు. 

    నష్టపరిహారం కడతానంటుంది. ఇండియన్స్ కి క్షమాపణ చెప్పకూడదనుకున్న మనిషి నష్టపరిహార మెలా కడుతుంది? కేసు పెట్టుకోమనొచ్చు. మీరు మా జండా తగుల బెట్టారు కాబట్టి నేను మీ కారు డ్యామేజ్ చేశానన్న వాదనతో. కానీ నష్టపరిహారం కడతాననే పాకిస్తాన్ బయల్దేరుతుంది తాతగార్ని డబ్బు అడగడానికి. అక్కడ తాతగారు ఎప్పుడో చనిపోయాడని తెలుస్తుంది. 

        విషయమేమిటంటే, కథ కోసం రామ్ సీతకి రాసిన ఉత్తరం ఆమె చేతికి రావాలి. రావాలంటే నష్టపరిహారం డబ్బుల కోసం తాత దగ్గరి కెళ్ళాలి. వెళ్తే తాత వీలునామాలో సీతకి ఉత్తర మందిస్తేనే ఆస్తి దక్కుతుందన్న షరతు తెలియాలి. దాంతో ఆమె నష్టపరిహారం డబ్బుల కోసం ఉత్తరం బాధ్యత తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పాడాలి. ఇలా కథ కోసం లండన్ సంఘటన దగ్గర్నుంచీ పాత్ర తత్వాన్ని కిల్ చేస్తూ పోవడం ఏమైనా బాగుందా?

        అయితే రశ్మిక పాత్రకి ముగింపులో ఇచ్చిన ట్విస్టు బావుంది. ఇరవై ఏళ్ళ క్రితం టెర్రరిస్టు క్యాంపు మీద రామ్ ఎటాక్ చేసినప్పుడు కాపాడిన బాలిక వహీదాయే తను అని తెలియడం. చాలా బలమైన కదిలించే సన్నివేశం. మొదట్నుంచీ పొగరు ప్రదర్శించడంలో రాణించిన రశ్మిక, ఇప్పుడు మెత్తబడే దగ్గర మార్పుని ప్రదర్శించడం కూడా బాగానే చేసింది. ఇలాటి కదిలించే సన్నివేశం ప్రేమ కథలో ఎక్కడా పైన చెప్పుకున్న కారణాలతో ఒక్కటీ లేకపోవడం విచారకరం.

        సీత కోసం, తర్వాత రామ్ కోసం అన్వేషణలో ప్రదేశాలు తిరిగే పాత్రగా రశ్మిక కథలో  సస్పెన్స్ ఏమీ పుట్టించదు - పైన చెప్పుకున్నట్టు క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ లోపించడంతో. ఇరవై ఏళ్ళుగా ఎన్నో చేతులు మారివున్న ఆ ఉత్తరం కూడా సినిమా చివరి వరకూ నలగకుండా, మాయకుండా ఫ్రెష్ గా వుంటుంది. పోస్టల్ శాఖవాళ్ళు ఎప్పటి కప్పుడు కొత్త కవర్లు అచ్చేసి సప్లై చేస్తున్నట్టు. వాళ్ళకి సీతారాముల ప్రేమ మీద ఎంత భక్తో!

        అన్వేషణలో రశ్మిక వెంట వుండే పాత్రగా దర్శకుడు తరుణ్ భాస్కర్ ఫన్నీ క్యారక్టర్ గా వుంటే సినిమాలో ఫన్ లేని లోటుని తనైనా తీర్చగలిగే వాడు. బ్రిగేడియర్ గా సుమంత్ ది కీలక పాత్ర. చివర్లో రామ్ రాసిన ఉత్తరంలో తను చేసిన ద్రోహం ఎలాటిదో బయటపడ్డాక తను తీసుకునే నిర్ణయం ఒక షాకింగ్ ట్విస్టు. అయితే దీనికో అభ్యంతరముంది. రామ్ పాత్రని దెబ్బతీసే విషయం. చివర్లో చూద్దాం.

        ఇక సుమంత్ భార్యగా భూమికది స్వల్ప పాత్ర. తాతగా పాక్ బ్రిగేడియర్ పాత్రలో సచిన్ ఖెడేకర్ కన్పిస్తాడు. జర్నలిస్టుగా ప్రియదర్శి ఒక సీన్లో వచ్చిపోతాడు. మురళీ శర్మ సుబ్రహ్మణ్యంగా నూర్జహా ప్యాలెస్ లో వుంటాడు. ఇక సునీల్, వెన్నెల కిషోర్ కమెడియన్లు ఎలా వున్నారో పైన తెలుసుకుని జ్ఞాన సముపార్జన చేశాం.  

        పాటలు కాలానికి తగ్గట్టు వున్నాయి. గందరగోళం లేదు. కెమెరా వర్క్ కూడా విరివిగా విజువల్స్ వాడకంతో కళ్ళప్పగించి చూసేలా వుంది. రెండు కాలాల పీరియెడ్ ప్రొడక్షన్ విలువలూ భారీతనంతో పురాతన ఛాయలు ప్రదర్శిస్తూ వున్నాయి- ఒక్క ఉత్తరం విషయంలో తప్ప. అప్పటి ఇంకు కూడా ఎంత గట్టిదో, రెండు దశాబ్దాలైనా ఉత్తరం మీద రాసిన చిరునామా ఏమాత్రం చెక్కు చెదర లేదు. ఈ సినిమా ఓటీటీలో వచ్చినా ఉత్తరం పదిలం, పరమ పదిలం.

చివరికేమిటి?

    వైజయంతీ మూవీసే తీసిన మహానటి (2018) కథన శైలినే తిరిగి దీనికీ వాడారు. మహానటి లో హాలీవుడ్ సిటిజెన్ కేన్ (1941) కథన శైలిని తెచ్చుకుని వాడారు. ఇద్దరు జర్నలిస్టులు (సమంతా, విజయ్ దేవరకొండ) సావిత్రి జీవితం గురించి తెలుసుకునే పరిశోధన ప్రారంభించడంతో, మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా సావిత్రి జీవితం తెలుస్తూ వుంటుంది. సీతారామం లో ఇద్దరు స్టూడెంట్లు (రశ్మిక, తరుణ్ భాస్కర్) సీతారాముల్ని అన్వేషించే క్రమంలో, వాళ్ళ ప్రేమ కథ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వస్తూంటుంది.

        ఈ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో ప్రేమ కథ ఖండ ఖండాలుగా వస్తూంటే, వాటిని జోడించుకుని చూపే విషయంపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో, ఎమోషనల్ కంటిన్యూటీకి అవరోధ మేర్పడింది. ప్రత్యక్ష కథలో రశ్మిక, తరుణ్ భాస్కర్ ల ట్రాక్ బాగా తగ్గించి వుంటే, పూర్వ కథగా వున్న ప్రేమ కథ, తక్కువ ఫ్లాష్ బ్యాకులతో, నిడివి పెరిగిన భాగాలతో ఎమోషనల్ త్రెడ్ నిర్వహణకి అనుకూలంగా వుండేది. 

అసలు పూర్వ కథలో చివర్లో తప్ప సరైన ఎమోషనే వర్కౌట్ కాలేదని పైన చెప్పుకున్నాం. రశ్మిక ట్రాక్ తీసేసి, ఫ్లాష్ బ్యాక్ ఖండికలన్నీ ఒక చోట పేర్చి చూస్తే, ప్రేమ కథలో విషయ మెంతున్నదనేది తెలుస్తుంది. 

కాన్సెప్ట్ గొప్పదే, ఇందులో సందేహం లేదు. నిర్వహణ అంత పకడ్బందీగానూ వుండాలి. ముగింపులో బాధ పెట్టే విషయమైనా లోపభూయిష్టంగా వుండకుండా చూసుకోవాలి. చివర్లో సీత విప్పి చూసిన ఉత్తరంలో రామ్ ఏమని రాశాడు? తను, బ్రిగేడియర్ విష్ణు శర్మ (సుమంత్ పాత్ర) పాక్ ఖైదీలుగా వున్నప్పుడు, అధికారులు ఒకర్ని విడిచి పెడతామంటారు. ఎవరు ఇండియన్ ఆర్మీ బేస్ వివరాలు చెప్తే వారిని విడిచి పెడతామంటారు. రామ్ చెప్తే రామ్ వెళ్ళిపోయి సీతని కలుసుకోవచ్చు. కానీ అతను దేశ ద్రోహం చేయలేడు. విష్ణుశర్మ చెప్పేసి విడుదలై వెళ్ళిపోతాడు. రామ్ ఉరికంబమెక్కుతాడు. నిజానికి విష్ణుశర్మ కూడా ఆర్మీ బేస్ రహస్యాలు చెప్పేసి ఎక్కడికీ వెళ్ళలేడు. అక్కడే కాల్చి చంపే అవకాశముంటుంది.

         క్లయిమాక్స్ లో ఈ సెటప్ అంతా, డ్రామా అంతా  పైన ఆల్రెడీ చెప్పుకున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వుండడానికి వీల్లేదు. రామ్ తను ప్రాణత్యాగం చేసి వెళ్ళిపోతే గొప్ప మనసున్న వాడవుతాడు. కానీ వెళ్తూ ఉత్తరంలో విష్ణు శర్మ గురించి రాయడమెందుకు? అప్పుడు తను చేసింది ప్రాణ త్యాగమవుతుందా, పగదీర్చుకోవడ మవుతుందా? తను గొప్పవాడవుతాడా, విష్ణు శర్మని చట్టానికి పట్టించాలన్న బుద్ధితో అల్పుడవుతాడా?

        ఉత్తరంలో నూర్జహా గురించి పేపర్ కటింగ్ పెట్టి నువ్వెవరో నాకు తెలుసని టీజ్ చేస్తాడు. తెలిసినప్పుడు ఉత్తరం మీద నూర్జహా అని రాయకుండా సీతామహాలక్ష్మి అని రాస్తే ఆ ఉత్తరం నూర్జహాకి ఎలా చేరేను? నూర్జహా అని అడ్రసు రాస్తే ఈ కథే వుండదనా?ఇలా రామ్ ఆడియెన్స్ ని కూడా చీట్ చేసి సినిమా హిట్ చేసుకున్నాడా? ఇలా అన్పించకూడదు. రైటింగ్ కి బోలెడు బడ్జెట్ వున్నప్పుడు క్వాలిటీ రైటింగ్ అవసరం. 

—సికిందర్