రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, డిసెంబర్ 2017, బుధవారం

568 : రైటర్స్ కార్నర్
(రెండో మెట్టు)
        మయపాలన దృష్ట్యా అందరు రచయితలూ కఠినమైన స్వీయ క్రమశిక్షణ కలిగి వుండాల్సి వుంటుంది. ఇది క్రమశిక్షణతో మెలగండీ అని మొక్కుబడిగా చెప్పే మంత్రా లాంటిది కాదు. సీరియస్ గా సినిమా రచన వృత్తిగా సమకూరకూరడానికి సంసిద్ధం కావడం గురించిన స్వీయ క్రమశిక్షణ అన్నమాట. మీరొక ఏడాది పాటు స్క్రిప్టు రాస్తానంటే అది నవ్వుకోవడానికి పనికొస్తుంది. మీరింకేవో వృత్తి వ్యాపకాలు చేసుకుంటూ తీరిక దొరికినప్పుడు  రాద్దాంలే అనుకుంటే మీరు ఈ రంగానికి పనికిరారు. పత్రికలకి కథలు రాసుకోవచ్చు. మీ ఇతర వృత్తి వ్యాపకాలుంటే వుండనీయండి, రాయడానికి ప్రతిరోజూ ఒక నియమిత సమయం కేటాయించుకుని రాయగల్గినప్పుడే మీరు సినిమాలకి పనికొచ్చే స్వీయ క్రమశిక్షణతో వున్నట్టని  గుర్తుంచుకోండి.

          సినిమా రచయితకి క్రమశిక్షణ లోపిస్తే  స్వయంగా కథల్ని సృష్టించలేడు సరికదా, ఇతరుల కథలకి ఎసైన్ మెంట్లు కూడా పొందలేడు.  వెర్షన్లు రాయడానికి కూడా ఎవరూ పిలవరు. ఎక్కువ ఎసైన్ మెంట్లకి గడువు పది వారాలిస్తారు. ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ పూర్తి  చేయడానికి. కొన్నిసార్లు ఇంకా తక్కువ సమయమే ఇస్తారు. మీరు గనుక ఇచ్చిన ఎసైన్ మెంటుని రెండు మూడు నెలల్లో పూర్తి చేయగల్గితే మీరు సరైన ట్రాకులో వున్నట్టని అర్ధం.  మీ భవిష్యత్తుకి మంచి బాట వేసుకుంటున్నట్టని నమ్మకం. ఫస్ట్ డ్రాఫ్ట్ తర్వాత సెకండ్ డ్రాఫ్ట్ కీ, ఫైనల్  డ్రాఫ్ట్ కీ గడువు తగ్గుతూ పోతూంటుంది. సెకండ్ కి రెండు వారాలు, ఫైనల్ కి వారమే వుంటుంది. ఇవి సైతం  గడువులోగా పూర్తి చేసి ఇస్తే మీకు తిరుగు లేనట్టే. 

          మీ సొంత స్క్రిప్టు రాసుకోవాలంటే ఒకవైపు రాసుకోండి. దాన్ని కచ్చితంగా ఓ మూడు నెలల కాలంలో మాత్రమే స్వీయ క్రమశిక్షణతో పూర్తి  చేసుకోండి. అయితే దాన్నే  పట్టుకుని వుండి పోకండి.  మీ సొంత కథ అమ్ముడుపోవాలంటే మీరు ముందు కొన్ని ఎసైన్ మెంటులు చేపట్టాల్సిందే. సమయపాలన విషయంలో ఎసైన్ మెంటులతో మీరు మన్నన పొందగల్గితే, అప్పుడు మీ సొంత కథ బయటికి తీయవచ్చు. అప్పుడు దానికుండే విలువ వేరు. ఎవరైనా మీ సొంత కథ వినడానికి ఆసక్తి అప్పుడు చూపిస్తారు. 

          మీరొక ఎసైన్ మెంటు మీద పనిచేస్తున్నారంటే దానర్ధం సినిమా నిర్మాణం ప్రారంభమైనట్టేనని గమనించండి. అది పూర్తయి విడుదల కాబోయేదేననీ నమ్మండి. ఎసైన్ మెంటు మీకు వడ్డించిన విస్తరి లాంటిది.  ఆ కథ  ఓకే అవడానికి ఆ ఒరిజినల్ రచయితో దర్శకుడో ఎన్నో కష్టాలు  పడి వుంటారు. మీరు మాత్రం ఆ కథకి ఎసైన్ మెంటు రైటర్ గా నేరుగా అవకాశం అందుకుంటారు. కాబట్టి మీ సొంత కథని ఒప్పించడానికి కష్టపడాలన్నా  మీరు విరివిగా ఎసైన్ మెంట్ల మీద పనిచేయడం అవసరం. ఇక్కడ్నించే కఠినమైన స్వీయక్రమశిక్షణని అలవర్చుకోవడం అవసరం.

కెన్ మియమోటో
(మూడో మెట్టు రేపు)  

          (టాలీవుడ్ స్వీయ క్రమశిక్షణ ఎలా మారిపోయిందంటే – ఎక్కువగా ఇలా జరుగుతుంది – దర్శకుడు రచయితలకి ఒక సీను చెప్పి రాసుకు రమ్మంటాడు. వాళ్ళల్లో ఒక రచయిత గణపతి కాంప్లెక్స్ దగ్గర కాలక్షేపం చేస్తూంటాడు. ఏమంటే మూడ్ రావడం లేదంటాడు. ఇంకో ఆయన మధురా నగర్ లో తిరుగుతూంటాడు. ఇక్కడేం చేస్తున్నావంటే, పిల్ల పరీక్షలున్నా యంటాడు. మరొకాయన మోతీ నగర్ లో తచ్చాడుతూంటాడు. ఇల్లు వెతుకుతున్నాననీ, ఇల్లు మారేక  సీను రాస్తాననీ అంటాడు. ఇలా రాయాలంటే వీళ్ళకి ఇంకేదో కావాలి. పారితోషికం ఒక్కటే సరిపోదు. మూడ్ రావాలి, పిల్ల పరీక్షలు అవ్వాలి, ఇల్లు మారాలి. ఆత్రేయ గారిలాగా  తమకూ చెల్లుతుం దనుకుంటారేమో. ముగ్గురూ పరారీలో వుంటే దర్శకుడు కంగారులో వుం టాడు. ఇంకెన్నాళ్ళు రాస్తావయ్యా అని నిర్మాత గొణుక్కుంటాడు. అప్పటికి ఏడాది కావొస్తూంటుంది  సి. )