రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

515 : రివ్యూ!

రచన – దర్శకత్వం: కె.క్రాంతి మాధవ్
తారాగణం : సునీల్, మియాజార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని, వెన్నెలకిషోర్,  ఆశీష్ విద్యార్థి, ల్లవేణు దితరులు
సంగీతం: జిబ్రాన్,  ఛాయాగ్రహణం : సర్వేష్ మురారి
నిర్మాత : పరుచూరి కిరీటి
విడుదల : సెప్టెంబర్ 15, 2017
***
          ల్లరి నరేష్, సునీల్ లు కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తే ఇద్దరి సమస్య తీరిపోతుందేమో. కామెడీలో స్పెషలైజ్ చేసే వాళ్ళకే  హీరోలుగా మారినా కామెడీ కరుణించకపోవడం కామెడీయే. సునీల్ కి ఇది ఇంకో భంగబాటు. ఈసారి మరీ చెప్పలేనంత నగుబాటు. ఒకసారి తను నటిస్తున్న సినిమాల్ని పరిశీలించుకుంటే అన్నీ ఒకే కాలం చెల్లిన పాత మూస పద్ధతిలో వుం టున్న సంగతి తెలుస్తుంది. ఈ పనిచేయకుండా ఇంకా  ఉంగరాలు, బంగారాలూ ఇలాగే నటిస్తూపోతే ఏమీ లాభం వుండదు. ఇప్పుడు వేరే కళ్ళద్దాలతో చూడాల్సి వుంటుంది. ‘ఉంగరాల రాంబాబు’ ని కూడా చూసిన కళ్ళద్దాలు నిలువుటద్దాలైతే తప్ప పరిస్థితి బాగుపడదు. ఒకసారి ఈ నిలుటద్దంలో ఏం కన్పిస్తోందో చూద్దాం...

కథ 
      రాంబాబు (సునీల్) అనే 200 కోట్ల ఆస్తికి వారసుడు తాత (విజయకుమార్) చనిపోగానే వీధిన పడతాడు. ఏం చేయాలో తోచక బాదం బాబా (పోసాని) ని ఆశ్రయిస్తాడు. ఒక కొండ ప్రాంతంలో తను ఇచ్చే మొక్క నాటితే పోయిన ఆస్తి  తిరిగి వస్తుందని బాబా ఆశీర్వదిస్తాడు. రాంబాబు ఆ మొక్క నాటుతూంటే 200 కోట్లు విలువజేసే బంగారం పెట్టె దొరుకుతుంది. దీంతో బాబా ఠారెత్తి పోయి, రాంబాబు దగ్గర నుంచి ఆ 200 కోట్లు లాగడానికి  ఏవో  సలహాలిస్తూ లక్షలు లాగుతూంటాడు. ఇందులో భాగంగా ఉంగరాల పెట్టె ఇస్తాడు. అవి ధరిస్తే శని వదుల్తుందంటాడు. భారీగా బస్సులు కొని ట్రాన్స్ పోర్టు కంపెనీ పెట్టిన రాంబాబుకి చీకాకులు ఎదురవుతూంటే, బాబా సలహామీద ఫలానా రాశిలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. ఆమె తన ఆఫీసులోనే పనిచేసే సావిత్రి (మియా జార్జి) అని తెలుస్తుంది. సావిత్రిని  ముందు నుంచే ప్రేమిస్తూంటే పట్టించుకోని ఆమెని,  కంపెనీ పని మీద అని చెప్పి దుబాయ్ తీసికెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. ఆమె తండ్రిని ఒప్పించాలంటుంది. రాంబాబు ఆమెతో కేరళలో వాళ్ళింటికి వెళ్తాడు. కమ్యూనిస్టు నాయకుడైన ఆమె తండ్రి రంగ నాయర్ (ప్రకాష్ రాజ్) క్యాపిటలిస్టు రాంబాబుని వెంటనే తిరస్కరిస్తాడు. ఆ తర్వాత కొన్ని పరీక్షలు నెగ్గాలని ఇంట్లో చోటు కల్పిస్తాడు. ఈ పరీక్షల్లో పోటీగా రంగా అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్న సుధాకర్ (వెన్నెల కిషోర్) కూడా దిగుతాడు.  ఇక ఈ పరీక్షల్లో రాంబాబు ఎలా నెగ్గి, రంగాని ప్రసన్నం చేసుకుని సావిత్రిని చేపట్టాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      బాగా అరిగిపోయిన మూస కథ. నిజానికి ఇదొక  కొత్త నేపధ్యంతో మాంచి  సెటైరికల్ కామెడీ కాగల కథ. వేసెక్టమీ అనే కొత్త నేపధ్యంతో  సెటైర్ చేస్తూ గత వారం విడుదలైన హిందీలో విజయవంతమైన  ‘పోస్టర్ బాయ్స్’ తరహాలో క్రియేటివ్ కామెడీ కాగల కథ.  మూస దృష్టి వల్ల ఎందుకూ పనికిరాకుండా పోయింది. పాయింటు కొత్తగానే  వుంది, దాని పాలనే  మూస టెంప్లెట్ సినిమాల చట్రంలో ఇరుక్కుంది. పెట్టుబడిదారీ వర్గానికి చెందిన హీరో - కమ్యూనిస్టు నాయకుడైన హీరోయిన్ తండ్రి – ఈ ఇద్దరి మధ్య  పరిష్కారం దొరకని తూర్పు పడమరల భావజాలాల సంఘర్షణ కి బదులు, కమ్యూనిస్టు తండ్రి ఇంకేవో ఫార్ములా పరీక్షలు  పెట్టడంతో – భావజాలాల నేపధ్యం బూజు పట్టిపోయింది. 

ఎవరెలా చేశారు 
     అన్నీ పాత సన్నివేశాలే కావడంతో సునీల్ కామెడీకి కొత్తగా నవ్వుపుట్టుకొచ్చే అవకాశం లేకుండాపోయింది. తను గొప్పగా వుంటుందని చేసిన కామెడీ సీన్లన్నీ పాతబడిపోయిన సీన్లే. ఎప్పుడో సత్యనారాయణ లాంటి నటులు కమెడియన్లు గా చేసినప్పుడు సీనుకో జోకర్ వేషంలో కన్పించి నవ్వించినట్టు, ఇప్పుడు సునీల్ చేయడం ఏంతో  సృజనాత్మక వెనుక బాటుతనంగా తేలింది. తను ఏం చేసినా ప్రేక్షకులు నవ్వడమే లేదు. లేచింది మహిళా లోకమని పిండి రుబ్బి పారేశారు ఎన్టీఆర్. సునీల్ రకరకాల  హీరోల బిట్ సాంగ్స్  వేసుకుంటూ ఎంత పిండి వొత్తినా,  ఎన్ని రొట్టెలు చేసినా అవుట్ డేటెడ్ గానే వేస్టయ్యింది. తను ఆల్ రౌండర్ అన్పించుకోవాలన్న కోరిక బలంగా వున్నట్టుంది సునీల్ కి. దీంతో తను నటుస్తున్నది కామెడీ కథా, కుటుంబ కథా, యాక్షన్ కథా అన్న తికమక ఏర్పడుతోంది. ఆడపిల్ల – తండ్రి సంబంధం గురించి బరువైన పాత  డైలాగులు చెప్పడం, సామ్యవాదం మీద ఉపన్యాసాలివ్వడం లాంటివి చేయడంతో ఒక పంథా లేకుండా పోయింది పాత్రకి. కనీసం తను  యాక్షన్ కామెడీలు నటించినా నటిస్తే ఫలితం వుంటుంది - కమెడియన్ అయిన తను సిక్స్ ప్యాక్ తో యాక్షన్ హీరో కావాలనుకున్నందుకు. దీన్ని కూడా అత్యాశకిపోయి ఆల్ రౌండర్ నంటూ గజిబిజి చేసుకోవడమే బాగాలేదు. 

          హీరోయిన్ గ్లామర్ బొమ్మ తప్పితే పాత్ర లేదు. ఈమె అక్క పాత్రకి ఏదో  కారణం చెప్పి మూగనోము పట్టించారు సరే, తల్లి పాత్రలో నటి కూడా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫ్రేముల్లో ఉండడమేమిటి. షాట్ పెట్టగానే ఈ తల్లీ కూతుళ్ళు పేరంటాళ్ళా వచ్చి నించుని, షాట్ పూర్తవగానే చేతులూపుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ షాట్ పెట్టగానే హాజరు. సినిమా సాంతం ఇదే రిపీటవుతూంటుంది. ఆ నటికూడా – ఏంటయ్యా నన్ను ఫోటోలు దిగడానికి పెట్టుకున్నావా – అని దర్శకుణ్ణి అడిగి వుండదు పాపం. ఈ తల్లి పాత్ర ప్రకాష్ రాజ్ పాత్రకి భార్య. ఇలా కూడా ప్రాధాన్యం లేకుండా చేశారు. ప్రకాష్ రాజ్ కూడా తన భార్య కాదన్నట్టే వుంటాడు. ఆమెతో ఒక్క డైలాగూ వుండదు. కమ్యూనిస్టు భావాలు బలంగానే వున్నాయిగానీ, కూతురు పెట్టుబడి దారీ వ్యవస్థలోనే  హీరో దగ్గర పని చేసుకుని జీవించడమేమిటి? 

          బాబాగా పోసాని షరా మామూలు నటన.  శిష్యుడుగా శీను రొటీన్. వెన్నెల కిషోర్ కి ఈసారి మూస పాత్రే. విలన్ గా ఆశీష్  విద్యార్థి ఇప్పటికీ పకడ్బందీగా వుంటాడు. కానీ విలన్ గా ఏమీ చేయకుండానే చివరికి వెళ్ళిపోతాడు తన ముఠాతో. దీంతో నిర్మాతకి క్లయిమాక్స్ పోరాటాల ఖర్చు తప్పినట్టయింది – సునీల్ కూడా పోనీలే అనుకోవడంతో. 

          సర్వేష్  మురారీ ప్రతిభనంతా చూపించుకుంటూ కెమెరా వర్క్ చేశాడు - కానీ ఏం లాభం, తనకి దీటుగా కథా కథనాలూ దర్శకత్వాలూ లేవు. జిబ్రాన్ సంగీతం డిటో. భారీగా ఖర్చు పెట్టి సినిమా తీశారు- కానీ విషయమే నాసి.

చివరికేమిటి 
        పెట్టుబడిదారీ – కమ్యూనిస్టు పాత్రల మధ్య సరికొత్తగా, స్ఫూర్తిమత్వంతో కొత్త నవ్వులు పుట్టించాల్సిన కామెడీ - ఫస్టాఫ్ టెంప్లెట్ గానూ,  సెకండాఫ్ సింగిల్ విండో  స్కీము గానూ సర్దుకుని వృధా యింది. ఫస్టాఫ్ ఒక ఫైట్, ఒక గ్రూప్ సాంగ్, హీరోయిన్ తో లవ్ ట్రాక్, ఇంకో సాంగ్, ఇంకాస్త  లవ్ ట్రాక్,  ఇంకో సాంగ్, లవ్ ఓకే, ఇక ప్రత్యర్ది పాత్ర ఎంట్రీ, ఇంటర్వెల్  లాంటి టెంప్లెట్ సినిమాలు ఎన్ని రాలేదు.  ఇక  సెకండాఫ్ లో హీరో ప్రత్యర్ధి ఇంట్లో మకాం వేసే సింగిల్ విండో స్కీముతో ఎన్ని సినిమాలు వచ్చి ఈ స్కీమే బంద్ అయిపోలేదు. అయినా ఏదో సామెత లాగా  మళ్ళీ దీన్నితీశారు. పాత దర్శకులు తమ టైం అయిపోయిందని రిటైరయ్యారు. కానీ టైం అయిపోలేదు- ఇప్పటి దర్శకుల తీరూ అలాగే వుంది. పాత దర్శకులు మళ్ళీ వచ్చేసి తమ తమ సినిమాలు నిశ్చింతగా తీసుకోవచ్చు. ఏమీ మారలేదు.

          ‘మిస్టర్’ అని ఈ మధ్యే వచ్చింది. అందులో గాంధేయ వాదుల గ్రామమని ఒక కృత్రిమత్వాన్ని సృష్టించి, ఏవో చాదస్తపు పాత్రల డ్రామాలతో బోరు కొట్టించి ఫ్లాప్ చేశారు. అక్షయ్ కుమార్ తో ‘జోకర్’  అని వచ్చింది. అందులో మొత్తం పిచ్చి వాళ్ళ గ్రామమంటూ సృష్టించి అభాసు చేసుకున్నారు. చాలా పూర్వం ‘మరో ప్రపంచం’ వచ్చింది. అందులో బాలలకంటూ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తే ఆది కూడా ఆడలేదు. విజయవంతంగా కొన్నేళ్ళ పాటు ఆడింది బహుశా  ‘రాంపూర్’  అనే  కాల్పనిక గ్రామాన్ని సృష్టించిన ‘షోలే’ ఒక్కటే. 

          మళ్ళీ ఇప్పుడు కూడా కేరళలో కమ్యూనిస్టుల  గ్రామమని సృష్టించి భంగపడ్డారు. నాటి  సోవియట్ రష్యాలో లాంటి పరిస్థితులు- సిద్ధాంతాలు – ఎవరికీ సొంతంగా ఏదీ వుండదు (వుండనివ్వదు ప్రకాష్ రాజ్ పాత్ర). ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు, ఉమ్మడి నివాసాలు, ఉమ్మడి భోజనాలు...ఒకే చోటా వండి ఇంటింటికీ పంపుతారు. సోవియెట్ లోనే ప్రజలు తిప్పికొట్టిన ఈ వ్యవస్థని ఇక్కడెవరు కోరుకుంటున్నారో గానీ, దీంతోనూ ప్రకాష్ రాజ్ పాత్రకి నిబద్ధత లేదు. పెట్టుబడిదారీ హీరో తను పెట్టే  పరీక్షల్లో నెగ్గితే కూతుర్నిచ్చేస్తాడా? ఆ వ్యవస్థని వదులుకుని రమ్మనడా? 

          హీరో తను  పెట్టుబడి దారీ వ్యవస్థా గివస్థా తెలీని అమాయకప్రాణిని అంటాడు. హీరో ఇలా తగ్గిపోతే ఇక కథలో బలాబలాల సమీకరణ ఎక్కడిది? ఇంకోటేమిటంటే,  హీరో సొంతంగా రూపాయి సంపాదించలేదు. తాత వున్నప్పుడు తేరగా అనుభవించాడు. పోగానే ఆస్తులు పోయి వీధిన పడ్డాడు. అప్పుడు దొరికిన బంగారంతో బిజినెస్ మాన్ అయిపోయాడు. ఆ బంగారం విలన్ ది. అది నాల్గు వందల కోట్లకి పెరిగింది. ఈ పరాయి సొమ్ముని చివరికి కేరళ గ్రామానికి ఎసరు పెడుతున్న ప్రభుత్వ ప్రాజెక్టు కిచ్చేసి గొప్ప సామ్య వాదంతో ‘కమ్యూనిస్టు’ అయిపోతాడు- ప్రకాష్ రాజ్ పాత్ర కి అల్లుడైపోతాడు!

          అడ్డగోలు సినిమాలు తీసేసి ఆడతాయనుకుంటే నిజంగా ఆడతాయా? ఆడుతున్నాయా? తీ స్తున్నవి అడ్డగోలు సినిమాలని ఇంకెప్పుడు తెలుస్తుంది???

-సికిందర్   
www.cinemabazaar.in