రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, మే 2019, గురువారం

833 : స్క్రీన్ ప్లే సంగతులు


     ఇంటర్వెల్ లో సీతా విజయం చూశాం. గుళ్ళో పెళ్లి చేసుకుంటానని రామ్ ని మాయ చేసి సంతకం పెట్టించుకుని వెళ్ళిపోవడం చూశాం. అయితే ఇది తాత్కాలిక విజయమేనని వూహించగలం. సెకండాఫ్ లో మళ్ళీ ఏవో అడ్డంకులొస్తాయని కూడా వూహించగలం. కానీ సీత ఇది తన పూర్తి విజయమని తనే ఫీలవుతోంది. అందువల్ల ఇది సీత తనకై తాను ఫీలవుతున్న ఇంటర్వెల్ బ్యాంగే తప్ప, ఆమె ప్రేక్షకుల కిచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమీ కాదు. ఆమెకి రివర్స్ అయితే అది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఇంటర్వెల్ బ్యాంగ్ అయ్యే అవకాశముంది. పాత్రకి రివర్స్ అవడమే సరైన ఇంటర్వెల్ అంటాడు సిడ్ ఫీల్డ్. లేదా పాత్ర దాని ప్రయాణంలో కొత్త విషయమేదో కనుగొనడం మంచి ఇంటర్వెల్ అంటాడు. ఇక ఫస్టాఫ్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పాత్ర ఏం గోల్ పెట్టుకుందో, సెకండాఫ్ ప్లాట్ పాయింట్ టూలో ఆ గోల్ వల్ల ఏం నేర్చుకుందో తెలిస్తే తప్ప ఇంటర్వెల్ ని వూహించలేమంటాడు స్టోరీ ఎనలిస్టు కరెల్ సెగర్స్ కూడా. ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ రెండిటినీ కలిపి వుంచే హుక్ లాంటిది ఇంటర్వెల్ అని కూడా అంటాడు సిడ్ ఫీల్డ్...

         సీత ప్లాట్ పాయింట్ వన్ లో ఐదువేల కోట్ల రామ్ ఆస్తికి స్కెచ్ వేసిందని తెలిసిందే. ఇక సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర, రాబోయే రామ్ ఫ్లాష్ బ్యాక్ ద్వారా, ఆమెలో పరివర్తన ఏమీ రాలేదని తెలుసుకోబోతున్నాం. 


       అంటే ఆమె ప్లాట్ పాయింట్ వన్ దగ్గరి తన స్కెచ్ ఎంత తప్పో, ప్లాట్ పాయింట్ టూ లో ఫ్లాష్ బ్యాక్ ద్వారా నిజాలు తెలిసినా తెలుసుకోవడం లేదన్న మాట.  పైగా ఇదే తలపొగరుతో - వాళ్ళమ్మ ఇచ్చిన వంద గ్రాముల బంగారానికి వడ్డీ కట్టి చెప్పండి, ఇచ్చి పారేస్తాను - అంటుంది. 

       
ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఆమె నెగెటివ్ వైఖరి, ప్లాట్ పాయింట్ టూ దగ్గర పాజిటివ్ వైఖరిగా మారనప్పుడు కథకీ పాత్రకీ అర్ధం వుంటుందా? అందుకని అర్ధవంతమైన కథకోసం, పాత్రకోసం, ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆమె వైఖరిని పాజిటివ్ గా మారిస్తే-    

       అప్పుడు ప్లాట్ పాయింట్ వన్ దగ్గర నెగెటివ్ వైఖరికీ, ప్లాట్ పాయింట్ టూ దగ్గర  ఆమె పాజిటివ్ వైఖరికీ నడుమ  వచ్చే ఇంటర్వెల్లో, ఆమెని అరెస్ట్ చేయడం ఒక ఆప్షన్. 

       
ఇలా ఆమెకి రివర్స్ అవడమే సరైన ఇంటర్వెల్. పోలీసులు వస్తున్నారని బుకాయించి ఏడ్చి, రామ్ చేత సంతకం పెట్టించుకుంటే - ఆ బుకాయింపే నిజమై పోలీసులు వూడి పడడం ఇంటర్వెల్ కి బలం. ఇంటర్వెల్ తర్వాతి సీన్లో బ్యాంకులో జరిగేదిదే. ఇంటర్వెల్లో అన్ని స్క్రిప్టింగ్ అవసరాల్ని తీరుస్తూ జరగాల్సిన అరెస్టుని, ఇంటర్వెల్ తర్వాత బ్యాంకు సీన్లో పెట్టుకున్నారు. బ్యాంకు సీను బాగాలేదు.

     మిడిల్ -2 కథనం : గుడి దగ్గర రౌడీలు మంగళ సూత్రం కోసం రామ్ ని ఇంకా కొడుతూంటారు. ప్లీజ్ నేను పెళ్లి చేసుకోవాలి వదలండని ఏడుస్తూంటాడు. అటు సీత డ్రెస్ మార్చుకుంటూ వాడెలా పోతే నాకెందుకని బ్యాంకు కెళ్తుంది. బ్యాంకు మేనేజర్ - మీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ గా వున్నాయి, ఆ డబ్బు ట్రాన్స్ ఫర్ చేసేస్తానంటాడు. పేరడుగుతాడు. ఎన్నిసార్లు చెప్పాలని పేరు చెప్తుంది. ఐడీ కార్డు తీసుకుని చూసి, పి. సీతా మహాలక్ష్మి కాదు, ఎం. సీతామహా లక్ష్మి అని వుంటే ఎమౌంటు ట్రాన్స్ ఫర్ చేయాలని మీ ఫాదర్ వీలునామా రాశారంటాడు. మధురవాడ సీతామహా లక్ష్మి, వైఫాఫ్ మధురవాడ సీతా  మహా లక్ష్మి అని వుండాలంటాడు. దీంతో అతడి మీద అరిచి గొడవ చేస్తూంటే, ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారంతో  పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారు. 

        పోలీస్ స్టేషన్లో రామ్ వచ్చి పోలీసు చట్టాలు వల్లెవేసి ఫైట్ చేసి సీతని విడిపించుకు వెళ్తాడు. రామ్ కి దెబ్బలు తగిలాయి మందు పూయమని రూప అంటే వాడు నన్ను ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని కసురుతుంది. సీత కో అసిస్టెంట్ వుంటాడు. రిజిస్టర్డ్ మ్యరేజికి ఏర్పాట్లు చేయమని అతడికి చెప్తుంది. ఆ సర్టి ఫికేట్ బ్యాంకులో చూపించి డబ్బు ట్రాన్స్ ఫర్ చేయించుకుంటానంటుంది. సీఐ పట్టుకోవడానికొస్తే పారిపోతుంది. పరారీలో వుంటూ బెయిల్ కోసం అప్లై చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమె కోర్టు కెళ్ళకుండా పట్టుకోమంటాడు. అప్పటికే ఆమె కోర్టులో వుంటుంది. ఎమ్మెల్యే తన లాయర్ని పంపించి సీత లాయర్ని బెదిరిస్తే సీత లాయర్ తప్పుకుంటాడు. ఇంకే లాయర్ ఒప్పుకోడు. రామ్ ముందుకొస్తాడు వాదించడానికి. పదిన్నర అవడంతో తీ కావాలని మారాం చేయడంతో అభాసు అవుతుంది. సీత అతణ్ణి బహిరంగంగా బాగా దూషిస్తుంది. వేరే లాయర్ వాదించి జడ్జి వేసిన రెండేళ్ళ శిక్షని ఏడాదికి తగ్గిస్తానంటుంది. ఇంతలో రామ్ వచ్చేసి - నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ యాక్ట్ 1881 సెక్షన్ 130 ని ప్రస్తావించి వాదిస్తాడు. జడ్జి అరెస్టు వారెంట్ చెల్లదని కేసు కొట్టేస్తాడు. 

        ఇక రామ్ ని చంపమని ఆదేశిస్తాడు ఎమ్మెల్యే. ఇది భూటాన్ లో మతగురువు సిక్స్త్ సెన్స్ కి అంది, రామ్ ని కాపాడమని ఇద్దరు శిష్యుల్ని పంపిస్తాడు. రామ్ మీద ఎటాక్ జరుగుతూంటే, కేసు గెలిచిన రామ్ ని చూడాలని సీత దగ్గరికి వస్తాడు ఆమె తండ్రి లాయర్. ఆమె పెడసరంగా మాట్లాడుతూంటే ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు - 

        ఫ్లాష్ బ్యాక్ : సీత తండ్రి భాగ్యరాజ్ వ్యాపారంలో పెట్టుబడి తగ్గిందని భార్యని నగలు అడుగుతాడు. ఇవ్వనంటుంది. భాగ్యరాజ్ చెల్లెలు ముందుకొచ్చి మంగళ సూత్రం సహా నగలన్నీ ఇచ్చేస్తుంది. ప్రమాదంలో భర్తతోబాటు చనిపోతుంది. మేనల్లుడు రామ్ ని తెచ్చుకుని పెంచుకుంటాడు భాగ్యరాజ్. వ్యాపారంలో బాగా కలిసి వచ్చి సంపన్నుడవుతాడు. భార్య జల్సాలు చేస్తూంటే వారిస్తాడు. ఈ సంపద ఆనాడు సాయపడ్డ తన చెల్లెలిదనీ, ఆమె వారసుడు రామ్ కే చెందుతుందనీ, తను కేవలం మేనేజర్ననీ, ‘కాబట్టి నువ్వు జీతగాడి భార్యవే’ ననీ చెప్పేస్తాడు. కోపంతో ఆమె సీత ఒంటి మీది నగలు లాగేస్తూంటే, రామ్ కి కాబోయే భార్యగా ఆమె అర్హురాలు అంటాడు. దీంతో రామ్ మీద కక్ష పెంచుకున్న భార్య, చిత్ర హింసలు పెడుతుంది. దీంతో రామ్ ని భూటాన్ మఠంలో చేర్పించేశాడు భాగ్యరాజ్ ...ఫ్లాష్ బ్యాక్ ఓవర్. 

        ఇది విని సీత నిర్లక్ష్యంగా - వాళ్ళమ్మ ఇచ్చిన వంద గ్రాముల బంగారానికి వడ్డీ కట్టి చెప్పండి, ఇచ్చి పారేస్తాను - అంటుంది. ప్లాట్ పాయింట్ టూ.

      ఈ మిడిల్ టూ కథనంలోనూ రోమాంటిక్స్ లేదు. కేవలం ఎకనమిక్స్ తో డ్రైగా సాగుతుంది. ఎకనామిక్స్ కూడా ఎలా వుందో చూస్తున్నదే. ఆమె బ్యాంకు సీను ఎంత లాజిక్ ని వదిలేద్దామనుకున్నా, సినిమాటిక్ లిబర్టీ కింద ఎంత సావధానంగా చూద్దామన్నా కుదరడం లేదు. ఒక వైపు చెక్ బౌన్స్ కేసు వుంటే ఆమెతో ఎలా వ్యవహరించాలి. ముందుగా - మీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ గా వున్నాయి, డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తానన్న మేనేజర్, ఐడీ అడిగి పేరు కరెక్ట్ గా లేదనడమేమిటి. వీలునామా తో బ్యాంకుకేం సంబంధం. అసలు రామ్ ఎక్కౌంట్ ఈ బ్రాంచి లోనే వుందా. ఎప్పుడు తెరిచాడు... చాలా శోచనీయంగా వుంది సీను. 

        మళ్ళీ ఎమ్మెల్యే ట్విస్ట్ ఇవ్వడం, సీత అరెస్ట్ అవడం, పోలీస్ స్టేషన్ కి రామ్ వచ్చి, తను ఫస్టాఫ్ లో లాయర్ దగ్గర ఒక్కసారి  ‘చదివేసిన’  లా బుక్ లో చట్టాల్ని వల్లించి, పోలీసుల్ని కొట్టి, సీతని విడిపించుకోవడం...ఇదంతా యాక్షన్ పార్టు. మళ్ళీ రిజిస్టర్ మ్యారేజి ప్లానేస్తూ ఇంకో ట్విస్టు. ఆ సర్టిఫికేట్ చూపిస్తే ఎమౌంట్ ట్రాన్స్ ఫర్ అవుతుందట. ఆమె దగ్గరున్న డాక్యుమెంట్స్ వొళ్ళు మండిన అసిస్టెంట్ కాల్చెయ్య బోతే రాం వచ్చి కాపాడతాడు. కానీరాం కి ఇప్పటికీ సేత కుట్రలు తెలియవు. 

        ఇక సీతని పట్టుకోవడానికి మళ్ళీ సీఐ హడవిడి. నిజానికి చెక్ బౌన్స్ కేసులో వారెంట్ వుండగా, పోలీస్ స్టేషన్ లో పోలీసుల్ని కొట్టి పారిపోయిన కేసు కూడా పెట్టాలి సీఐ. కోర్టులో ఈ అఫిడవిట్ వేస్తే ఆమెకిక డిఫెన్స్ వుండదు. కానీ  ఆమె బెయిల్ కి వేసిందని ఎమ్మెల్యే అంటే, సీఐ బెయిల్ని అడ్డుకోవడానికి కోర్టుకి సీత వస్తే అరెస్ట్ చేద్దామనుకుంటాడు. విచిత్ర మేమిటంటే, ఏ కింది కోర్టులో ఆమె మీద చెక్ బౌన్స్ కేసుందో,  ఆ కోర్టులోనే ముందస్తు బెయిల్ అప్లికేషన్ వేయడం. ఇది చెల్లుతుందా? ముందు కోర్టుకి లొంగిపోవాలి. ఆ తర్వాత బెయిల్ కి పెట్టుకోవాలి. లొంగిపోవడం ఇష్టం లేకపోతే, హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని సేఫ్ అయిపోవాలి. 

        కానీ అదే కింది కోర్టులో జడ్జిగారు బెయిల్ అప్లికేషన్ స్వీకరించి దాని మీద కథ నడుపుతాడు. సీతకి చెక్ బౌన్స్ కేసులో ఏకంగా రెండేళ్ళు శిక్ష కూడా అప్పుడే వేసేస్తాడు. ఇక భూటాన్ రామ్ గారు వచ్చేసి అప్పుడొకే ఒక్కసారి చదివేసిన బుక్కులోంచి, లా పాయింట్లు పీకి, తన అతీత శక్తులతో ఏకే సరికి - జడ్జిగారు విపరీతంగా బాధపడిపోయి  తీర్పు మార్చుకుంటాడు. ఇక అరెస్టు లేదు గిరెస్టు లేదు పొమ్మంటాడు. మరెందుకు ఇంత  అరెస్ట్ వారెంట్ ఇచ్చి, భూటాన్ నుంచీ నాంపల్లి దాకా ఇంత కథ నడపడానికి కారకుడయ్యాడు? దర్శ
కుడు ఎలా చూపిస్తే అలా క్యాలిక్యులేటర్ (మెదడు) లేకుండా చూడాలన్నట్టుంది. 

        ఇక మరో ఫ్లాష్ బ్యాక్ తో ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో విషయం తెలిశాక కూడా సీతలో మార్పు రాలేదంటే... స్క్రీన్ ప్లే క్షమిస్తుందా? 

సికిందర్