రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, April 4, 2017

     క్రైం జానర్ సినిమా అర్ధమవాలంటే డిటెక్టివ్ సాహిత్యం తెలుసుకోవాలి.  ఫిలిం నోయర్ గా పుట్టిన  క్రైం జానర్ డిటెక్టివ్ సాహిత్యంలోంచే పుట్టింది 1930 లలో. ఇప్పుడు తెలుగులోనూ డిటెక్టివ్ సాహిత్యం లేకపోవచ్చు. కానీ  దాని వారసత్వంగా క్రైం జానర్ తో సినిమాలు వుంటూనే వున్నాయి. కాబట్టి అసలీ క్రైం జానర్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే డిటెక్టివ్ సాహిత్య చరిత్రలోకి వెళ్ళాలి. ఫిలిం నోయర్ సినిమాలలో  ప్రధానంగా వుండే ఎలిమెంట్స్  గనుక చూస్తే- ఓ హత్య జరుగుతుంది, ఆ హత్య కేసుని ఒక డిటెక్టివ్, లేదా ఇన్వెస్టిగేటర్ దర్యాప్తు చేస్తాడు. ఇతనే కథానాయకుడు. మరో  రెండు స్త్రీ పాత్రలుంటాయి -  ఒకటి నెగెటివ్, ఇంకోటి  పాజిటివ్;  కథ నగర ప్రాంతంలోనే జరుగుతుంది, చాలా  వరకూ రాత్రి పూటే జరుగుతుంది, వర్షం కూడా  పడితే పడవచ్చు, డైలాగులు పదునుగా  పోయెటిక్ గా వుంటాయి, ప్రధాన పాత్రలన్నీ ఉన్నత వర్గాలకి చెందినవే అయివుంటాయి,  ఉన్నత వర్గాల హిపోక్రసీని ఎండగట్టడం , కాల నేపధ్యంతో బాటు, సమాజ నేపధ్యాన్ని కూడా జోడించడం  ఈ జానర్ ప్రధాన లక్షణాలుగా వుంటాయి.

           తెలుగులో డిటెక్టివ్ సాహిత్యానికి సుదీర్ఘ చరిత్రే వుంది. గొప్ప గొప్ప పండితులూ ఈ సాహిత్యాన్ని రాసిన వాళ్ళల్లో వున్నారు. 1950 లలో పాంచకడీ దేవ్ అనే రచయిత బెంగాలీలో పుంఖాను పుంఖాలుగా డిటెక్టివ్ నవలలు రాసే వారు. సర్ ఆర్ధర్ కానన్ డాయల్ సృష్టించిన సుప్రసిద్ధ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ నీ, ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ సృష్టించిన ప్రఖ్యాత  క్రిమినల్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ నీ,  తలపించేలా పాంచకడీ దేవ్ సృష్టించిన  డిటెక్టివ్ అరిందమ్ పాత్రతో, బెంగాలీ నవలల్ని  ప్రసిద్ధ వేంకట పార్వతీశ్వర కవులు తెలుగులోకి అనువాదం చేసి ముద్రించేవారు.

           కవి సామ్రాట్  విశ్వ నాథ సత్యనారాయణ కూడా ‘దిండు కింద పోక చెక్క’ అనే  డిటెక్టివ్ నవల రాసిన వారే. ఇక ప్రసిద్ధ కవి, పరిశోధకుడు, సినిమా రచయిత  ఆరుద్ర 1950 లో ‘పలకల వెండి గ్లాసు’ అనే  డిటెక్టివ్ నవల రాశారు. ఆ తర్వాత అణాకో బేడ స్టాంపు’, ‘అహింసా రౌడీ’, ‘రెండు రెళ్ళు ఆరు’, ‘ఆనకట్ట మీద హత్య’, ‘త్రిశూలం’, ‘కొండచిలువ మొదలైన డిటెక్టివ్ నవలలెన్నో  రాశారు. చివరిగా 1957 లో ‘ఆడదాని భార్య అనే డిటెక్టివ్ నవల రాశారు. పాలగుమ్మి పద్మరాజు కూడా  చచ్చి సాధించేడుఅనే అపరాధ పరిశోధక నవల రాశారు. 

          ఇదంతా ఒకెత్తయితే,  1930 లలోనే దాదాపు వెయ్యి నవలలు రాసి చరిత్ర కెక్కిన కొవ్వలి లక్ష్మీ నరసింహారావు, వంటింటీ స్త్రీలకి వాడుక భాషలో తన నవలలద్వారా అక్షరాస్యతనీ, పఠనాసక్తినీ పెంచారని పేరుగడించారు. ఈయన కూడా అలవోకగా డిటెక్టివ్ నవలలు  రాసి అవతల పడేయడం ఒకెత్తూ . డిటెక్టివ్ సాహిత్యంలో ఈ మొదటి తరం రచయితలిలా వుండగా, రెండో తరం వచ్చేసి 1950 లలోనే కొమ్మూరి సాంబశివరావుతో ప్రారంభమయ్యింది. ఈయన సగటు పాఠకుడి భాషలో ఆధునికంగా రాయడం మొదలెట్టారు. తెలుగులో ఆధునిక డిటెక్టివ్ సాహిత్య పితామహుడు ఆయనే. మద్రాసులో వుండే ఆయన సృష్టించిన డిటెక్టివ్ యుగంధర్ పాత్ర జంటిల్ మెన్ పాత్ర. చదువుతూంటే ఎలాటి వారికైనా ఈ పాత్రమీద గౌరవం ఏర్పడుతుంది. యుగంధర్ అసిస్టెంట్  రాజు, ఇంకో చైనీస్  అసిస్టెంటు కాత్యా, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  స్వరాజ్యరావు పాత్రలతో ఆయన నవలలు మూడు దశాబ్దాల పాటూ ఒక క్రేజ్. 

         ఇక టెంపోరావ్ అయితే చెప్పనే అక్కర్లేదు- డిటెక్టివ్ పరశురాం, డిటెక్టివ్ వాలి అనే పాత్రలతో వందలాది నవలలు రాసేశారు. ఇంగ్లీషులో ‘టెంపో’ అనే పత్రికని స్థాపించి, అందులో కూడా తన రచనల ఆంగ్లానువాదాలు ప్రచురించే వారు. సినిమారంగంపత్రిక సబ్ ఎడిటర్  గడియారం వెంకట గోపాలకృష్ణ - జి.వి.జి పేరుతో  డిటెక్టివ్ నవలలు రాసేవారు. ఇలా ఈ డిటెక్టివ్ సాహిత్యపు  పురుగు కుట్టని రచయితలూ, పాఠకులూ లేరంటే అతిశయోక్తి కాదు.    ఈ నేపధ్యంలో డిటెక్టివ్ సాహిత్యం గురించి మరికొంత సమాచారం తెలుసుకుంటే బావుంటుందన్న ఉద్దేశంతో,  2000 జులై  2  ‘ఆంధ్రభూమి’ ఆదివారం అనుబంధంలో ‘మాయమైన డిటెక్టివ్’  పేర ఈ వ్యాసకర్త  రాసిన కవర్ స్టోరీని ఇక్కడ ఇస్తున్నాం, ఆసక్తి వుంటే చదవండి... 
                                            ***
        లే చిత్రంగా తోచే స్థితి ఇది... పుస్తకాల్నిండా డిటెక్టివ్ పాత్రలున్నప్పుడు,  బయటెక్కడా డిటెక్టివ్ లు కన్పించలేదు మన దేశంలో. ఇప్పుడు బయట అడుక్కో ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థ వెలుస్తున్నప్పుడు, పుస్తకాల్లోంచే మాయమైపోయాడు డిటెక్టివ్ అనే వాడు!

          క్రైం సాహిత్యంలో డిటెక్టివ్ పొందింది  మామూలు మరణం కాదు – శాశ్వతంగా ఆ జాతి అంతరించిపోయింది, రాక్షస బల్లులు డైనోసారస్ లకి మల్లే.
         
           ఈ పరిణామం ఒక్క తెలుగు డిటెక్టివ్ సాహిత్యానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల క్రైం సాహిత్యాల నుంచీ డిటెక్టివ్ మాయమై పోయాడు.

          తెలుగులో శవ సాహిత్యంగా పేరు బడి, అస్పృశ్యతకి  గురైన క్రైం సాహిత్యమే, అనంతర కాలంలో స్టార్ రైటర్ల చలవతో తెలుగు వారపత్రికల కెక్కి,  పాపులరవడం, గౌరవం పొందడం  ఒక వింత. నవలా సాహిత్యమంటే ఇదేనేమో అన్నంత భ్రమలో పాఠకులూ  పడిపోయి, వార పత్రికల్లో స్టార్ రైటర్స్ రాస్తున్న క్రైం థ్రిల్లర్ సీరియల్స్ కి దాసోహమైపోయారు- ఒకప్పుడు డిటెక్టివ్- క్రైం సాహిత్యాన్ని శవ సాహిత్యమని ఛీ కొట్టిన ఉత్తమ సాహిత్యాభిలాషులే,  పాఠకురాళ్ళే, విపరీత క్రేజ్ తో అటువంటి  సీరియల్స్ నే  అక్కున జేర్చుకోవడం మొదలెట్టారు. 

          వార పత్రికల్లో ఆ పాపులర్ సాహిత్యమంతా కూడా మంత్ర తంత్రాల క్షుద్ర సాహిత్యం తోనే మొదలైంది. ఒకప్పుడు పావలాకి  అద్దెకి దొరికే డిటెక్టివ్ నవలలంత సమాన వైభోగమే ఇది. కానీ పాపులర్ నవలా రచయిత లెవరూ డిటెక్టివ్ ని  బతికించుకోవాలనే ఆలోచనే చేయలేకపోయారు.

          అప్పటివరకూ వున్న  క్రైం- డిటెక్టివ్ రచయితలూ వార పత్రికలకి ఎక్కలేకపోయారు. ఒక్క మధుబాబు విషయంలో అది సాధ్యమైనా, ఆయన సృష్టించిన లెజండరీ పాత్ర ‘షాడో’ డిటెక్టివ్ కాదు, ఒక యాక్షన్ హీరో. డిటెక్టివ్ యుగంధర్, అసిస్టెంట్ రాజు పాత్రలతో మూడు దశాబ్దాల పాటూ  మకుటం లేని మహారాజులా వెలిగిన కొమ్మూరి సాంబశివరావు,  చరమ దశలో ‘ఉదయం’ వీక్లీలో అతి కష్టంగా ఓ డిటెక్టివ్ సీరియల్ రాయగల్గారు ఆ పాత్రలతో, అంతే. చిన్నచిన్న క్రైం కథల్ని ప్రచురించాడానికే అదేదో మర్యాద తక్కువగా వెనుకాడిన వార పత్రికలే,  ఈ ట్రెండ్ లో ఇక ఏకంగా క్రైం –సెక్స్- హార్రర్  కథాంశాలతో,  శైలీ శిల్పం సరైన భాషా వుండని చవకబారు సీరియల్స్ కూడా ప్రచురించడం మొదలెట్టాయి- వాటిని కుటుంబాల డ్రాయింగ్ రూముల్లోకీ తీసికెళ్ళి పోయాయి. సీరియల్స్ పేరుతో  కాపీ రాయుళ్ళనీ, ఘోస్టు రచయితల్నీ ఉత్పత్తి చేసి, ఒక ఆంధ్రా హెరాల్డ్ రాబిన్స్ నీ, ఇంకో ఆంధ్రా ఆర్ధర్ హెయిలీ నీ, మరింకో ఆంధ్రా సిడ్నీ షెల్డన్ నీ ఆడా మగా అమాయక పాఠకుల మీద రుద్దాయి గానీ, ఒక్కరంటే ఒక్క ఆంధ్రా కానన్ డాయల్ ని గానీ, ఆంధ్రా జేమ్స్ హేడ్లీ ఛేజ్ ని గానీ, ఆంధ్రా అగథా క్రిస్టీ ని గానీ  అందివ్వలేకపోయాయి.

          జనబాహుళ్యంలో పఠనాశక్తిని పెంచింది అణా అద్దె డిటెక్టివ్ నవలలే.  పేపరైనా చూడని మొహాలకి చదివే క్రేజ్ ని నేర్పింది ఈ శవ సాహిత్యమనే డిటెక్టివ్ నవలలే. బడి కెళ్ళే బుడ్డి వెధవ దగ్గర్నుంచీ, సోడాలమ్మే మిడిమిడి జ్ఞానపు కామన్ మాన్ వరకూ-  దొంగచాటున డిటెక్టివ్ ల్ని చదివి ఎంతో కొంత అక్షర జ్ఞానంతో  బాటు, విషయ పరిజ్ఞానం పెంపొందించుకున్న వాళ్లెందరో. 

          మద్రాసు కేంద్ర స్థానంగా విరివిగా ఉత్పత్తి అయ్యే డిటెక్టివ్ నవలలు  చొరబడని ఆంధ్రప్రదేశ్ గ్రామమంటూ లేదు. అతి చిన్న సమూహంగా వుండే  ఈ సాహిత్యాభిమానులు, పదుగురి ముందు ఈ నవలలు చదివితే చీప్ టేస్టు వెధవలుగా చిన్న చూపుకి  గురయ్యే వారు. ప్రపంచంలో ఇంకే భాషలోనూ డిటెక్టివ్ సాహిత్యానికి ఈ గతిపట్టలేదు,  సరికదా విన్ స్టన్ చర్చిల్ లాంటి మహానుభావులు రాత్రి పూట డిటెక్టివ్ నవల చదవనిదే నిద్రపోయే వాళ్ళు కాదు.  తెలుగులోనే తామేదో గొప్ప  టేస్టున్న మొనగాళ్ళమని పోజు కొట్టే వాళ్ళు ఈ గతి పట్టించారు.

          ఈ డిటెక్టివ్ నవలలకి కూడా చాటుమాటుగా పట్టుకెళ్ళ డానికీ, దొంగచాటుగా చదువుకోవడానికీ అన్నట్టు ఒక అనువైన సైజు వుండేది. సరీగ్గా జేబులో పట్టే పాకెట్ సైజు (ఈ వ్యాసకర్త నిక్కరు జేబుతో లాభం లేక, పొత్తి కడుపులో దోపుకుని తిరిగే వాడు ఎనిమిదో తరగతి చదువుతూ కొమ్మూరి నవలల్ని. ఒకసారి తండ్రి చేత తొడపాశం కూడా పెట్టించుకున్నాడు. అయినా ఏనాడూ వదల్లేదు ఈ సాహిత్యాన్ని. ఆ నిర్బంధ పరిస్థితులు ఈ వ్యాసకర్తలో ఏకంగా డిటెక్టివ్ రచయిత ఉద్భవించేలా చేశాయి!). నవలలతో  పరిస్థితి ఇలా వుండగా, మరోవైపు ఒక మాస పత్రికతో  వేరేగా వుండేది. ‘అపరాధ పరిశోధన’ అనే ఆ మాసపత్రిక పెద్ద మనుషుల బుక్ షెల్ఫుల్లోకి చేరేది. భువనగిరికి చెందిన శ్యామ దామోదర రెడ్డి 1960 లలోనే హైదరాబాద్ నారాయణ గూడాలో ప్రారంభించిన ఈ డిటెక్టివ్ మాస పత్రికకి మంచి గౌరవం లభించేది. డాక్టర్ దాసరినారాయణ రావు కూడా తమ పాఠకులే అని దామోదర్ రెడ్డి చెప్పేవారు. ఎందరో ఉన్నతాధికారులు, వైద్యులు, న్యాయవాదులూ, ప్రవాసాంధ్రులు కూడా  చందాదార్లుగా వుండే వారు. పాఠకు రాళ్ళ సంఖ్యా తక్కువేం కాదు. ప్రతినెలా ఒక డిటెక్టివ్ కథల పత్రిక, దాంతో పాటూ నాల్గు డిటెక్టివ్ నవలికల సప్లిమెంటరీ వెలువడేవి. ఇవీ పాకెట్ సైజులోనే వుండేవి. తెలుగు డిటెక్టివ్ సాహిత్యానికి ‘అపన’ (‘అపరాధ పరిశోధన’ ముద్దు పేరు) సమకూర్చి పెట్టిన గౌరవ ప్రతిష్టలూ, చేసిన సేవా మరే పత్రికా చేయలేదు. 

కొమ్మూరి సాంబశివరావు 
         మద్రాసు నుంచే సినీనిర్మాత వైవీ రావ్ కొన్నాళ్ళు ‘డిటెక్టివ్’ అనే పత్రిక నడిపారు. విజయబాపినీడు ‘క్లూ’ అనే పత్రిక  నడుపుతూ ఆపుతూ వుండేవారు. అపన మాత్రం ఏ నెలా ఆగకుండా మూడు దశాబ్దాలూ  నడిచింది ( చరమ దశలో ఈ వ్యాసకర్త ఓ యాభై కథలూ, డెబ్బై నవలికలూ, ఇంకో రెండు సీరియల్సూ  ఆరేళ్ళ పాటూ రాసి అస్త్రసన్యాసం చేశాడు).
(ps : 1996- 2010 మధ్య ఆంధ్రభూమిలోనూ, ఆంధ్రజ్యోతిలోనూ 700 వరకూ క్రైం, డిటెక్టివ్  కథలు రాశాడు).
            యండమూరి, మల్లాదిలు కూడా ఈ పత్రికలో రాసిన వారే. ఇక మద్రాసు, విజయవాడ కేంద్ర స్థానాలుగా  కొమ్మూరి సాంబ శివరావు, టెంపోరావ్, గిరిజ శ్రీ భగవాన్, విశ్వ ప్రసాద్, విశ్వ మోహన్, కృష్ణ మోహన్, విజయబాపినీడు, కనక మేడల, భయంకర్, గుత్తా బాపినీడు, డాక్టర్, కొప్పిశెట్టి ... చెబుతూ పోతే జాబితా అంతమవదు- ఈ హేమాహేమీలు పుంఖానుపుంఖాలుగా  డిటెక్టివ్ నవలల్ని వెలువరుస్తూంటే, హైదరాబాద్ నుంచి ‘అపన’ ద్వారా మల్లాది వెంకట కృష్ణ మూర్తి, వసుంధర, శ్యాం బాబు, ముద్దా సురేష్, బొమ్మిడి అచ్చారావు, రమణ శ్రీ, తిరుమల శ్రీ, ఏవీ మోహన్రావ్, రంకిరెడ్డి రాము, అజీజ్, ఎంవివి సత్యనారాయణ, విఎస్ చెన్నూరి,  కురుమద్దాలి విజయలక్ష్మి, సామవేదుల గీతారాణి, విద్వాన్ షీలా దేవి, సికిందర్ ...మరెందరో రచయితలూ తమతమ  కలాలకి పదును పెడుతూ- మెదడుకి మంచి మేత పెట్టే, ఎక్కడ్నించీ కాపీ కొట్టని-  ఒరిజినల్ రచనల్ని అందించే వారు.

          ఈ వైభవమంతా వారపత్రికలలో పాపులర్ సీరియల్స్ అనే ఒక్క గాలివాటుతో హరప్పా - మొహంజొదారో అయిపోయింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే రచనా విధానం  పాఠకులకి విపరీతంగా నచ్చేసి,  ఆ రకపు సాహిత్యం వైపు మళ్ళడంతో,  ఉన్న ఆ ఒక్క డిటెక్టివ్ మాస పత్రికా మూతబడిపోయింది. దాంతో ఆ రచయితల్లో అనేకులు కనుమరుగయ్యారు, మిగిలిన వాళ్ళు ఇతర ప్రక్రియల మీద దృష్టి పెట్టారు. సాహితీ వేత్తలు ఒప్పుకోరేమో గానీ, ఇక్కడ చెప్పుకోదగ్గ విశేష మేమిటంటే, ఏ కథల్ని గతంలో శవ సాహిత్యమని ఈసడించుకునే వారో,  ఆ  డిటెక్టివ్ కథల్లో భాష బతికేది. శుభ్రమైన తెలుగుతో వర్ణనలు సింపుల్ గా వుండేవి. వార పత్రికల్లో పాపులర్ సీరియల్స్ ట్రెండ్ మొదలయ్యాక,  తెలుగెలా తయారయ్యిందో, వర్ణనలు, సన్నివేశాలూ ఎలా వుండేవో  చూసిందే. కనుగుడ్లు పీకేసే హార్రర్, ఐసు  దిమ్మెల్లో చిత్ర హింసలు పెట్టే  థ్రిల్స్ , నడిచే రైల్లో గుడ్డ లిప్పుకునే సెక్స్, కరిచే చలిలో నరికి వేతల ఉన్మాదం... కలగలిసిన కాక్ టెయిల్ పానీయాల మత్తులో పాఠక లోకం మైమరచి పోవడంతో- ఇక కుశాగ్రబుద్ధి బలం గల డిటెక్టివ్ చచ్చి వూరుకోక తప్పలేదు. 

          ‘రాజూ, అతన్ని  వెంటాడు... కానీ జాగ్రత్త, అతడి దగ్గర పిస్తోలుంటుందేమో' అని హెచ్చరించే మృదుభాషి అయిన కొమ్మూరి డిటెక్టివ్ యుగంధర్ గొంతు మూగబోయింది. 

          ‘ఈ నేరం చేసి నువ్వు తప్పించుకోలేవ్ రాజారావ్!’  అని ఎంతటి వారినైనా నింపాదిగా పైప్ పీలుస్తూ, ఏక వచనంలో సంబోధించే టెంపో రావ్ డిటెక్టివ్ వాలి తూలిపోయాడు.

          ‘రేయ్ బద్మాష్! ఇది దేశ ద్రోహంరా!’ అని శత్రువుని చెండాడే గిరిజశ్రీ భగవాన్ డిటెక్టివ్ నర్సనూ మాయమైపోయాడు. 

          ఇలా మూడున్నర దశాబ్దాల పాటు మూడు తరాలకి చెందిన రచయితలు కాపాడిన తెలుగు డిటెక్టివ్ తనువు చాలించాడు. మొదటి తరం ఆరుద్ర, కొవ్వలి వంటి  వారిదైతే, రెండో తరం కొమ్మూరి, టెంపో రావ్ లది. మూడోతరం ‘అపన’ రచయితలది.

          తెలుగు డిటెక్టివ్ సాహిత్యపు పరిసమాప్తికి స్థూలంగా పైన పేర్కొన్న కారణాలు కన్పించినా, లోతట్టులో చూస్తే, మరో కోణం కన్పిస్తుంది. ఇదే ఆంగ్లంతో సహా అన్ని భాషల్లోని డిటెక్టివ్ పాత్రలూ అంతర్ధానమవడానికి   కారణంగా అన్పిస్తుంది. ఆంగ్ల డిటెక్టివ్ సాహిత్యానికి స్వర్ణయుగం   1930ల నాటి కాలం. అప్పటికే కొన్నేళ్లుగా సర్ ఆర్ధర్ కానన్ డాయల్ సృష్టించిన షెర్లాక్  హోమ్స్ పాత్ర వుండగా, 1930 లలోనే మరిన్ని సుప్రసిద్ధ డిటెక్టివ్ పాత్రలూ పుట్టాయి. అగథా క్రిష్టీ – హెర్క్యూల్ పైరట్, ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ – పెర్రీ మేసన్ ( క్రిమినల్ లాయర్), రేమండ్ చాండ్లర్ -  ఫిలిప్ మార్లో మొదలైనవి. ఇదే కాలంలో డరోతీ సేయర్స్, జూలియన్ సైమన్స్, మార్గరెట్ కోల్ వంటి రచయిత్రులూ రాజ్యమేలారు. మార్గరెట్ కోల్ అయితే నాజీ నియంత హిట్లర్ అభిమాన రచయిత్రి. ఈ కాలంలోనే ఆంగ్ల డిటెక్టివ్ సాహిత్యపు వైభవానికి ముగ్ధుడై – నంబర్ వన్ హాస్య నవలా రచయిత పిజి ఓడ్ హౌస్ త
ను రాసిన ‘ములినర్స్ నైట్స్’  నవల్లో – ఈ ఆధునిక జీవితంలో ప్రజానీకాన్ని మిస్టరీ నవల కట్టిపడేస్తున్నంతగా మరేదీ కన్పించదు- అని ఒక పాత్ర చేత చెప్పించాడు....

(మిగతా రేపు)



-సికిందర్