రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, సెప్టెంబర్ 2018, ఆదివారం

678 : ఫ్లాష్ బ్యాక్ / రివ్యూ!దర్శకత్వం : సురేందర్ రెడ్డి 
తారాగణం : మహేష్ బాబు, అమృతా రావ్, కోట, బ్రహ్మానందం, సునీల్, మురళీ శర్మ, నాజర్, ఆశీష్ విద్యార్ధి తదితరులు
సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
బ్యానర్స్ : యూటీవీ మోషన్ పిక్చర్స్, కృష్ణా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు : రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఘట్టమనేని రమేష్ బాబు
విడుదల : అక్టోబర్ 19, 2007

***
     ఇది సింథటిక్ సినిమాల కాలం. సినిమాల్లో విషయం లేకున్నా టెక్నికల్ హంగామా అంతా భారీగా వుంటుంది. అవే పాత మూస కథలకి అధునాతన సాంకేతిక హంగులు జోడించి కొత్తగా ఆకర్షించే ప్రయత్నాలు. వర్గాల కతీతంగా ప్రేక్షకులందరిలో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ పెంచుకున్న టాప్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సైతం గత కొంత కాలంగా క్వాలిటీ కరువైన సినిమాలతో కాలక్షేపం చేయడం విచిత్రం. గ్లామర్ అనేది ధరించే పాత్రల బలం వల్ల పెరుగుతుంది గానీ, లుక్స్ మార్చినంత మాత్రాన కాదు. మహేష్ బాబు ఏ సినిమాకా సినిమాగా కొత్త లుక్స్  మీద పెడుతున్న శ్రద్ధ సినిమాల్లో విషయం మీద పెట్టకపోవడం విచారకరం. ‘అతిధి’ కూడా ఈ కోవలోకే చేరిపోయింది. ఈ పండగల సీజన్లో కూడా ‘అతిధి’ పండగల మూడ్ ని పెంచే వినోదభరిత అంశాలకి దూరంగా హింసా రక్తపాతాలతో కూడి – హతవిధీ అనిపించే ఒక మామూలు పురాతన కాలపు ఫార్ములా ప్రయత్నంగా మిగిలిపోయింది. కానీ నాటి పురాతన సినిమాలు కూడా వాటి పాత్రల, కథల బలంతో మెప్పించాయి. ఇదిలా వుంటే, బాల్యంలో హీరో హీరోయిన్లు దూరమయ్యే పాత ఫార్ములా కథకి, డెంజిల్ వాషింగ్టన్ నటించిన మానవతా విలువల ‘మ్యాన్ ఆన్ ఫైర్’ థీమ్ ని తెచ్చి ‘అతిధి’కి అతికించి బతికించాలనుకోవడమే గందరగోళానికి దారితీసింది. 

          
కిడ్నాపుల దందాని ఎండగట్టే ‘మ్యాన్ ఆన్ ఫైర్’ లో హైలైట్ చేసిన మానవీయ కోణమే దాన్ని పాపులర్ సినిమాగా నిలబెట్టింది. దీన్నే అంతే బలంగా అమితాబ్ బచ్చన్ తో హిందీలో  ‘ఏక్ అజ్నబీ’ గా తీసి హిట్ చేసుకున్నారు కూడా. తెలుగులో తగుదునమ్మాయని నేటివిటీ కోసమని తెలుగు మార్కు  చిన్నప్పటి హీరోహీరోయిన్ల ఎడబాటు సెంటిమెంట్ల గొడవ తెచ్చి అతికించారు. రెండు వేర్వేరు పాయింట్లతో ఒక కథ చెప్పడం సాధ్యమా?  అందుకే ‘అతిధి’ కథ ఎటు పోతోందో, అసలేం జరుగుతోందో అర్ధంగాని అయోముంలో పడిపోతాం. ఇంత అయోమయానికి ఇరవై  కోట్లు ఎలా ఖర్చు పెట్టారబ్బా అని ముక్కున వేలేసుకుంటాం. ఈ భారీ లోపాన్ని మరిపించడానికి కాబోలు -  ఎడా పెడా ఫైట్లతో రక్తాలు పారించారు. 

         ‘అతిధి’ ఒక అనాధ. చిన్నప్పుడు తనని చేరదీసిన కుటుంబంలో తల్లిదండ్రుల్ని ఒక కిరాతకుడు కాల్చి చంపితే, ఆ తుపాకీ లాక్కుని ఎదురు కాల్పులు జరిపిన అతిధిని పొరపాటుగా అర్ధం జేసుకుని, ఇతనే ఈ హత్యలు చేశాడని సాక్ష్యం చెప్తారు ప్రజలు. ఆ కిరాతకుడు తప్పించుకుని పారిపోతాడు. అతిధి మూడేళ్ళు జైలుకి పోతాడు. విడుదలై అదే ఢిల్లీలో హోటల్ పెట్టుకుంటాడు. ఇప్పుడు తన అన్వేషణంతా ఆ కిరాతకుడి గురించే. ఆ చనిపోయిన తల్లిదండ్రుల కుమార్తె అయిన అమృత (అమృతారావ్) గురించే. ఆమె కూడా అప్పట్లోనే అతిధిని అపార్ధం జేసుకుని, ద్వేషం పెంచుకుంది. ఇప్పుడు ఇదే ఢిల్లీలో పెయింటర్ గా వుంటోంది.  ఒకసారి ఇద్దరూ పరిచయ మవుతారు. ఇతనే అతిధి అని తెలీక ప్రేమించేస్తుందామె.

          ఒక సంఘటన జరిగి ఇంకో అపార్ధం జేసుకుని ఆమె హైదరాబాద్ వెళ్ళిపోతే, ఆమె ఎవరో అప్పుడు తెలుస్తుందతడికి. ఇక వెంటనే తనూ హైదరాబాద్ వచ్చేస్తే, ఇక్కడ ఆమె బాబాయ్ హోంమంత్రి అనీ, వెయ్యికోట్లకి వారసురాలనీ తెలుస్తుంది (అయితే ఇరవై కోట్ల బడ్జెట్ నష్టపోయినా ఫర్వాలేదు, ఆమె రీ ఫండింగ్ చేస్తుంది). ఇక ఆమెని చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, డానీ (ఆశీష్ విద్యార్థి) అనే డ్రగ్ మాఫియా ద్వారా తెలుసుకున్న అతిధి అమృత ఇంట్లో దిగిపోతాడు. అదే డానీ చిన్నపిల్లల కిడ్నాపర్ కైసర్ గురించి కూడా చెప్తాడు. ఈ కైసరే తను వెతుకుతున్న కిరాతకుడని తెలుసుకున్నఅతిధి, ఇక హత్యా కుట్రలోంచి అమృతని ఎలా కాపాడుకుని, కైసర్ ని  చంపాడన్నది మిగతా కథ. 

       ఈ కథలో మొదట చేయని నేరానికి శిక్ష కూడా అనుభవించిన అతిధి, ఎందుకో అమృత ముందు గిల్టీ ఫీలవడం, అమృత కూడా తన దృష్టిలో అతను హంతకుడే అయినా, శిక్ష అనుభవించి వచ్చాడని తెలిసీ ఎందుకో ఇంకా ద్వేషించడం చైల్డిష్ గా వున్నాయి. ‘నా కళ్ళలోకి చూడు, నేను హంతకుడిలా వున్నానా’  అని అతను ఒక మాటనగానే, ఆమె అపార్దాలన్నీ ఎగిరిపోవడమూ; ఆమె బాబాయ్ కూడా ‘అతను హంతకుడే అయితే నిన్ను కాపాడే వాడా’ అనగానే, ఇక పూర్తిగా ఫ్లాట్ అయిపోయి పాటేసుకోవడమూ చైల్డిష్ గానే వుంటాయి. 

          కొత్త హేర్ స్టయిల్ తో మహేష్ బాబు డిఫరెంట్ గా కన్పించే ఈ మూస యాక్షన్ లో, నటనలో ఏదైనా వెరైటీ కనబర్చడం కంటే పోరాటాలతోనే కాలక్షేపం చేశాడు. పోరాటాలూ, పాటల్లో డాన్సులూ ఇవే మస్తుగా వున్నాయి మిగతా విషయాల కంటే. పక్కన గ్లామరు తక్కువ హిందీ హీరోయిన్ తో జోడీ కుదరలేదు గానీ, ఆమె లాస్ ని భరించే వెయ్యి కోట్లకి వారసురా లైనప్పుడు గ్లామర్ ఎలా వుంటేనేం. బాలీవుడ్ లో ఆమెకి దొరకని గ్లామర్ పాత్ర ప్రప్రథమంగా తెలుగులో లభిస్తున్నప్పుడు వెయ్యి కోట్లు కాదు, రెండు వేల కోట్లయినా పట్టుకు రాగలదు.

        హిందీ లో చిన్న చిన్న విలన్ పాత్రలేసే మురళీ శర్మకి తెలుగులో మెయిన్ విలన్ పాత్ర దొరకడం కూడా అదృష్టమే. కోట శ్రీనివాసరావు, నాజర్, ఆశీష్ విద్యార్థి, బ్రహ్మానందం, వేణు, వేణుమాధవ్, సునీల్ తదితరులు ఆయా పాత్రలు పోషించడం మాస్ కోసం. ఇక మలైకా అరోరా ఖాన్ ఐటెం సాంగ్ ప్రధానాకర్షణ కావాలి నిజానికి. కానీ తెలుగు ప్రేక్షకులకి ఆమె ఎవరో ఇంకా తెలీదు. 

          పోతే, ‘మ్యాన్ ఆన్ ఫైర్’ లోని పోలీస్ కార్యాలయం సెట్, డిస్కోథెక్ సీను, అది పేలిపోయే దృశ్యం మొదలైన వాటితో బాటు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని, బ్లీచవుట్ షాట్స్ ని దాన్నుంచే యధాతధంగా కాపీ చేశారు. ఇంకా ‘యూజువల్ సస్పెక్ట్స్’ లోని విలన్ పాత్రని అదే పేరుతో తెచ్చి పెట్టుకోవడం, క్లయిమాక్స్ కత్తి ఫైట్ ని ‘300’ అనే మరో హాలీవుడ్ లోంచి ఎత్తేయడం కూడా సాంప్రదాయానుసారం దిగ్విజయంగా, సుఖంగా జరిగిపోయాయి.

          ఇక టెక్నికల్ హంగామా విషయానికొస్తే, దర్శకుడు సురేందర్ రెడ్డి గత విఫలయత్నం ‘అశోక్’ లోని కథా నడకనే తిరిగి కొనసాగించాడు. పెడితే ప్రధాన పాత్రకి మాత్రమే పెట్టాల్సిన రీ కలెక్షన్స్, ఫాస్ట్ ఫార్వర్డ్, రీ క్యాప్స్ షాట్స్ ని తోచిన పాత్రకల్లా పెట్టేస్తూ ఒక దృశ్య కాలుష్య కాసారాన్ని ఆవిష్కరించాడు. తదాత్మ్యతా ఏకత్వాలతో కూడిన యూనిటీ ఆఫ్ స్టయిల్ ని తనివిదీరా దెబ్బ తీశాడు. 

 
సికిందర్
(‘ఈవారం’ – 2007)