రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, November 7, 2021

1077 : రివ్యూ

కథ- దర్శకత్వం : రోహిత్ శెట్టి
తారాగణం : అక్షయ్ కుమార్
, కత్రినా కైఫ్, జాకీ ష్రాఫ్, అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్, గుల్షన్ గ్రోవర్, కుముద్ మిశ్రా, జావేద్ జాఫ్రీ, అభిమన్యూ సింగ్, సికిందర్ ఖేర్ తదితరులు
రీసెర్చి : ఎస్ హుసేన్ జైదీ
, స్క్రీన్ ప్లే : యూనస్ సజావల్, మాటలు : ఫర్హాద్ సాంజీ, సంచిత్ బెంద్రే, విధీ ఘోడ్గాడ్కర్
సంగీతం : అమర్ మోహిలే
, ఎస్ తమన్, ఛాయాగ్రహణం : జామన్ జాన్
బ్యానర్స్ : రిలయెన్స్ ఎంటర్ టైన్మెంట్
, రోహిత్ శెట్టి పిక్చర్జ్, ధర్మా ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్
విడుదల : నవంబర్ 5
, 2021

***

      సూర్యవంశీ - వెండి తెరపై కులాసాగా చూడాలని ప్రేక్షకులు ఉవ్వీళ్ళూరిన అక్షయ్ కుమార్ మెగా యాక్షన్ డ్రామా ఓపట్టాన ప్రేక్షకుల ముందుకు రాలేదు. సరీగ్గా రెండేళ్ళ క్రితం నిర్మాణం పూర్తయి, మార్చి 27, 2020 న విడుదల ప్రకటించుకుని సన్నాహాలు చేస్తూంటే, దురదృష్టం కొద్దీ  -24 వ తేదీనే ప్రభుత్వం దేశవ్యాప్త కోవిడ్ లాక్ డౌన్ ప్రకటించడంతో విడుదల ఆగిపోయింది. లాక్ డౌన్ ఎత్తేశాక గత దీపావళికి విడుదల తేదీ ప్రకటిస్తే, థియేటర్ల మీద ప్రభుత్వ ఆంక్షలతో మళ్ళీ వాయిదా పడింది. ఇక లాభం లేదని ఏప్రెల్ 2, 2021 న తిరిగి తేదీ నిర్ణయిస్తే, ముంబాయిలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ప్రకటించడంతో అదీ వాయిదా పడింది. సరేలెమ్మని మళ్ళీ ఏప్రెల్ 30 కి విడుదల ప్రకటిస్తే, మళ్ళీ కోవిడ్ వచ్చి పడడంతో మరోసారి లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఇలా ప్రభుత్వ తేదీలతో విడుదల తేదీలు తెమలవని విడుదల మర్చిపోయి కూర్చున్నారు. కూర్చున్నాక పొలిమెరలో ఇక ప్రభుత్వ తేదీలు కనిపించక పోవడంతో, ఈ దీపావళే బిజినెస్ కి సరైన అదును అని విడుదల చేసేశారు!

        విజయవంతమైన కమర్షియల్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి (గోల్ మాల్ సిరీస్, సింగం సిరీస్, సింబా వగైరా) ఈసారి  సూర్యవంశీ తో టెర్రరిజం మీది కెళ్ళాడు. భారీ తారాగణాన్నీ, బడ్జెట్ నీ సమకూర్చుకుని, తన అలవాటైన కొత్త కొత్త గిమ్మిక్కులతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశాడు. అసలు దేశాన్ని అర్ధం జేసుకుంటే టెర్రరిజం అర్ధమవుతుంది, ఎవరితో పోరాడాలో తెలుస్తుంది. ఇవి చేశాడా రోహిత్ శెట్టి చూద్దాం...

కథ

    1992 లో బాబ్రీ మసీదు కూల్చివేతకి ప్రతీకారంగా, 1993 లో ముంబాయిలో జరిగిన వరస బాంబు పేలుళ్ళలో వీర్ సూర్యవంశీ (అక్షయ్ కుమార్) తల్లిదండ్రులు చనిపోతారు. ఈ బాంబు దాడులకి పొరుగు దేశం నుంచి వెయ్యి కిలోల ఆర్డీఎక్స్ దిగుమతి అయింది. ఇందులో 400 కిలోలే దాడులకి ఉపయోగించి మిగతా ఆర్డీఎక్స్ దాచి పెట్టారు. దీన్నుపయోగించుకుని, 26/11 దాడుల తర్వాత  లష్కరే తోయిబా మరిన్ని దాడులు జరిపేందుకు 40 మంది టెర్రరిస్టుల్ని పంపి సరయిన సమయం కోసం ఎదురు చూస్తోంది. ఈ నలభై మంది టెర్రరిస్టులు హిందూ పేర్లు పెట్టుకుని, పెళ్ళిళ్ళు చేసుకుని  వివిధ నగరాల్లో ప్రజల్లో కలిసిపోయి వుంటున్నారు.  వీళ్ళని పొరుగు దేశం నుంచి బిలాల్ (జాకీ ష్రాఫ్) కంట్రోలు చేస్తున్నాడు. ఈ నలభై మందిలో ఇతడి ఇద్దరు కొడుకులు బిలాల్ అహ్మద్ (కుముద్ మిశ్రా), రియాజ్ హఫీజ్ (అభిమన్యూ సింగ్) కూడా వున్నారు.

          ఈ సమాచారమందుకున్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ డిసిపి వీర్ సూర్యవంశీ తన టీముతో రంగంలోకి దిగుతాడు. పూర్వం ఒక ఆపరేషన్ లో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చేరినప్పుడు, డాక్టర్ రియా (కత్రినా కైఫ్) చికిత్స చేసి కాపాడింది. దీంతో ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కొడుకు పుట్టాడు. అతడికి కుటుంబం కంటే డ్యూటీ  ముఖ్యం కావడంతో, ఒక దాడిలో కొడుకు గాయపడ్డాడు. దీంతో అతడ్ని తిట్టిపోసి కొడుకుతో దూరంగా వుంటోంది రియా.

          ఈ నేపథ్యంలో ఇప్పుడు సూర్యవంశీ కర్తవ్యం టెర్రరిస్టుల స్లీపర్ సెల్స్ తో బాటు, ఆ దాచిపెట్టిన 600 కిలోల ఆర్డీఎక్స్ ని పట్టుకుని, టెర్రర్ దాడుల్ని నివారించడం, టెర్రరిస్టుల్ని నిర్మూలించడం. ఈ క్రమంలో బిలాల్ అహ్మద్, రియాజ్ హఫీజ్ లతో బాటు వాళ్ళ లీడర్ ఖాదర్ ఉస్మానీ (గుల్షన్ గ్రోవర్) నీ ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

      ఇది యాక్షన్ థ్రిల్లర్ కాకుండా యాక్షన్ డ్రామా కావడంతో సస్పెన్స్ లేకపోవడం, సస్పెన్స్ లేకపోవడంతో టెన్షన్, థ్రిల్ లేకపోవడం జరిగాయి. ఈ కథ డ్రామా ఆధారంగా ఇలా వుండడం సరైనదే. ఇది సామాజిక కథ. సామాజిక కథ డ్రామా కవకాశం లేని సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వుంటే ఎబ్బెట్టుగా వుంటుంది. అందుకని టెర్రరిస్టుల్ని పట్టుకునే వేటలో ఇప్పుడేం జరుగుతుందన్న మలుపులు గానీ, పతాక సన్నివేశాలుగానీ ఎదురు కావు. యాక్షన్ దృశ్యాలు మాత్రం భారీ స్థాయిలో వుంటాయి. డ్రామాలో భాగంగా ఉత్పన్నమయ్యే యాక్షన్ దృశ్యాలు. ఇలా మార్కెట్ యాస్పెక్ట్, దానికి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ వరకూ ఈ కథ ఓకే. కాన్సెప్ట్ పరంగానే చెదిరిపోయింది...

        దేశంలో టెర్రరిజం దాదాపూ లేదు, కాశ్మీరు లోయలో తప్ప. కారణ ముంటేనే టెర్రరిజం. ఆ కారణాలు లేక పోవడంతో టెర్రరిజం మీద సినిమాలు తీయడం కూడా మానుకున్నారు. దర్శకుడు రోహిత్ శెట్టి అసహజంగా కొత్త కారణాన్ని పుట్టించ కుండా, 1993 లో జరిగిన పేలుళ్ళ లోంచే ఓ కారణాన్ని సృష్టించాడు. ఆ నాటి దాడుల్లో 600 కిలోల ఆర్డీఎక్స్  మిగిలినట్టు కల్పన చేసి, దాంతో ఈ కథంతా చిత్రీకరించుకుంటూ పోయాడు.

        అయితే 30 ఏళ్ళు గడిచిపోయినా ఆ నాటి ఆర్డీక్స్ ని దాచిపెట్టుకుని, దాడుల కోసం ముసలివాళ్ళయి పోతున్నా ఇంకా కూర్చుని వుంటారా టెర్రరిస్టులనేది ఒక లాజికల్ క్వశ్చన్. ఇంత కాలం వేచి వుండడానికి ఓ చారిత్రక విశేషాన్ని టార్గెట్ చేసి కూర్చుంటే, మంచి ఎమోషనల్ కనెక్ట్ వుండేది ఆడియెన్స్ కి. స్వాతంత్ర్య దినోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుకలు కావచ్చు లేదా, 2024 లో 75 వ భారత రాజ్యాంగ దినోత్సవం కావొచ్చు. ఐడియాని సరీగ్గా నిర్మించుకుని వుంటే హాలీవుడ్ హై కాన్సెప్ట్ మూవీగా ఇది అప్ గ్రేడ్ అయి వుండేది.

        ఇకపోతే  వున్న కాన్సెప్ట్ తో స్పష్టమైన పంథా కూడా వుండదు. పాక్ మూలాలున్న టెర్రరిజం కుట్రతో ఇది ఇండియా వర్సెస్ పాక్ దేశాల కథవుతుంది. ఇలా ఏకసూత్రతతో అడుగడుగునా పాక్ ని టార్గెట్ చేస్తూ కథ నడపాలి. ఇలాకాకుండా ఇండియన్ గవర్నమెంట్ వర్సెస్ ఇండియన్ ముస్లిమ్స్ అన్నట్టు కూడా ఏదో చేసుకుంటూ పోయీ గజిబిజి చేశారు.

        ఇండియన్ ముస్లిమ్స్, పాక్, టెర్రరిజం ఇవన్నీ కలగలిపేసి ఇండియన్ ముస్లిమ్స్ కి ఎక్కువ పాఠాలు చెప్పేశారు. టెర్రరిజానికి పాక్ ని టార్గెట్ చేయాల్సింది పోయి- మధ్యలో జింగోయిజంతో ఇండియన్ ముస్లిములని టార్గెట్ చేసే గందరగోళానికి లోనయ్యారు. ఇండియన్ ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తూ పెట్టిన కేసులన్నీ కోర్టులు కొట్టి వేస్తూ ప్రభుత్వాలకి మొట్టి కాయలేస్తున్నాయి ఓ పక్క. ఇండియన్ ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తూ ఇలా సినిమాలు తీస్తే పాక్ కి సంతోషమే కదా. సురక్షితమే కదా. వాళ్ళకి కావాల్సిందిదే. వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుస్తున్నామని గుర్తించక పోతే ఎలా.

        టెర్రరిజానికి మతం లేదన్నప్పుడు మత వర్గాన్ని టార్గెట్ చేసేశారు. మంచి ముస్లిం- చెడ్డ ముస్లిం అంటూ చూపించడం ఇంకో వైపు. మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇతర మతాల్లో వుండనట్టు. పొడుగు గడ్డమున్న వాడు ఎక్కువ దైవ భక్తితో టెర్రరిస్టుగా వుంటాడని, చిన్న గడ్డమున్న వాడు అజ్మీరుకి పోయినా భక్తి వుండదని, క్లీన్ షేవ్ చేసుకున్నవాడు సెక్యులర్ గా వుంటాడనీ అర్ధం లేని వర్గీకరణ చేయడ మొకటి. ఈ దేశంలో ముస్లిములే నెగెటివులు, ఇతరులు మంచి మన్నికైన పాజిటివులని చెప్పాలనేమో.

         ముంబాయి పోలీసులు పాస్ పోర్ట్ మీద మతం చూసి కాల్చి చంపరు, క్రిమినల్ రికార్డు చూసి చంపుతారు అంటాడు అక్షయ్ కుమార్. ఇలా మత ప్రసక్తి లేకుండా టెర్రరిస్టుల గురించి మాట్లాడితే సరిపోతుంది. ఇది ఇరు దేశాల మధ్య రావణ కాష్ఠం కథైనప్పుడు, పొరుగు దేశాన్ని తిట్టాల్సింది పోయి, ముస్లిముల్ని తిట్టే సీన్లు నాల్గు పెట్టి, రెండు మెచ్చుకునే సీన్లతో బ్యాలెన్సు చేయడం ఇంకో వైపు. ఇది కూడా అరిగిపోయిన పాత మూస ఫార్ములా టెక్నిక్కే.

        ఈ కథలో ఒక పేటలో గణేష్ ఉత్సవాలకి హిందువులు విగ్రహాన్ని ఎత్తలేక పోతూంటే, ముస్లిములు పరుగెత్తు కొచ్చి వాళ్ళే మోస్తారు. వెనుక మసీదు కన్పిస్తూంటుంది గొప్ప మెలో డ్రామాగా. వెంటనే పాట- పంద్రాగస్టుకీ, రిపబ్లిక్ దినోత్సవానికీ మోగే అరవై ఏళ్ళనాటి ప్రసిద్ధ పాట - ఛోడో కల్కీ బాతేఁ, కల్కీ బాత్ పురానీ, నయే దౌర్ మే లిఖేంగే మిల్కర్ నయీ కహానీ, హమ్ హిందూస్థానీ (గతాన్ని మర్చిపో, గతం గతః, కొత్త యుగపు కథ కలిసి రాసుకుందాం హిందూస్థానీలుగా) అంటూ. యుగాలుగా కలిసే పాడుకుంటున్నారుగా హిందూ ముస్లిములు. కొత్తగా నేర్పాల్సిన పని లేదు. విభజన రాజకీయాలు మానుకుంటే ఇండియా మౌలిక స్వరూపం వెలుగులో కొస్తుంది.

        అసలు ఈ సీనులో టూరిస్టులుగా వచ్చిన పాక్ దేశస్థులు గణేష్ విగ్రహం సాయం పట్టినట్టు చూపిస్తూ ఈ పాట వేసి వుంటే, మెలోడ్రామాతో బాటు పాక్ కి మెసేజి అదిరేది. ఈ కాన్సెప్ట్ ఇండియా వర్సెస్ పాక్ అని ఎప్పటికప్పుడు కావాలని మర్చిపోతూ సినిమా తీస్తే ఇలా గాకుండా ఇంకెలాగో వుంటుంది.

  అసలు ఇండియా పట్ల పాక్ దేశస్థుల అభిప్రాయమేమిటో ఇండియన్లు వెళ్ళి తీసిన వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఇండియా పట్ల వాళ్ళ ప్రేమ, బాలీవుడ్ సినిమాలతో బాటు ప్రత్యేకించి తెలుగు సినిమాలంటే అక్కడి అమ్మాయిల క్రేజ్ తెలుస్తాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తెలుస్తారు. ఇంకా చాలా తెలుస్తాయి. రివర్స్ లో ఇలాటి పాక్ క్యారక్టర్స్ తో టెర్రరిస్టులకే, పాక్ ప్రభుత్వాలకే గట్టి మెసేజ్ వెళ్ళేలా చేసి వుంటే రోహిత్ శెట్టి మూసని బద్దలు కొట్టిన మొదటి దర్శకుడయ్యేవాడు. ఇండియన్ ముస్లిమ్స్ ని పరీక్షించే అదే పాత మూస ఇంకెంత కాలం. పాక్ పౌరుల్ని లాక్కొచ్చి కొత్త కథలు చెప్పకుండా.

        ఈ దేశంలో కసబ్ మీద ఎంత ద్వేషముందో కలాం మీద అంత ప్రేమ వుంది అని ఇంకో పాఠం చెప్తాడు అక్షయ్. ఇది పాక్ చెప్పాల్సిన పాఠం. మనకి కాదు. అసలు హిందూ ముస్లిం ప్రసక్తి దేనికి- పౌరులు అనకుండా. పౌరులొక వైపు, టెర్రరిస్టులొక వైపు అనకుండా? టెర్రరిస్టుల భాషే సినిమా కూడా మాట్లాడితే, వాళ్ళకీ సినిమాకీ, సినిమా తీసే వాళ్ళకీ తేడా ఏముంటుంది.   

        కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టి వేస్తుంది అన్న గాంధీజీ సూక్తితో ఈ సినిమా ప్రారంభమవుతుంది. కంటికి కన్నే డౌట్ లేదు అన్నట్టు బిగ్ యాక్షన్ సీన్స్ తో టెర్రరిస్టుల్ని కాల్చి కాల్చి చంపుతున్నప్పుడు ఈ సూక్తి దేనికి. సూక్తిని కూడా కాల్చి చంపేశారు. ఏదో రకంగా గాంధీని చంపాలి. ఇలా మసాలా ఫార్ములా యాక్షన్ సినిమాగా తీయక తప్పదని తెలిసీ ఐడియాలజీల ఉత్సాహం, అరకొర మేధావి తనాలు ప్రదర్శించారు. ఇలా చెప్పాల్సిన కథ ఒకటైతే, చెప్పిన కథ గజిబిజిగా ఇంకోటైంది. అక్షయ్ కుమార్ రాజకీయ నేపథ్యంతో ఇంతేనేమో. జస్ట్ ఏ ప్రాపగండా మూవీ.

        ఐతే ఇంతా చేసి రజనీకాంత్ అన్నాత్తే (పెద్దన్న) ని బీట్ చేయలేక పోయింది సూర్యవంశీ. అన్నాత్తే మొదటి రెండు రోజులు 63 కోట్లు, సూర్యవంశీ 40 కోట్లు. 

నటనలు- సాంకేతికాలు

       రోహిత్ శెట్టి యాక్షన్ హీరో అంటే మన ఫ్యాక్షన్ సినిమాల్లోలాగా గాల్లోకెగిరి ఎగిరి కార్ల పేలుళ్లు, విచ్చలవిడి కాల్పులు, ఇదే గాకుండా ఇప్పుడు అక్షయ్ తో రజనీ కాంత్ స్టయిల్లో ఏక వ్యక్తి సైన్యంగా డేర్ డెవిల్ విన్యాసాలూ... విచ్చల విడిగా 20, 30 వేల రౌండ్ల బుల్లెట్ల వర్షం. నువ్వు చచ్చే బుల్లెట్ మీద మేడిన్ ఇండియా అని పెద్ద అక్షరాలతో రాసుంటుంది అని అక్షయ్ పవర్ఫుల్ డైలాగు.

        సగటు ప్రేక్షకుడికి కావాల్సిన గిమ్మిక్కులన్నీ వున్నాయి అక్షయ్ తో. బ్యాంకాక్ లో సికిందర్ ఖేర్ (రాజేంద్ర గుప్తా పాత్ర) మోటార్ బోటు మీద దూసుకు పోతూంటే, అక్షయ్ హెలీకాప్టర్ మీద వెంటాడి లిఫ్ట్ చేసి కాపాడే యాక్షన్ కొరియోగ్రఫీ హైలైట్. విడుదలకి ఎన్ని అవాంతరా లొచ్చినా ఓటీటీకి వెళ్ళక పోవడానికి కారణమిదే. సగటు ప్రేక్షకుడికి బిగ్ స్క్రీన్ మీద, జలదరించే శబ్ద ఫలితాలతో చూపించాలని. బ్యాక్ గ్రౌండ్ లో సూర్యవంశీ సూర్యవంశీ అంటూ చెవులు పగిలే ఆడియో లోగో సహా.

     అక్షయ్ పాత్రకి పేర్లు గుర్తుండవు. ఇంత పెద్ద ఆపరేషన్లు చేసే ఆఫీసరుకి పేర్లు గుర్తుండకపోయే క్యారక్టరైజేషన్ కామిక్ రిలీఫ్ కి బాగా తోడ్పడింది. ఎంటర్టైన్మెంట్. అయితే దేశభక్తి గురించి, పౌర బాధ్యతల గురించి, సెక్యులరిజం గురించీ ముస్లిములకే లెక్చర్ లివ్వాలని మాత్రం ఎంతో బాగా గుర్తుంటుంది. రోహిత్ శెట్టి అక్షయ్ పాత్రని కేర్లెస్ గా వుండే, నిబంధనలు పాటించని అధికారిగా కూడా ప్రెజెంట్ చేశాడు. ఈ ప్రవర్తనకి భార్య దూరమైన కారణమేమో తెలీదు.

          భార్య డాక్టర్ రియా పాత్రలో కత్రినా కైఫ్ మోరల్ యాంకర్ గా పనిచేసే పాత్ర. యాంటీ ముస్లిం ధోరణిని బ్యాలెన్స్ చేయడానికన్నట్టు ఈ పాత్ర. తప్పుగా మాట్లాడుతున్నాడని, తప్పుగా ప్రవర్తిస్తున్నాడని భర్త అక్షయ్ కి క్లాసులు పీకే పాత్ర. అవతలింట్లో కాదు, మనింట్లో ఏం జరుగుతోందో చూడమన్నట్టు ఈ క్లాసులు. క్లయిమాక్స్ లో రణవీర్ సింగ్ కి కూడా ఓ క్లాసు పీకి వుండాల్సింది.

        ఇక అసలైన వాళ్ళు వున్నారు. చివరి ఇరవై నిమిషాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్. రోహిత్ శెట్టి తీసిన సింగం సిరీస్ లోని ఇన్స్ పెక్టర్ బాజీరావ్ సింగం (అజయ్ దేవగణ్) పాత్రని, సింబా లోని ఇన్స్ పెక్టర్ సంగ్రామ్ సింబా భలేరావ్ (రణవీర్ సింగ్) పాత్రనీ ప్రవేశపెట్టి, అక్షయ్ కుమార్ తో యాక్షన్ లోకి దింపి, క్లయిమాక్స్ ని బ్లాస్ట్ చేశాడు శెట్టి. అజయ్ సీరియస్ అయితే, రణవీర్ ఫన్. ఈ క్లయిమాక్స్ ముందు వరకూ అక్షయ్ కి యాక్షన్ మూవీని భుజాన మోసే సత్తా వుంది. అయితే ఆడియెన్స్ కి ఇంకా జోష్ కోసం వీళ్ళిద్దరి ఎంట్రీ.

     గత మూవీ సింబా లో సింగంఅజయ్ దేవగణ్ ని దింపి కథని ఊహించని మలుపు తిప్పాడు దర్శకుడు రోహిత్ శెట్టి. ఇలాటి ఆలోచనలు అతడికే వస్తాయి. పాత మసాలా కమర్షియల్స్ ని కూడా ఏదో గిమ్మిక్కు చేసి ఉలిక్కి పడేలా చేస్తాడు. సింగంఅజయ్ దేవగణ్ వచ్చేసి, సింబా రణవీర్ సింగ్ ని కాపాడే కిక్కిచ్చే మలుపు!

          టెర్రరిస్టుల పాత్రల్లో గుల్షన్ గ్రోవర్, అభిమన్యూ సింగ్, కుముద్ మిశ్రాలు మంచి విలనీతో కన్పిస్తారు. గుల్షన్ గ్రోవర్ మౌల్వీ వేషంలో వుండే టెర్రరిస్టు లీడర్. అభిమన్యూ సింగ్ హిందూ పేరు పెట్టుకుని జైసల్మీర్లో పెళ్ళి చేసుకుని సెటైలైన స్లీపర్ సెల్ టెర్రరిస్టు. ఇతను టెర్రరిస్టు అని ఎంతో కాలానికి తెలుసుకున్న హిందూ భార్య ఏడ్పు వర్ణనాతీతం. ఇతను హిందువు కాదని పెళ్ళయి మొదటి రాత్రే తెలియాలిగా.

        దీనికి బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రమే అమర్ మోహిలే, తమన్ లందించారు. నాలుగు పాటలు వేరే రెండు బ్యాండ్స్ వాళ్ళు అందించారు. ఈ పాటల్లో పైన చెప్పుకున్న హమ్ హిందూస్థానీ లోని ఛోడో కల్కీ బాతేఁ’, మొహ్రా లోని టిప్ టిప్ బర్సా పానీ  రీమిక్స్ పాటలు.

—సికిందర్