రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, September 24, 2025

1393 : స్పెషల్ ఆర్టికల్

       

        2003 లో ఈ వ్యాసకర్త ఒక షూటింగు నిమిత్తం ముంబాయి వెళ్ళాడు. అక్కడ సినిమా ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్. అతను తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. దర్శకుడవ్వాలన్న తన కల త్వరలో నిజం కాబోతోందన్నాడు.  మంచి కాన్ఫిడెన్సు తో వున్నాడు. ఇంతలో ఖర్మ కాలి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నోకియా సెల్ ఫోన్ తీసి ఒక్క నొక్కు నొక్కాడు. ఇక అవతలి మాటలు విని చిందు లేయసాగాడు- '20 వేలా? ఎక్కడ్నించి తెచ్చివ్వాలి 20 వేలు? నేనింకా రెంటే కట్టలేదు. తిరగడానికి డబ్బులే లేవు, అమ్మో 20 వేలా? ఎలా వస్తాయి ...' అని ఇంకేదేదో అనేస్తూ కంట్రోలు తప్పిపోయాడు. కట్ చేసి, కంగారు పడిపోతూ  అటూ ఇటూ చూసి, మళ్ళీ కాల్ చేశాడు- 'టైం కావాలి. ఎప్పుడందితే అప్పుడు ఇచ్చేస్తా' అని  కట్ చేశాడు. ఊగిపోతూ మళ్ళీ కాల్ చేసి- '20 వేలు వూరకే వస్తాయా, నా వల్ల కాదు, అమ్మో నావల్ల కాదు- అయినా ఇచ్చేస్తా' అనేసి ఫైనల్ గా సెల్ జేబులో వేసుకుని, మూడాఫ్ అయిపోయి కూర్చున్నాడు. ఆ ఫోన్ చేసింది ఇద్దరు రచయితలు. అతడి కథ మీద పనిచేస్తున్నందుకు 20 వేలు అడిగారు. దానికి ఇతడి తతంగం ఇలా వుంది.

     మితాబ్ బచ్చన్  'కౌన్ బనేగా కరోడ్ పతి' ప్రోగ్రాం లో 5 కోట్లు గెలిచిన సుశీల్ కుమార్ అనే పాలవ్యాపారి, ఐదేళ్ళు తిరిగేసరికల్లా మళ్ళీ మొదటికొచ్చి కూరగాయాలమ్ముకుని జీవించ సాగాడు. అమెరికాలో 18 మిలియన్ డాలర్లు లాటరీ గెలిచిన మిడిల్ క్లాసు జానైట్ లీ అదంతా పోగొట్టుకుని రోడ్డున పడింది. ఇలాటి జీవితాలు చాలా వున్నాయి. వీటికి కారణం సెల్ఫ్ ఇమేజీ లేకపోవడమే. సెల్ఫ్ ఇమేజీ లేనప్పుడు సడెన్ గా అదృష్టం వరిస్తే నిలబెట్టుకోలేరు. పాలమ్మినవాడు 5 కోట్లు గెలిచేసరికి తనని తానూ మిలియనీర్ మైండ్ సెట్ తో సెల్ఫ్ ఇమేజీని మార్చుకోలేదు. అదే పాలమ్ముకునే బడుగు జీవి మనస్తత్వంతో వుండిపోయాడు. అలాంటప్పుడు అంత హై ఎనర్జీతో వున్న 5 కోట్ల డబ్బు ఈ లో- ఎనర్జీ శాల్తీతో ఎందుకుంటుంది. ఇలాగే జానైట్ లీ ట్రాజడీ కూడా. ఆర్ధికవేత్త లంటారు- ధనికుల దగ్గర వున్న డబ్బంతా సామాన్యులకి పంచేస్తే, తిరిగి ఆ డబ్బంతా ధనికుల దగ్గరికే  వచ్చేస్తుందని. ధనికులు మిలియనీర్ మైండ్ సెట్ తో సంపదని  అలా ఆకర్షించేస్తారు. పాపం రాబిన్ హుడ్ ని చూస్తే  ఈ విషయం తెలీక అన్నట్టు ధనికుల్ని కొట్టి పేదలకి పంచేస్తూంటాడు. పైన చెప్పుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ కూడా తన గోల్ కి తగ్గ సెల్ఫ్ ఇమేజీ లేకా అలా ప్రవర్తించాడు. తను దర్శకుడ వ్వాలని హై ఎనర్జీ కలలు గంటున్నప్పుడు ఆ దర్శకుడి హోదా ఫీలవుతూ దానికి తగ్గ సెల్ఫ్ ఇమేజీ ని సృష్టించుకోవాలి. ఆ హోదాతో హూందాగా ప్రవర్తించాలి. కానీ రచయితలు డబ్బు అడగ్గానే తన పరువు తనే తీసుకుంటూ లో-ఎనర్జీ  చిందులూ కేకలూ వేస్తే ఏమై పోతాడు. దర్శకుడి హోదాతో వుండే హై ఎనర్జీ దగ్గరికి రానిస్తుందా  తనని . దర్శకుడంటే టీం మొత్తానికీ లీడర్.  బాధ్యత తీసుకునే వాడు. ఇలా చలించి పోయి చులకనయ్యే బలహీన మనస్కుడు కాడు. దీన్ని గుర్తించదు ఎల్ ఓ ఏ. 

కాబట్టి ఎల్ ఓ ఏ పాటించి దర్శకుడవ్వాలనుకుంటే ముందు దానికి తగ్గ సెల్ఫ్ ఇమేజీ వుందా  చెక్ చేసుకోవాలి. గోల్ కి తగ్గ సెల్ఫ్ ఇమేజీ లేకపోతే  లా ఆఫ్ ఎట్రాక్షన్  పనిచెయ్యదు. విశ్వం అన్నీ కనిపెట్టి అవకాశాలిస్తుంది. తనని దర్శకత్వ అవకాశం కోరుతున్న వ్యక్తి అసలంటూ దర్శకుడవ్వాలని ఏ మేరకు ఫ్రీక్వెన్సీ తో సిన్సీ యర్ ఫా ఫీలవుతున్నాడన్నది కనిపెట్టి- ఇందులో నెగ్గితే మిగతా కార్యక్రమం జరిగేలా చూస్తుంది విశ్వం. సింపుల్ గా సక్సెస్ అంటే ఫీలింగులు- ఫ్రీక్వెన్సీల ఆటే! ఫీలింగులు విశ్వాన్ని తాకే హై ఫ్రీక్వెన్సీ తో వున్నాయా ఇక పంటే!!

సెల్ఫ్ ఇమేజీ ఎలా వస్తుంది?  

    సెల్ఫ్ ఇమేజీ ఏదైనా గోల్ పెట్టుకోక ముందు ప్రతీ ఒక్కరికీ వుంటుంది. రెండేళ్ళ అప్పట్నుంచే వుంటుంది. ఆ వయసులో తనని అందరూ ఇష్టపడతారు, ఆడిస్తారు, ఏడిస్తే   లాలిస్తారు. మారాం చేస్తే  ముద్దుచేసి అన్నం తినిపిస్తారు. అడక్కుండానే అవసరాలు తీరుస్తారు. దీంతో ఆ బుడ్డోడు లేదా బుడ్డిది గ్రేట్ గా ఫీలవుతారు. అందరి దృష్టి నాకర్షిస్తూ తాము ప్రత్యేకంగా వున్నామనుకుంటారు. అదొక అందమైన పాజిటివ్ సెల్ఫ్ ఇమేజీ. ఇక ఐదేళ్ళకో ఎప్పుడో అఆలు నేర్చుకునేప్పుడు  హతాశులవుతారు. చదువు సరిగా నేర్చుకో, లేకపోతే ఎందుకూ  పనికి రాకుండా పోతావని పెద్దల తిట్లూ దెబ్బలూ మొదలై పోతాయి. స్కూ ల్లో టీచర్లు కూడా నువ్వు దద్దమ్మవి,  నీకు జీరో మార్కులు కూడా ఎక్కువేనని  ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తారు. ఇలా ఏడేళ్ళు వచ్చేటప్పటికి రెండు మూడేళ్ళ వయసులో ఏర్పరచుకున్న అందమైన సెల్ఫ్ ఇమేజీ కాస్తా చెదిరి పోయి- నేను అన్ ఫిట్ ని, నావల్ల ఏదీ సాధ్యం కాదనే కొత్త సెల్ఫ్ ఇమేజీ- అంటే నెగెటివ్ సెల్ఫ్ ఇమేజీ ఏర్పడిపోతుంది. పెద్దలు ఇలా తయారు చేసి వదుల్తారు. పెద్దల ఆజమాయిషీలో నెగెటివ్ అదలింపులే తప్ప పాజిటివ్ మందలింపులుండవు. చాలా కాలం క్రితం 'బోర్న్ టు విన్' అన్న పుస్తకం చదివినప్పుడు అందులో డాక్టర్ మురియెల్ జేమ్స్, డాక్టర్ డరోతీ జోంగ్వార్డ్ లంటారు- కడుపులో పడ్డప్పుడు ఆ బిడ్డ తలరాత దేవుడు రాస్తాడో లేదోగానీ, పుట్టాక మాత్రం నుదుటి మీద తల్లిదండ్రులు రాస్తారని!

    ఆ నెగెటివ్ సెల్ఫ్ ఇమేజీతో, ఇంకా పెద్ద వాళ్ళు చెప్పే అశాస్త్రీయ సిద్ధాంతాలనీ, వాళ్ళ మూఢ నమ్మకాలనీ - నిజమని నమ్మి ఆ మేరకు జీవితం పట్ల దృక్పథా నేర్పర్చుకుని టీనేజీ దాటి- జీవితంలో స్థిరపడే దశకొస్తారు. ఇలాటి దశలో గోల్ నేర్పర్చుకుంటే వాళ్ళ సెల్ఫ్ ఇమేజీ ఎలా వుంటుంది? ఈ దశలో వ్యక్తిగతంగా అప్పటి వరకూ వున్న నెగెటివ్  సెల్ఫ్ ఇమేజీని దాటుకుని ఫ్రెష్ గా  వృత్తిగత సెల్ఫ్  ఇమేజీని సృష్టించుకోగలిగితేనే,  ఏదైనా గోల్ తో జీవితంలో రాణించగలుగుతారు. పైన చెప్పుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ గతంలో ఎవరెవరితోనో ప్రభావితమై ఏర్పరచుకున్నవ్యక్తిగత  సెల్ఫ్ ఇమేజీని దాటుకుని, తన గోల్ పరమైన వృత్తిగత సెల్ఫ్ ఇమేజీని సృష్టించుకోలేక పోవడం వల్లే, అలా గోల్ విధి విధానాలకి విరుద్ధంగా అదుపుతప్పి ప్రవర్తించాడు. 

గత వ్యాసంలో చెప్పుకున్నట్టు- హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ పుట్టుకతో తన ముఖంలో ఏర్పడ్డ లోపంతో సినిమావకాశాలు కోల్పోతూ వచ్చాడు. తన ముఖం పట్ల  నెగెటివ్ కామెంట్స్ ని ఎదుర్కొన్నాడు- కానీ దాంతో  తన సెల్ఫ్ ఇమేజీ ఇదేనని కృంగిపోలేదు. దాన్ని స్వీకరించడానికి తిరస్కరించాడు. దాన్ని తుంగలో తొక్కి, తను ఖచ్చితంగా హాలీవుడ్  స్టారే నని బలంగా నమ్ముతూ  ఆ వృత్తిగత సెల్ఫ్ ఇమేజీతో గోల్ నేర్పర్చుకున్నాడు. సఫలమయ్యాడు. మొదటి సినిమాతోనే నటుడుగా ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయ్యే దాకా వెళ్లి పోయాడు!

కనుక ముందుగా నెగెటివ్ ఎనర్జీని ఉత్పత్తిచేసే వ్యక్తిగత సెల్ఫ్ ఇమేజీని జయించాలి. ఈ నెగెటివ్ ఎనర్జీ కేవలం మెదడులో ఇమిడి వుండదు. గుండెలోనూ తిష్ట వేసుకు వుంటుంది. మెదడు -గుండె -పొట్ట వేగస్ నాడి ద్వారా కనెక్ట్ అయి వుం టాయని  గత వ్యాసంలో చెప్పుకున్నాం. మెదడులో ఎమోషన్స్ పుడితే అవి  వేగస్ నాడి ద్వారా గుండెకి చేరి ఫీలింగ్ రూపంలో నిల్వ వుంటాయి. రెండవ మెదడు అయిన పొట్ట విశ్వం నుంచి అందే సంకేతాలని మూడవ మెదడు అయిన గుండెకీ, అటు పైన మెదడుకీ అందించి అప్రమత్తం చేస్తుంది. పొట్ట నుంచి అందే సంకేతాలనే గట్ ఫీలింగ్స్  అంటాం. వీటిని బలంగా నమ్మి నిర్ణయాలు తీసుకుంటాం. అయితే గుండెలో నెగెటివ్ ఫీలింగ్స్ వుంటే, పొట్టనుంచి గట్ ఫీలింగ్స్ మెదడుకి అందవు. మెదడుకి అందకపోతే విశ్వం అందిస్తున్న సంకేతాలు తీలీక చాలా అవకాశాలు కోల్పోతాం.  గుండెలో ప్రధానంగా నిల్వ వుండే నెగెటివ్ ఫీలింగ్స్ అపరాధభావం, ద్వేషం, ప్రతీకార భావం. ఈ మూడూ గట్ ఫీలింగ్స్ ని అడ్డుకుంటాయి. అంటే ఇలా ఎల్ ఓ పాటిస్తే ఫలితాలు శూన్యంగా వుంటాయి. 

మరొకటేమిటంటే, కొందరిలో వేగస్ నాడి పనిచెయ్యదు. ఇది తీవ్ర శారీరక పరిణామాలకి దారితీస్తుంది. ఇక ఎల్ ఓ ఏ పరిస్థితేమిటో వూహించుకోవచ్చు. డిప్రెషన్, అలసత్వం, దేని పట్లా ఆసక్తి లేకపోవడం మొదలైనవి దీనికి కారణమవుతాయి. వెంటనే చర్య తీసుకోవాలి. ప్రాణయామం, ధ్యానం, వ్యాయామం, సంగీతం వినడం లాంటివి చేస్తే వేగస్ నాడి  యాక్టివేట్ అవుతుంది. లేదా చలికాలం హరిద్వార్ వెళ్ళి  గంగలో రెండు మునకలేస్తే భళ్ళున శరీరం ప్రకంపనలతో వశం తప్పుతుంది. వేగస్ నాడి  యాక్టివేట్ అయిందనడానికి ఇదే సంకేతం. 

ఇక గుండెలోంచి నెగెటివ్ ఎనర్జీని లేదా నెగెటివ్ ఫీలింగ్స్ తీసేయాలంటే  పాజిటివ్ ఫీలింగ్స్ తో  నింపాలి. పాజిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ ఆలోచనలతో, పనులతో వస్తాయి.  ఇది హో- ఒపోనోపోనో ప్రార్ధనతో  సాధ్యమవుతుందని గత వ్యాసంలో చెప్పుకున్నాం. దీంతో నెగెటివ్ ఫీలింగ్స్ ప్రక్షాళన జరిగి -ఇకపైన మెదడులో పుట్టే ఎమోషన్స్ నుంచి నెగెటివ్ ఎనర్జీని తిప్పి కొడుతుంది గుండె. పొట్ట అందించే గట్  ఫీలింగ్స్ ని స్వీకరించి మెదడుకి అందించడం మొదలెడుతుంది. ఈ డెప్త్ లో కెళ్ళ కుండా - నేను దర్శకుడ్ని- నేను దర్శకుడ్ని అవుతాను- నేను దర్శకుడ్ని అయ్యాను- అని ఎన్ని అఫర్మేషన్లు చేసినా ఎల్ ఓ ఏ పనిచేయకుండా స్తబ్దుగానే వుండి పోతుంది. 

ఈ వృత్తిగత సెల్ఫ్ ఇమేజీ సింపుల్- దర్శకుడుగా వూహించుకోవడమే. అలా ఫీలవడమే. వూరికే ఫీలయితే ఫీలింగుల కేంద్రం గుండె తీసుకోదు కాబట్టి  కారణంతో వూ హించాలి. ఎందుకంటే....అని కారణం జోడిస్తే ఫీలింగు పుడుతుంది. నేను దర్శకుడ్ని...ఎందుకంటే మానాన్న కోరిక తీర్చాలి, నేను దర్శకుడ్ని  ఎందుకంటే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎన్నో కథలు చెప్పాలి, నేను దర్శకుడ్ని ఎందుకంటే సినిమా కళకి అదనపు విలువ జోడించాలి. ఇలా సెంటిమెంటుతో కూడిన  ఉదాత్త కారణం అనుకుని విజువలైజ్ చేసుకోవాలి. దర్శకుడుగా ఏ రూపంలో, ఏ దుస్తుల్లో, ఇంకే ప్రత్యేకతలతో  వుంటారో రాసి పెట్టుకుని, ప్రతీసారీ అలాగే విజువలైజ్ చేసుకోవాలి. దుస్తుల రంగుకూడా మారకుండా అదే రంగుల్లో వుండాలి. మెదడు నుంచి గుండెకీ, గుండెనుంచి పొట్టకీ, అంతిమంగా సబ్ కాన్షస్ మైండ్ లోకీ ఈ విజువలైజ్ చేసిన ఇమేజీ వెళ్తుందని గుర్తుంచుకోవాలి. సబ్ కాన్షస్ మైండ్ మాటల  కంటే ఇమేజెస్ ని ఎక్కువ ఇష్టపడి త్వరితంగా రియాక్ట్ అవుతుంది. 

ఇంతేకాదు, ఇంకో ఆశ్చర్యకర విషయమేమిటంటే, విజువలైజేషన్ వల్ల శరీరంలో వివిధ రసాయనాలు విడుదలవుతాయి. దీంతో శరీరంలోని 86 బిలియన్ల నాడీ  కణాలు యాక్టివేట్ అవుతాయి. ఇవి ఖాళీగా కూర్చోవు. విశ్వంతో మాట్లాడతాయి. ఎలా మాట్లాడతాయి? మెదడులో ఇమేజెస్ ని రికార్డు చేసే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టం కి తమ మెసేజ్ అని అందిస్తాయి. జీన్స్ స్థాయిలో మార్పులు తేవాలని. అలా జీన్స్ చలనంలోకొచ్చి మనల్ని మోటివేట్ చేస్తాయి. మన శక్తి పెరుగుతుంది, వైబ్రేషన్ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మొత్తం కలిపి విజువలైజేషన్ వెళ్ళి విశ్వాన్ని తాకుతుంది. మన శరీరం సంభ్రమాశ్చర్యాలు కలిగించే  ఇంత అద్భుత వ్యవస్థ అన్నమాట!

విజువలైజేషన్ కి ఇంకా యాక్షన్ కూడా జోడిస్తే మంచిది. దర్శకుడుగా షూటింగు   చేస్తున్నట్టు, వివిత నటీనటులతో షాట్స్  చేస్తున్నట్టు వగైరా. ఇక్కడ కూడా ప్రతీసారీ అదే షూటింగు, అదే నటీనటులు వుండాలి. ఇలా ముందు దర్శకుడి ఇమేజీతో, తర్వాత యాక్షన్ లో వీలైనప్పుడల్లా  విజువలైజ్ చేసుకుంటూ వుండాలి.  ఇక వ్యక్తిత్వంలో ప్రశాంతత, లీడర్ షిప్, కమాండ్ మొదలైన పాజిటివ్ ఫీలింగ్స్ ని సెల్ఫ్ ఇమేజీకి జోడించాలి. 

ఒకసారి వృత్తిగత సెల్ఫ్ ఇమేజీని సృష్టించుకున్నాక మళ్ళీ ఎలాటి నెగెటివ్ ఎనర్జీకి తావివ్వకూడదు. ఇక విసుగు, కోపం, చిరాకు, అసహనం, ద్వేషం వంటివి ఫీలవకూడదు. కొందరు ఏం చేస్తారంటే ఓ నిర్మాతకి కథ చెప్పి ఆయన తిరస్కరిస్తే వచ్చి బ్యాడ్ గా చెప్తారు. బాడీ షేమింగ్ చేస్తారు. బుర్ర లేదంటారు. ఇంకేదో అని ఇన్సల్ట్ చేస్తారు. ఇలా చేయకుండా జాగ్రత్త పడాలి. ఇంకెవరో ఏదో అన్నారని అంతు చూసేందుకు నడుం బిగిస్తారు. ఎవరేమన్నా, ఎవరు తప్పుగా ప్రవర్తించినా వాళ్ళ సంగతి విశ్వం చూసుకుంటుంది- మనం చేయాల్సింది- థాంక్యూ, గాడ్ బ్లెస్ యూ అనుకుని దీవించి వదిలేయడమే. నేను సినిమా తీస్తా, తీసి వాడికి నిరూపిస్తా అనడం కూడా నెగెటివిటీయే. ఎవరికో ఏదో నిరూపించడం కోసం విశ్వం పనిచేయదు. అది విశాల ప్రయోజనం కోసం పని చేస్తుంది. అలాగే గాసిప్స్ కి దూరంగా వుండాలి. 

వృత్తిగత సెల్ఫ్ ఇమేజీతో అనుకున్న గోల్ సాధించాక, కోరుకున్న పై స్థాయికి చేరుకున్నాక  -అంటే దర్శకుడిగా మారేక - అక్కడుంటుంది మళ్ళీ పరీక్ష! అనుకున్నది సాధించాం కదా అని, కింది స్థాయిలో వున్నప్పుడు ఏ సెల్ఫ్ ఇమేజీ సృష్టించుకున్నారో, ఇప్పుడూ అదే సెల్ఫ్ ఇమేజీతో కొనసాగుదామనుకుంటే సర్రున జారి అదే కింది స్థాయికి వచ్చేస్తారు. అందుకని అనుకున్న గోల్ సాధించాక మళ్ళీ అంతకి మించిన పెద్ద సెల్ఫ్ ఇమేజీని సృష్టించుకోవాలి. దాని మీద పనిచేయాలి. అంటే మనతో మనమే పోటీ పడాలి, ఇంకొకరితో పోటీ పడడం కాదు. లక్ష్మి చాలా చంచలమైనది. అది మనతో స్థిరంగా వుండాలంటే నిత్యం స్కిల్స్ ని పెంచుకుంటూ వుండాలి. ఎడ్యుకేట్ అవుతూ వుండాలి. న్యూ ఏజ్ గురు దీపక్ చోప్రా అంటాడు- లక్ష్మి రావాలంటే,  వచ్చి మనతో వుండి పోవాలంటే,  మనం నిత్యం విద్యని పెంపొందించుకుంటూ వుండాలి- అప్పుడు మనతో వుంటున్న అంత సరస్వతిని చూసి, ఈర్ష్యతో లక్ష్మి మన పక్కకొచ్చేస్తుందని! నిరంతర విద్యలేక ఏదీ నిలబడదు జీవితంలో. 

పొతే, సెల్ఫ్ టాక్ (స్వగతం) అనే దొకటుంటుంది. మనసు నిత్యం ఏం రొదపెడుతోందో  ఓ కన్నేసి వుంచాలి. అది నెగెటివ్ సెల్ఫ్ టాక్ అయివుంటే ఎల్ ఓ ఏ మీద బురదజల్లినట్టే. దీన్ని నివారించి పాజిటివ్ సెల్ఫ్ టాక్ గా మార్చుకోవాలి. 

ఎల్ ఓ ఏ కి మొదటి అడుగు ఇలా వృత్తిగత సెల్ఫ్ ఇమేజీని సృష్టించుకోవడం. దాని విదివిదానాలకి కట్టుబడి వుండడం. ఏ వృత్తికైనా ఇది అవసరం. దీంతో గోల్ సాధించాక మరింత పెద్ద సెల్ఫ్ ఇమేజీని సృష్టించుకోవడం కూడా అవసరం. నోకియా కంపెనీ తను సృష్టించుకున్న గ్లోబల్ మార్కెట్ ని చూసి మురిసిపోయింది. కానీ స్మార్ట్ ఫాన్స్ కి అప్ గ్రేడ్ అవ్వాలని మరింత పెద్ద సెల్ఫ్ ఇమేజీ సృష్టించుకోకపోవడం వల్ల మార్కెట్ లోనే లేకుండా పోయింది. ఈ విషయం కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకోవాల్సి వచ్చింది నోకియా బాస్!

(ఇంకా వుంది) 

-సికిందర్