రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, సెప్టెంబర్ 2022, గురువారం

1210 : రివ్యూ!

దర్శకత్వం: అయాన్ ముఖర్జీ
తారాగణం : రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, నాగార్జున, మౌనీ రాయ్ తదితరులు
రచన ; అయాన్ ముఖర్జీ, హుస్సేన్ దలాల్; సంగీతం : ప్రీతమ్, ఛాయాగ్రహణం : మణికందన్, పంకజ్ కుమార్, సుదీప్ ఛటర్జీ, వికాష్ నౌలాఖా, ప్యాట్రిక్ డ్యూరక్స్
బ్యానర్స్ : స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్
నిర్మాతలు: కరణ్ జోహార్, అపూర్వా మెహతా, నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, మరిజ్కే డిసౌజా, అయాన్ ముఖర్జీ
విడుదల : సెప్టెంబర్ 9, 2022
***

        సుదీర్ఘ కాలం నిర్మాణంలో వుండి, బహిష్కరణల పిలుపులతో అయోమయంలో పడి, ఆఖరికి బుకింగ్స్ తో ఆశల్ని రేకెత్తిస్తూ విడుదలైన బ్రహ్మాస్త్రం ప్రేక్షకుల తీర్పుకి నిలబడింది. 410 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అని చెబుతున్న ఈ బాలీవుడ్ మెగా మూవీ, ఇంకో సందిగ్ధాన్ని కూడా తొలగించేందుకు ముందుకొచ్చింది. వరుసగా బాలీవుడ్ సినిమాలు విఫలమవుతున్న నేపథ్యంలో, ప్రేక్షకులు హిందీ సినిమాలని ఇక మర్చిపోదల్చారా అన్న ప్రశ్నకి సమాధానంగా కూడా బ్రాహ్మాస్త్రం విడుదలైంది. అలాటిదేమీ లేదు, హిందీ సినిమాల్ని కూడా చూస్తారు - కాకపోతే ఎంత స్టార్ సినిమా అయినా నాసిరకం సినిమాల్ని చూడరని ఇక తేలిపోతోంది.

        ర్శకుడు అయాన్ ముఖర్జీకిది డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో ఈ స్థాయి బడ్జెట్ కి, హాలీవుడ్ ని తలదన్నే విజువల్ హంగామాకీ భారీ తారాగణం కొలువు దీరాలి నిజానికి. కానీ అరడజనుకి మించి తారలు లేరు. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, నాగార్జున, మౌనీ రాయ్, ఇంతే. భారీ సంఖ్యలో తారాగణముంటేనే కథంతా గందర గోళమై, ఎవరు ఎవరో గుర్తు పెట్టుకుని చూడ్డం కూడా అదనపు భారమై పోతుంది. మరి ఇంత సింపుల్ తారాగణంతో బ్రహ్మాస్త్రం కథ ఎంత బలంగా వుంది? అరుగురూ స్టార్సే. ఏ క్షణం చూసినా ఒకరు కాకపోతే ఒకరు స్టార్సే కనపడే ఈ బృహత్ ప్రయత్నంలో, ఏ మాత్రం మెప్పించి కడుపు నిండిన ఫీలింగ్ తో ప్రేక్షకుల్ని ఇళ్ళకి పంపించారు? ఇవి తెలుసుకుందాం...

కథ

పురాతన కాలంలో గాలి నీరు నేల నిప్పు అనే పంచభూతాల్లోని నాలుగు మూలకాలకి, జంతు సంబంధమైన, వృక్ష సంబంధమైన ధాతువుల్ని కలిపి, అతీత శక్తుల్ని సాధించడానికి ఋషులు హిమాలయాలలో కఠోర తపస్సు చేసి బ్రహ్మాస్త్రాన్ని సృష్టించారు. దుష్ట శక్తుల నుంచి ప్రపంచానికి ముప్పు వాటిల్లినప్పుడు ఈ అస్త్రం ఆ ముప్పుని తుత్తునియలు చేసే విశ్వశక్తితో వుంటుంది. ఈ బ్రహ్మాస్త్రాన్ని మూడు భాగాలుగా  చేసి, బ్రహ్మాంశ్ అనే గుప్త సమాజానికి అందించారు. తరతరాలుగా గుప్త సమాజం చేతులు మారుతూ వస్తూ, ఇప్పుడు ముగ్గురి దగ్గర అస్త్ర భాగాలు భద్రంగా వున్నాయి.        

ప్రస్తుతానికొస్తే, ముంబైలో డీజే శివ (రణబీర్ కపూర్) పండగలకి ప్రోగ్రాములు ఇస్తూ వుంటాడు. అనాధగా అతడిది సామాన్య జీవితం. దసరా ఉత్సవాలప్పుడు అతను ఈషా (ఆలియా భట్) అనే అద్భుత సౌందర్యరాశిని చూసి వెంటనే ప్రేమలో పడిపోతాడు. అయితే అతడి ప్రేమాయణానికి ఏవో కలలు అడ్డుపడుతూంటాయి. ఆ కలల్లో అగ్నిగోళాలు పేలుతూ, ఏవో దృశ్యాలు కనపడుతూ వుంటాయి. దీన్ని అర్ధం జేసుకోలేక పోతాడు.

        ఇలావుండగా, జునూన్ (మౌనీ రాయ్) అనే దుష్ట శక్తి తన అనుచరులిద్దరు రఫ్తార్, జోర్ లని వెంటేసుకుని బ్రహ్మాస్త్రం వేటలో వుంటుంది. మోహన్ భార్గవ్ (షారుక్ ఖాన్) అనే శాస్త్రవేత్త గుప్త సమాజం సభ్యుడిగా వుంటూ, బ్రహ్మాస్త్రంలోని ఒక భాగం వానరాస్త్రాన్ని కలిగి వుంటాడు. ఇతడ్ని చంపేసి వానరాస్త్రాన్ని హస్తగతం చేసుకుంటుంది జూనూన్. మిగిలిన రెండు అస్త్రాల్ని కూడా చేజిక్కించుకుని ప్రపంచాన్ని శాసించాలన్న దుష్ట ప్రణాళికతో వుంటుంది.

        శివకి కలలో కనపడుతున్న దృశ్యాలివే. మరోసారి వారణాసిలో చిత్రకారుడు అనీష్ శెట్టి (నాగార్జున) బలి కాబోతున్నాడని గ్రహించి, ఈషాతో అక్కడికి వెళ్ళేసరికి జునూన్ దాడి చేస్తూంటుంది. గుప్త సమాజం రెండో సభ్యుడు అనీష్ శెట్టి దగ్గరున్న నంది అస్త్రాన్ని కైవసం చేసుకుని చంపేస్తుంది. ఈ సమయంలోనే శివకి అగ్నితో తనకేదో సంబంధ ముందని తెలుస్తుంది. తను నిప్పుని  పుట్టించలేడు, కనీసం దీపం ముట్టించలేడు. అయితే  మంటలు కూడా అతడ్నేమీ చేయలేవు.

        ఈ నేపథ్యంలో గురూ (అమితాబ్ బచ్చన్) అనే గుప్త సమాజం మూడో సభ్యుడు హిమాలయాల్లో ఆశ్రమంలో వున్నాడని తెలుసుకుని వెళ్ళిన శివ అక్కడేం చేశాడు? మూడో అస్త్ర భాగం జునూన్ చేతికి చిక్కకుండా ఆమెనెలా ఎదుర్కొన్నాడు? చివరికేమయ్యాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ట్రెజర్ హంట్- మిథికల్ ఫాంటసీ జానర్ కథ ఇది. అయితే ఇటీవల కార్తికేయ 2 లో  పురాణాలు చరిత్రలనీ, కృష్ణుడు చారిత్రక పురుషుడనీ చెప్తూ, కృష్ణుడిచ్చిన అస్త్రంతో వాస్తవిక కథ చేయకుండా కల్పిత కథే చేశారు. ప్రపంచాన్ని కాపాడే ఒక అస్త్రాన్ని కృష్ణుడు గుప్త సమాజానికిస్తాడు. ఆ గుప్త సమాజం వారసుల దగ్గరున్న అస్త్ర భాగాల కోసమే ఈ కథ. బ్రహ్మాస్త్రం లో కూడా ఇలాటిదే కథ. ఈ కథలు అశ్విన్ సంఘీ  రాసిన ది కృష్ణ కీ అనే పాపులర్ మిథికల్ థ్రిల్లర్ నవల్లోని కథ లాగే వుంటాయి. కాకపోతే కార్తికేయ 2 లో అస్త్రం కోసం వేట కథ కాస్తా, కృష్ణుడి ప్రవచనాలతో భక్తి సినిమాలాగా మారిపోయింది. అందుకే ఇప్పుడున్న మతోత్సాహ వాతావరణంలో నార్త్ లో అంత హిట్టయ్యింది.

        బ్రహ్మాస్త్రం లో దేవుళ్ళూ  ప్రవచనాలూ లేవు. అస్త్రం కోసం వేటతోనే సూటి కథ. అయితే ఈ కథలు ఈ కాలంలో కూడా మూసలోనే తీస్తున్నారు. అటు హాలీవుడ్ లో చూస్తే ప్రపంచాన్ని కాపాడేది అమెరికానే అన్నట్టు సినిమాలు తీసి పడేస్తున్నారు. మన వాళ్ళు ప్రపంచానికివ్వగల శాస్త్ర పరిజ్ఞానమంతా మన దగ్గరే వుందని  చెప్తూ కూడా - అస్త్ర శస్త్రాల కథల్ని దేశం దాటించడం లేదు. ఇదే బ్రహ్మాస్త్రం దుష్ట శక్తుల చేతిలో పడితే మొదటి దెబ్బ అమెరికాకే అన్నట్టు చెప్పి, విదేశీ పాత్రలతో కూడా కథ చేసి వుంటే - సెకండాఫ్ ఈ కథ మరో లోకల్ మూస కథగా కుదేలవకుండా, గ్లోబల్ కథగా వ్యాకోచించేది.

నటనలు- సాంకేతికాలు
ఉన్న ఆరు పాత్రలూ బావున్నాయి- ముఖ్యంగా హీరో రణబీర్ కపూర్ మాస్ ఓరియెంటెడ్ పాత్ర. పాత్ర చిత్రణ. స్టార్ కివ్వాల్సిన ఎలివేషన్. యూత్ అప్పీల్ కోసం రోమాన్స్ సహా. తల్లిదండ్రు లెవరో తెలియని అతడి కదిలించే ఫ్లాష్ బ్యాక్. దివ్య శక్తులతో హీరోయిజం. ఇలా ప్రతీ కోణంలో గుర్తుండి పోతాడు. అగ్ని పుంజాలతో అతను పాడుకునే పాట క్రియేటివిటీ పరంగా కొత్తాలోచన. దసరా ఉత్సవాల్లో మొదటి మాస్ పాట దగ్గర్నుంచి, మూడు నాల్గు రోమాంటిక్ సాంగ్స్ మ్యూజికల్ గా, విజువల్ గా హైలైట్సే. ఇక అతడి యాక్షన్ సీన్స్ చెప్పనవసరం లేదు.

        ఆలియాభట్ ప్రేమలప్పుడు, పాటలప్పుడూ వచ్చిపోయే ఫార్ములా గ్లామర్ బొమ్మలా కాకుండా, ఆద్యంతం కథలో, యాక్షన్ దృశ్యాల్లో పాల్గొనే పాత్రచిత్రణతో, తగిన నటనతో వుంది. షారూఖ్, నాగార్జున లవి అతిధి పాత్రలే అయినా, కీలకమైనవి. సినిమా ప్రారంభం షారూఖ్ తో వుంటుంది. అతడి పాత్ర మరణం, తర్వాత నాగార్జున పాత్ర మరణమూ కదిలిస్తాయి. సెకండాఫ్ లో గురూగా అమితాబ్ మూలస్తంభంగా వుంటాడు. ఇక విలన్ పాత్రలో యంగ్ మౌనీ రాయ్ ఒక సర్ప్రైజ్. ఇంత భారీ సినిమాని విలన్ గా తన భుజాన మోయడం!

        ఇక సాంకేతికంగా చెప్పడానికి మాటల్లేవు. సంజయ్ లీలా భన్సాలీ కూడా ఈ దృశ్య వైభవం చూసి అప్డేట్ అవ్వాల్సిందే. హాలీవుడ్ ఆల్రెడీ మోకరిల్లిందని రివ్యూలొస్తున్నాయి. తిరుగులేని గ్రాఫిక్స్ వర్క్ కి కళ్ళు చెదురుతాయి. ఇంతకంటే ప్రేక్షకులకేం కావాలి? కావాలి ఇంకాస్త మంచి సెకండాఫ్...

చివరికేమిటి

ఆరే ఆరు పాత్రలతో భారీ కథ కాకుండా, కథ సింపుల్ గా, సూటిగా వుండడంతో ఫస్టాఫ్ క్షణం కూడా కళ్ళు తిప్పుకోకుండా ఫాలో అవుతాం. నిజానికి హాలీవుడ్ బిగ్ యాక్షన్ మూవీస్ సింపుల్ గా సూటిగా వుండే కథలతోనే వుంటాయి. ఇక్కడ ఒక బ్రహ్మాస్త్రం మూడు చోట్ల వుంది, దాన్ని కాజేయడం కోసం విలన్, విలన్ని అడ్డుకునే హీరో, ఇంతే కథ. ఆ విలన్ కి ఇద్దరే అనుచరులు. దీనికి బ్యాక్ డ్రాప్, యాక్షన్ ఇవన్నీ బిగ్ కాన్వాస్స్ తో వుంటాయి. ఇలా ఈమధ్య కాలంలో ఫస్టాఫ్ కళ్ళు తిప్పుకోకుండా కూర్చోబెట్టే సినిమా ఇదే.

        సెకండాఫే సమస్య. సెకండాఫ్ లో వేట కథ నాపి, బ్రహ్మాస్త్రం పుట్టు పూర్వోత్తరాలు (ఇది ఆల్రెడీ సినిమా ప్రారంభంలో చిరంజీవి వాయిసోవర్ చెప్పేశారు), హీరో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ వంటి సెకండాఫ్ ని కుంగదీసే విషయాలతో నిడివిని భర్తీ చేయడంతో, ముప్పావుగంట సహనాన్ని పరీక్షిస్తుంది. మళ్ళీ వేట కథ మొదలయ్యాక ఎంతకీ ముగియని క్లయిమాక్స్ తో సహన పరీక్ష రెట్టింపవుతుంది. మరి ముగింపు? ముగింపు పేలవంగా వుంది. ఈ ముగింపుతో రెండో భాగం తీస్తారా, దీంతో ఆపేస్తారా అనేది త్వరలో న్యూస్ ఇవ్వొచ్చు దర్శకుడు.

సికిందర్