రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, మార్చి 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!






కథ – దర్శకత్వం :  దశరథ్
మనోజ్ మంచు, రెజినా, ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, నాగినీడు, సుబ్బరాజు, బ్రహ్మానందం 
స్క్రీన్  ప్లే : గోపీ మోహన్, హరి, కిషోర్ గోపు,  మాటలు :  దశరథ్ - కిషోర్ గోపు, సంగీతం : కె, వేదా, ఛాయాగ్రహణం : మల్హర్ భట్ జోషి 
బ్యానర్ : సురక్ష్ ఎంటర్ టైన్మెంట్స్ , నిర్మాత : మల్కాపురం శివకుమార్ 
విడుదల : 4  మార్చి,  2016

           ***

     దర్శకుడు కె.  దశరథ్ ఈ సారి ఓ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతవారం విడుదలైన రెండు థ్రిల్లర్స్ ‘క్షణం’, ‘టెర్రర్’ లు చూసివున్న ప్రేక్షకులకి వెంటనే మరో థ్రిల్లర్ చూసే భాగ్యం కలుగుతోంది. కనీసం తెలుగు సినిమాలు రొటీన్ అయిపోయిన ప్రేమ కథలు, హార్రర్ కామెడీలకి దూరంగా కాస్త మార్పు తో ఇలా థ్రిల్లర్స్ తో ఉపశమనం కల్గించడం అమంచిదే. అయితే తెలుగు దర్శకులు  ఎంత వరకూ థ్రిల్లర్స్ అందించడంలో సక్సెస్ అవుతున్నదీ ప్రేక్షకులు గమనిస్తున్నదే. ఈ నేపధ్యంలో మంచు మనోజ్ –రెజీనా కాసాండ్రాలు హీరో హీరోయిన్లుగా దశరథ్ తీసిన ‘శౌర్య’ అనే థ్రిల్లర్ ఏ  మేరకు మార్కెట్ ధోరణులకి తగ్గట్టుగా వుందో  పరిశీలిద్దాం.


కథ
         
హార్వార్డ్  యూనివర్సిటీ విద్యార్థి అయిన శౌర్య (మంచు మనోజ్) ఆంధ్రా వచ్చి ఎంపీ సత్యమూర్తి ( నాగినీడు) కూతురు నేత్ర(రెజీనా కాసాండ్రా) తో ప్రేమలో పడతాడు. నేత్ర ఈ విషయం తండ్రికి సత్యమూర్తికి చెప్పక పోవడంతో సత్యమూర్తి ఆమెకి వేరే సంబంధం ఖాయం చేస్తాడు. తర్వాత కూతురు శౌర్యని  ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. పెద్ద కూతురు కూడా ఇలాగే ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. నేత్ర కూడా ఇదే పరిస్థితి తేవడంతో సత్యమూర్తి తమ్ముడు కృష్ణ మూర్తి (సుబ్బరాజు) కోపం పట్టలేక పోతాడు. కానీ సత్యమూర్తి  కూతురి సుఖమే ముఖ్యమని ఖాయం చేసుకున్న సంబంధాన్ని మెల్లిగా వాళ్లకి నచ్చజెప్పి రద్దు  చేయిస్తానని,  అప్పటివరకూ శౌర్యని కలవకుండా వుండాలనీ షరతు పెడతాడు నేత్రకి. 

          కానీ నేత్ర శివరాత్రి నాడు జాగారం చేద్దామని శౌర్య తో గుడికి వెళ్తుంది. అక్కడ నిద్రపోతున్న ఆమెని గొంతు కోసి పారిపోతరెవరో. ఈ హత్యాయత్నం కేసులో శౌర్య  అరెస్ట్ అవుతాడు. ఇదీ విషయం. నేత్ర గొంతు కోసిందెవరు? తర్వాత నేత్ర చనిపోతే శౌర్య మీద కేసు ఎంతమేరకు బలపడింది?  ఈ కేసులోంచి ఎలా బయటపడ్డాడు? ఈ సంగతులు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

ఎలావుంది కథ
         
థ, అది చెప్పిన విధానం ఇప్పటి మార్కెట్ ని ఆకర్షించే విధంగా లేదు. ఇవాళ్ళ సినిమా కథల్ని యూత్ ని దృష్టిలో పెట్టుకుని రాస్తున్నామని అనుకుంటున్నారు గానీ, వాస్తవానికి ఆ యువ ప్రేక్షకుల్లో అబ్బాయిలకి తప్ప అమ్మాయిలు వుండడం లేదు ఇలాటి కథలకి. ఈ అబ్బాయిల కోసం కూడా రాస్తున్న కథలు ప్రేమ పేరుతో  అవే కాలం చెల్లిన, ఫార్ములా కథలు. ఈ కథలకంటే అబ్బాయిలు చాలా ముందున్నారు. కథల్లో చూపిస్తున్న  ప్రేమలకి అప్పుడే పెళ్లి అనే సంకెళ్ళు వేయడం, సెంటి మెంట్లతో బంధించడం నేటి జెనెక్స్  ప్రేక్షకులైన అబ్బాయికి  అస్సలు జీర్ణం కావడం లేదు. ప్రేమ కథల్లో ప్రేమలు  కాకుండా, ప్రేమల పేరుతో  పాల్పడే రకరకాల క్రేజీ చేష్టల్నే ఎంజాయ్ చేసే పరిణామక్రమంలో వున్నారు. ఈ మార్కెట్ అవసరాన్ని ఇలాటి కథలు తీర్చడం లేదు. పైగా ఈ కథ థ్రిల్లర్ అన్నారు. కానీ థ్రిల్లర్ జానర్ లక్షణాలు ఎక్కడా లేవు. జానర్ మర్యాద కాపాడని సినిమాలు గత సంవత్సరం ఏ బాట పట్టాయో అదే  బాటన పడిందీ కథ!

ఎవరెలా చేశారు
        మంచుమనోజ్ పూర్తి పాసివ్ పాత్ర పోషించాడు. రాముడు మంచి బాలుడన్నట్టు ఏమీ చేయకుండా, ఎక్కడా ఎదురు తిరగకుండా, పైపెచ్చు ఏడ్చే అతి బలహీన పాత్ర పోషించాడు. తెలుగు సినిమాల్లో పాసివ్  పాత్రలకి పరాకాష్ట అన్నట్టు వున్నాడు. ఆర్టు సినిమాల్లో కన్పించే బాధితులైన బడుగు రైతు పాత్రకీ  దీనికీ తేడా ఏమీలేదు. ఇది పూర్తిగా బాక్సాఫీసు వ్యతిరేక పాత్ర చిత్రణ. పైగా బాగా లావెక్కి పోయి యూత్ అపీల్ ని కోల్పోయే విధంగా వున్నాడు. అర్జెంటుగా అనవసర బరువు తగ్గించుకుంటేనే యూత్ లో తనకి ఇదివరకున్న క్రేజ్ వుంటుంది.

          హీరోయిన్  రెజీనా నటించడానికి పాత్ర పడే   సంఘర్షణ ఏమే లేదు. నేటి యూత్ కి హుషారు కలిగించే క్రేజీ సీన్లు కూడా లేవు ఆమెకి.

          ప్రకాష్ రాజ్ సీఐడీ అధికారిగా అయితే వున్నాడు గానీ,  అతడి పనితీరుకి  ఎక్కడా లాజిక్ కనపడదు. ఎంట్రీ సీనులో ఒక ఉరేసుకున్న మనిషి ఎంత సేపటికి చనిపోతాడో తనమీదే ప్రయోగించుకుని చూపిస్తాడు. తను 57 సెకన్ల వరకు మెడ చుట్టూ ఉరి తాడుని తట్టుకున్నాడు గాబట్టి, ఆ సమయాన్నే అసలు వురేసుకున్న ఆడమనిషికి వర్తింపజేసి ఆమె భర్తని  అరెస్ట్ చేస్తాడు. కానీ మెడకి వురి వేసుకుని కాళ్ళ కింద స్టూలు తన్నేయగానే జరిగే మొదటి చర్య మెడ ఎముక విరగడం. అంతే  గాకుండా మనిషి మనిషికీ ప్రాణం పోయే సమయం వేర్వేరుగా వుంటుంది. ప్రకాష్ రాజ్ ఇలా ఎలా నిర్ణయిస్తాడు?

          ప్రకాష్ రాజ్ భర్తని అరెస్టు చేయాలంటే  సింపుల్ విషయం  ఏమిటంటే, స్వయం గా వురేసుకుంటే తాడు మెడ చుట్టూ తిరిగే  కోణం,  ఇంకెవరో వురి తీసి వేలాడదీస్తే వుండే కోణం పరస్పర విరుద్ధంగా వుంటాయి. ఒక  సీఐడీ ఆఫీసర్ కిది జనరల్ నాలెడ్జి. అలాంటిది తన మీదే ఉరి ప్రయోగించి చూసుకుంటూ వేలాడ్డ మేమిటి సిల్లీగా. 

          అలాగే, హీరోయిన్ గొంతు  కోసిన కత్తికి అంటిన రక్తం గురించిన వివరణకీ  లాజిక్ లేదు. ఏ ఫోరెన్సిక్ లాబ్ లోనైనా పరీక్షల్లో మొట్ట మొదట చూసేది కత్తికి ఆ రక్తం హతురాలిదో కాదో అనే. ఈ కథలో అది హీరోయిన్ రక్తమే కానప్పుడు ఆమె మీద హత్యాయత్నం జరిగి వుండే అవకాశమే  లేదు. రెండోది, కత్తికి చర్మపు  పోగులు, ఎముకల పొడీ అంటుకునే అవకాశమే లేదు. ఇది ఈ సినిమా లోనే కొత్తగా వింటున్నాం. శరీరంలోకి దిగిన రక్తమే అంటుకుంటుంది తప్ప ఇంకమీ అంటుకోవు. అది హీరోయిన్ రక్తమే కాదని పరీక్షలో తేలడం ఖాయం. అలాంటప్పుడు హీరోమీద కేసుకి ఛాన్సే లేదు.

          ఇలా ప్రకాష్ రాజ్ పాత్ర చిత్రణ అవకతవకగా తయారయ్యిది. ఇతర పాత్రల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. సెకండాఫ్ లో వచ్చే బ్రహ్మానందం చేసే విఫల కామెడీ సహా. ఇక పాటలు, కెమెరా వర్క్, ఇతర సాంకేతిక విలువలూ చెప్పుకోదగ్గవిగా లేకపోవడం మనోజ్ సినిమాకి ఆశ్చర్యకరం. 

చివరికేమిటి
        ఈ సినిమాలో మంచు మనోజ్ ఎందుకు నటించాడా అన్నాది లాజిక్ కి అందని చిక్కు ప్రశ్న. పాత్ర ఎంటర్ టైన్ న్ చెయ్యదు, ఫైట్లూ  చెయ్యదు. మార్కెట్ డిమాండ్ చేసే అన్ని విలువలకీ దూరంగా మనోజ్ ఇలా కన్పించి సాధించేమిటో  తనకే తెలియాలి. దర్శకుడు దశరథ్ థ్రిల్లర్ జానర్ ర్ కొత్త.  ఓవరాల్ గా ఈ కథ కి మార్కెట్ స్పృహ ఎలా లేదో, అలాగే దీనికి చేసిన స్క్రీన్ ప్లేకి ఏ  స్క్రీన్ ప్లే లక్షణాలూ లేవు. దశరథ్ సహా ఈ సినిమాకి ఐదుగురు రచయితలూ పనిచేశారు మరి. ఐదారు సినిమాలు తీసిన దశరథ్ కే ఈ పరిస్థితి వుండడం విచారకరం. పైగా తికమక పెట్టే, అర్ధంలేని ఫ్లాష్ బ్యాక్స్ చివరంటా చికాకు పెడతాయి. ఈ కథలో ఏ ట్రాకుని  థ్రిల్లర్ కుండాల్సిన ప్రత్యేక డైనమిక్స్ దృష్ట్యా ఫ్లాష్ బ్యాక్ గా చూపాలి, ఏ ట్రాకుని  ప్రత్యక్ష కథగా చూపితే  బోరెత్తకుండా వుంటుందో తెలుసుకోలేదు. దీనికి సమాధానం గతవారం  విడుదలైన  ‘క్షణం’ లోనే దొరుకుతుంది. సీన్ల కంపోజిషన్, పాత్రల తీరు, చిత్రీకరణ వగైరా ఇప్పటి మార్కెట్ విలువలకి అందనంత దూరంలో  వున్నాయి. థ్రిల్లర్ జానర్ పక్కా ప్రొఫెషనలిజాన్ని డిమాండ్ చేస్తుందని  గుర్తిచలేదు.


-సికిందర్    
http://www.cinemabazaar.in