రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, January 16, 2017

స్పెషల్ ఆర్టికల్- 3




    A movie is told with pictures, not words- అన్నాడు స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని  నేలకు దించి యువతరానికి  సులభతరం చేసిన దివంగత సిడ్ ఫీల్డ్. కథకి టీజర్ గా పాత్రని కూడా ఎక్కు పెట్టొచ్చు. ఆ పాత్ర హీరో, హీరోయిన్, విలన్, ఎవరైనా కావొచ్చు. మనం సినిమా కెళ్తే,  అక్కడ టైటిల్స్ పూర్తవగానే హీరోని చూపిస్తూ- పండు గాడు వీడు. మహా అల్లరి గాడు సుమండీ! చిన్నప్పుడు బామ్మ నేర్పిన అల్లరి అట.  బామ్మ వీడికి జడ లేసి వంశంలో ఆడపిల్ల ల్లేని ముచ్చట కూడా తీర్చుకునేది. అదిగో దాని తాలూకు గుర్తే ఆ పిలక! అందుకే వీడికి ఆడపిల్లలంటే సిగ్గండీ. వీడు ఇంటర్ మూడు సార్లు తప్పి పుస్తకాల ఖర్చూ ఆదా చేస్తున్నాడు. అదిగో- అదిగో-వాడి నడక స్టయిల్ చూశారా..ఎంటా కుంటి నడక అంటారూ? ఎంతకీ వీడు ఆడపిల్లల వెంట పడి చావడంలేదనీ, వీడి నాన్న ఠపీ విరగ్గొట్టిన కాలు కదూ అలా అయిపోయిందీ...ఇలా కామెంటరీ సాగుతూంటుంది....

         
దీన్ని క్యారక్టర్ టీజర్ అందామా? మూకీ సినిమాల కాలంలో తెర పక్కన నించుని ఒకడు మాటలు పలకని పాత్రల భావాల్ని అరిచి చెప్పేవాడట- ఇది రానురానూ 2000 నాటికల్లా తెలుగు సినిమాల్లో తెర వెనుక నుంచి ఓ  గొంతుక (వాయిసోవర్- డబ్బింగ్ ఆర్టిస్టు కూడా కావొచ్చు) పాత్రల్ని పైన చెప్పుకున్న విధంగా పరిచయం చేసే పద్ధతికి మారింది. 

          పాత్రల్ని ఇలా పరిచయం చేసే విధానం శాస్త్రంలో లేదు.  సినిమా శాస్త్రం కంటే నాటక విధానాలతోనే తెలుగు సినిమాల తీరుతెన్నులుంటాయి కాబట్టి, ఇది శాస్త్రీయ దృష్టికి  
లో- కేటగిరీకళా ప్రదర్శన అయ్యింది.    పాత్ర తీరుని అది పాల్పడే చర్యలు గానీ, లేదా ఈ పాత్ర తో ఇంకో పాత్రకి అనుభవమైనప్పుడు ఈ పాత్ర గానీ, పరిచయం చేయడం సరైన విధానం. ఒకప్పుడు ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్  అననే అన్నాడు – తన గురించి తాను అంతా వాగేసే పాత్ర మహా బోరు.  అలా పాత్ర వాగినా, వాయిసోవర్లో కథకుడు సంబరపడినా పాత్రలో సరుకంతా సఫా – అని!

          రచయిత చమత్కార శక్తిని ప్రదర్శించుకోవడం తప్ప దీనివల్ల ఒరిగేదేమిటి
. గమనిస్తే పాత్రల్ని ఇలా  టీజర్స్  గా ప్రయోగించిన సినిమాలు  ఫ్లాపయ్యాయి- లేదా పెద్దగా  సక్సెస్ కాలేదు. కామెడీకైనా ఈ నాటకీయ విధానం  రచయిత  అసమర్ధతని పట్టిచ్చేస్తుంది. తనకి కథనం ద్వారా పాత్రని పరిచయం చేసే విజువల్ సెన్స్ లేదనీ, ఇలా నాల్గు మాటల్లో  చెప్పేసి తప్పించుకుంటున్నాడనీ అర్ధం వస్తుంది. అందుకే –
a movie is told with pictures, not words’  మీద పట్టు సాధించాలి. 

         
 కామెడీ సినిమాయే కదాని కూడా టీజర్ గా పాత్రని అల్లరి చిల్లరిగా పరిచయం చేయడమే కాదు, ఇతర జానర్ సినిమాల్లో కూడా స్టార్ గారిని ఎంత గౌరవనీయంగానూ, లేదా బీభత్సభరితంగానూ వాయిసోవర్ వేసి,  పరిచయం చేయడమనేది కూడా  దృశ్య మాధ్యమమైన సినిమా విధానమే కాదనేది గ్రహించాల్సి వుంటుంది. 

          క్యారక్టర్ టీజర్ కి
 వాయిసోవర్ వేసి, అందులో క్యారక్టర్ తాలూకు భూత  వర్తమాన భవిష్యత్ గానాలూ చేసేసి, క్యారక్టరైజేషన్  ఫలానా ఇదీ అని చెప్పేయడమంటే, అటు పైన ఆ క్యారక్టర్ కథలో ఎలా ప్రవర్తిస్తుందో ముందు చెప్పేయడమే. అంటే క్యారక్టర్ తాలూకు వుండాల్సిన సస్పెన్సుని చంపేసి   పలచబారేట్టు చేయడమే. భలే వున్నాడ్రా క్యారక్టర్-  అని ముందే చెప్పేస్తే ఆతర్వాత ఆ క్యారక్టర్ తో బాటు కథకూడా ముందే తెలిసిపోతూంటుంది. ప్రేక్షకులు ఇక యాక్టివ్ గా కాక,  ఇన్వాల్ మెంట్ తగ్గి పాసివ్ గా సినిమా చూడ్డం  మొదలెడతారు. ప్రతీ అక్షరం ప్రేక్షకుల మెంటాలిటీని బేరీజు వేసుకుంటూ సినిమా రచన చేయకపోతే అది సినిమా రచన అవదు, వార్తా రచన  అవుతుంది- వార్తా రచనలో మొదటి పేరాలో విషయం చెప్పేసి, తర్వాత ఆ వార్త తాలూకు వివరాల్లోకి వెళ్లినట్టు. 

      జానర్ కీ జానర్ కీ తేడాలు తెలీక అన్ని జానర్లకీ ఒకే టైపు రచన చేసేయడం, ఆ చేసిన రచనకూడా సినిమా రచనలా వుండకపోవడం గమనిస్తున్నాం. సినిమాటిక్ గా డైలాగులు రాయడంలో  చూపినంత ప్రతాపం, మిగతా కథా కథనాల్లో, పాత్ర చిత్రణల్లో చూపించడం లేదు.  

          సినిమా విడుదలయ్యే వరకూ ఆ సినిమా కథేమిటో టీజర్స్ లోనో, ట్రైలర్స్ లోనో  బయట పడకుండా ఎలా జాగ్రత్త పడతారో, అలా కథని పాత్రనీ గుప్పెట్లో పెట్టుకుని వాటి తాలూకు తురుపు ముక్కల్ని సమయోచితంగా ప్రయోగిస్తున్నపుడే  థ్రిల్ వుంటుంది.

         
సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్ విధానాలని తెలిపే శాస్త్రాల్లో మోనోలాగ్, నేరేషన్, టైం లాప్స్, స్పేస్ బ్రిడ్జింగ్, మూవ్ మెంట్ బ్రిడ్జింగ్ మొదలైన సౌండ్ ట్రాన్సిషన్ పద్ధతుల గురించే చెప్పారు తప్ప, పాత్రల్ని పరిచయం చేసే  వాయిసోవర్ ప్రక్రియ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అసలటువంటిది లేదు.

         
 కథకి నేరేషన్ ఇవ్వొచ్చు వాయిసోవర్ ద్వారా. అది కథని ముందుకి నడిపించేందుకు ( స్పేస్ బ్రిడ్జింగ్) పనికి రావొచ్చు (హీరోహీరోయిన్లు స్టెప్పు లేస్తూ డ్యూయెట్లు పాడుకునే రోజులుపోయి మాంటేజ్ సాంగ్స్ మొదలయ్యాక- కథని ముందుకు నడిపించేందుకు ఈ మాంటేజ్ సాంగ్స్ కూడా పనికొస్తున్నాయి). దీన్ని డైజెసిస్అంటారు. న్యూస్ రీళ్ళల్లో మనకి విన్పించే వ్యాఖ్యానం ఈ డైజెసిస్సే. ఇలా రికార్డు చేసిన ధ్వనిని డైజెటిక్ సౌండ్ అంటారు. ఇలా కథా గమనం గురించి కథకుడు వ్యాఖ్యానం చేసే డైజెటిక్ సౌండ్ కాక, పాత్ర తన గురించి తాను చెప్పుకునే వాయిసోవర్ కూడా వుంటుంది. దీన్ని ఇంట్రా డైజెటిక్ సౌండ్ అంటారు.  దీంతో సినిమా ప్రారంభిస్తే ఇది ఫ్లాష్ బ్యాక్ కి దారితీస్తుంది- ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లాగా. కానీ ఇది క్యారక్టర్ టీజర్ అన్పించుకోదు. ఆ మాటకొస్తే ఒక టీజరే అన్పించుకోదు. పాసివ్ ప్రారంభం అన్పించుకుంటుంది. యాక్టివ్ గా క్యారక్టర్ టీజర్ అన్పించుకోవాలంటే,  పాత్ర దృక్కోణంలో ఫ్లాష్ బ్యాక్ మొదలవకూడదు- అది  కథకుడి దృక్కోణ మవ్వాలి. 

          ఉదాహరణకి ఇదే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లో హీరో శ్రీనివాసరెడ్డి ఓపెనింగ్ సీనులో
సముద్రపుటొడ్డున ఎమోషనల్ గా నిలబడి చూస్తూ, మెళ్ళో  తాయత్తు  తెంపి సముద్రంలోకి విసిరేస్తాడు. ఆ తాయెత్తుతో అతడి  కథేమిటో చెప్పడానికి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఇందులో టీజర్ ఎఫెక్ట్ ఏముంది? ఏమీ లేదు. ప్రేక్షకులు కంగారు పడేట్టు శ్రీనివాస రెడ్దికి ఏమీ కాలేదు. తాయెత్తు సముద్రంలో కలిస్తే ఆడియెన్స్ కి వీసమెత్తు వర్రీ ఎందుకుంటుంది- తాళి తెంపి సముద్రంలోకి హీరోయిన్ విసిరేస్తే వుంటుంది గానీ! 

           తాళి స్థాయి వేరు, తాయెత్తు లెవెల్ వేరు. పవిత్రమైన తాళి కట్టుకోవడం, దాన్ని తెంపి పారెయ్యడం శ్రీనివాసరెడ్డికి సాధ్యం కాదు గనుక, అన్యధా భావించకుండా తనే సముద్రంలోకి దూకెయ్యాలి. మూఢ నమ్మకాలకి బలయ్యానని తాయెత్తుని  తెంపినంత మాత్రాన అవి మనసులోంచి తొలగిపోతాయా? కాబట్టి ఫ్రస్ట్రేషన్ తో తనే సముద్రంలోకి దూకెయ్యాలి. కథకి ఒక విజయవంతమైన క్యారక్టర్ టీజర్ని అందించడానికి ఈ త్యాగం తప్పదు. అప్పుడు మొదలయ్యే ఫ్లాష్ బ్యాక్ తో చక్కగా రెండు  జరుగుతాయి : ఒకటి- అంత తీవ్ర నిర్ణయం తీసుకున్న శ్రీనివాస రెడ్డి కథ ఏమై వుంటుందో తెలుసుకోవాలన్న ఆదుర్దా ఒకవైపు పెరిగిపోతూ,  రెండు- అలా దూకిన  శ్రీనివాసరెడ్డి ఏమయ్యాడు, బయటికి వస్తాడా, ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, లేకపోతే ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యేసరికి కొంపదీసి అతను....ఇలా సస్పెన్స్ ఇంకోవైపు అనుభవిస్తూ యాక్టివ్ గా సినిమా చూడ్డంలో లీనమవుతారు ప్రేక్షకులు. 

          ప్రేక్షకులని కూడా కలుపుకుని సీన్స్ ని ఎనాలిసిస్ చేసుకుని రాసుకోకపోతే అది కేవలం కథకీ- రచయితకీ (రచయితల బృందానికీ) మధ్య లీనియర్ రైటింగ్ అవుతుంది. శుష్క రచన అవుతుంది. చాలా లోపాలు వచ్చి చేరిపోతాయి.  రాత పని ఎప్పుడూ ఒంటరి పని కాదు. అక్కడ కన్పించని ప్రేక్షకులు కూడా వుంటారు. కాబట్టి కథ ఏం డిమాండ్ చేస్తోంది,  రచయిత ఏమనుకుంటున్నాడూ అనే గాక, ఫ్రేక్షకులెలా ఫీలవుతారనే ఇంకో దృక్కోణాన్ని కూడా కలుపుకుని ట్రయాంగిల్ బంధం రాత పని. 

          కథ- దాని ఎదురుగా రచయిత - వర్చువల్ గా ప్రేక్షకులూ - ఈ ముగ్గురూ కలిసి పాల్గొనేదే రాత పని. దురదృష్ట వశాత్తూ కథ ముందు పెట్టుకుని నల్గురైదుగురు రచయితలూ కుస్తీ పడతారు గానీ, వాళ్ళ మనసుల్లో ప్రేక్షకులుండరు. పైన శ్రీనివాసరెడ్డి ఉదంతంలో  కారక్టర్ టీజర్ అలా ఎందుకు మారిందంటే,  ప్రేక్షకుల వైపు నుంచి కూడా ఆలోచించడం వల్లే. లీనియర్ రైటింగ్ బదులు ట్రయాంగులర్ రాతపనిని ఆశ్రయించడం వల్లే- అక్కడ కథ సాంతం వెంటాడే రెండు అవస్థలు ఏర్పడ్డాయి- ఫ్లాష్ బ్యాక్ తాలూకు ఆదుర్దా, శ్రీనివాస రెడ్డి క్యారక్టర్ టీజర్ తాలూకు సస్పెన్స్. 

          బృందంలో ఇలా ఆలోచించే వాళ్ళుంటే- వాళ్ళ వెర్షన్ ని  తోసి పుచ్చడమే సర్వసాధారణంగా జరుగుతుంది. ప్రేక్షకుల్ని కూడా కలుపుకుని ఆలోచించడానికి అస్సలు ఇష్టపడరు. శాస్త్రీయత కంటే అశాస్త్రీయ లీనియర్ రైటింగ్ కే మెజారిటీ ఓట్లు పడతాయి. కానీ రచయితలు  అథమస్థానానికి చెందుతారు. వాళ్లకి  పై స్థాయిలో కథ- ప్రేక్షకులూ వుంటారు. ట్రయాంగులర్ బంధాన్ని గౌరవిస్తూ కథ ఏం చెప్తోంది,  ప్రేక్షకులేం ఫీలవుతారో వింటూ కింద కూర్చుకుని రాసుకుపోయే వాళ్ళే  నిజమైన రచయితలు. 

          రాతపనిలో వర్చువల్ గా ప్రేక్షకుల్ని భాగస్వాములుగా చేసుకోవాలంటే రచయిత విమర్శకుడు కూడా కావాలి. విమర్శకుడు సినిమా చూస్తూ ప్రేక్షకుల వైపు నుంచి కూడా ఆలోచిస్తాడు – ట్రయాంగులర్ బంధంతో. స్క్రిప్టు నుంచి స్క్రీన్ ప్లే,  స్క్రీన్ ప్లే నుంచి  స్క్రిప్టు నీ  ఎలా విడదీయలేమో-  రచయిత లోంచి విమర్శకుడూ, విమర్శకుడి లోంచి రచయితా తొంగి చూసినప్పుడే వాళ్ళ రాత పనికి న్యాయం జరుగుతుంది. ఇద్దరికీ కామన్ భాగస్వామ్యులు ప్రేక్షకులే. 

                                    ***
    'Amovie is told with pictures, not words’  కి ప్రత్యక్ష ఉదాహరణగా హాలీవుడ్  ‘సెవెన్’  క్యారక్టర్ టీజర్ ని చూద్దాం- ఈ కథ ఐదు సింపుల్ షాట్స్ తో మొదలవుతుంది. ఎలాటి వాయిసోవర్ గానీ డైలాగులూ గానీ లేకుండా, ఈ ఐదు షాట్స్ ద్వారా కొన్ని  సెకన్ల కాలంలో మోర్గాన్ ఫ్రీమాన్ క్యారక్టర్ ఏంటో తెలిసిపోతుంది...

          అపార్ట్ మెంట్ లోంచి కన్పించే  దృశ్యంతో అతను  మహానగరంలో నివసిస్తున్నాడని తెలుస్తుంది. అతను ధరించిన బ్యాడ్జి ద్వారా అతను పోలీసే కానీ, మామూలు పోలీసు కాదు- డిటెక్టివ్ పోలీసని తెలుస్తుంది. బెడ్ మీద అతను సరంజామా సర్దే పద్దతి  చూస్తే అతడిది నిశిత దృష్టి అనీ తెలుస్తుంది, అక్కడ డబుల్ బెడ్ వున్నా అతను  సింగిల్ గా వుంటున్న మనిషనీ తెలుస్తుంది, అతని దగ్గర కత్తి కూడా వుండడాన్ని బట్టి అతడి కేదో చీకటి చరిత్ర వుందని కూడా అర్ధమౌతుంది....ఇదంతా కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో అయిదు షాట్లలో! 

          క్యారక్టర్ గురించి మాటలతో చెప్పకుండా బొమ్మలతో చూపిస్తే క్యారక్టర్ కి సస్పెన్స్ పెరుగుతుంది, క్యారక్టర్ గుంభనంగా వుంటుంది. క్యారక్టర్ థ్రిల్లింగ్ గా వుంటుంది, క్యారక్టర్ పవర్ఫుల్ గా వుంటుంది...
(ఇంకా వుంది) 

-సికిందర్