రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, డిసెంబర్ 2017, మంగళవారం

567 : రైటర్స్ కార్నర్


      సినిమా రచన అనేది కళ మాత్రమే కాదు, మేనేజిమెంట్ కూడా. సినిమా రచయితలు నేరుగా ప్రచురించడానికో, ప్రదర్శనకి పెట్టడానికో స్క్రిప్టులు రాయరు. వాటిని సినిమాలుగా తీసేందుకోసం రాస్తారు. అవి సినిమాలుగా రూపొందాలంటే పరిశ్రమలో ఎన్నో అడ్డంకుల్ని ఛేదించాల్సి వుంటుంది. అడ్డంకుల్ని ఛేదించాలంటే మీరు మీ వృత్తిని ఒక క్రమ పద్ధతిలో మేనేజి చేయాలి. మీ నుంచి ఒక అద్భుత స్క్రిప్టు వచ్చి పరిశ్రమ దృష్టి నాకర్షించాలంటే మీరు పనిచేస్తున్న విధం మార్చుకోవాలి. సినిమా రచనా వృత్తి ఒక ప్రక్రియ. మీరు అవుట్ పుట్ ఇస్తారు, ఆ అవుట్ పుట్ కి కంటెంట్ కోసం అన్వేషిస్తారు. నిరంతరం అవుట్  పుట్ ఇస్తూ వుండాలంటే, మీదగ్గరున్న అయిడియాల్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. అంటే అయిడియా ల్ని కంటెంట్ గా మార్చుకోవాలి. మీ మనసులో ఎన్నో అయిడియాలు ముసురుకుని వుంటాయి. అవన్నీ రాయాలన్పిస్తుంది. అయితే వాటిని ఆర్గనైజ్ చేయకుండా రాయలేరు. ఏది ముందు రాయాలో తేల్చుకోలేరు. అందువల్ల స్క్రిప్టు రాయడానికి పూనుకునే ముందు ఓ నెలరోజులపాటు సమయం తీసుకుని ముందుగా ఆర్గనైజ్ చేసుకోండి. మిమ్మల్ని వేధిస్తున్న ఒక్కో అయిడియానీ కాగితం మీద  పెట్టండి. మీ మనసు తేలికవుతుంది. ఆ అయిడియాల్లో వేటికి ఎక్కువ  మార్కెట్ వుంటుందో విశ్లేషించుకోండి. వాటిని ప్రాధాన్యాల క్రమంలో నెంబర్లు వేసి పెట్టుకోండి. ఇకప్పుడు ఒక్కో అయిడియానీ డెవలప్ చేయడం మొదలెట్టండి. కొన్ని పాత్రల్ని, వాటి సంఘర్షణల్ని, బిగినింగులని, మిడిళ్ళని, ఎండ్ లని రాసుకోండి. ఈ మొత్తం కలిపి ఒక సినాప్సిస్ గా రాసుకోండి. ఒక్కో అయిడియాకి ఒక్కో సినాప్సిస్. అలాగే వాటికి  టైటిల్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. టైటిల్స్ పెట్టుకున్నప్పుడే ఆ అయిడియాల మీద ప్రేమ పెరుగుతుంది. అవి వర్కింగ్ టైటిల్స్ అయినా ఫర్వాలేదు. ఇలా చేస్తే, మీకు వచ్చే రెండేళ్ళూ  ఏం రాయాలో, దేని తర్వాత ఏది రాయాలో ఒక కార్యాచరణ చేతికొస్తుంది. ఇప్పుడు మీరు ఏది రాస్తున్నారో దాని మీదే మీమనసు లగ్నమవుతుంది. వేరే అయిడియాలు వేధించి పనిని డిస్టర్బ్ చేయవు. ఏదైనా రాతలో పెట్టినప్పుడే మనసుకి రంపపు కోత తప్పుతుంది.

కెన్ మియమోటో
(రేపు రెండో మెట్టు)