రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, జులై 2016, శుక్రవారం


దర్శకత్వం : మురళీకృష్ణ ఎం.

తారాగణం :  చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక, వాసు ఇంటూరి, రాజారవీంద్ర తదితరులు కథ, స్క్రీన్ ప్లే :  మారుతి, మాటలు : రవివర్మ, సంగీతం: జెబి, ఛాయాగ్రహణం : బాల్ రెడ్డి
బ్యానర్ : గుడ్ సినిమా గ్రూప్, నిర్మాత : జి. శ్రీనివాసరావు
విడుదల :  జులై  1,  2016
***
దిల్ రాజు సమర్పణ, మారుతి రచన అనే ఆభరణాలు చూశాక ‘రోజులు మారాయి’ మీద ఆకర్షణ పెరుగుతుంది ఎవరికైనా. ఆ ఆకర్షణని, నమ్మకాన్నీ నిలబెట్టుకోవాలంటే దిల్ రాజుకీ మారుతికీ రోజులు మారినట్టు తాము కూడా మారామనే నమ్మకం  కల్గాలి. అప్పుడే ‘రోజులు మారాయి’  అంటూ తీయడానికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోజులు మారిపోయి ప్రపంచం ముందుకు వురుకుతోంది. తాము అక్కడే వుండి పోయి  రోజులు మారాయంటూ మెసేజీలు ఇస్తే అది  శోభాయమానంగా వుంటుందా? నిజంగా ‘రోజులు మారాయి’ అనే టైటిల్  పెట్టుకుని ఆ ప్రకారం తీయగల్గింది  సగం సినిమానే.  మిగతా  సగాన్ని  తాము మారలేక  మారిపోయి కూర్చున్న  ప్రేక్షకుల మీద లాఠీ చార్జి చేసినట్టు తీశారు.

      అసలు తెలుగు  సినిమాలకోసం  రోజులు మారకుండా వుండే ఫైర్ వాల్ సాఫ్ట్ వేర్ ని ఎవరైనా కనిపెడితే బావుణ్ణు.  రోజులు మారిపోవడం తెలుగు సినిమాలకి ప్రాణసంకటంగా మారింది. ఏరువాకా సాగారో అంటూ 1955 నాటి  ‘రోజులు మారాయి’ ఇంకా మారిపోతూ మారిపోతూ వున్న రోజుల్లో కూడా గ్లామర్ ని  పెంచుకుంటూ వుంటే, మారుతి  ‘రోజులు మారాయి’ @ 2016  సినిమాలకి రోజులే కావన్నట్టు గట్టి లక్ష్మణ రేఖ గీసేసుకుంది.
        ఇంతకీ రోజులు మారాయి అని ఎందుకు అనుకుంటున్నట్టు? తెలుసుకుందాం...

కథ
      ఆద్య ( కృత్తిక), రంభ (తేజస్వి) లనే ఇద్దరు కిలాడీ అమ్మాయిలు హాస్టల్లో  వుంటారు. అవసరాల కోసం ఇద్దరితో,  ప్రేమల కోసం మరో ఇద్దరితో తిరుగుతూంటారు. అశ్వథ్  (చేతన్), పీటర్ ( పార్వతీశం) లు ఈ అమ్మాయిల్ని సిన్సియర్ గా ప్రేమిస్తూ వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా వుంటారు.  ఆద్య, రంభలకి తాము సిన్సియర్ గా ప్రేమిస్తున్న అసలు బాయ్ ఫ్రెండ్సే  కిలాడీలని  తెలీదు.  

        ఓ రోజు ఓ  బాబా జ్యోతిషం చెప్తాడు. ఒకే  జాతకాలున్న ఆద్య, రంభలు పెళ్లి చేసుకున్న మూడ్రోజుల్లో వాళ్ళ భర్తలు చనిపోతారని హెచ్చరిస్తాడు.  దీంతో ఆందోళనకి గురైన ఇద్దరూ ఒక ఆలోచన చేస్తారు. ముందు తమ చుట్టూ సిన్సియర్ గా తిరుగుతున్న బకరాలు అశ్వథ్, పీటర్ లని  పెళ్లి చేసుకుంటే, మూడ్రోజుల్లో వాళ్ళు చచ్చి పీడా వదుల్తుంది. అప్పుడు తమ బాయ్ ఫ్రెండ్స్ ని చేసుకుని కలకాలం సుఖంగా వుండ వచ్చని పథకం వేస్తారు. పథకం ప్రకారం పెళ్లి చేసుకున్న రెండు రోజులకి కూడా అశ్వథ్, పీటర్ లు చావకపోతే,  మూడోరోజు శోభనం నాడు తామే చంపి పారేసి, ఫాం హౌస్ వాచ్ మన్ విబూధి (వాసు ఇంటూరి) సహాయంతో పాతిపెట్టేస్తారు.  ఇక బాయ్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతారు. అప్పుడిక ఏం జరిగిందన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ
     ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలా ఉంటారని చెప్పాలనుకున్నారు. కానీ దీన్ని ఏ జానర్ లో తీసి అలరించాలో నిర్ణయించుకోలేక పోయారు. బకరాలని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి చావు తప్పిపోయే ఘట్టాలవరకూ రోమాంటిక్ కామెడీగా సాగుతున్నది కాస్తా, వాళ్ళని చంపెయ్యడంతో రసభంగమై సీరియస్ క్రైం ఇన్వెస్టిగేషన్ జానర్ గా మారిపోతుంది. అంతలో చనిపోయిన ఇద్దరూ దెయ్యాలై  తిరిగి రావడంతో మరోసారి రసభంగమై, హర్రర్ కామెడీగా మారుతుంది. ఇదికూడా భంగమై మళ్ళీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జానర్ కి తిరగబెడుతుంది. చివరికి మరో రసభంగంతో, కామెడీలో ఫార్స్ సబ్ జానర్ కిందికి మారిపోయి చప్పగా, అసంతృప్తిగా, చూసింది మొత్తం డొల్లగా అన్పించి ముగుస్తుంది. ఇన్ని రసభంగాలతో శృంగభంగమైంది. ఒక విఫలయత్నంగా మిగిలిపోయింది. కిలాడీ అమ్మాయిల్ని అలాగే కిలాడీ అమ్మాయిలుగా వుంచకుండా, నేరస్వభావాన్ని అద్ది ఖూనీకోర్లుగా మార్చడం వల్ల మొత్తం ‘రోజులు మారాయి’ అనే కాన్సెప్టే  మింగుడు పడకుండా మారిపోయింది. ఇలాటి నేర పథకాలేసే అమ్మాయిలు ఉండొచ్చు. ఎక్కడో అరుదుగా వుంటారు. దాన్ని రోమాంటిక్ కామెడీగానో, హార్రర్ కామెడీగానో తీయలేరు. సీరియస్ క్రైం జానర్ లో డార్క్ మూవీగా తీయాల్సి వుంటుంది, మెయిన్ స్ట్రీమ్ ఎంటర్ టైనర్ గా మాత్రం కాదు. 

ఎవరెలా చేశారు 

        మార్కులన్నీ తేజస్వీ మాదివాడకి పడతాయి. ఆ తర్వాత పార్వతీశానికి పడతాయి. మాటల రచయిత వర్మకి పడతాయి. మారుతికీ, కొత్త దర్శకుడు మురళీ కృష్ణకీ మార్కులు పడవు. సంగీతానికి కూడా పడవు. కెమెరాకి కొంత వరకు మార్కులు పడతాయి. తేజస్వీ మాదివాడ మంచి టాలెంట్ వున్న యువనటి. రంభ పాత్రలో కీలాడీతనం, నటనలో వేగం, హావభావ ప్రదర్శనలో పరిణతి ఆమెకి పెట్టని ఆభరణాలు. దిల్ రాజు సమర్పణ, మారుతి రచన అనే ఆభరణాలు ఆమె ముందు వెలవెలబోతాయి. ఉత్తరాంధ్ర యాసతో, టైమింగ్ తో కామెడీ పండించగల నేర్పున్న వాడు పార్వతీశం. ఇదివరకే ‘కేరింత’ లో ప్రేక్షకులకి ఇలాటి ప్రేమికుడి పాత్రలోనే పరిచయమయ్యాడు. ఇక ‘దృశ్యం’ ఫేం కృతిక సాఫ్ట్ రోల్ లో సున్నితంగా కన్పిస్తుంది. చేతన్ ది పెద్దగా పనిలేని పాత్ర. ఇక ‘ఆద్య’ అనే పేరుని ఆధ్య...ఆధ్య  అని పిలవడం ఎబ్బెట్టుగా వుంది.


చివరికేమిటి 
      రచయితగా మారుతి ఇద్దరు హీరోన్లు పాజిటివ్ గా ఒకరు, నెగెటివ్ గా  ఒకరుగా కొనసాగే డైనమిక్స్ ని పట్టించుకున్నంతగా కథ జానర్ ని పట్టించుకోలేదు. పైన చెప్పుకున్నట్టు ఒక కలగూరగంపలా తయారయ్యింది. తప్పులో కాలెక్కడ పడిందంటే, ఇంటర్వెల్లో హీరో లిద్దర్నీ చంపేసే దగ్గర. ఇది పూర్తిగా రాంగ్ కథా పథకం రోమాంటిక్ కామెడీకి. అందుకే సెకండాఫ్ ని రకరకాల జానర్స్ తో గిమ్మిక్కులు చేస్తూ ఒక లక్ష్యం లేకుండా నడిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే సెకండాఫ్ కుప్పకూలింది. హీరోల్ని హీరోయిన్లు చంపేశాక ఏ రకంగానూ రోమాంటిక్ కామెడీ సెకండాఫ్ ని  నడపలేరు, జస్టిఫై చేయలేరు. హీరోయిన్లకి వాళ్ళ చేష్టల్ని  బట్టి బాబా మాటల్ని పట్టుకుని హీరోలని చంపెయ్యాలన్న ఆలోచన రావడంవరకూ, హీరోలు చావడం కోసం రకరకాల విఫయ లత్నాలూ చేయడం వరకూ ఓకే. ఇదంతా కామెడీ కింద వర్కౌట్ అయిపోతుంది. అయ్యింది కూడా. ఫస్టాఫ్ గట్టిగా  నిలబడడానికి ఇదే కారణం. ఎందుకంటే సెకండాఫ్ లోనైనా తాము చేస్తున్నది తప్పని హీరోయిన్లు తెలుసుకుని మనసు మార్చుకుంటారని ప్రేక్షకులు భావిస్తారు. ఎప్పుడైతే హీరోల్ని చంపేశారో సినిమా చచ్చిపోయింది. ప్రేక్షకులూ చచ్చారు. 

        బాబా జోస్యం చెప్పే దృశ్యం సరిగ్గా సినిమా ప్రారంభమైన అరగంట కొస్తుంది. ఇంత త్వరగా బిగినింగ్ విభాగం ముగిస్తున్నందుకు సంతోషిస్తాం. ఇదే సమయంలో, స్టార్ కాస్ట్ కూడా సరిగా లేని,  ఇంత  నూలు దారం లాంటి సన్నని కథని, ఇక్కడ్నించీ మిడిల్ నంతా  చాలా దూరం కుప్పకూలకుండా నడపడం మారుతికి సాధ్యమౌతుందా అన్న సందేహం కూడా వచ్చేస్తుంది. ఈ సందేహమే నిజమైంది. నడపలేమని ఇంటర్వెల్లో హీరోలని మర్డర్ చేసేశారు!  

        బంగారం లాంటి కథని మర్డర్ చేసుకోవడమే రోజులు మారాయనడానికి అర్ధమేమో!   


-సికిందర్ 
http://www.cinemabazaar.in