రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, July 26, 2022

1184 : రివ్యూ!

 

 రచన- దర్శకత్వం : రజత్ కపూర్

తారాగణం : రజత్ కపూర్ (ద్విపాత్రాభినయం), మల్లికా షెరావత్, రణవీర్ షోరే, మనూ రిషీ చద్దా, చంద్రచూడ్ రాయ్, కుబ్రా సెయిట్, , అభిషేక్ శర్మ తదితరులు
సంగీతం : సాగర్ దేశాయ్, ఛాయాగ్రహణం : రఫీ మహమూద్
బ్యానర్స్ : ఎన్ ఫ్లిక్స్ ప్రై.లి; ప్రియాంశీ ఫిలిమ్స్, మిథ్య టాకీస్
నిర్మాత : రజత్  కపూర్
విడుదల : జులై 22, 2022
నిడివి :  95 ని.
***
        ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత రజత్ కపూర్ కి కూడా సినిమా తీయాలంటే క్రౌడ్ ఫండింగ్ తప్పలేదు. వందలాది మంది విరాళాలిచ్చి ఈ సినిమా నిర్మాణానికి తోడ్పడ్డారు. క్రౌడ్ ఫండింగ్ తో తీసే సినిమాలు తక్కువే. ఇండిపెండెంట్ సినిమాల పేరుతో తీసే ఇవి దాదాపు అడ్రసులేకుండా పోయినవే. ప్రస్తుత సినిమాలో ఒక డైలాగు వుంటుంది- ఇండిపెండెంట్ సినిమాల పేరుతో చెత్త సినిమాలు చూడడానికి ప్రేక్షకులు అలవాటు పడ్డారని. రజత్ కపూర్ అలాటి ఇంకో చెత్త కాకుండా, క్రౌడ్ ఫండింగ్ తో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ RK / RKAY ని ఒక కళాఖండంలా తీసి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలందుకున్నాడు. అమెరికాలో ఇది గత సంవత్సరమే విడుదలైంది. దీనితో కలిపి 12 సమాంతర సినిమాల దర్శకుడైన రజత్, ఇప్పుడు అపూర్వంగా చేసిన ప్రయోగమేమిటి? 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మెటా కామెడీ ఈ వారాంతం మూడు రోజులూ 5.75 కోట్లు వసూలు చేసింది. ఇందులో నిన్నఆదివారం 3 కోట్లు వసూలు చేసింది. సామాన్య ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయగల విషయం ఏమిటిందులో కొత్తగా వుంది? వివరాల్లోకి వెళ్దాం...

కథ

    ఆర్కే (రజత్ కపూర్) సినిమా దర్శకుడు. భార్యా ఇద్దరు పిల్లలు. 1960 లనాటి సినిమాలకి నీరాజనంగా సినిమా తీయాలనుకుంటాడు. తానే హీరో పాత్ర. హీరోయిన్ పాత్రకి బిజీ నటి నేహా (మల్లికా షెరావత్) ని ఒప్పిస్తాడు. నిర్మాతగా బిల్డర్ గోయెల్ సాబ్ (మనూ రిషీ చద్ధా) కి బడ్జెట్ ఇస్తాడు. షూటింగ్ ప్రారంభమవుతుంది. 1960 లనాటి ఈ కథలో గులాబో పాత్రని ఎంతో ఇష్టపడ్డ నేహా ఆనాటి హీరోయిన్ లా ముద్దులొలుకుతూ నటిస్తుంది. ఆమె ప్రేమికుడు మహెబూబ్ గా దర్శకుడు ఆర్కే క్లాస్ గా నటిస్తాడు. మహెబూబ్ - గులాబో మహోజ్వల ప్రేమ కథలో దృశ్య కావ్యంలా కీలక సన్నివేశం -నా గుండె ఎందుకు అదురుతోంది?’ అంటుంది. నీ ఎదుట నేనున్నందుకు అంటాడు. ఈ క్లాసిక్ సన్నివేశం నటించడానికి చాలా టేకులు తీసుకుంటుంది. యూనిట్ కి పిచ్చెత్తుతుంది. తర్వాత ఇద్దరూ బాస చేసుకునే ఇంకో భావోద్వేగ సన్నివేశం - రాత్రి పదిన్నరకి బాంద్రా స్టేషన్లో కలుసుకుని కలకత్తా వెళ్ళిపోవాలని.

        ఇలా షూటింగ్ సాగుతూ సాగుతూ క్లయిమాక్స్ ముందు సీను వస్తుంది. చెట్ల మధ్య మహెబూబ్ కీ, విలన్ కె ఎన్ సింగ్ (రణవీర్ షోరే) కీ యాక్షన్ సీను. ఈ సీనులో కె ఎన్ సింగ్ కి చెందిన ఐదు లక్షలతో మహెబూబ్ పారిపోతాడు. ఇక ముగింపు సీన్లే మిగిలుంటాయి. ముగింపులో కె ఎన్ సింగ్, మహెబూబ్ ని కాల్చి చంపి ఐదు లక్షలు సొంతం చేసుకునే సీను. ఇలా ముగింపు దృశ్యాలు మిగిలి వుండగా, అంతవరకూ వచ్చిన డిజిటల్ ఫైల్స్ ని ఎడిటర్ ఎడిటింగ్ చేస్తూ కంగారు పడతాడు. సినిమాలో ఎక్కడా మహెబూబ్ కన్పించడు. తీసిన సినిమాలోంచి మహెబూబ్ క్యారక్టర్ పారిపోయాడని ఆర్కేకి కాల్ చేసి చెప్తాడు.

        ఆర్కేకి పిచ్చెత్తుతుంది. తీసిన సినిమాలోంచి క్యారక్టర్ పారిపోవడమేమిటి? షూట్ చేసిన సీన్లలో ఎక్కడా లేకుండా ఎలా పోతాడు? ఇప్పుడేం చేయాలి? ముంబాయిలో వెతకడం మొదలెడతారు. పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇస్తారు... ఇంతకీ ఏమయ్యాడు మహెబూబ్? ఎందుకు సినిమా సీన్లలోంచి పారిపోయాడు? ఇప్పుడెలా పట్టుకోవాలి? పట్టుకుని సినిమా పూర్తి చేసి అక్టోబర్ 15 కల్లా ఎలా విడుదల చేయాలి?...

ఎలా వుంది కథ

    ఐడియా చూస్తేనే నవ్వొచ్చే విషయం. మెటా మూవీ జానర్ కథ. దేశీయ తెరమీద తొలి ప్రయత్నం. మెటా అంటే వున్న స్థితిని దాటడం. కథలోని పాత్ర, ఆ కథని దాటి నిజ ప్రపంచంలో విహరించడం. కొంచెం తేడాతో ఫోర్త్ వాల్ టెక్నిక్ అని కూడా వుంటుంది. హిందీలో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ (2019), ఘూమ్ కేతు (2020) సినిమాల్లో ఇది చూశాం. అంటే సినిమాలోని పాత్ర ప్రేక్షకుల వైపు చూస్తూ కథ గురించి, పాత్రల గురించీ కామెంట్లు చేయడం. ఇది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ లో ప్రధానమంత్రి సలహాదారు అక్షయ్ ఖాన్నాతో బాగా వర్కౌటయ్యింది. కానీ ఘూమ్ కేతు లో రచయిత పాత్ర నవాజుద్దీన్ సిద్ధిఖీతో విఫలమయింది.

        ప్రస్తుత సినిమాలో సినిమాలోని పాత్రలు సినిమాలోంచి తప్పించుకుని నిజ ప్రపంచంలో పడ్డం మెటా మూవీ జానర్ కిందికొస్తుంది. ఈ ప్రయోగం 1985 లోనే హాలీవుడ్ లో వుడీ అలెన్ చేశాడు. ది పర్పుల్ రోజ్ ఆఫ్ కైరో అని అప్పట్లో తీసిన మెటా మూవీలో ప్రేమ కథ. మియా ఫారో నటించిన ఈ 82 నిమిషాల ముక్కోణ ప్రేమ కథ పదిహేను లక్షల డాలర్ల బడ్జెట్, కోటిన్నర డాలర్ల బాక్సాఫీసు.

        ఇందులో ఇంట్లో భర్తతో సమస్యలొచ్చి మనశ్శాంతి కోసం సినిమాల కలవాటు పడుతుంది మియా. ఒక సినిమా నచ్చి పదే పదే చూస్తుంది. తనని చూడడానికి ఇన్నిసార్లు  సినిమాకొస్తున్న మియా మీద ప్రేమ పుట్టి వెండితెర లోంచి ఆమె దగ్గరి కొచ్చేస్తాడు హీరో జెఫ్ డేనియెల్స్. ఇక ఇద్దరూ షికార్లు తిరగడం మొదలెడతారు. వీళ్ళ ప్రేమాయణం మధ్యకి మియా భర్త రావడంతో సంక్షోభం మొదలవుతుంది.

        2021 లో అక్షయ్ కుమార్ -సారా అలీఖాన్ -ధనుష్ నటించిన అట్రంగీరే లో సారా ఓ కథలోని మెజీషియన్ పాత్ర (అక్షయ్ కుమార్) నిజంగానే వున్నాడనుకుని ప్రేమిస్తుంది.  ఓ రోజు గుర్రం మీద వచ్చేస్తుంది మెజీషియన్ పాత్ర. ఇది మెటా మూవీ కాదు, సారా కల్పించుకున్న ఫాంటసీ.

        వుడీ అలెన్ తీసిన సినిమా మెటా జానర్లో రోమాంటిక్ కామెడీ. రజత్ సినిమా అబ్సర్డ్ (అసంబద్ధ) కామెడీ. నాన్సెన్స్ హ్యూమర్ అని కూడా అనొచ్చు. మైండ్ లెస్ కామెడీకంటే ఒక మెట్టు పైనుండే క్రియేటివిటీ. ఈ సృజనాత్మకతని రజత్ అనితరసాధ్యంగా సాధించాడు. తెలుగులో బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించాలంటే అనునిత్యం కొత్త జానర్లతో కథల కోసం రీసెర్చి చేయాల్సిందే- అప్డేట్ అవ్వాల్సిందే. రీసెర్చి లేకుండా రాయడానికి/తీయడానికి గడ్డిపోచ కూడా దొరకదు, మెదడులో వుండే చెత్త తప్ప.

    రజత్ కపూర్ మెటా మూవీ, దర్శకుడికీ- దర్శకుడు సృష్టించిన పాత్రకీ మధ్య సంఘర్షణ. దర్శకుడు తీస్తున్న సినిమా ముగింపులో చావడం ఇష్టం లేని హీరో క్యారక్టర్ మహెబూబ్, తీసిన సినిమాలోంచి పారిపోయి వచ్చి దర్శకుడితో తగువు పెట్టుకుంటాడు. తిరిగి ఇతడ్ని తీసిన సినిమాలోకి ఎలా పంపించాలన్నది దర్శకుడి సమస్య. తీసిన సినిమాలోంచి ఐదు లక్షలతో పారిపోయిన మహెబూబ్ క్యారక్టర్ ని పట్టుకోవడానికి, విలన్ క్యారక్టర్ కె ఎన్ సింగ్ కూడా తీసిన సినిమాలోంచి బయటపడి నిజ ప్రపంచంలో అలజడి సృష్టిస్తాడు. ఇలా తీసిన సినిమాలోంచి హీరో, విలన్ ఇద్దరూ పారిపోయేసరికి ఏం చేయాలో దిక్కు తోచదు ఎడిటర్ కి. తీసిన సినిమాలోంచి విలన్ కూడా పారిపోయాడని ఇంకో పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. ఇలాటి సినిమాలెందుకు తీస్తారయ్యా, ప్రేమ సినిమాలు తీసుకోక? - అంటాడు పోలీసు అధికారి. ఇక విలన్ పాత్రనీ పట్టుకోవడానికి పోలీసు బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. పిచ్చ నవ్వు పుట్టడానికి ఇంతకంటే పిచ్చి కామెడీ లేదు.

        పూర్తి స్థాయి కొత్త తరహా హాస్య కథ ఇది. నవ్వి నవ్వి బయటికొస్తాం. ఈ కథ ఐడియా, దీని పాలనా అనిర్వచనీయమన్న మాట. కల్పన- వాస్తవం రెండిటి కలబోత.దృశ్యకావ్యంలా తీస్తున్నామని దీన్ని ఫిలాసఫికల్ గా మార్చలేదు. దర్శకుడికీ పాత్రకీ మధ్య నడిచే దృశ్యాల్లో ఒకటి రెండు సందర్భాల్లో సృష్టికర్తకీ, ప్రాణికీ మధ్య వుండే సంబంధంతో సంఘర్షణని పైపైన టచ్ చేసి వదిలేస్తాడు- ఈ గంభీర విషయాలనే థీమ్ గా చేయలేదు - నీకు రాసిపెట్టివున్న దానికంటే ఎక్కువ, దాని కాలానికంటే ముందు, నీ కేదీ దక్కదు (దర్శకుడు), నా నొసటి రాత నేను మార్చి పారేస్తా (పాత్ర), సృష్టికి ముందూ తర్వాతా ప్రేమ తప్ప మరేదీ లేదు  (దర్శకుడు)- లాంటి గంభీర చర్చని నామమాత్రం చేశాడు. ప్రొఫెషనల్ సమస్యనే ప్రధానంగా చేసి బాక్సాఫీసు ఫ్రెండ్లీ కథనం నడిపాడు.

     నువ్వు నిజం కాదు, నేను రాశాను కాబట్టే పాత్రగా నువ్వున్నావ్ అంటాడు దర్శకుడు. అక్కడే నువ్వు తప్పులో కాలేశావ్ ఆర్కే సాబ్. నీకు నీ రాత మీద నమ్మకం లేదు గాబట్టే పాత్ర చనిపోవాలనుకుంటున్నావ్ అంటుంది మహెబూబ్ పాత్ర, నేను నిజం కాదని నన్నెందుకు మాటిమాటికీ కించపరుస్తావ్? నీకు నువ్వు మాత్రం నిజం అని ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్?’ అని రెట్టిస్తుంది పాత్ర. ఆర్కే కంట్రోల్లో వుండడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మహెబూబ్ పాత్ర. కథ మీద అదుపు ఎవరికుండాలి- పాత్రకా? రచయితకా? కథ పాత్రదా? రచయితదా?

        తెలుగు సినిమాలకి చాలా అవసరమైన పాయింటు ఇది. గత ఇరవై ఏళ్ళుగా పాత్ర కథని పాత్ర నడుపుకో నివ్వకుండా, జోక్యం చేసుకుని, పాసివ్ పాత్రగా మార్చేస్తూ తాము కథ నడిపి - 90% అట్టర్ ఫ్లాపులు తీస్తున్న కొత్త తరం మేకర్లు ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన విషయమిది. ఇరవయ్యేళ్ళకి పూర్వం సీనియర్ రచయితలతో, దర్శకులతో ఇలా వుండేది కాదు.     

        పాత్రకుండే చైతన్యం రచయితకుండదు. పాత్ర దాని కథ అది నడుపుకుంటే చాలా ఆశ్చర్యపరుస్తూ సాగుతుంది. రచయిత కూడా వూహించని ఆశ్చర్యాలు సృష్టిస్తుంది. దీని ప్రాముఖ్యం గురించి సిడ్ ఫీల్డ్ అనేకసార్లు, 19వ శతాబ్దపు సుప్రసిద్ధ రచయిత హెన్రీ జేమ్స్ ని ఉటంకిస్తాడు- What is character but the determination of incident? What is incident but the illustration of character?అని. ఈ మధ్యే ఒక కథ చేస్తూంటే, అనూహ్యంగా పాత్ర వచ్చేసి థ్రిల్లింగ్ ముగింపు ఇచ్చేసరికి బిత్తరపోవాల్సి వచ్చింది.

    విచిత్రమేమిటంటే కథా చర్చల్లో నేను కరెక్ట్ అంటే, కాదు నేను కరెక్ట్ అని సిగపట్లకి దిగుతారు. వీళ్ళని చూసి క్యారక్టర్ నవ్వుకుంటుంది. అసలు నేనేమనుకుంటున్నానో ఇంపార్టెంట్రా బాబూ అంటూ - వినేవారు లేకా విసుక్కుంది నాకేకా - అని పాడుకుంటూ వూళ్ళు పట్టుకుని పోతుంది పాత్ర. ఇక ఇగోలు శాటిస్ఫై చేసుకుని, ఇంకో అట్టర్ ఫ్లాప్ తీయడానికి శ్రీకారం చుడతారు.

        రచయితకి ఇగో కాదు, మెచ్యూర్డ్ ఇగో వుండాలి. పాత్రకి వుంటుంది ఇగో. అనుభవాల క్రమంలో దాని ఇగో, మెచ్యూర్డ్ ఇగోగా మారే స్థాయికి అది ఎదుగుతుంది. ఇదీ కథంటే. కథల్ని విశ్లేషిస్తే యుగాలుగా ఇదే. ఎవరి ఇగో కూడా చావదు. మనుషులు చేయగల్గింది తమ ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుని ఎదగడమని కథలు చెప్తాయి. ఈ మూల సూత్రం తోనే కథలుంటాయి. కథంటే సైకో థెరఫీ. కథంటే ఆర్గ్యుమెంట్. అంటే స్టోరీ సిట్టింగ్స్ లో కుమ్ములాట కాదు, కథలోని పాత్రల మధ్య సంఘర్షణ. కథలోని పాత్ర వచ్చి దర్శకుడితో సంఘర్షించే కథనంతో ఈ మెటా పోయెటిక్ ఫన్ ఒక పాఠ్యాంశం.

నటనలు- సాంకేతికాలు 
    చంపడాని కిష్టపడ్డ దర్శకుడిగా, చావడాని కిష్టపడని పాత్రగా రజత్ కపూర్ డీసెంట్ గా ద్విపాత్రాభినయం చేశాడు. ఇద్దరి మధ్య వాళ్ళకి సీరియెస్ సీన్లే, కానీ ప్రేక్షకులకి హాస్యం. పాత్ర దర్శకుడి ఇంట్లోనే బస చేసి, మంచి వంట వాడుగా వండి పెడుతూంటే, వీడికి వంట వచ్చని నేను రాయలేదే - అని దర్శకుడి అంతర్మధనం. భార్య కూడా పాత్ర పక్షమే వహించేసరికి, కత్తితో పాత్ర పీక కోసి చంపెయ్యడానిక్కూడా సిద్ధపడతాడు దర్శకుడు. ఈ ద్విపాత్రాభినయానికి ఏ పాత్ర హావభావాలు ఆ పాత్రకి అతికినట్టుగా అన్వయించి నటించడం రెండు పాత్రల్నీ ఇంట్రెస్టింగ్ గా మార్చింది.

        1960 ల నాటి సినిమా పాత్ర గులాబోగా మల్లికా షెరావత్ రాకుమారి గ్రేస్ తో మెస్మరైజ్ చేస్తుంది చాలా కాలం తర్వాత తెరపైకొచ్చి. ఈమె వున్న దృశ్యాల్ని పోయెటిక్ గా తీర్చిదిద్దాడు రజత్. మహెబూబ్ కోసం కలవరిస్తూ తీసిన సినిమాలోనే వుండిపోయే క్యారక్టర్. ఈమెకి నచ్చజెప్పి కథకి తాననుకున్న ముగింపే ఇవ్వడానికి విఫలయత్నాలు చేస్తాడు దర్శకుడు.  

        విలన్ పాత్రలో రణవీర్ షోరే, అతడి ముగ్గురు అనుచరులూ (సనమ్ కుమార్, ఆదర్ మాలిక్, పీయూష్ రాయ్) ఒక పిచ్చి మేళం. చప్పుడెక్కువ, చేసేది తక్కువ. మహెబూబ్ కోసం తీసిన సినిమాలోంచి పారిపోయిన విలన్ పాత్రగా షోరే, ముంబాయిలో తిరుగుతూ-తన దగ్గరున్న ఫోన్ నెంబరుతో కాల్స్ చేస్తూంటాడు. ఆ నెంబర్ కలవదు. ఈ మహెబూబ్ నంబర్ సినిమాలో సినిమా కోసం రాసిన కల్పిత  నెంబరురా అంటే వినకుండా, పిస్తోలు తీసి పేల్చే సీనులో షోరే నటన టాప్. అలాగే పోలీసులు పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకొచ్చినప్పుడు కూడా.

    నిర్మాత గోయెల్ సాబ్ గా మనూ రిషీ చద్దా నుంచి కూడా హాస్యం పొందొచ్చు. హీరోని చంపవద్దని ముందే చెప్తాడు, దర్శకుడు ఆర్కే వినకుండా చంపే కథే తీయడంతో హీరో పారిపోయాడు. బిల్డర్ గా నిర్మాతది ఆర్ధిక సంకటం, దర్శకుడిగా ఆర్కేది కళా లంపటం. చద్దా వున్న సీన్లు కూడా నవ్విస్తాయి.

        మిగిలిన నటీనటులు కూడా సహాయపాత్రల్లో సహజత్వాన్ని చాటారు. సాంకేతికంగా ఇదొక స్థాయిలో అద్భుతమే. సెట్స్, లొకేషన్స్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, వర్తమానంతో బాటు, 1960 ల నాటి పీరియెడ్ లుక్, లైటింగ్ వగైరాలతో విజువల్స్ కి నిజమంటే నిజంగా స్క్రిప్టు న్యాయం చేసింది. తెలుగులో చూస్తూంటాం- ప్రొడక్షన్ విలువలు ఆకాశంలో, స్క్రిప్టు పాతాళంలో!

చివరికేమిటి

    మెటా మూవీ సమాంతర సినిమాయేగా అని తన కోరికల గుర్రాలతో స్క్రిప్టు చేయలేదు రజత్ కపూర్. చక్కగా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో సార్వజనీన - మెయిన్ స్ట్రీమ్ స్క్రీన్ ప్లేనే చేశాడు. అంతర్జాతీయ మీడియా పొగడ్తలతోనే రివ్యూలిచ్చింది- ఒక్క రోజర్ ఎబర్ట్ డాట్ కామ్ తప్ప. రోజర్ ఎబర్ట్ డాట్ కామ్ రివ్యూలో- ఈ సినిమా వుడీ అలెన్ సినిమా సారాన్ని పట్టుకోలేక పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే పైన చెప్పుకున్న ఫిలాసఫీని.    వుడీ అలెన్ మెటా మూవీ ది పర్పుల్ రోజ్ ఆఫ్ కైరో ముక్కోణ ప్రేమ కథ. భర్తతో బాధాతప్త సంసారం నుంచి ఉపశమనం కోసం సినిమాలకలవాటు పడ్డ మియా ఫారో కోసం,  ప్రదర్శిస్తున్న సినిమాలోంచి హీరో వచ్చేయడం ఆమె మానసిక స్థితి, స్వైరకల్పన. అతడితో ప్రేమాయణం సాగిస్తున్నట్టూ వూహించుకుని ఊరట పొందడం. ఒక రకంగా ఇది అనైతికమే. దీనికి అనుభవిస్తుంది చివరికి.

        ఆమెని ప్రేమిస్తూ హీరో పాత్ర సినిమాలోంచి వెళ్ళి పోయేసరికి, ఆ పాత్ర పోషించిన  నిజ జీవీతంలో హీరోయే రంగంలోకి దిగుతాడు. నేను పోషించిన పాత్రే కావాలా, నిజ వ్యక్తిని నేను కావాలా - అని అడుగుతాడు. నువ్వే కావాలని భర్తకి విడాకులిచ్చేస్తుంది. చేసేదిలేక సినిమా పాత్ర సినిమాలో కెళ్ళి పోతుంది. హీరో కూడా ఆమెకి హేండిచ్చి వెళ్ళిపోతాడు. అతడిక్కావాల్సింది నిర్మాత సినిమాని కాపాడ్డమే తప్ప, ఈమెతో సంసారం చేస్తూ కూర్చోవడం కాదు. రెంటికీ చెడ్డ రేవడి అవుతుందీమె. సమస్య వస్తే ఎదుర్కోవాలే గానీ, పలాయన వాదం ప్రమాదకరమనే నీతీ, ఫిలాసఫీ ఇందులో వున్నాయి.

        రజత్ మూవీలో ఈ సెటప్ లేదు. ఎవరూ వూహించుకోలేదు. తీసిన సినిమాలోంచి పాత్రలే వాటి అవసరాలకోసం పారిపోయాయి. రెండూ దర్శకుడ్ని పట్టుకుని వేధించాయి. ఇది వేరు. ఇందులో ఫిలాసఫీ చెప్తే  సముద్రకని దర్శకత్వంలో వినోదాయ చిత్తం (2021) లా అయ్యేది. విదేశాల్లో ఏమో గానీ, ఇప్పుడు ఇండియాలో సినిమా అంటే ఒక సంఘటన, దాని చుట్టూ పరిణామాలతో పరుగులెట్టే కథ. ఆ సంఘటన ఎకనమిక్స్ లేదా రోమాంటిక్స్ గురించి. సంఘటనల్లోనే తీసుకోవాలంటే నీతీ రీతీ అన్నీ వాటికవే వుంటాయి. ప్రత్యేకంగా మెసేజిలివ్వడం కోసం సినిమాలు తీయనవసరం లేదు.

        స్ట్రక్చర్ చూస్తే తీసిన సినిమాలోంచి హీరో పాత్ర పారిపోవడంతో  ప్లాట్ పాయింట్ వన్ సరీగ్గానే 30వ నిమిషంలో వస్తుంది. 70 వ నిమిషంలో తీసిన సినిమాలోంచి విలన్ పాత్ర పారిపోవడంతో ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఈ రెండిటి మధ్య మిడిల్లో వుండే కథ 40 నిమిషాలు సాగుతుంది. ప్లాట్ పాయింట్ టూ తర్వాత ముగింపు 25 నిమిషాలుంటుంది. ముగింపు ఎలా జరిగిందీ, రైటర్ కీ క్యారక్టర్ కీ మధ్య గొడవ ఎలా పరిష్కారమయిందీ సస్పెన్స్ కోసం వుంచేద్దాం.

—సికిందర్