రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, ఫిబ్రవరి 2016, సోమవారం

నాటి సినిమా!దేశం దుర్మతుల పాలయినప్పుడు, అమాయకులు అన్యాయాలకి బలౌతున్నప్పుడు, ధర్మానికి తానే  రాజు అయి, న్యాయానికి తానే బుద్ధి అయ్యి, ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని ఆ గీతాచార్యుడు సాకార రూపంలో ఈ లోకాన అవతరిస్తాడు. ఆ రూపం ‘బొబ్బిలి పులి’ అయినప్పుడు,  ఆ ప్రక్షాళనా  శతఘ్నులు భళ్ళున భళ్ళున అగ్ని వర్షాలు కురిపిస్తాయి!
          ఎస్, ఇందుకే కనక వర్షం కురిసింది!

        స్ట్రాంగ్ క్యారెక్టర్.. స్ట్రాంగ్ స్టోరీ.. చివరికి  ఇవన్న మాట సినిమా సిల్వర్ జూబ్లీ  అవడానికి మూలస్థంభాలు! సినిమా అంటే ఇప్పుడొస్తున్న  పాసివ్ పాత్రలతో పేలవమైన కథనాలతో చుట్టేసే క్రేజీ కాంబినేషన్ల ప్రదర్శన కాదు. డాక్టర్ ఎన్టీ రామారావు - డాక్టర్ దాసరి నారాయణ రావుల కాంబినేషన్ ఇలాటిది కాలేదు. వాళ్ళ బాధ్యతాయుతమైన భాగస్వామ్యంలో  ‘బొబ్బిలిపులి’ అనే పరాకాష్ట ధూర్తజనులకి కొరడా చరుపైంది. అవినీతిని ఏదో లంచం రూపంలో చూపించేసి, చంపడం వేరు. అవినీతి వల్ల భౌతిక నష్టతీవ్రతని పెంచి చూపించి, శత్రువుని వధించడం పూర్తిగా వేరు. మొదటిది ( లంచం ) ప్రేక్షకులు తేలిగ్గా తీసుకున్నే నిత్య వ్యవహారమే. రెండోది ( ప్రాణ నష్టం, ఆస్తి నష్టం) మాత్రం సీరియస్ గా పట్టించుకోవాల్సిన పవర్ ఫుల్ వ్యక్తీ కరణ అవుతుంది. ఇందుకే ‘బొబ్బిలిపులి’ ది  పవర్ఫుల్ స్టోరీ అయింది. ఇందుకే ‘బొబ్బిలి పులి’  ఎన్టీఆర్  నట జీవితానికో కుదుపు నిచ్చిన బ్లాక్ బస్టర్ మాత్రమే కాలేదు, అంతలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఉత్తరీయమిచ్చిన ఉపాఖ్యానం కూడా అయింది.

        ‘బొబ్బిలి పులి’  అనే నాణేనికి ఇలా రెండు ముఖా లేర్పడ్డాయి. ఇందుకు ఉత్తరాది పాత్రి కేయ బృందమూ సాక్ష్యమే. ఓ వైపు ఊరూరా ప్రభంజనం సృష్టిస్తున్న ఎన్టీఆర్ చైతన్య రథ యాత్రా విశేషాల్ని కవర్ చేస్తూనే, మరో వైపు మారు మూల పల్లెల్లో క్రిక్కిరిసిన థియేటర్ లలో ‘బొబ్బిలిపులి’  బాక్సాఫీసు గాండ్రింపుల్ని సైతం  లోకానికి చాటిన చరిత్రా వుంది.

        అపూర్వంగా  ఎన్టీఆర్ నటించిన  ఈ శక్తిమంతమైన పాత్ర తప్ప, మరింకో చర్చనీయాంశం సాక్షాత్తూ షెర్లాక్ హోమ్స్ వచ్చి తన ట్రేడ్ మార్క్ భూతద్ధం పెట్టి గాలించినా ఈ సినిమాలో దొరకదు. కాబట్టి ఒక పాత్ర బలంగా ఎదగడానికి ఏవి దోహద పడతాయో, తెలుసుకోవడమే  మనకి ముఖ్యాంశ మవుతుంది.

        సినిమాల్లో కథే పాత్రని నడిపితే అది  నసపెట్టే పాసివ్ పాత్రవుతుంది. పాత్రే కథని నడిపిస్తే అప్పుడది యాక్టివ్ పాత్ర,  లేదా స్ట్రాంగ్ క్యారెక్టర్ అవుతుంది. స్ట్రాంగ్ క్యారెక్టర్ కి వ్యక్తిగత ఆశయమే వుంటే,  అది అంతవరకే  పరిమితమైన దాని సొంత కథవుతుంది. ఇంకో మెట్టు పైకెళ్ళి ఇతరుల సమస్యల్ని పట్టించుకుంటే అప్పుడది సామాజిక కథగా, పాత్రగా ప్రమోటవుతుంది. మరింకో మెట్టు పైకి చేరుకుని అంతర్జాతీయ సమస్యని తలకెత్తుకుంటే, అప్పుడు విశ్వజనీన కథగా, పాత్రగా పదోన్నతి పొందుతుంది. మరింకో మెట్టు పైకి చేరుకుని అక్కడ పారలౌకిక అంశాల్ని స్పృశిస్తే,  భక్తి లేదా ఆథ్యాత్మిక కథగా, పాత్రగా పరమోన్నతమవుతుంది. కథల, పాత్రల గౌరవ ప్రపత్తులు ఈ ఆరోహణా క్రమంలో వుంటాయి. మెట్లెక్కే కొద్దీ  పెరుగుతూంటాయి.

        1982 లో విడుదలై అఖండ విజయాన్ని సాధించిన ‘బొబ్బిలిపులి’  లో ఎన్టీఆర్ పోషించిన మేజర్ చక్రధర్ పాత్ర  పై ఆరోహణా క్రమంలో రెండో స్థానాన్ని అలంకరిస్తోంది. ఇతరుల సమస్యల్ని పట్టించుకుంటూ సామాజిక పాత్ర అయింది. దుష్టులు ధర్మాన్ని చె రబట్టడం ప్రపంచ వ్యాప్త సమస్యే. దీనిమీద సామాజిక బాధ్యతతో తిరగబడ్డ చక్రధర్  విశ్వ జనీన ఆశయంతో ప్రతీ ఒక్కర్నీ అందుకే కదిలించ గలిగాడు. సినిమాల్లో కనీసం అయిదు కదిలించే సన్నివేశాలుంటే  విజయం ఖాయమని  నటి ఇంగ్రిడ్ బెర్గ్ మాన్ చెప్పినట్టు మూడు  ఆస్కార్ ల రచయిత విలియం గోల్డ్ మాన్ తన పుస్తకంలో రాశాడు. ఐదేం ఖర్మ, అరడజనుకి పైగా కుదిపివేసే సన్నివేశాలు కొలువు దీరాయి ‘బొబ్బిలిపులి’ లో.

      పాజిటివ్ సహిష్ణుతతో మేజర్ చక్రధర్ తన వాళ్ళ పట్ల ఔదార్యం వహించే ప్రతీ  మలుపూ కదిలించే సంఘటనే! అదే పాజిటివ్ సహిష్ణుత రీత్యా నిస్పృహ కి లోనవకుండా, ఆత్మ స్థయిర్యమూ కోల్పోకుండా, ప్రజా కంటకుల మీద దండయాత్ర చేసినప్పటి ప్రతీ ఘట్టమూ  కదిలించే సంఘటనే! 

        ఇలా పరస్పర భిన్నమైన అంతర్గత, బహిర్గత ఆశయాలుండబట్టే  మర్చిపోలేని సజీవ పాత్రయ్యాడు. ఇది యాక్షన్ సినిమాయే అయినా ఇందులో పాత్ర వ్యక్తిగత జీవిత చిత్రణకి కూడా ( దాదాపు 50 సీన్లు) ప్రముఖ స్థానముంది. మనం డబ్బు సంపాదన అనే యాక్షన్లో పడిపోయి  వ్యక్తిగత  జీవితాన్నిపట్టించుకోం. దీని ఫలితాన్ని మానసిక రుగ్మతల రూపంలో అనుభవిస్తున్నాం. జీవించడానికి బయట యాక్షన్ తో బాటు, ఇంటి మీద కాస్త ఎఫెక్షనూ అంత ముఖ్యమే. ఈ సంగతి పైకి చెప్పకుండా అన్ కాన్షస్ గా సైకో ఎనాలిసిస్ చేసేదే పవర్ఫుల్ పాత్ర. కాకి కేం తెలుసు సైకో ఎనాలిస్ అన్నాడో కవి. చరిత్రలో నిలచిపోయిన కొటేషను. కాకి సంగతేమో గానీ, మన టైంపాస్ తెలుగు సినిమా  పాత్రలు కూడా సైకో ఎనాలిస్  చేయగలవని మేజర్ చక్రధర్ నిరూపిస్తున్నాడు.

        సెలవు మీద ఊరొచ్చిన సైనికుడతను. ఇక్కడ ప్రేమించినమ్మాయి ( శ్రీదేవి) తో పెళ్లను కుంటోండగానే  సైన్యం నుంచి అర్జెంటుగా పిలుపు! ఆ పిలుపందుకుని పెళ్లి కంటే దేశ రక్షణే ముఖ్యమనుకుని వెళ్లి పోతాడు. అంతలో తల్లి అస్తమించిన వార్త. విధి నిర్వహణలో తల్లి ఋణం కూడా తీర్చుకోలేని దైన్యం. ఎలాగో ఊరొస్తే, చెల్లెలి (అంబిక)  తొందరపాటు ఫలితంగా కుండ మార్పిడి పెళ్ళిళ్ళు తప్పవు. అసలు ప్రేమించినమ్మాయిని పెళ్లి చేసుకోలేని బాధని కూడా దిగమింగుకుని, మతిస్థిమితం లేని ఈ భార్య (జయచిత్ర) తో రాజీ పడి,  ఇక విధి నిర్వహణకి తిరుగు ప్రయాణమవబోతూంటే, నడిరాత్రి నగరంలో దుష్ట త్రయం (సత్యనారాయణ, రావు గోపాలరావు, రాజనాల)  దగుల్బాజీ తనం నగ్నంగా కళ్ళబడుతుంది!

        ఇక దేశ సరిహద్దుల్లో కాదు విధి నిర్వహణ, ఈ దేశం నడిబొడ్డునే అని కళ్ళు తెర్చి సమరభేరి మోగిస్తాడు దుష్టజాతి మీద! 

      ఇలాటి సైనికుల కథల్లో  రొటీన్ గా కొన్ని స్టాక్ సీన్లు వుంటాయి. వాటిలో ముఖ్యమైనది సరిహద్దులో డ్యూటీ చేస్తూ ప్రియురాలి నుంచి ఉత్తర మందుకోవడం. అలనాటి హీరో బాలరాజ్ సహానీ లా ‘హకీఖత్’ లో   ‘హోకే  మజ్బూర్ హమే ఉస్నే బులాయా హోగా’ అని తల్చుకుని పాట పాడుకోవచ్చు. లేదా జేపీ దత్తా ‘బోర్డర్’  లో లాగా ‘సందేశే ఆతే హై  హమే తడ్పాతే హై’ అని కూడా పాడుకోవచ్చు. మేజర్ చక్రధర్ కూడా ఇలాటి లేఖే ప్రేమించినమ్మాయి నుంచి అందుకుని  ‘ఇది ఒకటో నంబరు బస్సూ’  అని ఎంటర్ టైన్ చేస్తాడు.

        ఇలాటి రోమాంటిక్  హీరో జ్వలిత హృదయుడు అవడానికి రెండు బలమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒకటి, సమాజ ద్రోహులు గోడౌన్ లో చక్కర నిల్వల్ని తరలించుకుపోయి అగ్ని ప్రమాదం సృష్టించే  సంఘటన. ఇది ఎప్పుడో రాజేష్ ఖన్నాతో మన్మోహన్ దేశాయ్ తీసిన ‘రోటీ’ లో రేషన్ డీలర్ జీవన్ దాచేసిన సరుకుని సింపుల్ గా పట్టుకోవడం లాంటి సాత్విక సంఘటన కాదు – చాలా నీచమైన తామసిక సంఘటన! 

        ఒక నేరాన్ని దాచడానికి నిప్పెట్టి ఇంకో దుర్మార్గం చేసే రాక్షస చర్య.  అవినీతి అనగానే ఓ లంచం పుచ్చుకునే  సీనుతో సరిపెట్టేసే  సాదా కథనం కాదు. ఆ అవినీతి దుష్పరిణామంగా నష్ట తీవ్రతని భౌతికంగా చూపించే మేజర్ సీను. ఇందుకే దీంతో తలపడి కోర్టులో నిరూ పించలేక, చక్రధర్ పడే వేదన - విజువల్ గా నష్ట తీవ్రతని  చూసి చలించిన ప్రేక్షకులు కూడా అంత ఆవేశంతో రగిలిపోవడానికి వీలయ్యింది.

        ఇలా అమాయక ప్రజల ఆస్తి నష్టానికి కారణమయ్యీ, కోర్టులో దుష్టులు తప్పించుకుంటే, రెండోసారి ప్రాణ నష్టం చూస్తాడు చక్రధర్. ఇదింకా బలమైన సంఘటన. రోడ్డుపక్క నిద్రపోతున్న అభాగ్యుల మీదికి  తాగిన మైకంలో కారు తోలిన దుర్మార్గం కూడా కళ్ళెదుటే కోర్టులో వీగిపోతుంది!

        దీంతో తిరగబడతాడు చక్రధర్. కోర్టులోనే అవినీతి యంత్రాంగాన్ని పట్టుకుని చితకబాది చితకబాది  వదుల్తాడు. కిష్కింధ అవుతుంది కోర్టు.

        ఫిలిం ఈజ్ బిహేవియర్ అంటారు స్క్రీన్ ప్లే పండితులు. పాత్రంటే ఏంటి?  సంఘటనని సృష్టించేది. మరి సంఘటనంటే? పాత్రకి వన్నెచేకూర్చేది...అని అంటాడు 19 వ శతాబ్దపు ప్రసిద్ధ నవలా రచయిత హెన్రీ జేమ్స్.  మనుషులు నాల్గు భౌతిక తత్త్వాల ( అగ్ని, భూమి, వాయు, జల౦) తోనూ, మూడు మానసిక తత్త్వాల ( చర, స్థిర, ద్విస్వభావాలు) తోనూ ఉంటారని అంటారు ప్రాచీన శాస్త్రకారులైన పరాశరుడు, వరాహ మిహిరుడు ప్రభృతులు.

      ఈ పైవన్నీ క్రోడీకరించుకుని,  రక్తమాంసాలతో సజీవంగా అవతరించిందే మేజర్ చక్రధర్ పవర్ఫుల్ పాత్ర!

        కోర్టు లో తిరగబడి ఇలా ప్రకాశించిన చక్రధర్, ఇక బొబ్బిలిపులియై కొండ కోనల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని  ప్రజా ద్రోహుల్ని బంధించి హతమారుస్తూంటాడు. ఇదంతా యమలోకం వాతావరణాన్ని స్ఫురింపజేస్తుంది. తనేమో యమధర్మ రాజు, అనుచరులు యమ భటులు, వాళ్ళు పట్టుకొచ్చే జీవులు పాపులు. వాళ్ళకి కఠిన శిక్షలు. మరణ శిక్షలు.

        ప్రపంచ పురాణా లన్నిటినీ కూలంకషంగా పరిశోధించడానికే  జీవితాన్నంతా వెచ్చించిన గ్రేట్ జోసెఫ్ క్యాంప్ బెల్ -  ఓ చిన్న జోకు అయినా, మహా గొప్ప ఫిక్షన్ అయినా అన్నిటి మూలాలూ పురాణాల్లోనే ఉన్నాయని అంటాడు. అందుకే ఒక కల్పిత పాత్రలో వివిధ పురాణ పాత్రల కోణాలూ  కనిపిస్తాయనీ పేర్కొంటూ- ‘ది హీరో విత్ ఎ థౌజండ్ ఫేసెస్’ అన్న ఉద్గ్రంథాన్ని రచించాడు. సశాస్త్రీయంగా ఇలాటి మిథికల్ క్యారెక్టరే మేజర్ చక్రధర్ కూడా! 

        నవలా పాత్రలాగా సినిమా పాత్ర డైలాగులతో కథ నడపలేదు. చేతలతో నడిపితేనే చెల్లుబడి అయ్యేది. చేతలన్నీ  అయ్యాకా మాటలతో ఎంతైనా నడపొచ్చు. ఇలాటి మేకప్ ఉండబట్టే క్లయిమాక్స్ లో చాలా సుదీర్ఘమైన  ఆ వాదోపదావాలతో కూడిన కోర్టు సీనుని విగు పుట్టించకుండా డైలాగులతో లాక్కు రాగలిగాడు చక్రధర్. పైగా తన వాదపటిమకి తగ్గట్టు కథనంలో మొదటి మలుపు ( ప్లాట్ పాయింట్- 1)  దగ్గర స్థాపించిన సమస్య ( ప్రాణ నష్టం) కూడా అంత బలంగానూ వుంది. ప్లా పా- 1 దగ్గర సమస్య ఏర్పాటు బలంగా వుంటే దాంతో పోటీ పడుతూ ఆటోమేటిగ్గా క్లయిమాక్స్ కూడా బలంగా వచ్చేసినట్టే. ఇలాటి కథా పథకం బలం వల్లే సినిమా మొత్తం మీద చివరి కోర్టు సీనుని అంత హైలైట్ గా మార్చగలిగాడు చక్రధర్. 

      అతడి వాదం ఒక్కటే. ఒకే కేసులో ఒక కోర్టుకీ దాని పై కోర్టు కీ పొంతన లేని తీర్పు లేమిటి? శత్రువుని సైనికుడు సరిహద్దులో చంపితే  సత్కారమా? అదే దేశం లోపల నేరస్థుల్ని వధిస్తే మరణశిక్షతో ఛీత్కారమా? నిజంగా సైనికుడు దేశాన్ని ఎప్పుడు కాపాడినట్టు? మర లాంటప్పుడు ఈ మరణశిక్ష తన కెందుకు విధించినట్టు?

        యంత్రాంగం సమాధానం ఇవ్వలేని లేని ప్రశ్నలు.  దేశం మొత్తం మీద ఒక్క సైనిక జవాను మాత్రమే వేయగల కఠిన ప్రశ్నలు. 

        అతడి ఆవేదన మాత్రమే గొప్పది. 

        ప్రాణాల్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడు కొస్తూంటే, పందికొక్కులు దేశంలోపల సర్వ వ్యవస్థల్నీ నాశనం చేస్తున్నాయి.

        స్ట్రాంగ్ క్యారెక్టర్ కి నషాళాన్నంటే అంతే స్ట్రాంగ్ స్టోరీ!

        ఈ పాత్ర చిత్రణతో  తెరమీద మహానటుడు ఎన్టీఆర్ ప్రేక్షకులకి ఊపిరి సలపనీయడు. తెరవెనుక సూత్రధారి దాసరి కూడా కళ్ళు తిప్పుకోనివ్వడు.

        తెలుగు ప్రజల సాంస్కృతిక, రాజకీయ భావజాలాల మీద ‘బొబ్బిలిపులి’ ది చెరగని ముద్ర!


- సికిందర్
(2009- ‘సాక్షి’)
http://www.cinemabazaar.in/