రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, జనవరి 2014, సోమవారం

రీసైక్లింగ్ మసాలా !
రివ్యూ
 ‘ఎవడు’
తారాగణం : రాం చరణ్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, శృతీ హాసన్, అమీ జాక్సన్, జయసుధ,కోట శ్రీనివాసరావు, సాయికుమార్, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం,
సుబ్బరాజు, అజయ్ తదితరులు 

కథ : వక్కంతం వంశీ, వంశీ పైడిపల్లి,  మాటలు : అబ్బూరి రవి
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్   గీతాలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోసు, కృష్ణ చైతన్య, శ్రీమణి
చాయాగ్రహణం : రాం ప్రసాద్   నృత్యాలు :       కళ : ఆనంద్ సాయి  కూర్పు : మార్తాండ్ కే వెంకటేష్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్     నిర్మాత : దిల్ రాజు
స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వంశీ పైడిపల్లి
నిడివి : 166 నిమిషాలు, సెన్సార్ : A   విడుదల : జనవరి 12 , 2014

***
గత ఆర్నెల్లుగా అనేక సార్లు వాయిదా పడుతూ రామ్ చరణ్ అభిమానుల్ని తీవ్ర అసహనానికి గురిచేస్తున్న  తాజా కానుక ‘ఎవడు’ ఎట్టకేలకు సంక్రాంతికి దిగివచ్చింది. రంగంలో వున్న మహేష్ బాబు ‘1- నేనొక్కడినే’ ని బలంగా ఢీ కొట్టింది. ఈ పందెం కోళ్ళల్లో మొదటిది ఆపాటికే డీలాపడివున్న పరిస్థితిని సొమ్ముచేసుకుంటూ బాక్సా ఫీసు ని కొల్లగొట్టుకుంది. అలాగని పూర్తిగా గెలిచానన్న సంతోషం కూడా లేదు. సంక్రాంతి కోడి పందాలంతటి థ్రిల్లింగ్ గా  ఈ రెండు కోళ్ళ మధ్య నువ్వా నేనా ? అన్నట్టు పోటీ లేకపోవడంతో- ఈయేటి సంక్రాంతి హీరో బ్యాడ్జీ దాని గ్లామర్ ని కోల్పోవాల్సి వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీసు ముఖం పట్టేందుకు ఏంతో  ఓపికపట్టి ఉన్న నిర్మాత దిల్ రాజు కి దీని సక్సెస్ చాలా అవసరం. గత నిర్మాణం ‘రామయ్యా వస్తావయ్యా’ తో అయిన అనుభవం దృష్ట్యా ‘ఎవడు’ ప్రతిష్ట నిలబెట్టాలి. అయితే సుదీర్ఘకాలం నిర్మాణంలో వున్న కారణంగా కొన్ని నష్టనివారణా చర్యలు తీసుకోవడానికి వీలు పడి ఉండక పోవచ్చు. ఫలితంగా ఇది ఒకవర్గం ప్రేక్షక కటాక్షానికే లోబడాల్సి వచ్చింది- పండక్కి కుటుంబాలు వినోదించే మసాలాదినుసులకన్నా,  పక్కా మాస్ ఎలిమెంట్స్ శృతిమించి పోవడంవల్ల!

హీరో రామ్ చరణ్ తన తండ్రిలాగే ఆయన నిర్దేశకత్వంలో మూస ఫార్ములా బరి ఏమాత్రం దాటకుండా,  సేఫ్ గేమ్ ఆడేందుకు కృతనిశ్చయు డయ్యాడని అతడి ట్రాకుని బట్టి తెలిసిపోతోంది. ఏ ముహూర్తాన అయితే 2010 లో ‘ఆరెంజ్’ అనే జెనెక్స్ అర్బన్ క్లాస్ ప్రేమకథ దారుణ పరాజయం పాలయ్యిందో-ఇక అప్పట్నుంచీ చిరంజీవి మార్గదర్శకత్వంలో ఆయనకి కలిసివచ్చిన బాటలో వరుసగా ‘రచ్చ’, ‘నాయక్’, ఇప్పుడు  ‘ఎవడు’ అనే మాస్ లక్ష్యిత మూస ఫార్ములా కథల వైపు మొగ్గడం ప్రారంభించాడు. మధ్యలో ‘జంజీర్’ – ‘తూఫాన్’ హిందీ /తెలుగు రీమేకుల ప్రయోగం మరో దెబ్బ తీసింది. ఒకేతరహా సినిమాలతో మాస్ మహారాజా రవితేజకి  తలపట్టుకునే పరిస్థితి వచ్చిందన్నది కన్పిస్తున్న చరిత్ర. రామ్ చరణ్ కి ఇలాంటి ఇబ్బంది ఎదురవకూడదని ప్రార్ధిద్దాం.

మూస ధోరణిలో ‘ఎవడు’ కొన్ని ఆంగ్ల-తెలుగు సినిమాల రీసైక్లింగ్ తిరగమోత. విద్యాధికుడైన దర్శకుడు వంశీ పైడిపల్లి నుంచి ఇలాటి వంటకం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. హీరోని బట్టి దర్శకుడు కూడా మారాల్సిందే. కాకతాళీయమే కావొచ్చు, ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తూ విడుదలైన సినిమాలు   ‘క్షత్రియ’,  ‘1-నేనొక్కడినే’, ’ఎవడు’- మూడూ కొత్త కథల్నే ప్రయత్నిచాయి. మొదటి రెండూ సైకాలజికల్ థ్రిల్లర్స్ గానూ, చివరిది ముఖమార్పిడి యాక్షన్ మూవీగానూ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే కథా నిర్వహణలో కొత్తదనాన్ని ప్రదర్శించలేకపోయాయి. ‘ఎవడు’ కథని నడిపించడానికి మరీ ఇంత పాత మూస అవసరమా అన్పించేట్టుంది-మాస్ కి హృదయస్పందనలే  వుండ వన్నట్టు ఇంత సుత్తిమోత అవసరమా?

ఫేసులూ – కౌంటర్ ఫేసులూ
వైజాగ్ లో సత్య( అల్లు అర్జున్), దీప్తి (కాజల్ అగర్వాల్) ప్రేమించుకుంటారు. లోకల్ డాన్ వీరూభాయ్ (రాహుల్ దేవ్) దీప్తిని వశపర్చుకోవాలని చూస్తూంటాడు. సత్య కీ, వీరూకీ ఈ కారణంగా ఘర్షణలు పెరిగి, దీప్తీ తో పారిపోయి హైదరాబాద్ లో పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు సత్య. వీరూ మనుషులు ఆ బస్సుని అటకాయించి ఇద్దర్నీ చంపేసి బస్సుని తగులబెట్టేస్తారు. సగం ముఖం కాలిపోయి కొనప్రాణంతో వున్న సత్యని హైదరాబాద్ లో డాక్టర్ శైలజ  (జయసుధ) చికిత్స చేస్తుంది. పదిరోజుల తర్వాత కోలుకున్న సత్య ముఖం చూసుకుంటే అది తన ముఖం కాదు. సర్జరీలో ఏకంగా ఫేస్ ట్రాన్స్ ప్లాంటేషనే జరిగిపోయింది...మారిపోయిన ముఖంతో (రామ్ చరణ్ ముఖం) ఇదే అదును అనుకుని సత్య వైజాగ్ పారిపోయి వీరూ మనుషుల్ని చంపడం మొదలెడతాడు. ఈ క్రమంలో వీరూ కన్ను పడిన మరో అమ్మాయి శృతి (అమీ జాక్సన్ ) ని కాపాడి ఆమెద్వారానే గ్యాంగ్ ని ట్రాప్ చేసి చంపుతుంటాడు. చివరికి వీరూని చంపేసి పగ తీర్చుకోవడం పూర్తయ్యేసరికి – ఇంకో ముఠా అనుచరుడు- సత్యని చూసి చరణ్ (రామ్ చరణ్) అనుకుని- ఇంకా బతికే ఉన్నాడని  గగ్గోలు లేపుతాడు. ఇక సత్య మీద ఈ  ముఠా దాడులు మొదలెడుతుంది.

చిక్కుల్లో పడతాడు సత్యా. చచ్చిపోయిన చరణ్ ఫేసు తన కెందుకొచ్చింది? ఈ అనుమానంతో డాక్టర్ శైలజ  ని కలిస్తే- ఆమె తన కొడుకు చరణ్ కథ చెప్పుకొస్తుంది. అందరి బాగు కోరే కొడుకు దుష్ట రాజకీయనాయకుడు ధర్మా (సాయికుమార్) కుట్రలకి  ఎలా బలైపోయాడో తెలుసుకున్న సత్య – చరణ్ గా ఎంటరై ధర్మాని బోల్డు తికమక పెట్టేస్తూ ఆడుకోవడం మొదలెడతాడు...

ఓకే ఫేసుతో సత్యగా, చరణ్ గా నటించిన రామ్ చరణ్ అభిమానుల మెప్పు తప్పకుండా పొందుతాడు. ఈ ద్విపాత్రాభినయాలు ఇంకో విధంగా వుండి వుంటే నటనల్లో  ఇంకా చాలా వైవిధ్యం వచ్చేది. అదెలాగో తర్వాత చూద్దాం. ప్రారంభంలో అతిధి పాత్రలో వచ్చే అల్లు అర్జున్ ది  ‘లో- ప్రొఫైల్ ‘ మెయింటైన్ చేసే క్యారక్టర్ కావడంతో సినిమా ప్రారంభ దృశ్యాలు అంత ప్రభావశీలంగా ఏమీ లేవు.  అతడి ప్రేయసిగా కాజల్ బాగా లావెక్కి కన్పిస్తుంది. శృతి పాత్రలో బ్రిటిష్ నటి అమీ జాక్సన్ తెలుగులోకి ఎంటరవుతూ పాత్ర సరిగ్గా లేక కృతకంగా నటించి వెళ్ళిపోయింది. ‘1947- ఏ లవ్ స్టోరీ (తమిళ మాతృక ‘మదరాస పట్టినం’- 2010 విడుదల) లో కడు హృద్యంగా అభినయించిన ఆమె ఇలా తేలిపోవడం ఒక విషాదం. 

చరణ్ పాత్ర ప్రేయసిగా శృతీ హాసన్ దీ కురచ పాత్రే. విలన్ గా  నటించిన సాయికుమార్ పెడబొబ్బలు పెట్టడంతోనే సరిపోయింది. డాక్టర్ గా జయసుధ నటన హుందాతనం ఉట్టిపడేలా వుంది. వెన్నెల కిషోర్ ది పాత్రే కాకపోయాక, బ్రహ్మానందం నవ్వించడానికి అంతంత మాత్రమే  స్క్రీన్ టైం దక్కింది.

సినిమాలో కామెడీ మిస్సయి ఒకటే సీరియస్ గా అదేదో ప్రపంచం కొట్టుకు పోతున్న చందంగా పాత్ర చిత్రణ లున్నాయి. దీనికి తోడూ దేవీశ్రీ ప్రసాద్ పాటల పారవశ్యం మాటేమో గానీ, నేపధ్య సంగీతం మాత్రం చాలా నాటుగా, డీటీఎస్ మిక్సింగ్ మరీ ఘోరంగా చెవులుపగిలే మోతతో నరకం చూపిస్తాయి. మాస్ కి ఈ క్రియేటివిటీ తోనే ఆకట్టుకోవచ్చను కున్నారేమో తెలీదు - ‘సి’ గ్రేడ్ సినిమా వ్యవహారంలా వుంది. ఛాయాగ్రహణం, ఫైట్స్ షరామామూలే. పండక్కి పెద్దలకుమాత్రమే ‘A’ సర్టిఫికేట్ తో వచ్చిన ఈ హింసాత్మక మసాలా మాస్ కోసమే అనడం కూడా వాళ్ళని అవమానించడమే అవుతుందేమో!

స్క్రీన్ ప్లే సంగతులు 
దర్శకుడు వంశీ పైడిపల్లి, వక్కంతం వంశీ కలిసి రాసిన కథకి వంశీ పైడిపల్లి  స్క్రీన్ ప్లే రాసినట్టు టైటిల్స్ లో పడుతుంది. ప్రారంభంలో ఇరవై  నిమిషాలూ అల్లు అర్జున్ పాత్ర ప్రమాదానికి గురికావడం, సర్జరీ చేసి రామ్ చరణ్ ముఖం గా మార్చడమూ జరుగుతాయి. అక్కడ్నించీ వైజాగ్ వచ్చి హత్యలు చేయడం మొదలెడతాడు రామ్ చరణ్. ముఖ మార్పిడి అనే వినూత్న కాన్సెప్ట్ తో ప్రారభమైన సినిమా- ఇక్కడ్నించే స్క్రీన్ ప్లే పట్టు తప్పిపోయి ఆసక్తిని కోల్పోతుంది. ప్రసిద్ధ స్క్రీన్ ప్లే ట్యూటర్ జాన్ ట్రూబీ చెప్పే పొరపాట్లలో మొదటిది ఇదే- స్టోరీ ఐడియా ఒరిజినల్ ది  కాకపోవడం, ఆ ఐడియాని తమ వంతుగా డెవలప్ చేసుకోవడానికి రాంగ్ జెనర్ ని ఎంపిక చేసుకోవడం, లేదా ముందే నిర్ణయించుకున్న ఫలానా ఫలానా సినిమాల్లోని కథనాలని ఆ అయిడియాలోకి జోప్పించడమూ చేస్తారు తప్ప,  అరువుదెచ్చుకున్నఆ  స్టోరీ ఐడియాకి తగిన తమదైన ఒరిజినల్ కథనాన్ని సృష్టించే పాపానే పోరు.

హిట్ సినిమా స్క్రిప్ట్ అంటే  హై కాన్సెప్ట్ నేపధ్యంతో భారీ బిల్డప్ ఇవ్వడమే అనుకుంటారు. మరి ఆ బిల్డప్ కి తగ్గ కథనాన్ని జోడించడం ఓ రెండు మూడు సీన్లవరకే చేసి చేతులేత్తేస్తారని కూడా అంటాడు ట్రూబీ.

సరిగ్గా ఇదే జరిగింది. మొదట్లోనే వైజాగ్ వచ్చి హత్యలు చేయడం మొదలెట్టగానే టెన్షన్ గ్రాఫ్ ఒక్కసారి పడిపోయింది. కారణం  ఎన్నుకున్న హై కాన్సెప్ట్ ఐడియా తిరుగు ముఖం పట్టడం. అతను అంతలోనే వెనక్కి వైజాగ్ కి రావడమే కథని వెనక్కి తిప్పేసింది. కొత్త ముఖంతో  హైదరాబాద్ లో కొత్త శత్రువులతో అప్పుడే  కొత్త కథ మొదలై పోయి వుంటే,  టైం అండ్  టెన్షన్ గ్రాఫ్ అమాంతం పైకి లేచి కథ ముందుకు పరుగులెత్తేది! 

తనకు సంబంధం లేని ఆ కొత్త శత్రుత్వం కూడా పేలవమైన పాతచింతకాయ - కాలంచెల్లిన  రాజకీయ గూండాయిజం తో కాకుండా, ముఖమార్పిడి అంతటి సంచలన ఎత్తుగడకి మించిన స్థాయిలో ఉన్నప్పుడే హై కాన్సెప్ట్ కి న్యాయం చేసినట్టు. 

ఇలా లేకపోవడం వల్ల ఫస్టాఫ్ లో అల్లు అర్జున్ పాత్ర వైజాగ్ లో గూండాయిజం తో తలపడినట్టే, సెకండాఫ్ లోనూ  రామ్ చరణ్  కథకి ఫ్లాష్ బ్యాక్ లో సృజనాత్మకత లోపించి, అలాటి గూండాయిజం తోనే కథ నడిఛి- రిపీటీషన్ బారినపడి  ఆ సెకండాఫ్ కూడా  మరీ డల్ అయిపో యింది. 


సినిమాలో టెన్షన్ ఫ్యాక్టర్ లేదా థ్రిల్ మిస్సవడానికి ప్రథమార్ధంలో, ద్వితీయార్ధంలో ఓకే తరహా కాలం చెల్లిన కథలు కొనసాగడం ఒక కారణమైతే,  ఈ కథలు కూడా స్ట్రక్చర్ లో లేకపోవడం అసలు కారణం. ప్రథమార్ధంలో సత్య, చరణ్ లా  వైజాగ్ కి తిరిగివచ్చి ప్రతీకారం తీర్చుకున్నాక,  ధర్మా గ్యాంగ్ మనిషి అతన్ని చూసి గుర్తుపట్టడం అనే మొదటి మలుపు (ప్లాట్ పాయింట్ -1 ) దాదాపు గంట సేపటికి వస్తుంది. ఆ తర్వాత పదిహేను నిమిషాల్లోనే ఇంటర్వెల్ పడిపోతుంది. ఒకసారి సారి ఈ క్రింది పటాన్ని గమనిస్తే... మలుపు యాక్ట్ -1 విభాగంలో, ప్లాట్ పాయింట్ -1 (రెండవ ఎరుపు రేఖ) దగ్గర రావాల్సింది. ఇది ముందుకు జరిగిపోయి, పించ్ పాయింట్ -1 (మూడో ఎరుపు రేఖ ) దగ్గర వచ్చింది. అంటే యాక్ట్ -2 విభాగంలోకి అతిక్రమించి వచ్చింది. తర్వాత పదిహేను నిమిషాల్లో యాక్ట్ -2 మిడ్ పాయింట్ (నలుపు రేఖ) దగ్గర విశ్రాంతి పడింది.
పించ్ పాయింట్ -1 అనేది ఇంటర్వెల్ కి దారితీసే ఉత్ప్రేరక ఘటనగా రావాలే తప్ప మరోలా కాదు. కానీ ఇక్కడ ప్లాట్ పాయింట్ -1 గా వచ్చింది. పించ్ పాయింట్-1 అసల్లే కుండా పోయింది! ఇలా అంకాలు భంగపడి, వాటి బిజినెస్ సాంతం మూతపడి- స్క్రీన్ ప్లేకి అర్ధమే  లేకుండా పోయింది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో లేనప్పుడు ఏదీ ఆసక్తికరంగా వుండే అవకాశం ఏమాత్రం లేదు.

ప్రేక్షకులనుంచి ఇంకో కామెంట్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ లో ఓ సినిమా, సెకండాఫ్ లో మరో  సినిమా చూపించారని! ఇది రసభంగం కల్గించే ఏకసూత్రత లోపించిన రచనా సంవిధానం. ఫస్టాఫ్ లో వీరూ గ్యాంగ్ మీద పగదీర్చుకుని, ఆ కథ ముగించేసి,  సెకండాఫ్ లో వేరేగా ధర్మా గ్యాంగ్ తో మరో కథ మొదలు పెట్టినట్టు అన్పించడమే ప్రేక్షకుల కి
ఆ  ఫీలింగ్ కలగడానికి కారణం.  ప్రధాన కథలో ప్రారంభ కథ కలగలిసి పోక పోవడం వల్లే ఇలా జరిగింది. ఏ సినిమాకైనా  ఓకే ఒక్క ప్రధాన కథ కథ వుంటుంది. ఇంకేవైనా కథలుంటే అవి ఉప కథలే అవుతాయి. ఈ సినిమాలో వీరూ మీద పగదీర్చుకోవడం, ధర్మా గ్యాంగ్ ని మట్టు  బెట్టడం –ఈ రెండిట్లో ఏది ప్రధాన, ఏది ఉప కథ ఆవుతాయంటే- ధర్మా గ్యాంగ్ తో జరిగేదే ప్రధాన కథ! వీరూ  ముఠాతో జరగాల్సిందంతా  ఉప కథే!

అలాంటప్పుడు ధర్మా గ్యాంగ్ తో జరిగే ప్రధాన కథతో వీరూ గ్యాంగ్ తో కథ అంతర్వాహినిలా వుండాలి. వేరే ముగించేసిన ఎపిసోడ్ లా వుండకూడదు. అంటే, చరణ్ లా సత్య వైజాగ్ లో  వీరూ గ్యాంగ్ ని అంతమొందించడానికి వస్తే, కథ అడ్డం తిరిగి, ధర్మా గ్యాంగ్ కంట పడి అసలు కథ ( ప్రధాన కథ ) మొదలైపోతే- అప్పుడు చరణ్ పాత్రకి పెండింగ్ లో పడ్డ వీరూ మీద ప్రతీకార లక్ష్యంతో కూడిన ఎమోషనల్ యాక్షన్ ఒకవైపు, మరోవైపు తనని చూసి పొరబడ్డ ధర్మా గ్యాంగ్ తో ఫిజికల్ యాక్షన్ అనే ద్వందాలేర్పడి, అది సజీవ పాత్రగా రాణించేది. చివరంటా ఎక్కడా బోరు కొట్టకుండా- రెండు సినిమాలు చూపిస్తున్నారన్న ఫీలింగ్ ఏర్పడకుండా- ఏకకాలంలో ఈ ద్విముఖ కార్యాచరణతో, క్యారక్టర్ అనుక్షణం సంఘటనలు సృష్టిస్తూ- తద్వారా వేడిపుట్టిస్తూ వుండేది. ఆఫ్టరాల్ పంతొమ్మిదో శతాబ్దపు ప్రసిద్ధ నవలా రచయిత జేమ్స్ విలియమ్స్ ఏమన్నాడు? –‘What is character but the determination of incident ? And what is incident but the illumination of character?- అని కాదూ?


క్యారక్టర్ బయోగ్రఫీ బలాదూర్!
రామ్ చరణ్ పాత్ర యాక్టివ్ పాత్రే, పాసివ్ కాదు. కాకపొతే దానికి  ఇన్నర్ (ఎమోషనల్) స్ట్రగుల్, ఔటర్ (ఫిజికల్ ) స్ట్రగుల్స్ తో కూడిన డైమన్షన్స్ పైన చెప్పుకున్న కారణాల వల్ల ఏర్పడలేదు. పూర్వం మహేష్ బాబు నటించిన ‘బాబీ’ అనే సినిమాలోనూ ఈ డైమన్షన్స్ కన్పించవు. బ్యాక్ డ్రాప్ లో బద్ధ శత్రువులైన హీరో హీరోయిన్ల తండ్రుల ఆగడాలతో నగరం అట్టుడికిపోతున్నా- ఈ బ్యాక్ డ్రాప్ తో సంపర్కం లేకుండా హీరో పాత్ర హీరౌయిన్ తో ప్రేమాయణం సాగించడంతో నే సరిపెట్టుకుంటుంది. మొత్తం కథా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో అంతా హీరో కి తెలిసి వుండడ మన్నది  కథనంలో పాటించాల్సిన ప్రాథమిక  సూత్రమే. ఇదిలోపిస్తే పాత్ర ఒట్టి  కటౌట్ లా మిగిలిపోయే ప్రమాదముంది.

అల్లు అర్జున్ ముఖానికి రామ్ చరణ్ ముఖాన్ని అతికించినంత మాత్రాన  శరీరాకృతి, గొంతు, కళ్ళూ వగైరా రామ్ చరణ్ వి వచ్చేస్తాయా?ఇలాటి మాస్ కమర్షియల్ కథలకి కాసేపు లాజిక్ ని పక్కన బెట్టి, సినిమాటిక్ లిబర్టీ( సృజనాత్మక స్వేచ్చ)అనే లైసెన్సు తీసుకుని వాస్తవ దూర కల్పనలకి దర్శకుడు పాల్పడే హక్కు ఎప్పుడూ వుంటుంది. దీన్నే స్క్రీన్ ప్లే పరిభాషలో ‘suspension of disbelief’  అంటారు. అంటే మన అపనమ్మకాల్ని కాసేపు సస్పెండ్ చేసుకుని సినిమాని బేషరతుగా ఎంజాయ్ చేయడమన్నమాట. అలాగనీ ఈ లైసెన్సుని దుర్వినియోగం చేసి ప్రేక్షకుల ఔదార్యంతో అతిగా ప్రవర్తించే అధికారం దర్శకుడికి వుండదు. ‘ఫేస్ ఆఫ్’ అనే హాలీవుడ్ సినిమాలో ముఖ మార్పిడి అదొక గూఢచార సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా గుట్టుగా జరిగే వ్యవహారం. లాజిక్ కి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలూ తలెత్తవు. ‘ఎవడు’ సినిమాలోలా ప్రైవేట్ డాక్టర్ పేషంట్ అనుమతిలేకుండా ఇష్టానుసారం ముఖాన్ని మార్చేస్తే చట్టపరమైన, సామాజిక పరమైన, వ్యక్తిగతమైన సమస్యలెన్నో వస్తాయి. కాబట్టి అరిస్టాటిల్ మహాశయుడు చెప్పినట్టు - ముందు సన్నివేశానికి పునాది నమ్మశక్యంగా ఏర్పాటు చేస్తే , ఆపైన దాన్నాధారంగా ఎలాంటి అసంబద్ధ కామెడీతో నైనా ఒప్పించవచ్చన్నది ‘ఎవడు’ వంటి సీరియస్ కథాంశానికి  కూడా వర్తిస్తుంది.

ఇక్కడ ఒక గొప్ప ఆశయం కోసం మరణించిన పాత్ర ఫ్లాష్ బ్యాక్ లోని చరణ్ పాత్రే తప్ప, చావుతప్పిన సత్య కాదు. కానీ ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం కాడ్నించీ రొటీన్ గా చిత్రించి సరిపెట్టేశారు. మిత్రుడ్ని చంపినందుకు విలన్ని ఢీకొన్నాడు తప్పితే, అసలు మొదట్నించీ  ఆ పాత్ర అంతరంగం, వ్యక్తిత్వం, ప్రపంచం పట్ల, వ్యవస్థ పట్ల దాని దృక్పథం ఏమిటో నిండుతనంతో, సజీవపాత్రలా చూపడంలో విఫలమయ్యారు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే, నడుస్తున్న కథకంటే విభిన్నమైన విషయమేదో ప్రేక్షకులు ఫీలవ్వాలి. ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తుండి పోవాలి. అలాటిదేమీ ఇక్కడ జరక్క- ఫ్లాస్ష్ బ్యాక్ ఓపెన్ కాగానే- సినిమా ఫస్టాఫ్ లో ఫస్ట్ యాక్ట్ బిజినెస్స నే (సన్నివేశాల్నే) మళ్ళీ చూపిస్తున్నట్టు  తయారయ్యింది.

ఇదిలా  వుంటే, గమ్మత్తుగా కొన్ని పాత్రలు అర్ధాంతరంగా అంతర్ధానమై పోతాయి. రెండో హీరోయిన్ అమీ జాక్సన్, పోలీసు అధికారి పాత్ర  పోషించిన మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ వగైరా పాత్రల్ని కొనసాగించలేక మాయం చేశారు కాబోలు!

సమగ్రమైన కథా కథనాలతో భారీ బడ్జెట్ సినిమాలు కూడా తీయలేకపోవడం దేనికి నిదర్శన మనాలో ఎవరికి  వాళ్ళే నిర్ణయించుకోవాలిక!

-సికిందర్