రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, March 26, 2018

629 : రైటర్స్ కార్నర్



          రాసే వాళ్లకి తీసే వాళ్ళ కష్టం తెలీదు. తీసే వాళ్లకి రాసే వాళ్ళ కష్టం తెలీదు. రెండూ చేసేవాళ్ళకి రెండూ తెలుస్తాయి. ఐతే తీయడం కంటే రాయడమే కష్టమంటారు క్రిస్టఫర్ మక్కోరీ. ‘యూజువల్ సస్పెక్ట్స్’ కి ఆస్కార్ అవార్డు పొందిన రచయిత తను. దర్శకుడు బ్రయాన్ సింగర్ కి రెగ్యులర్ రచయిత అయిన తను ఆయనతో కలిసి ‘పబ్లిక్ యాక్సెస్’, ‘వాకిరీ’, ‘జాక్ ది జెయింట్ స్లేయర్’, ‘ఎడ్జ్ ఆఫ్ టుమారో’   స్క్రీన్ ప్లేలు రాశారు.  ‘ది వే ఆఫ్ ది గన్’, ‘జాక్ రీచర్’ లని తనే రాసి దర్శకత్వం వహించారు. ‘మిషన్ ఇంపాసిబుల్ – రోగ్ నేషన్’ కి దర్శకత్వం వహించిన తను, ప్రస్తుతం ‘మిషన్ ఇంపాసిబుల్ – ఫాలౌట్’ కి రచన - దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకత్వం కంటే రచనే కష్టమన్న తను, దర్శకత్వం కంటే నటన కష్టమని కూడా అంటారు. రాయడం గురించీ,  తీయడం గురించీ ఇంకా ఆయన  వెల్లడించిన అనేక అనుభవపూర్వక విషయాలు ఈ క్రింది ఇంటర్వ్యూలో చూద్దాం...

అనుభవమున్న దర్శకుడికీ, అనుభవం లేని దర్శకుడికీ వ్యత్యాసం ఏమిటంటారు?
         
అనుభవమే! ఐతే అనుభవమున్నంత మాత్రాన నైపుణ్యం  వుండాలని లేదు. పోటీ పడని గొప్ప దర్శకులు, పోటీయే లోకంగా మామూలు దర్శకులూ అని రెండు రకాలుగా వుంటారు. వీళ్లిద్దరికీ నైపుణ్యంలో   తేడా ఎక్కడొస్తుందంటే,  తీసే కథని అర్ధం జేసుకోగలగడంలో. కథని ఎలా చెప్పాలి, భావోద్వేగాలు ఎలా సృష్టించాలి అన్న దగ్గరే తేడా వస్తుంది. విజయాలు సాధిస్తున్న చాలామంది గొప్ప దర్శకులున్నారు. వాళ్లకి హీనపక్షం భావోద్వేగాలపరంగా ప్రేక్షకుల్నిఎలా కట్టి పడెయ్యాలో  తెలీదు.

నవలగానీ లేదా ఒక చిన్న కథగానీ రాయడాన్నీ, సినిమాలకి స్క్రీన్ ప్లేలు రాయడాన్నీ ఎలా పోల్చవచ్చంటారు?
          పోలికే లేదు. చిన్నకథో,  నవలో రాసినప్పుడు ప్రతిదీ పేజీ మీద అక్షరాల్లో పొందుపర్చి పఠిత కోసమే వుంటుంది . అదే స్క్రీన్ ప్లే రాస్తున్నామంటే కేవలం సినిమా తీయడానికి అదొక బ్లూ ప్రింట్ అన్నట్టే వుంటుంది. ఇది చిన్నకథలాగో, నవలలాగో జనంలోకి వెళ్ళదు. ప్రొడక్షన్ విభాగంలో సంబంధిత శాఖలు తప్ప స్క్రీన్ ప్లేలనేవి బయట ప్రజల్లోకి వెళ్ళవు. కాబట్టి ఇవి ఇతర పాఠకుల కోసం కాదు, అంతర్గతంగా ప్రొడక్షన్ టీముల కోసం. ఇంకోటేమిటంటే,  చాలా మంది రచయితల స్క్రీన్ ప్లేలు ప్రొడక్షన్ కే నోచుకోవు. నా స్క్రీన్ ప్లేలు చాలా అలా మూలన పడున్నాయి. చిన్న కథో నవలో అచ్చవడానికి చాలా మాధ్యమాలున్నాయి. కానీ స్క్రీన్ ప్లేలు చాలా వ్యయప్రయాసలతో సినిమాలుగా వెండి తెరకి మాత్రమే ఎక్కాలి. ఎక్కకపోతే అవెన్ని రాసినా విలువ లేదు.

మీరు దేన్నిఇష్టపడతారు – రచనా, దర్శకత్వమా? ఎందుకు?
         
రచన కంటే దర్శకత్వం చాలా సులభమన్పిస్తుంది. దర్శకత్వానికి రాసింది చేతిలో వుంటుంది. అది చూసుకుని చకచకా తీసుకుంటూ పోవడమే, ఎంత వేగంగా నైనా తీసుకుంటూ పోవచ్చు. వేగం తగ్గితే వ్యయం పెరుగుతుంది. దర్శకత్వం దానికదే వేగాన్ని నింపుకుని వుంటుంది. రచన కొచ్చేటప్పటికి చేతిలో తెల్ల కాగితం తప్ప మరేమీ వుండదు. ఇక్కడ చకచకా వేగం సాధ్యం కాదు. ఒక్కో తెల్లకాగితం నింపే సరికి తలప్రాణం తోకకొస్తుంది. వేగం సంగతి అవతల పెడితే, అసలేం రాయాలో తెలిస్తే రాయడం కూడా సులభమవుతుంది. రాసింది ఎలా తీయాలో తెలిస్తే దర్శకత్వం సులభమైనట్టు. నాకు రెండూ తెలిసినప్పుడు రెండూ ఇష్టపడతాను.

సినిమాలకి రాయడానికీ, టీవీకి రాయడానికీ తేడా చెప్పండి.
         
కాలమే తేడా. సినిమాలకి స్క్రీన్ ప్లేలు రాయాలంటే నెలలు, కొన్ని సార్లు సంవత్సరాలూ  పడుతుంది. అదే టెలిప్లే కి వారంవారం రాసేస్తూ వుండాలి. కంటెంట్ లో తేడా : స్క్రీన్ ప్లే ఆ ఒక్కదాంతో ముగిసిపోతుంది, టెలిప్లే లు ఎంతకీ ముగియవు.

స్టూడియోలుగానీ, నిర్మాతలుగానీ  జోక్యం చేసుకోకపోతే,   మీ ఒరిజినల్ విజన్ ని ఎంతవరకూ మీరు తెరపైకి తీసుకు రాగల్గుతారు?
         
ఒరిజినల్ విజన్ అనేది కేవలం ప్రారంభ అభినివేశమని నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. ఎవరి జోక్యం వున్నా, నేను స్వతంత్రంగా తీసినా,  సినిమా నిర్మాణమనేది నిరంతర రాజీ ప్రక్రియ. పరిస్థితులు ఒకలా వుండవు. పరిస్థితుల్ని బట్టి మారడానికి మనం సిద్ధంగా వుండాలి. ఐతే నాకొచ్చిన ఆలోచన అయినా , ఇతరులకి వచ్చిన ఆలోచన అయినా బెటర్ గా వుంటే దానికోసం పోరాడతాను. వొరిజినల్ విజన్ ప్రారంభంలోనే  వుంటుంది. అది ప్రాక్టికల్ విజన్ గా తర్వాత మారుతూ వుంటుంది.

మీకు పిల్లలూ కుటుంబం వుండడం రచయితగా, దర్శకుడుగా మీపై ఎలాటి ప్రభావం చూపుతోందంటారు?
          పిల్లలు - కుటుంబం వీటికంటే ముందు వృత్తిగతంగా ఇంకో కష్టాన్ని ఎదుర్కొన్నాను. పెళ్లి కంటే ముందు, పిల్లల కంటే ముందు,  నేను రచయిత నుంచి దర్శకుడిగా పరిణామం చెందే క్రమాన్ని చాలా క్లిష్టంగా ఫీలయ్యాను. రచయిత కుండే నైపుణ్య పరిధి వేరు, దర్శకుడికుండే నైపుణ్య పరిధి వేరు. రచయిత తన లోంచి తీసిస్తాడు, దర్శకుడు ఇతరుల నుంచి తీసుకుంటా
డు. రచయిత ప్రతి ఒక్కరి విజన్ నీ పరిగణన లోకి తీసుకోవాల్సిన నైపుణ్య పరిధిలో వుంటాడు. నిర్మాత, దర్శకుడు, నటీనటులు,  వీళ్ళందరి విజన్ తో బాటు, తన విజన్ ని కూడా దృష్టిలో పెట్టుకుని రాస్తాడు. ఇలాకాక దర్శకుడు ప్రతి ఒక్కరి పనిని  జల్లెడ పట్టి తన విజన్ లోకి మార్చుకుంటాడు. సినిమా కోసం పనిచేసే నటీనటుల్ని, సాంకేతికుల్ని  అందర్నీ పరికరాలుగా వాడుకుని తాననుకున్న విధంగా సినిమాని తీర్చి దిద్దుకుంటాడు. ఇలా పరస్పర విరుద్ధ దృక్పథాలు ఎక్కడా వుండవు రాయడం తీయడం ఒక్కరే చేస్తున్నప్పుడు. ఇవి రెండూ పూర్తి పరస్పర వ్యతిరేక మైండ్ సెట్టులు. కాబట్టి నా రచయిత మైండ్ సెట్ ని దర్శకుడి మైండ్ సెట్ గా మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాను.  అలా ఓ మూవీకి దర్శకత్వం వహిస్తున్నప్పుడు, ఆ నటుల్లో జేమ్స్ కేన్ ఒకరు. నా స్ట్రగుల్ ని ఆయన కనిపెట్టి ఒకటే అన్నారు - చూడూ, నీకిష్టమున్నా లేకున్నా ఇది నీ మూవీ. ఇంకొకరి మూవీ కానే కాదు. ఇక్కడ నాతో బాటు యాక్టర్స్ అందరం  పిల్లల్లాంటి వాళ్ళం. మేమేం చేయాలో నువ్వు చెప్పాలని కోరుకుంటాం. నువ్వు చెప్పకుండా మాతో మొహమాట పడి, మాకే వదిలేసి, మా దృష్టిలో నువ్వు చాలా మంచివాడివని  అన్పించుకోవాలనుకుంటే మాత్రం దెబ్బతిని పోతావ్. నీకేం కావాలో డిమాండ్ చేసి మాతో చేయించుకో. మమ్మల్ని నీ విజన్ లోకి మార్చుకో- అని మందలించారు. సెట్ లో నియంతలా బిహేవ్ చేసే దర్శకులని చూశాను. నేను క్రియేటివ్ పర్సన్ ని అన్పించుకోవాలని మెత్తగా ప్రవర్తిస్తున్నాను. దీని వల్ల దర్శకుడిగా విఫలమవుతానని గుర్తించాను. తన క్రియేటివిటీ కోసం దర్శకుడు నియంతలా మారి ఇతరుల టాలెంట్ ని పిండుకోవాల్సిందేనని అప్పుడు తెలుసుకున్నాను.


          తర్వాత నాకు పెళ్ళయి పిల్లలు పుట్టాక, పేరెంట్ గా నేనెలా వుండాలో నేర్చుకున్నాను. పెరెంటింగ్ అంటే హద్దుల్ని ఏర్పర్చడమే. పిల్లల్ని వాళ్ళ స్వేచ్ఛ కొదిలేస్తూనే,  వాళ్ళు దారి  తప్పకుండా చూడ్డం. జేమ్స్ కేన్  ఇదే అర్ధంలో చెప్పివుంటారు. దర్శకత్వమంటే ఇదే.

నటన కష్టమంటారా, దర్శకత్వం కష్ట మంటారా?
          నటనే కష్టమంటాను. ప్రతీ వొక్కరూ - మళ్ళీ నొక్కి చెప్తున్నాను -  ప్రతి వొక్కరూ దర్శకులవ్వచ్చు. కానీ కెమెరా ముందు కొచ్చి అందరూ నటించలేరు. హావభావాల్ని ప్రదర్శించలేరు. ఐతే ఒక మంచి దర్శకుడు చెడ్డ నటుణ్ణి మంచి పాత్రలో నటింప జేసి మంచి నటుడుగామార్చవచ్చు. కానీ ఆ నటుడు తన లోపాల్ని అలా ఎంత కాలమూ కప్పిపుచ్చలేడు. అదే చెడ్డ దర్శకుడు ఎక్కడా దొరికిపోకుండా  విజయవంతమైన దర్శకుడుగా కొనసాగగలడు.

దర్శకుడిగా మీరు ప్రేక్షకుల పట్ల ఏ విషయంలో అసంతృప్తి ఫీలవుతారు?
          కొన్నిసార్లు ప్రొడక్షన్ విశేషాలు చూసి ఇది ఫ్లాపవుతుందని ముందే చెప్పేస్తూంటారు ప్రేక్షకులు. కావొచ్చు. కానీ అలాంటి అంచనాలకి మేం రాలేం.  బయటి నుంచి చెప్పడం వేరు, లోపల పని చేయడం వేరు. నిర్మాణం పూర్తయ్యేవరకూ స్పష్టత రాదు. నిర్మాణంలో వున్నప్పుడు ఆ నిర్మాణంలో పడి కొట్టుకుపోతాం. ఎక్కడికి చేరుకుంటున్నామో మాకే తెలీదు. ‘మిషన్ ఇంపాసిబుల్ –రోగ్ నేషన్’ తీస్తున్నప్పుడు తీసుకుంటూనే  పోయాం. కొన్ని కొన్ని తీస్తున్నవి దెబ్బతీస్తాయని తెలుసుకునేప్పటికి చాలా ఆలస్యమైపోయింది. ఈ నేర్చుకున్న పాఠాలతో  తర్వాతి మూవీలో జాగ్రత్తలు తీసుకున్నాను. ప్రేక్షకులు ముందే జాతకం చెప్పేయడం ఈజీ, మేం తెలుసుకోవడం ఈజీ కాదు. ప్రేక్షకులు గ్రహించాల్సిన ఇంకో విషయమేమిటంటే,  ఎవరూ కావాలని చెడ్డ సినిమా తీయరు. మంచి సినిమా తీయాలనే మంచి ఉద్దేశాలతో సంకల్పిస్తాం. ఐతే  పరిస్థితులు ఎదురుతిరిగే పరిస్థితులు కూడా వస్తాయి.
***
.