తారాగణం : కీర్తీ సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం :చిరంతాన్ దాస్
బ్యానర్ : వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
విడుదల : జనవరి 28, 2022
***
“You’ve got to ask
yourself one question: ‘Do I feel lucky?’ Well, do ya, punk?”
—Clint Eastwood in ‘Dirty Harry’
“No,
sir. Its fucky.”
తెలుగు
వాడైన నగేష్ కుకునూర్ 1998 లో కొత్తగా వచ్చి, ఉండీ
లేని టాలెంట్ తో ’హైదరాబాద్ బ్లూస్’
తీసి ఫేమస్ అయిపోయాడు. అప్పట్నుంచీ వరుసగా హిందీ, ఇంగ్లీష్
భాషల్లో 15 సమాంతర సినిమాలు తీసి రెండు జాతీయ అవార్డులూ, 7
అంతర్జాతీయ అవార్డులూ సాధించాడు. ఇంత పేరు ప్రఖ్యాతులు గడించాక, తెలుగులో తన మొదటి సినిమా తీయాలన్పించి కీర్తీ సురేష్ తో ‘గుడ్ లక్ సఖీ’ తీశాడు. దీన్ని ప్రప్రథమంగా ‘స్పోర్ట్స్ రోమెడీ’ (స్పోర్ట్స్ + రోమాన్స్ +
కామెడీ) జానర్ లో తీస్తున్నానని చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఎందుకో ఇతర
భాషల్లో విడుదల చేయకుండా, తెలుగు ప్రేక్షకులకే ప్రత్యేకం
చేసి వారి పాదాల ముందుంచాడు. మరి ఈ సినిమా చూస్తూంటే పాదాలు కుదురుగా వుంటాయా, మధ్యలో లేచి పరిగెడతాయా?
కీర్తీ
సురేష్ నటించిన ‘మిస్ ఇండియా’ చూసి స్క్రిప్టులు
కాస్త చూసి సెలెక్టు చేసుకోవమ్మా అని ట్విట్టర్ లో ప్రేక్షకులు ఆల్రెడీ ఆర్తనాదాలు
చేసి వున్నారు. మళ్ళీ ఆమె అదే పని చేసింది. కుకునూర్ కి స్టోరీ నేరేషన్ రాదు.
స్క్రిప్టులిచ్చి చదువుకోమంటాడు. అలా కుకునూర్ నుంచి మంచి బరువైన బౌండెడ్
స్క్రిప్టు అందుకుంది కీర్తీ సురేష్. అది చదివింది. అందులో లిఖించిన సువర్ణాక్షర కథ
ఇలా వుంది...
అది రాయల సీమలోని ఒక
గ్రామం. అక్కడో లంబాడీ తండా. ఆ తండాలో సఖి (కీర్తీ సురేష్) అనే లంబాడీ యువతి. ఈమె దురదృష్ట
జాతకురాలని అందరి నమ్మకం. ఈమె ఎదురొస్తే కీడే జరుగుతుందని చిన్న చూపు. ఈ కారణంగా ఈమెకి
పెళ్ళి కూడా కుదరదు. ఈ బ్యాడ్ లక్ సఖీకి గోలీలన్నా, గురి
చూసి కొట్టాలన్నా బలే ఉత్సాహం. ఇలాటి ఈమెకి గోలి రాజు (ఆది పినిశెట్టి) అనే నాటక
నటుడితో స్నేహం. సూరి (రాహుల్ రామకృష్ణ) అనే
ఇంకో దోస్తు కూడా వుంటాడు గానీ, ఇతనంటే పడదు.
ఇలా వుండగా,
ఒక రిటైర్డ్ కల్నల్ (జగపతి బాబు) గ్రామాని కొస్తాడు. షూటింగ్ గేమ్స్ లో కొందర్ని తయారు చేయాలని
ఆశయం పెట్టుకుని వస్తాడు. తయారు చేసి నేషనల్ గేమ్స్ కి పంపాలని లక్ష్యం. ఈ కల్నల్
కి సఖిని తీసికెళ్ళి పరిచయం చేస్తాడు రాజు. గురి చూసి కొట్టే ఆమె టాలెంట్ చూసి ట్రైనింగులో
చేర్చుకుంటాడు కల్నల్. తీరా ఆ ట్రైనింగ్ తో గేమ్స్ పంపాలనుకుంటే ఆమె దృష్టి షూటింగ్ మీద వుండదు. అపార్ధంజేసుకుని విడిపోయిన గోలిరాజు మీద
వుంటుంది. మరోవైపు ఆమెని ప్రేమిస్తూ సూరి వుంటాడు. ఇలా గాడి తప్పిన ఈమెని లక్ష్యం
వైపుకి కల్నల్ ఎలా నడిపించాడన్నది మిగతా కథ.
ముందే చెప్పుకున్నట్టు ఇది ప్రప్రథమ
స్పోర్ట్స్ రోమెడీ దర్శకుడి పరిభాషలో. పూర్వ మెప్పుడో పేపర్లో ఒక వార్త చదివాడు.
ఒక గ్రామీణ యువతికి ఆటల్లో వున్న ఆసక్తి గురించి. ఐతే స్పోర్ట్స్ కథని ఒక గ్రామీణ యువతి ప్రధాన పాత్రగా తీద్దామని ఈ కథ
రాశాడు. దీనికి ప్రేమని, కామెడీనీ జోడిస్తే స్పోర్ట్స్ రోమెడీ ఐపోతుందని బౌండెడ్
స్క్రిప్టు తయారు చేసి కీర్తీ సురేష్ కరకమలాలలో వుంచాడు. ఆమె ఆ స్క్రిప్టుని
షోమాన్ రాజ్ కపూర్ ఎంత పవిత్రంగా భావించి స్క్రిప్టులు చదివేవాడో, అంత భక్తి శ్రద్దలతో చదివింది కుకునూర్ ఇంటర్నేషనల్ ఫేమస్ కాబట్టి.
అందుకని ఇది ‘మిస్ ఇండియా’ ని మించిన
మాగ్నమ్ ఓపస్ అవుతుందని తప్పకుండా భావించడంలో ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదు. హీరోయిన్లని
తెలివిలేని గ్లామర్ డాల్స్ గా, కరివేపాకు పాత్రలుగా
సినిమాల్లో చూపిస్తారని విమర్శిస్తారు గానీ, ఎడ్యుకేటెడ్
హీరోయిన్లు చదివి ఓకే చేసే స్క్రిప్టులు
అంతకన్నా ఘోరంగా వుంటాయని తెలుసుకోవడం మంచిది. కీర్తీ సురేష్ సువర్ణాక్షరాలతో కుకునూర్
అందించిన సింగిల్ స్టార్ రేటింగ్ స్క్రిప్టు ని భక్తి శ్రద్దలతో కళ్ళకద్దుకుంది.
కుకునూర్ కి స్టోరీ నేరేషన్ రాదు, కీర్తీకి స్క్రిప్టు రీడింగ్ రాదు. ఇంకేం కావాలి ఇద్దరి జోడీ కలవడానికి? ఇద్దరూ కలిస్తే అది రాంబో కాంబో. గన్ పట్టుకుని కీర్తీ, పెన్ పట్టుకుని కుకునూర్ రాంబో కాంబో. ఈ స్పోర్ట్స్
రోమేడీలో స్పోర్ట్స్ లేదు, రోమాన్స్ లేదు, కామెడీ లేదు. కీర్తిని ప్రత్యేకంగా లంబాడీ పాత్రలో చూపించడంలో
ఉద్దేశమేమిటో తెలీదు. వూరికే అలా చూపిస్తే ముందు పబ్లిసిటీ వస్తుంనదనుకున్నట్టుంది. ఈ సినిమా చూస్తూంటే ఎవరికైనా కామన్ సెన్సు దొలుస్తూ వుంటుంది-
తండాలో మూఢనమ్మకాల బాధితురాలైన బ్యాడ్ లక్ సఖి, వాటి మీద
తిరుగుబాటు చేయడం ఈ కథవుతుంది కదాని...
తండా అందాల బాలగా కీర్తీ సురేష్
అలనాటి పల్లెటూరి ఆడే పాడే హీరోయిన్లని గుర్తుకు తెస్తుంది. కాకపోతే విజయ నిర్మల
లా అట్లతద్ది పాట పాడలేదు ఉయ్యాలెక్కి. జమునలా కట్టె తుపాకెత్తుకుని... అని కూడా
పాడలేదు. కుకునూర్ ఆ సినిమాలు చూసివుండడు. కానీ తెలుగు నేలతో తన సంబంధాలు తెగిపోయి
దశాబ్దాలు గడిచాక, ఇప్పుడు కూడా తెలుగు నేల అదే తను చూసిన నేలలాగే
వుంటుందని ఫీలైపోయి సఖిని ఆహార్యం సహా అలా ఆడించాడు. పాత్రకి క్రీడలో, ప్రేమలో, కామెడీలో ఎక్కడా ఫీల్ లేదు. నటన కూడా
పేలవం.
జగపతి బాబు పాజిటివ్ పాత్రలో బాగానే
కనిపిస్తాడు. కానీ ఎందుకని క్రీడా కారుల్ని తయారు
చేయాలనుకుంటాడో తెలియదు. నాటక నటుడి పాత్రలో ఆది పెనిశెట్టికి ఈ సినిమా వృధా. డిటో
రాహుల్ రామకృష్ణ.
ఇక దేవీశ్రీ ప్రసాద్ సంగీతం గురించి
అసలు పట్టించుకోలేదు. కథ విని ఇంతకంటే అవసరం లేదనుకున్నాడేమో, పాటలు ఏదో సర్దేశాడు. కెమెరా వర్క్ సహా ప్రొడక్షన్ విలువలు మాత్రం టాప్
హీరోయిన్ కాబట్టేమో బావుండేట్టు చూసుకున్నారు.
‘గుడ్ లక్ సఖీ’ అని టైటిల్ పెట్టేంత గుడ్ లక్కేమీ లేదు కుకునూర్
ప్రయత్నంలో. బేసిగ్గా కథ ఎలా చేసుకోవాలో
కూడా తెలియలేదు. ఈ కథని కీ శే హృషీకేశ్ ముఖర్జీతో కొలాబరేట్ అయి
తీద్దామనుకున్నాట్ట. ఆ పని చేసినా బావుండేది. హృషికేశ్ చేతిలో కడుపుబ్బా నవ్వించే
స్పోర్ట్స్ కామెడీ అయ్యేది. ఆయన నవ్వించడం మొదలెడితే ఇంకెలాటి నాన్సెన్స్
పెట్టుకోడు. బ్యాడ్ లక్ తెస్తుందని వూరంతా అనుకునే హీరోయిన్ లక్కీ ఛార్మ్ గా ఎలా
మారుతుందో కథ చెప్పకుండా- స్పోర్ట్స్,
రోమాన్స్, కామెడీలతో ఏం చెప్పాడో కుకునూర్ అర్ధం గాదు. స్పోర్ట్స్
కీ, రోమాన్స్ కీ అసలు కనెక్షనే లేదు. ప్రారంభ దృశ్యాలే కథ
క్వాలిటీని చెప్పేస్తాయి. మనకి తెలియకుండా పాదాలు అప్పట్నించే ఎలాగో అన్పిస్తూంటాయి.
ఏమిటా అని చూసుకుంటే పరారీకి తయారీ చేసుకుంటున్నాయన్న మాట. పరారైతే రివ్యూ ఎలా? అందుకని చివరి దాకా పాదాల్ని గట్టిగా పట్టుకుని కూర్చోవడం. సినిమాలు ఇలా
తీసి, టికెట్ల ధరలు పెంచేస్తే చిన్న సినిమాలు బతకవని గొడవ
చేయడంలో అర్ధముందా? రెండు మూడొందలు పెట్టి ఇలాటి
సినిమాలెవరైనా చూస్తారా?
ఇంకా అవే టెంప్లెట్ స్పోర్ట్స్
సినిమాలేమిటి? తండాలో మూఢనమ్మకాల బాధితురాలైన సఖి, గన్ షూటింగ్ ట్రైనింగుతో కలిసొచ్చిన అవకాశాన్నంది పుచ్చుకుని, ట్రైనింగ్ పూర్తవగానే గన్ తో జంపై- మూఢ నమ్మకాలనే మూర్ఖత్వం మీదా, మూఢ నమ్మకాలతో తనకి పెళ్ళవకుండా చేస్తున్న మూర్ఖుల మీదా తిరుగుబాటు ఫన్
డ్రామా క్రియేట్ చేయకుండా?
గ్రామీణ పేద యువతులు స్పోర్ట్స్ కెళ్ళాలంటే చాలా సమస్యలుంటాయి. కట్టడి, అణిచివేత, వివక్షా వగైరా. స్పోర్ట్స్ లో నారీ విజయమనే అరిగిపోయిన పాత ఫార్ములా తర్వాత - ముందు బ్యాక్ గ్రౌండ్ లో క్లీనప్ చేయాల్సిన అడ్డుపడే సామాజిక చెత్త చాలా వుంది. సమాజాన్ని చదివి, సమాజంలోంచి కథలు తీసి సమాంతర సినిమాలు తీస్తూ ప్రశంసలు పొందుతున్న నగేష్ కుకునూర్ తీయాల్సిన సినిమా మాత్రం కాదిది.
గ్రామీణ పేద యువతులు స్పోర్ట్స్ కెళ్ళాలంటే చాలా సమస్యలుంటాయి. కట్టడి, అణిచివేత, వివక్షా వగైరా. స్పోర్ట్స్ లో నారీ విజయమనే అరిగిపోయిన పాత ఫార్ములా తర్వాత - ముందు బ్యాక్ గ్రౌండ్ లో క్లీనప్ చేయాల్సిన అడ్డుపడే సామాజిక చెత్త చాలా వుంది. సమాజాన్ని చదివి, సమాజంలోంచి కథలు తీసి సమాంతర సినిమాలు తీస్తూ ప్రశంసలు పొందుతున్న నగేష్ కుకునూర్ తీయాల్సిన సినిమా మాత్రం కాదిది.
—సికిందర్