రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, జనవరి 2022, శుక్రవారం

1124 : మలయాళం రివ్యూ!


 

బ్రోడాడీ (మలయాళం)
రచన -
దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్
తారాగణం: మోహన్‌లాల్
, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా, లాలూ అలెక్స్, కళ్యాణీ  ప్రియదర్శన్, నీహా, సౌబిన్ సాహిర్, ఉన్ని ముకుందన్ తదితరులు
స్క్రీన్ ప్లే: బిబిన్ మాలికల్
, శ్రీజిత్, సంగీతం: దీపక్ దేవ్, ఛాయాగ్రహణం : అభినందన్ రామానుజం
బ్యానర్ : ఆశీర్వాద్ సినిమాస్
నిర్మా
: ఆంటోని పెరుంబవూర్
విడుదల : జనవరి 26, 2022 (డిస్నీ+హాట్‌స్టార్)
***

            టీవల అయ్యప్పనుమ్ కోషియమ్’, కోల్డ్ కేస్ భ్రమరం వంటి సినిమాల్లో నటించిన మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ తో లూసిఫర్ కి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తిరిగి మోహన్ లాల్ తో ఇప్పుడు బ్రో డాడీ అనే  కామెడీకి దర్శకత్వం వహిస్తూ, మోహన్ లాల్ సరసన కొడుకు పాత్ర వేశాడు. ‘బ్రోడాడీ కి హిందీ కామెడీ బధాయీ హో (2018) లోని తల్లిదండ్రుల లేట్ ప్రెగ్నెన్సీ అనే సమస్యకి, సహజీవనంతో ఇంకో ప్రెగ్నెన్సీని కౌంటర్ గా పెట్టి ఫ్యామిలీ డ్రామా కామెడీ తీశాడు. ఒక ఐడియాని ఇంకో ఐడియాతో    సంకరం చేసి కొత్త కథ సృష్టించాలనుకోవడం దర్శకుడుగా పృథ్వీరాజ్ సుకుమారన్ తలపెట్టిన మంచి ప్రయత్నం. 2011 లో  డేనియల్ క్రేగ్, హారిసన్ ఫోర్డ్, ఒలీవియా వైల్డ్ లతో దర్శకుడు జాన్ ఫెవ్రూ కౌబాయ్స్ అండ్ ఎలియెన్స్ అని కౌబాయ్ లకీ, గ్రహాంతర జీవులకీ పోరాటం పెట్టి, ఇది వరకు రాని వినూత్న అనుభూతినిచ్చే కొత్త కౌబాయ్ మూవీని సృష్టించాడు. ఐడియాల్ని సంకరం చేయొచ్చు, అయితే అది బెడిసి కొట్టకుండ కూడానూ చూసుకోవాలి... 

కథ

కేరళలో బిజినెస్ మాన్ జాన్ కట్టాడి (మోహన్ లాల్) కి భార్య అన్నమ్మ (మీనా),  కుమారుడు యేషూ (పృధ్వీరాజ్ సుకుమారన్) వుంటారు. యేషూ బెంగుళూరు లో  యాడ్ కంపెనీలో పనిచేస్తూంటాడు. ఇంకో వైపు జాన్ స్నేహితుడు కురియన్ (లాలూ అలెక్స్) కుటుంబం వుంటుంది. కురియన్ కి భార్య ఎల్సీ (కనిహా), కూతురు అన్నా (కళ్యాణీ ప్రియదర్శన్) వుంటారు. కూతురు అన్నా కూడా బెంగుళూరులో జాబ్ చేస్తూంటుంది. ఈ కొడుకూ కూతుళ్ళతో పరస్పరం వియ్యమొందడం మంచిదని రెండు కుటుంబాలూ ఆలోచిస్తూంటాయి. బెంగుళూరులో వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తెలీదు. సమయం చూసి ఇంట్లో చెప్పి పెళ్ళి చేసుకుందామనుకుంటారు వాళ్ళు. ఇంతలో అన్నా అనుకోకుండా గర్భవతవుతుంది. యేషూ కంగారుపడతాడు. ఇలావుండగా వెంటనే వూరికి వచ్చేయమంటూ  తండ్రి జాన్ నుంచి కాల్ వస్తుంది. వూరికెళ్ళిన యేషూకి తండ్రి జాన్, తల్లి అన్నమ్మ ఏదో చెప్పాలని చెప్పలేక పోతూంటారు. మీ అమ్మ తల్లి కాబోతోందని జాన్ కొడుక్కెలా చెప్పాలి? జాన్ సమస్య ఇదైతే, కొడుకు యేషూ సమస్య-  తన కాబోయే పెళ్ళాం తల్లి కాబోతోందని తల్లిదండ్రుల కెలా చెప్పాలి? ఇదీ కథ.

ఎలావుంది కథ

దాసరి 'తూర్పు పడమర' లో ఇలాటిదే రక్త సంబంధాల్ని ప్రశ్నార్ధకం చేసే కథ. 1973 లో హాలీవుడ్ లో ‘40 క్యారట్స్అనే సినిమా వచ్చింది. ఇది బేతాళ కథలా వుంటుంది. దీన్ని తమిళంలో కె బాలచందర్ కమల్ హాసన్, శ్రీవిద్య, జయసుధ, మేజర్ సౌందరరాజన్, రజనీ కాంత్ లతో 1975 లో అపూర్వ రాగంగళ్గా తీశారు. దీన్నే దాసరి నారాయణరావు 1976 లో నరసింహ రాజు, శ్రీవిద్య, జయసుధ, సత్యనారాయణ, మురళీమోహన్ లతో తూర్పు పడమరగా తీశారు.

          ఇందులో నరసింహ రాజు, శ్రీవిద్యలు ప్రేమించుకుంటారు, జయసుధ, సత్యనారాయణలు ప్రేమించుకుంటారు. జయసుధ శ్రీవిద్య కూతురని, నరసింహరాజు సత్యనారాయణ కొడుకని కథ మధ్యలో తెలిసి షాక్ తింటారు. ఇప్పుడేం చేయాలి? చిక్కు ముడి నెలా విప్పాలి? తండ్రీ కొడుకులు తల్లీ కూతుళ్ళని ప్రేమించారు. తండ్రి తెలియక ఓ కూతుర్ని ప్రేమిస్తే, కొడుకు ఆ కూతురి తల్లి అని తెలీక ఆ తల్లిని ప్రేమించాడు. ఇప్పుడు ఎవరికెవరు ఏమవుతారు?

        'బ్రో డాడీ'లో అత్తాకోడళ్ళు గర్భవతులయ్యారు. ఇది ఇబ్బందికర పరిస్థితే. దర్శకుడు ఈ పరిస్థితిని సృష్టించి బాగానే షాకిచ్చాడు ప్రేక్షకులకి, బావుంది, దీనితర్వాత కథ ఎలా నడపాలో తెలియక చేతులెత్తేశాడు. తండ్రీ కొడుకులు తమ కెదురైన పరిస్థితిని  ఎలా చెప్పాలో తెలియక పడే తిప్పలతో ఫస్టాఫ్ వరకే కామెడీ చేసి కథ నడపగలిగాడు. ఆ తర్వాత సెకండాఫ్ లో ఈ సంకరం చేసిన రెండు ఐడియాలతో ఏమీ చేయలేక వదిలేశాడు.

        సంకరం చేసిన ఐడియాల్లోంచి లేట్ ప్రెగ్నెన్సీని పక్కన బెట్టేసి, సహజీవనంతో గర్భం సమస్య ఒకటే తీసుకుని సెకండాఫ్ రోటీన్ లవ్ స్టోరీగా మార్చేశాడు. కూతురు అన్నాని గర్భవతి యేషూ మీద అన్నాతండ్రి కురియన్ కోపం, పగసాధింపు డ్రామాగా, రెండు కుటుంబాల మద్య సంఘర్షణగా మార్చేశాడు. ఈ సంఘర్షణ కూడా కుదరక హడావిడిగా ముగించేశాడు.

నటనలు - సాంకేతికాలు

తండ్రి పాత్రలో మోహన్ లాల్ కొడుక్కి తన విషయం చెప్పుకోలేని సున్నిత పరిస్థితిని నటించడంలో నీటైన పాత్ర పోషణే చేశాడు అనుభవంతో. అలాగే తల్లి పాత్రలో మీనా కూడా.  కొడుకుగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తండ్రి తో చేసే బ్రోమాన్స్ కామెడీ బాగానే నటించాడు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వుండే బ్రోమాన్స్ అలాటి పరిస్థితులతో తండ్రితో బ్రో డాడీగా మారిందంతే. ఇక హీరోయిన్ తండ్రి కురియన్ గా లాలూ అలెక్స్, తల్లిగా నీహా, కూతురుగా హీరోయిన్ కళ్యాణీ  ప్రియదర్శన్ డీసెంట్ గా నటించారు. అందరి నటనలూ అద్భుతం. కానీ నటించింది ఏం కథ! నటనలొక్కటే  సినిమాని నిలబెడతాయా? ఇందుకనే థియేటర్ రిలీజ్ కి నిలబడదని జాగ్రత్తపడి ఓటీటీకి అమ్మేశారు.  

        కనులకింపైన లొకేషన్స్ తో కెమెరా వర్క్ వుంది, వీనుల విందుగా సంగీతముంది. సుకుమారన్ దర్శకత్వమూ బావుంది. కానీ దర్శకత్వం వహించింది ఏం కథ!

చివరికేమిటి?

కౌబాయ్స్ అండ్ ఎలియెన్స్ కి సహ నిర్మాతైన స్టీవెన్ స్పీల్ బర్గ్ ప్రీ-ప్రొడక్షన్ సమయంలో దర్శకుడ్ని, రచయితల్ని కలిసి స్క్రిప్ట్ వర్క్ ని, ఆర్ట్ వర్క్ ని పరిశీలించాడు. పరిశీలించి, దర్శకుడు జాన్ ఫెవ్రూ కి కొన్ని క్లాసిక్ కౌబాయ్ సినిమాలు అందించాడు. అంతేగాక వాళ్ళని ప్రైవేట్ స్క్రీనింగ్ కి ఆహ్వానించి కౌబాయ్ సినిమాలు వేసి చూపిస్తూ, ప్రాపర్ గా కౌబాయ్ ఎలా తీయాలో వివరించాడు. అలాగే ఎలియన్స్ తో సైన్స్ ఫిక్షన్ కథగా కౌబాయ్ ని ఎలా తీయాలో కూడా సూచనలిచ్చాడు.

        హైబ్రిడ్ ఐడియాతో ప్రాపర్ గా సినిమా ఎలా తీయాలో అనుభవజ్ఞుల సలహా తీసుకుని వుండాల్సింది పృథ్వీరాజ్ సుకుమారన్.

—సికిందర్