రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, November 10, 2025

1401 : పాత్రోచితానుచితాలు

    భూమాదేవి (రశ్మికా మందన్న) పీజీ కోర్సులో చేరుతుంది. అదే కాలేజీలో విక్రం (దీక్షిత్ శెట్టి) వేరే పీజీ చేస్తూంటాడు. ఇద్దరూ వేర్వేరు హాస్టల్స్ లో వుంటారు. గర్ల్స్ హాస్టల్లో బాయ్స్, బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తూంటారు. మేనేజిమెంట్ డోంట్  కేర్ అన్నట్టు వుంటుంది. ప్రొఫెసర్ పాత్ర వేసిన దర్శకుడు కూడా మీటూ డోంట్ కేర్ భయ్యా అన్నట్టే వుంటాడు. ఇలాటి లాజిక్ లేని సీన్లు ఎందుకు వేశారనేది తర్వాత అర్ధమౌతుంది. ఎందుకంటే భూమా  తండ్రి హాస్టల్ కొచ్చినప్పుడు ఆమె గదిలో విక్రం తో పట్టుబడాలి కాబట్టి, కథా సౌలభ్యం కోసం హాస్టల్స్ లో ఆ లాజిక్ లేని సీన్లు చూపిస్తూ వచ్చారు. ఇక బయట ఒక సంఘటనలో భూమా, విక్రం ఎదురెదురు పడతారు. విక్రం వెంటనే ప్రేమలో పడతాడు. భూమా బెరుకు బెరుకుగా, పిరికిగా వుంటుంది. ఆమెకి తల్లిలేదు, వున్న తండ్రి (రావురమేష్) క్రూరత్వంతో వుంటాడు. తను మంచి పేరు తెచ్చుకుంటే తనతో తండ్రి ప్రవర్తన మారవచ్చన్న ఆశతో ఆమె వుంటుంది.



ప్రేమలోనే గాక పడకలోనూ పడుతుంది భూమా. ఆమె వేరే అబ్బాయితో మాట్లాడడం అతను సహించడు. అతడ్ని వేరే స్టూడెంట్ దుర్గ (అనూ ఇమ్మాన్యుయేల్) ప్రేమిస్తూ వుంటుంది. తనకి అమ్మలా చూసుకునే అమ్మాయి కావాలని, ఆ లక్షణాలు భూమాలో వున్నాయనీ చెప్పేస్తాడతను. దుర్గ డ్రాప్ అయిపోతుంది. ఇది విన్న భూమా అమ్మలాగే అతడికి సేవలు చేస్తూంటుంది. ఇది గమనించిన దుర్గ - నువ్వు విక్రంతో హేపీగా వున్నవాని అడుగుతుంది. భూమా దగ్గర సమాధానముండదు. విక్రంతో ఆమె లైఫ్ విక్రంతోనే ఎండ్ అయిపోతుందనీ, ఆమెలో  స్పార్క్ వుందనీ, అది పూర్తిగా చచ్చి పోతుందనీ హెచ్చరిస్తుంది దుర్గ.  భూమా ఆలోచనలో పడుతుంది. తండ్రి లాగే విక్రం కూడా తనకి స్వేచ్ఛనివ్వకుండా కంట్రోల్లో వుంచుతున్నాడని అర్ధం జేసుకుంటుంది.


ఒక రోజు ఇంటికి తీసికెళ్ళి కాబోయే కోడలిగా తల్లికి పరిచయం చేస్తాడు.  ఆ తల్లి (రోహిణి) మాటలు రాని మూగదానిలా, మానసిక రోగిలా వుంటుంది. ఇంట్లో ఈసురోమని వాతావరణ ముంటుంది. తర్వాత అతడి మాటల్లో తండ్రి ఎలాటి వాడో, అతడి వల్ల తల్లి ఎలా అయిందో గ్రహిస్తుంది. తను జాబ్ చేయవచ్చా అంటే వద్దంటాడు. తనని ఎంతో బాగా చూసుకునే అమ్మకి అమ్మలా వుండాలి కదా అంటాడు. తనతో ముగ్గురు పిల్లల్ని కనాలంటాడు. భూమాకి ఇక్కడ బ్రేకప్ కి బీజం పడిపోతుంది.


ఆమె బ్రేకప్ చెప్పడంతో ఆమెకోసం పిచ్చెత్తి పోతాడు. హింసాత్మకంగా మారతాడు. ఆమె లొంగదు. ఇతడితో వ్యవహారం అటు ఆమె తండ్రికీ తెలిసిపోయి హాస్టల్లో నానా రచ్చ చేస్తాడు. ఇక లాభం లేదని విక్రంని వదిలించుకోవడానికి తిరగబడుతుంది. అతడికి బుద్ధి చెప్పి బయట పడుతుంది. ఇదీ కథ.



ఏది టాక్సిక్ రిలేషన్ షిప్? 

    దీన్ని టాక్సిక్ (విషపూరిత)  రిలేషన్ షిప్ కథ అన్నారు. ఇందులో టాక్సిక్ ఏముంది. ఆమె బ్రేకప్ చెప్తే అతను ఉన్మాదిలా మారడమా. ఆమె బ్రేకప్ చెప్పాక  రిలేషన్ షిప్పే లేనప్పుడు టాక్సిక్ రిలేషన్ షిప్ ఎలా అయింది. అతను అల్ఫా మేల్ కూడా ఎలా అయ్యాడు. అతడితో రిలేషన్ షిప్ లో వున్నప్పుడు ప్రేమతోనే వున్నాడుగా. తన బందీగా చేసి బానిసగా మార్చుకోలేదుగా. బలవంతంగా పడక మీదికి లాగ లేదుగా. ఆమె ఇష్టంతోనే పడక పంచుకుంది. ఆమెలో అమ్మలా చూసుకునే అమ్మాయిని చూస్తున్నప్పుడు అతనెక్కడ హద్దు మీరి ప్రవర్తించాడు. ఏ విషయంలో ఆమె స్వేచ్చని హరించాడు. 


అతడి గురించి దుర్గ అలా చెప్తే ఎలా నమ్ముతుంది. అతను అలాటి వాడైతే దుర్గ అతడ్ని ఎందుకు ప్రేమించింది. అతను కాదన్నాక వచ్చి అతడి గురించి అలా చెప్తోందంటే భూమాకీ అతడికీ మధ్య పుల్లలు పెట్టడానికా. అతడితో వుంటే తనలో వున్న స్పార్క్ చచ్చిపోతుందా. వ్యక్తిత్వం లేకుండా దుర్గ ప్రకారం తన నమ్మకాల్ని మార్చుకుని ఏ రిలేషన్ షిప్ లో వుంటుంది. ఇది తెలుసుకోకుండా, విక్రం పట్ల వ్యతిరేకతని  పెంచుకుని- దుర్గని శ్రేయోభిలాషిగా మార్చుకుని, వెంటేసుకు తిరుగుతోంటే అతడ్ని రెచ్చగొట్టినట్టు కాదా. అయినా అతనేమీ అనలేదే. 


అతను ఇంటికి తీసికెళ్ళి తల్లికి పరిచయం చేయడంతోనే వచ్చింది  సమస్య. ఆమెకి లాగే అతడికీ మెచ్యూరిటీ లేదు అంత వయస్సొచ్చి పీజీ చేస్తున్నాక. కామన్ సెన్స్ లేదు. అతడి తల్లిని తండ్రి ఆ స్థితికి నెట్టేస్తే తీసికెళ్ళి మానసిక వైద్యం చేయించక, తనని ప్రేమగా చూసుకుంటోందని, సేవలు చేస్తోందని మురిసిపోయి, ఇలాటి అమ్మలాటి అమ్మాయే కావాలని కోరికలు పెట్టుకున్నాడు. ఆమె భర్తతో పంచుకో లేకపోయిన ప్రేమ కొడుకుతో పంచుకుంటోంది. అప్పుడా కొడుకు బాధ్యత ఏమిటి. ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయడమా, ఆమెని అలాగే వుంచి ఆమె లాంటి పెళ్ళాం కావాలనుకోవడమా. మానసిక రోగిని చూసి ఏ  అమ్మాయి వస్తుందని నమ్ముతున్నాడు. 


అతను ఆమెని ఇంటికి తీసుకు వెళ్ళినప్పుడు అతడి తల్లి కటకటాల తలుపు మూస్తుంది. జైలు కుండే కటకటాల తలుపులాంటిది. ఇది సింబాలిజం.ఈ సింబాలిజం ఎలా వుందంటే -రామ్మా రా, నువ్వు కూడా రా, నా మొగుడు నన్నిలా చేశాడు, ఇక నాకొడుకు నిన్నూ నన్నులా చేస్తాడు ఈ జైల్లోనే, రా- అన్నట్టే వుంది సీను. 


సినిమా ప్రారంభంలో ఇంకో సింబాలిజం వుంది. భూమా బాగా బరువున్న పెద్ద సూట్ కేసుని హాస్టల్లో చేరుతూ మెట్లపైకి లాగలేక లాక్కొస్తూ వుంటుంది. అంటే ఆమెకి ఎదురవబోయే రిలేషన్ షిప్ కథ ఈ సూట్ కేసులా, గుదిబండ కాబోతోందన్న మాట. కానీ ఆ సూట్ కేసులో ఆల్రెడీ ఆమె క్రూరుడైన తండ్రి వున్నాడు, తర్వాత వికారంగా విక్రం తల్లి రాబోతోంది,  మధ్యలో అక్రమంగా దుర్గ డార్లింగ్ జాయినయ్యేది వుంది. 


అతను జాబ్ వద్దనీ, అమ్మ వయసైపోయింది కాబట్టి ఇంటి పట్టున వుండాలనీ, తనకి ముగ్గురు పిల్లల్ని కనాలనీ చాదస్తం చెప్పినప్పుడు ఆమె బ్రేకప్ చెప్పేస్తే అతను ఆలోచించుకోకుండా  ఉన్మాది అయ్యాడు. ఆమెని పొందడం కోసం సైకోలా మారాడు. దీంతో ఆమె తట్టుకోలేక తప్పించునే మార్గాలు వెతికింది. ఈ పరిస్థితి ఆమె కల్పించుకున్నదే. ఇప్పుడు ఇక్కడ్నుంచీ ఇది టాక్సిక్ రిలేషన్ షిప్ కథ అవుతుందా. మధ్యలో తలెత్తిన పరిణామాల పర్యవసానంగా కాకుండా, స్వాభావికంగా అతను మొదట్నుంచీ సైకోలా వుంటే అప్పుడు టాక్సిక్ రిలేషన్ షిప్ అవచ్చేమో. ఇప్పుడు పేరు మార్చి కొత్తగా అన్పించేలా టాక్సిక్ రిలేషన్ షిప్ అంటున్నది ఒకప్పుడు వచ్చిన సైకో కథలే. చిరంజీవి- జయప్రదలతో కె. బాలచందర్ తీసిన ‘47 రోజులు’, చిరంజీవి- జయసుధ- కమల్ హాసన్ లతో బాలచందరే తీసిన ‘ఇది కథ కాదు’ ప్రేమలో, సంసారంలో సైకో కథలే. కానీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ వచ్చేసి టాక్సిక్ కాలేదు, సైకో కాలేదు. 


ఆమె చేసే మంచి పనులు:

 మంచి పనులు చేసి తండ్రిని మార్చుకోవాలనుకున్న తను, చిటికెలో సర్వస్వం విక్రంకి అర్పించేసింది. ఇది మంచి పనా. తనలో అమ్మలా చూసుకునే అమ్మాయుందని అతననగానే కరిగిపోయి సేవలు చేసింది. అంతేగానీ, వీడేంటి అమ్మకూచిలా వున్నాడని, అమ్మ కొంగు చాటు చంటాడిలా వున్నాడని అప్పుడే బ్రేకప్ చెప్పేయలేదు. కానీ ఇప్పుడతను తల్లికి పరిచయం చేశాక అతడి షరతులు వినగానే- చిటికెలో బ్రేకప్ చెప్పేసి దులుపేసుకుని వెళ్ళిపోవడం తన క్యారక్టర్ ఏమిటో బైట పెట్టుకున్నట్టుంది. కాస్త ఆగి- నీకు మీ  ఇంట్లో మదర్ ప్రాబ్లం, నాకు మా ఇంట్లో ఫాదర్ ప్రాబ్లమ్ కదా, ముందు వీటిని సాల్వ్ చేసుకుందాం - అని వుంటే అతను ఆలోచించేవాడేమో. అప్పుడు ఇది వేరే కథవుతుంది. తప్పక అవుతుంది. ప్రేమకథలోకి  పేరెంట్స్ కథ లాగితే  ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే పాత్ర తన కథ తను నడపాలి కాబట్టి. ఇలాగాక పాత్ర కోసం  కథకుడు కథ నడిపితే ఇలాటి అర్ధం లేని పాసివ్ పాత్రలు, టాక్సిక్ కథా వస్తాయి. 


అసలీ కథలో ఆమెకి తండ్రితో సమస్య, అతడికి తల్లి సమస్యా వుండకూడదు. వున్నందు వల్ల రిలేషన్ షిప్ లో చెప్పాలనుకున్న పాయింటు చెదిరిపోయింది. ఎందుకంటే ఈ రెండు  సమస్యల వల్ల మూడు కాన్ఫ్లిక్టులు ఏర్పడ్డాయి- రిలేషన్ షిప్ లో కాన్ఫ్లిక్ట్ సహా. ఎంత కన్ఫ్యూజన్. వుండాల్సింది ఒక్క రిలేషన్ షిప్ లో కాన్ఫ్లిక్టు మాత్రమే. ఒక కథలో ఒక కాన్ఫ్లిక్టు కి మాత్రమే అనుమతి వుంటుంది, ఆమెకి తండ్రితో ప్రాబ్లం, అతడికి తల్లి ప్రాబ్లం పెడితే వీటి బై ప్రొడక్టే రిలేషన్ షిప్ కథ అన్నట్టు ప్రాధాన్యం కోల్పోయింది ప్రధాన కథ.


కథంటే తప్పొప్పుల ఆర్గ్యుమెంట్- దానికో జడ్జిమెంటూ. ఈ జడ్జిమెంటు ప్రధాన పాత్ర గెలవాలి. ప్రధాన పాత్ర గెలవాలంటే ప్రత్యర్ధి పాత్రకి జస్టిఫికేషన్ వుండకూడదు. కానీ విక్రం క్యారక్టర్ని  జస్టిఫై చేశాడు దర్శకుడు అతడింట్లో పరిస్థితి  చూపించి. తండ్రి బాదితురాలు తల్లే కాదు, తండ్రి వల్ల తనూ బాధితుడయ్యాడు- మానసికంగా ఎదగక అన్నట్టు. ఇట్లా ప్రత్యర్ధి పాత్ర పట్ల సానుభూతి ఏర్పడితే, ప్రధాన పాత్ర అతడ్ని వదిలించుకోవడానికి తిట్టి దండించి గెలిచానని చప్పట్లు కొట్టించుకుని చెక్కేయడం ఆటవికం అన్పిస్తుంది. 


మంచి కథంటే ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చి ముగిసేది. సినిమా కథల మీద ఇరవై ఏళ్ళు అజ్ఞాతంలో కెళ్ళి పరిశోధన చేసి ల్యాండ్ మార్క్ బుక్ రాసిన జేస్ బానెట్ చెప్పే మాట!


-సికిందర్