రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, August 17, 2015

నాటి సినిమా






          
సినిమా చూస్తున్నప్పుడు ఆ కథలో  ఏర్పాటయ్యే సమస్య తో ఆసక్తిని రేపి, ఆలోచింప జేయడం వేరు. ఆ ఆలోచనని, ఆసక్తినీ  సహేతుకమైన, సమగ్రమైన పరిష్కార మార్గం దిశగా నడిపి ప్రేక్షకుల్ని సంతృప్తి పర్చడం పూర్తిగా వేరు. మొదటిదే జరిగి, రెండోది జరగని సినిమాలే ఎక్కువ. చాలా అదృష్టం కొద్దీ రెండూ జరిగాయంటే, ఇక ఆ సినిమాని జీవితాంతం మర్చిపోలేరు ప్రేక్షకులు! 

          ‘జీవితచక్రం’ అనే సినిమానీ ఇంకో జన్మకి కూడా మర్చిపోలేరు ప్రేక్షకులు!

          ‘జీవిత చక్రం’ అనగానే, ‘సుడిగాలిలోన దీపం..’ అనో, లేదా ‘మధురాతి మధురం మన ప్రేమ మధురం..’  అనో శంకర్ -జైకిషన్ ల సంగీతంలో ప్రజాదరణ పొందిన పాటలెలా మెదులు లుతాయో- అలా ఆ పాటలతో పోటీ పడుతూ కథా సంవిధానమూ సయ్యాటలు పోతుంది.

          ఒక ముక్కోణ ప్రేమకథలో నెలకొల్పిన కథా పథకానికి త్యాగాన్ని కేంద్ర బిందువు చేసినప్పుడు, ఆ ప్రేమలో ఆ మూడు పాత్రల్లో ఒక దాన్ని ఆ  త్యాగం పేరుతో పీక నులిమి పరిష్కారం చెప్పడం - హాయిగా సృజనాత్మక శ్రమ నుంచి పలాయనం చిత్తగించే దర్శకులు చేసే పనే.

          ఇందుకు ప్రతిగా కథల మీద పట్టున్న దర్శకుడు ఆ పాత్రల మధ్య ఏర్పడ్డ సమస్యకి సర్వామోద యోగ్యమైన పరిష్కారాన్ని చూపించి ప్రశంస లందుకుంటాడు. ఈ రెండో కోవకి చెందిన దర్శకుడే స్వర్గీయ సీఎస్ రావు.

          వారసత్వం ఉద్యోగ భద్రత నివ్వచ్చు. వృత్తి నైపుణ్యం స్వయం కృషితోనే అలవడుతుంది. 1925 లో ‘భక్త మార్కండేయ’ అనే తొలి తెలుగు మూకీని పూర్తిగా తెలుగు గడ్డ మీద నిర్మించిన గొప్ప దర్శకుడు సి. పుల్లయ్య తనయుడిగా సీఎస్ రావు ( చిత్తజల్లు శ్రీనివాస రావు) చిన్ననాటి నుంచే తండ్రి నిర్మించే సినిమాల్లో నటిస్తూ, 1953 కల్లా దర్శకుడిగా మారారు. ‘పొన్ని’ అనే తొలి సినిమా తమిళంలో తీశాక -


       ఇంకో తమిళం కూడా తీసి, అప్పుడు 1955 లో తెలుగులో ‘శ్రీకృష్ణ తులాభారం’ తీసి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, మలయాళ, ఒరియా భాషల్లో 70 వరకూ సినిమాలకి దర్శకత్వం వహించారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఆయన సంపాదించుకున్న అనుభవమే 1963 లో తండ్రి అనారోగ్య కారణాలతో ఆగిన ఆల్ టైం ఎవర్ గ్రీన్ క్లాసిక్  ‘లవకుశ’ చివరి భాగానికి తానే  దర్శకత్వం వహించి పూర్తి చేశారు. ‘మసక మసక చీకటిలో..’ వ్యాంప్ తార రాజసులోచన భర్తగా మళ్ళీ కొత్త పాపులారిటీని సంపాదించుకుని వుంటే ఉండొచ్చు గాక-  జీవితపు చరమాంకంలో ఆ పెళ్లి విఫలమై దుర్భర జీవితాన్నే గడపాల్సి వచ్చింది. సినిమా కథలకి అర్ధవంతమైన ముగింపులు పలికే తనే తన జీవితాన్నెలా ముగించుకోవాలో తెలుసుకోకపోవడమే ఆయన జీవితంలో అతి పెద్ద విషాదమేమో!

     
          ‘జీవిత చక్రం’ ఆయన అందించిన క్లాస్ క్రియేషన్. కమర్షియల్ గా వుంటూనే కళ్ళు చెమర్చే సీరియస్ నెస్ తో సుఖాంతమయ్యే ముగ్గురి జీవితాల కథ ఇది. నందమూరి తారకరామారావు, వాణిశ్రీ, శారద లు రోమాన్స్ బరిలో; చిత్తూరు వి. నాగయ్య, హేమలత, శ్రీరంజని, జగ్గయ్యలు జడ్జిమెంటు గుడిలో; రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రావికొండలరావు అండ్ కోలు కామెడీ బడిలో; ప్రభాకరరెడ్డి విలనీ కోటలో సమన్వయం చేసుకుని, ఒక అర్ధవంతమైన సినిమాగా రక్తి కట్టిస్తారు దీన్ని.

     ఇందులో ధర్మారావు ( నాగయ్య) కొడుకు రాజా ( ఎన్టీఆర్) విదేశాల్లో చదువుకుని వస్తాడు. తండ్రి వ్యాపారం చూసుకోమంటే, వినకుండా సరదాగా తిరుగుతూంటే, ఒకనాడు సుశీల ( వాణిశ్రీ) పరిచయమవుతుంది. ఈమె చిన్నపాటి ఉద్యోగం చేస్తూ, తల్లి ( శ్రీ రంజని) ని, చెల్లి ( శ్యామల) నీ పోషించుకుంటూ వుంటుంది. ఇంతవరకూ బాగానే వుంది. కానీ జూదం పిచ్చిగల తండ్రి ( రమణా రెడ్డి), లాటరీల పిచ్చోడైన అన్న పిచ్చేశ్వర్రావ్( పద్మనాభం), ఇంకో ముదిరిన బ్రహ్మచారి మేనమామ బుచ్చేశ్వర్రావ్( రేలంగి) ..ఈశుద్ధ వేస్టు మగ మూక పోషణాభారం కూడా తన మీదే పడుతుంది. ఈమెకి తన జీవితానుభావాల్లోంచి ఒకటే పుట్టింది- డబ్బున్న వాళ్ళంటే అసహ్యం!

          అందుకని డబ్బున్న రాజా నిరుపేదగా నటిస్తూ ఈమెకి దగ్గరవుతాడు. ప్రేమించి, ప్రేమించేట్టు చేసుకుంటాడు. ఓసారి మేనత్త ( హేమలత) ఊరి కెళ్తాడు. తల్లి లేని తనని ఈమే పెంచి  పెద్ద చేసింది. కూతురు కమల ( శారద) పుట్టగానే ఇతడి తోనే పెళ్ళనుకుని అన్న ధర్మారావు దగ్గర మాట కూడా తీసుకుంది.

      కానీ రాజా మాత్రం కమలని ఆ దృష్టితో చూడ్డం లేదు. కమల మాత్రం ఆ దృష్టితోనే చూస్తూ చాలా కలలు కంటోంది. ఇహ పెళ్ళనుకునే సరికి, రాజా సుశీల గురించి చెప్పేసి పెద్ద తుఫాన్నే సృష్టిస్తాడు. తండ్రి కుమిలిపోతాడు. కమల కృశించి జబ్బున పడుతుంది. ఆ ప్రాణాంతక జబ్బుతో చివరి కోరిక ఒకటే కోరుతుంది : ఈ క్షణంలో రాజా చేత తాళి కట్టించుకుని తృప్తిగా కన్ను మూయాలని.

          రాజా ఆమె కోరిక తీరుస్తాడు. ఆ తర్వాతే కథ అడ్డం తిరుగుతుంది- కమల బతికి బాగుపడుతుంది! కలవర పడిపోతుంది. ఏం చేసింది తను? అనుకున్న దేమిటి, జరిగిందేమిటి? నమ్మి తాళి కట్టిన రాజాతో ఇప్పుడెలా? ఇప్పుడెలా నూరేళ్ళ జీవితాన్ని అతడితో పంచుకోవాలి? ఈ లోకం లోంచి వెళ్ళిపోవాల్సిన తనే  ఇలా సుశీలకి అడ్డు అయ్యిందేమిటి? ఇందులోంచి ఎలా బయట పడాలి? ఎలా? ఏమిటి మార్గం?

       ఇదీ విషయం. ఇంతకంటే చెబితే గతంలో ఈ సినిమా చూడని పాఠకుల సీడీ వీక్షణానుభావాన్ని భంగపర్చినట్టే అవుతుంది. ఒక్కటి చెప్పుకోవచ్చు : గొప్ప సస్పెన్సుని పోషిస్తూ  సీఎస్ రావు ఈ క్లిష్ట పరిస్థితిని కొలిక్కి తెచ్చిన తీరుని చూసి ప్రతి ఒక్కరూ మెచ్చుకుని తీర్తారు. ఒకసారి మనం జాన్ ట్రూబీ అనే వెయ్యి సినిమాలకి పైగా స్టోరీ కన్సల్టెంట్ గా పనిచేసిన హాలీవుడ్ స్క్రిప్ట్ డాక్టర్ ఇంటర్నెట్ లో ఏం రాశారో చూస్తే..  ‘ప్రేమకథల్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఐతే పైకి చూస్తే సులభంగా తోచే ఈ ప్రేమ కథల్ని రాయడమే చాలా కష్టమైన పని. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి : ఒక మంచి ప్రేమకథ ఇతర అన్ని రకాల కథలకంటే కూడా అత్యంత బలమైన  ప్రభావం చూపగలదు. ఎందుకంటే, అది ప్రేక్షకులకి వాళ్ళ జీవితాల్లో ప్రేమకున్న అర్ధమేమిటో స్పష్టంగా తెలిసేట్టు చేస్తుంది గనుక!’

          దట్సిట్, సరీగ్గా  ‘జీవిత చక్రం’ తో  సీఎస్ రావు ఈ పనెప్పుడో పూర్తి చేశారు. ఎన్టీఆర్, వాణిశ్రీ, శారదల పాత్రలతో పగా ప్రతీకారాలకి తావివ్వని ఏకతాటి పైకి వాటిని తెచ్చి, వాటి మధ్య ప్రేమానురాగాలనే చాటారు. చాటుతూ ప్రేమలో భిన్న కోణాల్లో త్యాగ ప్రయత్నాల్ని చూపి, మనమెన్ని రకాలుగా ప్రేమకి బద్ధులం కావచ్చో తెలిపారు. అందుకే  ఓ పట్టాన ఈ సినిమాని మర్చిపోవడం సాధ్యం కాదు. నవశక్తి ప్రొడక్షన్స్  పి. గంగాధర రావు నిర్మాణంలో 1.1.1971 న విడుదలైన ఈ మ్యూజికల్ హిట్ లో ఆరుద్ర సినారె లు రాసిన అన్ని పాటలూ శంకర్- జైకిషన్ ల సంగీత సారధ్యంలో ఇప్పటికీ అలరిస్తాయి. నవశక్తి ఫిలిమ్స్ యూనిట్ సమకూర్చిన కథ, స్క్రీన్ ప్లేలకి విద్వాన్ కణ్వశ్రీ మాటలు రాశారు.

***
కదిలించే ఒక సన్నివేశం

కదిలించే సన్నివేశం సినిమా మొత్తానికీ డెప్త్ తీసుకురావచ్చు. 

          పరిస్థితుల దృష్ట్యా ఎన్టీఆర్ శారదకి కి తాళి కట్టిన తదనంతర పరిణామాల్లో మిత్రుడు జగ్గయ్య వచ్చి నిలదీస్తారు ఎన్టీఆర్ ని. ఈ విషయం వాణిశ్రీకి చెప్పకుండా అన్యాయం చేస్తున్నారనీ, ఆమె మోసగాడను కోవచ్చనీ, కనుక వెంటనే వెళ్లి జరిగింది చెప్పేయమనీ హెచ్చరించి వెళ్ళిపోతారు.

          ఇది గమనించిన ఎన్టీఆర్ తండ్రి నాగయ్య,  ‘నువ్వు చేసిన బుద్ధి లేని పనికి లోకమేం అనుకుంటోందో చూశావా?’ అని నిలదీస్తారు. ఈ లోకంతో తన కవసరం లేదని ఎన్టీఆర్ అంటారు.

          ‘నీ కవసరం లేకపోతే మా పరువు ప్రతిష్ఠ లేంగావాలనుకున్నావ్. అసలీ విషయం ఇన్నాళ్ళూ అమ్మాయికి చెప్పకుండా ఎందుకీ నాటకా లాడుతున్నావ్?’ అని రెట్టిస్తారు నాగయ్య. ఆమెకి ఎప్పుడెలా చెప్పాలో తనకి బాగా తెలుసంటారు ఎన్టీఆర్.

          ‘ఏమిట్రా నీకు తెలిసిందీ? పెద్దల మాట లెక్క చేయకుండా స్వతంత్రించి,  ప్రశాంతంగా వున్న కొంప మీద కుంపటి పెట్టడం తెలుసు. దాని ఫలితం నువ్వూ నేనూ అందరమూ అనుభవిస్తున్నాం!’ అని నాగయ్య ఆగ్రహం మిన్నంటుతుంది.

          హర్టయిన ఎన్టీఆర్,  ‘నాన్నా, అందరిలాగా మీరూ అపార్ధం జేసుకుంటారని నేను కల్లో కూడా అనుకోలేదు. అందరి కన్నీళ్ళకూ నేనే కారణమైతే కావచ్చు. కానీ కావాలని ఎవరికీ ఏ  అన్యాయమూ చేయలేదు.. అత్తయ్యా! ‘ అంటూ హేమలత వైపు వెళ్లి- ‘ కమలని నాకిచ్చి పెళ్లి చేయాలని మీ మనసుసులో వున్న కోరిక నాకెప్పుడైనా చెప్పారా? హుఁ, లేదు.. కానీ అది నా ధర్మంగా భావించి నేనామెకు మాంగల్యం కట్టాను’  అనగానే, అటు పక్క వున్న శారద ఆర్తిగా చూస్తారు. ఎన్టీఆర్ కొనసాగిస్తారు- ‘ఎందుకు? ప్రాణం వదలడానికి సిద్ధంగా వున్న కమలని బతికించుకోవడానికి. అంతేగానీ ఆమె జీవితంతో చెలగాటా లాడ్డానిక్కాదు. మీ మనస్సుల్లో కోరికలు మీరే రగిలించుకుని నా జీవితంతో చెలగాటా లాడిన మనుషులు మీరు. ఈ రోజున అడ కత్తెరలో పోక చెక్కలా ముక్కలు ముక్కలయ్యేట్టు చేసింది మీరు. మీ అందరితో మంచిగా ఉండాలనుకున్న నన్ను ఈ రోజు పిచ్చివాణ్ణి చేసింది మీరు!’ అని ఆగి-

          ఒక నిశ్చయానికి వచ్చినట్టు-  ‘ మీ పరువు  ప్రతిష్టలకి భంగం కలగనక్కర్లేదు. ఈ కథకి ముగింపు బాగా తెలుసు. ఈ కథ ఎలా ముగించాలో బాగా తెలుసు..’ అని కసిగా అనేసి వెళ్లి పోబోతూంటే శారద వచ్చేసి కాళ్ళ మీద పడతారు. ఈ కథకి  ముగింపు తనకి వదిలెయ్యమని ప్రాధేయ పడతారు. ఆమెని విడిపించుకుని బయటికి వెళ్లి పోతారు ఎన్టీఆర్.

***
డైలాగ్ డైజెస్ట్


ఎన్టీఆర్ :

 *బంధుత్వాలు వేరు, బంధాలు వేరు నాన్నా.
*ఏ ధర్మం నిన్ను మారు మనువు చేసుకోకూడదని శాసించిందో, అదే ధర్మం నన్ను కూడా
నిన్ను వదిలి పెట్టొద్దని శాసించింది.
*అద్దంలో ఎన్ని ముఖాలైనా కన్పిస్తాయి, కానీ ఆత్మలో ఒకే లక్ష్యం.
*ఈ కథకి ముగింపు ( నాకు) బాగా తెలుసు, ఈ కథని ఎలా ముగించాలో (నాకు) బాగా తెలుసు.

వాణిశ్రీ :
*ఆలో లక్ష్మణా అని నేనేడుస్తూంటే హలో అంటూ మీరేమిటి?
* జీవితమంతా కన్నీటితో గడిపిన నేను, నవ్వుతూ ఈ బాధని అనుభవించ గలను. కానీ అది నీ వల్ల కాదు.
*మన మంచితనం వల్లే ఇందరి జీవితాలు బాధపడుతున్నప్పుడు, అన్ని ప్రశ్నలకూ ఒకే జవాబుగా మనమే ఆహుతై పోవడం మంచిదమ్మా.

శారద :
*నేను ఆయనకు చాలా దూరంలో వెలుగుతున గుడ్డి దీపాన్ని, నువ్వాయన మనసులో వెలుగుతున్న మాణిక్య దీపానివి.


సికిందర్
(జనవరి 2010 - సాక్షి ‘ఆ ఒక్క సినిమా’ శీర్షిక)