రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, సెప్టెంబర్ 2022, మంగళవారం

1219 : రివ్యూ!



రచన - దర్శకత్వం : ఆర్. బాల్కీ
తారాగణం : దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి, సన్నీ డియోల్, పూజా భట్, అమితాబ్ బచ్చన్ తదితరులు
కథ : ఆర్. బాల్కీ, స్క్రీన్‌ప్లే :  ఆర్. బాల్కీ, రాజా సేన్, రిషీ వీరమణి
సంగీతం: అమన్ పంత్, ఛాయాగ్రహణం : విశాల్ సిన్హా నిర్మాతలు : రాకేష్ ఝున్‌జున్‌వాలా, జయంతీ లాల్ గడా, అనిల్ నాయుడు, గౌరీ షిండే
బ్యానర్స్ : హోప్ ప్రొడక్షన్, పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల :  సెప్టెంబర్ 23, 2022
***

ర్శకుడు ఆర్ బాల్కీ (బాలకృష్ణన్) గత 15 ఏళ్ళుగా బాలీవుడ్ లో తీసినవి 8 సినిమాలే అయినా అవి ఎవరూ తీయలేని సినిమాలు. చీనీ కమ్’, నుంచీ పాడ్ మాన్ వరకూ చూసుకుంటే అన్నీ అవుటాఫ్ బాక్స్ ప్రయోగాలే. కొన్నిసార్లు ఆ బాక్స్ కూడా కనపడదు. బాక్సే లేని సినిమాలతో బాక్సాఫీసు విజయాలు. రెండుసార్లు ఉత్తమ చలన చిత్రం జాతీయ అవార్డులు, 4 సార్లు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో 5 విభాగాల్లో 17 నామినేషన్లు అతడి స్థాయిని తెలుపుతాయి. ఈసారి ప్రపంచ వ్యాప్తంగానే ఎవరి వూహకూ రాని ఐడియాతో సీరియల్ కిల్లర్ సినిమా తీశాడు. ఇందులో మలయాళ స్టార్ సల్మాన్ దుల్కర్ ని, బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ నీ, హైదరాబాద్ తెలుగు అమ్మాయిగా బాలీవుడ్ హీరోయిన్ అయిన శ్రేయా ధన్వంతరినీ ప్రధాన తారాగణంగా తీసుకుని, ఎవరూ వూహించని కొత్త కథ తెరకెక్కించాడు. అదేమిటో చూద్దాం...

కథ

ముంబాయిలో ఒక సీనియర్ సినిమా రివ్యూ రైటర్ (రాజా సేన్) హత్య జరుగుతుంది. ఎందుకు జరిగిందో, ఎవరు చేశారో అర్ధంగాదు క్రైమ్ బ్రాంచ్ ఐజీ అరవింద్ మాథుర్ (సన్నీ డియోల్) కి. హత్యచేసిన తీరు ఆశ్చర్య పరుస్తుంది. శవం మీద గాయాలు హత్యలా అన్పించవు, ఆర్టిస్టు గీసిన రేఖాచిత్రాల్లా వుంటాయి కత్తితో. నుదుట త్రికోణాకారం చెక్కి వుంటుంది. ఈ త్రికోణాకారం మీద దృష్టి పెడతాడు ఐజీ మాథుర్. దీనికి ఇంకో త్రికోణం కలిపితే నక్షత్రం గుర్తు వస్తుంది. ఒక త్రికోణమే వేశాడంటే సగం నక్షత్రమన్న మాట. అంటే సగం స్టార్. స్టార్స్ సినిమా రివ్యూలకిచ్చే రేటింగ్ గుర్తులు. అంటే హంతకుడు హతుడికి హాఫ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడన్న మాట.  

ఆ వారం విడుదలైన సినిమాకి రివ్యూ రైటర్ రివ్యూ రాస్తూ సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఇందుకు ఈ హత్య జరిగినట్టు అర్ధమవుతుంది. మళ్ళీ వారం ఇంకో రివ్యూ రైటర్ హత్య జరుగుతుంది. ఆ వారం విడుదలైన సినిమాకి అతనుకూడా మంచి రేటింగ్ ఇవ్వలేదు. రేఖా చిత్రకారుడుగా హంతకుడు అతడి శవాన్ని ఆర్టులా చెక్కి
, నుదుట సింగిల్ స్టార్ వేశాడు. రివ్యూరైటర్లు సినిమాలకి రేటింగ్ ఇస్తూంటే, హంతకుడు రివ్యూ రైటర్లని చంపి వాళ్ళకి అర్హమైన రేటింగ్ ఇస్తున్నాడన్న మాట.

ఈ పాటికి రివ్యూ రైటర్ల మీద పగబట్టిన సీరియల్ కిల్లర్ రంగంలో వున్నాడని అర్ధమైపోతుంది ఐజీ మాథుర్ కి. ఇక పూర్తి స్థాయిలో యాక్షన్ లోకి దిగిపోతాడు. డానీ (దుల్కర్ సల్మాన్) అని ఒక ఫ్లోరిస్టు వుంటాడు. నీలా (శ్రేయా ధన్వంతరి) అని ఒక సినిమా రిపోర్టర్ వుంటుంది. డానీ సుప్రసిద్ధ దివంగత దర్శకుడు గురుదత్ అభిమాని. గురుదత్ తీసిన కాగజ్ కే ఫూల్’, ప్యాసా క్లాసిక్స్ చూస్తూ ఆ పాటలు వింటూ వుంటాడు. ఇంతే క్లాసిక్ గా నీలాని ప్రేమిస్తూంటాడు. నీలాకో అంధురాలైన తల్లి (శరణ్య) వుంటుంది.

డానీ రెండు గ్లాసుల్లో టీ పోసుకుని తాగుతాడు. సైకిలు మీద తిరుగుతూ కస్టమర్స్ కి ఫ్లవర్స్ అందిస్తాడు. నీలాతో ప్రేమ గురించి తనలో తానే మాట్లాడుకుంటూ వుంటాడు. ఇంతలో ఇంకో హత్య జరుగుతుంది. ఎవరీ సీరియల్ కిల్లర్? వారానికో హత్య చేస్తున్నాడు. ఈ హత్యల్ని ఎలా అరికట్టాలి? సీరియల్ కిల్లర్ ని ఎలా పట్టుకోవాలి? ఇవీ ఐజీ మాథుర్ ముందున్న చిక్కు ప్రశ్నలు.

ఎలా వుంది కథ
పైన చెప్పుకున్నట్టు సీరియల్ కిల్లర్ జానర్ లో ఇంతవరకూ ఎక్కడా రాని కొత్త కథ. అల్టిమేట్ ఐడియా- సినిమా రివ్యూ రైటర్లని చంపడం. దర్శకుడు బాల్కి గురుదత్ అభిమాని. గురుదత్ తీసిన ప్యాసా (1957- ఇది తెలుగులో 1978 లో మల్లెపువ్వు గా రీమేక్ అయింది శోభన్ బాబుతో), కాగజ్ కే ఫూల్ (1958) రెండూ బ్యాడ్ రివ్యూల పాలబడి సమాధి అయిపోయాయనీ, ఇవే తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా నిలబడ్డాయనీ, కానీ గురుదత్ కాగజ్ కే ఫూల్ వైఫల్యం తర్వాత విరక్తితో దర్శకత్వం మానుకుని, 10 సినిమాలకి నిర్మాతగానే కొనసాగాడనీ, బ్యాడ్ రివ్యూలు అతడిలోని గొప్ప దర్శకుడ్ని చంపేశాయనీ, ఈ బాధ ఎలా వుంటుందో తెలిపేందుకే చుప్ తీశాననీ వెల్లడించాడు బాల్కీ.

అయితే రివ్యూ రైటర్ల మీద కక్ష గట్టినట్టు ఏమీ సినిమా తీయలేదు. కానీ బ్యాడ్ రివ్యూలు గురుదత్ కెరీర్ ని సమాప్తం చేశాయని అంటున్నప్పుడు
, తను ఈ సినిమా బ్యాడ్ రివ్యూలకి అవకాశం లేకుండా, లోపాలు లేకుండా చూసుకోల్సింది. ఇలా జరగలేదు. కథే తికమకగా మిగిలింది చివరికి. ఏం చెప్పాలని తీశాడో అర్ధం గాదు.

బ్యాడ్ రివ్యూ అనేది వుంటుందా
? సినిమా బ్యాడ్ గా వుంటే దాన్ని బట్టి రివ్యూ వుంటుంది. సినిమాలే బ్యాడ్ గా వుంటాయి, రివ్యూలు కాదు. నిష్పాక్షిక రివ్యూలు, నిర్మాణాత్మక విమర్శ బ్యాడ్ రివ్యూలు కాలేవు. ఉద్దేశపూర్వకంగా  సినిమాని దెబ్బతీసే  ఎజెండా రివ్యూలుంటాయి. డబ్బు తీసుకుని రాసే భజన రివ్యూలూ వుంటాయి. ఈ సినిమాలో బాల్కీ వివిధ పాత్రలద్వారా ఈ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశాడు.

 
విమర్శ సమాజానికి అవసరం. ఏ రంగం అభివృద్ది పథంలో సాగాలన్నా విమర్శ చాలా అవసరం. విమర్శే లోపాల్ని ఎత్తిచూపి ఎడ్యుకేట్ చేస్తుంది’... అబద్ధపు రివ్యూలు ప్రేక్షకుల కళ్ళు తెరిపించ లేవు, వాళ్ళ అభిరుచులు పెరిగేలా చెయ్యలేవు. ఇవి సినిమాలకి హాని కూడా చేస్తాయి’... సోషల్ మేడియాలో అందరూ రివ్యూలు రాస్తున్నప్పుడు ఇంకా వేరే రివ్యూల అవసరమేముంది?’... రివ్యూలు రాసే వాళ్ళందరూ క్రిటిక్స్ కారు. మూవీ ఎక్స్ పర్ట్స్ రాసే రివ్యూలు వేరు. వీళ్ళ రివ్యూల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తారు ... ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు.

కథ కొత్తది. రివ్యూ రైటర్ల హత్యల వల్ల బాలీవుడ్ లో ఏర్పడిన పరిస్థితికూడా చూపించాడు. చంపుతున్న సీరియల్ కిల్లర్ ఎవరో చివరి వరకూ సస్పెన్స్ లో వుంచకుండా ఇంటర్వెల్లో రివీల్ చేసేశాడు. దీని వల్ల ఎండ్ సస్పెన్స్ కథనం బారిన పడి బోరు కొట్టదు సినిమా. చివరి వరకూ నేరస్థుడెవరో సస్పెన్స్ లో వుంచే ఎండ్ సస్పెన్స్ కథలు ప్రింట్ మీడియా అయిన నవలల్లో బావుంటాయి గానీ, విజువల్ మీడియా అయిన సినిమాకి పనికిరావని హాలీవుడ్ ఏనాడో  గుర్తించి, ఎండ్ సస్పెన్స్ సినిమాలకి చెక్ పెట్టేసింది. అయినా ఇంకా ఇప్పటికీ తెలుగులో ఓదెల రైల్వే స్టేషన్’, కిరోసిన్ లాంటి ఎండ్ సస్పెన్సులు తీసి అట్టర్ ఫ్లాప్ చేసుకుంటున్నారు.

హాలీవుడ్ సీన్ టు సీన్ సస్పెన్స్ సినిమాలకి తెరతీసింది. ఇవి సక్సెస్ అవుతున్నాయి. సస్పెన్స్ అనే అంశానికి రెండు పార్శ్వాలుంటాయి- ఎవరు
? ఎందుకు? అనేవి. ఇవి రెండూ మూసి పెట్టి చివరివరకూ కథ నడిపితే అది ఎండ్ సస్పెన్స్ అవుతుంది. ఈ రెండు పార్శ్వాల్లో ఎవరు? అనేది చూపించేసి, ఎందుకు? అనేది చివరి వరకూ సస్పెన్స్ లో పెట్టుకోవచ్చు. ఎవరు? అనేది ఓపెన్ చేశాక, ఇక ఎలా పట్టుబడతాడనే సీన్ టు సీన్  సస్పెన్స్ తో కథనం చేస్తే సక్సెస్ అవుతుంది.

అయితే ఎందుకు
? అనే నేర కారణం చివర్లో ఓపెన్ చేసినప్పుడు బలంగా వుండాలి. లేకపోతే తేలిపోతుంది సినిమా. ఇదే జరిగింది చుప్ లో.  ఇంటర్వెల్లో సీరియల్ కిల్లర్ ఎవరో చూపించేసి, ఇక అతనెలా పట్టుబడతాడనే సీన్ టుసీన్ సస్పెన్స్ కథనం చేసు కొస్తూ, చివర్లో పట్టుబడ్డాక ఓపెన్ చేసిన నేర కారణం కన్ఫ్యూజుడుగా వుంది. ముగింపు పేలవంగా మారింది.

సీరియల్ కిల్లర్ చిన్నప్పుడు కుటుంబంలో జరిగిన ఒక ట్రాజడీని ఇప్పుడు రివ్యూ రైటర్ల హత్యలకి ముడిపెట్టి జస్టిఫై చేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. నడుస్తున్న కథా ప్రపంచానికి లోబడి సజాతి కారణం చూపించకుండా
, సంబంధం లేని చిన్నప్పటి విజాతి కారణం చూపించి మెప్పించాలనుకోవడం విచారకరం. ఒక దర్శకుడే రివ్యూల వల్ల తన కెరీర్ పరిసమాప్తమైందని కక్షగట్టి, రివ్యూ రైటర్లని చంపుతూ వుంటే, అది కథా ప్రపంచంలో ఒదిగే సజాతి కారణమవుతుంది.

నటనలు - సాంకేతికాలు
దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకి బలమే కానీ, సెకండాఫ్ లో సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రేమైనా ఇంకేదైనా నవ్వు మొహంతో సున్నితంగా వ్యవహరించే నటనతో ఓ ముద్రవేస్తాడు. అతడికి కోపం రాదు, ఆవేశపడడు. హాయిగా పూలు అమ్ముకుంటూ, గురుదత్ సినిమాలూ పాటలూ ఎంజాయ్ చేస్తూంటాడు. ఇతడి వల్ల సినిమాకో ఆకర్షణ వచ్చింది. హీరోయిన్ శ్రేయా ధన్వంతరి కూడా సినిమా రిపోర్టర్ గా, దుల్కర్ సల్మాన్ లవర్ గా  సింపుల్ గా వుంది. ఈమె తల్లిగా నటించిన శరణ్య అంధురాలి పాత్ర వల్ల కథకి లభించిన అదనపు ప్రయోజనం లేదు. ఆమెకి సీరియల్ కిల్లర్ ని చూసే అతీతశక్తి ఏదైనా వుంటే అది వేరు. ఆ సీరియల్ కిల్లర్ ఈమెకి కూడా స్పాట్ పెట్టి థ్రిల్ పెంచొచ్చు. ఐజీగా సన్నీడియోల్, క్రిమినల్ సైకాలజిస్టుగా పూజాభట్ ల ఇన్వెస్టిగేషన్ ప్రొఫెషనల్ టచ్ తో వుంది. పోలీస్ ప్రొసీజురల్ జానర్ మర్యాదలకి తగ్గట్టు.

కెమెరా వర్క్
, విజువల్స్ మిగతా బాల్కీ సినిమాల్లాగే టాప్ క్లాస్. పాటలు బ్యాక్ గ్రౌండ్ లో వస్తూంటాయి- జానేక్యా తూనే కహీ, వఖ్త్ నే కియా క్యా హసీన్ సితమ్, యే దునియా అగర్ మిల్ భీ జాయే... అన్నీ  ప్యాసా’, కాగజ్ కే ఫూల్  లలోని క్లాసిక్ హిట్సే. చివరి విషాద గీతం చిన్నప్పటి ముగింపు ఫ్యామిలీ దృశ్యాలకి డిస్టర్బింగ్ గా బ్యాక్ గ్రౌండ్ లో వస్తూంటుంది.

మొత్తానికి గురుదత్ కి నివాళిగా బాల్కీ తీసిన ఈ మూవీ రేటింగ్స్ 2/5 నుంచి 3/5 వరకు ఇచ్చారు. సెకండాఫ్ లో హత్యలు లేకుండా సీరియల్ కిల్లర్ ని ట్రాప్ చేయడానికి హీరోయిన్ని రివ్యూ రైటర్ గా ప్లాంట్ చేసే డ్రామా ఒక దశ దాటే టప్పటికి బోరే తప్ప ఏమీ లేదు. ఈ ట్రాప్ క్లయిమాక్స్ లో (ప్లాట్ పాయింట్ 2) ప్రారంభించాల్సింది. మరిన్ని హత్యలతో టెన్షన్  గ్రాఫ్ పెంచకుండా
, మిడిల్ 2 యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే కొనసాగించకూడా, సెకండాఫ్ పూర్తిగా ఇదే డ్రామా నడిపి, ముగింపుకి కూడా న్యాయం చేయని లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ సినిమా రచయితల్లో రివ్యూ రైటర్ రాజా సేన్ కూడా వున్నాడు.

—సికిందర్