రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

రివ్యూ..
 గూండే

 మాస్ బ్రోమాన్స్!
రణవీర్ సింగ్ , అర్జున్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, శౌరభ్ శుక్లా తదితరులు 
సంగీతం : సుహెయిల్ సేన్,  ఛాయాగ్రహణం : అసీం  మిశ్రా 
బ్యానర్ : యశ్  రాజ్ ఫిలిమ్స్,  నిర్మాత : ఆదిత్యా చోప్రా 
రచన- దర్శకత్వం :  ఆలీ అబ్బాస్ జాఫర్  , విడుదల : ఫిబ్రవరి 14, 2014
   ***   
మాస్ సినిమాల కోసం దక్షిణాది రీమేకుల మీద ఆధారపడుతున్న బాలీవుడ్ కి అలాటి అవసరం ఇక లేకుండా సొంత కార్ఖానా నుంచి కూడా తమదైన ఉత్పత్తి తీయొచ్చని ‘గూండే’ అనే ఈ పక్కా ఉత్తరాది నేటివిటీ తో వచ్చిన కమర్షియల్ నిరూపిస్తోంది. కావలసిన అన్ని హంగులూ, మసాలా మేళవించి రెండున్నర గంటల బోరు కొట్టని, బోల్డు బ్రోమాన్స్ (బ్రదర్ హుడ్ – రోమాన్స్) ని ఒలకబోస్తూ వాలెంటైన్స్ డే కి విచ్చేసిన ఈ యశ్ రాజ్ ఫిలిమ్స్ కానుక, 1970 ల నాటి కథాకమామిషుని ఆవిష్కరిస్తోంది. 
1970 ల నాటి నేటివిటీతోనే గత ఆగస్టు 15 న విడుదలైన అక్షయ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్ లు నటించిన ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబాయి- దొబారా’ దారుణంగా విఫలమైన చోటే, ‘గూండే’ నాటి కలకత్తా నేటివిటీతో సఫలమైంది. రెండూ యాక్షన్ - ప్రేమకథలే అయినప్పటికీ-  ‘గూండే’ –ప్రేమలోనే ఒదిగిపోయే యాక్షన్ ని నేర్పుగా జొప్పించి చప్పట్లు కొట్టించుకో గల్గుతోంది.

బాలీవుడ్ తాజా ట్రెండీ హీరోలు రణవీర్ సింగ్- అర్జున్ కపూర్ లు, హాట్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తో కలిసి మ్యూజికల్ రోమాన్స్ కి తెర తీశారు. ముక్కోణ ప్రేమకథని బొగ్గు గనుల చీకటి కోనల్లో మెరుపులా మెరిపించారు. ఆమె దృష్టిలో ఒకరు  వజ్రం అయితే, మరొకరు నల్ల బంగారం. ఆమె ప్రేమ కోసం ఈ రెండూ సంఘర్షించుకోవడం స్వయంకృతమేనా, లేక దీని వెనుకేమైనా వేరే చోదక శక్తులున్నాయా?

దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ 2011 లో ఇమ్రాన్ ఖాన్- కత్రినా కపూర్- అలీ జాఫర్ లతో ‘మేరే బ్రదర్ కీ దుల్హన్’ అనే కడుపుబ్బ నవ్వించే రోమాంటిక్ కామెడీతో-  కత్రీనాలోని కొత్త టాలెంట్ ని (అదరగొట్టే పూర్తి స్థాయి యాక్టివ్ పాత్ర తో)  బయట పెట్టించిన ఘనతతో,  ఇప్పుడు ప్రియాంకా చోప్రాలోని స్త్రీ సహజ లాలిత్యాన్నీ  చక్కగా వెలికి తీశాడు.

1970 లనాటి కథా కాలం నేటి హిందీ బాక్సాఫీసు విజయాల కొత్త ఫార్ములాగా ఎలా వర్కవుటవుతోందో చూడాలంటే అసలీ సినిమాలో విషయమేమిటో  తెలుసుకోవాలి..

బంగ్లా కాందీశీకులు – ఘరానా గూండాలు
1971 యుద్ధంలో భారత దేశం తూర్పు పాకిస్తాన్ ని విడగొట్టి బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేసిన నేపధ్యంలో జెనీవా శరణార్ధుల శిబిరంలో ఇద్దరు బాలలు- విక్రం, బాలా బాధలు పడతారు. ఒక ఆయుధాల స్మగ్లర్ వీళ్ళని ఉద్ధరించి వాడుకుంటాడు. తదనంతర పరిణామాల్లో పిల్లలిద్దరూ ఒక కాముకుడైన బ్రిగేడియర్ ని చంపి కలకత్తా పారిపోయి వస్తారు. పౌరసత్వం లేని వీళ్ళ ఉనికి ప్రశ్నార్ధకమౌతుంది. అవమానాలకి గురవుతారు. అసలు తామెవరు, ఏ దేశపు వాళ్ళు, ఇక్కడ్నించీ ఏమిటి జీవితం...లాంటి జవాబుదొరకని ప్రశ్నలతోనే బతుకులీడుస్తూ ఓ ఆలోచనచేసి – బ్రతుకుదెరువు కోసం బొగ్గు రవాణా చేసే రైళ్ళ మీద ప్రాణాలకు తెగించి దాడులు చేస్తూ ఆ బొగ్గుని అమ్ముకుంటూంటారు.

పెరిగాక కలకత్తానే శాసించే బడా గూండా లవుతారు. హేపీగా బొగ్గుతో బాటు చమురు, గ్యాస్, కలప స్మగ్లింగులు చేసుకుంటూ ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పిగా మారుతారు. ఒకపక్క స్కూళ్ళూ  ఆస్పత్రులూ కట్టించి ప్రజా సేవ చేస్తూంటారు. ప్రజానీకానికి దేవతల్లాగా వుంటారు. దందాలో వీళ్ళకి ప్రత్యర్ధు లెవరూ వుండరు. వేరే విలన్లూ శత్రువులూ ఎవరూ వుండరు- ఒక్క కొత్తగా వచ్చిన ఏసీపీ సత్యజిత్ సర్కార్ (ఇర్ఫాన్ ఖాన్) తప్ప.

విక్రం (రణవీర్ సింగ్), బాలా (అర్జున్ కపూర్) ఇద్దరూ ప్రాణానికి ప్రాణమిచ్చే కరుడుగట్టిన స్నేహితులు. పధ్నాల్గేళ్ళుగా వీళ్ళ మీద రుజువులు దొరకని కేసుల చిట్టాలు కట్టలుగా పేరుకుని పున్నాయి. వీళ్ళ కరుడుగట్టిన స్నేహాన్నీ, చట్టాలకి దొరకని వీళ్ళ దందాల్నీ ఎలాగైనా బద్దలు కొట్టాలనుకుని - ఏసీపీ సర్కార్ ఆ కేసుల కట్టల్ని మోసుకొచ్చి కౌన్సెలింగ్ చేస్తాడు. వాళ్ళు పగలబడి నవ్వి,  ఒక్క రుజువు చూపిస్తే ఏ కౌన్సెలింగూ అక్కర్లేకుండా చట్టానికి లొంగి పోతామంటారు. సర్కార్ అక్కడే ఆ ఫైళ్లని తగులబెట్టి- ఇక్కడ్నించీ మీ నేరాల్ని రుజువులతో సహా పట్టుకుని, మీ లంకలోంచి మిమ్మల్ని కుక్కల్ని ఈడ్చుకు పోయినట్టు ఈడ్చుకు పోతానని హెచ్చరించి  వెళ్ళిపోతాడు.

ఎంటర్ ది క్యాబరే డాన్సర్ నందితా (ప్రియాంకా చోప్రా).. కలకత్తా క్లబ్ యూరినల్స్ లో ఈమెతో యూత్ ఫుల్ గా  రోమాన్స్ లో పడి – దందా వదిలేసి బీట్లేయడం మొదలెడతారు. ఈమె ఎవరికి పడితే ఆ రెండో వాడు వదినగా ఒప్పుకుని తప్పుకోవాలని ప్రమాణాలు చేసుకుంటారు. ఆమెఎవరికీ పడదు సరికదా, ఓ రోజు సినిమాకి రమ్మని- ఆ సినిమాహాల్లో వెండి తెరమీద శ్రీదేవి పాటకి ఆగలేక స్క్రీన్ ముందు డాన్స్ వేస్తూంటే ఆకతాయిలు అడ్వాన్స్ అవుతారు. అప్పుడు తట్టుకోలేక ఓ ఆకతాయిని బాలా కాల్చి పారేస్తాడు. కేసు మెడకి చుట్టుకోవడంతో పారిపోమ్మంటాడు విక్రం.

కానీ తమ ప్రేమాయణం కొలిక్కి రాకుండానే ఎలా పారిపోవాలి? ప్రస్తుతానికి ప్రేమాయణానికి విరామం, పరిస్థితులు చక్కబడి నువ్వు తిరిగొచ్చాకే మొదలెడదాం, అంతవరకూ నేను నందితాని కూడా చూడను-అని మాటిచ్చి పంపుతాడు విక్రం. ఆపాటికే నందితా తనతో ప్రేమలో పడిందని విక్రంకి తెలీదు. ఆమె వచ్చి ప్రేమని ప్రకటించి- కాళీ మాతా నిమజ్జనోత్సవాలకి నువ్వొచ్చి నాతోపాటు హారతి పట్టకపోతే జన్మలో నీ మొహం చూడనని వెళ్ళిపోతుంది.

ఇప్పుడేం చేశాడు విక్రం? స్నేహితుడి కిచ్చిన మాట తప్పి నందిత కోసం వెళ్ళాడా? వెళ్తే పరిణామాలెలా వుంటాయి?నందితని కాదంటే ఏమవుతుంది? ఈ పరిస్థితిని ఏసీపీ సర్కార్ ఎలా వాడుకోగలడు? స్నేహితుల్ని విడదీసి పరస్పరం అస్త్రాలుగా ప్రయోగించగలడా? ఏం చేయగలడు? ఇక్కడ్నించీ ఏమౌతుంది?

Contd..