రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, November 17, 2021

1087 : ఓటీటీ న్యూస్



       లయాళ సినిమా రంగం - మాలీవుడ్- ఇవాళ ప్రేక్షకుల భాషే  సినిమా అన్నట్టుగా నాడీ పట్టుకుని ఓటీటీతో విశేషంగా లాభపడుతోంది. భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షక లోకాల్ని సొంతం చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. సినిమా బావుంటే ఏ భాష అనేది ప్రేక్షకులు చూడరు. వాళ్ళ భాషే సినిమా అయిపోతుంది. ఈ కొత్త నిర్వచనాన్ని పట్టుకుని భాషల కతీతంగా ద్వారాలు తెరిచిన ఓటీటీ విప్లవంలో పాలు పంచుకుంటూ కళకళ లాడుతున్నారు మలయాళ దర్శకులు, నిర్మాతలూ.

        ది తెలుగులో జరగాలంటే తెలుగులో ఇంకా చిన్న సినిమాలు ప్రయత్నించే కొత్త దర్శకులైనా పాత మూస ఫార్ములాల లోంచి బయటికి రావాలి. థియేటర్ సినిమాలకి మూస సినిమాలు ఒక విధంగా అవసరం కావొచ్చు. కానీ తీస్తున్న చిన్న సినిమాల క్వాలిటీకి థియేటర్ అనేది ప్రేక్షకులు తొంగి చూడరాని కర్ఫ్యూ ప్రాంతమైంది. ఆ చిన్న సినిమాలు ప్రేక్షకుల మీద లాఠీ చార్జో, ఫైరింగో జరుపుతాయని ప్రేక్షకుల భయం. ఓటీటీ విప్లవం సినిమా నిర్వచనాన్ని పూర్తిగా మార్చేస్తూ ప్రత్యామ్నాయం చూపిస్తున్నా, చిన్న సినిమాల ధోరణి మారకపోవడంతో, ఇటు థియేటర్ కీ అటు ఓటీటీకీ పనికి రాకుండా పోతున్నాయి చిన్న సినిమాలు. పెద్ద సినిమాలకంటే తీసే చిన్న సినిమాల సంఖ్య చాలా ఎక్కువ. ఇవన్నీ రెంటికీ చెడ్డ రేవడి అవుతున్నాయి.


        ఇతర భాషల సినిమా రంగాల కన్నా మలయాళ రంగం లేదా మాలీవుడ్ ఓటీటీ మార్కెట్ ని పట్టుకుని అభివృద్ధి పథంలో దూసుకు పోతోంది. మలయాళ మేకర్లు ఎంపిక చేసుకుంటున్న జానర్లు, వాటికి నాణ్యమైన సబ్ టైటిల్స్, వీటికి పెరిగిన ఇంటర్నెట్  స్పీడూ తోడై మలయాళం సినిమాల్ని టాప్ లో వుంచుతున్నాయి. 2020 కి పూర్వం మలయాళ సినిమాల్ని చూడని ప్రేక్షకులు కోవిడ్ లాక్ డౌన్స్ తో ఓటీటీకి అలవాటయ్యాక మలయాళ సినిమాలు ప్రధానంగా దృష్టి నాకర్షించాయి. ఈ ఆకర్షణే పెరుగుతూ పోతే వివిధ ఓటీటీల్లో మెయిన్ స్ట్రీమ్ సినిమాలంటే మలయాళ సినిమాలేనని పేరు తెచ్చుకోవడాని కెంతో కాలం పట్టదని పరిశీలకులు అంటున్నారు.

        తెలుగులో చిన్న సినిమాలు తీసినా అవి పెద్ద సినిమాల మసాలాలతోనే తీయడాన్ని ఎంతో అమితంగా కోరుకుని ప్రేమిస్తారు దర్శకులు, నిర్మాతలూ. అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్లకీ, ఓటీటీ బాసులకీ తేడా వుంది. డిస్ట్రిబ్యూటర్లు మసాలా సినిమాలు కోరుకుంటారు. ఓటీటీ బాసులు వాస్తవికతని కోరుకుంటారు. డిస్ట్రిబ్యూటర్లు సినిమాల్ని కోరుకుంటే, ఓటీటీ బాసులు జీవితాల్ని కోరుకుంటారు. నార్మల్ కమర్షియల్ థియేట్రికల్ ఫార్మాట్ ని ఫాలో కారు. ఓటీటీకి అలవాటు పడుతున్న ప్రేక్షకులు కూడా ఇక జీవితాల్నే కోరుకుంటున్నారు. ఈ నాడీ పట్టున్నారు మలయాళ మేకర్లు. వాళ్ళు జీవితాలకి నేటివిటీని కలిపి చూపిస్తూ ఓటీటీల్లో టాప్ బిజినెస్ చేసుకుంటున్నారు.


        తెలుగులో చిన్న సినిమాల క్వాలిటీకి థియేటర్లో ప్రేక్షకులుండరు, ఓటీటీల్లో ఎవరూ కొనరు. థియేటర్లలో విడుదల చేయడానికి బయ్యర్లూ వుండరు. నిర్మాతే విడుదల చేసుకోవాలి. అన్నిసెంటర్లలో విడుదల చేసుకోలేరు. మల్టీ ప్లెక్సులో ఒక షో వేస్తారు. రెండో రోజు చూసి ఎత్తేస్తారు. ఎక్కడ్నించీ నయాపైసా రాదు.

        ఫీచర్ ఫిలిమ్ ఫార్మాట్ లో ఒదగని ఐడియాలెన్నో వున్నాయి. స్టోరీ టెల్లింగ్ విధానాన్నే ఓటీటీ పూర్తిగా మార్చేయడంతో ఆ ఐడియాలు ఇక్కడ వర్కౌట్ అవుతాయి అంటూ మణిరత్నం సైతం అంటున్నారు. కేపిఎంజి -2018 నివేదిక ప్రకారం 2023 కల్లా దేశంలో ఓటీటీ చందాదార్లు 45 శాతానికి పెరిగి, 138 బిలియన్ రూపాయల మార్కెట్ గా అవతరించబోతోంది. ఇది సినిమాలని ఆధారంగా జేసుకునే. ఇది మాకవసరం లేదని అవే మూసలు తీసుకుంటూ మోసపోతామంటే ఎవరూ కాదనరు.
***