సినిమా బడ్జెట్ ఎలా లెక్కించాలి? ఈ ప్రశ్న కొత్త దర్శకులకు కఠినమైనదే, హాలీవుడ్‌లో ఎవరూ దర్శకుడిని బడ్జెట్ గురించి అడగరు. కానీ మన దగ్గర అదే మొదటి ప్రశ్నే అవుతుంది. అందువల్ల మీకు నచ్చక పోయినా కొంత లాజిక్ ఆధారంగా సమాధానం సిద్ధంగా ఉంచుకోవాలి. సినిమా బడ్జెట్ అంచనా వేయడానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. మొదటగా, దర్శకుడు షూట్ డేస్ అంచనా వేయాలి. కానీ ఎలా? ముందుగా, మీ స్క్రిప్ట్‌లో ఉన్న ప్రతి లొకేషన్ రాయండి. తర్వాత, ప్రతీ లొకేషన్‌లో షూట్ చేయాల్సిన సీన్లను రాయండి. తరువాత, ఆ లొకేషన్‌లోని అన్ని సీన్లను కవర్ చేయడానికి రఫ్ గా ఎన్ని రోజులు పడుతుందో అంచనా వేయండి. ఇలా ప్రతి లొకేషన్ కోసం చేయండి. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటే వాటినీ చేర్చండి...
మొత్తం కలిపితే షూట్ డేస్ వస్తుంది. కావాలంటే కొన్ని బఫర్ డేస్‌లు కూడా చేర్చవచ్చు, ఒక వేళ మీకు ఇండస్ట్రీ లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా ఆధారంగా అంచనా వేయవచ్చు. తెలిసిన వాళ్ళు లేక పోయినా మీరే అంచనా వేయొచ్చు. అది పెర్ఫెక్ట్ గా ఉండక పోయినా పర్వాలేదు.
బడ్జెట్‌లో ఉండే ప్రధాన విభాగాలు ఏమిటి?
ప్రొడక్షన్ cost: షూట్ జరుగుతున్న ప్రతి రోజూ అయ్యే ఖర్చులు — కెమెరా ఎక్విప్‌మెంట్, సెట్స్/లొకేషన్ కాస్ట్, ఆర్ట్ వర్క్, కారవాన్స్, కాస్ట్యూమ్స్, ట్రావెల్, ఫుడ్, మేకప్, రోజువారీ బేటాలు మొదలైనవి — షూట్‌కు కావాల్సిన ప్రతిదీ.
ప్రీ-ప్రొడక్షన్ cost: ఆఫీస్ రెంట్స్, స్టాఫ్ జీతాలు, ఫుడ్, లొకేషన్ స్కౌటింగ్, ప్రొడక్షన్ మేనేజర్ మరియు అతని టీమ్ జీతాలు, డైరెక్షన్ టీమ్ (డైరెక్టర్ తప్ప) జీతాలు.
పోస్ట్ ప్రొడక్షన్ cost: సౌండ్ ఎఫెక్ట్స్, సౌండ్ మిక్సింగ్, DI, డబ్బింగ్, ఎడిటింగ్ రెంటల్స్ మొదలైనవి — ఫస్ట్ కాపీ వరకు. గమనిక: మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ రేమ్యూనరేషన్ ఇందులో ఉండవు; అవి సాంకేతిక సిబ్బంది ఖర్చులోకి వస్తాయి. మీ సినిమాలో ఎక్కువ VFX ఉంటే, ఆ ఖర్చు ఇక్కడ చేర్చాలి.
Cast (నటీ నటుల) cost: హీరో సహా అందరు నటీనటుల రేమ్యూనరేషన్.
Crew (సాంకేతిక నిపుణుల) cost: డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, DOP, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, మేకప్ మాన్, యాక్షన్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, డాన్స్ డైరెక్టర్ మొదలైనవారి ఫీజు.
సాధారణంగా, cast & crew ఖర్చులను మన బడ్జెట్‌లో చేర్చకపోవడం మంచిది, ఎందుకంటే అవి ప్రొడ్యూసర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి మారుతాయి.
అందువల్ల, మన బడ్జెట్ ఫార్ములా:
BUDGET = Production Cost + Pre-Production Cost + Post Production Cost
Production Cost = Shoot Days × Average Cost Per Day
ఒక రోజుకు అయ్యే ఖర్చు సాధారణంగా ₹2 లక్షల నుండి ₹15 లక్షల వరకు ఉంటుంది. మీ లొకేషన్స్, సెట్స్, ఇతర పరిస్థితులను బట్టి మీరు ఒక అంచనా వెయవచ్చు. కొన్ని రోజులు 2 లక్షలు, మరికొన్ని రోజులు 6 లక్షలు లేదా 15 లక్షలు కూడా కావచ్చు. ప్రతి రోజుకీ ఒక అంచనా వేసి ఆ తరువాత యావరేజ్ తీసుకోవచ్చు లేదా మీ gut feeling ఆధారంగా ఓవరాల్ గా ఒక యావరేజ్ figure నిర్ణయించవచ్చు.
ఉదాహరణ: సగటు ప్రొడక్షన్ ఖర్చు రోజుకి ₹5 లక్షలు, షూట్ డేస్ = 50 అయితే,
Production Cost = 50 × 5L = ₹2.5 కోట్లు.
Pre-Production Cost: సాధారణంగా ₹40L నుండి ₹70L మధ్య ఉంటుంది — ఇక్కడ ₹50L తీసుకుందాం.
Post Production Cost ₹50L నుండి ₹1 కోటి వరకు ఉంటుంది — ఇక్కడ ₹1 కోటి తీసుకుందాం.
అంటే, Cast & Crew తప్పించి, Budget = ₹2.5Cr + ₹50L + ₹1Cr = ₹4Cr
ఇది ఒక సుమారుగా చేసిన అంచనా మాత్రమే. ఈ బడ్జెట్...షూట్ డేస్, ప్రతీ రోజూ ఏం కావాలి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. షూట్ డేస్ మీ స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటే, రోజువారీ ఖర్చు అనేక ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
ప్రొడ్యూసర్ కు మీరు బడ్జెట్ చెప్పక తప్పదు. ఏదో ఒక ఫిగర్ చెప్పే కన్నా, ఇలా లాజిక్ తో చెప్తే బెటర్ (అదీ కూడా ఎందుకు అని అడిగితేనే).
ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను.
— శ్రీనివాసరెడ్డి చిలుకల, రచయిత & దర్శకుడు
.jpg)