రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, January 26, 2016

స్పెషల్ ఆర్టికల్

సింగిల్ స్క్రీన్ మజా పోతోందా?
 
ల్టీప్లెక్స్ లో మహారాజులా కూర్చుని ఆర్డరిస్తే మన సీటు దగ్గరికే వచ్చే స్నాక్స్ తింటూ, సాఫ్ట్ డ్రింక్స్ సిప్ చేస్తూ,  కొత్త కొత్త సినిమాల్ని బాగా ఎంజాయ్ చేయడంలో మునిగిపోయి, పాత మజానంతా కోల్పోతున్నామా? ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో  సినిమాల్ని మజా చేసిన రోజుల్ని మర్చిపోయి ఆ థియేటర్లు మూతబడే పరిస్థితులు కల్పిస్తున్నామా? పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, చిన్నచిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్స్ ల నిర్మాణాలు జోరందుకోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆదరణ కోల్పోతూ వరసగా మూతబడుతున్నాయి.

        ఈ పరిస్థితి పదిహేనేళ్ళ క్రితం ఒకసారి వచ్చింది. టీవీ చానెళ్ళ వైపు సినిమా ప్రేక్షకులు మళ్ళడంతో థియేటర్లు విలవిల్లాడాయి. ఒకటొకటే మూత బడ్డాయి. ఫంక్షన్ హాల్సుగా, గోడౌన్లుగా, షాపింగ్ కాంప్లెక్సులు గా మారిపోతూ వచ్చాయి. అప్పట్లో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సెంటర్లలో దాదాపు మూడు వేల వరకూ వుండిన సినిమాహాళ్ళు, పదమూడు- పద్నాల్గు వందలకి పడిపోయాయి.
        ఈ పరిస్థితి హైదరాబాద్ తో బాటు నైజాం ఏరియాలో ఎక్కువ కన్పించేది. కోస్తా, సీడెడ్ లలో నైతే ‘సి’ సెంటర్లలో ఛోటా మోటా సినిమాహాళ్ళన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఈ సెంటర్లలో ఆ రోజుల్లో  ఏ సినిమా కూడా రిలీజ్ అయ్యేది కాదు. పాత సినిమాల రీరన్స్ జోరుగా అడేవి. చిరంజీవి నటించిన ‘ఖైదీ’ ఒక ‘సి’ సెంటర్లో ఎన్నిసార్లు వేసినా ఆడేది. ఇక రిలీజయ్యే కొత్త సినిమాల్ని దగ్గరున్న పట్టణాలకెళ్ళి చూసి వచ్చే వాళ్ళు.  అలా రెండు వైపులా థియేటర్లకి లాభసాటిగా వుండేది. కానీ ఎప్పుడైతే 1996 లో ఈటీవీ ప్రసారాలు ప్రారంభమాయ్యాయో- అప్పుడు ఇక ‘సి’ సెంటర్లలో సీను మారిపోయింది. దూరదర్శన్ మాత్రమే వున్న కాలంలో ఊరికొక్క  పెద్దమనిషి ఇంట్లో ఒక్క టీవీ వుండి- వారానికోసారి చిత్రలహరి సినిమా పాటలొచ్చి, వారానికో పాత సినిమా మాత్రమే వచ్చేది. అలాటిది ఈటీవీ వచ్చేసి సీను మార్చేసింది. 24x7 దాంట్లో వినోదమే. రాత్రిపదిన్నరకి ఓ పాత సినిమా. దీంతో అప్పోసప్పో చేసి టీవీలు కొనుక్కుని సినిమా హాళ్ళకి వెళ్ళడం మానేశారు. సినిమాహాల్లో వచ్చే పాత సినిమాలే టీవీలో వస్తున్నప్పుడు సినిమా హాలు కెందు కెళ్ళాలి? ఇలా ‘సి’ సెంటర్ హాళ్ళ పనైపోయింది.  సినిమాలు రీరన్స్  కూడా ఆగిపోయాయి.
        ‘బి’ సెంటర్లలో ఇందుకు భిన్నంగా ఏం లేదు. కాకపోతే నెమ్మది నెమ్మదిగా జరిగింది. పట్టణాల్లో ‘బి’ సెంటర్స్ లో కూడా రీరన్స్  ఆడేవి. ఈటీవి సినిమాల ధాటికి అవికూడా ఆగిపోయాయి. ఇక పెద్ద సినిమాలకే పట్టణ  జనం థియేటర్లకి  వచ్చి, చిన్న సినిమాల్ని అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. చుట్టు  పక్కల వూళ్ళ నుంచి పనులమీద  పట్టణాలకి వచ్చే జనాలే మార్నింగ్, మ్యాటినీ షోలకి చిన్న సినిమాలకి వుండేవాళ్ళు. ఫస్ట్ షోకి ఎఫెక్ట్ కనపడేది. ఎంతో అయిష్టంగా పట్టణ జనం ఫాస్ట్ షోకి కదిలేవాళ్ళు. ఇక సెకండ్ షోలకి టీవీ చుట్టూ మూగి పోయే వాళ్ళు. దీంతో చిన్న సినిమాలకి సెకెండ్ షోకల్లా  థియేటర్లు ఖాళీ.
నగరాల్లోనూ  ఇదే పరిస్థితి. తెలుగుతో బాటు హిందీ సినిమాలు ఆడే  థియేటర్ల  పరిస్థితీ  ఇదే. దీంతో పట్టణాల్లో, నగరాల్లో థియేటర్ల మూత మొదలయ్యింది. హైదరాబాద్ లో ఒకప్పుడు మహోజ్వలంగా  వెలిగిపోయిన ప్యాలెస్, విక్రాంత్, జమ్రుద్, టివోలీ, పారడైజ్, అజంతా, కమల్, మొదలైన పదుల సంఖ్యలో థియేటర్లు  ఒకటొకటే మూతబడ్డాయి. మళ్ళీ వీటిని తెరిచే పరిస్థితులు కూడా లేవు. చాలా వరకూ వీటి స్థానే షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి. ఇప్పుడు ఆబిడ్స్ లో బిగ్ బజార్ వున్న చోట  ప్యాలెస్ టాకీస్ వుండేది. పక్కనే కొత్తగా 1980 లలోనే ప్రారంభించిన సూర్య జంట థియేటర్లు 1998 కల్లా మూతబడి ఇప్పటికీ అలానే వున్నాయి. కాచీగూడాలో ప్రభాత్ థియేటర్ షాపింగ్ కాంప్లెక్స్ గా మారిపోయింది. హిమాయత్ నగర్లో ఇంగ్లీషు సినిమాలాడే ల్యాండ్ మార్క్ థియేటర్ లిబర్టీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ గా మారింది. అటుపక్క స్కై లైన్ జంట థియేటర్లూ మూతబడి అలాగే వున్నాయి. ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే మొత్తం అన్ని థియేటర్లూ, కాచీగూడా చౌరాస్తాలో మహేశ్వరి- పరమేశ్వరి థియేటర్లూ, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్ లోని థియేటర్లూ టీవీ చానెళ్ళ ధాటికి తట్టుకోగాలిగాయి. అయితే క్రాస్ రోడ్స్ లో  కొన్ని ప్రసిద్ధ థియేటర్లకి,  కాచిగూడాలో మహేశ్వరి- పరమేశ్వరి జంట థియేటర్లకీ మల్టీప్లెక్స్ ల ట్రెండ్ లో కాలం చెల్లింది. మహేశ్వరి - పరమేశ్వరి జంట థియేటర్లు  షాపింగ్ మాల్స్ తో కూడిన మల్టీప్లెక్స్ గా  మారాయి. క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ ఈ బాటలోనే వుంది.
        టీవీ చానెళ్ళ తర్వాత,  మల్టీప్లెక్స్  ట్రెండ్ ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లకి పెద్ద పరీక్షా కాలాన్ని తెచ్చి పెట్టింది. అప్పటి అవిభక్త రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు హైదరాబాద్ నడిబొడ్డున ఆబిడ్స్  లో  అధునాతనంగా రామకృష్ణ  జంట థియేటర్లు కట్టారు. ఇది 1966 లోనే జరిగింది. విశేష మేమిటంటే,  అప్పటి దాకా రాష్ట్ర ప్రజలకి ఎక్కడా అందని 70 ఎంఎం  బొమ్మ తోపాటు, సిక్స్ చానెల్ స్టీరియో ఫోనిక్ సౌండ్ అందించిన  ఘనత ఆయనది. అలాటి సౌండ్ సిస్టం తో 70 ఎంఎం వెండితెర మీద ‘మెకన్నాస్ గోల్డ్’ విడుదలై సినిమా ప్రదర్శనలో  విప్లవాన్నే సృష్టించింది! తర్వాత  ‘షోలే’ విడుదలైనప్పుడు అది  నాల్గు ఆటలతో ఐదేళ్లూ ఆడిందంటే కేవలం అది ఎన్టీఆర్ అందించిన ఆ అధునాతన టెక్నాలజీ  పుణ్యమే. ఒక్కొక్కళ్ళు వంద సార్లు ఆ థియేటర్లో ఆ సినిమా చూసి వుంటారు. కాలేజీ స్టూడెంట్లు రోజుకొక సారి చూసేవాళ్ళు.
        ఈ విప్లవం తర్వాత,  రాష్ట్రంలో మళ్ళీ 2002 లోనే కొత్త విప్లవం వచ్చింది. అది ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్ రూపంలో. ఇందులోనే మల్టీప్లెక్స్ థియేటర్ల సముదాయంతో. అయితే దేశంలో మొట్టమొదట  మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చింది 2000 వ సంవత్సరంలో ముంబాయిలోనే. అనిల్ అంబానీకి చెందిన యాడ్ లాబ్ ఫిలిమ్స్ దీన్ని ప్రారంభించింది. ఈ కల్చర్ అంచెలంచెలుగా దేశంలో వివిధ నగరాలకి విస్తరించింది. ప్రేక్షకుల సినిమాల్ని వీక్షించే కల్చర్ నే  మార్చేసింది. ఇదలా వుంచితే, అసలు ఏ టీవీ చానెళ్ళ పుణ్యాన నగరాల్లో థియేటర్లు జీవన్మరణ సమస్య నెదుర్కొన్నాయో, మళ్ళీ కొత్త సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్మాణాల జోలికి వెళ్ళలేదో, ఆ స్లంప్ ని కూడా ఏమాత్రం లెక్క చెయ్యక మరిన్ని థియేటర్లు మల్టీప్లెక్స్ ల రూపంలో పుట్టుకొచ్చాయి. మరి ఇంత కాలం  సింగిల్ స్క్రీన్ థియేటర్ల కే తగ్గిన ప్రేక్షకులు మల్టీప్లెక్స్ లకి ఎక్కడ్నించి వస్తారని అనుకున్నారు? వుంటే గింటే పూర్వం కొన్ని చోట్ల  35 ఎంఎం, 70 ఎం ఎం అని జంట థియేటర్లే ఉంటున్న నేపధ్యంలో ఏకంగా నాల్గు నుంచి ఆరు థియేటర్ల సముదాయంగా మల్టీప్లెక్సులు కట్టే ధైర్యం ఎలా చేశారు?  
        ఈ ధైర్యం రావడానికి కారణమేమిటంటే, అంతవరకూ సింగిల్ స్క్రీన్ థియేటర్లతో సింగిల్ యాజమాన్యాలకి సాధ్యంకాని పద్ధతిలో, ఈ రంగంలోకి కొత్తగా కార్పోరేట్ కంపెనీలు ప్రవేశించడంతో మొత్తం ప్రదర్శనా రంగం రూపురేఖలు మారిపోలేదు. మొట్టమొదట అనిల్ అంబానీ కంపెనీ, ఆతర్వాత ప్రసాద్స్, పీవీఆర్, ఆసియన్..ఇలా కార్పోరేట్ కంపెనీలు ఒకటొకటిగా వచ్చిన మాట నిజమే. అయితే ఇవి రావడానికి సినిమాలు డిజిటలీ కరణ చెందడమే కారణం. సినిమాల ప్రదర్శన ఉపగ్రహాల ద్వారా జరగడమే కారణం. అదే ఇంకా సినిమా రీళ్లే వుంటే  ఏ కంపెనీ వచ్చేది కాదు. డిజిటలీ కరణతో సినిమాల నిర్మాణమే కాదు, పంపిణీ, ప్రదర్శనా పద్ధతులూ సులభతరం కావడమే మల్టీప్లెక్సుల ఆవిర్భావానికి కారణం. ఇది ప్రపంచవ్యాప్తంగా సంభవించిన పరిణామం. దీన్నుంచి మనం దూరంగా ఉండలేం.
        అయినంత మాత్రానా- భారీ యెత్తున థియేటర్ల కి రావడం మానేసిన ప్రేక్షకులు ఇంత భారీ సంఖ్యలో  కడుతున్న మల్టీప్లెక్సు లకి వస్తారని ఎలా భావించారు? ‘ఆసియన్ సినిమాస్’ లో భాగస్వామి అయిన డి.  సురేష్ బాబు దీనికి వివరణ ఇచ్చారు : చాలా కారణాల వల్ల  ప్రేక్షకులు థియేటర్లకి రావడం మానేశారనీ, నగర  శివార్లలో పాతబడిన సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి బాగాలేకపోవడం ఒక కారణమనీ, వాటిలో ప్రొజెక్షన్ దగ్గర్నుంచీ టాయిలెట్స్ వరకూ అన్నీ అధ్వాన్నంగా వుంటున్నాయనీ, స్వల్ప టికెట్ ధర పెంపుదలతో అత్యాధునిక సౌకర్యాలతో మల్టీప్లెక్సులు కడితే తప్పకుండా ప్రేక్షకులు వస్తారనీ ఆయన అంచనా.
        ఇది నగర శివార్లలో మల్టీప్లెక్సుల సంగతి. మరి నగరాల ప్రధాన కూడళ్ళలో వెలసిన, వెలుస్తున్న మల్టీప్లెక్సులు కొత్తగా ఏ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ వెలుస్తున్నట్టు?
(వచ్చేవారం ..)

-సికిందర్
http://www.filmyfreak.com/










వీకెండ్ కామెంట్

ఇవి విచారణా సంఘాల  రిపోర్టులా?

       దేశంలో వివిధ భాషలకి చెందిన సినిమా పరిశ్రమలున్నాయి. కానీ అసహనమంటూ ఏ భాషా సినీరంగమూ ఫీలవని సమస్యని   ఒక్క బాలీవుడ్ మాత్రమే ఫీలవుతోంది. మొత్తం బాలీవుడ్ అని కాదుగానీ, అందులో ప్రముఖులనదగిన ఇద్దరు ఖాన్ స్టార్లు, మరికొందరు దర్శకులూ దేశంలో తమ వృత్తి వ్యాపారాలతో  సంబంధం లేని  అసహనంగురించి అడపాదడపా వివాదాలు సృష్టిస్తున్నారు. ఇలా కొందరు ఇబ్బందుల్లో కూడా పడుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు ఖాన్ స్టార్లు. ఖాన్ స్టార్ల విషయమే తీసుకుంటే,  వాళ్ళు తాము కొనసాగుతున్న  బాలీవుడ్ రంగంలో నిర్మాతల నుంచో, దర్శకుల నుంచో అలాటి అసహనాన్ని గానీ, వివక్షని గానీ, అణిచివేతని గానీ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా అని అడగాలి. వీళ్ళని మోస్తూ ఇంతటి వాళ్ళని చేసిందెవరని కూడా అడగాలి. అసలు బాలీవుడ్ ఒక సెక్యులర్ రంగం, ఇక్కడ అందరి సహకారంతో మైనారిటీలమైన మేము ఇంతటి వాళ్ళమాయ్యమని ఎప్పుడైనా చెప్పుకున్నారా?  అలాంటప్పుడు దేశం గురించి మాట్లాడ్డం ఏం బావుంటుంది. 
          ఇప్పుడు తాజాగా ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఆరిపోతున్న అసహనం  కుంపటిని రగిలించారు. యధావిధిగా మళ్ళీ దీనిమీద రాజకీయ పార్టీలు గళమెత్తాయి.
         
ఇలా బాలీవుడ్ ప్రముఖులే  ఎందుకు అసహనం గురించి మాటాడుతున్నారు. దేశంలో మిగతా బెంగాలీ, తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ తదితర సినిమా పరిశ్రమల నుంచి ఈ వ్యాఖ్యలు ఎందుకు రావడం లేదు. ఇక్కడి వ్యక్తులకి దేశంలో అసహనముందని అన్పించడం లేదా, లేక పోతే మనకెందుకులే అనుకుని మౌనం దాల్చారా? ఈ విషయంలో బాలీవుడ్ ప్రముఖుల్ని సమర్ధిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా?          అసలు బాలీవుడ్ ప్రముఖులకి దేశంలో అసహనం వుందని ఎందుకు అన్పించింది. అన్పించినా ఎందుకు కల్పించుకోవాల్సి వచ్చింది. మౌలికంగా కొన్ని అవాంఛనీయ సంఘటనల దృష్ట్యా  బాలీవుడ్ తో సంబంధంలేని కొందరు మేధావులూ, రచయితలూ అసహనం మీద మాట్లాడడం మొదలు పెట్టారు. అవార్డులు వెనక్కి ఇవ్వడం మొదలెట్టారు. దీంతో బాలీవుడ్ లో  కూడా రాగాలు తీయడం మొదలెట్టారు. అకాడెమిక్ మేధావులు చూసుకుంటున్న అంశంలో  వాళ్ళతో  ఎందులోనూ పోలికగానీ, సంబంధంగానీ  లేని, కమర్షియల్ సినిమాలు తీసి జనాన్ని వినోదపర్చే బాలీవుడ్ వ్యక్తులు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రజాసమస్యల మీద సినిమాలు తీయని బాలీవుడ్ కి అకస్మాత్తుగా ఈ స్పృహ ఏమిటి
          తాము తీసే  సినిమాల మీద దాడులు జరిగినప్పుడో, అవి నిషేధానికి గురయినప్పుడో  అసహనమంటూ మాట్లాడితే అర్ధముంది. అంతవరకే సంబంధం. కానప్పుడు అరకొర జ్ఞానంతో దేశ సమస్యల్లో జోక్యం చేసుకుంటే శృంగభంగమే బహుమానం.  అసహనం గురించి  ఈ గళాల్నిచూసి చూసి,  ఇందుకే శత్రుఘ్న సిన్హా సినిమా స్టార్లు రాజకీయాలు  మాట్లాడ వద్దన్నారు. 
         
 కానీ స్టార్లు ఇలా తమకి వ్యతిరేకంగా రాజకీయాలు మాట్లాడేస్తూంటే, చాప కింద నీ రొచ్చేస్తున్నట్టు కేంద్రంలో అధికార పార్టీ కంగారు పడిపోవడం, దీన్ని చూసి ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యల్ని పట్టుకుని అధికార పార్టీని  ఇరుకున బెట్టాలని చూడ్డం పదేపదే జరిగిపోతోంది. ఏమో, ఏం చెప్పగలం.. రేపు ఈ సినీ సెలబ్రిటీలే  తమ పార్టీల్లో చేరి ఓట్లు రాల్చే అధిదేవత లవుతారేమో. 
         
తాజాగా కరణ్ జోహార్ వ్యాఖ్య- దేశంలో భావ స్వేచ్చ ఒక జోక్-  ప్రజాస్వామ్యం రెండో పెద్ద జోక్ అని! తక్షణం దీన్ని పట్టుకుని, ఇదేదో విచారణా  సంఘం రిపోర్టు అయినట్టు, కాంగ్రెస్ వెళ్లి బీజేపీ మీద పడడం,  రొటీన్ గా బిజేపీ ఆ రిపోర్టుని తిప్పికొట్టడం జరిగిపోయాయి. చూస్తే ఈ పార్టీలు ఒక్కో బాలీవుడ్ ప్రముఖుడు అసహనం గురించి ఒక్కో విచారణా  సంఘం రిపోర్టు విడుదల చేస్తున్నట్టే భావిస్తున్నట్టున్నాయి. వాటికంత విలువిచ్చి రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రముఖ వార్త చేస్తున్నాయి. అందుకే కాబోలు  కాంగ్రెస్  పార్టీకి చెందిన మనీష్ తివారీ, కరణ్ జోహార్ ని వెనకేసుకొస్తూ -  మోడీ ప్రభుత్వం ఇంటలెక్చువల్స్ కి వ్యతిరేకమని కేంద్రం మీద విరుచుకు పడ్డారు. విచారణా సంఘం రిపోర్టిచ్చారంటే  కరణ్ జోహార్ ఇంటలెక్చువల్లే అయివుండాలి. ఇంతకి ముందు రిపోర్టు లిచ్చిన బాలీవుడ్ స్టార్లు కూడా ఇంటలెక్చువల్సే అన్నమాట. పాపం అసహనం ఎజెండాతో ప్రారంభమైన అసలైన  ఇంటలెక్చువల్స్ ఈ బాలీవుడ్ హైజాకింగ్ ని చూస్తూ వున్నారు. కరణ్ జోహార్ మసాలా సినిమాలు తీయకుండా, దేశసమస్యల మీద వివాదాస్పద సినిమాలు తీసి వ్యతిరేకత నెదుర్కొన్నప్పుడు,  భావ స్వేచ్చ గురించి, ప్రజాస్వామ్యం గురించీ మాట్లాడవచ్చు. బాలీవుడ్ సినిమాల కిస్తున్నంత స్వేచ్చ ప్రాంతీయ సినిమాల కివ్వడం లేదు సెన్సార్ బోర్డులు. 
       
టాలీవుడ్ లో బాలీవుడ్ కి మించిన ఫైర్ బ్రాండ్ స్టార్- పోలిటీషియన్ వున్నారు. ఆయనెప్పుడూ  విచారణా సంఘం రిపోర్టులు ఇవ్వలేదు. దాని మీద రాజకీయ పార్టీలు పోట్లా డుకోనూ లేదు. ఇస్తే గిస్తే అప్పుడప్పుడు మాత్రమే సెలెక్టివ్ గా ప్రజల్లోకి వెళ్లి సమతూకంతో గ్రౌండ్ రిపోర్టు లిస్తారు. తోచినప్పుడు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళడం, సమతూకం పాటించడం, ఈ రెండిటి వల్ల మేధావులూ రాజకీయనాయకులూ నోళ్ళు మెదపలేక  పోతున్నారు. బాలీవుడ్ మేధావులుతాము దేశానికే ప్రతినిధులమని భావించుకుంటే భావించుకోవచ్చు. కానీ టాలీవుడ్ ని  కేవలం తెలుగు సినిమాలు రీమేక్ చేసుకోవడానికి మాత్రమే  ఉపయోగించుకోకుండా, ఇక్కడి రాజకీయ టాలెంట్ ని కూడా గుర్తించి, ఆ ప్రకారం కాస్త ప్రజల్లోకి వెళ్లివస్తూ,  గ్రౌండ్ రిపోర్టు లివ్వడం నేర్చుకుంటే ఏ పేచీ వుండదు. లేకపోతే ఇలా స్వయం ప్రతిష్ఠాపిత విచారణా సంఘాల  రిపోర్టులతో ఎప్పటికీ శృంగభంగాలే!

-సికిందర్