రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, January 23, 2016

స్క్రీన్ ప్లే సంగతులు!


ఇంటలిజెంట్  స్క్రీన్ ప్లే రైటింగ్ ఎప్పుడూ మూలాల్ని దాచి పెడుతుంది. సైంటిస్టు ఐన్ స్టీన్ కూడా ఇదే చెప్పాడు : క్రియేటివిటీ రహస్యమంతా దాని మూలాల్ని దాచి పెట్టడంలోనే వుందని. అంటే మూలాల్ని బహిర్గతం చేసుకుంటే అది క్రియేటివిటీ
అన్పించుకోకపోగా  ఫక్తు డాక్యుమెంటరీయో, న్యూస్ రిపోర్టింగో,
ఎడ్యుకేషనల్ మెటీరియలో అవుతుందని చెప్పడమన్న మాట. ఇంకో శాస్త్రవేత్త న్యూటన్ చలన సూత్రాల్లో మూడో దేమిటి? ప్రతి చర్యకూ సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుందనేగా? 

అంటే సినిమాల్లో విలన్ హీరోని ఒక రకమైన దెబ్బ తీస్తే, వెంటనే పూనుకుని 

హీరో ఎదురు దెబ్బ తీయడమనే దృశ్యాల్ని చూస్తూనే వుంటాం. చివరంటా ఈ యాక్షన్ -రియాక్షన్ ల ఇంటర్ ప్లే నడుస్తూనే వుంటుంది. ఇది చూపించడనికి 

ఎవరైనా, ఏ దర్శకుడైనా,  ముందుగా ప్రేక్షకులకి న్యూటన్ చలన సూత్రాల గురించి చెప్పి, ఎడ్యుకేట్ చేసి – ఈ సూత్రాల ప్రకారం వీళ్ళిద్దరూ ఇలా 

             కొట్టుకున్నారు –అని పదేపదే సినిమాలో చెబుతూ  చూపించాడా ఎప్పుడైనా?  

                                         అలా చేస్తే అది  అలా చేస్తే అది సినిమా అనే కళ అవుతుందా,  
తరగతి గది పాఠమవుతుందా? అసలు దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అలా మూలాల్ని బహిర్గతం చేసుకున్న దర్శకుడి గురించి ఏమనుకుంటారు ఎవరైనా?

      స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ మూలాల్ని దాచిపెట్టడం గురించి ఇంకా మైండ్ బ్లోయింగ్ గా చెప్పాడు : ఆరోగ్య సూత్రాల్లో ఎక్సర్ సైజ్ చేయడం ఒకటని మనకి తెలుసు. వెళ్లి హెల్త్ కోసం ఎక్సర్ సైజ్ చెయ్యమంటే  ఏ పిల్లాడూ చెయ్యడు. ఎందుకంటే అది డ్రై గా వుండే యాక్టివిటీ. అందులో ఆనందం లేకపోగా శరీరాన్ని కష్ట పెట్టుకోవాలి. నువ్వెళ్ళి  గేమ్స్ ఆడుకో పొమ్మంటే, వాడు విపరీతంగా ఆడేస్తాడు. ఎందుకంటే ఇది డ్రై యాక్టివిటీ కాదు, ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ గనుక! అందులో  శారీరక శ్రమ తెలీదు, ఆనందమే ఆనందం వుంటుంది గనుక. వాడికా కోరుకునే ఆనందంతో బాటు, మనం ఉద్దేశించిన ఎక్సర్ సైజ్ కూడా లబిస్తుంది. ఇది  వాడికి తెలీకుండా జరిగిపోతుంది. ఎక్సర్ సైజ్ అనేది మూలం అనుకుంటే, గేమ్ అనేది దాన్ని మరుగుపర్చిన క్రియేటివిటీ అన్నమాట. గేమ్ అనే క్రియేటివ్ యాక్టివిటీలో ఎక్సర్ సైజ్ అనే కఠిన మూలాన్ని దాచిపెట్టి పిల్లాడికి ప్యాకేజీలా అందించామన్న మాట. ఎక్సర్ సైజ్ కి షుగర్ కోటింగ్ వేస్తే గేమ్ అవుతుంది. ప్రపంచం షుగర్ కోటింగ్ తోనే, తియ్యటి మాటల తోనే నడుస్తోంది. ఇవి లేకపోతే ఒక్క పనీ జరగదు. మనిషి ఎప్పటికీ చిన్న పిల్లాడే, వాడికి తియ్యటి ఫలాలే కావాలి. కమర్షియల్ సినిమాకి కూడా ఇదే కావాలి. 

       
ఒక కమర్షియల్ గా వుండని యూరోపియన్/ అవాంట్ గార్డ్/ నాయిర్ / వరల్డ్ సినిమా మొదలైన వాటన్నిటి  శైలుల్నీ కలగలిపి, కమర్షియల్ సినిమా తీస్తున్నామని ఎవరో  చెప్పారనుకోండి. ఈయనెవడ్రా మన ప్రాణానికని అనుకుంటాం మనం. కొసమెరుపుగా, సర్రియలిజం ( అధివాస్తవికత) ని  కూడా జోడిస్తున్నామని  చెప్పాడనుకోండి. నిజంగానే ఈయన  సినిమా చూపించి చంపేస్తాడనుకుంటాం. హాలీవుడ్ సైతం దూరం పెట్టే  యూరోపియన్/ అవాంట్ గార్డ్/ నాయిర్ / వరల్డ్.. ఏవైతే అవి, మళ్ళీ వీటికి సర్రియలిజం కోటింగూ,  ఇవన్నీ కలిపేసి  సినిమా తీస్తే అది కమర్షియల్ సినిమా అవుతుందా? ప్రేక్షకులు చూస్తారా? డబ్బులొస్తాయా?

        ప్రేక్షకులు చూశారు, డబ్బు లొచ్చాయి. ఎందుకంటే అతను పైన చెప్పుకున్న  యూరోపియన్/ అవాంట్ గార్డ్/ నాయిర్ / వరల్డ్ / సర్రియలిజం..ఎట్సెట్రా ఎట్సెట్రా మూలాల్ని ఎక్కడా ప్రకటించకుండా దాచి పెట్టి మరీ చూపించి సక్సెస్ అయ్యాడు. అతను
అశ్విన్ శరవణన్ అనే తమిళ దర్శకుడు. ఇటీవలే నయనతార తో ‘మయూరి’  అనే న్యూవేవ్ హార్రర్ అందించిన షార్ట్ ఫిలిం మేకర్. ఒక షార్ట్ ఫిలిం మేకర్ గా సహజంగానే వరల్డ్ సినిమాకి ఎక్స్ పోజ్ అయ్యాడు. ఆ ప్రభావంతో విజయవంతంగా పైన చెప్పుకున్న వేరియేషన్స్ తో తన సొంత దుగ్ధ తీర్చుకుంటూ,  కమర్షియల్ గా ప్రేక్షకులకి కావాల్సింది కూడా అందించాడు. 

        సొంత దుగ్ధ తీర్చుకోవడంలో తప్పులేదు, ఎటొచ్చీ దాన్ని కప్పిపుచ్చుతూ ప్రేక్షకులకి కావాల్సినట్టు కమర్షియల్ గా మల్చామా లేదా అన్నదే ముఖ్యం.

ఇంటలిజెంట్  v / s ఇంటలెక్చువల్  
     కమర్షియల్ సినిమా అనే పదార్ధం- ఇంటలెక్చువల్ అనే పదం రెండూ ఒకే  ఒరలో ఇముడుతాయా? ఇంటలెక్చువల్స్  కమర్షియల్ సినిమాలు తీసే తక్కువ స్థాయిలో వుండరు. వాళ్ళ సినిమాలు పై స్థాయికి చెందినవి. తలపండిన మేధావులు చూసేవి. కమర్షియల్ సినిమా అర్ధవంతంగా ఉండాలంటే కేవలం అది ఇంటలిజెంట్ రైటింగ్ ని డిమాండ్ చేస్తుంది. ఇంటలిజెంట్ రైటింగ్ కి ఇంటలెక్చువల్  అయి తీరాల్సిన  పని లేదు. ఉన్న కమర్షియల్ సినిమా క్రాఫ్ట్ నీ, క్రియేటివిటీ నీ కంటెంట్ పరంగా అర్ధవంతంగా ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళి స్థాపించగల స్థోమత వుంటే సరిపోతుంది. ‘మయూరి’ తో బాటు ‘కంచె’  ఇలాటి ఇంటలిజెంట్ రైటింగ్స్ తో ఇటీవల విజయవంతమైన కమర్షియల్ సినిమాలు. ఇంటలిజెంట్ అయివుంటే చాలు, ఇంటలెక్చువల్ అవనవసరంలేదు తెలుగు సినిమాలకి. 

        చూసిన ఒక సినిమా గురించి కథ బావుందనో, నటనలు బావున్నాయనో, లేదా కామెడీ పాటలు ఫైట్లూ ఇంకేవో బావున్నాయనో- లేదా ఇవేవీ అసలు బాగా లేవనో  జనం అనుకోవడం సాధారణంగా జరుగుతూంటుంది. ఇదేమీ కాకుండా,  సినిమాలో సైన్స్ సూత్రాల గురించీ, వాటికిచ్చిన వివరణల గురించీ మిశ్రమ స్పందనలకే ప్రాధాన్యమిచ్చి, మిగతా ఏ కమర్షియల్ అంశాల గురించీ  మాటాడుకోవడం లేదంటే,  ఆ సినిమాతో  ప్రేక్షకులు ఏదో ప్రాబ్లం ఫీలవుతున్నట్టే. లేకపోతే ఎన్టీఆర్ ఒక స్టార్ గా ఈసారి ఎంత బాగా చేశాడో  చెప్పుకోకుండా, ఎంతసేపూ దర్శకుడి సైన్స్  ప్రదర్శనలో సామంజస్య- అసామాంజస్యాల మీదికే దృష్టి మళ్లించడమేమిటి? ఒక కమర్షియల్ సినిమాని స్టార్ డమ్ కోసం తీయకుండా, దర్శకుడి సైన్స్ విజ్ఞానం  కోసం తీయరుకదా? 

క్వాలిటీకి కత్తెర
        ఈ కథ తండ్రికి చేసిన అన్యాయానికి విలన్ మీద పగదీర్చుకునే హీరో కథ. ఇక్కడ రెండు జరిగాయి : ఒకటి, ఈ కథ చెప్పడంలో, పాత్రల్ని చిత్రించడంలో ఎలాటి కనీస స్థాయి ఇంటలిజెన్సు, లాజిక్కూ లేకపోవడం; రెండోది, తగుదునమ్మాయని ఇలాటి తూతూ మంత్రపు  కథలో సృష్టించిన సంఘటనలకి బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటూ, సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటూ, కార్బన్- ఎలక్ట్రాన్ ల కొలీషన్ అంటూ ఇంటలెక్చువల్ వివరణలతో కోటింగు లివ్వడం, మళ్ళీ దీనికి కూడా కొన్ని చోట్ల లాజిక్ లోపించడం. 

        ఈ మూడంకాల స్క్రీన్ ప్లేలో మొదటి పది నిమిషాల్లో కథని స్థాపించేశారు. తనకి కలిగే కోపాన్నో, ఉద్రేకాన్నో ఎవర్నో కొట్టో, ఏదో చేసో చల్లార్చుకునే స్వభావం గల వాడు హీరో. ఉద్యోగం పోగొట్టుకుని వేరే కంపెనీ పెట్టుకున్నాక,  తండ్రికి బాగా లేదని తెలియడంతో ఇంటికి వెళ్తాడు. అక్కడ చావుబతుకుల్లో  వున్న తండ్రి,  విలన్ చేసిన మోసం గురించి చెప్పి పగదీర్చుకోవాలంటాడు. ఇందుకు హీరో పూనుకుంటాడు. పదినిమిషాల్లో ఈ బిగినింగ్ విభాగం ముగుస్తుంది.  

        ఇక్కడ్నించీ మిడిల్ విభాగంలో  హీరో ఓ ముగ్గుర్ని కూడగట్టి, విలన్ కూతురికి వలేయడం ప్రారంభిస్తాడు. విలన్ కూతురు, అంటే హీరోయిన్- తండ్రికి బహుకరించబోయే ఒక పాతిక కోట్ల రూపాయల సీతాకోక చిలుక బొమ్మ వున్న పెయింటింగ్ లో స్పై కెమెరా పెట్టి,  అతడి బ్యాంక్  ఎక్కౌంట్ పాస్ వర్డ్ తెలుసుకోవాలని పథక మేస్తాడు. హ్యాకింగ్ ద్వారా ఎక్కౌంట్ లో డబ్బు నిల్వలన్నీ కొట్టేసి విలన్ని వీధిలో పడెయ్యాలన్నది లక్ష్యం. గతంలో తన తండ్రినికూడా మోసం చేసి వీధిలో పడేశాడు విలన్. హీరో లక్ష్యానికి గడువు ముప్పై రోజులు. అంతకి మించి తండ్రి బతకడని డాక్టర్లు చెప్పారు. 

        హీరోయిన్ కి కూడా ఏవో సైన్సు విద్యలు ప్రదర్శిస్తాడు హీరో. ఆమె చేత అప్పాయింట్ మెంట్ ఇప్పించుకుని  ఆమె తండ్రి దగ్గరికి- అంటే విలన్ దగ్గరికి కాబోయే అల్లుడిగా  వెళ్తాడు హీరో. అప్పుడా విలన్ కూడా ఏవో విద్యలు ప్రదర్శించి అల్లుడివి అవుతావో లేదో ఈ విద్యే నిర్ణయిస్తుందంటాడు. ఆ మాగ్నెటిక్ గోల్ఫ్ బాల్స్ ఆటలో హీరో గెల్చి ఆ పెయింటింగ్ గిఫ్ట్ గా ఇచ్చేసి వచ్చేస్తాడు. ఐతే హీరో ఎవరి కొడుకో అతడి లక్ష్య మేమిటో పసిగట్టిన విలన్, అతడి లక్ష్యం నెరవేరదని చెప్తాడు.  

        ఈ దరిమిలా హీరోయిన్ కి దూరమవుతాడు హీరో. హీరోయిన్ కి ఒక కల వెంటాడుతూ వుంటుంది. తన చిన్నప్పటి సంఘటనకి సంబంధించి- అప్పట్నించీ కన్పించని తల్లి గురించి. ఇదిలా వుండగా హీరోని వ్యతిరేకించిన ఈమె హీరోని దెబ్బ తీసే  ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. హీరో జైల్లో వున్న ఆమె తల్లిని ఆమెతో తో కలిపి తిరిగి ఆమెకి దగ్గరవుతాడు.. 

        విలన్ కీ హీరోకీ మధ్య జరుగుతున్న పోరాటంలో భాగంగా విలన్ హీరోకి కొద్ది నిమిషాల్లో చనిపోయే ఇంజెక్షన్ ఇప్పించడంతో ఈ మిడిల్ విభాగం ముగుస్తూ రెండో మూలస్థంభం ఏర్పాటవుతుంది.

        ఎండ్ విభాగంలో,  అటు విలన్ ఆఫీసులో పెట్టుకున్న ఆ గిఫ్టెడ్ పెయింటింగ్ లో  వున్న  రహస్య కెమెరా  ద్వారా విలన్ బ్యాంక్ ఎక్కౌంట్ ని హ్యాకింగ్ చేసి,  డబ్బంతా తన ఎక్కౌంట్ లో వేసుకుని దివాలా తీయిస్తాడు హీరో. విలన్ ఏంతో  గొప్పకి పోయి స్పెయిన్ లో పెట్టుబడి పెట్టిన గ్యాస్ కంపెనీ కూడా హీరో ఏర్పాటు చేసిన బోగస్ వ్యవహారమేనని తేలుతుంది చివరికి. ఇలా తండ్రి  కోరిక తీర్చి, సంతృప్తిగా ఆయన చివరి శ్వాస చూస్తాడు  హీరో.

పాయింటులో పస 
     ఈ స్క్రీన్ ప్లేలో కథనపరంగా ఇంటర్వెల్ బ్లాకులో మంచి క్రియేటివిటీ వుంది. హీరో- విలన్ పరస్పరం మాటలు అనుకున్నాక, హీరో వెళ్ళిపోయాక విలన్ అసిస్టెంట్ వచ్చి, బ్రేక్ తీసుకుందామా అన్నప్పుడు, బ్రేక్ అని అక్షరాలు  పడతాయి. లేదు, ఇంకా ఉందంటూ  విలన్ అనగానే ఆ అక్షరాలు చెరిగిపోయి- విలన్ తను చెప్పాల్సింది పూర్తి చేశాక అసలు పాయింటు తో ‘బ్రేక్’ అని ఇంటర్వెల్ ఇస్తారు. ఇది కాపీ క్రియేషన్ కాకపోతే దర్శకుడి వండర్ఫుల్ క్రియేటివిటీ అనుకోవాలి. అయితే కథనంతో ఈ  క్రియేటివిటీ మిగతా స్క్రీన్ ప్లే అంతటా కూడా పరివ్యాప్తమై వుండాల్సింది. 

        స్క్రీన్ ప్లేకి ఎప్పుడూ బలం మొదటి మూలస్థంభమే. అంటే బిగినింగ్ ముగుస్తూ వచ్చే ప్లాట్ పాయింట్ -1. అంటే కథకి పాయింటుని ఎస్టాబ్లిష్ చేసే కేంద్ర బిందువు. ఇది అర్ధవంతంగా, బలంగా లేకపోతే మొత్తం స్క్రీన్ ప్లే ఏమంత బలంగానూ  వుండదు. గతంలో అనేక సార్లు చెప్పుకుంది మళ్ళీ చెప్పుకుంటే,  ప్లాట్ పాయింట్ -1 దగ్గర ఉండాల్సిన అంశాలు : ఏర్పాటు చేస్తున్న సమస్యలో లేదా హీరో గోల్ లో-
 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్  అన్నవి ఉంటాయని గతంలో చాలా సార్లు చెప్పుకున్నాం. దీని ప్రకారం 1. ఇక్కడ హీరో ‘కోరిక’ తండ్రి కోరిక తీర్చడమే, సరే ఇది ఓకే అనుకుందాం;  2. ‘పణం’ గా కాలాన్ని ఒడ్డాడు, ముప్పై రోజుల్లో చనిపోయే తండ్రి కోరిక తీర్చాలి, ఇది కూడా ఓకేనే  అనుకుందాం; 3. విలన్ మీద పోరాటం వల్ల తనకెదురయ్యే విపరిణామాల ( పరిణామాల హెచ్చరిక) గురించి మాత్రం చెప్పుకోవడానికేమీ లేదు, కనుక ఇది ఓకే కాలేదు; 4. లక్ష్యసాధన కోసం హీరోకి తగినంత ‘ఎమోషన్’ పుట్టిందా అంటే  ఇది కూడా ఓకే అనుకోలేని పరిస్థితి, కనుక ఇదీ నాట్ ఓకే. 

        ఇలా కథకి పెట్టుకున్న పాయింటులో వుండాల్సిన నాల్గు కీలకాంశాల్లో రెండు  అంశాలు తేలిపోతే, పాయింటులో పస  సగానికి సగం తగ్గినట్టే. అంటే 50 శాతం స్క్రీన్ ప్లే బలంతో ఈ కథ తయారయ్యిందన్న మాట.  

           
పైరెండు కీలకాంశాలు ( పరిణామాల హెచ్చరిక, ఎమోషన్) ఎందుకు మిస్సయ్యాయో చూద్దాం ; ఎప్పుడో ఇరవై ఏళ్ల  క్రితం విలన్ చేసిన మోసమిది. ఆ తండ్రి ఇన్నాళ్ళూ ఊరుకుని తీరా జబ్బుతో  చనిపోతాననేసరికి తన పగ కొడుకులు తీర్చాలన్నాడు. ఇందులో అర్ధం ఉందా? అర్ధం లేదనే పెద్ద కొడుకు వాదిస్తాడు. ఎప్పుడో జరిగిపోయినదాన్ని ఇప్పుడు పూసుకోవడంలో అర్ధం లేదంటాడు. అర్ధముందని హీరో చెప్పలేక పోతాడు. హీరో కాబట్టి, ఆయన  తండ్రి కాబట్టి,  అర్ధమున్నా లేకపోయినా పూనుకోవడం హీరోయిజం అవుతుందా అంటే  ఆలోచించాల్సిందే. ఆలోచనలో పడ్డామంటే హీరోయిజం కానట్టే. అందుకే హీరో చిన్నప్పుడే అతడి కళ్ళెదుటే కుటుంబానికి జరిగే  అన్యాయంతో బాటు, విలన్ని కూడా  ప్రత్యక్షంగా చూసినట్టూ  చూపించేసి,  ఆ భగభగ లాడే ఎమోషన్ ని చిన్నపట్నుంచీ రగిలిస్తూ ఎత్తుకుంటారు చాలా సినిమాల్లో. వాళ్లకి సినిమా అనే ఆటకి ఇంటలిజెంట్ గా గ్రౌండ్ రూల్స్ బాగా తెలుసు. హీరో పాత్ర ఎప్పుడూ ఫస్ట్ హేండ్ ఇన్ఫర్మేషన్ మీదే రియాక్ట్ అవుతుంది, అంతేగానీ సెకండ్ హేండ్ ఇన్ఫర్మేషన్ తో కాదు. అయ్యిందంటే  ఆ పాత్రకి సొంత వ్యక్తిత్వం వుండదు. 

        ఇలా చిన్నప్పుడు తను చూడని, అనుభవించని  తండ్రికి జరిగిన ఆర్ధికపరమైన మోసంతో హీరో కి ఎమోషనల్ కనెక్ట్ లేకుండా పోయింది. రెండోది, దేని మీదయితే హీరో రియాక్ట్ అవుతున్నాడో దాంట్లో సానుభూతి  పుట్టాలి మనకి. ఆ సానుభూతి బాధితుడు పుట్టించాలి. హీరో తండ్రి బాధితుడిగా అలాటి సానుభూతి పుట్టించాడా? ఇన్నాళ్ళూ దాని ఊసేలేకుండా గడిపేసి, ఇప్పుడు అప్పనంగా కొడుకుల ద్వారా తన మనోకామన తీర్చుకుని ప్రశాంతంగా కన్నుమూద్దామన్న స్వార్ధపూరిత  ధోరణిలోనే  కన్పిస్తాడు. దీంతో ఈ పాత్ర బ్యాడ్ క్యారక్టరైజేషన్ పాలబడింది. సానుభూతి పుట్టక పోవడానికి మరొక కారణ మేమిటంటే, ఈ తండ్రి- విలన్ బాల్య మిత్రులు. బాల్యంలోనే ఒక మోసం చేస్తాడు విలన్. అలాటి వాణ్ణి పెద్దయ్యాక మళ్ళీ ఎందుకు నమ్మాడు? ( ఇది పాత్రచిత్రణ లోపం). మొన్నొక హైదరాబాద్ లోకల్ సినిమా వచ్చింది- ‘గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్’ అని. అందులో చిన్నప్పుడు హీరోలిద్దరూ ఒకమ్మాయి కోసం కొట్టుకుంటారు. ఆ వేర్పాటు పెద్దయాక కూడా అలాగే కొనసాగుతూంటుంది. ఇదీ క్యారక్టర్స్ ఎష్టాబ్లిష్ మెంట్ అంటే. ఇలా ఎస్టాబ్లిష్ అయ్యాక ఇలాగే కొనసాగుతాయి పాత్రలు. 

        అప్పుడు ప్రస్తుత కథలో ఎలా ఉండాలంటే, హీరో తండ్రి – విలన్ బాల్యంలో మంచి మిత్రులే. అలాంటప్పుడు అప్పట్లో ఆ  మిత్రుణ్ణి కాబోయే విలన్ గా నెగెటివ్ గా చిత్రించ కూడదు. చిన్నప్పుడు ఏదో మోసం చేశాడనే పాయింటుని  కూడా ఎష్టాబ్లిష్ చేయకూడదు. చేస్తే ఆ రెండు పాత్రలూ అలాగే  ఎడమొహం  పెడమొహం గా కొనసాగాల్సి వుంటుంది. అప్పుడు పెద్దయ్యాక విలన్ గా మారిన అతడి చేతిలో హీరో తండ్రి మళ్ళీ మోసపోయే కథనమే రాదు.  బాల్యంలో హీరో తండ్రితో మంచిగా, పాజిటివ్ గా  వున్నవాడు పెద్దయ్యాక దుర్బుద్ధి పుట్టి మోసం చేశాడంటే, మోసం చేయడానికీ మోసపోవడానికీ అర్ధం వుంటుంది. ఇలాకాక చిన్నప్పుడూ మోసపోయి మళ్ళీ పెద్దయ్యాకా మోసపోయాడంటే ఆ డబుల్ వాయింపుడు తెలిసి చేసుకున్న ఆ తండ్రి ఖర్మ. సానుభూతి చూపించాల్సిన అవసరం హీరోకి కూడా లేదు. రివెంజికి బయల్దేరాల్సిన అవసరం అంతకన్నా లేదు. అందులో ఎమోషన్ ఉంటేగా.

        ఇలా ఎప్పుడైతే ఫస్ట్ హేండ్ ఇన్ఫర్మేషన్, దాంతోబాటు సానుభూతీ కరువయ్యాయో- అప్పుడా ఎమోషన్ అంతా హీరోకి కృత్రిమంగా పుట్టిన ఎమోషనే. 

        ఇక పరిణామాల హెచ్చరిక కూడా ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదు. పరిణామాల హెచ్చరిక ఎప్పుడూ విలన్ వైపు నుంచే వుంటుంది. హీరో స్కెచ్, దాని బ్యాక్ డ్రాప్ అంతా విలన్ కి తెలుసు. తెలిసినప్పుడు తనవైపునుంచీ గేమ్ ఎందుకు మొదలు పెట్టడు? తన ఎకైక తారక మంత్రంగా చేతిలో ఆ మ్యాగ్నెటిక్ గోల్ఫ్ బాల్స్ పెట్టుకుని ఏమిటి అతను  చేస్తున్న తెలివితక్కువ పని? 

        అనుకున్నది మొత్తం తలకిందు లవడమే కథనంలో అసలు సిసలు డైనమిక్స్ అని కదా? మరి ఇంటర్వెల్ బ్లాకులో విలన్ దగ్గరికి హీరో తనని తానూ అల్లుడిగా ప్రమోట్ చేసుకుని దెబ్బ కొట్టాలని వెళ్ళినప్పుడు, ఆ  విలన్ ఏం చేయాలి? ఇక్కడ మైండ్ గేమ్స్ అనీ ఇంకేదో అనీ  గొప్ప మాటలొద్దు. సినిమాల్లో పనీపాటా లేని చిత్రణలకి కూడా మైండ్ గేమ్స్ అనడం ఫ్యాషనై పోయింది.  హీరో అల్లుడిగా ఝలక్ ఇద్దామని అలా వచ్చినప్పుడు,  సింపుల్ గా విలన్ అనే వాడు ఆ గోల్ఫ్  బాల్స్ ముందు పడేసి- ఒకటి తీసుకుంటే నీ అయ్య బతికుంటాడ్రా.. రెండోది తీసుకున్నావంటే  నీ అయ్య అసలుకే చచ్చూరుకోవడం ఇప్పట్నించే మొదలెడ్తాడ్రా- అని కసికసిగా అనెయ్యాలా వద్దా? తాటిని దన్నేవాడొకడుంటే తలదన్నే వాడొకడుంటాడని- గోల్ఫ్ బాల్స్ తీసేసి, అక్కడ రెండు తాటి కాయలు పెట్టి ఇంటర్వెల్  బ్యాంగ్ గట్టిగా ఇవ్వాలా వద్దా?

ఫోకస్ = డైనమిక్స్ 
      కథమీద, ఏర్పాటు చేసిన మూలస్థంభం (స్టోరీ పాయింటు) మీదా ఫోకస్ వుంటే,  డైనమిక్స్ ఆ  కథానుగుణంగా, సజీవంగా మంచి పంచ్ తో బలంగా వుండే అవకాశముంది.  ఫోకస్ చెదిరిపోతే, లేదా అసలు మొదటి మూలస్థంభం స్పృహే లేకుండాపోయి  ముందుకు సాగిపోతే, కథనం దారి తప్పి పోవడమే గాక,  ఆయా సన్నివేశాల్లో రసోత్పత్తి కూడా లేకుండా పోతుంది. ఇక్కడ  ఇంటర్వెల్ బ్యాంగ్ అనే డైనమిక్ సన్నివేశం ఇలాంటిదే. ఇది కథమీద ఫోకస్ లేని, అసలు మొదటి మూలస్థంభం ( స్టోరీ పాయింట్) సోయేలేని, రసోత్పత్తి కూడా అడుగంటిన కృత్రిమ సన్నివేశంగా ఎలా మిగిలిందో చూద్దాం. 

        మొదటి మూలస్థంభంలో ఏర్పాటు చేసిన స్టోరీ పాయింట్ తండ్రి పగ తీర్చుకోవడం గురించి అయినప్పుడు,  హీరో ట్రాక్ వెళ్లి విలన్ ట్రాకుతో తో స్పర్శిస్తున్నప్పుడు, తండ్రియే  ఇక్కడ కేంద్ర బిందువు అవ్వాలి. ఎందుకంటే మొదలెట్టిన ఈ కథ హీరో- విలన్- మధ్యలో తండ్రీ ..వీళ్ళదే!  అంతేగానీ మధ్యలో వచ్చిన హీరో- విలన్- మధ్యలో హీరోయిన్ కథ కాదు. అయితే కథలో  చూపించినట్టు, ఇంటర్వెల్ బ్లాకులో  హీరోయిన్ ట్రాకుతో హీరో వెళ్లి విలన్ని కలవడం మంచిదే. అయితే అక్కడ విలన్ తాను కూతుర్నివ్వాలా వద్దా అన్న పాయింతో, ఇద్దరి మధ్యా గోల్ఫ్ బంతులతో ఇంటలెక్చువల్ పరీక్షలు  కాదు నిర్వహించాల్సింది. తన ఉనికియే ప్రమాదంలో పడ్డ విలన్ వెంటనే హీరో బలహీనతని అడ్డుపెట్టుకుని దెబ్బ తీయాలనుకోవడం యాదృచ్చికంగా పాల్పడే నష్టనివారణా చర్య అవుతుంది. సైకలాజికల్ గా దీనికి ప్రత్యాన్మాయం లేదు. హీరో బలహీనత ఇవాళ్లో రేపో పోయేట్టున్న తండ్రి ప్రాణాలు, ఈలోగా తండ్రి బతికుండగానే విలన్ వినాశాన్ని ఆయనకి చూపించాలన్న తాపత్రయం కదా? ఆ  తండ్రి ప్రాణాలేవో ఇప్పుడే తీసిపారేస్తే తనే పాతాళంలోకి కుంగిపోయి జన్మాంతం తండ్రి పట్ల అపరాధభావంతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు హీరో- ఇది కదా విలన్ కుండాల్సిన కౌంటర్ ప్లేతో తీసుకోవాల్సిన అప్పర్ హేండ్ పొజిషన్? మరి విలన్ ఏం పొజిషన్ తీసుకున్నాడు ఈ కథలో? 

        ఆఫ్టరాల్ హీరో తండ్రి కూడా ఎవరు- ఈ కథ పుట్టడానికి మూలబీజం అతనే కదా? అతణ్ణి  మూల పడేసి మళ్ళీ ఎప్పుడో ముగింపులో తప్ప తండ్రితో హీరోకి  మిలాఖత్ పెట్టకపోవడం వల్లే కదా,  ఆ తండ్రీ కొడుకుల మధ్య ఉండాల్సిన సెంటిమెంట్లూ మెలోడ్రామా-ఉద్విగ్న క్షణాలూ, బాండింగ్ మొదలైనవి సోసోగా వున్నాయి? ఇంటర్వెల్ బ్లాకులో ఒక వ్యూహంతో వెళ్ళిన హీరోకి,  అనూహ్యంగా విలన్ వల్ల ఏకంగా తండ్రి జీవన్మరణ సమస్యే ఉత్పన్నమవడం- అక్కడ్నించీ ఆ  తండ్రిని బ్రతికించుకుని, ఆయనకి విలన్ నినాశం చూపించడం కోసం హీరో పడే పాట్లు- అతణ్ణి వెంటాడుతూ విలన్ పొడిచే పోట్లు- అనే యాక్షన్ రియాక్షన్ ల సంకుల సమరం కాదా ప్రారంభంకావాల్సింది ఈ మిడిల్ విభాగం రెండో దశలో కథకి? తండ్రి కేంద్ర బిందువుగా పుట్టిన కథ మధ్యలో హీరోయిన్ కేంద్ర బిందువుగా చేసుకుని ఎలా పక్కదారి పడుతుంది  - ఇది ప్రేమకథ కానప్పుడు? 

        హాస్పిటల్లో వున్న తండ్రి ప్రాణం తీయడానికి ఎప్పుడో క్లయిమాక్స్ లో విలన్ వెళ్లినట్టు  చూపించారు- సెకండాఫ్ ప్రారంభం నుంచే ఆ పని మొదలెట్టాలి. అప్పుడే మొదటి మూలస్థంభంలో ఉండాల్సిన  ‘పరిణామాల హెచ్చరిక’ అనే మూడో ఎలిమెంట్ పుట్టుకొస్తుంది. హీరో తన లక్ష్యం కోసం బయల్దేరితే,  విలన్ వల్ల తండ్రికి ఏం జరగొచ్చో ఆ పరిణామాల హెచ్చరికతో ప్రేక్షకుల్ని కంగారు పెట్టడం! కథనమనే చేపల వేట (డైనమిక్స్) లో ఇలాటి పెద్ద చేపల్నే పట్టి థ్రిల్ చెయ్యాలి.
This is called true dramatic situation, for an active cinematic  experience!

         
స్ట్రక్చర్ అంటే ఇదే. మొదటి మూల స్థంభంలో వుండే ఈ నాల్గు ఎలిమెంట్సే- కథ సరైన పంథాలో, సరైన అర్ధంలో నడవడానికి దారి చూపించే దిక్సూచీ లు అయిన - పైన చెప్పుకున్న కోరిక – పణం - పరిణామాల హెచ్చరిక - ఎమోషన్ అన్నవి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో అంతర్భాగాలు. ఇవి ఉంటేనే కథ సరైన పంథాలో వున్నట్టు. ఈ స్ట్రక్చరూ వద్దు, పాడూ వద్దూ అని మా క్రియేటివిటీ మాకుంటుందని అనుకుంటే ఏమీ చేయలేం. ఎందుకంటే ముందుగా  స్ట్రక్చర్ వేరు, క్రియేటివిటీ వేరు అని అర్ధంజేసుకుని వుండాలి.  స్ట్రక్చర్ కి రూల్స్ వుంటాయి, క్రియేటివిటీకి ఏ రూల్సూ వుండవు. క్రియేటివిటీ కేవలం స్ట్రక్చర్ సహిత స్క్రీన్ ప్లేలో  సీన్లని  చెక్కే నగిషీ మాత్రమే. స్ట్రక్చర్ లో పెట్టి రాసిన సీన్ ని ఇలా తీద్దామా, అలా తీద్దామా, ఇంకెలా  తీద్దామా అన్నది వ్యక్తి వ్యక్తికీ వుండే టాలెంట్ ని బట్టే మారే సృజనాత్మక ప్రక్రియ. పైన చెప్పుకున్న నాల్గు ఎలిమెంట్స్ క్రియేటివిటీకి సంబంధించినవి కావు- మాకవసరం లేదని తీసి పారెయ్యడానికి. ఇది క్రియేటివిటీ పేరుతో బండి నడవకుండా చక్రాలు తీసి పారెయ్యడం లాంటిదిది. క్రియేటివిటీతో కథ నడవదు, స్ట్రక్చర్ తోనే, అందులో వుండే వివిధ ఎలిమెంట్స్ తోనే ఏ కథైనా నడుస్తుంది. ఈ ఎలిమెంట్స్ స్క్రూలు, నట్లు, బోల్టులు. విప్పిపారేస్తే  అంతే సంగతులు. 

క్యారక్టర్స్ = కన్ఫ్యూజన్ 
      హీరోయిన్ కి కలొచ్చే కథ చూస్తే, చిన్నప్పుడామె  తల్లిదండ్రులతో ఏర్ పోర్టులో వున్నప్పుడు కస్టమ్స్  అధికారులు  చెకింగ్ కి వస్తారు. ఇది చూసి టాయిలెట్ కని తండ్రి (విలన్) వెళ్ళిపోతాడు. ఆ బ్యాగులో డ్రగ్స్ బయటపడ్డంతో తనకే పాపం తెలీదంటున్నా కస్టమ్స్ వాళ్ళు  తల్లిని లాక్కెళ్ళి పోతారు. తండ్రి చాటు నుంచి చూస్తూంటాడు. తల్లి కోసం పిల్ల ఏడుస్తూ పరిగెడుతూంటుంది.

        ఇక్కడ తండ్రి ఉద్దేశం ఏమిటి- నిజంగానే తను దొరికిపోతాడన్న భయంతో భార్య పట్టుబడ్డా ఊరుకున్నాడా? అంత పిరికివాడా? లేకపోతే ఈ వంకతోనైనా  భార్యని వదిలించుకుందామనుకున్నాడా? అంత దుర్మార్గుడా? ఏమిటతను? స్పష్టత లేదు. తల్లి ఏదని పెద్దయాక కూడా తనని వెంటాడుతున్న కల దృష్ట్యా హీరోయిన్ తండ్రిని అడగదు. అధికార్లు కూడా తల్లిని పిల్లనుంచి దూరం చేసి తీసి కెళ్ళి పోతారా? బ్యాగేజీలో తండ్రి పాస్ పోర్టో మరోటో వుంటే అతణ్ణి పట్టుకోరా? పట్టుకోబోతే తండ్రి మేనేజ్ చేశాడా? అసలేం జరిగింది? ఈ అసమగ్ర సమాచారంతో కథ ఎందుకు? అప్పటినుంచీ ఇరవయ్యేళ్ళూ తల్లి జైల్లోనే వుండిపోయిందా? అదెలా సాధ్యం?  అదే ఇప్పుడు,  విలన్ హీరోని డ్రగ్ కేసులో ఇరికిస్తే వెంటనే హీరో బెయిల్ మీద బయటికి ఎలా వస్తాడు? 

        సరే, తల్లి అదృశ్య రహస్యం స్వయంగా తెలుసుకోవాలని అంత హైటెక్ గా తిరిగే  హీరోయిన్ కే లేదు. మరి ఆమె చేతులు పట్టుకుంటే ఆ కల హీరోకి తెలిసిపోవడ మేమిటి? ‘పీకే’ లో అమీర్ ఖాన్ మనుషుల చేతులు పట్టుకుంటే వాళ్ళ భావాలు తెలిసిపోతాయి. అతను అతీంద్రియ శక్తులున్న గ్రహాంతర వాసి గనుక ఆ పాత్రకి సరిపోయిందనుకున్నాం. ఇక్కడ హీరోయిన్ చేతులు పట్టుకుని చూసిన హీరోకి కూడా అలాటి సూపర్ నేచురల్ పవర్సే ఉన్నాయా? 

        హీరో కూడా హీరోయిన్ కి  తన లక్ష్య సాధనకోసం వలేసి- తీరా ఆమెని ప్రేమిస్తున్నట్టు చెప్పడ మేమిటి? ఆమె దూరమైతే ఏడ్వడమేమిటి? లక్ష్యం ప్రేమా- పగా? పాత్ర దిగజారిపోలేదా? కథ డిమాండ్ చేస్తున్న కథనం ప్రకారం హీరో ప్రేమలో పడకూడదు, హీరోయినే ప్రేమలో పడాలి. హీరోకి బదులు హీరోయినే ప్రేమలో పడితే  ఆమెకి నిజం చెప్పలేని మోరల్ డైలెమాతో ఆ ప్రేమ ట్రాకు అర్ధవంతంగా వుండే అవకాశామింది. 

        ఇక  హీరో అలా ఒకరకమైన గడ్డం పెంచుకు తిరగుతోంటే ఏ పాత్రకీ తెలుసుకోవాలని కుతూహలం కలగదా మనకి కలిగినట్టు - జీవిత భాగస్వామి కాబోయే హీరోయిన్ కి కూడా? ఆ పాత్రకీ గడ్డానికీ సంబంధమేమిటి? అది అతడి స్టయిల్ స్టేట్ మెంటా, లేక బాబా రాందేవ్ కి పబ్లిసిటీయా? అలాగే, వదిన పాత్ర ఉన్నట్టుండి ఏమైపోయింది- మామగారు చావుబతుకుల్లో వుంటే?  

        ఎప్పుడైతే హీరో ఉద్దేశాలు బయటపడ్డాయో విలన్ అతనిచ్చిన పెయింటింగ్ ని తన వెనుక గోడకి తగిలించుకుంటాడా? అందులో వున్న స్పై  కెమెరాకి  పాస్ వర్డ్ దొరికేలా అక్కడే  కూర్చుని శాటిలైట్ డివైస్ ని ఆపరేట్ చేస్తాడా? ఇంటర్వెల్ బ్యాంగ్ లోనే ఆ పెయింటింగ్ లోంచి కెమెరాని తీసి , హీరో చేతిలో పెట్టి వెళ్లి పొమ్మనడా? హీరో అట్టర్ ఫ్లాప్ అయి ఈ కథకి అక్కడే అడ్డుకట్ట పడదా?

        స్టాక్ మార్కెట్లో షేరు ధర ఒకేసారి వంద రెట్లు పెరిగి పోవడమేమిటి? అక్కడి (అమెరికాలో) నాస్డాకో మరోటో వెంటనే అప్రమత్తమై చర్యకి దిగదా? హీరో దొరికిపోయి ఈ కథ ఇంకో కథలా తయారవదా? 

        ఎకౌంట్ ని హ్యాకింగ్ చేసేటప్పుడు పదిహేను పదహారు డిజిట్స్ తో వుండే ఆ ఎక్కౌంట్ నంబర్ని క్షణకాలమే చూసి ఎలా గుర్తు పెట్టుకుంటాడు హీరో? ఈజ్ హీ ఏ  ‘పీకే’ ఆల్సో?

        వేలకోట్ల పౌండ్లు  ఎకౌంట్ లోంచి హాంఫట్ అయిపోతే విలన్ కంప్లెయింట్ ఇవ్వొచ్చుకదా? అది బ్లాక్ మనీ కాదుకదా? ఆ మనీ హీరో ఎకౌంట్ లోకే వెళ్ళింది కదా? హీరో ఇట్టే దొరికిపోతాడు కదా? జీవితాంతం ఊచలు లెక్కబెడతాడు కదా? అసలు ఏ బ్యాంక్ ఒకే సారి అంత మొత్తంలో ట్రాన్సాక్షన్ ని అంగీకరిస్తుంది? ఇది వదిలేసి డబ్బంతా పోయిందని  విలన్ రోడ్డున పడ్డం ఏమిటి? ఇతడికి కౌటిల్య అని ఇంటి పేరు! మళ్ళీ కోలుకోవడానికి గ్యాస్ కంపెనీ ఉందనుకుంటే అదీ బోగస్ గా హీరో ప్లాన్ చేసిందే అని తేలడ మేమిటి? ఒక విదేశంలో అంతంత ఉత్తుత్తి ప్లాంట్ కట్టి విలన్ కి అంటగట్టడం సాధ్యమేనా? అంత డబ్బెక్కడిది? అసలు అక్కౌంట్ లోంచే మొత్తం సంపదనంతా హీరో కాజేస్తున్నప్పుడు,  వేరే ప్లాంట్ కట్టి అమ్మనవసరం లేదుకదా? క్లయిమాక్స్ ఆ సెట్, షూటింగ్ ఖర్చూ వేస్టేగా? ఇంకా ఈ సినిమాలో వుండీ ఏమీ చేయని పాత్రల్లో ఆర్టిస్టులు నిర్మాతకి  భారం పెంచడానికే వున్నారు. 

        విలన్ కూడా అన్ని  వేలకోట్లు బ్యాంకులో ఎందుకు పార్క్ చేస్తాడు? సంపదని వివిధ షేర్స్, సెక్యూరిటీస్, స్థిర, చరాస్థుల రూపంలో కదా పెట్టుకుంటారు మల్టీ మిలియనీర్స్? వేస్టుగా బ్యాంకులో  పడేసి ఊరుకుంటారా?  అసలు విలన్ కి ఉన్నదంతా ఆ ఒక్క బ్యాంక్ బ్యాలెన్సే అని హీరో ఎలా ఊహించాడు? స్విస్ బ్యాంకులో కూడా దాచుకోవచ్చు. ఇండియాలో కూడా ఎసెట్స్ ఉండొచ్చు. అప్పుడు విలన్ ని ఎలా దివాలా తీయించినట్టవుతుంది? 

        ఈ కథకి ఇన్ని లాజిక్కులు తీయడం అవసరమా అన్పించ వచ్చు. మామూలు రివ్యూకి అవసరం లేదు. ఇక్కడ అవసరమే. సినిమా చూసేవాళ్ళకి ఆ వందరూపాయలతో పోతుంది. కానీ ముప్పై నలభై కోట్లు పెడుతూ ఇలాటి తూతూ మంత్రపు కథతో తీస్తే నిర్మాతకి చాలా పోతుంది. అలాగని ఎవర్నో సేవ్ చేయాలనీ ఈ రాతలు కాదు. ఔత్సాహిక దర్శకులకి,  రచయితలకి మాత్రమే. 

        ఇంతకీ తండ్రి చనిపోయే గడువు హీరో అనే నవంబర్ ఒకటా, విలన్ చెప్పే సెప్టెంబర్ ఒకటా? రెండు నెలలు వెనక్కి ఎలా వెళ్ళిపోతుంది? ఇప్పుడు బతికున్న మనిషి రెండు నెలలు వెనక్కి వెళ్లి  ఎలా చనిపోతాడు? ఇది కూడా కాలంలో వెనక్కి ప్రయాణించే సైన్సులో భాగమా?

        అసలు డాక్టర్లు చికిత్సకి లొంగని వ్యాధితో ఒక పేషంట్ ఇన్ని రోజుల్లో చనిపోతాడని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు. వాళ్ళు యమభటులు కాదుకదా. ఓ నెలో రెండు నెలలో అని గడువు చెప్పవచ్చు. ఓ నెలే అన్నా కూడా ఫర్వాలేదు. తెలంగాణా ఉద్యమ కాలంలో గులాంనబీ ఆజాద్ చెప్పినట్టు, నెలంటే ముప్పై రోజులే కాదు, ఐదు వారాలు కావొచ్చు, ఆరు వారాలూ కావొచ్చు ... 

        ఇదంతా ఎందుకంటే,  ముప్పై రోజులని కచ్చితంగా చెప్పడానికీ,  ఓ నెలరోజులు అనడానికీ కథనంలో చాలా తేడా వచ్చేస్తుంది. మొదటిది టైం లాక్ స్టోరీ లిమిట్ కింది కొస్తే, రెండోది ఆప్షన్ లాక్ స్టోరీ లిమిట్ కింది కొస్తుంది. టైం లాక్ స్టోరీ లిమిట్ అయితే ఆ కథా లక్షణం ఘడియల్ని లెక్కబెడుతూ పరిగెట్టేలా వుంటుంది. ఆప్షన్ లాక్ కి ఇంత సెన్సాఫ్ అర్జెన్సీ వుండదు. ప్రస్తుత సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కాదు కాబట్టి, ఓ నెలరోజులని  ఆప్షన్ లాక్ పెట్టుకుంటే సరిపోతుంది- ఇలాకాక ముప్పై రోజులే అని కచ్చితంగా గడువు పెడితే, దీనికి తగ్గట్టు లేని కథనంతో ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయడమే. 

       
ఈ కథాకథనాల, పాత్రచిత్రణల తీరు తెన్నులిలా ఉన్నాక, ఇక వీటికి కవరింగిస్తూ చేసిన సైన్స్ విన్యాసా లెలా వున్నాయో చూద్దాం.

ఫ్రాయిడ్ నుంచీ ఈస్ట్రోజెన్ దాకా 
       
     ‘కలి, సెక్స్, నిద్ర ఈ మూడూ మనుషులకి జంతువులకీ కామన్. కానీ మనుషుల్ని జంతువుల నుంచి వేరు చేసేదే ఎమోషన్’ -అన్న హీరో కొటేషన్ తో ఈ  కథ మొదలవుతుంది.
        ఒక  ఓపెనింగ్ కొటేషన్  తో మొదలయ్యే సినిమాలు  ఆ కొటేషన్ కే కట్టుబడి  అది ప్రతింబింబించే కథనే చెప్పుకొస్తూంటాయి చివరంటా. మధ్యలో ఇంకో కొటేషన్ ని –వేరేవేరే కాన్సెప్ట్స్ నీ ప్రవేశపెట్టి, ఉద్దేశించిన మొదటి కొటేషన్ నుంచి యూటర్న్ తీసుకోవడం  వుండదు. ఒక కథ ఒకే కాన్సెప్ట్ తో  వుంటుంది. ఈ కథలో  కూడా పై కొటేషన్ చెప్పిన హీరో,  ఆ కొటేషన్ భావమేమిటో దాన్నే పట్టుకుని  ఏకసూత్రతతో సాగిపోతే బాగానే వుండేది. దాన్ని మరుగున పడేసి బటర్ ఫ్లై ఎఫెక్ట్ కాన్సెప్ట్ అని ఎత్తుకోవడం, మళ్ళీ 45 డిగ్రీస్ కాన్సెప్ట్ అనడం, ఇంకో కార్బన్- ఎలెక్ట్రాన్ కొలీషన్ ...
un- fulfilled emotions  గురించి ఫ్రాయిడ్ సిద్ధాంతాలూ, ఇంకేవో భౌతిక, గణిత, రసాయన, జీవ శాస్త్ర సూత్రాలూ ముందుకు  లాగడం వంటివీ చేస్తాడు. ఇలా చేస్తూ  ఒక అసహజ- అబ్ నార్మల్ వ్యక్తిలా కన్పించే ప్రమాదంలో పడిపోతాడు.

        ఎమోషన్ కి సంబంధించి ఫ్రాయిడ్ చెప్పిన
un- fulfilled emotions  సిద్ధాంతాన్ని ముందుకు తెస్తూ, ఎమోషన్ ని అణిచి పెట్టుకుంటే కాలక్రమంలో అది పెద్దగా అయి విస్ఫోటించే ప్రమాదం వుంది కాబట్టి ఎప్పటి ఎమోషన్ ని అప్పుడే దింపుకోవాలని అంటాడు. ఈ దింపుకునే మిషతో వాళ్ళనీ వీళ్ళనీ  కొట్టేస్తూంటాడు. దీంతో అతడిది ఒక ఆరోగ్యకర మానసిక స్థితిలా అన్పించదు. అసలు తను ఉంటున్న లండన్ లాంటి నగరంలో ఎప్పుడో అరెస్టై పోయే చర్యలవి. తను మొదట్లో చెప్పిన కొటేషన్ కీ ఫ్రాయిడ్ కీ కూడా పొసగదు.  మనుషుల్ని జంతువుల నుంచి వేరు చేసేదే ఎమోషన్-  అని హీరో అంటాడు. ఇదెలా? ప్రాణమున్న జీవి అన్నాక దేనికైనా ఎమోషన్ వుంటుంది కదా? ఇతర జీవుల్నుంచీ మనుషుల్ని వేరు చేసేది ఎమోషన్ ఎలా అవుతుంది- విచక్షణా జ్ఞానం కాదా? జంతువులకి లేనిదీ మనుషుల కున్నదీ విచక్షణా జ్ఞానమే. ఇలా కన్ఫ్యూజ్ చేసే  కొటేషన్ తో,  ఓ మనిషిగా అలాటి విచక్షణా జ్ఞానాన్ని తనే కోల్పోయి,  జంతువులతో సమానం కావడం లేదా? ఫ్రాయిడ్ కి కూడా తప్పుడు భాష్యమివ్వడ మేమిటి? ఎమోషన్ ని దింపు కోవాలంటే జంతువులా విచక్షణా జ్ఞానం కోల్పోయి మనుషుల మీద దాడి చేయమని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడా- చెబితే గిబితే, యాంగర్ మేనేజ్ మెంట్ కోర్సుకి వెళ్ళమని చెప్పి ఉంటాడేమో. . 

కాన్సెప్ట్ కి దూరంగా ఎమోషన్ 
      సాధారణ విషయానికి లేనిపోని సిద్దాంతాలూ, బిల్డప్పులూ ఏవీ లేకుండా ఇంతవరకూ సినిమాల్లో సింపుల్ గా, హాయిగా చెప్పేసింది  ఇతనొక రెబెల్ క్యారక్టర్ అనే, ఇంతే. ఈ కథలో హీరో పాత్ర ఓన్లీ రెబెల్ క్యారక్టర్. చర్యల్లో ఇది బయటపడుతున్నాక, సైద్ధాంతిక వివరణలు అవసరం లేదు. ఎమోషన్ అంటే కూడా ఒక్క ఆవేశం అనో ఉద్రేకమనో అర్ధం వచ్చేట్టు పదప్రయోగం చేయడం ఈ మధ్య కాలం నుంచే  తెలుగు సినిమాల్లో ఎక్కువగా జరుగుతోంది. 
మాట్లాడితే ఎమోషన్, మాట్లాడితే ఎనర్జీ అంటున్నారు. ఆ చూపించే ఎమోషన్స్ అర్ధవంతంగా లేకపోగా, ఎనర్జీ కూడా బౌద్ధికంగా వుండడం లేదు. ఎమోషన్స్- అనగా భావోద్వేగాలు-  వివిధ రకాలు. ప్రేమ కూడా ఒక ఎమోషనే. నవరసాలన్నీ ఎమోషన్సే. హీరో ఆవేశపరుడైన రెబెల్ కాబట్టి ఇదే హీరోని హాలీవుడ్ సినిమాల్లోనైతే పరివర్తన చెందేలా చూస్తారు. లేకపోతే క్యారక్టర్ గ్రోత్ కన్పించక నిద్ర పట్టదు అక్కడి రైటర్లకి, డైరెక్టర్లకి. మన సినిమాల్లో హీరో ఎలా వున్న వాడు అలాగే వుండిపోతాడు మానసిక ఎదుగుదల లేకుండా. ఇప్పుడూ ఇదే జరిగింది : తనకింత  ఆవేశం తప్పని హీరో  ఎక్కడా తెలుసుకోడు, ఇదే రైట్ అన్నట్టుగా ప్రేక్షకులకి నెగెటివ్ సిగ్నలిస్తున్నట్టు ఉంటాడు. 

        సరే ఇంత  ‘ఎమోషన్’ తో కూడా చేసింది... తండ్రికి  జరిగింది తెలుసుకున్నాక,  విలన్ మీద పగ దీర్చుకోవడానికి ఒక  దీర్ఘకాలిక ప్రణాళిక రచిస్తాడు. ఇదెందుకు? తను  ఫిజికల్ యాక్షన్ ఓరియెంటెడ్ క్యారక్టర్ అయినప్పుడు, ఈ మెంటల్ యాక్షన్ ఎలా వస్తుంది? అలవాటుగా ఏం చేస్తాడో అదే చెయ్యాలి. వెంటనే  విలన్ మీద  భౌతిక దాడి జరపాలి. అప్పుడా క్యారక్టరైజేషన్ నిలబడుతుంది. రెబెల్ క్యారక్టర్స్ ధోరణే ఇంత. హీరో ఎప్పుడైనా కోపం తగ్గించుకోవడానికి ఒకళ్ళని కొట్టేశాక, శాంతించి-  ‘ఇప్పుడు  నో ఎమోషన్స్ - జీరో ఎనిమీస్’ – అంటాడు. అదెలా? అలా దెబ్బలు తిన్న వాళ్ళు కొత్త శత్రువులు కాకుండా పోతారా? సరే, మరి ఇదే తరహాలో  విలన్ని కూడా కొట్టేసి -  ‘నో ఎమోషన్స్ - జీరో ఎనిమీస్’ – అనొచ్చుగా? క్యారక్టరైజేషన్ ని  అన్నిచోట్లా క్యారీ చేస్తూండాలి కదా అలా ఎష్టాబ్లిష్ అయ్యాక? అప్పుడే ఇలా విలన్ని  కొట్టేస్తే  కథ నడవదు కదా అనొచ్చు. మరి ఇలాటి క్యారక్టరైజేషన్ తో ముందరి కాళ్ళకి బంధం ఎందుకేసుకోవాలి?  

అదిగో నవలోకం.. 
      పైన చెప్పుకున్న మానసిక శాస్త్ర ప్రపంచాన్ని వదిలేసి, మరో కొత్త లోకాన్ని  ఎత్తుకుంటాడు. అది భౌతిక శాస్త్రం. ప్రపంచంలో ఎక్కడో చోటు చేసుకునే ఒక చిన్న కదలిక ఇంకెక్కడో మరో కదలికకి దారి తీస్తుందని మరో కాన్సెప్ట్ ఎత్తుకుంటాడు. చైనాలో సీతాకోక చిలుక రెక్కలు రెపరెప లాడిస్తే అది అమెరికాలో పెను తూఫానుకి దారితీయొచ్చని, బటర్ ఫ్లై ఎఫెక్ట్ గురించి చెప్పుకొస్తాడు.  ఈ ప్రకారం కొన్ని సంఘటనల్ని చూపిస్తాడు. ఎమోషన్ గురింఛి ప్రారంభంలో చెప్పిన కొటేషన్ తో, లేదా కాన్సెప్ట్ తో ప్రారంభమైన కథకీ దీనికీ సంబంధ మేమిటి? తండ్రి మాటతో ఒక గోల్ పెట్టుకున్న హీరోకి తప్పో ఒప్పో ఎమోషన్ గురించి చెప్పిన ఒక కొటేషన్ కనెక్ట్ అయిందే అనుకుందాం, మరింతలో ఈ కాన్సెప్ట్ ని  పూర్వపక్షం చేస్తూ, మరో కాన్సెప్ట్ తో ఎలా కొత్త బాట పడతాడు? అడుగడుగునా మరిన్ని కాన్సెప్ట్స్ ప్రతిపాదిస్తూ ఎలా పోతాడు? తండ్రికి మాటిచ్చి వేటకి బయల్దేరింది మొదలు హీరోయిన్ తో ప్రారంభించే ఎపిసోడ్స్ అన్నీ రకరకాల సైన్స్ ప్రదర్శనలే కదా? ఇందులో లవ్ కి సంబంధించి కార్బన్- ఎలెక్ట్రాన్ ల కొలీషన్, హీరోయిన్ కి తండ్రితో గల సాన్నిహిత్యానికి సంబంధించి ఎలెక్ట్రా కాంప్లెక్స్,  హీరోయిన్ కిడ్నాపయితే రోడ్డు మీద పడున్న బాటిల్ తో 45 డిగ్రీస్ థియరీ ( బాటిల్ మూతి సూచిస్తున్న దిశని పట్టుకుని అదో థియరీ అంటూ కిడ్నాపర్స్ కోసం అటే పరిగెట్టడం- ఈ థియరీ ఫెయిల్ అయ్యింది). కిడ్నాపర్స్ తో ఫైటింగులో  హీరోయిన్ని ఆమె కాలిచెప్పుని 55 డిగ్రీల కోణంలో  పెట్టమని చెప్పి- దాన్ని బట్టి వెనుక నుంచి వస్తున్న కిడ్నాపర్ ఎత్తు, బరువు, దూరం వగైరా కంప్యూటర్ లా క్యాలికులేట్ చేసి మరీ ఎగిరి కొట్టడం ( ఇది జీర్ణించుకోవడానికే కాదు, అర్ధమవడానికీ  చాల ఓవర్), రెస్టారెంట్ లో కాంతి వక్రీభవనం గురించి, ప్రతిబింబాల గురించీ..ఇలా లేనిదంటూ లేదు  సైన్స్ విన్యాసాలు. నువ్వు మొద్దు పెట్టుకున్నా నాకేం ఫీలింగ్ కలగదని హీరోయిన్ అంటే, ఆ ఫీలింగ్ వుందో లేదో నీ ఈస్ట్రోజెన్ లెవెల్ చూసి తెలుసుకుంటానని, ఓ వెంట్రుక పీక్కుని వెళ్తాడు. ఈ చర్య వెనుక వేరే ఉద్దేశం వున్నా, మళ్ళీ ప్రేక్షకులకి అర్ధమవకుండా ఈస్ట్రోజెన్ అనకుండా హార్మోన్స్ అంటే సరిపోయేది. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇదలా ఉంచితే,  ఆ ముద్దుపెట్టిన సమయంలో పెరిగే హార్మోన్ లెవెల్స్ ఇంకలాగే గడ్డ గట్టుకుని వుండిపోతాయా లాబ్ లో పరీక్షల కివ్వడానికి? ఈ అనుమానం హైటెక్ హీరోయిన్ కి కలిగి వెంట్రుక వూడలాక్కోదా? తన ఫిజియాలజీ తనకే తెలీని హైటెక్ హీరోయిన్ పాత్ర ఉంటుందా శరీర ఉపరితల పోషణ తెలిసి? 

        ఆ వెంట్రుక తీసుకున్న హీరో ల్యాబ్ పరీక్షకిచ్చి, ఆమె తల్లి డీఎన్ఏ తో మ్యాచింగ్ చూస్తాడు. లండన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న హీరోయిన్ తల్లి రక్త నమూనాని ఎలా సేకరించాడు హీరో? ఆ తల్లీ కూతుళ్ళని కలిపిన హీరో, వాళ్ళని విలన్ ముందు నించోబెట్టి, దీనికేం సమాధానం చెప్తాడో ఎందుకు చెప్పించడు హీరో? కథకి అవసరం కదా?

ఏ కథ- ఏ పాత్ర 
      ఇదేం  సైన్స్ ఫిక్షన్ కథకాదు, అది అందులోని పాత్రా కాదు. సైన్స్ ఫిక్షన్ కథై, అలాంటి సైంటిస్టు పాత్రై వుంటే, ఆ సైన్స్ వాతావరణమంతా, ఆ వాతావరణంలో వున్న హీరో సైతం  సైన్సు సంగతుల్ని ప్రకటిస్తూ పోతూంటే ఓకే. అయినా ప్రారంభంలో ‘ఎమోషన్’ కి  ప్రతిపాదించిన కాన్సెప్ట్ దీనికి అడ్డు పడుతూనే వుంటుంది.
        క్రిస్టఫర్ నోలన్ తీసిన ‘ఇంటర్ స్టెల్లార్’  రెండు గ్రహాల మధ్య జరిగే సైన్స్ ఫిక్షన్ కథ. అది తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధాలకి సంబంధించిందే అయినప్పటికీ, సైంటిస్ట్ అయిన హీరో  గురుత్వాకర్షణ గురించీ, కాలయానం గురించీ, వార్మ్ హోల్స్ గురించీ...ఇలా సైన్స్ విషయాలు మాటాడ్డంలో అర్ధముంది. 

        పోనీ ఇది పోలీస్- డిటెక్టివ్ కథా కాదు, అది అందులోని పాత్రా కాదు. అలాటి నేరపరిశోధక కథై, అలాటి షెర్లాక్ హోమ్స్ లాంటి పాత్రై వుంటే, ఆ వాతావరణ నేపధ్యంలో హీరో తెలివి తేటల ప్రదర్శనతో బాటు, సంఘటనల కార్యాకారణ సంబంధాల గురించీ, క్లూస్ ఏరుకుని వాటికీ వివరణల గురించీ ఎంత మాటాడినా అర్ధముంటుంది. అయినా ప్రారంభంలో ‘ఎమోషన్’ అంటూ ప్రతిపాదించిన కాన్సెప్ట్ దీనికీ  అడ్డు పడుతూనే వుంటుంది. 

        ‘మనోరమ –సిక్స్ ఫీట్ అండర్’ అనే హిందీ మర్డర్ మిస్టరీలో హీరో పీ డబ్ల్యివ్ డీ ఇంజనీరే అయినా డిటెక్టివ్ నవలా రచయిత కాబట్టి, వూళ్ళో జరిగిన ఆ మర్డర్ కి క్రైం డిటెక్షన్ ప్రారంభించినా మన కభ్యంతర మన్పించలేదు. 

        కానీ మన హీరో కేవలం ఉద్యోగం పోగొట్టుకున్న సగటు హీరోయే. ఓ బిగ్ షాట్ కీ తనకీ  మధ్య జరిగే రివెంజి డ్రామా మాత్రమే ఇది. ఈ సెటప్ లో పైన చెప్పుకున్న సైన్స్ ఫిక్షన్ సెటప్, పోలీస్- డిటెక్టివ్ టైపు సెటప్ రెండూ ఉండేందుకు అవకాశం లేదు సృజనాత్మకంగా. హీరో పాత్ర కూడా సైంటిస్టో, షెర్లాక్ హోమ్సో కాదు- ఉద్యోగం పోగొట్టుకున్న సగటు హీరో అతను. ఎమోషన్ కో  భాష్యం చెప్పి ప్రారంభించిన రివెంజి జానర్ కథకీ, సైన్స్ ఫిక్షన్ జానర్ని తెచ్చి ఇలా అతికించలేం. అలాగే పోలీస్- డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ జానర్ని కూడా ఇలా తెచ్చి జోడించలేం. రివెంజి, సైన్స్ ఫిక్షన్,  పోలీస్- డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఈ మూడూ వున్నవి వున్నలాగా ఒకదాంట్లో ఒకటి ఇమడని విజాతి జానర్లు.  రివెంజి డ్రామా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ జానర్ కిందికొస్తుంది.  హాలీవుడ్ లో రెండు మూడు జానర్స్ కలిపి తీసిన సినిమాలు వున్నాయి. అయితే అది హారర్ - మిస్టరీ- ఇన్వెస్టిగేషన్ బేస్డ్ వంటి సజాతి జానర్ల సంకరమే. విజాతి జానర్స్ అయిన సైన్స్ ఫిక్షన్నీ- క్రయిం  ఇన్వెస్టిగేషన్నీకలిపి తీయలేదు. విజాతి జానర్స్ అయిన గ్రహాంతర వాసులతో కూడిన సైన్స్ ఫిక్షన్ని, అడ్వెంచర్ జానర్ అయిన పురాతన కాలపు కౌబాయ్ ల కథతో కలిపి మొదటి సారిగా గమ్మత్తయిన ‘ఎలియన్స్ అండ్ కౌబాయ్స్’  అనే ప్రయోగం చేశారు.  రివెంజి డ్రామా యాక్షన్ జానర్ లోకొస్తుంది. ఎత్తుకు పై ఎత్తుల ఈ  జానర్ లోనే బోలెడు మైండ్ గేమ్స్ తో బుర్ర వేడెక్కిపోతుంది. దీన్ని మళ్ళీ వేరే సైన్స్ పజిల్స్ పెట్టి, క్రైం థింకింగ్ పెట్టి కన్ఫ్యూజ్  చేసి శిరోభారంగా మార్చనవసరం లేదు. 

        కాదూ కూడదని ఒకవేళ...ఒకవేళ...ఇలాగే తీస్తామని పట్టుబడితే, ఇందుకు ఎందరెందరో వేసిన రాచబాట లేదా? ఎందుకులేదు ...

రాచబాట రకరకాలు 
      ఈ సినిమాలో స్టారేంటో మాటాడుకోకుండా,  బటర్ ఫ్లై ఎఫెక్ట్!  బటర్ ఫ్లై ఎఫెక్ట్! అని ఒకటే చెప్పుకుంటున్నారు- అదేదో ఇలాటి సినిమాలు తెలుగులో ఎప్పుడూ లేనట్టు! సూడో మేధావులకి సూడో అభిమానులు తోడయితే ఇంతే. ఆడే సినిమా కూడా ఆడకుండా రాబోయే ప్రేక్షకులని తమ ప్రకటనలతో భయపెట్టేస్తారు. ఈ సినిమా ఇలాటి రాంగ్ పబ్లిసిటీ బాధిత చలనచిత్రమే.
        ఈ కథని ఎక్కడా బటర్ ఫ్లై ఎఫెక్టు అని పేరు చెప్పకుండా రాసి వుంటే ఎలావుండేది? 1946 నుంచీ హాలీవుడ్ లో డజన్ల సంఖ్యలో  సినిమాలు బటర్ ఫ్లై ఎఫెక్ట్ మీద వచ్చాయి. ఇన్నాళ్ళకి మనకీ ఒకటి వచ్చిందని సంబరపడ్డం ఏమిటి- తెలుగులోనూ బోలెడు బటర్ ఫ్లై ఎఫెక్ట్ సినిమాలు వచ్చాయి. కాకపోతే అవి అలా చెప్పుకోలేదు. ఎందుకు చెప్పుకోలేదంటే, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చెపినట్టు, మూలాల్ని దాచిపెట్టడం  సృజనాత్మక ప్రక్రియలో భాగం గనుక.   

        బటర్ ఫ్లై ఎఫెక్ట్ గురించే కాదు, బోలెడు ట్రాజడీ కథలతో వచ్చిన సినిమాల్లో కూడా వాటిలో కర్మ సిద్ధాంతం గురించి చెప్పామని చెప్పుకోలేదు. ‘మరో చరిత్ర’  తీసిన బాలచందర్ చివరికి హీరో హీరోయిన్లు చనిపోవడం కర్మసిద్ధాంతమని ఎక్కడా చెప్పలేదు. చివర్లో ఆ పాత్రలు హతమవడానికి అవి చేసుకున్న కర్మలని (సరిత ఒక విలన్ టీజ్ చేశాడని కొట్టి వాడిలో కక్ష రేపడం, అటు కమల్ మాధవిని తిరస్కరించి ఆమె అన్నకి శత్రువవడం)  చూపిస్తూ- ఇలా కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నట్టు గానీ, దాని ప్రకారం ఆ సంఘటనలు ఎక్కడికి దారితీస్తాయో చూడమన్నట్టు గానీ  సూచనప్రాయంగానైనా చెప్పలేదు. అది కథ చెప్పే కళ కాదు కనుక. అలా చెబుతూ  చూపిస్తే  కచ్చితంగా నవ్వుకునే వాళ్ళు ప్రేక్షకులు. 

        తమిళ డబ్బింగ్ ‘12b’   బటర్ ఫ్లై ఎఫెక్ట్ ఆధారంగానే చెప్పకుండా తీశారు. జర్మన్ పాపులర్ థ్రిల్లర్  ‘రన్ లోలా రన్’ లో వున్నది  బటర్ ఫ్లై ఎఫెక్టే. హాలీవుడ్- ‘బ్యాక్ టుది ఫ్యూచర్- 2’, మిస్టర్ డిస్టినీ’, ‘ఏ సౌండ్ ఆఫ్ థండర్’... ఇలా ఎన్నో. ఇక దాదాపు ప్రతీ సినిమాలో బటర్ ఫ్లై ఎఫెక్ట్ సన్నివేశాలు నిత్యం చూస్తూంటాం. ‘శివ’ లో ప్రారంభ దృశ్యాల్లో  జేడీ క్యారక్టర్ అమల క్యారక్టర్ ని  టీజ్ చేయడమనే చిన్న సంఘటన, పోనుపోను పెద్ద మాఫియా రఘువరన్ క్యారక్టర్ అంతానికే దారి తీస్తుంది. ఇది బటర్ ఫ్లై ఎఫెక్ట్ కాక ఏమిటి? ఇప్పటి ‘డిక్టేటర్’ లో కూడా ఒక వ్యక్తి కోసం గాలిస్తున్న గ్యాంగ్ హీరోయిన్ని వేధించడమనే చర్య,  మొత్తంగా ఆ గ్యాంగ్ హతమవడానికి  దారితీయడం బటర్ ఫ్లై ఎఫెక్టే. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లో చిన్నప్పుడు నాగార్జున పాత్రని,  రమ్య కృష్ణ తల్లి పాత్ర ఆడగాలి సోకకుండా పెంచే చర్య, పెద్దయ్యాకా అతడి  దాంపత్య జీవితానికే గొడ్డలిపెట్టు అవడం బటర్ ఫ్లై ఎఫెక్టే. నిజజీవితంలో చూస్తే, ఆనాడు దక్షిణాఫ్రికాలో మాహాత్మా గాంధీని రైల్లోంచి తోసేసిన చిన్న సంఘటనే, తర్వాతి కాలంలో భారత దేశానికి స్వాతంత్ర్యమనే మహా సంఘటనకి దారి తీయడం, ఆనాడు  కేసీఆర్ కి చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వని చిన్న కారణం, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి దారి తీయడం..ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.  ఏ చర్య, ఏ సంఘటనా వృధా పోదు. మంచో చెడో జరిగే తీరుతుంది. చిల్లు పడ్డ కుండలో నీళ్ళు మోసేవాడు నీళ్లన్నీ వృధా పోతున్నాయని బాధ పడకూడదు. ఆ కారిన నీటితో కొన్ని మొక్కలు మొలకెత్తవచ్చు
. There's no wastage in God's grand economy అన్నారు కదా? 

       
ఇలాటి కథనాలు సినిమాల్లో నిత్యకృత్యాలు. వాటికి ఫలానా మూలమని గొప్పగా చెపుతున్నట్టు కొత్తగా ఫీలయి ఇప్పుడు చెబితే - ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పుకున్న న్యూటన్ చలన సూత్రాలతో  చేసినట్టే అవుతుంది  నిర్వాకం. 

        ఇదే జరిగింది ప్రస్తుత కథలో. బటర్ ఫ్లై ఎఫెక్ట్ అనీ, 45 డిగ్రీస్ అని ఇంకేదో అనీ చెప్పి సీన్లు చూపించడంతో, వీటిని పట్టుకుని విషయం పక్కకి వెళ్ళిపోయింది. పైగా రివెంజి కథలో ఇవన్నీ ఎందుకు చెబుతున్నట్టని విమర్శలపాలు అవ్వాల్సివస్తోంది. ఇదే చూపించిన సంగతులు వేటికీ,  ఫలానా సూత్రాలు  ఆధారాలని చెప్పకుండా ఈ కథ రాసి వుంటే? 

        అప్పుడు ప్రేక్షకులు ఇంకే పేచీ లేకుండా అదంతా రివెంజి డ్రామాలోనే భాగంగా తీసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈ వ్యాసం ప్రారంభంలో జేమ్స్ బానెట్ గురించి చెప్పినట్టుగా- దాన్ని ఎక్సర్ సైజ్ అని చెప్పకుండా పిల్లలచేత హుషారుగా గేమ్స్  ఆడించినట్టు.

        ఇంకో స్క్రీన్ ప్లే పండితుడు రాబర్ట్ మెక్ కీ కూడా ఇదే చెప్తాడు : స్క్రీన్ ప్లే శాస్త్రమంతా నేర్చుకున్నాకా ఆ శాస్త్రం గురించి ఆలోచించక మర్చిపొమ్మని. నేర్చుకున్న ఆ శాస్త్రం ఆటోమేటిగ్గా నువ్వు రాసే  స్క్రీన్ ప్లేలో దిగుమతయ్యేలా నీ సబ్ కాన్షస్ చూసుకుంటుందని.. 

        ఆ స్క్రీన్ ప్లే పదజాలమంతా  కూడా మర్చిపోతే ఇంకా మంచిది. రివ్యూలేవో  రాయాల్సి వచ్చినప్పుడు ప్లాట్ పాయింట్లనీ, టైం లాక్- ఆప్షన్ లాక్ అనీ, మూలస్థంభాలనీ, కోరిక, పణం, గిణం, ఋణం లాంటి ఎకడెమిక్ పదజాలాల్ని వాడాల్సి వస్తోందిగానీ, మామూలుగా మాటాడుకుంటున్నప్పుడు ఈ పదజాలాల్ని వాడడం పాండిత్య ప్రదర్శన లాగా ఎబ్బెట్టుగా వుంటుంది. 


        సైన్సుని ఎంతయినా పాత్రల చేత మాటాడించి నవలగా  రాయొచ్చు. అలా రాయకపోతే ఆ నవల అర్ధం గాదు. ప్రింట్ మీడియాకుండే స్వేచ్ఛ వేరు, సినిమా అనే మాస్ మీడియా కుండే పరిమితులు వేరు. ఒక సైన్సు ని  వెలగ బెట్టిన స్టూడెంట్ గా ఈ వ్యాసకర్తకి ఏమనిపిస్తోందంటే- ఇలాటి సినిమాలో  సైన్సు లాజిక్కులేమిటి-  అసలు కథకి అవసరమైన ముఖ్యమైన లాజిక్కులు లేకుండా అనేసి! 


ఫీల్ తో ఫుల్ మజా
 
      చిన్నప్పుడు చదువుకున్న ‘నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం’ అనే రష్యన్ పాపులర్ పుస్తకం ఈ సందర్భంగా గుర్తుకొస్తోంది. అందులో మన చుట్టూ జరిగే సైన్స్ విషయాలని చాలా వినోదాత్మక ఉదాహరణలతో చెప్పుకు పోవడం వుంటుంది. బెలూన్ ఎందుకు శబ్దం చేస్తూ పేలుతుంది- దీంట్లో వున్న సైన్స్ ఏమిటి,  సూది ఎందుకు గుచ్చుకుంటుంది - దాంట్లో వున్న సైన్స్ ఏమిటి, తుపాకీ గుండు ముందుకెలా దూసుకెళ్తుంది – దీంట్లోని సైన్సేమిటి...ఇలా ఎన్నో విషయాల్ని వినోదాత్మకమైన సంఘటనలతో  వివరిస్తాడు రచయిత యాకోవ్ పెరెల్మాన్. షుగర్ కోటింగ్ వేసి విజ్ఞానాన్ని వినోదాత్మకం చేయడమన్న మాట. . 

        ప్రస్తుత సినిమా స్క్రీన్ ప్లేలో ఎత్తుగడలో చెప్పిన మంచిదో చెడ్డదో అయిన కొటేషన్ ప్రకారమే కథ నడుస్తోందనిపించేలా చూడ్డం చాలా ముఖ్యం. అలా సైన్సునీ, ఇన్వెస్టిగేషన్ తరహా కథనాన్నీ కలగలిపి చూపించాలంటే, వీటి శాస్త్ర పదజాలం ఎక్కడా వాడకుండా, ఇది ఫలానా అని చెప్పకుండా, చూపించుకు పోయినప్పుడు, పై పుస్తకం తరహాలో చాలావరకూ నయంగా వుండేది. అసలు ఈ పుస్తకంలో వున్న లాంటి నిత్యం మనకు అనుభవమయ్యే చిన్న చిన్న సైన్స్ సంగతులతో ఆ లవ్ ట్రాకుని నింపేసి వుంటే ఇంకా బావుండేది. 

        బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటూ డైరెక్టుగా చెప్పేయడమే గాక, ఆయా సన్నివేశాల్లో సీతాకోక చిలుకని కూడా చూపిస్తూ పోయారు. ఇంత  హార్డ్ హిట్టింగ్ గా ఎత్తి చూపకుండా, ఆయా సీన్లలో జరుగుతున్న బిజినెస్ ని ప్రేక్షకుల  ఫీల్ కే వదిలెయ్యడం ఉత్తమ కథా రచన. పరోక్షమైన సింబాలిజాలు, మెటాఫర్స్ ఇందుకే వాడతారు.  ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో టైం మెషీన్ రకరకాల రూపకాలంకారాలతో ( మెటాఫర్స్ తో) కళాత్మకంగా రూపొందించిన యంత్రం. ఆ రూపకాలంకారాలతో శివుడి గుర్తులు కూడా వుంటాయి. శివుడు దేనికి సంకేతమో తెలిస్తే ఈ సినిమా కాన్సెప్ట్ ని అది ప్రకటిస్తున్న తీరూ  అర్ధమైపోతుంది. సైన్సుకి ఆధ్యాతికతని జోడిస్తే అది గొప్ప అనుభూతినిస్తుంది. ఆఫ్టరాల్ టెక్నాలజీ అంతా ఆధ్యాత్మికతే  కదా? ‘రోబో’ లో చివర్లో అసంఖ్యాక రోబోలు పుట్టుకురావడం రావణుడి మెటాఫర్. చంపినకొద్దీ పుడుతూనే ఉంటాడు రావణుడు. అలాగే సైన్సు ని జాగ్రత్తగా వాడుకోకపోతే, అది సృష్టించే బీభత్సాన్ని మట్టుబెట్టలేమని సందేశం. ‘పీకే’లో కూడా సైన్స్ ఫిక్షన్ కి ఆధ్యాత్మికతని జోడించి మంచి ఫలితాల్ని పొందారు.

        ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ ఆధారంగా తీసిన ‘ఆదిత్య-369’  అనే సైన్స్ ఫిక్షన్లో అయితే అసలెక్కడా సైన్స్ సూత్రాలే చెప్పరు. కాంతి వేగమంటూ, అభికేంద్రీయ శక్తి అంటూ ఎక్కడా మాటాడుకోవు పాత్రలు. ‘జురాసిక్ పార్క్’ లో శిలాజాల సైన్స్ గురించి కొద్ది మాటల్లో చెప్పి ముగిస్తాయి పాత్రలు. ‘పీకే’ లో సైన్స్ ఎక్కడా చెప్పలేదు, ‘కోయీ మిల్ గయా’ లో చెప్పలేదు, ‘జోకర్’ లో కూడా చెప్పలేదు. వెండితెర మీద జరిగేదాన్ని ఆడియెన్స్ ఫీలవ్వాలి. ఫీల్ కి పేర్లు పెట్టి విషయం చెప్పేస్తే ఫీల్ అంతా పోయి, వ్యతిరేక ఫలితాలొస్తాయి. ఈ ఫీలవడాన్ని సబ్ టెక్స్ట్ అంటారు. ఇది మామూలు సినిమాల్లో చాలా డైలాగుల్లోనే ప్రవహిస్తూంటుంది. అర్ధోక్తిలో ఆపిన డైలాగుల ద్వారానో, ఇన్ డైరెక్టుగా చెప్పిన డైలాగుల్లోనో...ఇలాటిదే జరగాల్సింది ఈ కథలో.

        ఇలా చేసి చూపించిన వాడే  ‘మయూరి’ తో అశ్విన్ శరవణన్. మనకంటూ కొన్ని దుగ్ధ లుండొచ్చు. వాటిని  తీర్చుకోవాలంటే మెళ్ళో వేసుకు తిరగనవసరం లేదు, చాపకింద నీరులా పారించి,  ప్రేక్షకులకి ప్రేమతో అందించాలి..

        స్ట్రక్చరూ లేక, క్రియేటివిటీ లేక,  ఇంత కథ ఇలా వుంటే ఎలా!