రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, January 15, 2016








దర్శకత్వం-మాటలు  : కళ్యాణ్ కృష్ణ

తారాగణం : నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ, బ్రహ్మానందం,
చలపతి రావు, సప్తగిరి, నాగబాబు, సంపత్ రాజ్, నాజర్, వెన్నెల కిషోర్,
బ్రహ్మాజీ, ఝాన్సీ, అనసూయ, హంసా నందిని
మూలకథ : పి. రామ్మోహన్ , స్క్రీన్ ప్లే : సత్యానంద్
సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బాలాజీ, కేకే, ఛాయాగ్రహణం : పి ఎస్ వినోద్, కూర్పు : ప్రవీణ్ పూడి, కళ : రవిందర్,
నృత్యాలు : రాజూ సుందరం, విశ్వ, రఘు
http://www.filmyfreak.com/
http://www.filmyfreak.com/
బ్యానర్ :  అన్నపూర్ణా స్టూడియోస్, నిర్మాత : నాగార్జున
విడుదల : జనవరి 15, 2016
***
'యూ’ సర్టిఫికేట్ తో వినోదాత్మక సినిమాల్ని ఇహ దాదాపు మర్చిపోవాల్సిందే అనుకుంటున్న సమయంలో సంక్రాంతి కోతకి కొత్త వరి వంగడంలా కసకస లాడుతూ ప్రేక్షకుల  మధ్యకి వచ్చేసిన ‘సోగ్గాడే చిన్నినాయనా’  కోసుకున్నవారికి కోసుకున్నంత వినోదం. కోసుకుంటున్న కొద్దీ కోతకి అందే కొత్త వంగడం. కోసికోసీ అలసిపోవాలే తప్ప తను మాత్రం కర్సవని విందువినోదాల పంట!

        పండగ రోజుకూడా పాత మొగుడేనా అన్నట్టు వచ్చిన పండగ సినిమాల మధ్య  ఏ పాత మొగుడు బెటరని చూస్తే, పండక్కి తగ్గట్టు తెలుగుదనపు  పంచె కట్టుతో అచ్చతెలుగు మాటాడుతూ విచ్చేసిన బంగార్రాజే కన్పిస్తాడు. పండగ మూడ్ కి న్యాయం చేస్తూ, పండగని పండగలా ఉండనిస్తూ, తెలుగు సినిమాని కూడా చాలా కాలానికి దయతల్చి తెలుగు సినిమాలానే  వుండనిస్తూ-  బంగార్రాజు బాక్సాఫీసుకి బాకా వేసి మరీ పసి నుంచీ ముసలి వరకూ పొలోమని బళ్ళు కట్టిస్తాడు. తనెవడో తెలియని పసి కీబోర్డు రాక్షసి వెధవకి, తానింకా ఇంతేనేమోలే  అనుకునే ముసలి నిరాశా జీవికీ,  పల్లెనంతా విప్పి చూపించి- పరికిణీల రెపరెపల కాడ్నించీ కాడెద్దుల గిట్టెల చప్పుళ్ళ వరకూ అన్నీ బతికే ఉన్నాయనీ; అమెరికా వెళ్లి చెడినా, ఆ బంధాల్ని  కలుపుకోవడానికి ఏ టూ జెడ్ మనిషితనం అంతా ఇక్కడే కుప్పపోసి ఉందనీ భరోసా కల్పిస్తాడు.

        కమర్షియల్ సినిమాల  పేరుతో తీస్తున్నవి నిజమైన కమర్షియల్ సినిమాల్లా వుండడం లేదు, కేవలం అవి ఫ్యాన్స్ కీ, పేదవర్గాలకీ పరిమితమైపోయిన ‘మాస్’ సినిమాల్లా ఉంటున్నాయి. ఈ గ్లోబల్ యుగంలో కూడా పేదల్ని ఇంకా పేదలుగానే చూపిస్తూ, వాళ్ళని నిరు పేదలుగానే వుండనిచ్చే రాజకీయం చేస్తూ, నెగెటివిజంతో  ఉత్పత్తి అవుతున్నవే ‘స్లమ్- లేదా బస్తీ’ మార్క్ సినిమాలు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ డానీ బాయల్ ని చాలా విమర్శించారు- ఇండియా అంటే  కంపుకొట్టే మురికి వాడలే అన్నట్టు చూపించాడని. అవసరం లేదు, టాలీవుడ్ లో  మాస్ (స్లమ్- బస్తీ) సినిమాల పేరుతో  ఈ పని ఎప్పట్నించో జరుగిపోతోంది. ప్రధాని స్వచ్చ భారత్ అంటూంటే తెలుగు సినిమాలు ఆ చెత్తనే చూపిస్తున్నాయి.  ఇహ హైటెక్ సిటీలొద్దూ, లోఫర్ స్లమ్సూ  వద్దూ అనుకుని, పచ్చని పల్లెని చూపించడానికి కూడా దమ్ము కావాలి. ఆ దమ్ముతో మీసం తిప్పుతూ బుల్లెట్ మీద వచ్చినవాడే బంగార్రాజు.

        ఈ బంగార్రాజు - నేను అక్కినేని నాగార్జుననీ- అని ఇగో చూపించి ఈలలు వేయించుకోడు, తనది ఏ వంశపు రక్తమో డైలాగులు చెప్పి చప్పట్లు కొట్టించుకోడు, థియేటర్ని ఒక పార్టీ సభలా మార్చి ఉపన్యాసాలిచ్చి కేరింతలు కొట్టించుకోడు. కృత్రిమత్వంతో సినిమా చూసే అనుభవాన్ని కల్తీ చెయ్యడు. అతనేం చెప్పినా, ఏం చేసినా పాత్ర స్వభావం కొద్దీ మాత్రమే స్వచ్చంగా చెప్పి, చేసి  నవ్విస్తాడు. కేవలం హృదయపూర్వకంగా నవ్విస్తూంటాడు. పాత్రలో అక్కినేని నాగార్జునని చేతనైనంత ఎంజాయ్ చేసుకోనిస్తాడు బంగార్రాజు కూడా. ఈ దశాబ్దపు మర్చిపోలేని కమర్షియల్ క్యారక్టర్ బంగార్రాజైతే, దాన్ని దుక్కిదున్ని పారేసిన స్టార్ నాగార్జున.
                                         ***
ఫాంటసీ లోకి ప్రయాణం 

        చ్చి నరకంలో వున్నాడు బంగార్రాజు. కారణం బతికున్నప్పుడు వూళ్ళో అతను మచ్చలేని మన్మథుడు. కాబట్టి యముడు ( నాగబాబు) నరకంలో సీటు రిజర్వ్ చేశాడు. అక్కడ కూడా కళ్లు తిరిగే మన్మథలీలల్ని చూపిస్తూంటే భూమ్మీదికి నెట్టేశాడు యముడు. భూమ్మీద అప్పటకే బంగార్రాజు భార్య సత్య ( రమ్యకృష్ణ) ఓ సమస్యకి సాయం అడుగుదామని అతడి ఫోటో ముందు వచ్చి నిలబడింది. బంగార్రాజు వచ్చి వాలిపోవడంతో షాకయ్యింది. 



        సమస్యేమిటంటే, అమెరికాలో డాక్టరుగా ఉంటున్న రాము ( యంగ్ నాగార్జున)  భార్య సీత ( లావణ్యా త్రిపాఠీ) తో వచ్చాడు. ఎడమొహం పెడమొహంగా వున్నారు. ఏంటంటే విడాకులు తీసుకోవడానికి వచ్చామన్నారు. షాకయిన సత్య భర్త ఫోటో దగ్గరి కెళ్ళింది. అక్కడకూడా షాక్ తిని ఆత్మరూపంలో ప్రత్యక్షమైన బంగార్రాజుని చూసింది.

        రాము సమస్యకి ప్రత్యక్షంగా సత్య, పరోక్షంగా బంగార్రాజులే కారణం. రాము కడుపులో ఉండగానే చనిపోయాడు భర్త బంగార్రాజు. ఆ భర్తలా నవమన్మథుడు  అవకూడదని, పుట్టిన రాముని ఆడగాలి అస్సలు తగలకుండా నిర్బంధంగా పెంచింది సత్య. ఇప్పుడు పెళ్ళయ్యాకా కూడా డాక్టర్ రాము భార్యగాలి అస్సలు తగలకుండా జాగ్రత్త పడుతున్నాడు, ఏమంటే డాక్టర్ వృత్తిలో క్షణం తీరికలేని బిజీ. మూడేళ్ళుగా అక్షరాలా మూడే సార్లు ముద్దూ ముచ్చటా  తీరిన భార్య సీత, ఇక  బేజారెత్తి పోయి విడాకులకి రెడీ అయ్యింది. ఓకే అన్నాడు రాము.

      సమస్య తెలుసుకున్న బంగార్రాజు రంగంలోకి దిగాడు. పడగ్గదిలో రాము శరీరంలోకి దూరి తన బ్రాండ్ మన్మథలీలల్ని రేపాడు. రేపినంత  సేపే రెచ్చిపోయి-  లాప్ టాప్ తో మెడికల్ లోకంలో తలమునకలవడం రాము దినచర్య అయింది. రాముని ఎన్ని రకాలుగా మార్చాలని ప్రయత్నిచాలో అన్నిరకాలుగా ప్రయత్నించి చూశాడు బంగార్రాజు. బంగార్రాజుకి అనుకోకుండా ఇంకో సమస్య కూడా ఎదురై ఆ పనిమీద కూడా బిజీగా ఉండాల్సి వచ్చింది. ముప్పై ఏళ్ల క్రితం తను యాక్సిడెంట్ లోనే  చనిపోయాడని  అనుకుంటున్నాడు. అది యాక్సిడెంట్ కాదు హత్య అని అనుమానం కలిగే పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో ఆత్మలతో మాటాడే బాబా ( బ్రహ్మానందం) ని సంప్రదించి అతడి ద్వారానే గుట్టు బయట పెట్టేందుకు తన పినతండ్రి ( నాజర్) దగ్గరికి తీసికెళ్ళాడు. ఇలా కొడుకు కోడళ్ళ సమస్య ఒకవైపు, తన మరణ రహస్యం తెలుసుకునే సమస్య ఇంకో వైపూ బంగార్రాజుని వేధించాయి...

         యముడు పెట్టిన గడువు శివరాత్రి ముందు రోజువరకే. ఆ లోగా పనులు ముగించుకుని వచ్చేయాలి. అసలు వూళ్ళో గుడిని అడ్డం పెట్టుకుని జరిగిన- జరుగుతున్న కుట్ర లేమిటి, ఈ కుట్ర కి ఇప్పుడు రాము కూడా ఎలా బలికాబోయాడు, బంగార్రాజు రాముని ఎలా కాపాడి, భార్యతో కలిపాడు- కుట్ర దారులకి ఎలా బుద్ధి చెప్పాడూ అన్నవి ఇక్కడ్నించీ మిగతా కథ.

ఎవరెలా చేశారు
      నిస్సందేహంగా  ఇది నాగార్జున  ఒన్ మాన్ షో- ఓవరాక్షన్ లేని ఒన్ మాన్ షో. తూర్పు పడమరల్లాంటి బంగార్రాజూ రామూల పాత్రల్ని అవలీలగా పోషించేశాడు. ఈ పాత్రలు కొంత కాలం గుర్తుండి పోతాయి. ఒక తెలుగు హీరో ధోవతీ కట్టుకుని గ్రామీణ పాత్ర పోషించడం ఈ మధ్య కాలంలో జరగలేదు. ఒకే రకం మూస ఆవారా మాస్ పాత్రల్ని చూస్తున్న ప్రేక్షకులకి ఒక మార్పునివ్వడం నాగార్జున చేసిన మంచి ఆలోచన. రెండేళ్ళ క్రితం- ‘మనం’ కంటే ముందు తన మూడు నాల్గు సినిమాలకి ఓపెనింగ్స్, అభిమానులూ లేని దశనుంచి ‘మనం’ తో సంచలనం సృష్టించడానికి అందులో మూడు తరాలకి చెందిన  తన కుటుంబ స్టార్లు వున్నారు. అది జరిగిపోయిన రెండేళ్ళకి  ప్రస్తుత సినిమా సోలోగా చేసి బంపర్ ఓపెనింగ్స్ తో ఈలలేయించుకోవడం చూస్తే, ట్రేడ్ పండితులకే కళ్ళుతిరిగి పోతాయి. సినిమా చూస్తున్న యూత్ రెచ్చిపోయి కాగితాలు విసిరి అభిమానం ప్రకటించుకోవడం ఇదంతా నాగార్జున  పూర్వ వైభవాన్ని గుర్తుకు తెస్తుంది. కథ, పాత్ర బావుంటే- అదికూడా తెలుగుదనంతో కూడిన తెలుగు సినిమాలాగే  వుంటే, ఈ స్టారూ ఎప్పుడూ వెనకబడి పోడని తేల్చి చెప్పాడు  నాగార్జున.

        రమ్యకృష్ణ వల్ల చెప్పలేని గ్లామర్ వచ్చింది సినిమాకి- హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ  కంటే కూడా. లావణ్యా త్రిపాఠీ సామాన్య యువతి ముఖ కవళికలతో గ్రామీణ కథ నేటివిటీలో ఒదిగిపోయింది. బ్రహ్మనందం క్లీన్ కామెడీ చేశారు. కుటుంబ సభ్యులుగా చలపతి రావు,
వెన్నెల కిషోర్,  బ్రహ్మాజీ, ఝాన్సీ నటిస్తే,  నాగబాబు యముడిగా కన్పిస్తాడు. విలన్లు నాజర్, సంపత్ రాజ్ లు. ఇక అనసూయ, హంసా నందిని, అనూష్కా లు బంగార్రాజు రాసలీలకి తోడ్పడ్డారు.

        పాటలు వాటి చిత్రీకరణా, ఛాయాగ్రహణమూ ఇతర సాంకేతిక హంగులన్నీ పక్కా కమర్షియల్ విలువల్ని ప్రదర్శిస్తాయి. 


        కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, ఇతర కొత్త దర్శకుల్లా కాకుండా తనది కాని కథని ఓన్ చేసుకుని, మాటలు రాసి చిత్రీకరణ చూసుకోవడం, దీనికి నాగార్జున కావాల్సిన మంది బలాన్ని సమకూర్చడం- వంటి వికేంద్రీ కరణ కూడా ఈ సినిమా ఇంత  బాగా రావడానికి కారణం. సీనియర్ సత్యానంద్ స్క్రీన్ ప్లే  సమకూర్చడం ఈ గ్రామీణ కథకి న్యాయం. 

       


-సికిందర్