రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, November 22, 2023

1382 : r


 

దర్శకత్వం : రాబీ వర్గీస్ రాజ్
తారాగణం : మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, అజీజ్ నెడుమంగడ్, శబరీష్ వర్మ, కిషోర్, విజయరాఘవన్ తదితరులు
రచన : రోనీ డేవిడ్ రాజ్, మహమ్మద్ షఫీ; సంగీతం : సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం : మహమ్మద్ రహీల్
బ్యానర్ : మమ్ముట్టి కంపెనీ, నిర్మాత : మమ్ముట్టి
విడుదల : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (ఓటీటీ)
***
        లయాళంలో సెప్టెంబర్ లో విడుదలైన సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్  థియేట్రికల్ రన్‌ ముగించకముందే  రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. సెప్టెంబర్ 28160 స్క్రీన్‌లలో విడుదలై, మూడవ రోజుకే 330 స్క్రీన్‌లకి పైగా విస్తరించి  సూపర్ హిట్టయ్యింది. ఈ సంవత్సరం మలయాళంలో హిట్టయిన నాలుగే సినిమాల్లో ఇదొకటి. దీనికి రాబీ వర్గీస్ రాజ్ కొత్త దర్శకుడు. మమ్ముట్టి నిర్మాతగా రూపొందిన ఈ మూవీ ఇప్పుడు ఐదు భాషల్లో ఓటీటీలో విడుదలైయింది. దీని బాగోగులు చూద్దాం...

కథ

కేరళ లోని కన్నూర్ జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించడానికి 'కన్నూర్ స్క్వాడ్' పేరుతో ఒక పోలీసు బృందం ఏర్పాటవుతుంది. దీనికి జార్జి మార్టిన్ (మమ్ముట్టి) నాయకత్వం వహిస్తాడు. 2015లో జరిగిన ఒక  పాత హత్య కేసుని జార్జి టీమ్ తెలివిగా ఛేదిస్తుంది. దీంతో టీంని ఎస్పీ అభినందిస్తాడు. 2017లో కాసర గోడ్ లో ఒక రాజకీయనాయకుడి హత్య జరుగుతుంది. అతడి కూతురు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరుతుంది. ఈ హంతకుల్ని 10 రోజుల్లోగా పట్టుకోవాలని ఎస్పీ చోళన్ (కిశోర్) కి పైనుంచి వొత్తిడి పెరుగుతుంది. దాంతో కేసుని కన్నూర్ స్క్వాడ్ కి అప్పగిస్తాడు. సరిగ్గా ఈ సమయంలోనే ఈ టీమ్ సభ్యుడు జయన్ (రోనీ డేవిడ్ రాజ్) లంచం తీసుకుంటూ కెమెరాకి చిక్కుతాడు. టీం నుంచి అతడ్ని తొలగించమని పైఅధికారుల నుంచి ఆదేశాలందుతాయి. తామంతా కలిసే అన్ని ఆపరేషన్స్ నీ సక్సెస్ చేస్తూ వచ్చామనీ, జయన్ బాధ్యత తాను తీసుకుంటాననీ పై అధికారుల్ని ఒప్పిస్తాడు జార్జి.
       
ఇప్పుడు లంచగొండి జయన్ ని జార్జి వెనకేసుకు రావడానికి కారణమేమిటి
? తన టీం తో 10 రోజుల్లో హంతకుల్ని పట్టుకోగలిగాడా? ఈ క్రమంలో ఎదుర్కొన్న ఆటంకాలు, ప్రమాదాలు ఏమిటి? అసలు రాజకీయ నాయకుడి కథ ఏమిటి? ఇవి ముందు కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

కేరళలో కన్నూర్ స్క్వాడ్ ని 2008 లో అప్పటి ఎస్పీగా వున్న శ్రీజిత్ ఏర్పాటు చేశారు. కన్నూర్‌లో నేరాల సంఖ్యని అరికట్టడానికి దర్యాప్తు విభాగంగా ఈ స్క్వాడ్‌ ని ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్ ఇప్పటికీ పనిచేస్తోంది. 2017 లో ఈ స్క్వాడ్ చేపట్టిన రాజకీయ నాయకుడి హత్య కేసు ఆధారంగా ఈ సినిమా కథ చేశారు.  కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఈ కథని రచయితలు రోనీ డేవిడ్ రాజ్, మహమ్మద్ షఫీలు రాయడం ప్రారంభించారు. 15 డ్రాఫ్టులు రాసి ఫైనల్ స్క్రిప్టు తయారు చేశారు. ఈ సినిమాతో దర్శకుడైన ఛాయాగ్రహకుడు రాబీ వర్గీస్ రాజ్ తండ్రి సి.టి. రాజన్, 30 ఏళ్ళ క్రితం మమ్ముట్టితో మహాయానం అనే సినిమా తీసి సర్వం కోల్పోయాడు. ఇప్పుడు అదే మమ్ముట్టి నిర్మాతగా, రాబీ వర్గీస్ రాజ్ దర్శకుడుగా మారి కన్నూర్ స్క్వాడ్  సినిమా తీసి 100 కోట్ల క్లబ్ లో చేర్చాడు. ఈ సూపర్ స్టార్ సినిమా బడ్జెట్ 30 కోట్లు మాత్రమే. తెలుగులో తీస్తే 130 కోట్లు టేబుల్ మీద పెట్టాల్సిందే.
       
ఇది పోలీస్ ప్రొసీజురల్ జానర్ కి చెందిన ఇన్వెస్టిగేషన్ ప్రధాన కథ. హంతకుల్ని పట్టుకునేందుకు ఇచ్చిన పది రోజుల గడువుతో టైమ్ లాక్ కథ. తెర మీద కౌంట్ డౌన్ రికార్డవుతూంటే ఉత్కంఠ రేపుతూ పరుగులుదీసే కథ. కనుక ఈ కౌంట్ డౌన్ కి అడ్డుపడే పాటలు
, కామెడీలు, కాలక్షేపాలు వంటి వినోదాత్మక విలువలకి దూరంగా, సీరియస్ మూడ్ లో సీరియస్ గానే సాగుతుంది ఆద్యంతం. ఈ సీరియస్ నెస్ తో బోరుకొట్టకుండా, నిజ కేసులో వున్న సదుపాయం ఈ కథకి ఉపయోగపడింది. హంతకుల కోసం ఈ కథ కన్నూర్, కాసరగోడ్, వాయనాడ్, ఎర్నాకులం, తిరువనంతపురం, పుణే, ముంబాయి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బెల్గాం, మంగళూరు, కోయంబత్తూరు మొదలైన 12 ప్రాంతాలకి ప్రయాణిస్తుంది. వేల కొద్దీ మైళ్ళు రోడ్డు మార్గానే పోలీసు వాహనంలో తిరుగుతారు. ఎందుకంటే విమాన ప్రయాణాలకి తగ్గ బడ్జెట్ పోలీసు డిపార్ట్ మెంట్ దగ్గర లేదు.
       
ఇక బుద్ధి బలంతో ఇన్వెస్టిగేషన్
, కండబలంతో యాక్షన్ పుష్కలంగా జరుగుతాయి.
 హంతకులకి సహకరించిన ఒకడ్ని పట్టుకోవడానికి మారుమూల గ్రామానికి వెళ్ళే స్క్వాడ్ మీద అక్కడి జనం తిరగబడే సన్నివేశం సినిమాకి హైలైట్.  హంతకులు సిమ్ కార్డులు మారుస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జంప్ అవుతూంటే- మొబైల్ టవర్ డంప్ నాలిసిస్ వంటి అత్యాధునిక టెక్నాలజీ నుపయోగించి ఇన్వెస్టిగేట్ చేసే వాస్తవిక చిత్రణ ఇందులో కన్పిస్తుంది. ఈ ఔటర్ స్ట్రగుల్ ఒకవైపు, తొందరపెట్టే పై అధికారులకి సమాధానం చెప్పే, క్రుంగిపోకుండా టీంకి స్ఫూర్తి నింపే, ఇన్నర్ స్ట్రగుల్ ఇంకోవైపూ పడే మమ్ముట్టి పాత్రతో కథకి జీవం కూడా వస్తుంది.
       
అయితే చాలా చోట్ల లాజిక్
, కంటిన్యూటీ లేకపోవడం, స్పీడుతగ్గి బోరుకొట్టడం వంటి లోపాలుకూడా వున్నాయి. ఈ టైమ్ లాక్ వాస్తవిక కథని వేగమే ప్రధానంగా రెండుగంటల్లో ముగించేస్తే బావుండేది. రెండున్నర గంటలు సాగింది. ఓటీటీలో నిడివి తగ్గించి వుండొచ్చు. ఇక క్లయిమాక్స్ లో మంచి ఊపు వస్తుంది.
       
ఇలాటిదే నిజ కేసుతో కథ తమిళంలో కార్తీతో
ఖాకీ గా వచ్చింది 2017లో. ఇది కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో తమిళనాడు పోలీసులు సాగించే వేట. కాకపోతే ఇది ఆన్ని కమర్షియల్ హంగులూ వున్న మసాలా యాక్షన్.

నటనలు- సాంకేతికాలు

72 ఏళ్ళ మమ్ముట్టి కూడా రజనీకాంత్, కమల్ హాసన్, బాల కృష్ణ, శివరాజ్ కుమార్, సన్నీ డియోల్ ల వంటి హిట్లిచ్చిన 60 ప్లస్ స్టార్స్  క్లబ్ లో చేరిపోయాడు. ఇక చిరంజీవి కోసం వెయిటింగ్. మమ్ముట్టి చాలా తక్కువ స్థాయి పాత్ర పోషించాడు. అతను ఎఎస్సై. ఎస్సై కూడా కాదు. అతడి టీంలో వుండేది కానిస్టేబుల్సే. అందులో ఒకడు రచయిత  రోనీ డేవిడ్ రాజ్.  మరో ఇద్దరు అజీజ్, శబరీష్ వర్మ. ఇన్వెస్టిగేషన్లో ఎదుర్కొనే సమస్యల్లో, ప్రమాదాల్లో, ఇంకా కొన్ని వ్యక్తిగత విషయాల్లో టీంకి ధైర్యాన్ని నింపి, ముందుకు నడిపించే పాత్రలో - టీం లీడర్ అంటే ఇతనే అన్పించేలా నటించాడు మమ్ముట్టి. భారీ డైలాగులు, బిల్డప్పులు లేని సహజ నటన, టీంలో ముగ్గురూ కానిస్టేబుల్స్ కి స్ఫూర్తిగా వుంటారు.
       
రాజకీయ నాయకుడి ఇంట్లో దోపిడీకి వెళ్ళి చంపి పారిపోయే హంతకులుగా అర్జున్
, ధ్రువన్ లది పాత్రలకి తగ్గ జిత్తులమారి నటన. ఇంకా హంతకుల వేటలో 12 ప్రాంతాల్లో ఎదురయ్యే పాత్రలేన్నో వుంటాయి.  అయితే కెమెరా వర్క్ ఛాయాగ్రాహకుడైన దర్శకుడు నిర్వహించలేదు.
మహ్మద్ రహీల్ కెమెరా వర్క్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. నైట్ ఎఫెక్ట్ లో, ఫారెస్టులో తీసిన  సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక  సుశీన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు కథతో బాటు ప్రేక్షకులు ప్రయాణించేలా చేస్తుంది.
       
మొత్తం మీద
కన్నూర్ స్క్వాడ్ పోలీసు శాఖ గురించి ఒక ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్. చట్టాన్ని అమలు చేసే వాస్తవిక చిత్రణని అందిస్తుంది. పోలీసుల రోజువారీ సవాళ్ళని, నిధుల కొరతని, ఓ మాదిరి వేతనాల్ని భరిస్తూ, అదే సమయంలో రాజీపడని విధి నిర్వహణకి కట్టుబడి, సమాజం పట్ల మానవీయంగా ఎలా మారతారో చూపిస్తుంది.

—సికిందర్