రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, మార్చి 2017, శుక్రవారం






రచన- దర్శకత్వం : సుధా కొంగర
తారాగణం : వెంకటేష్‌., రుతికా సింగ్‌, ముంతాజ్సర్కార్, నాజర్‌., జాకీర్ హుస్సేన్, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి తదితరులు
మాటలు : హర్షవర్ధన్, సంగీతం: సంతోష్నారాయణన్ , ఛాయాగ్రహణం: శక్తివేల్
బ్యానర్ :  వై నాట్స్టూడియోస్
నిర్మాత: ఎస్‌.శశికాంత్
విడుదల : మార్చి 31, 2017
          ***
   
త రెండు నెలలుగా విడుదల వాయిదా పడుతూ పడుతూ మొత్తం మీద ఈ మండుటెండల్లో ప్రేక్షకుల తలుపు తడుతున్న  వెంకటేష్ ‘గురు’, బాక్సాఫీసు క్రీడకి  గెలుపు పాయింట్లు ముందే స్కోరు చేసేసుకుంది. దీని తమిళ- హిందీ మాతృకలే  దీని స్కోరేమిటో ముందే చెప్పేశాయి. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమిటి రిజల్టు, ఏమిటి టాక్ అని ఎంక్వైరీ చేసుకోనవసరం లేదు- ది బిగ్ ‘వీ’ ఈజ్ ఆల్రెడీ రిటెన్ ఆన్ ది ఎంటైర్ వాల్!

          ‘దృశ్యం’, ‘గోపాలా గోపాలా’ లాంటి విజయాల్లో వయసుకి తగ్గ పాత్రలు వేసిన వెంకటేష్, ఆ తర్వాత  ‘బాబు బంగారం’ లో కుర్ర పాత్రతో కుదేలయ్యాక, తిరిగి ఇప్పుడు వయసుని గౌరవించుకుంటూ గురువు పాత్ర పోషించారు. గౌరవనీయ పాత్రలు రీమేకులతోనే సాధ్యపడుతున్నాయి తనకి. 

          మణిరత్నం సహాయకురాలు, విశాఖపట్నం వాసి  సుధా కొంగర ఈ రీమేక్ చేస్తూ తెలుగులో అన్ని ఫార్ములా వెటకారాల్నీ పటాపంచలు చేశారు. క్లాస్- మాస్ ప్రేక్షకులతో భారీ ఓపెనింగ్స్ ని సాధించుకుంటూ – ఏదో రొటీన్ నే వూహించుకుంటూవచ్చిన ప్రేక్షకుల్ని అనూహ్యంగా ఈ సీరియస్ స్పోర్ట్స్ డ్రామాతో కట్టి పడేశారు – ఇటీవలే ఇలాటిదే  ‘దంగల్’ ని తెలుగులో కూడా చూసివున్న  ప్రేక్షకుల్ని నోరెత్తకుండా చేశారు. 

          ‘గురు’ - ఒక డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామా- జీవితంలో ఓ దిశా దిక్కూ లేకుండా కాలం  గడిపేసే స్లమ్ డాగ్స్ కి, అండర్ డాగ్స్ కీ ఒక ధృవ నక్షత్రం. కాకపోతే  ఈ జీవులకి చేయూత నిచ్చే వ్యక్తులు, వ్యవస్థా ఎవరా అని ఎదురు చూడాల్సిందే. సినిమాల్లో తప్ప అలాటి గురువెవరో  ‘మొండెదవ’ గా ఎప్పుడో గానీ రాడు. ఇప్పుడొచ్చిన  ‘మొండెదవ’ మామూలు ‘మొండెదవా’ కాదు. వీడి కథేమిటో ఒకసారి తెలుసుకుందాం...

కథ 
      తన పొగరురుతో, మొండితనంతో బాక్సర్ గా ఎదగలేకపోయిన ఆదిత్య (వెంకటేష్),  విమెన్స్ బాక్సింగ్ ఫెడరేషన్ లోనూ అదే ప్రవర్తనతో ట్రైనర్స్ ని  ముప్పు తిప్పలు పెడుతూంటాడు. ఇది తట్టుకోలేక అమ్మాయిలు లైంగిక హింస కంప్లెయింట్ పెడతారు.  ఫెడరేషన్ బాస్ దేవ్ ఖత్రీ  (జాకీర్ హుస్సేన్) ఇదే ఛాన్సు అనుకుని ఆదిత్యని వైజాగ్ కి ట్రాన్స్ ఫర్ చేసి పారేస్తాడు. దేవ్ తో ఆదిత్యకి పాత పగలు చాలానే  వుంటాయి.

          వైజాగ్ వచ్చిన ఆదిత్య,  మార్కెట్లో కూరగాయలమ్మే రఫ్ అండ్ టఫ్ కూలీ పిల్ల రామేశ్వరి అలియాస్ రాముడు (రుతికా సింగ్) లో వీధి పోరాటాల, సిగపట్ల మాస్ టాలెంట్ చాలా వుందని పసిగట్టి, తనే రోజుకి ఐదొందలు ఎదురిచ్చుకుంటూ బలవంతంగా ట్రైనింగ్ ఇప్పిస్తూంటాడు. తను మొండి అయితే ఆమె జగమొండి. ఏ మాత్రం మంచీ మర్యాదా వుండదు. పరువు  తీసి మాటాడినా దులుపుకుంటాడు. 


        ఈమెకి తల్లిదండ్రులు (రఘుబాబు, అనితాచౌదరి) లతో బాటు, ఓ ఆక్క లక్ష్మి (ముంతాజ్ సర్కార్- విఖ్యాత దివంగత మ్యాజిషియన్ పీసీ సర్కార్ కుమార్తె) వుంటుంది. బాక్సింగ్ లో ఈమెకి ప్రవేశమున్నా ఆదిత్య  రాముడునే ప్రోత్సహిస్తాడు. రాముడు ఇక అదిత్యని వదిలించుకుందామని అనుకున్నప్పుడు- తనకోసం రాముడు చేసిన ఒక త్యాగం తెలుసుకుని మనసు మార్చుకుంటుంది- ఆ మార్చుకున్న మనసు ఇంకెటో  వెళ్ళిపోయి మ్యాచ్ ఒడి- ఆదిత్య  ఆగ్రహానికీ  వెలివేతకీ గురవుతుంది.
  

        మళ్ళీ ఇద్దరి మధ్య ఎలా సఖ్యత కుదిరిందీ,  ఆమెని వరల్డ్ ఛాంపియన్ గా చేయడానికి ఆదిత్య ఎలా సంఘర్షించాడూ, మధ్యలో దేవ్ ఆడిన గేమ్ ఏమిటీ...మొదలైనవి మిగతా కథలో తెలిసే అంశాలు. 

ఎలా వుంది కథ  |

       
        స్పోర్ట్స్ జానర్ కూడా ఓ టెంప్లెట్ లోనే వుంటుంది. ఓ క్రీడలో శిక్షణ ఇప్పియ్యడం, క్రీడా రాజకీయాలతో సంఘర్షించడం, చివరికి స్టేడియంలో ఛాంపియన్ గా గెలవడం. ఇదీ ఈ చట్రంలో వున్న కథే. కాకపోతే కమర్షియల్ ఫార్ములాలకి దూరంగా రియలిస్టిక్ గా చూపించారు. ఇదే దర్శకురాలి తమిళ ‘ఇరుధి సుత్రు’ (ఫైనల్ రౌండ్), హిందీ ‘సాలా ఖదూస్’ (మొండెదవ) లకి తెలుగు రీమేక్ అయిన ఈ కథ ఇంకో దర్శకుడి చేతిలో పడితే ఏమయ్యేదో గానీ- ఒరిజినల్ దర్శకురాలి ఒరిజినాలిటీ అంతా యీ రిమేక్ కి చాలా కలిసివచ్చింది. క్రీడ అంటే క్రికెట్టే అన్నట్టు తయారైన పరిస్థితుల్లో ఇలాటి సినిమాలే ఇతర క్రీడలని జనాలకి పరిచయం చేస్తూ వాటి ప్రశస్తిని చాటుతున్నాయి. 




ఎవరెలా చేశారు 
          మొండోడుగా వెంకటేష్  చాలా ప్రభావశీలంగా నటించిన పాత్ర ఇది. దర్శకుడి/ దర్శకురాలి విజన్ ని మన్నిస్తే  సీనియర్ స్టార్స్ తామూహించని ఎత్తులకి ఎదుగుతారని నిరూపించిన నటన ఇది.  క్రీడా జీవితంలో ఓడిపోయాడు, పెళ్ళాం లేచిపోయింది, అధికారులతో తగాదాలు పెట్టుకుంటాడు, ట్రైనర్స్ ని తన్నితగిలేసి  ట్రైనింగ్ ఇప్పిస్తాడు, తాగుతాడు, ఛీ కొట్టించుకునేలా వుంటాడు- ఇదంతా అర్ధం జేసుకుంటే-  ‘ఆమెకి గోల్డ్ మెడల్ సాధించి పెట్టడం కోసం నూట ఇరవై కోట్ల మంది జనం కాళ్ళు నాకమన్నా నాకే’ పని రాక్షసుడు అతడిలో కన్పిస్తాడు,  అర్ధం జేసుకోకపోతే  మొండెదవలా కన్పిస్తాడు. 

          రెండోదేమిటంటే, హీరోయిజమంతా తన పాత్రకే వుండాలన్న నియమం పెట్టుకోకుండా, హీరోయిన్ కి కావాల్సినంత రంగస్థలాన్ని వదలడం. అభిమానుల్లో తన ఇమేజికి దెబ్బ తగులుతుందనే అనుమానాలేవీ పెట్టుకోకుండా, ఆమె బూతుమాటలన్నీ పడడం. తెలుగు ప్రేక్షకులకి తొలిసారిగా ఒక సీనియర్ స్టార్ ఇంత పచ్చి పాత్రలో కన్పించడం, కదలకుండా కూర్చోబెట్టేయడం. దీంతో వెంకటేశ్ ఇప్పుడే నిజానికి విక్టరీ వెంకటేష్ అయినట్టు. 

          తమిళ హిందీల్లో నటించిన రుతికా సింగే హీరోయిన్ గా నటించింది. ఆమె మాట, చేత, తాటతీత మాస్ క్యారక్టర్ ని  ప్రేక్షకులు వూహించని స్థాయికి తీసికెళ్ళి పోయాయి - మూస ఫార్ములా కృత్రిమత్వం లేకుండా. ఇవన్నీ చేస్తూనే జీవంతో గుండెలు బరువెక్కిం చనూ గలదు తను.

          అక్కపాత్రలో ముంతాజ్,  చెల్లెలి మీద ఈర్శ్యాసూయల్ని పతాకస్థాయికి తీసికెళ్ళే సన్నివేశం మరపురానిది. ఇప్పుడొస్తున్న యువ హీరోయిన్లలో  కూడా చాలా  ప్రతిభ వుంటోంది. నూటికి తొంభై తొమ్మిది శాతం సినిమాల్లో వీళ్ళకి కరివేకు పాత్రలిచ్చి ఇంటికి పంపేస్తున్నారు. ఇక ప్రతినాయక దేవ్ ఖత్రీ పాత్రలో జాకీర్ హుస్సేన్ మెత్తగా పిండాలు పెడుతూంటాడు. జ్యూనియర్ కోచ్ గా నాజర్ ది కామెడీ పాత్ర.

          సాంకేతికంగా ఉన్నత స్థాయిలో వుంది- ఈ రియలిస్టిక్ జానర్ కి తగ్గ విజువల్స్ తో,  మ్యూజిక్ తో – కంటెంట్ ని సానబడుతూ కత్తిలా తయారుచేసిన సాంకేతిక ఔన్నత్యమిది...

 చివరికేమిటి 
       దర్శకురాలు సుధా కొంగర ఒకే కథతో మూడు సినిమాలు చేయడం – అందులో మొదటి రెండిట్లో దొర్లిన చిన్న చిన్న లోపాలు దీంట్లో సవరించుకోవడమూ ఒక ఎడ్యుకేషన్ లాగే ఉపయోగ పడిందామెకి. దృశ్యమాధ్యమాన్ని ఎలా వాడుకోవాలో ఎనలేని అవగాహన వుందామెకి. పఫర్ఫుల్ సినిమా ఎలా తీయాలో కూడా తెలుసామెకి. జానర్ మర్యాదని జానర్ మర్యాదతోనే  వుంచడమూ బాగా తెలుసామెకి. అయితే ప్లాట్ పాయింట్  వన్ దగ్గర హీరోయిన్ కి గురు మీద ప్రేమ కలగడమనే జానర్ మర్యాద తప్పిన  ఫార్ములా మూస వాసనే మింగుడు పడనిది. దీన్ని ఇంకో పావుగంట ఇంటర్వెల్ వరకూ భరించక తప్పదు మనకి. అప్పుడు ఆమెకి గురు క్లాసు పీకడంతో  ఈ మూస రొమాంటిక్ యాంగిల్ బాధ తొలగిపోతుంది. గురువు మీద అమ్మాయిలకి ఆకర్షణ పుట్టొచ్చు. అందులోనూ అక్షరం ముక్కరాని స్లమ్ డాగ్ పిల్లకి. కానీ గురువు గురువే. ఇందువల్ల మళ్ళీ జానర్ మర్యాద పట్టా లెక్కుతుంది. ప్లాట్ పాయింట్ టూ రాగానే, మళ్ళీ హీరోయిన్- నువ్వు రిజైన్ చేశావంటే ప్రేమే కదా అంటుంది- ఇక్కడ చాలా బ్యాడ్ గా కన్పిస్తుంది ఈ మాటనేసిన తను. ఇంతే కాదు- క్లయిమాక్స్ లో సదరు  ‘గురు’ గ్లామరస్ గా తయారై  కూడా వచ్చేస్తాడు!  ముగిస్తూ వీళ్ళు లవర్స్ అనే అర్థాన్నే ఇచ్చారు. ఈ రియలిస్టిక్ కథలో సినిమాటిక్ ట్విస్టులు ప్రేక్షకులు డిమాండ్ చేయలేదే- ఎందుకు తొందరపడాలి. స్పోర్ట్స్ లో సెక్సువల్ హెరాస్ మెంట్ అంటూ చెప్పారు బాగానే వుంది. కానీ ముగింపు చూస్తే  కోచ్ లతో ఎఫైర్సే క్రీడాకారిణులకిశ్రీరామ రక్ష అన్నట్టుగా,  లొంగిపోయినట్టు వుంది...

-సికిందర్