రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, జూన్ 2021, శుక్రవారం

1045 : స్పెషల్ ఆర్టికల్


      కథకి, లేదా గాథకి పునాది ఐడియా. ఐడియాని విడమర్చి చెప్పడం ఆ ఐడియాలో కథ వుందా, లేక గాథ వుందా తెలుసుకోవడంతో ప్రారంభమవుతుంది. ఐడియాలో కథ కన్పిస్తే కథా లక్షణాల్ని దృష్టిలో పెట్టుకుని కథగా చేసుకోవడం, ఐడియాలో గాథ కన్పిస్తే  గాథ లక్షణాలని బట్టి గాథగా చేసుకోవడం జరగాలి. లేదూ ఆ కథని గాథగా, గాథని కథగా మార్చుకోవాలనుకుంటే అదిప్పుడే - అంటే ఐడియాని సిద్ధం చేసుకునేప్పుడే జరగాలి. ముందుగా ఐడియాతో కచ్చితంగా ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టత లేకపోతే సూపర్ ఫ్లాపవడం ఖాయం.

        చ్చుకి రెండు ఐడియాలు ఇలాటివి చూద్దాం : బద్రీనాథ్ లో పూర్వం విదేశీ దురాక్రమణ దార్లు దేశంలో దేవాలయాల్ని కొల్లగొట్టారని, ఇప్పుడు టెర్రరిస్టులు పని చేస్తున్నారని, అక్షరధాం ఉదంతాన్ని చూపుతూ, ఇలాటి పుణ్య క్షేత్రాల సంరక్షణకి హీరో ఏం చేశాడన్నది ఐడియాగా తీసుకున్నారు. అంటే మంచి మార్కెట్ యాస్పెక్ట్ తో, భారతీయ వెండితెర మీద అపూర్వంగా, ఇండియన్ టెంపుల్స్ వర్సెస్ టెర్రరిజం కథని చూపబోతున్నారని ఉత్సుకతని పెంచేశారు. తీరా చూస్తే, ఇదంతా కాకుండా, ఓ మామూలు ఫ్యాక్షన్ ప్రేమ కథగా మూసలోకి తిప్పేస్తే అట్టర్ ఫ్లాపయింది. అంతే కాదు, చివరికొచ్చేసి, స్వమతస్థులే దేవాలయం మీద తిరగబడి మారణహోమం సృష్టించినట్టు విచిత్ర ముగింపు కొచ్చారు. ఇలా ఐడియాతో ప్రేక్షకులకి ఉత్సుకత రేపిందొకటి, చూపించిందొకటి చేశారు. 

        సూర్య వర్సెస్ సూర్య లో వినూత్నంగా జిరోడెర్మా అనే రుగ్మత గురించి ఐడియా.  హీరో ఎండలో తిరిగితే పావుగంటలో చచ్చిపోయే రుగ్మత అది. అందుకని రాత్రి పూటే తిరుగుతాడు. ఈ సమస్యతో వున్న ఇతడితో ప్రేమలో పడ్డ హీరోయిన్ కి, ఈ సమస్య గురించి తెలిస్తే ఏమౌతుందన్న ప్రశ్న కథలో తలెత్తుతుంది. దీన్ని పక్కన బెట్టేసి, వాళ్ళ ప్రేమలో ఐడియాతో సంబంధం లేని ఇంకేవో అపార్ధాలు సృష్టించి, ఏడ్పుల ప్రేమ కథగా మార్చేశారు. ఫ్లాపయింది.

        ఇలాటి ఐడియాలు రీసెర్చిని కోరుకుంటాయి. ఇప్పుడు కూడా రీసెర్చి చేయని రియలిస్టిక్ ఐడియాలతో నాంది’, మోసగాళ్ళు మలయాళం ఒన్ లాంటివి వస్తున్నాయి. ఇలాటి కథలకి విషయపరమైన రీసెర్చి చాలా అవసరం. ఫార్ములా కథలకి విషయపరమైన రీసెర్చి అవసరముండదు. హవాలా కథతో ఫార్ములా సినిమా తీయాలనుకుంటే రీసెర్చి అవసరం లేదు. కానీ హవాలా కథతో సూపర్ ఓవర్ లాంటి రియలిస్టిక్ తీయాలంటే మాత్రం రీసెర్చి అవసరం. ఇందులో హైదరాబాద్ నేపథ్యంలో హవాలా వ్యాపారం నెట్వర్క్ గురించి రీసెర్చి బాగానే చేశారు.

      రీసెర్చి కోరుకునే కథలకి రీసెర్చి దశ తర్వాత వస్తుంది. ముందుగా ఐడియా మార్కెట్ యాస్పెక్ట్ ని సమీక్షించుకోవాలి. ఐడియా సామర్ధ్యాన్ని దాని పూర్తి స్థాయిలో రాబట్టుకుంటేనే వసూళ్ళ రూపంలో దాని మార్కెట్ సామర్ధ్యానికి న్యాయం చేసిన వాళ్ళవుతారు. కోటి వచ్చే అయిడియా చేతిలో వున్నప్పుడు లక్ష చాలని ఎవరను  కుంటారు. ఇలా నాంది’, మోసగాళ్ళు’, ఒన్  వంటి జాతీయ మార్కెట్ ని ఆకర్షించే కిల్లర్ (కత్తిలాంటి) ఐడియాల్ని మార్కెట్ యాస్పెక్ట్ విశ్లేషణ చేసుకోకుండా లోకల్ మార్కెట్ కి  సరిపెట్టుకున్నారు.

        నాంది (1017) లో 211 చట్టం గురించి కథ. ఈ కథని 211 చట్టం గురించి గాక రొటీన్ రివెంజీ కథగా మార్చేసి ముగించారు. 211 చట్టం గురించి అది చెప్పే సరైన కథగా ఐడియాని డెవలప్ చేసివుంటే జాతీయ స్థాయిలో వైరల్ అయ్యేది. మోసగాళ్ళు’(1028) లో దేశంలో సంచలనం సృష్టించిన అంతర్జాతీయ కాల్ సెంటర్ స్కామ్ ఐడియా సామర్ధ్యాన్ని తగ్గించి మూస ఫార్ములా కథ చేసేశారు. లేకపోతే ఇది కూడా జాతీయ స్థాయిలో వైరల్ అవాల్సిన ఐడియా. మలయాళం ఒన్’ (1037) లో రైట్ టు రీకాల్ చట్టంతోనూ ఇదే పరిస్థితి. ఇలా ఐడియా మార్కెట్ యాస్పెక్ట్ ని విశ్లేషించుకోక పోవడం వల్ల సినిమాలు వాటి స్థాయిని అందుకోలేక పోతున్నాయి.

        ఐడియా మార్కెట్ యాస్పెక్ట్ స్పష్టమయ్యాక, దాని స్ట్రక్చర్ కి రావాలి. అంటే తీసుకున్న ఐడియాలో కథ వుందా, గాథ వుందా పరిశీలించాలి. హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు, దాంతో హీరోయిన్ని పొందాలనుకున్న ఒక డాక్టర్ హీరోని కురూపిని చేస్తాడు, దీనికి ప్రతీకారంగా డాక్టర్నీ అతడి అనుచరుల్నీ కురూపుల్ని చేస్తాడు హీరో అని ఒక ఐడియా వుందనుకుందాం. ఇందులో మొదట కథ కవసరమైన స్ట్రక్చర్ వుందా లేదా చూసుకోవాలి. 1. హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు (బిగినింగ్), 2. దాంతో హీరోయిన్ని పొందాలనుకున్న ఒక డాక్టర్ హీరోని కురూపిని చేస్తాడు (మిడిల్), 3. దీనికి ప్రతీకారంగా డాక్టర్నీ అతడి అనుచరుల్నీ కురూపుల్ని చేస్తాడు హీరో (ఎండ్). ఇలా మూడు పరస్పరాధార విభాగాలుగా త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ లో వుంది కథ.

        ఉబుసుపోక ఆలోచిస్తూంటే ఇదే ఐడియా ఇలా తోచిందనుకుందాం : హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు, దాంతో హీరోయిన్ని పొందాలనుకున్న ఒక డాక్టర్ హీరోని కురూపిని చేయాలని ప్రయత్నిస్తూంటాడు, ఇంకా ఇంకా ప్రయత్నిస్తూంటాడు, మరీమరీ ప్రయత్నిస్తూంటాడు, ఇంతలో హీరో చేతిలో అనుకోకుండా హీరోయినే కురూపి అయిపోతుంది. ఇప్పుడు ఇది గాథవుతుంది. దీంట్లో బిగినింగ్, మిడిల్, ఎండ్ లతో కూడిన స్ట్రక్చర్ లేదు. హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు (బిగినింగ్) దాంతో హీరోయిన్ని పొందాలనుకున్న ఒక డాక్టర్ హీరోని కురూపిని చేయాలని ప్రయత్నిస్తూంటాడు (ఇంకాస్తా బిగినింగ్), ఇంకా ఇంకా ప్రయత్నిస్తూంటాడు (ఇంకాస్తా బిగినింగ్), మరీ మరీ ప్రయత్నిస్తూంటాడు (మరి కాస్తా బిగినింగ్), ఇంతలో హీరో చేతిలో అనుకోకుండా హీరోయినే కురూపి అయిపోతుంది (ఎండ్).

     గాథలు ఆడవని కాదు. ఇప్పుడిక ఆడతాయి. కోవిడ్ వల్ల ఈ ఏడాదిన్నర కాలంగా ఓటీటీకి అలవాటు పడ్డ ప్రేక్షకులు రియలిస్టిక్ సినిమాలు చూసేస్తున్నారు. కోవిడ్ కి పూర్వం థియేటర్లలో రెగ్యులర్ కమర్షియల్స్ అయితేనే చూసేవాళ్ళు. థియేటర్లు మూతబడ్డాక ఓటీటీల్లో రియలిస్టిక్కులు చూసేస్తున్నారు. ఇవే సినిమాలు థియేటర్లలో విడుదలైతే ఎంతమంది చూస్తారనేది సందేహమే. టికెట్టు కొని థియేటర్లో చూడాలంటే ఆ సినిమా ఫుల్ మజా ఇచ్చే మూస ఫార్ములా అయివుండాలి. టికెట్టు కొంటే ఒక అభిరుచి, ఫ్రీగా వస్తే ఇంకో అభిరుచి. అందుకని రియలిస్టిక్స్ తీసే మేకర్లు థియేటర్ల మీద ఆశ పెట్టుకోవాలంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి వుంటుంది.

        పూర్వం ఆర్ట్ సినిమాలు గాథలే. ఆర్ట్ సినిమాలే గాథలతో రూపం మార్చుకుని రియలిస్టిక్స్ గా వస్తున్నాయని గమనించాలి. ఈ ట్రెండ్ కి ముందు సెమీ రియలిస్టిక్ అంటూ కాస్త ధైర్యం చేస్తూ వచ్చేవి. ఇప్పుడు పూర్తిస్థాయి రియలిస్టిక్ గా వచ్చేస్తున్నాయి.


        ఇక కథకీ, గాథకీ తేడా ఏమిటో అనేకసార్లు చెప్పుకున్నదే. కథంటే ఆర్గ్యుమెంట్ అని, గాథంటే స్టేట్ మెంట్ అని. కథ ఒక సమస్యని పరిష్కరించే వాదాన్ని (ఆర్గ్యుమెంట్) ని ప్రతిపాదిస్తేగాథ సమస్యని ఏకరువు పెట్టి వాపోతుంది (స్టేట్ మెంట్).  అంటే గాథలు పరిష్కారం జోలికి పోకుండా కేవలం  సమస్యని ఏకరువుబెట్టే స్టేట్ మెంట్ మాత్రంగా 
వుంటేకథలు  సమస్య అంతు తేల్చి జడ్జిమెంటు ఇచ్చేవిగా వుంటాయి. గాథల్లో పాసివ్ పాత్రలుంటే, కథలో యాక్టివ్ పాత్రలుంటాయి.



        ఇలా ఐడియాలో మార్కెట్ యాస్పెక్ట్, స్ట్రక్చర్ నిర్ణయించుకున్నాక రీసెర్చికి రావాలి. రీసెర్చి అంటే ఐడియాకి సంబంధించి విషయ సేకరణ. విషయ సేకరణ తర్వాతే కథ ఆలో చించాలి. విషయ సేకరణని బట్టి కథ వుంటుంది గానీ కథని బట్టి విషయ సేకరణ వుండదు. ఐడియాని బట్టి విషయ సేకరణ వుంటుంది. దీని గురించి రేపు తెలుసుకుందాం.

సికిందర్