రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, ఆగస్టు 2017, శుక్రవారం

502 : రివ్యూ!
రచన - ర్శకత్వం: సందీప్ రెడ్డి
తారాగణం: విజయ్ దేవ కొండ, శాలినీ పాండే, కాంచన, రాహుల్ రామకృష్ణ, జియాశర్మ, ల్ కామరాజు, సంజయ్ స్వరూప్, దితరులు
సంగీతం: న్, ఛాయాగ్రహణం : రాజు తోట
బ్యానర్ : ద్రకాళి పిక్చర్స్
నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగా
విడుదల : ఆగస్టు 25, 2017
***
        ఇప్పుడొస్తున్న తెలంగాణా దర్శకులు తెలుగు సినిమాలకి  విసుగెత్తిన మూస ఫార్ములాల అలసత్వాన్ని వదిలించి, టాలీవుడ్ కలలో కూడా తలపెట్టని  వాస్తవిక కథా చిత్రాల్ని కాస్త మేధస్సుని కూడా జోడించి ప్రధానస్రవంతికి  అపూర్వంగా పరిచయం చేస్తున్నారు. ఇందుకు అలాటి నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. రాష్ట్రం విడిపోవడం ఎవరికి లాభం, ఎవరికి నష్టమో గానీ భాషల అడ్డుగోడల్ని ఛేదించి తెలుగు సినిమాలు మరుగున పడిన ఇంకో పార్శ్వాన్ని ప్రదర్శించుకుంటున్నాయి. తెలుగు సినిమాలు  మూలన పడేసిన తెలుగుదనం తిరిగి పలకరించడంతో ఉభయరాష్ట్రాల్లోనూ భాషల కతీతంగా ద్వారాలు తెర్చుకుంటున్నాయి. ‘పెళ్లిచూపులు’, ‘అప్పట్లో ఒకడుండే వాడు’, ‘పిట్టగోడ,’ ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’, రేపు ‘నీదీ నాదీ ఒకే కథ’ ఈ కోవకి చెందుతాయి. 

          
తీస్తే ప్రేమని వెల్లడించలేకపోవడం, లేకపోతే అపార్ధాలతో విడిపోవడం – అనే ఈ రెండు  పాత చింతకాయ సిల్లీ నాన్సెన్స్  కథల చుట్టే ముష్టి ఫార్ములా ప్రేమ సినిమాల్ని తిప్పితిప్పి తీస్తున్న మిడిమేలపు జనాభా  ఇక మేల్కొనే టైం అయింది. మేల్కోకపోతే ఇంటికెళ్ళి పోయే టైం వస్తుంది. భవిష్యత్ టాలీవుడ్  తెలంగాణా ప్రైవేట్ లిమిటెడ్ అవుతుంది. 

          ‘అర్జున్ రెడ్డి’ ప్రేమ మామూలే.  పరిణామాలు మామూలైనవి కావు.  మూస దర్శకులు ధైర్యం చేయలేని చీకటి కోణాల్లోకి ప్రయాణించి ప్రేమంటే ఇదీ అని చెప్తుంది. ప్రేమలోకి వెళ్లేముందు పరిణామాల్నిదృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరిస్తుంది. ఈ పని ‘దేవదాసు’ ఎప్పుడో చేశాడు. శరత్  ‘దేవదాసు’ ఇప్పుడు పనిచెయ్యకపోవచ్చు, అప్పుడున్న షరతుల్లేని ఆధునిక – విశృంఖల ‘దేవదాసు’  ఇప్పుడు కావాలి.  

       ఆర్జున్ రెడ్డి (విజయ్)  సంపన్న కుటుంబానికి చెందిన మెడికో. మంగళూరు మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ చేస్తూంటాడు. అతను యూనివర్సిటీ టాపర్. కానీ కోపమెక్కువ.  ఈ  కోపంతో ఎవర్ని ఎప్పుడు కొట్టేస్తాడో తెలీదు. ఫుట్ బాల్ టీం ని అలాగే కొట్టి సస్పెండ్ అవుతాడు. ఆ సమయంలో ప్రీతీ శెట్టి (శాలినీ పాండే)  అనే జ్యూనియర్ ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని ర్యాగింగ్ సమస్య నుంచి కాపాడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. అర్జున్ మాస్టర్స్ చేయడానికి ముస్సోరీ వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చేస్తుంది. ఇంకింత బలంగా  ప్రేమిస్తాడు. ఇక పెళ్లి విషయం ఆమె తండ్రితో మాట్లాడాలని కర్ణాటక వస్తాడు. తుళు భాషలో చెడామడా తిడతాడు ఆమె తండ్రి. కులం, ప్రాంతీయత ఇవన్నీ ముందుకు తెచ్చి రెండు దెబ్బలు కొట్టి వెళ్ళ గొట్టేస్తాడు. కూతురికి వేరే పెళ్లి చేసేస్తాడు. హతాశుడైన అర్జున్ మందూ మాదక
ద్రవ్యాలూ మరిగి,   ఒక పిచ్చి డాక్టర్ గా తయారై, హైదరాబాద్ లో జాబ్ చేస్తూంటాడు. హాస్పిటల్లోనే తాగి ఆపరేషన్లు చేసేస్తూంటాడు. ఒక కుక్క పిల్లని కొనుక్కుని  ప్రీతి అని పేరు పెట్టుకుంటాడు. ప్రీతిని మర్చిపోలేకపోతాడు. ఇదీ కథ. ఇదెలా ముగుస్తుందనేది ద్వితీయార్ధం. 

ఎలా వుంది కథ 
   ప్రేమకథలో ప్రేమకథ చెప్పకుండా, పాత్ర కథ చెబితే ప్రేమ సినిమాల స్వరూపం ఎలా మారిపోతుందో తెలియజేసే వాస్తవిక కథ. దీన్ని ‘దేవదాసు’ లో పట్టుకున్నట్టుందీ కథ. కొన్ని పాత్రలు కూడా అలాగే వున్నాయి- అర్జున్ దేవదాసులాగా, ప్రీతి పార్వతి లాగా, మిత్రుడు భగవాన్ లాగా, సినిమా హీరోయిన్ చంద్రముఖి లాగా. రోడ్డున పడి  అరుగుమీద చేరాక అర్జున్  పక్కన కుక్క కూడా దేవదాసు కుక్క లాగా. ముగింపులో తప్ప సెకండాఫ్ లో హీరోయిన్ కన్పించక
పోయినా హీరో పాత్ర ప్రవర్తనతోనే, మార్పులు చెందే జీవితంతోనే ఏకోన్ముఖంగా కథ నడపడం కత్తిమీద సామే. దీన్ని అత్యున్నతంగా సాధించిందీ కథ. కథ కంటే క్యారక్టర్ స్టడీ మీద ఎక్కుపెట్టి మూస ప్రేమలు
అలవాటైన ప్రేక్షకుల గుండెల్లో బాధని రగిలించే, రాణించే కాన్సెప్ట్. ఈ వాస్తవికతని కూడా బంగారు పళ్ళెంలో తియ్యగా పెట్టి ఇవ్వలేదు, ఇందులో ధారాళంగా అశ్లీల పదాలూ, అశ్లీల దృశ్యాలూ, ప్రేమలో కరకు వాస్తవాలూ  ‘ఏ’ సర్టిఫికేట్ కి న్యాయం చేస్తూ బోనస్ గా వున్నాయి – న్యూసినిమా ధోరణిలో. పోతే ముగింపే రాజీపడి వాస్తవిక ధోరణి తప్పుతూ మూస ఫార్ములాలోకి తిరగబెట్టడం మింగుడుపడదు. ఈ ముగింపుతో పాత్రలే అర్ధంలేనివిగా తేలాయి. ఈ వాస్తవిక కథకి కథా ప్రయోజనమే దెబ్బతింది. 

ఎవరెలా చేశారు
      విజయ్ ఆశ్చర్య పరుస్తాడు. కమర్షియల్ సినిమా నటనల ఛాయలు పడకుండా వాస్తవిక పాత్రని అత్యంత సహజంగా నిర్వహించాడు. బావున్న రోజుల్లో ఆ రోషం, చెడిపోయాక పిచ్చి చూపులు, కన్ఫ్యూజన్ బాగా ప్రాక్టీసు చేసి నటించాడు. ఫస్టాఫ్ వరకూ యాక్టివ్ పాత్రే, సెకండాఫ్ లో పాసివ్ గా మారిపోతాడు. వాస్తవిక కథా చిత్రాలకి యాక్టివ్ – పాసివ్ లు వర్తించవు. ఎక్కువగా కథే పాత్రని నడిపిస్తుంది. సినిమా సాంతం ఆయా కాలాల్ని బట్టి విభిన్న గెటప్స్ లో కనిపిస్తాడు. ఆ గెటప్స్ లో అప్పటి పాత్రలాగే అన్పిస్తాడు. అత్యంత పరాకాష్టకి చేరడం- హస్పిటల్లో ఉద్యోగంపోయి,  ఇంట్లోంచి తండ్రి వెళ్ళగొట్టి, ఫ్లాట్ లోంచి యజమాని కూడా వెళ్ళ గొట్టి, డబ్బులేక వస్తువులు అమ్ముకుంటూ రోడ్డున పడ్డాక- రెండు సీన్లలో. విజయ్ ఆంటోనీ కి ‘బిచ్చాగాడు’ ఎలాగో, విజయ్ కి ‘అర్జున్ రెడ్డి’ అలాగ. ‘దేవదాసు’ – ‘బిచ్చగాడు’  రెండూ కలిసి ‘అర్జున్ రెడ్డి’ అయ్యాడు- ఇది బాగా తరచి చూస్తే  తప్ప దొరికిపోని క్రియేటివిటీ. 

          హీరోయిన్ శాలినీ పాండే చాలా లో- ప్రొఫైల్ పాత్ర నటించింది. మాటలుకూడా తక్కువే. హా వభావాలే ఆమె భాష. వేరే పెళ్ళయి పార్వతి లాగా వెళ్ళిపోవడం వరకూ ఓకే గానీ, ఆ తర్వాతే ఆమె పాత్ర  రొటీన్ మూస ఫార్ములా పాత్రగా మారిపోయి, తీవ్ర అసంతృప్తికి లోనుజేస్తుంది చివర్లో. 

          ఇక విజయ్ ఫ్రెండ్ పాత్రలో రాహుల్ రామకృష్ణ  ఒక కొత్త ఆకర్షణ. ఇతను కూడా హాస్యాన్ని వంకర్లు తిరిగిపోతూ నాటకీయంగా, కమర్షియల్ గా నటించలేదు. పాత్రపరంగా పక్కా ఆధునిక భగవాన్ పాత్ర,  ‘దేవదాసు’ లో పేకేటి శివరాంని గుర్తుకు తెస్తూ. అర్జున్ అన్న పాత్రలో కమల్ కామరాజు, తండ్రి పాత్రలో సంజయ్ స్వరూప్ సహజనటులు. ఇక నానమ్మగా అలనాటి హీరోయిన్ కాంచన ఒక వండర్ఫుల్ చేరిక. 

          టెక్నికల్ గా కెమెరా వర్క్ సాంప్రదాయ షాట్స్ తో వుంది. ఎడిటింగ్ లో కూడా గిమ్మిక్కులు చేయలేదు. విజయ్ మీద బిల్డప్ షాట్స్, డీటీఎస్ మోతా లేవు. పాటలు ఏడువున్నాయి- ఏదీ దృశ్య, శబ్ద కాలుష్యాల్ని పరివ్యాప్తం చేయకుండా ఆరోగ్యకరంగా వున్నాయి. లొకేషన్స్ కథని డామినేట్ చేయకుండా కథకి తగ్గట్టుగా వున్నాయి. దర్శకుడు కొత్తవాడయినా కొత్త విజన్ లో ఈ ప్రేమకథని చూశాడు. మామూలుగా అయితే కాలేజీ సీన్లు, క్లాస్ రూమ్ సీన్లు ఇంకా చూపించడానికేమీ లేనట్టుగా వెటకారంగా,  విషయలేమితో వుంటాయి. కానీ ఇక్కడ ఆ ఫార్ములాకి దూరంగా, సహజంగా, విషయంతో కొత్తగా వుంటాయి. 

చివరికేమిటి 
      కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వినోదాత్మక వాస్తవికత ఎలా
వుంటుందో ‘పెళ్లిచూపులు’ నుంచి ఇంకో మెట్టు పైకి తీసికెళ్లి చూపిం
చాడు. చిత్రీకరణ మీద మంచి పట్టు సాధించాడు. రచనాపరంగా బయట మాట్లాడుకునే భాష వాడి దృశ్యాల్ని ప్రేక్షకులకి సన్నిహితంగా చేశాడు. అయితే దీన్ని మూడుగంటల సినిమాగా తీయక్కర్లేదు. అరగంటకి పైగా తగ్గించవచ్చు. ఫస్టాఫ్ ఇంటర్వెల్ కే గంటన్నర పట్టింది. ఇక్కడ పాయింటు కొచ్చి, సెకండాఫ్ లో హాస్పిటల్లో ఉద్యోగం పోయే దగ్గర పరిష్కార మార్గానికొచ్చి,  ఆ తర్వాత పరిష్కరించిన విధానంతోనే ముగింపు చెడిపోయింది. ఏదో కాలక్షేప బఠానీ అనుకుని ఈ మూవీ తీసి వుంటే అది వేరు. కానీ సీరియస్ వాస్తవిక పాత్రని చర్చిస్తూ దాన్ని మూసఫార్ములా  ముగింపుతో సరిపెట్టేస్తే ఎలా? దీంతో హీరో హీరోయిన్ల పాత్రల మౌలిక తత్త్వాలే  దెబ్బతినిపోయాయి. వాళ్ళు మెడికల్ రంగంలో వున్నారు. అంత అజ్ఞానంగా ఎలా వుంటారు తమ శారీరక కలయిక విషయంలో? ఫార్ములా ముగింపు కోసమే కదా హీరోయిన్ పాత్రతో ఈ అసంగతాలు. 

          దీంతో ఏం చెప్పాలనుకుంటున్నారు? భగ్నప్రేమలతో అలమటించిపోండి, పెళ్ళయిన ప్రేయసిని వదలకండి- అనా? భగ్న ప్రేమలు సరే, వేరే పెళ్ళిళ్ళు సరే- move on man, move on- ఇంకా జీవితం చాలా ఇస్తుందని  చెప్పడమా? చివరికి అర్జున్ వ్యసనాలు మానుకుని పరివర్తన చెంది, విదేశీ యాత్రకి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్ గా అన్పిస్తాడు. హాయిగా- he is certainly moving on – అన్పించి ఏంతో  బావుంటాడు. అలా తిరిగి వచ్చి - నాకు సంబంధం చూడండి డాడ్ -  అంటాడేమో, తనలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే యూత్ కి ఇన్స్పైరింగ్ గా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడేమో అనుకుంటే, ఎందుకు భయపడ్డాడో దర్శకుడు- పెళ్ళయిన ప్రేయసి దగ్గరికే పంపి లాజిక్ లేని ఫార్ములా ముగింపుతో - వాస్తవిక కథా చిత్రాన్ని  అవాస్తవికంగా మార్చాడు. 


         
 -సికిందర్
cinemabazaar.in