రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, జూన్ 2022, ఆదివారం

1175 : సందేహాలు- సమాధానాలు

         
      Q : మీ బ్లాగులో రివ్యూలు రావడం లేదు. కారణం తెలియదు. అకస్మాత్తుగా రివ్యూలు ఆపేస్తే మాకు ఇబ్బంది తప్పదు. ఎందుకంటే నిర్మాణాత్మక రివ్యూలకు మీ ఒక్క బ్లాగే మాకు ఆధారం. మాకు ఎంతో ఉపయోగపడే మీ విలువైన బ్లాగుని మీరు నిర్లక్ష్యం చేయకుండా కంటిన్యూ చేయగలరు. రివ్యూలు అందించగలరు.

—వి ఎస్ ఎన్, అసోషియేట్
        A :  ఇలాటి ప్రశ్నలు మరి కొన్ని వచ్చాయి. మీ అందరి మనోభావాలు అర్ధమయ్యాయి. దీని కొక్కటే సమాధానం. సినిమా ఎందుకు హిట్టయ్యిందని కాక ఎందుకు ఫ్లాపయ్యిందని రివ్యూలు రాయడం వల్ల  ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఫ్లాపవడానికి ప్రధాన కారణాలేమిటో ఎంత చెప్పినా అవే ప్రథాన కారణాలతో ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి. మన కాంటాక్టులోకి వచ్చే వాళ్ళెందరో బ్లాగు అభిమానులమని, ఎన్నో తెలుసుకుంటున్నామనీ, స్ట్రక్చర్ నేర్చుకుంటున్నామనీ చెప్తూంటారు. దీంతో పాటు ఇతరుల సినిమాల్లో తప్పులు పట్టుకుని అనవసరంగా వెక్కిరించే పనికూడా గొప్ప కోసం చేస్తూంటారు. ఇంత జ్ఞాన సంపన్నులైన తాము తీరా సినిమా అవకాశమొస్తే, మళ్ళీ కంటికి కన్పించకుండా పలాయన మంత్రం పఠించి, ఈ బ్లాగు, స్ట్రక్చర్ గ్రిక్చర్, చర్చ అన్నీ పక్కకు తోసేసి, ఏదో సొంత కవిత్వం వూహించుకుని అట్టర్ ఫ్లాప్ తీసేసి ఆశ్చర్య పరుస్తారు. నేటి బ్లాగు పఠిత రేపటి పలాయన పథికుడు అన్నట్టు వుంది. ఈ మాత్రం దానికి బ్లాగు జోలికి రావడమెందుకు. ఈ బ్లాగు కేవలం తామెక్కాల్సిన రైలుకి కాలక్షేపం చేసే రైల్వే ప్లాట్ ఫామ్ లా తయారైనట్టు సీసీ కెమెరాలో కన్పిస్తోంది. ఈ బ్లాగు సత్రంలా వున్నా మాకు ఆనందమే.

        ఈ వర్గంలో మీరు కూడా వుండరని ఆశిద్దాం. అయితే హిట్టయిన సినిమాకి ఎందుకు హిట్టయ్యిందో రివ్యూ రాస్తే వుండేంత ప్రయోజనం ఫ్లాప్ సినిమా రివ్యూకి కి వుండదు. హిట్ సినిమాల్లో కొత్త విషయాలు తెలుస్తాయి. నేర్చుకోవడానికుంటుంది. సర్కారు వారి పాట, మేజర్, అంటే సుందరానికి, విరాటపర్వం లలో నేర్చుకోవడానికేముందని రివ్యూలు రాయాలి. ఈ పెద్ద సినిమాలు బాక్సాఫీసు దగ్గర స్ట్రగుల్ చేస్తున్నవే కదా.  ఇలాటి సినిమాల్లో అవే లోపాల గురించి స్క్రీన్ ప్లే సంగతులు మళ్ళీ అలాగే రాసి రాసి విసుగెత్తి పోయిందని చెప్పొచ్చు. అందుకే పాత స్పీల్ బెర్గ్ డ్యూయెల్ ని వెతికి పట్టుకుని నేర్చుకోవాల్సిన కొత్త విషయాలతో స్క్రీన్ ప్లే సంగతులు రాయాల్సి వస్తోంది. ఇది మీకు ప్రయోజనకరమా, టెంప్లెట్ సినిమాల రివ్యూలే  ప్రయోజనకరమా?

        అయినప్పటికీ, చాలా డిమాండ్స్ వల్ల మేజర్, విరాటపర్వంలకి సంక్షిప్త రివ్యూ లివ్వదలిచాం. ఇకపైన స్క్రీన్ ప్లే సంగతులకి అర్హమైన సినిమాలకే రివ్యూలుంటాయని గ్రహించగలరు. వందల సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు ఈ బ్లాగులో వున్నాక, ఇక వచ్చే ప్రతీ సినిమాకీ స్క్రీన్ ప్లే సంగతులు రాస్తేనే విషయం అర్ధమవుతుందనుకోవడం పొరపాటు. అన్నేసి స్క్రీన్ ప్లే సంగుతులు చదివాక నాలెడ్జి వచ్చేసి వుండాలి. ఈ డేటా బ్యాంకు ఆథారంగా  వచ్చే కొత్త సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు మీకే తెలిసిపోతూండాలి. ఇంకా తెలియకపోతే సినిమాలేం తీస్తారు.

—సికిందర్
(మరికొన్ని ప్రశ్నలు రేపు)