రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, October 21, 2015

మేకప్ చీఫ్   వి. మోహన్ రావు 





గాడ్ క్రియేటెడ్ వన్ ఫేస్ బట్ విత్ మేకప్ వియ్ కెన్ షో వేరియస్ ఫేసెస్ ఆన్ ది సేమ్  ఫేస్’ అని ఉంటుంది ఎపి సినీ మేకప్ ఆర్టిస్ట్స్ అండ్ హేర్ స్టయిలిస్ట్స్ యూనియన్ వెబ్ సైట్లో. యూసుఫ్ గూడలోని మూడంతస్తుల సొంత యూనియన్ భవనం టెర్రస్ మీద ఓ సాయంకాలం పూట యూనియన్ ప్రెసిడెంట్, సీనియర్ మేకప్ చీఫ్ వి. మోహన్ రావు ఈ కొటేషన్ కి కొనసాగింపుగా నందికేశ్వరుడి శ్లోకం చెప్పుకొచ్చారు..

ఆంగికం భువనం యశ్య
వాచికం సర్వ వాజ్మయం
ఆహార్యం చంద్రతారాది తం
వందే సాత్వికం శివమ్ - అని.

        తుర్విదాభినయ స్వరూపుడైన ఆ శివుడికి పై విధంగా నమస్కరిస్తూ నందికేశ్వరుడు, ఆహార్యాభినయాన్ని ప్రకృతిలో కన్పించే సమస్తంతో పోలుస్తూ తృతీయ స్థానం కల్పించాడు. ఇందుకు చాలా గర్వంగా ఫీలవుతారు మోహనరావు. ఆహార్యంలో మేకప్ చాలా ప్రధానమైన భాగమని తెలిసిందే.

        ‘సృష్టికి ప్రతి సృష్టి చేయగలం మేము. బ్రహ్మ ఇచ్చిన రూపాన్ని మార్చగల శక్తి మాకుంది.’ అన్నారు నవ్వుతూ. అసలు మేకప్ అంటే ఏమిటన్న ప్రశ్నకి- ముఖంలో లోపాల్ని సరిదిద్ది అందంగా చూపడమే నన్నారు.

      అనేక పరిణామ దశలు దాటిన మేకప్ కళ ప్రస్తుతం హైటెక్ స్థితికి చేరుకుందని చెబుతూ, రోజుకో కొత్త రకం బ్రాండ్ తో మేకప్ మెటీరియల్ వెల్లువలా వచ్చి పడుతోందని తలపట్టుకున్నారు. ఏది ఎంచుకోవాలో తెలిసి చావడం లేదన్నారు. మేకప్ ఆర్టిస్టు కిట్ బ్యాగులో కనీసం లక్షరూపాయాల మెటీరియల్ వుంటే తప్ప అతణ్ణి కన్నెత్తి చూడడం లేదన్నారు. మెటీరియల్ ధరలు కూడా తడిసి మోపెడవుతున్నాయనీ, ఓ లిప్ స్టిక్ కొనాలన్నా కూడా రెండు వేలు తీసి ఖర్చు పెట్టాల్సి వస్తోందన్నారు. లేకపోతే రంగంలో  వుండే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. సినిమాల కంటూ ప్రత్యేకంగా మేకప్ మెటీరియల్ ఉత్పత్తి చేయడం వల్లే ఇవి ఇంత ఖరీదైనవి అవుతున్నాయన్నారు

        తెలుపు - నలుపు రోజుల్లో మేకప్ వేయడానికి 45 నిమిషాలు పట్టేదనీ, ఇప్పుడా సమయం సగానికి తగ్గిందనీ, అయితే నటీమణుల విషయంలో మళ్ళీ అదే  45 నిమిషాలూ పడుతోందనీ వివరించారు.

     కొన్ని సినిమాల్లో మేకప్ లేకుండా నటించారని అంటూంటారు,  అదేమిటన్న ప్రశ్నకి-  ‘అప్పుడు కూడా మేకప్ ఆర్టిస్టుకి పని వుంటుంది. ఆర్ట్ సినిమాల్లో ఆ వాస్తవిక లుక్ తీసుకు రావడానికి కూడా మేకప్ ఆర్టిస్టు చెయ్యి పడాల్సిందే’ అని చెప్పుకొచ్చారు. చర్చ టెక్నిక్ మీదికి మళ్ళినప్పుడు- ‘ఆర్టిస్టు మొహానికి ఇంత రంగు పులిమేసి గాయమైనట్టు చూపించేస్తున్నారు, ఇది కరెక్టేనా?’ అంటే- నవ్వేసి- అలాటి దాన్ని ‘మేకప్’ అనలేమన్నారు. గాయాన్ని సృష్టించడానికి పట్టీ, వాక్స్ అనే పదార్దాలున్నాయనీ, వాటిని అతికించి, కోత పెడితే అప్పుడది గాయంలా కన్పిస్తుందనీ, ఈ పదార్ధాల ఖరీదు  కూడా ఐదు వేలకి తక్కువుండదనీ, వీటి జీవితకాలం కూడా నాలుగైదు నెలలేననీ వివరించారు.

        ‘మరగద నాయకన్’ (కమలహాసన్ ఆగిపోయిన సినిమా) కి కమల్ హాలీవుడ్ నుంచీ మేకప్ నిపుణుడు బేరీ కూపర్ ని పిలిపించుకుని, 30 లక్షలు ఖర్చు చేసి శిక్షణా తరగతులు నిర్వహించారని చెప్పుకొస్తూ, అందులో తాను కూడా పాల్గొన్న విషయం వెల్లడించారు. ఆ శిక్షణా తరగతుల్లో  మొహం మీద మచ్చలు, ముసలితనం, పెద్ద పెద్ద గెడ్డమూ మీసాల మేకప్ గురించి తెలుసుకున్నానని చెప్పారు. అయితే ఎప్పుడో భీష్ముడి లాంటి పాత్రలకి మనమే పెద్ద పెద్ద గడ్డాలూ మీసాలూ అవీ సృష్టించి వున్నాం కదా అంటే, ‘ఎందుకు లేదూ, చింతపండుతో స్పెషల్ గెటప్స్ సృష్టించిన ఘనత కూడా మనకుంది. అయితే ఆ తెలుపు నలుపు రోజుల్లో నెట్ తో గడ్డం అతికిస్తే తెలిసేది కాదు. ఇప్పుడు తెలిసిపోతోంది’ అన్నారు. ఇప్పుడు గడ్డం అతికించడానికి వాడే జిగురు ఖరీదే 3,800 రూపాయలుందన్నారు. హాలీవుడ్ లోనైతే ముందు నటుడి మౌల్డ్ ని తయారు చేసి, దాని  మీద మేకప్ ప్రక్రియ పూర్తి చేస్తారనీ, అలా మ్యాచింగ్ చేసిన గడ్డం మీసాల్ని మళ్ళీ ఆర్టిస్టు కి అలంకరిస్తారనీ చెప్పుకొచ్చారు.

       రేపల్లె దగ్గర్లోని బెల్లంవారి పాలెం కి చెందిన మోహనరావు, 1975 లోనే  మద్రాసు చేరుకున్నారు. ‘స్వర్గం-నరకం’ సినిమాకి  దర్శకత్వం వహిస్తున్న డా. దాసరి నారాయణరావు కి వ్యక్తిగత కార్యదర్శిగా చేరారు. తర్వాత దాసరే అడిగితే, మేకప్ మాన్ కావాలన్న కోరిక వెలిబుచ్చారు. చిన్నప్పట్నించే తనకి మేకప్ పట్ల ఆసక్తి వుంది. అప్పట్లోనే నాటకాల్లో టమాటా రసంలో రంగులు కలిపి మొహాలకి అద్దిన అనుభవాలున్నాయి. సరేనని,  దాసరి 150 రూపాయలు సభ్యత్వ రుసుం చెల్లించి చేర్పిస్తే, మేకప్ మాన్ గా మోహన్ కెరీర్ మొదలైపోయింది. ఇప్పటివరకూ 300 సినిమాలకి పని చేశారు. ఎస్వీ రంగారావు, గుమ్మడి, రావికొండలరావు ప్రభృత నటులకి మేకప్ చేసిన అనుభవాల గురించి గర్వంగా చెప్పుకొచ్చారు. పోతే, గత 26 ఏళ్లుగా పరుచూరి బ్రదర్స్ కి పర్సనల్ మేకప్ మాన్ గా కొనసాగుతున్నారు తను. 

        ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులకి  విలవ లేదన్నారు. నందికేశ్వరుడి మంత్రాన్ని జపించే మేకప్ కళాకారులు కూడా లేరన్నారు. పూర్వం నటీనటులు గడపకి దండం పెట్టుకుని, లోపల కొచ్చి,  మేకప్ మాన్ కాళ్ళకి నమస్కరించి గానీ మేకప్ కి కూర్చునేవాళ్ళు కాదని చెప్పారు. 

      నాటి ప్రఖ్యాత నటీమణి కృష్ణ కుమారి ఓసారి మోహనరావు కాళ్ళకి దండం పెట్టేశారు! ఆయన కంగారు పడి - ‘ అమ్మా మీకు బిడ్డ లాంటి వాణ్ణి!’ అన్నారు. ఆవిడ చిద్విలాసంగా నవ్వి- ‘దండం పెట్టుకున్నది నీకు కాదు బాబూ, నీలోని కళాకారుడికి’ అని అన్నారని చెమర్చిన కళ్ళతో చెప్పుకొచ్చారు మోహనరావు.
        ‘వియ్ డోంట్ నో హౌమెనీ పీపుల్ హేడ్ సీన్ గాడ్, బట్ మేకప్ కెన్ షో’  ఇది కూడా యూనియన్ వెబ్సైట్లోదే.  ఇందుకే ఆ రోజుల్లో మేకప్ కళాకారుల పట్ల అంత గౌరవం..

-సికిందర్ 
( ఏప్రిల్ 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమాటెక్’ శీర్షిక)