రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, December 21, 2016

రివ్యూ!





నిర్మాణం- దర్శకత్వం : ఆదిత్యా చోప్రా

తారాగణం : రణవీర్ సింగ్, వాణీ కపూర్, అర్మాన్ రాల్హాన్, ఆకాష్ ఖురానా, ఆయేషా రజా జూలీ ఆర్డాన్ తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : ఆదిత్యా చోప్రా, మాటలు : శరత్ కటారియా, సంగీతం : విశాల్- శేఖర్, ఛాయాగ్రహణం : కనామే ఒనోయమా
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్,
విడుదల : 9 డిసెంబర్,  2016
***
సెంటిమెంటల్ సినిమాల ఆదిత్యా చోప్రా స్వయంగా రోమాంటిక్ కామెడీకి దర్శకత్వం వహిస్తూ ‘బేఫిక్రే’  (కేర్ ఫ్రీ) తీసినప్పుడు ఇది కాలేజీ యూత్ ని కిర్రెక్కించేలా తయారయ్యింది. యూత్ నాడిని పట్టుకుని ఎక్కడా దేనికీ హద్దుల్లేని, పరిమితుల్లేని  ఆల్ ఫ్రీ- కేర్ ఫ్రీ లవ్ ని కలర్ఫుల్ గా తెరాయమానం చేశాడు. హీరో రణవీర్ సింగ్, హీరోయిన్  వాణీ కపూర్ లు ఈ ‘ ‘రోమెడీ’ (రోమాంటిక్ కామెడీ) ని హాట్ హాట్ గా రగిలించి – క్యారక్టర్స్ ని పండించి, నవ్వించి, కవ్విస్తూ కొలిక్కి తెచ్చిన విధం ఎట్టిదంటే....


కథ 
     ఢిల్లీ కరోల్ బాగ్ కుర్రాడు ధరమ్ పని వెతుక్కుంటూ పారిస్ చేరతాడు. తనకి తెలిసిన విద్య కామెడీ షోలు చేయడమే. ఒక నైట్ క్లబ్లో ఏకపాత్రాభినయాలు చేస్తూ నవ్విస్తూంటాడు.  అక్కడే షైరా (వాణీ కపూర్) పరిచయమై చెట్టపట్టా లేసుకుంటారు. ఆమె తల్లిదండ్రుల్ని  వదిలి పెట్టి అతడితో సహజీవనం చేయడం మొదలెడుతుంది. ఇద్దరికీ పెద్దగా ప్రేమలంటూ పట్టింపుల్లేవు. ఆ సహజీవనంలో ఓ రోజు తేడా వస్తుంది. ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఫ్రెండ్స్ గా కలిసివుందామనుకుంటారు. అసలు ముందు ఫ్రెండ్ షిప్ చేయకుండా కలవడం వల్లే అది ఉత్త మోహానికి దారి  తీసిందనీ, అదే ముందు ఫ్రెండ్ షిప్ చేసి వుంటే ప్రేమ పుట్టి వుండేదనీ గుర్తిస్తారు. ఇప్పుడు తమ రిలేషన్ షిప్ ని మర్చిపోయి ఫ్రెండ్స్ గా వుంటున్నప్పుడు  ఒక ఇన్వెస్ట్ మెంట్  బ్యాంకర్ (అర్మాన్ రాల్హాన్) కి ఆమె కనెక్ట్ అవుతుంది. క్రిస్టీన్ (జూలీ ఆర్డాన్) అనే ఫ్రెంచ్ అమ్మాయికి ధరమ్ కనెక్ట్ అవుతాడు. బ్యాంకర్ తనకి ప్రేమిస్తూ కూర్చునే టైం లేదనీ, పెళ్లి చేసుకుందామనీ తొందర పెడతాడు. ఆమె ధరమ్ సలహా అడుగుతుంది. చేసుకొమ్మంటాడు. ఆమె పెళ్లి చేసుకుంటూంటే,  పోటీ పడి తనూ క్రిస్టీన్ ని పెళ్లి చేసుకోబోతాడు- ఈ పెళ్ళిళ్ళు అయ్యాయా, ఏం చేసుకున్నారు, ఏం తెలుసుకున్నారు, ఎలా ముగించుకున్నారు.... అనేది మిగతా కథ. 

ఎలావుంది కథ
      నస పెట్టకుండా   సాఫీగా వుంది. నేటి తరాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ టేస్టులకి  పట్టం గడుతూ వుంది. మనస్సుని కాదనుకుని ఎంతైనా స్వేచ్ఛాయుత జీవితాలు గడుపుకోవచ్చు, ఒకనాటికి ఆ మనస్సుకి  చెప్పుకోవాల్సి వస్తుందన్న సున్నితమైన థీమ్ తో వుంది. ఇందులో తెలుగు యూత్ సినిమాల్లో లాగా హాస్యాస్పదంగా పెద్ద పాత్రల చాదస్తాలు, జోక్యాలు, ఏడ్పులూ, క్లాసులు పీకి ప్రేమికుల మధ్య సమస్య పరిష్కరించడాలూ వంటి నాన్ సెన్స్ లేకుండా చాలా రిలీఫ్ నిచ్చేలా వుంది. హీరోయిన్ కి పేరెంట్స్ వున్నా,  తండ్రి ఒకసారి – మన చేతుల్లో వీళ్ళు పెరగరు, వీళ్ళ చేతుల్లో మనం పెరగాలని  విజ్ఞతతో అనేసి వూరుకుంటే, చివర్లో డైలెమాలో పడ్డ  హీరోయిన్ తో తల్లి చెప్పే ఒక మంచి మాటని  కూడా తలకిందులు చేసేస్తూ, హీరోతో కలిసి  నిర్ణయం తీసుకుంటుంది హీరోయిన్. ఫలితంగా ఫ్రెంచి చర్చిలో రెండు పెళ్ళిళ్ళ గలాభా, గందరగోళం, పెద్ద కిష్కింధ కాండా  జరిగి- ఒక కామిక్ స్ట్రోక్ తో ముగుస్తుంది.  ఎత్తుకున్న జానర్ కి న్యాయం చేస్తూ, ఎక్కడా బరువెక్కించని పూర్తి స్థాయి సరదా రోమాంటిక్ కామెడీ ఇది. 

ఎవరెలా చేశారు
      క్యారక్టర్  ఒక్కోసారి చాలా పెద్ద పని చేసి పెడుతుంది. రొటీన్ గా వుండే కమర్షియల్ సినిమా క్యారక్టర్లు కేవలం ప్రేమల్లో పోకిరీ తనాలూ, హీరోయిన్ని ఏడ్పించి లొంగ దీసుకోవడాలూ మొక్కుబడిగా చేసుకు పోతూంటాయి. రణవీర్ సింగ్ పాత్ర ఇక్కడ చాలా పెద్ద పని చేసి పెట్టింది. చాలా ఇంటరెస్ట్ పుట్టిస్తుంది. అతడి ముఖాన్ని, చేష్టల్ని  మర్చిపోలేకుండా చేసి పెట్టింది. ఇంకా పద్నాల్గేళ్ళు నిండని లేత కుర్రాడు చూపులు ఎలా చూస్తాడో, మూతి విరుపులు ఎలా ప్రదర్శిస్తాడో, ఎలాటి చేష్టలు పోతాడో, అలిగితే ఎలా వుంటాడో, సరీగ్గా వీటిని ప్రెజెంట్ చేస్తూ కేర్ ఫ్రీగా దున్నుకుంటూ పోయాడు రణవీర్. చిన్న కుర్రాడిలా పెట్టే అతడి మూతిని, చూపుల్నీ అస్సలు మర్చిపోలేం. మనస్తత్వం కూడా అలాటిదే. ఈ క్షణం అలిగితే మరుక్షణం నవ్వేస్తాడు. మనసులో ఏదీ దాచుకోడు. ప్రేమంటే పెద్దగా తెలీదు. పెళ్ళంటే కూడా తెలీకుండా పోటీకోసం  పెళ్ళికి సిద్ధపడతాడు. ఈ రకం క్యారక్ట రైజేషన్ ఈ రోమాంటిక్ కామెడీని చాలా కలర్ఫుల్ గా మార్చేసింది. 

     హీరోయిన్ వాణీ కపూర్ కూడా అతడికేం తీసిపోని తెగువతో నటించేసింది. హీరో కే మాత్రం తీసిపోని, తగ్గని, స్వత్రంత్రతా కోల్పోని తత్త్వాన్ని కొట్టొచ్చినట్టూ గ్లోరిఫై చేసింది. ఈమె పేరెంట్స్ పాత్రల్లో ఆకాష్ ఖురానా, ఆయేషా రజాలవి చాలా అదుపులో వుండే పొదుపైన పాత్రలు. 

     ఈ రోమాన్స్ కి దీటుగా పారిస్ నగరాన్ని పగలూ రాత్రీ వైభవంగా చూపించారు. ఈ హాట్ రోమాన్స్ కి పోటీ పడే బీట్స్ తో పాటలూ వున్నాయి. టెక్నికల్ గా అంతర్జాతీయ స్థాయిలో వుంది. విశృంఖల శృంగారం అక్కడక్కడా వుంది. కానీ ఒక్క బూతు మాటా లేదు.  డబల్ మీనింగులతో కామెడీ చేయడాలు లేదు. డైలాగుల్లో వాడిన భాష కూడా అర్బన్ యూత్ వాడే పదాలతో వుంది.

చివరికేమిటి 
        మేం యూత్ కి ఫలానా ఈ మెసేజ్ తో సీనిమా తీశామని పాత స్టయిల్లో పబ్లిసిటీ చేసుకోవడాలు చూస్తూంటాం. యూత్ కి మెసేజ్ ఇచ్చేదేమిటి? వాళ్ళు దేశాలు దాటిపోతున్నారు. సినిమా ఫీల్డు దాటకుండా కూర్చుని మెసేజి లివ్వడమేమిటి? ఆదిత్యా చోప్రా కేవలం అనుభవాలు చూపించి వదిలేశాడు. అనుభవాల్లోంచి యూత్ వాళ్ళే నేర్చుకుంటారు. కావాల్సిందల్లా అచ్చు గుద్దినట్టు వాళ్ళ జీవితాల్ని, అనుభవాల్నీ చూపించడం. పెద్దగా విషయం లేకుండానే విషయమున్నట్టు తోచే ఈ రోమాంటిక్ కామెడీ బాలీవుడ్ వేసిన ఒక ముందడుగు. 1995 లో ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ కి దర్శకత్వం వహించిన ఆదిత్యా చోప్రా, ఇంకో రెండే సినిమాలకి దర్శకత్వం వహించి, నిర్మాతగా 40 సినిమాలు నిర్మించి, ఇప్పుడు ఈ యూత్ ఫుల్ రోమాంటిక్ కామెడీకి రచన- దర్శకత్వమూ వహిస్తూ అత్యంత ట్రెండీ చిత్రీకరణ జరపడం గొప్ప విషయమే.


-సికిందర్
http://www.cinemabazaar.in/