రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, May 12, 2018

645 : సందేహాలు -సమాధానాలు



Q :    తెలంగాణా సినిమాపై అనేక వ్యాసాలు చదువుతున్నాను. ఏది కరెక్టో అర్ధం గావడం లేదు. కన్ఫ్యూజన్లో వున్నాను. అసలు తెలంగాణా సినిమా అంటే ఏమిటి?
పిఎన్ రాజేందర్, నిజామాబాద్ 

 
A :    ఏదీ కరెక్ట్ అనుకోనవసరం లేదు. మీ ప్రశ్నకి ఇస్తున్న ఈ జవాబు కూడా కరెక్ట్ అనుకోనవసరం లేదు. ఇప్పుడున్న పరుగుపందెపు కాలంలో ఎవరి నమ్మకం వాళ్ళు కరెక్ట్  అనుకుని దూసుకెళ్ళి పోవడమే. ఐతే నమ్మకాలు వేరు, సృజనాత్మక నైపుణ్యం వేరు. రెండోది సందేహాస్పదమైనప్పుడు, మొదటిది చర్చనీయాంశమే కాదు. 

          తెలంగాణా సినిమా అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, తెలంగాణా జీవితాన్ని తెలంగాణా అద్దంలో చూసుకుంటే కాదు. ప్రపంచీకరణ అద్దంలో చూడాలి. సినిమాలు  రాష్ట్రావతరణాన్ని బట్టి వుండవు, కాలాన్ని బట్టి వుంటాయి. మాభూమి, దాసిల వంటి సినిమాల కాలంలో రాష్ట్రావతరణ జరిగివుంటే అలాటి అస్తిత్వాలకి, వాస్తవికతలకీ అద్దంపట్టే సినిమాలని,  స్వతంత్ర రాష్ట్రంలో  మరింత స్వేచ్ఛగా తీసుకోవడానికి  ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లభించేవేమో.

          అది కూడా ప్రపంచీకరణ వరకే. కాలం ప్రపంచీకరణలోకి ప్రవహించాక, ఇక అందరితో బాటూ తెలంగాణా సినిమాకూడా కమర్షియల్ బాట పట్టాల్సిందే తప్ప, ఇంకా అదే తెలంగాణా జీవితం, సంస్కృతీ అంటూ కూర్చుంటే అంతరించిపోవడమే. దేశంలో ప్రతీ ప్రాంతీయ సినిమా ఇలా అంతరించిపోయి, తర్వాత ప్రపంచీకరణకి లొంగి కమర్షియల్ గా పునర్జన్మెత్తిందే. శ్యాం బెనెగళ్, గోవింద్ నిహలానీల వంటి ప్రాంతీయ సినిమా దర్శకులు కూడా దీన్ని తప్పించుకోలేదు. 

   రాష్ట్రావతరణతో కాలం అక్కడే ఆగిపోయి వుండదు. రాష్ట్రమే ఇంకో కాలంలోకి ప్రయాణిస్తుంది. రాష్ట్రావతరణ ప్రపంచీకరణ కాలంలో జరిగింది. ఈ కాలంలో దేశంలో ఎక్కడెక్కడి ప్రాంతీయ సినిమాలూ ఫక్తు కమర్షియల్ సినిమాలుగా మారిపోయాయి. మరాఠీ, అస్సామీ, ఒరియా, చత్తీస్ ఘరీ, తుళు, హర్యాన్వీ ... ఇలా ఎక్కడెక్కడి ప్రాంతీయ సినిమాలూ కమర్షియల్ బాటే పట్టాయి. వీటిలో హర్వాన్వీ సినిమా  ప్రపంచీకరణ నేపధ్యంలో 2000లో అవతరిచడంతో,  ఇవి మిగతా వాటిలాగా ప్రాంతీయ అస్తిత్వాలతో,  వాస్తవిక కథా (ఆర్టు) చిత్రాల కనీస కాలాన్ని కూడా చవి చూడలేదు. దేశం మొత్తం మీద భూస్వామ్య వ్యవస్థతో బాటు ఆర్టు సినిమాలూ 1980 లలోనే అంతరించి పోయాయి. అప్పట్నుంచీ 2000 వరకూ ప్రాంతీయ సినిమా లనేవి మూతబడ్డాయి. 2000 నుంచి ప్రపంచీకరణ హంగూ ఆర్భాటాల మధ్య ప్రాంతీయ సినిమాలు కమర్షియల్ సినిమాలుగా మారాకే మూతబడిన తలుపులు తెర్చుకున్నాయి. ఛత్తీస్ ఘరీ భాషలో 1971 ల తర్వాత ప్రాంతీయ సినిమా లేదు. 2000 లో ఓ పక్కా కమర్షియల్ తీసినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. విడుదలైన మూడో రోజున ఛత్తీస్ ఘర్ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడంతో - మన రాష్ట్రం, మన సినిమా అంటూ  సూపర్ హిట్ చేశారు. అలా ఛత్తీస్ ఘర్ రాష్ట్ర ఆవిర్భావమే కమర్షియల్ సినిమాతో జరిగింది. ఆ తర్వాత అంతా కమర్షియల్ చరిత్రే. అంతేగానీ మన చరిత్ర చెప్పుకుందామని వెనక్కి పోయే అత్యుత్సాహాన్ని కనబర్చలేదు. 

          ఉత్తరాది ప్రాంతీయ సినిమాల సమస్యే ఏమిటంటే,  అవి బాలీవుడ్ హిందీ సినిమాలతో పోటీ పడాల్సి రావడం. అప్పుడు ఖచ్చితంగా అవి కూడా స్థానిక భాషల్లో హిందీ సినిమాల నకళ్ళుగా తయారవుతున్నాయి. ఇంకా మనదేదో జీవితం, మన దేదో సంస్కృతీ అని భీష్మించుకోలేదు. హిందీ సినిమాలకి నకళ్ళయిన ఆ కమర్షియల్  సినిమాల్లో వుండేవి కేవలం అక్కడి స్థానిక భాష, అక్కడి నటులూ మాత్రమే. 

          తెలంగాణా సినిమాకి బాలీవుడ్ తో పోటీ లేకపోవచ్చు గానీ, ఉమ్మడి రాష్ట్ర బ్రాండ్ తెలుగు కమర్షియల్ సినిమాలతో పోటీ వుండనే వుంటుంది.  ఉమ్మడి రాష్ట్ర బ్రాండ్ తెలుగు సినిమాలు ఫక్తు కమర్షియల్ ఎంటర్ టైనర్లు హిందీ సినిమాలకి లాగే. ఉమ్మడి రాష్ట్ర బ్రాండ్ తెలుగు సినిమాలకి అలవాటుపడ్డ తెలంగాణా వాసులు, ఇంకే తమ జీవితాల ఆర్ట్ సినిమాలూ చూడలేరు ప్రపంచీకరణ నేపధ్యంలో ఇతర రాష్ట్రాల ప్రేక్షకులకి లాగే. 

          భాషా సమస్య కూడా వుంది. తెలంగాణా మొత్తం ఒకే భాషతో, ఒకే పదాలతో లేదు.   జిల్లాల వారీ పదాలున్నాయి. ఒక జిల్లా పదాలు ఇంకో జిల్లాలో అర్ధంగాని పరిస్థితి వుంది. మనుషుల పేర్లు కూడా అంతే. కరీంనగర్ లో రాజయ్య  పేరు నల్లగొండలో వుండదు. నల్లగొండ సైదులు పేరు కరీంనగర్లో వుండదు. నిజామాబాద్ గంగారామ్ వరంగల్లో వుండడు. తెలంగాణా సినిమాలు తీయాలనుకున్నప్పుడు ఏ జిల్లా మేకర్ ఆ జిల్లా పదాలు వాడితే ఇతర జిల్లాల్లో సినిమా పరిస్థితి ఏమంత బావుండదు. అప్పుడవి తెలంగాణా సినిమాలన్పించుకోవు – నిజామాబాద్ సినిమా, వరంగల్ సినిమా, నల్లగొండ సినిమా, ఖమ్మం సినిమా అన్పించుకుంటాయి. 

       పక్కనున్న కర్ణాటకలో  రెండున్నర జిల్లాల భాష తుళులో ఆ రెండున్నర జిల్లాలకీ కలిపి ఒకే భాషా, పదాలూ వున్నాయి. ఇందువల్ల తుళు భాషలో తీస్తున్న కమర్షియల్ సినిమాలు ఆ రెండున్నర జిల్లాల్లోనే కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. ఒక సినిమా మల్టీప్లెక్స్ లో 570 రోజులాడింది. ఇక్కడ కన్నడతో బాటు హిందీ  ఇంగ్లీషు సినిమాల పోటీని ఇవిలా కమర్షియలైజ్ అయి తట్టుకుంటున్నాయి. అన్నీ పిచ్చ కామెడీలే. 

          దేశంలో ఎక్కడా లేని భాషా స్పృహ తెలంగాణా సినిమాలకి సంబంధించే వుంది. ఇది పనికిరాని స్పృహ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో భూతద్దాలు పెట్టి  మరీ భాషని పరీక్షించడం, ఇది మన భాష కాదు, యాస కూడా కాదూ అంటూ వ్యతిరేకించడం హాస్యాస్పదంగా వుంటుంది. తెలంగాణా సినిమాకి అన్ని జిల్లాలకీ కలిపి ఓ ఉమ్మడి భాష అవసరం. ఆ అవసరాన్ని ఈ రెండు సినిమాలూ తీరుస్తూ ఆంధ్రప్రదేశ్ లో కూడా విజయవంతమయ్యాయి.  

          కనుక తెలంగాణా సినిమా అంటే ఒక ఉమ్మడి తెలంగాణా భాషతో కూడిన, ఉమ్మడి రాష్ట్ర బ్రాండ్ తెలుగు కమర్షియల్ సినిమానే. ఉమ్మడి రాష్ట్ర బ్రాండ్ తెలుగు కమర్షియల్ సినిమాల శైలుల్లోనే ఉమ్మడి తెలంగాణా భాషా సినిమా తీయడమే. మిగతా తెలంగాణా సమస్యలు, పేదరికం, కష్టాలూ కన్నీళ్ళూ సాహిత్యంలో వరకూ రాసుకోవచ్చు. వీటికి సాహిత్యంలో విలువ వుంటుంది.

Q : ‘మహానటి’ గురించి కూడా మీరు రాయరా?
నగేష్ సి, టాలీవుడ్
 A :    ఇంకా చూడలేదు. చూశాక ఖచ్చితంగా రాయం. రివ్యూలు వుండవని చెప్పాక రాయడం ఎలా జరుగుతుంది. అయినా చాలా రివ్యూలు వచ్చేశాయిగా, అవి సరిపోతాయి మీకు. 

 
Q :   పూరీ జగన్నాథ్ ‘మెహబూబా’ ని మళ్ళీ టెంప్లెట్ లోనే పెట్టి స్క్రీన్ ప్లే చేశారా లేదా తెలియడం లేదు. ఆయన తీస్తున్న టెంప్లెట్స్ ఫ్లాప్ అవుతున్నాయి కదా? ఇది కూడా అందుకే ఫ్లాపయ్యిందా?
ఎం. సత్యం, టాలీవుడ్
 
A :    ఇంకా ఈ సినిమా చూడలేదు. బ్లాగులో అన్ని రివ్యూలు చదువుతూ వున్నాక కూడా,  టెంప్లెట్ అవునో  కాదో తెలుసుకోలేక పోయారంటే, ఇప్పుడు మీకు చెప్పినా ఏమర్ధమవుతుంది. ముందు టెంప్లెట్ అంటే ఏం తెలుసుకున్నారో మీరే వొక మెసెంజర్ కొట్టండి. దాన్నిబట్టి చూద్దాం. 

Q :    మాదో ప్రశ్న. మేము కొంత మందిమి గత నెల ఓ స్క్రీన్ ప్లే వర్క్ షాప్ కి వెళ్లాం. ఫ్యాకల్టీ గా వచ్చిన తెలుగు రచయిత, ‘చాలా  మంది కొత్త రచయితలు తమ వ్యక్తిగత సమస్యల్ని , బాధల్ని, కోరికల్ని హీరో పాత్రలకు ఆపాదించి కథలు రాస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పర్సనల్ లైఫ్ ఎప్పుడూ  సినిమా కథ కాదు. డ్రీమ్ బిగ్ అని చెప్పారు. తర్వాత ఎఫ్ టీ ఐ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ క్లాస్ తీసుకుని, ‘మీకు కథ కావాల్సి  వచ్చినప్పుడు ఒక్కసారి మీ జీవితం లోకి చూసుకోండి. మీకు ఎన్నో గొప్ప కథలు దొరుకుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సినిమాకు సరిపడా కథ వుంటుంది. most personal feeling is universalఅని చెప్పారు. పరస్పర విరుద్ధంగా వున్న రెండు స్టేట్ మెంట్స్ లో ఏది కరెక్ట్? వీలైనంత వివరంగా చెప్పండి.
అసోషియేట్ల బృందం, టాలీవుడ్

 
A :   విరుద్ధంగా ఏమీ లేవు, అవి రెండు వేర్వేరు సందర్భాలు. అయినా ఈ వైరుధ్యాల్ని ఆ గురువు గార్లనే అడిగి తెలుసుకోవాల్సింది. వాళ్ళ స్టేట్ మెంట్స్ అన్వయింపుల్ని బట్టి కరెక్టే. మొదటి స్టేట్ మెంట్ పెద్ద సినిమాలకి అన్వయిస్తే కరెక్టు. రెండో స్టేట్ మెంట్ చిన్న సినిమాలకి అన్వయిస్తే కరెక్టు. ఏ రచయిత  తన జీవితంలో ‘భరత్ అనే నేను’ మహేష్ బాబు అయి వుంటాడు? వుంటే రాజకీయాల్లోకి వెళ్తాడు, కథలెందుకు రాస్తూ కూర్చుంటాడు?  అందుకని తన సొంత జీవితంలోంచి తీసి స్టార్ సినిమాలకి కథ రాయబోతే బోర్లా పడతాడు. కథకుడిలో డీఫాల్టుగా జర్నలిస్టు వుంటాడు. లేడంటే నెల తక్కువ కథకుడన్నట్టే.  అప్పుడు తన జీవితానికే బందీ అయిపోయి అందులోంచే కథలు తీసే బావిలో కప్పయిపోతాడు.

      తనలో జర్నలిస్టు అంశ వుంటే,  ఆ పాయింటాఫ్ వ్యూతో ప్రపంచాన్ని చూసి కథల్ని తవ్వుతాడు. కల్పిత పాత్రలతో ఆబ్జెక్టివ్ గా కథలు చెప్తాడు. సినిమాలనే కోట్ల రూపాయల వ్యాపారానికి కావాల్సింది బయట కనుగొని ఆబ్జెక్టివ్ గా చెప్పే కథలే తప్ప, కథకుడి  వ్యక్తిగత జీవితంలోంచి పుట్టే సబ్జెక్టివ్ కథలు కాదు.

          ఇక రెండో స్టేట్ మెంట్ : చిన్న సినిమాలకి కథకుడు తన జీవితంలోంచి తీసి రాసుకుంటే రాసుకోవచ్చు. చిన్న సినిమాల కథల పరిధికి – కాన్వాస్ కి – అవి సరిపోతాయి. తన జీవితంలోంచి తీస్తున్నాడు కాబట్టి అవి సబ్జెక్టివ్ గా వుంటాయి. అయినా ఫర్వాలేదు. ఇండిపెండెంట్ మూవీస్ కూడా ఈ కోవకే చెందుతాయి. అయితే చిన్న మూవీస్ కథకైనా, పెద్ద మూవీస్ కథకైనా మార్కెట్ యాస్పెక్ట్ కన్పించడం ముఖ్యం – కమర్షియల్ విజయం కావాలనుకుంటే. 

          ఈ రెండూ కాకుండా మూడో స్టేట్ మెంట్ కూడా వుంటుంది. ఇదే ఎక్కువ అమలవుతూ వుంటుంది. వేరే సినిమాల్లోంచి కాపీ కొట్టి రాయడం. అప్పుడు సొంత జీవితమూ లేదు, బయటి ప్రపంచమూ లేదు. డౌన్ లోడ్లే కథలు. కాబట్టి డౌన్ లోడ్స్ లోంచి కూడా కథలు పుడతాయని మూడో స్టేట్ మెంట్ ఇచ్చుకోవాలి.

సికిందర్